Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : ఆరుషి కేసులో తీర్పు సబబేనా? - 1

ఆరుషి హత్య కేసులో వెలువడిన తీర్పు చాలామందిని ఆశ్చర్యపరిచింది. తలిదండ్రులు సొంతబిడ్డను చంపుకుంటారా? మీడియా చేసిన హంగామా వలన జడ్జిగారు ప్రభావితుడయ్యాడు అని చాలామంది అభిప్రాయపడ్డారు. సోషల్‌ మీడియాలో కూడా విస్తృతంగా చర్చ జరుగుతోంది. తలిదండ్రులు హత్య చేశారని భావిస్తే దానితో బాటు ఆరుషి ప్రవర్తన మంచిది కాదని కూడా భావించాలి. ఒక 14 ఏళ్ల పిల్లకు 45 ఏళ్ల పనివాడితో అక్రమసంబంధం వుందని అనుకోవడానికి చాలా ఎబ్బెట్టుగా వుంది. ఎవరికీ నమ్మబుద్ధి కావటం లేదు. 'ఆరుషికి న్యాయం కలగజేయండి' అనే నినాదంతో ఫేస్‌బుక్‌లో ఒక ఉద్యమం నడుస్తోంది. మరి ఘజియాబాద్‌లోని సిబిఐ స్పెషల్‌ కోర్టు నవంబరులో వెలువరించిన తీర్పు తప్పందామా?

ఐదేళ్ల క్రితమే యీ కేసు ప్రారంభమైంది కాబట్టి కేసు వివరాలు చాలామందికి సరిగ్గా గుర్తుండకపోవచ్చు. తల్లీ తండ్రీయే చంపారని కొన్నాళ్లు, అబ్బే కాదు, పనివాళ్లు చంపారని కొన్నాళ్లూ కన్‌ఫ్యూజ్‌ చేశారు. ఇప్పటికి కూడా ఎవరు చంపారు, ఎలా చంపారు, ఎందుకు చంపారు అన్న విషయంపై స్పష్టత లేదు. 5 ఏళ్ల పరిశోధన, మూడు జట్ల యిన్వెస్టిగేటర్లు, 15 నెలల విచారణ, 46 మంది సాకక్ష్యులు, 15 మంది డాక్టర్లు, 4 గురు ఫోరెన్సిక్‌ లాబ్‌లు.. అన్నీ కలిసి గందరగోళం. కేసు ఒక్కోసారి ఒక్కో దిశలో నడిచింది. పోస్టు మార్టమ్‌ చేసిన డాక్టరే మాట మార్చారు. అదేమంటే 'ఆరుషి తండ్రి రాజేష్‌ సోదరుడు దినేష్‌ కూడా డాక్టరే, అతను నా స్నేహితుడు. అతని కోరిక మేరకు ఆరుషి శృంగారంలో పాల్గొన్నదన్న విషయంలో వాస్తవాలు దాచి పెట్టాను' అన్నాడు. తప్పుడు సాక్ష్యం యిచ్చినందుకు ఆయనపై కేసు పెట్టాలి. ఇంకా పెట్టలేదు. కానీ పోస్టు మార్టమ్‌ నడిచే సమయంలో దినేష్‌ నుండి చాలా ఫోన్‌ కాల్స్‌ వచ్చాయని నిరూపణ అయింది.

మొత్తమంతా చూస్తే పోలీసులు కేసు విచారణ సరిగ్గా జరపలేదు అని స్పష్టంగా తేలుతోంది. చిన్న చిన్న విషయాలలో కూడా వాళ్లు శ్రద్ధ వహించలేదు. అంతమాత్రం తెలియనివారా మన పోలీసులు? ఏదైనా హత్య జరిగితే అక్కడకి ఎవర్నీ రాకుండా చేసి, సాక్ష్యాధారాలు సేకరించాలన్న ప్రాథమిక అవగాహన లేకుండా మన పోలీసు వ్యవస్థ పనిచేస్తోందా? రోడ్డు మీద యాక్సిడెంటు జరిగి శవం అక్కడ పడి వుంటే మనం పోయి తొంగి చూడబోతే పోలీసు కానిస్టేబుల్‌ అదిలిస్తాడు - 'అటు పోవద్దు' అని. అలాటిది ఒక డాక్టరు గారింట్లో బెడ్‌రూమ్‌లో శవం పడి వుంటే అక్కడకు బంధువులందరినీ రానిచ్చి అంతా కలయదిరగనిస్తారా? సాక్ష్యాలు నాశనం చేయనిస్తారా? ఒకవేళ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించినా చదువుకున్న తలిదండ్రులు ఊరుకుంటారా? ఆరుషి తలిదండ్రులు యిద్దరూ విద్యావంతులు.  ఉన్నత కుటుంబం నుండి వచ్చినవారు. ఏదైనా హత్య జరిగినపుడు ఎలా వ్యవహరించాలో తెలియనంత మూర్ఖులు కారు. పైగా చనిపోయినది వాళ్ల సొంత కూతురు. హంతకుణ్ని పట్టుకోవాలన్న పట్టుదలతో ఏ సాక్ష్యం వదలవద్దని పోలీసులకు గట్టిగా చెప్పాలి. నిజానికి వాళ్ల యింటి పొరుగునే రిటైర్డ్‌ డిఎస్‌పి కెకె గౌతమ్‌ వున్నారు. ఆయనను పిలిచినా దగ్గరుండి అన్నీ చూసుకునేవాడు. తనను పోస్ట్‌ మార్టమ్‌ చేసే డాక్టరుకు సిఫార్సు చేయడానికి తనను ఉపయోగించుకుందామని దినేష్‌ ప్రయత్నించాడని గౌతమ్‌ 2012లో సిబిఐ కోర్టుకి చెప్పాడు. ఇవన్నీ తను సిబిఐకు మొదట్లోనే చెప్పినా వాళ్లు తమకు అనుకూలమైన విషయాలు మాత్రమే తీసుకుని తక్కినవి వదిలేశారని కూడా చెప్పాడు. 

టివిలో ''సిఐడి'' వంటి క్రైమ్‌ సీరియల్‌ చూసే ప్రేక్షకులు కూడా యిలాటి జాగ్రత్తలు తీసుకుంటారు. మరి వీళ్లు డాక్టర్లు. దంతవైద్యులు కాబట్టి తమ చేతుల మీదుగా చావులు ఎక్కువ చూసి వుండకపోవచ్చు కానీ వాళ్ల కుటుంబంలో ఎందరో డాక్టర్లున్నారు. రాజేష్‌ తల్వార్‌ తండ్రి కార్డియో థొరాసిక్‌ సర్జన్‌. సోదరుడు దినేష్‌ నేత్రవైద్యుడు, వదిన వందన అనస్తీషియా డాక్టరు. రాజేష్‌ ఢిల్లీలో మౌలానా ఆజాద్‌ మెడికల్‌ కాలేజీలో బిడిఎస్‌ చదువుతూవుండగా నూపుర్‌ పరిచయమైంది. ఆమె మరాఠీ, యితను పంజాబీ. నూపుర్‌ తండ్రి ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్సులో పనిచేశాడు. తర్వాత లండన్‌లో హై కమిషనర్‌గా పని చేసేటప్పుడు నూపుర్‌ బాల్యం లండన్‌లో గడిచింది. ఇద్దరూ 1989లో పెళ్లాడారు. రాజేష్‌ నోయిడాలోని ఫోర్టిస్‌ హాస్పటల్‌లో డెంటల్‌ యూనిట్‌కు హెడ్‌. ఐటిఎస్‌ డెంటల్‌ కాలేజీలో ప్రొఫెసర్‌. అది కాక ఢిల్లీలో హౌజ్‌ ఖాస్‌లో క్లినిక్‌ నడుపుతున్నాడు. నూపుర్‌ కూడా అక్కడే ప్రాక్టీసు చేస్తోంది. 

వాళ్లిద్దరూ కలిసి నోయిడాలోని జలవాయు విహార్‌లో మంచి లొకాలిటీలో 1300 చ.అ.ల 2 బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌ కొనుక్కున్నారు. అది సెకండ్‌ ఫ్లోర్‌లో వుంది. ఆ యింటి ప్లాను చూస్తే తప్ప కొన్ని విషయాలు అర్థం కావు. మామూలుగా ఫ్లాట్‌ అనగానే ఒక్కటే ప్రవేశద్వారం వుంటుంది. కానీ దీనికి డోర్లు చాలానే వున్నాయి. మెయిన్‌ గ్రిల్‌ డోర్‌ ఒకటి, ఆ తర్వాత మరో గ్రిల్‌ డోర్‌, ఆ తర్వాత తనంతట తాను లాక్‌ అయ్యే చెక్క తలుపు ఒకటి.. యిలా. అంతేకాదు, ప్రత్యేకంగా డాబా కూడా వుంది. దానికి ఫ్లాట్‌ బయటనుండి మెట్లున్నాయి. మొదటి గ్రిల్‌ డోర్‌ దాటి రెండో గ్రిల్‌ డోర్‌కు వెళుతూండగానే కుడివైపు హేమరాజ్‌ గది వుంది. అక్కడున్న తలుపు ద్వారా ఆ గదిలోకి వెళ్లవచ్చు. అతని గదినుండి డ్రాయింగు హాల్లోకి యింకో తలుపు వుంది. డ్రాయింగ్‌హాల్లోకి వెళ్లాక కుడివైపు ఆరుషి బెడ్‌రూమ్‌ వుంది, ఎదురుగా రాజేష్‌ దంపతుల బెడ్‌రూమ్‌ వుంది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే కావాలనుకుంటే హేమరాజ్‌ (అతని అసలు పేరు యమ ప్రసాద్‌) రాజేష్‌ వాళ్లకి తెలియకుండా ఆరుషి గదిలోకి వెళ్లగలడు. 

అందుకే ఆరుషి గదికి బయటనుండి తాళం వేస్తూ వుంటారు. ఆరుషి తలుచుకుంటే లోపలనుండి తలుపు తీయగలదు. కానీ బయటనుండి ఎవరైనా ఆ గదిలోకి వెళ్లాలంటే తాళంచెవి వుండాల్సిందే. హత్య జరిగిన రాత్రి ఆరుషియే హేమరాజ్‌ కోసం తలుపు తీసి వుంటుందని ప్రాసిక్యూషన్‌ అంటుంది. 'అబ్బే, నేనే తాళం చెవిని డోరులోనే మర్చిపోయాను. దానితో హేమరాజ్‌ ఆమె గదిలోకి వెళ్లి వుంటాడు.' అంటుంది నూపుర్‌. తమ కూతుర్ని హేమరాజ్‌ హత్య చేసి పారిపోయాడు అనే థియరీతోనే ఆరుషి తలిదండ్రులు కేసు నడవాలని ఆశించారు. (సశేషం) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2013)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?