Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : ఆరుషి కేసులో తీర్పు సబబేనా? - 2

2008 మే 16 ఉదయం హత్య బయటపడింది. నూపుర్‌ కథనం ఏమిటంటే - 'మా యింట్లో పని చేసే భారతి 6 గంటలకు కాలింగ్‌ బెల్లు కొట్టింది. బయటి గ్రిల్‌ డోరు తోసి చూసింది. మామూలుగా అయితే హేమరాజ్‌ వచ్చి తలుపు తీసేవాడు. అవేళ తీయలేదు. మళ్లీ మళ్లీ బెల్లు కొట్టగా నేను చెక్క తలుపు తీసి లోపటి గ్రిల్‌ డోర్‌ తెరిచి భారతిని చూసి ''హేమరాజ్‌ లేడా? పాలకోసం వెళ్లాడేమో కాస్త ఆగు'' అన్నాను. ''అప్పటిదాకా ఆగడం దేనికి, మీరు తాళం చెవి విసిరేస్తే నేను గ్రిల్‌ డోరు తలుపు తీసుకుని లోపలకి వస్తాను'' అంది భారతి. తర్వాత చూస్తే ఆ డోర్‌ బిగుసుకు పోయి వుంది తప్ప తాళం వేసి లేదు. రెండో గ్రిల్‌ డోరు మాత్రం బయటనుండి గొళ్లెం వేసి వుంది. (హేమరాజ్‌ వెళ్లిపోతూ పోతూ లోపలి గ్రిల్‌ డోర్‌ బయటనుండి గొళ్లెం పెట్టి వెళ్లాడని చూపించడానికి రాజేష్‌ దంపతులు ప్రయత్నించారు. డ్రాయింగ్‌ హాల్లోంచి హేమరాజ్‌ గదిలోకి వచ్చి, దాని రెండో తలుపులోంచి గ్రిల్‌ డోర్‌ బయట గొళ్లెం పెట్టే వీలుంది). నేను, భారతి మాట్లాడుతూండడం విని రాజేష్‌ నిద్ర లేచి హాల్లోకి వచ్చాడు. అక్కడ డైనింగ్‌ టేబుల్‌ మీద విస్కీ సీసా చూసి ఉలిక్కిపడ్డాడు. ఎవరో వచ్చి వుంటారని భయపడుతూ వెంటనే ఆరుషి గదికి వెళ్లి చూశాడు. అక్కడ ఆరుషి చచ్చిపోయి వుంది.''

పోలీసులు వచ్చినపుడు యీ కథే వినిపించారు. వాళ్లు వెంటనే నమ్మేశారు. సాక్ష్యాలు పెద్దగా ఏమీ సేకరించలేదు. ఇల్లంతా తిరిగి చూడలేదు కూడా. టెర్రేస్‌ మీద చూడాలని ఎవరో ఒక పోలీసతను అన్నాడట. తాళం చెవి కనబడటం లేదు అన్నాడు అప్పటికే మతి పోయి వున్న రాజేష్‌. సరే, ఏం చూస్తాంలే అని వదిలేశారు పోలీసులు. ఇది వింతాతి వింత విషయం. హత్యాయుధం దొరకనప్పుడు పరిసరాలన్నీ కక్షుణ్ణంగా వెతుకుతారు. తాళంచెవి లేదంటే  తలుపు బద్దలు కొట్టి మరీ చూస్తారు. అది చేయలేదు. టీవీ చర్చలకు వచ్చిన రాజేష్‌ వదిన ఈ విషయంపై మాట్లాడుతూ - కూతురు చనిపోయిన ఆందోళనలో వున్న తండ్రి తాళం చెవి మర్చిపోవడం సహజమే కదా అన్నారు. సాక్ష్యాలు చెదిరిపోయిన మాట ఎత్తితే 'యింటి నిండా బంధుమిత్రులు వచ్చేశారు. గందరగోళంగా వుంది. పోలీసులే అవన్నీ చూసుకోవాలి. చూసుకోకుండా యిప్పుడు మా వాడిపై నింద వేస్తే ఎలా?' అని వాదించారు. 

ఇంత ప్రాథమిక విషయాలు కూడా తెలియకుండానే పోలీసులకు వుద్యోగాలు చేస్తున్నారా? మామూలుగా మనం వూహించవలసినది ఏమిటంటే - చూసీ చూడనట్లు పొమ్మనమని పోలీసులకు వాళ్ల పై అధికారులు చెప్పి వుంటారు. ఆ విధంగా వాళ్ల చేత చెప్పించినది రాజేష్‌ కుటుంబమే అయివుంటుంది. ఆ కుటుంబానికి వున్న పలుకుబడి మనం విస్మరించకూడదు. 14 ఏళ్ల అమ్మాయి పనివాడి చేతిలో హత్యకు గురైందని వింటే ఎవరికైనా మనసు కరుగుతుంది. కేసు అంటూ కోర్టు గొడవలతో విసిగించకూడదని జాలిపడతారు. 'హేమరాజ్‌ ఏదో కారణం చేత ఆరుషిని హత్య చేసి పారిపోయాడు, దొరకలేదు' అని రాసేసి కేసు క్లోజ్‌ చేస్తే చాలు అని పోలీసులకు చెప్పి పంపించివుంటారు. అందుకే డాబా మీదకు వెళ్లి చూడనక్కరలేదని పోలీసులకు అనుకున్నారు. పెద్దింట్లో కేసు కాబట్టి అంతా మొక్కుబడి వ్యవహారమే. మన దగ్గర సినీనటుడు బాలకృష్ణ యింట్లో కాల్పుల కేసు చూశాం, వాచ్‌మన్‌ను చంపేశారు. దాని గురించి ఎవరైనా వివరంగా చెప్పగలరా? ఎవరికైనా శిక్ష పడిందా? మనిషి తనంతట తానే చావలేదు కదా. మరి ఎవరో ఒకరికి శిక్ష పడాలి కదా! 

విచారణ సరిగ్గా చేసినా చేయకపోయినా పోస్టుమార్టమ్‌ తప్పదు కదా. చావుకి ముందు ఆరుషి ఎటువంటి శృంగారచేష్టలలోనూ పాల్గొనలేదని, ఆమెపై ఏ అత్యాచారమూ జరగలేదని రాసేశారు. అందువలన హేమరాజ్‌ డబ్బు కోసమో, మరి దేని కోసమో చంపాడని మొదటిరోజు అనుకున్నారు. మర్నాడు హేమరాజ్‌ శవం బయటపడి వుండకపోతే ఆ కథ అలాగే నడిచి వుండేది. ఈ లోపున రాజేష్‌ చాలా హంగామానే చేశాడు. హేమరాజ్‌ ఆచూకీ చెప్పినవాళ్లకు 25 వేల రూ.లు బహుమతి ప్రకటించాడు. పోలీసులు కూడా ప్రకటనలు యిచ్చారు. కానీ హేమరాజ్‌ ఆ యింటి డాబా మీదనే శవంగా తేలాడు. (సశేషం)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2013)

[email protected]

Click here For Part-1

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?