Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : ఆరుషి కేసులో తీర్పు సబబేనా? - 3

రాజేష్‌ దంపతులు ఆ రోజే ఆరుషి అంత్యక్రియలు జరిపేసి, మర్నాటికల్లా ఆమె అస్తికలు గంగలో కలపాలంటూ హరిద్వార్‌కు కారులో బయలుదేరారు. కెకె గౌతమ్‌ అనే రిటైర్డ్‌ డియస్పీ వీళ్ల యింటి పక్కనే వుంటాడు. ఆయన మర్నాడు మధ్యాహ్నం వాళ్లను పలకరించడానికి వచ్చాడు. పోలీసు బుద్ధి కదా, హేమరాజ్‌ గదిని చూడబోయాడు. అక్కడ వైన్‌, బియర్‌, స్ప్రైట్‌ బాటిల్స్‌ కనబడ్డాయి. హేమరాజ్‌తో బాటు ఎవరైనా వున్నారా? వాళ్లంతా కలిసి డ్రింక్స్‌ తీసుకుని వుంటే మరి మూడు గ్లాసులుండాలి కదా! అవేవీ? ఫ్లాట్‌ అంతా కలయదిరగడంలో డాబా మెట్ల వద్ద రక్తపుచుక్కలు కనబడ్డాయి. వాటిని అనుసరిస్తూ పైకి వెళ్లాడు. టెర్రేస్‌ తెరిపించాడు.  గోడమీద రక్తపు చేతిముద్ర, రక్తపునీటితో వున్న ఎయిర్‌ కూలరు కనబడ్డాయి. అక్కడ ఒక శవం కనబడింది. మే నెల మండుటెండలు కాబట్టి రోజున్నరలో బాగా కుళ్లిపోయింది. ఆ శవాన్ని అక్కడకు దుప్పటిలో చుట్టి తెచ్చినట్టు కనబడుతోంది. ఎయర్‌ కూలరు గ్రిల్‌ దానిపై పెట్టారు. పక్క ఫ్లాట్‌ వాళ్ల డాబా మీద నుంచి చూసినా యిది కనబడకుండా వుండడడానికి మధ్యనున్న గ్రిల్‌కి అక్కడ ఆరేసి వున్న దుప్పటి అడ్డంగా కట్టారు.

నిజానికి ముందురోజు ఉదయం 8.30కు ఆరుషి శవాన్ని పోస్టుమార్టమ్‌కు తీసుకెళ్లాక ఆమె గదిలో పరుపు, దుప్పటీ అవీ తడిపేసి డాబా మీద ఆరేద్దామనుకున్నారు. టెర్రేస్‌ తాళం చెవి లేదనడంతో పక్కింటి ఫ్లాట్‌ డాబా మీదకు వెళ్లి ఆరబెట్టారు. అప్పుడు యీ వైపు చూసినా యీ శవం కనబడలేదు. అనుకోకుండా గౌతమ్‌ వచ్చి కెలకడంతో బయటపడింది. సరే యింతకీ యీ శవం ఎవరిది? హేమరాజ్‌దా? రాజేష్‌కు ఫోన్‌ చేశారు. అతనూ, భార్యా హరిద్వార్‌కి వెళ్లే దారిలో వున్నారు. వెనక్కి రప్పించారు. అస్తికల పాత్ర పట్టుకుని నూపుర్‌ కారులోనే కూర్చుని వుండగా రాజేష్‌ పైకి వచ్చాడు. శవం చూపించి హేమరాజ్‌దా అంటే కాదన్నాడు. గుర్తు పట్టలేనన్నాడు. అప్పుడు యితరులు యిది హేమరాజ్‌దే అన్నారు. 8 నెలలుగా యింట్లోనే అహర్నిశలు వుంటూ వంట చేసిపెడుతూ, పనుల్లో సాయపడుతూ వున్న వ్యక్తి శవాన్ని రాజేష్‌ గుర్తించకపోవడమేమిటి? హేమరాజ్‌ హత్య చేసి పారిపోయాడన్న థియరీకే అతను కట్టుబడ్డాడు కాబట్టే అనుకోవాలి. పోలీసులు వచ్చి రాజేష్‌ దంపతులను హరిద్వార్‌కు, యీ శవాన్ని పోస్టుమార్టమ్‌కు పంపించారు. ఆరుషి లాగే యితని హత్య కూడా రాత్రి 1- 2 ప్రాంతంలో జరిగినట్టు తెలిసింది. అంటే హేమరాజ్‌ ఆరుషిని చంపిన తర్వాత వేరే ఎవరైనా అతన్ని చంపారా? ఎందుకు? లేక హేమరాజ్‌ను, ఆరుషిని ఒకళ్లే చంపి శవాలను వేర్వేరు చోట్ల పడేశారా? 

రెండోదే జరిగింది అనుకుంటే అలా చేసినది రాజేష్‌ కావచ్చు. ఆరుషి శవాన్ని దుప్పటి కప్పి యింట్లోనే పెట్టి హత్యానేరం హేమరాజ్‌ శవాన్ని డాబా మీద పడేసి, దాన్ని ఎవరూ చూడకుండా చేసి, హేమరాజ్‌నే నిందితుడిగా చూపించాడనుకోవాలి. మే 16 రాత్రి హేమరాజ్‌ శవాన్ని మాయం చేయాలని అనుకుని ఏ కారణం చేతనో చేయలేకపోయా డనుకోవాలి. క్రైమ్‌ నవలలోనే కాదు, నిజంగా జరిగే నేరసంఘటనల్లో కూడా హంతకుడు ఏదో ఒక సాక్ష్యాన్ని వదిలిపెట్టడమో, అనుకోకుండా ఏదో జరిగి - ఎవరో రావడమో, లేక చప్పుడు కావడం చేత భయపడి దేన్నో ఆనుకుని అక్కడ వేలిముద్రలు పడడమో ఏదో జరుగుతుంది. మొన్న మహేష్‌ బ్యాంక్‌లో బంగారం చోరీ సంగతి చూడండి. మొగానికి ముసుగు వేసుకున్నాను కదాని దొంగ కొన్ని సిసిటివి కెమెరాలు ఆఫ్‌ చేయలేదు. నడక తీరు బట్టి పట్టేశారు. స్టాఫ్‌లో ఎవరో ఒకరు చేసి వుంటారనుకుని వాళ్లందరినీ నడిచి చూపించమన్నారు. పోలిక దొరికింది. ఒక్కోసారి హంతకుడు మొదటి హత్య చాలా పకడ్బందీగా చేస్తాడు. దొరకడు. పోలీసులు పట్టుకోలేక పోవడంతో ధైర్యం పెరిగి రెండో హత్య చేస్తాడు. అప్పుడు పొరబాటున క్లూ వదిలేయడం జరుగుతూ వుంటుంది. వదిలేయకపోయినా రెండు హత్యావిధానాల్లో వున్న సారూప్యత (మోడస్‌ ఒపరాండి), రెండు కేసుల్లో వున్న అవసరం, అవకాశం పోల్చి చూసేసరికి హంతకుడు పట్టుబడతాడు. రాజేషే హంతకుడు అనుకుంటే  రెండో శవమే అతన్ని పట్టిచ్చింది.

అయితే కోర్టు కూడా అతన్ని హంతకుడు అని డైరక్టుగా అనలేదు. అనడానికి సాక్ష్యాలు చాలలేదు. సాధారణంగా హత్యాస్థలంలో తీసిన ఫోటోలు బలమైన సాక్ష్యంగా వుంటాయి. కానీ యీ కేసులో పోలీసు ఫోటోగ్రాఫర్‌ ఫింగర్‌ప్రింట్స్‌ కోసం తీసిన 24 ఫోటోల్లో 22 మసకమసగ్గా వున్నాయి. అతను సబ్మిట్‌ చేసిన ఫోటోల్లో 23 ఫోటోలు నెగటివ్స్‌తో మ్యాచ్‌ కాలేదు. టెర్రేస్‌ మీద రక్తపు కాలిముద్రలను ఫోటో తీయలేదు. ఏం? అంటే చాలామంది జనం వున్నారండి అన్నాడు. డ్రాయింగ్‌ హాల్లో ఓ మూల బార్‌ వుంది. అక్కడ విస్కీ బాటిల్‌ వుంది. దానిపై రక్తంతో తడిసిన వేలిముద్రలున్నాయి. అవి ఎవరివి అంటే వేటితోనూ మ్యాచ్‌ కాలేదండి అన్నాడు. హత్యాస్థలం వద్ద మడతలు పడని దుప్పటి అవీ చూసి సాక్ష్యాలు మసిబూసి మారేడుకాయ చేశారన్న అనుమానమే రాలేదతనికి. 2010 మార్చి తర్వాత కేసు తిరగతోడినప్పుడే వీటిపై అతను నోరు విప్పాడు. 

పోలీసు శాఖలో పనిచేసే ఫోటోగ్రాఫర్‌ యింత అసమర్థుడా? సాధారణంగా పెద్దవాళ్లు యిన్‌వాల్వ్‌ అయిన కేసుల్లో పోలీసులు కావాలనే సాక్ష్యాలను, ఆధారాలను సరిగ్గా సేకరించరు. ప్రజలను సంతృప్తి పరచడానికి కొన్నాళ్లపాటు కేసు నడిపిస్తారు. కోర్టులో విచారణకు వచ్చేసరికి ఈ ఆధారాలు తేలిపోతాయి. సాకక్షులు ఎదురు తిరుగుతారు. తగిన ఆధారాలు లేవంటూ కోర్టు కేసు కొట్టేస్తుంది. పనిలో పనిగా తమ విధి సరిగ్గా నిర్వహించలేదంటూ పోలీసులకు అక్షింతలు వేస్తుంది. వాళ్లు తల ఓసారి ఝాడించి, అక్షింతలు విదిల్చేసుకుంటారు. జగన్‌ కేసులో సిబిఐ చేసిన హంగామా చూశాం. నెలల తరబడి మీడియా హోరెత్తించేసింది - అదిగో ఆ కేసులో పట్టుబడ్డాడు, యీ కేసులో యింకేముంది, సిబిఐ సాక్ష్యాలు సేకరించింది, వాళ్లను విచారించింది, వీళ్లను నిలదీసింది, ఫలానావాడు నిజాలు కక్కేశాడు.. అంటూ చివరకు ఏం జరిగింది? సిబిఐ పెట్టిన 10 కేసుల్లో 8 వాటికి ఆధారాలు సరిపోలేదన్నారు. బెయిలు యిచ్చారు. ఫైనల్‌గా కోర్టు అన్నీ కొట్టి పారేసినా ఆశ్చర్యం లేదు. 

అలాగే కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి కేసు. ఇన్నేళ్లు సాగదీసేటప్పటికి నిందితుల్లో ఒకడు యీ మధ్యే హత్యకు గురయ్యాడు. ముఖ్యసాకక్షులు ఎదురు తిరిగారు. హతుడి కుటుంబసభ్యులే జావకారిపోయారు. ఆధారాలు లేవంటూ కోర్టు కేసు మూసేసింది. ధర్మం జయించిందని స్వాములు ప్రకటించారు. ఈయన చంపలేదు సరే, మరి అతన్ని ఎవరు చంపారు? అడిగినవారు లేరు. సాకక్షుల మానసిక స్థితి కూడా ఎప్పుడూ ఒకలాగ వుండదు. ప్రలోభాలకు లొంగవచ్చు, భయపడవచ్చు, ఎందుకొచ్చిన గొడవ అనుకోవచ్చు. కేసు సాగదీసినకొద్దీ రంగులు మారిపోతాయి. ఇప్పుడు రాజేష్‌ తల్వార్‌ కేసులో కూడా యిదే ఫైనల్‌ అనుకోవడానికి లేదు. వీళ్లు పై కోర్టుకి వెళ్లేటప్పటికి సాకక్షులు తమ సాక్ష్యాలు మార్చేయవచ్చు. సిబిఐ వారు ఒత్తిడి చేసి మా చేత చెప్పించారు అనవచ్చు. (సశేషం)

 - ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2013)

[email protected]

Click here For Part-1

Click Here For Part-2

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?