Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ :కలహాలతో కరంటు వచ్చేనా? - 3

హరీశ్‌రావు చెప్తున్నారు, తెరాస అధికారంలోకి వచ్చాక 120 సంక్షేమపథకాలను ప్రవేశపెట్టిందని. అన్ని అవసరమా? అన్నిటికీ అవసరమైన విద్యుత్‌ను వెనకపెట్టి వీటికి డబ్బు ఖర్చు చేయడం సమంజసమా? అదీ ఓ పక్క కెసియార్‌ ఢిల్లీలో కేంద్ర ఆర్థికమంత్రి వద్దకు వెళ్లి మాకు ఆదాయం తగ్గిపోయింది బాబోయ్‌, మాకు ప్రత్యేకహోదా యివ్వకపోతే కటకటలాడిపోతాం అని మొత్తుకుంటున్నపుడు! హైదరాబాదు లాటి బంగారు బాతు చేతిలో వుండగా యీ అభ్యర్థనలేమిటి? అని జైట్లీ నివ్వెరపోతే 'అధికారులు హైదరాబాదు ఆదాయాన్ని ఎక్కువ చేసి చూపించారు' అని వాళ్ల మీద నెట్టేశారు కెసియార్‌. అధికారులను తప్పు పడితే ఎలా? పుష్కరకాలం పాటు ఉద్యమం చేసిన మీకు గణాంకాలు తెలియవా? జయశంకర్‌ గారు ఎకనమిక్‌ ప్రొఫెసర్‌, కోదండరామ్‌ గారు మరో ప్రొఫెసర్‌. అసలు  ప్రత్యేక తెలంగాణ కావాలని పోరాడిన మేధావుల్లో హరగోపాల్‌ నుండి చక్రపాణి దాకా చాలామంది ప్రొఫెసర్లు వున్నారు. వాళ్లెవరూ హైదరాబాదు ఆదాయం గురించి సరైన సమాచారం కెసియార్‌కు యివ్వలేదా? విభజన తర్వాత పన్నుల రాబడి ఎలా వుంటుందో వారూహించలేదా? ముందుచూపున్న కెసియార్‌ కానలేదా? పెట్రోలియం కార్పోరేషన్లు యిక్కడ పన్నులు కట్టడం లేదు, ఎపి బెవరేజెస్‌ కట్టడం లేదు అంటూ ఇప్పుడు ఫిర్యాదు చేస్తున్నారు. అనేక కంపెనీలు తమ కార్పోరేట్‌ ఆఫీసులు ఆంధ్రకు తరలించి అక్కడ పన్నులు కడుతున్నారు, దాన్ని నిరోధించాలి అని తెరాస నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. కేంద్రప్రభుత్వం తలచుకుంటే చట్టంలో అలాటి మార్పులు చేయవచ్చు అని టీవీ మేధావులు వాక్రుచ్చుతున్నారు. నిజంగా అలా మార్పులు చేస్తారా? తెలంగాణ సంక్షేమ పథకాలకోసం ఆదాయం చాలటం లేదని యిలాటి చట్టం తెస్తే తక్కిన రాష్ట్రాలన్నీ యిలాగే డిమాండ్‌ చేయవా? 23 జిల్లాల్లో ఎక్కడ ఎవడు కాఫీ తాగినా, దానిపై పన్ను వచ్చి హైదరాబాదు ఖాతాలో పడినపుడు చాలా కమ్మగా వుంది కదా! ఇన్నాళ్లూ అనుభవించాం, యికపై లేకపోయినా సర్దుకోవాలి అనుకోకుండా కంపెనీల ఉద్యోగులను మేం తరిమివేసినా కార్పోరేట్‌ ఆఫీసులు యిక్కడే వుంచి పన్నులు మాకే కడుతూ వుండాలి, మాకు ఆదాయం తగ్గకూడదు అంటే కుదురుతుందా?

రాష్ట్రం విడిపోతే తెలంగాణకు కూడా చాలా నష్టాలు జరుగుతాయన్న స్పృహ లేకుండానే విభజన కోరారా యీ పెద్దలు? ఉద్యమం ప్రారంభించిన కెసియార్‌, లేఖ యిచ్చిన చంద్రబాబు, కేంద్రం ఏం చేస్తే దానికి ఒప్పుకుంటాం అంటూ బ్లాంక్‌ చెక్‌ యిచ్చిన జగన్‌ (ఆఖరిలో సమైక్యం అందుకున్నా నమ్మని పరిస్థితి వచ్చింది), రాజకీయ లబ్ధికోసం చీల్చిన సోనియా - అందరూ యీ విషయంలో దోషులే! తెలంగాణ ఏర్పడితే తెరాసకు లాభమని, తెలంగాణకు నష్టమని యిక్కడ  యిటువంటి వాతావరణం ఏర్పడి, హైదరాబాదుతో సహా తెలంగాణ యిబ్బంది పడుతుందని వీళ్లెవరికీ తోచలేదా? తెలంగాణ ఏర్పడితే చాలు, యీ ఆదాయాలు, ఆస్తులు, ఉద్యోగాలు యిలాగే వుంటాయని, ఆంధ్రావాళ్లు వెళ్లిపోతారని, అవన్నీ మనకు దక్కుతాయని వీరందరూ తెలంగాణ ప్రజలు నమ్మేట్లు చేశారు. అలాగే 'విభజన జరిగినా హైదరాబాదు యుటీ చేస్తారు, తక్కిన ముక్కే తెలంగాణకు పోతుంది, మనకూ రాజధాని, కొత్త అవకాశాలు, కొత్త పెట్టుబడులు, బ్రహ్మాండమైన అభివృద్ధి..' అంటూ ఆంధ్రులను ఊదరగొట్టారు. విభజన అనేదానికి అందర్నీ మానసికంగా సిద్ధం చేశారు. తీరా చట్టం చేసేటప్పటికి ఆంధ్రులు ఎదురు చూడని విధంగా మొత్తం హైదరాబాదును తెలంగాణకు యిచ్చేశారు. వారు గొల్లుమన్నారు. హైదరాబాదు చేతికి వచ్చినా యిప్పుడు తెలంగాణవారూ గొల్లుమంటున్నారు. కేసులో ఓడినవాడు కోర్టులోపల ఏడిస్తే, గెలిచినవాడు కోర్టు బయట ఏడ్చాడని సామెత. ఇప్పుడు పరిస్థితి అలాగే వుంది. ప్రత్యేక ప్రతిపత్తి ప్రామిస్‌ చేసిన ఆంధ్రకే అతీగతీ లేదు, యిప్పుడు తెలంగాణ అడుగుతోంది. ఇస్తారా? ఏ బేసిస్‌పై యిస్తారు? ఇవ్వకపోతే మన గతి అధోగతేనా? 

బాహర్‌ షేర్‌వానీ, ఘర్‌మే పరేశానీ అన్నట్లుగా వుంది తెరాస సర్కారు ధోరణి. 120 సంక్షేమ పథకాలు చూపించుకుంటోంది. పైగా అది చేస్తాం యిది చేస్తాం అంటూ కొత్తకొత్త హామీలు గుప్పిస్తోంది. ఖజానాలో నిజంగా డబ్బుంటే ఋణమాఫీపై, సంక్షేమపథకాలపై యిన్ని పిల్లిమొగ్గలు వేస్తుందా? అర్హులకు మాత్రమే పథకాలు అమలు చేసేందుకే సమగ్ర సర్వే అని హంగు చేశారు. ఆధార్‌ వున్నా నిరాధారులను చేశారు. సర్వే తర్వాత అందరి జాతకాలు మా గుప్పిట్లో వుంటాయన్నారు. ఎవరి స్తోమత ఎంతో తెలుసుకుని, అవసరమైన వాళ్లకు కార్డులు యిచ్చేయవచ్చుగా. అబ్బే, ఇప్పుడు మళ్లీ ఎమ్మార్వోల వద్దకు వెళ్లి అప్లయి చేసుకోవాలట. ఒక్క తెల్లకాగితంపై అర్జీ పెట్టుకుంటే చాలట. సమగ్రసర్వేకు వచ్చి కోళ్లెన్ని, కొంగలెన్ని అని అడిగి, డాక్యుమెంట్ల జిరాక్సులు చూపించమని అడిగి చేసిన కసరత్తంతా ఏమయినట్లు? ఈ ఎమ్మార్వో రౌండు అయ్యాక మరో సంకటం ఏదో పెట్టవచ్చు. అపూర్వ సహస్ర శిరచ్ఛేద చింతామణిలా ఏదో ఒక చిక్కు పెట్టి ప్రభుత్వసాయం కోరేవాళ్ల తలకాయలు నరుక్కుంటూ పోవడమే ప్రభుత్వలక్ష్యంలా వుంది. స్థానికతకు 1956 రూలు పెడితే అసలైన వాళ్లకు కూడా దస్తావేజులు చూపడం కష్టం అని  తెలంగాణ ప్రతిపక్ష నాయకులు చెప్పారు. 'అదేగా మాకూ కావలసినది' అని అధికారపార్టీ వాళ్లు లోలోపల నవ్వుకుని వుంటారు. ఎవరో ఒకరు కోర్టుకి వెళతారు, స్టే తెస్తారు, పథకం అమలు ఆలస్యమవుతుంది, ఎన్ని నెలలు ఆగితే అంత మిగులు!

పరిస్థితి యింత గడ్డుగా వుంటే బతకమ్మకు పది కోట్లు యివ్వాలా అంటారు కొందరు. ఎన్ని కష్టాలు పడుతున్నా సంస్కృతిని కాపాడుకోవడం ముఖ్యం.  కొంత బజెట్‌ భాషాసంస్కృతుల పరిరక్షణకు కేటాయిస్తూనే వుండాలి. బతకమ్మ జరుపుకునేవారికి ఏర్పాట్లు చేయడం వరకు ప్రభుత్వబాధ్యత. దానికి ఖర్చయినా తప్పు లేదు. కానీ మీరంతా జరిపి తీరాలని అతి చేయడం పొరబాటు. బతకమ్మ సంప్రదాయం అన్ని జిల్లాలలోనూ లేదు, అన్ని కులాలలోనూ లేదు. కానీ బతకమ్మ చేయకపోతే తెలంగాణ సంస్కృతిని అవమానపరిచినట్లే అనే బిల్డప్‌ యిచ్చి స్పిరిట్‌ చెడగొట్టారు. ఆఫీసుల్లో మహిళా ఉద్యోగులు బతకమ్మ ఆడాలి,   మహిళా ఐయేయస్‌ ఐపియస్‌లు కూడా ఆడాలి, 15 రోజులు సెలవు యివ్వాలి.. యివన్నీ అతి చేయడం కింద వస్తాయి. వీటివలన ఎన్ని మ్యాన్‌అవర్స్‌ నష్టపోతున్నామో లెక్క వేసి చూస్తే బాధ కలుగుతుంది. తెలంగాణ ఏర్పడ్డాక అదనపు గంటలు పని చేసి బంగారు తెలంగాణ నిర్మిస్తాం అని ఉద్యోగులు చెప్తూ వచ్చారు. ఇప్పుడు రాష్ట్రం యిక్కట్లలో వుందని ముఖ్యమంత్రే చెపుతున్నారు కాబట్టి వాళ్ల చేత అదనంగా పని చేయించి, ప్రజల్ని గట్టున పడేస్తే మంచిది. అలా జరగటం లేదు కదా, ఆఫీసు వేళల్లో కూడా బతకమ్మ ఆడమంటే యిక ఫైళ్లు ఏం కదులుతాయి? అలాగే ఐయేయస్‌ల నుండి అధికారులందరూ తెలంగాణ యాసలో మాట్లాడాలంటూ కెసియార్‌ ఉపన్యాసాలు కూడా కౌంటర్‌ ప్రొడక్టివ్‌. అధికారులు స్థానిక భాషలో మాట్లాడితేనే మనం దణ్నం పెట్టాలి. ఆఫీసులోని సహచరులతో ఇంగ్లీషు మాట్లాడినా ప్రజలు, గ్రామీణులు వచ్చి తెలుగులో తమ గోడు చెప్పుకున్నపుడు విని, అర్థం చేసుకుని, వీలైతే తెలుగులోనే వాళ్లకు చూస్తామనో, చేస్తామనో అంటే ఉపకారం చేసినట్లే. ఎందుకంటే ఎవరికీ కొత్త భాష ఓ పట్టాన పట్టుబడదు. తెలుగులో మాట్లాడండి అని హితవు చెప్పే బదులు తెలంగాణ యాసలో మాట్లాడమంటే ఎవరికైనా కష్టమే. 

మిమిక్రీ ఆర్టిస్టులు, అది కూడా కొన్ని వాక్యాలు మాత్రమే కావలసిన యాసలో మాట్లాడగలరు. తక్కినవాళ్లకు అది కష్టమే. అంతెందుకు తెలంగాణ నాయకుల్లోనే ఒక్కోరిది ఒక్కో శైలి. ఎమ్మెస్సార్‌, నాయిని.. లాటి వాళ్లు ఎప్పుడూ ఒకే యాసతో మాట్లాడతారు. కెసియార్‌ కాస్సేపు యాసలో, కాస్సేపు ప్రామాణిక భాషలో మాట్లాడతారు. ఆయన కుమారుడు కెటియార్‌ భాషలో యాస కనబడదు. అయినా తెలంగాణ యాస అంటూ ప్రత్యేకమైన యాస ఏదీ లేదు. జిల్లాజిల్లాకు యాస మారుతుంది. ఒకే జిల్లాలో కూడా పట్టణ ప్రాంతాల్లో ఒకలా, పల్లె ప్రాంతాల్లో మరోలా మాట్లాడతారు. ఒక్కో కులం వాళ్లు ఒక్కోలా మాట్లాడతారు. వారిలో కూడా చదువుకున్నవారు ఒకలా, చదువుకోని వారు మరోలా మాట్లాడతారు. నేను చెప్పేది అతిశయోక్తి కాదు. ఒక్కో జిల్లాలో వాడుకలో వుండే పదాలతో వేర్వేరు పదకోశాలు వెలువరించారు, చూడండి. ఇది తెలంగాణ రాష్ట్రానికే ప్రత్యేకం కాదు, అన్ని రాష్ట్రాలలో యిదే పరిస్థితి. అటువంటప్పుడు యిలాగే మాట్లాడండి అని అధికారులను ఒత్తిడి చేసి లాభించేదేమిటి? ఇలాటివి చూస్తే యిక్కడ ప్రాంతీయవాదం రాజ్యం చేస్తోంది అనే అభిప్రాయం కలుగుతుంది.  జాతీయస్థాయిలో పెట్టుబడిదారులకు, ప్రభుత్వాధికారులకు అది ప్రతికూల సంకేతాలను పంపుతుంది. శివసేన స్థాపించిన ఎన్నేళ్లకు రాష్ట్రంలో - అదీ సంకీర్ణభాగస్వామిగా - అధికారంలోకి వచ్చిందో గమనించండి. తమిళనాట ప్రాంతీయవాదం ఎక్కువే కానీ వాళ్లు కూడా తమ రాష్ట్రంలోని యితర జాతుల వారిని కించపరుస్తూ ఉద్యమాలు నడపలేదు. అధికారులను తమిళంలో మాట్లాడమన్నారు. ఫలానా యాసలోనే మాట్లాడమని అడగలేదు. అందర్నీ ఆట్టు కుదరై డాన్సు చేయమని అడగలేదు. ప్రాంతీయవాదం, భూమిపుత్రుల వాదం పరిశ్రమలను రానివ్వదు. అది ఆదాయంపై ప్రభావం చూపుతుంది. తెరాస నాయకులు అది గమనించాలి.  

(సశేషం) - ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2014)

[email protected]

Click Here For Part-1

Click Here For Part-2

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?