Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : కలహాలతో కరంటు వచ్చేనా? - 4

విద్యుత్‌ సమస్య నానాటికి పెరుగుతోంది. హైదరాబాదులోనే కనీసం పది గంటలపాటు కరంటు లేకుండా పోతోంది. ఎక్కడా ఏ పనీ జరగటం లేదు.  కమ్మర్షియల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ అన్నీ బావురుమంటున్నాయి. ఇళ్లల్లో కూడా చీకటే, ఉక్కే. లిఫ్టు లేక ఆపసోపాలు పడుతూ మెట్లు ఎక్కేవాళ్లే కనబడుతున్నారు. ఇన్వర్టర్‌ కూడా ఎంత సేపని పని చేయగలుగుతుంది? దేశంలోని ఎక్కడెక్కడి వారు హైదరాబాదు వాతావరణానికి మురిసి, రిటైరయ్యాక యిక్కడ స్థిరపడ్డారు. బెంగుళూరు వాతావరణం కూడా బాగున్నా, అక్కడ కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఎక్కువ. ఇక్కడ అన్ని సౌకర్యాలు, అందుబాటు ధరల్లో వుంటాయని యిష్టపడ్డారు. కానీ క్రమేపీ హైదరాబాదు వాతావరణం కూడా చెడిపోయింది. చెట్లు కొట్టేశారు. పచ్చదనం కనుమరుగైంది. వేడి, గాడ్పు, చెమట.. సుఖం లేకుండా పోయింది. ఎంతైనా ఆంధ్ర నగరాల కంటె మేలు కదా అని ఒక వూరట వుండేది. ఇప్పుడు అక్కడ విద్యుత్‌ పరిస్థితి చాలా బాగుంది, హాయిగా ఏసి వేసుకుని కూర్చోవచ్చు, యిక్కడైతే ఉస్సురుస్సురనుకుంటూ ఎలా వుంటాం? అనుకుంటున్నారప్పుడే. 

ఈ విద్యుత్‌ కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మె కొన్ని రోజుల్లోనే ముగిసిపోవచ్చు. ఈ సమస్య తాత్కాలికమే కావచ్చు. కానీ తగిన విద్యుత్‌ సరఫరాకు మాత్రం మూడేళ్లు పడుతుందని ప్రభుత్వమే ఢంకా బజాయించి చెపుతోంది. ఈ లోపున ఎన్ని సమ్మెలొస్తాయో, ఎన్ని సమస్యలొస్తాయో అనుకుంటే మాత్రం మామూలు గృహస్తులకు కూడా యిక్కడి నుండి జండా ఎత్తేస్తే మంచిదనిపిస్తుంది. ఎందుకంటే ఆధునిక జీవితమంతా విద్యుత్‌ చుట్టూనే తిరుగుతోంది. సెల్‌ఫోన్‌తో సహా ఏ గాజెట్‌ ఐనా చార్జింగ్‌ చేయనిదే పని చేయదు కదా. వంటకు కూడా ఎలక్ట్రిక్‌ కుక్కర్లు, స్టవ్‌లు ఎక్కువగా వాడుతున్నారీ రోజుల్లో. ఉద్యోగాలలో వున్నవాళ్లయితే ఎక్కడ ఉద్యోగం వుంటే అక్కడే వుండాల్సి వస్తుంది. ఆ బంధం లేనివాళ్లు ఎక్కడికైనా తరలిపోవచ్చు. మరీ వృద్ధులైతే వైద్యసదుపాయం వున్నచోటు కోసం వెతుక్కుంటారు కానీ తక్కినవాళ్లు సౌకర్యం వుంటే చాలనుకుంటారు. ఇలా వెళ్లిపోయేవాళ్లు తమతో పాటు డిపాజిట్లను, సేవింగ్స్‌ను కూడా తీసుకుపోతారు. ఇక్కడ స్థిరాస్తులు అమ్ముకుని వేరే చోట కొంటారు. ఇవేమీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మేలు చేయవు.

విద్యుత్‌ సమస్య యింత తీవ్రంగా వుంది కదా, తెరాస ప్రభుత్వం కారణం ఏం చెప్తోంది? న్యాయపరంగా మాకు రావలసిన వాటా రావకపోవడం చేతనే యిబ్బందులు పడుతున్నాం అంటోంది. అలాటి ఫిర్యాదులు చెప్పుకోవడానికి కేంద్రం నీరజ్‌ మాధుర్‌ కమిటీ వేసింది. దాని గడువు సెప్టెంబరుతో పూర్తయిపోయింది. ఇరు రాష్ట్ర ప్రతినిథులు వెళ్లకపోవడంతో ఒక్క సమావేశం కూడా జరగలేదు. విద్యుత్‌ విషయంలో అవసరం తెలంగాణది కాబట్టి సమావేశం జరిగితీరాలని పట్టుబట్టవద్దా? కేంద్రమే కమిటీ గడువు పెంచింది. ఇప్పటికైనా వీళ్లు ఏమైనా చేస్తున్నారా? మీడియా ముందు టిడిపిని తిడుతూ కూర్చుంటున్నారు. నీరజ్‌ మాధుర్‌ కమిటీయే కాదు, అసలు ఏ కమిటీ మాత్రం సరిగ్గా పని చేస్తోంది? 

కమలనాథన్‌ కమిటీ సిఫార్సులు పూర్తయ్యేయి అనుకుంటే తెలంగాణ వుద్యోగులు మళ్లీ తిరగదోడుతున్నారు. తమ తమ రాష్ట్రాలకు వెంటనే ఎలాట్‌ చేయకపోతే జీతం తీసుకుంటూనే పని మానేస్తారట. ఐయేయస్‌ అధికారులకై పెట్టిన ప్రత్యూష్‌ సిన్హా కమిటీ పనీ పూర్తి కాలేదు. ఏదో ఒకటి యిచ్చినది తీసుకుని, చప్పున పని మొదలుపెడితే కావలసినవి తర్వాత చక్కదిద్దుకోవచ్చు అనుకోవటం లేదు. ప్రతీదాన్ని ప్రతిష్టకు ముడిపెడుతున్నారు. ఉద్యోగుల పంపకానికి మొదట ఒక ఫార్ములాకు ఒప్పుకున్నారు, దాని ప్రకారం టి ఉద్యోగ నాయకుడు విఠల్‌ను ఆంధ్రకు ఎలాట్‌ చేయాల్సి వచ్చింది, అంతే, ఫార్ములా మార్చండి అంటూ తిరగతోడారు. ఇలా ఏ సూత్రానికీ కట్టుబడకుండా, ఎప్పటికప్పుడు వాదనలు మార్చుకుంటూ పోతే ఏదీ ఎప్పటికీ తెమలదు. అధికారులు లేరు, వున్నవాళ్లు మనవాళ్లో కాదో తెలియదు, కొందరు కుర్చీలో సాంతం కూర్చోకుండా కుర్చీ అంచున కూర్చుని ఎప్పుడు లేచిపోదామా అన్నట్టున్నారు. ఇక పాలన ఎలా నడుస్తుంది? ఇలాటి పాలన వుంది కదాని బండి స్లోగా పోనిస్తున్నారా? 'కేంద్రం పగ్గాలు వేస్తోంది కానీ లేకపోతే మేం యింకా ఉరికేవాళ్లం' అంటున్నారు హరీశ్‌. 

విద్యుత్‌ లోటు విషయంలో తెరాస నాయకులు చేస్తున్న వాదనలు గమనిస్తే - 1. '60 ఏళ్లల్లో కాంగ్రెస్‌, టిడిపిలు ఏమీ చేయలేదు. అందుకే యీ అవస్థ.' వాళ్లు ఏమీ చేయకుండా వుంటే హైదరాబాదు యీ స్థాయికి వచ్చేదా? హైదరాబాదు యివ్వకపోతే తల కోసుకుంటాం, మెడ కోసుకుంటాం అంటూ పోరాటాలు చేసినదెందుకు? హైదరాబాదు ఒక్కటేనా? రంగారెడ్డి...? కరీంనగర్‌లో 1956 నాటికి వరి ఉత్పత్తి ఎంత? ఇప్పుడెంత? అధికారిక గణాంకాలు ఒక్కసారి తిరగేయండి. అధికారులను నమ్మకపోతే మీ ఉద్యమనాయకులు వేసిన పుస్తకాలే చూడండి. ఎంతో కొంత తప్పకుండా చేశారు, దానికి మీకు తృప్తి లేదు, అది సహజం. ఇవాళ మీరు చేసినదానితో మీ వారసులు తృప్తి పడరు. కాంగ్రెసు ఏమీ చేయలేదంటూ టిడిపి అధికారంలోకి వచ్చింది, వాళ్లిద్దరూ ఏమీ చేయలేదంటూ మీరు వచ్చారు, మీ ముగ్గురూ ఏమీ చేయలేదంటూ యింకోరు వస్తారు. ప్రజలకు యివన్నీ తెలుసు. ఈ పల్లవిని ఎక్కువసేపు ఆలపించడం వలన ప్రయోజనం లేదు. 

2. 'తట్టెడు బొగ్గు లేని ఆంధ్రలో ప్రాజెక్టులా? బొగ్గు గనులున్న తెలంగాణలో కావలసినన్ని ప్రాజెక్టులు లేకపోవడమా? అది అన్యాయం కాదా? ' - తప్పకుండా అన్యాయమే. ఇలాటి 'అన్యాయాలు' చాలా జరిగాయి గతంలో. రాష్ట్రంలో హైదరాబాదు తప్ప వేరే ఊరే లేనట్లు అన్ని జిల్లాల డబ్బూ యిక్కడే ఖర్చు పెట్టారు. అన్ని ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలూ యిక్కడే పెట్టారు. కేంద్ర సంస్థలూ యిక్కడే. ఇదే పాయింటు ఆంధ్రవాళ్లూ లాగుతున్నారు. వికేంద్రీకరణ ఎందుకు జరగలేదు? అని. దానికి సమాధానం దొరికితే యీ ప్రాజెక్టులకూ సమాధానం దొరుకుతుంది. వికేంద్రీకరణ చేసి, అన్ని ప్రాంతాలు తగుపాటి స్థాయికి చేరిన తర్వాత విభజన గురించి ఆలోచించండి అని నా బోటివాళ్లు సూచిస్తే తిట్టరాని తిట్లు తిట్టారు. విభజన కోరేముందు యిలాటి అంశాల విషయంలో ఏం చేయాలో చూసుకోనక్కరలేదా? తొందర, తొందర. తండ్రికి పెళ్లవుతోందన్న సంబరం కాదు, సవతి తల్లి వస్తోందేమో చూసుకోవాలి. అనేక రాష్ట్రాల రష్యాను ఏర్పాటు చేసినపుడు స్టాలిన్‌ ముడిసరుకు ఒక దానిలో దొరికితే దాని ప్రాసెసింగ్‌ మరో రాష్ట్రంలో పెట్టాడు. అన్ని రాష్ట్రాలు ఒకదానిపై మరొకటి ఆధారపడేట్లా చేశాడు. కొన్ని థాబ్దాలు పోయాక రష్యా విచ్ఛిన్నమయినప్పుడు అన్ని రాష్ట్రాలూ దెబ్బ తిన్నాయి. ఇప్పటిదాకా పూర్వవైభవాన్ని తెచ్చుకోలేదు. గతచరిత్ర కళ్లముందు కనబడుతూ వుంటే ముందు జాగ్రత్తలు పడవద్దా? ఉమ్మడి రాష్ట్రంగా వున్నపుడు ఎక్కడ వెసులుబాటు వుంటే అక్కడ పెట్టేశారు. ఇది మనది, ఇది పరాయిది అనుకోలేదు. అనుకునివుంటే గడుసువారిగా (కెసియార్‌ భాషలో రాక్షస సంతతిగా) పేరుబడిన ఆంధ్రులు అన్ని పెట్టుబడులూ, అన్ని సంస్థలూ తెలంగాణలో పెట్టనిచ్చేవారు కారు. విభజన తర్వాత ఎక్కడున్నది వారికే అనేసరికి వాళ్లు పళ్లు నూరుతున్నారు. విద్యుత్‌ లాటి విషయాల్లో తెలంగాణ నాయకులూ నూరుతున్నారు. (సశేషం)

 - ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2014)

[email protected]

Click Here For Part-1

Click Here For Part-2

Click Here For Part-3

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?