Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : కలహాలతో కరంటు వచ్చేనా? - 5

3. 'ఉమ్మడి రాజధాని వున్నంతకాలం హైదరాబాదుకు కావలసినంత విద్యుత్తూ ఆంధ్ర ప్రభుత్వం యివ్వాల్సిందే!' ఉమ్మడి రాజధాని అనేదే రాజ్యాంగంలో లేదు, మేం దాన్ని ఒప్పం అని కాస్సేపంటారు, ఉమ్మడి రాజధాని కాబట్టి దానికి సరిపడా కరంటు యిచ్చి తీరాల్సిందే అని మరోసారి అంటారు. దీనిలో కూడా క్లారిటీ లేదు. ఆంధ్ర ఆఫీసులకు కావలసినంత కరంటు యివ్వాలా? లేక యిక్కడ యిప్పటికే వున్న, భవిష్యత్తులో పెట్టబోతున్న కమ్మర్షియల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ అన్నిటికీ కరంటు యివ్వాలా? అసలు యిప్పటికే హైదరాబాదు - ఎట్‌ అదర్స్‌ కాస్ట్‌ - చాలా అనుభవించింది. తెలంగాణ పల్లెటూళ్లలో బొత్తిగా మూడు గంటల కరంటా!? అని నేను విస్తుపోతే ఒక పాఠకుడు మంచి పరిశీలన చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలలో విద్యుత్‌ సరఫరా ఎక్కువ సేపు యివ్వడానికి తక్కిన 21 జిల్లాలలో కరంటు కోతలు విధించేవారు. ఆ విధంగా అన్ని జిల్లాలను నష్టపరచడంతో బాటు విభజన బిల్లులో జనాభా బేసిస్‌లో కాకుండా వాడకం బేసిస్‌న విద్యుత్‌ పంపిణీ చేస్తామంటూ ఆంధ్రరాష్ట్రానికి అన్యాయం చేశారు. ఆ మాట అలా వుంచితే యిప్పుడు హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలలో వెలుగులు నింపడానికి తక్కిన 8  తెలంగాణ జిల్లాలలో చీకట్లు పంచుతున్నారు. అంటే గతంలో 21 జిల్లాలు మోసిన భారాన్ని 8 జిల్లాలు మోస్తున్నాయి. మరి అంధకారబంధురం అయ్యాయంటే అవ్వవా? మీరు కరంటు యివ్వకపోతే మీ ఆఫీసులకు, ఎమ్మేల్యేల యిళ్లకు కరంటు కట్‌ చేస్తాం వంటి ప్రలాపాలు ఒక్క యూనిట్‌ కరంటు కూడా పుట్టించలేవు. 

ఎవరు వెళ్లినా విభజన చట్టం ప్రకారమే వెళ్లాలి. వాడకం బట్టి విద్యుత్‌ పంపిణీ చేసి అన్యాయం చేశారని బాబు వాపోయినా ప్రయోజనం లేదు. విభజన చట్టం అలా వుంది. దాన్ని అనుసరించాల్సిందే. అలాగే తెరాస లేనిపోని కొత్త క్లాజులు పెట్టకుండా చట్టంలో వున్నదానికోసం గట్టిగా పట్టుబట్టి పోరాడవచ్చు. విభజన చట్టంలో వున్న అంశాలను అమలు చేయకపోతే ఆ వివాదం లేవనెత్తేందుకు నీరజ్‌ మాధుర్‌ కమిటీతో సహా చాలా వేదికలు వున్నాయి. కోర్టుకి వెళ్లవచ్చు. ఆ మార్గాలన్నీ విడిచిపెట్టి కేంద్రమంత్రికి చెప్పాం. ఆయన ఔనన్నారు, భేషన్నారు అని బయటకు వచ్చి మనకు చెప్పడం వేస్టు. తెలంగాణ సమస్య ధర్మమాని యిలాటి ప్రెస్‌మీట్లు చాలా కన్నాం, విన్నాం. 'మేం చెప్పినదానికల్లా సోనియా తలూపారు, గుమ్మందాకా వచ్చి సాగనంపారు' అంటూ చెపుతూ వచ్చారు. చివరకు ఆవిడ చేయాలనుకున్నది చేశారు. ఎన్నికల్లో ప్రజలు ఆవిణ్నే సాగనంపారు. విద్యుత్‌ విషయంలో కేంద్రంతో సాగించిన ఉత్తరప్రత్యుత్తరాలను తెరాస ప్రభుత్వం విడుదల చేస్తే వాళ్లు చేసినదేమిటో, చెయ్యనిదేమిటో తేటతెల్లంగా తెలుస్తుంది.

4. 'భౌగోళికంగా ప్రాజెక్టులు ఆంధ్రలో వున్నంత మాౖతాన వాళ్లే వాడుకుంటామంటే కుదరదు, ఉమ్మడిలో వుండగా తెలంగాణ ప్రాజెక్టుల పెట్టుబడులు కూడా కృష్ణపట్నంలో పెట్టారు, మాకు వాటా రావలసినదే' - 'భౌగోళికంగా ఒక ప్రాంతంలో వున్నంత మాత్రాన వాళ్లకే చెందదు, అది ఆవిర్భవించడానికి, ఎదగడానికి శ్రమించిన వారందరికీ వాటా వుంటుంది' అనే వాదన చాలా సమంజసమైనది. హైదరాబాదులో యిన్ని కేంద్ర సంస్థలు వచ్చాయన్నా, యింత భారీ యింటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు వచ్చిందన్నా, లేక అనేక పెట్టుబడులు వచ్చాయన్నా దానికి కారణం 23 జిల్లాల ప్రజలకు ప్రాతినిథ్యం వహిస్తోందనే! 23 జిల్లాల పన్నుల ద్వారా వచ్చిన ఆదాయంలో అధికశాతం లేటెస్టుగా కూడా ఔటర్‌ రింగ్‌ రోడ్డు అనీ, మెట్రో అనీ హైదరాబాదులో ఖర్చు పెట్టారు. ఇప్పుడు సగం కంటె ఎక్కువ జనాభా వేరే రాష్ట్రం వాళ్లయిపోయినపుడు మరీ వాళ్లకూ వీటిలో వాటా యివ్వాలి. భౌగోళికంగా హైదరాబాదు తెలంగాణకు మధ్యలో వుందన్న కారణంగా తెలంగాణకు యిచ్చేశారు. ఆంధ్ర నుండి ఓ కారిడార్‌ ఏర్పాటు చేసి ఉమ్మడి రాజధానిగా ఎప్పటికీ వుండాలన్న సూచన వచ్చినా తోసిరాజని తెలంగాణకు యిచ్చారు. ఈ సూత్రం ఎత్తిచూపి హరీశ్‌ అప్పడే దాన్ని వ్యతిరేకించాల్సింది. 

సరే ఏదో పదేళ్లకు ఉమ్మడి అంటూ గందరగోళ విధానాన్ని రూపొందించింది కేంద్రం. తెలంగాణ ప్రభుత్వం దాన్నయినా సవ్యంగా అమలు చేస్తోందా? ఏకపక్షంగా కొన్ని సంస్థలను చేజిక్కించుకుని, దాని అధిపతులు చార్జి తీసుకోవడానికి వస్తే ఉద్యోగుల చేత అడ్డగిస్తున్నారు. వారికి పోలీసుల చేత రక్షణ కల్పిస్తున్నారు. కొన్ని సంస్థలను చీలుస్తున్నారు, ఎవర్నీ సంప్రదించకుండా పేర్లు మారుస్తున్నారు. భౌగోళికంగా మీ భూభాగంలో వుందనే కదా, యీ జబర్దస్తీ. ఇలాటి విన్యాసాలే ఆంధ్ర కూడా చూపించే ప్రమాదం వుందని మీకు తోచలేదా? ఉమ్మడి ఆస్తుల గురించి మాట్లాడితే ఆర్టీసీ విభజన కూడా వివాదంలో పడింది. 23 జిల్లాల కార్మికుల కష్టంతో కట్టుకున్న అనేక భవంతులు హైదరాబాదులో కట్టారు. వాటిల్లో మాకు కూడా వాటా వుంది అని ఆంధ్ర ఉద్యోగనాయకులు అంటే, లేదు తెలంగాణలో వున్నాయి కాబట్టి అవి మావే, మీకు వాటా లేదు అని తెలంగాణ ఉద్యోగనాయకులు వాదిస్తున్నారు. లేదు, యిది అందరి కష్టం, వాటాలు న్యాయంగా పంచుకోండి అని హరీశ్‌ వారికి చెప్పినప్పుడే ఆయనకు ఆంధ్రతో వాదించడానికి నైతికబలం వస్తుంది. 

ఆంధ్రలో విద్యుత్‌ ప్రాజెక్టులు వున్నాయి వాళ్లు బెటర్‌ పొజిషన్‌లో వున్నారు, మాకు ఏమీ లేవు అని వగస్తూ కూర్చోవడం దేనికి? వాళ్ల కష్టాలు వాళ్లకున్నాయి. మీకు సముద్రతీరం వుంది, చెలరేగిపోవచ్చు అంటూ మోదీ ఎన్నికల సభలో ఆంధ్రులను ఉబ్బేసి వెళ్లిపోయారు. చూస్తున్నాంగా హుదూద్‌ ప్రతాపం. భౌగోళికంగా చూస్తే వైజాగ్‌కు తుపాను ప్రమాదం లేదు అనుకోవడం తప్పని తేల్చేసింది. ఊరు మొత్తం ధ్వంసం. వైజాగ్‌ ఎయిర్‌పోర్టు ఛిన్నాభిన్నమై పోయింది. బాబు మొన్ననే ప్రారంభించిన యింక్యుబేషన్‌ సెంటర్‌ నామరూపాలు లేకుండా పోయిందట. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక వైజాగ్‌ రూపురేఖలు మార్చేస్తాం అని నాయకులంటూ వచ్చారు. ఆ పని హుదూద్‌ యింకోలా చేసింది. ఇప్పుడక్కడ యూనివర్శిటీలు, విద్యాసంస్థలు, ఐటీ కంపెనీలు, ఫిల్మ్‌ పరిశ్రమ, ఫార్మా యూనిట్లు ఎలా పెడతారో నాకు అర్థం కావటం లేదు. పెడితే యిలాటి తుపాన్లను తట్టుకునేందుకు వీలుగా పటిష్టంగా కట్టడానికి చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుందనిపిస్తోంది. వైజాగ్‌లో పెట్టకుండా వైజాగ్‌ జిల్లాలోనే సముద్రానికి దూరంగా పెట్టాలేమో! ఈ తలకాయనొప్పులేవీ తెలంగాణకు లేవు కదా. అందుకని ఆంధ్రను చూసి అసూయపడడం మానేసి, తప్పులు ఎంచడం మానేసి మన పని మనం చేసుకుంటే మంచిది.

కృష్ణపట్నం కమిషనింగ్‌ విషయంలో హరీశ్‌ చేసే ఆరోపణలు ఎంతవరకు వాస్తవాలో ఎవరికీ తెలియకుండా వుంది. అఖిలపక్షం ఏర్పాటు చేసి వాళ్లకైనా వివరిస్తే కన్విన్సింగ్‌గా వుంటుంది. మెట్రో లైను మార్పు గురించి గొడవై ప్రాజెక్టు ఆగిపోతుందన్నపుడు అఖిలపక్ష సమావేశం పెట్టవచ్చు కదాని విపక్షాలు సూచిస్తే, గతంలో లైను నిర్ధారించినపుడు పిలిచారా? అని తెరాస నాయకులు అడుగుతున్నారు. కాంగ్రెసు వాళ్లు సరిగ్గా చేయలేదనే వాళ్లని దింపి మిమ్మల్ని ఎక్కించారు. మీరూ వారి మార్గంలోనే నడుస్తామంటే, మరి వారి మార్గంలోనే నిష్క్రమించవలసి వస్తుంది. ప్రజలకు కావలసినది ఫలితాలు. మీరు దాని గురించి ప్రయత్నించినా అర్థం చేసుకుంటారు. పని ఎందుకు జరగలేదో కారణాలు చెపుతూ పోతే వాటిని సాకులుగా భావిస్తారు. బాబు విలన్‌, కాంగ్రెసు విలన్‌ అంటూ చెప్పినంత మాత్రాన మీరు హీరోలు కారు. రాముడు అయోధ్యకు వచ్చి 'మరేమో రావణుడు సీతను ఎత్తుకుపోయాడు. ఎంత వెతికినా నాకు కనబడలేదు' అని చెప్పుకుంటే ప్రజలు హర్షించేవారా? 'నిలకడలేని కోతుల సాయం తీసుకో, రెక్కలు విరిగిన పకక్షుల సాయం తీసుకో, ఎలాగోలా నీ భార్యను నువ్వు తెచ్చుకుని ఏలుకో, కథానాయకుడి వనిపించుకో' అని చెప్పి వుండేవారు. అదే విధంగా కెసియార్‌తో మనం 'నువ్వు బాబుతో బెగ్‌, బారో ఆర్‌ స్టీల్‌ చేసి మాకు కరంటు తే, చాలు' అని చెప్తార. (సశేషం)

 - ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2014)

[email protected]

Click Here For Part-1

Click Here For Part-2

Click Here For Part-3

Click Here For Part-4

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?