Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : కరుణ ఓడిన కారణం ? - 1/2

ఎమ్బీయస్‌ : కరుణ ఓడిన కారణం ? - 1/2

ఈసారి ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు తక్కిన రాష్ట్రాల విషయంలో ఫర్వాలేదు కానీ తమిళనాడు విషయంలో బాగా దెబ్బ తిన్నాయి. ఉదాహరణకి ఇండియా టుడే-యాక్సిస్‌ సర్వే తీసుకుంటే  డిఎంకె 124-140, ఎడిఎంకెకు 89-101 వస్తాయంది. టైమ్స్‌నౌ-సి ఓటరు ఒక్కటే ఎడిఎంకెకు 139 (134 వచ్చాయి), డిఎంకె కూటమికి 78 (89 వచ్చాయి) వస్తాయని చెప్పింది. దినతంతి టివి ఎడిఎంకెకు 111, డిఎంకెకు 99 వస్తాయంది. తక్కినవన్నీ దెబ్బ తిన్నాయి. ఎందుకిలా జరిగింది? తమిళ ఓటరు కావాలని వీళ్లను తప్పుదోవ పట్టించాడా? నా అనుమానం ఎగ్జిట్‌ పోల్‌ సర్వే శాంపుల్‌ తక్కువగా తీసుకుని (ఎందుకంటే సమయం తక్కువ వుంటుంది, పోలింగు పూర్తవుతూండగానే టీవీలో చర్చ మొదలుపెట్టేయాలి మరి) వీళ్లు ముందునుంచి సర్వేలు చేస్తూ వచ్చి, కొన్ని గణాంకాలు సేకరించి పెట్టుకుని, వాటిని ఎగ్జిట్‌ పోల్స్‌ అంకెలతో సమన్వయపరచి, మొత్తం అంకెల్ని ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వేగా చూపిస్తున్నారని! ఒకవేళ యిదే నిజమనుకుంటే పోలింగుకు ముందు చేసిన సర్వేల్లో చాలా భాగం డిఎంకెకు అనుకూలంగా వుండి వుంటాయి. పోనుపోను చివరకి వచ్చేసరికి ఎడిఎంకెకు అనుకూలంగా పవనాలు వీచి వుంటాయి. అది వీళ్లు పసి గట్టలేకపోయారు. 

జయలలిత పరిపాలన బాగా లేదన్న విషయం వరదల విషయంలో బాగా బయటపడింది. చెంబరుబాకం చెఱువులో చేరిన అదనపు నీటిని దశల వారీగా విడుదల చేయకుండా నవంబరు 16న ఒక్కసారిగా వదిలిపెట్టేయడంతో వూరు మునిగింది. డిసెంబరు 2న మళ్లీ అలాగే చేశారు. వరదల సమయంలో జయలలిత ఆ ప్రాంతాలు సందర్శించలేదు. ఒక్కసారి తన ఆర్‌కె నగర్‌ నియోజకవర్గానికి వచ్చి వాహనం దిగకుండా 'నా ప్రియమైన ఓటర్లలారా' అంటూ ఉపన్యసించింది. ఆ సంబోధనతో మండిపడిన ప్రజలను ఎడిఎంకె కౌన్సిలర్లు తమ చర్యలతో మరింత రెచ్చగొట్టారు. ఇతర ప్రాంతాల నుంచి స్వచ్ఛంద సంస్థలు ఆహారం, దుస్తులు ప్యాక్‌ చేసి తెస్తే వీళ్లు వాటిని లాక్కుని ఆ ప్యాకెట్లపై జయలలిత బొమ్మ ముద్రించి మరీ పంపిణీ చేశారు. ఇలాటి పరిస్థితిలో కూడా వీళ్లకు ఓట్ల ధ్యాసే అని అందరూ తిట్టుకున్నారు. అందుకే చెన్నయ్‌లో వున్న 16 సీట్లలో 10 సీట్లలో ఎడిఎంకె ఓడిపోయింది. వరదల వలన ప్రభావితమైన 37 నియోజకవర్గాల్లో 21 వాటిలో ఓడిపోయింది. గతంలో అయితే భాగస్తులతో కలిసి 35 నెగ్గింది! 

ఆర్థిక అభివృద్ధికి కావలసిన పారిశ్రామిక ప్రగతి జరగలేదని కూడా విశ్లేషకుల మనసుల్లో మెదలుతూ తాము అనుకున్నదానికి అనుకూలంగా గణాంకాలను మలచి వుంటారు. జయ హయాంలో తిరుపూరు జౌళి పరిశ్రమ పూర్తిగా దెబ్బ తినిపోయింది. శ్రీపెరంబుదూరు, మద్రాసులలో ఆటోమొబైల్‌, ఆటోస్పేర్‌ పార్ట్‌స్‌ పరిశ్రమలు కూడా అదే బాట పట్టాయి. సుగర్‌ పరిశ్రమ వాళ్లు కూడా ఇథనాల్‌ అమ్మకాల విషయంలో పెట్టిన పరిమితిపై గగ్గోలు పెడుతున్నారు. రాష్ట్రంలో మాన్యుఫాక్చరింగ్‌ సెక్టార్‌, ఎక్స్‌పోర్టు సెక్టార్‌ రెండు డీలా పడ్డాయి. పారిశ్రామిక వేత్తల సంఘాలు జయలలితను కలిసి తమ కష్టాలు చెప్పుకుందామంటే ఆమె అపాయింట్‌మెంటే యివ్వటం లేదు. పరిశ్రమలు రాష్ట్రం నుండి తరలిపోతున్నాయి. వీటన్నిటి వలన జయలలిత ఓటమి తథ్యం అనుకున్నారు పరిశీలకులు. జయలలితకు కూడా యీ విషయాలన్నీ తెలుసు. అందుకనే అనేకమంది ఎమ్మేల్యేలకు టిక్కెట్లు యివ్వలేదు. పార్లమెంటు ఎన్నికలలో ఐదుగురు మంత్రులను జిల్లా యిన్‌చార్జిలుగా పెట్టింది. ఈసారి వాళ్లెవరికీ బాధ్యత అప్పగించలేదు. గతంలో అన్ని ఎన్నికలలో 30-40 మందిని పార్టీ తరఫున ఎలక్షన్‌ పర్యవేక్షకులుగా పెట్టేది. ఈసారి అలాటిది చేయలేదు. అన్ని ఆదేశాలూ జయలలిత నివాసం నుండే వెళ్లాయి. పార్టీలోనే ఎవర్నీ నమ్మకుండా, ఓ పక్క భయపడుతూనే వున్నా ప్రతిపక్షాల అనైక్యతే తనను గట్టెక్కిస్తుందని ఆమె లెక్క వేసింది. ఒంటరిగా పోటీ చేసి ఓ రకంగా జూదమాడినట్లే ఆడింది. కొద్దిలో ఆట గెలిచింది. 

2011లో 160 స్థానాల్లో పోటీ చేసి (తక్కినవి భాగస్వామి పక్షాలకు యిచ్చింది) 150 గెలిచిన ఎడిఎంకె యీసారి 227లో పోటీ చేసి 131 గెలిచింది. ఐదుగురు మంత్రులు ఓడారు. 2015లో ఆర్‌ కె నగర్‌లో లక్షన్నర ఓట్ల తేడాతో గెలిచిన జయ యీసారి 40 వేల తేడాతో గెలిచింది. అక్కడ డిఎంకె అభ్యర్థికి దాదాపు 58 వేల ఓట్లు వచ్చాయి. ఎడిఎంకెకు 176.17 లక్షల ఓట్లు, డిఎంకె కూటమికి 171.75 లక్షల ఓట్లు. అంటే తేడా నాలుగున్నర లక్షల కంటె తక్కువ. ఓట్ల శాతం తేడా 1.1%! ఉచితాలు, సబ్సిడీలు ఎన్ని యిచ్చినా ఎడిఎంకెకు గతంలో కంటె 16 సీట్లు తగ్గాయి. డిఎంకె గతంలో కంటె 9% ఓట్లతో 66 సీట్లు ఎక్కువ గెలిచింది.  డిఎంకె కూటమికి మొత్తం 39.7% ఓట్లు వస్తే కూటమిలో విడివిడిగా డిఎంకెకు 31.6%, కాంగ్రెసుకు 6.4%, ముస్లిం లీగుకు 0.7%, తక్కినవాటికి 1% వచ్చాయి. డిఎంకె, ఎడిఎంకె డైరక్టుగా పోటీ పడిన 172 నియోజకవర్గాల్లో 52% అంటే 89 స్థానాలు డిఎంకెకు వచ్చాయి. అంటే విడిగా చూస్తే డిఎంకె బలపడింది కానీ భాగస్వాములు వీక్‌ కావడంతో వాళ్ల కూటమి నష్టపోయింది. ఇతర భాగస్వాములతో ఎడిఎంకె తలపడిన 60 చోట్లలో ఎడిఎంకె 51 గెలిచింది. మిత్రపక్షాలు డిఎంకెను దెబ్బ తీశాయి. 

దేశమంతా మోదీ హవా వీచిన 2014 పార్లమెంటు ఎన్నికలలో జయలలితకు 45% ఓట్లు వచ్చాయి. 39 సీట్లలో 37 గెలిచింది. (హిట్‌ రేట్‌ 95%) డిఎంకెకు 24% ఓట్లు వచ్చినా ఒక్క సీటూ దక్కలేదు. (హిట్‌ రేటు 0%) అలాటిది యీ రోజు జయలలిత హిట్‌ రేటు 232టిలో పోటీ చేసిన ఎడిఎంకె 134 సీట్లు పొందగా (58%), డిఎంకె విషయానికి వస్తే 176లో పోటీ చేసి 89 నెగ్గింది. (హిట్‌ రేటు 51%). ఇలా చూస్తే డిఎంకె విజయం అంచుల దాకా వచ్చినట్లు అర్థమవుతుంది. మరి చివర్లో అంచెందుకు జారింది అన్నదే పరిశీలించాలి. దీన్ని పార్టీ బయటి వ్యవహారాలు, అంతర్గత వ్యవహారాలుగా విడమర్చి చూడాలి. ప్రభుత్వ వ్యతిరేకతను ఉపయోగించుకోవాలంటే ప్రతిపక్షాల మధ్య ఓట్లు చీలిపోకూడదని తెలిసిన కరుణానిధి ఎంత ప్రయత్నించినా పొత్తులు కుదరలేదు. పిఎంకె మరీ కొమ్మెక్కింది. చివరకు 5.3% ఓట్లు తెచ్చుకుని డిఎంకె అవకాశాల్ని చెడగొట్టడానికే పనికి వచ్చింది. పిఎంకె ఓట్లు చీల్చిన కారణంగా డిఎంకె 30 స్థానాల్లో ఓడిపోయింది. 234లో పోటీ చేసిన పిఎంకె ఒక్కటీ గెలవలేదు. 4టిలో రెండో స్థానం, 66లో మూడో స్థానం దక్కింది. ముఖ్యమంత్రి అభ్యర్థి అనుకున్న అన్బుమణి కూడా ఓడిపోయాడు.  

ఇక ఫ్రంట్‌ సంగతి చూడబోతే విజయకాంత్‌ను ముఖ్యమంత్రిగా ప్రకటించడంతో సర్వనాశనమైంది. అతని దురుసు ప్రవర్తన, మతిమాలిన మాటలు, తన పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోలేని అసమర్థత యివన్నీ అతనిపై ఓటరుకు విశ్వాసం కలిగించలేదు. ''నేను కింగ్‌మేకర్‌ను కాను, కింగ్‌నే'' అంటూ చివరకు జోకర్‌లా మిగిలాడు. ఉళుందూర్‌ పేట నియోజకవర్గంలో మూడో స్థానంలోకి జారి డిపాజిట్టు సైతం పోగొట్టుకున్నాడు. గతంలో తెచ్చుకున్న 29 సీట్లు పోగొట్టుకున్నాడు. ఇతరులు కూడా 27 సీట్లు పోగొట్టుకున్నారు. అవన్నీ డిఎంకె ఖాతాలో పడ్డాయి. ఫ్రంట్‌లో ముఖ్యనాయకుడైన  వైగో పెద్ద కబుర్లు చెప్పి మధ్యలో పోటీలోంచి తప్పుకోవడంతో - తప్పుకోవడానికి ఏ కారణం చెప్పినా - ప్రజలకు ఆ కూటమి పట్ల విశ్వాసం పోయింది. ఫలితాల తర్వాత వైగో మాట్లాడుతూ ''ఆఖరి మూడు రోజుల్లో కూటమి దెబ్బ తింటోందని తెలిసిపోయింది. ఈసారి మధ్యతరగతి, ధనిక వర్గాలు కూడా ఓటుకు డబ్బు తీసుకున్నాయి. మీడియా మాకు వ్యతిరేకంగా పనిచేసింది'' అని చెప్పుకున్నాడు. అతను మూడు రోజులు అన్నాడు కానీ విశ్లేషకులు రెండు వారాల క్రితమే అది నీరసించిందని చెప్పారు. వాళ్లు బలంగా వుండి వుంటే డిఎంకె, ఎడిఎంకెలకు యిన్ని ఓట్లు వచ్చేవి కావు. ఫ్రంట్‌లో భాగస్వామి ఐన కమ్యూనిస్టు లీడరు ఓడిపోయాక మీడియాతో మాట్లాడుతూ ''వైగో ఉపసంహరణతో మాపై విశ్వాసం పోయింది. టిఎమ్‌సి పార్టీని పునరుద్ధరించిన జికె వాసన్‌‌, విజయకాంత్‌ చివరి వరకు ఎడిఎంకె తో బేరాలాడి చివరకు మా దగ్గరకు వచ్చారని ఓటర్లందరూ గమనించారు. వాళ్లతో కలిసి వూరేగిన మాకు విశ్వసనీయత ఎక్కడిది?'' అన్నారు. తక్కిన పార్టీల్లో బిజెపి 156 స్థానాల్లో పోటీ చేసి అన్నిట్లోనూ ఓడిపోయింది. రాష్ట్ర అధ్యక్షుడికి డిపాజిట్టు కూడా దక్కలేదు. తమిళ తీవ్ర జాతీయవాదం బోధించే నామ్‌ తమిళగ కచ్చి 232 స్థానాల్లో పోటీ చేసి ఎక్కడా గెలవలేదు. పార్టీ అధ్యక్షుడికి డిపాజిట్టూ పోయింది. (సశేషం) 

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మే 2016)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?