Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: కరుణ ఓడిన కారణం ? - 2/2

ఎమ్బీయస్‌: కరుణ ఓడిన కారణం ? - 2/2

ఇక పొత్తు కుదిరిన కాంగ్రెసు విషయంలో కరుణానిధి అంచనాలు బెడిసి కొట్టాయి. వారితో పొత్తు నష్టదాయకంగా పరిణమించింది. కాంగ్రెసు నుంచి జికె వాసన్‌ విడిగా వెళ్లిపోయిన తర్వాత కూడా కాంగ్రెసు బలం తగ్గింది. అది గ్రహించకుండా వాళ్లకు 41 సీట్లు కేటాయించాడు కరుణానిధి. వాటిలో అది కేవలం 8 గెలిచింది. వాటిలో మూడు కన్యాకుమారి జిల్లాలో గెలిచినవే. 2011తో పోలిస్తే 3 సీట్లు ఎక్కువ వచ్చాయి కానీ ఓట్ల శాతం 3% తగ్గింది. డిఎంకె కూటమిలోని యితర పార్టీల గురించి చెప్పుకుంటే - డిఎంకె రెండు ముస్లిము పార్టీలను చేర్చుకుని తలో ఐదూ యిచ్చాడు. వాటిలో 1 మాత్రమే గెలిచారు వాళ్లు. నాలుగు సీట్లు యిచ్చిన పుదియ తమిళగం ఒక్కటి కూడా గెలవలేకపోయింది. విజయకాంత్‌ పార్టీని చీల్చి తెచ్చిన నాయకులకు మూడు సీట్లు యిస్తే వాళ్లూ ఓడిపోయారు.  భాగస్వాములకు 58 సీట్లు కేటాయిస్తే వాళ్లు నెగ్గినవి 9 మాత్రమే! ఇన్ని కేటాయించకుండా తామే స్వయంగా పోటీ చేసి వుంటే డిఎంకెకు లాభం చేకూరేదని తోస్తుంది. ఎడిఎంకె తన భాగస్వామి పక్షాలకు 7 సీట్లు కేటాయిస్తే వాళ్లు 3 నెగ్గారు. డిఎంకె 1 సీటును 49 ఓట్ల తేడాతో పోగొట్టుకుంది. 500 కంటె తక్కువ తేడాతో 5, వెయ్యి కంటె తక్కువ తేడాతో 3 పోయాయి. 3 వేల తేడాతో పోయిన సీట్లు 21! ''విజయకాంత్‌ పార్టీకి యిప్పుడు 3% ఓట్లే వచ్చాయి. కానీ డిఎంకె అతన్ని ఎలాగైనా తన దారికి తెచ్చుకుని వుంటే అప్పుడు 6-8% ఓట్లు సంపాదించేవాడు. ఇద్దరూ కలిసి ఎడిఎంకెను ఓడించేవారు.'' అంటారు కొందరు. 

ఇక డిఎంకె అంతర్గత విషయాలకు వస్తే - లేచుంటే కూర్చోలేని, కూర్చుంటే లేవలేని స్థితిలో వున్నా రుణానిధి తనను తాను కాబోయే ముఖ్యమంత్రిగా ప్రకటించుకోవడం తప్పయిందని యిప్పుడనుకుంటున్నారు. తన బదులు స్టాలిన్‌ను చూపించి వుంటే తప్పకుండా పరిస్థితి మెరుగ్గా వుండేదట. ఐదేళ్ల క్రితం డిఎంకె పీకలనిండా కూరుకుపోయిన అవినీతి, బంధుప్రీతి గురించి తమిళ ప్రజలు పూర్తిగా మర్చిపోలేదు. ఆ స్కాముల్లో స్టాలిన్‌ నిందితుడు కాడు. అతను నమక్కు నామే పేరిట ఏడాది పాటు చేసిన 11 వేల కిమీల పాదయాత్రలో డిఎంకె గత పాలన గురించి యిబ్బందికరమైన ప్రశ్నలు ఎదుర్కోవచ్చింది. డిఎంకె నాయకుల్లో కరుణానిధితో సహా నోరు పారేసుకునే వారు చాలామంది వున్నారు. కానీ స్టాలిన్‌ మృదుభాషి. అన్న అళగిరిలా దురుసుగా ప్రవర్తించడు. సౌమ్యంగా రాజకీయాలు నడిపే వ్యక్తి. తన తర్వాత పార్టీని నడిపించగలిగేది స్టాలిన్‌ ఒక్కడే అని కరుణానిధికి కూడా తెలుసు. 

అయినా అతనే ముఖ్యమంత్రి అని ప్రకటిస్తే అళగిరి అలిగి చెడగొడతాడని భయపడ్డాడు. ప్రకటించకపోయినా అళగిరి చెడగొట్టాడు. అతని అనుచరులు జయకు ఓటేశారని మీడియాకు అనుమానం. అతనికి పట్టున్న 5 జిల్లాల మధురై మండలంలో 56 స్థానాల్లో ఎడిఎంకె నెగ్గింది. దానితో బాటు 57 స్థానాల కొంగు మండలం (కోయంబత్తూరు, తిరుపూరు, నీలగిరి, సేలం, ఈరోడు, నామక్కల్‌, ధర్మపురి, కృష్ణగిరి జిల్లాలు) కూడా డిఎంకెను దెబ్బ తీసింది. అక్కడ ఎడిఎంకె 45 గెలిచింది. స్టాలిన్‌ను ముఖ్యమంత్రిగా, అళగిరిని పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించి వుంటే పరిస్థితి మెరుగ్గా వుండేదేమో. అళగిరిని పూర్తిగా తొక్కేయాలనుకోవడం పొరపాటైంది. స్టాలిన్‌ ఒంటరిగా ప్రచారం చేస్తూండగా కరుణానిధి తన పక్కన దయానిధి మారన్‌ను పెట్టుకుని ప్రచారం చేశాడు. దయానిధిని చూడగానే అందరికీ ఎయిర్‌సెల్‌-మాక్సిస్‌ కుంభకోణం గుర్తుకు వచ్చింది. వీళ్లిద్దరూ కాకుండా కనిమొళి కూడా విడిగా ప్రచారం చేసింది. ఆమెను చూడగానే 2 జి స్కామ్‌ గుర్తుకు రావాలి అయినా ఆమె పట్ల, అవినీతి కేసుల్లో నిండా మునిగిన జయలలిత పట్ల ప్రజలు మరీ అంత వ్యతిరేకంగా లేరని పరిశీలకులు అంటున్నారు.  

జయకు మించి సంక్షేమ పథకాలు కొనసాగిస్తాం, పెంచుతాం, వాటితో పాటు మద్యనిషేధం పూర్తిగా అమలు చేస్తామంటూ తొలి సంతకం చేస్తాం అని కరుణానిధి చెప్పుకోవడం నష్టదాయకమైంది. సంక్షేమ పథకాల పెంపు, సంపూర్ణ మద్యనిషేధం రెండూ ఒకేసారి సాధించడం కష్టమని తమిళ ప్రజలకు అర్థమైంది. తొలి సంతకం చేస్తానన్నాడు కాబట్టి మద్యనిషేధం నిజంగా అమలు చేస్తే తమకు వచ్చే ఉచితాలు ఎగిరిపోతాయని భయపడ్డారు. దశలవారీ మద్యనిషేధం చేస్తానన్న జయలలితను నమ్మారు. మందుకు అలవాటు పడిన డిఎంకె సమర్థకులు తమ పార్టీ వస్తే మందు దొరక్కుండా పోతుందేమోనన్న భయంతో  యీసారి ఎడిఎంకెకు వేసి వుంటారని కొందరు చమత్కరించారు. అయితే కావచ్చు కూడా. ఉచితాల హామీని అమలు చేస్తూన్న జయలలిత యీసారి ఓడిపోతే, ఉచితాలు ఓట్లు తెచ్చిపెట్టవని డిఎంకె అనుకునే అవకాశం వుంది. అలా అనుకున్నాక వాటిని రద్దు చేయవచ్చు, తగ్గించవచ్చు. 'వాళ్లిస్తారో లేదో, యిస్తున్నవారిని చెడగొట్టకోవడం దేనికి?' అనుకుని ఓటర్లు అనుకుని ఎడిఎంకెకే ఓటేసి వుండవచ్చు. 

జయలలిత కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఏడుసార్లు మార్చింది. ఎవర్ని మార్చినా పార్టీలో తిరుగుబాటు రాలేదు. కానీ డిఎంకె వర్కర్లు మాత్రం అభ్యర్థిని మార్చిన సందర్భాల్లో హై కమాండ్‌తో విభేదించి కొన్ని చోట్ల ఓడించారు కూడా. 15 స్థానాల్లో అభ్యర్థుల ఎంపికలో లోపం వలన పార్టీ ఓడిపోయిందని అంచనా. డిఎంకె పార్టీ ఎన్నికల ముందే చురుగ్గా వుండి, ఎన్నికలు అయిపోయాక స్తబ్దంగా వుంటుందన్న విమర్శ వుంది. పొరుగున వున్న కేరళలో ప్రతిపక్షంలో వున్న లెఫ్ట్‌ ఫ్రంట్‌ నిరంతరం ఏదో ఒక ఆందోళన చేపడుతూ ప్రజల్లో చురుగ్గా వుంది.  కానీ యిక్కడ గత ఐదేళ్లలో ప్రజాసమస్యలపై ఆందోళన చేసి నాయకులు అరెస్టయిన సందర్భాలు లేవు. నమక్కు నామే పాదయాత్రలో కూడా స్టాలిన్‌ ప్రజల సమస్యలు ఓపిగ్గా విన్నాడే తప్ప 'పదండి, స్థానిక అధికారులను నిలదీద్దాం' అని చొక్కా చేతులు మడిచి ఊరేగింపుగా ప్రభుత్వ ఆఫీసులపైకి వెళ్లలేదు. అతని పాదయాత్ర ఏర్పాటు చేసినది పార్టీ కార్యకర్తలు కారు. స్టాలిన్‌ అల్లుడు శబరీశన్‌, ఒక ప్రయివేటు ఏజన్సీని ఏర్పాటు చేసుకుని, పార్టీవారితో ఏమీ సంప్రదించకుండా చేసుకొచ్చాడు. సోషల్‌ మీడియా కూడా పార్టీ తరఫున యితరులే మేనేజ్‌ చేశారు. దానికి దాదాపు 90 కోట్ల రూ.లైందిట. పాదయాత్ర, సోషల్‌ మీడియా ప్రచారం వలన పార్టీ నిధులు, టైము చాలా ఖర్చయ్యాయని, వాటికి బదులు సాంప్రదాయపద్ధతుల్లో ప్రచారం చేసినా బాగుండేదని సాధారణ కార్యకర్తలు వాపోతున్నారు. 

జయలలితకు మహిళల మద్దతు బాగా వుందని ఒక విశ్లేషణ వచ్చింది. మొత్తం 582 లక్షల మంది ఓటర్లుండగా 74.3% మంది అంటే 428.74 లక్షలు ఓటేశారు, వారిలో మహిళలు 50.45% మగవాళ్లు 49.55%. 143 స్థానాల్లో అధిక సంఖ్యలో పోలింగుకు వచ్చారు. అక్కడ 83 (58%) స్థానాల్లో ఎడిఎంకె, 53 (37%) స్థానాల్లో డిఎంకె, కాంగ్రెసు 6 (4.2%) స్థానాల్లో, ముస్లిం లీగ్‌ 1 (0.7%) స్థానంలో గెలిచాయి. 163 స్థానాల్లో మహిళలు మగవాళ్ల కంటె ఎక్కువ సంఖ్యలో ఓటేశారు. జయలలిత పెళ్లి సమయంలో యిస్తున్న 4 గ్రా. బంగారం, గర్భం ధరిస్తే  యిచ్చే 12 వేల రూ.లు, బేబీ కిట్‌, ఉచితంగా యిచ్చే మిక్సీ, గ్రైండర్‌, ఫ్యాను, నాలుగు గొఱ్ఱెలు, ఆవు యివన్నీ వారిని ఆకట్టుకున్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లలకు వుచితంగా యిచ్చే యూనిఫాం, నోటుబుక్స్‌, అచ్చు పుస్తకాలు, జామెట్రీ బాక్సు, చెప్పులు యివన్నీ కూడా భేషుగ్గా వున్నాయని మగవాళ్లు కూడా ఒప్పుకున్నారు. 1991 నుండి 1996 వరకు సాగిన పాలనలో జయలలిత తన దత్తత కొడుకు వివాహం, అవినీతి, ప్రత్యర్థులపై హింసాత్మకమైన దాడులు యిటువంటి వివాదాల్లో చిక్కుకుని 1996లో ఓడిపోయింది. 2001 నుండి 2006 వరకు సాగిన పాలనలో ప్రభుత్వోద్యోగులను హింసించడం, మతాంతీకరణ బిల్లు వగైరా వివాదాలతో 2006లో ఓడిపోయింది. గత ఐదేళ్లగా యిలాటి పెద్ద వివాదాలు తలెత్తలేదు. శాంతిభద్రతలు కూడా బాగానే వున్నాయి. అందువలన ప్రభుత్వ వ్యతిరేకత మరీ అంత బలంగా లేదు. ఉన్నదాన్ని వినియోగించుకోవడం చేతకాక డిఎంకె ఓడిపోయింది. - (సమాప్తం)

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మే 2016)

[email protected]

Click Here For Part-1

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?