Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: కాశీకి పోయాము రామాహరీ...!

ఎమ్బీయస్‌: కాశీకి పోయాము రామాహరీ...!

యుపి ఎన్నికలలో పోటీ పడుతున్న  ప్రధాన నాయకులందరూ శనివారం నాడు కాశీలోనే సాక్షాత్కరించారు. పొద్దున్న మోదీ, మధ్యాహ్నం అఖిలేశ్‌-రాహుల్‌ ర్యాలీలు. సాయంత్రం మాయావతి మహాసభ.  ఎస్పీ, బియస్పీ నాయకులు కాలికి బలపం కట్టుకుని తిరగడం మామూలే కానీ బిజెపి తరఫున సాక్షాత్తూ మోదీయే వచ్చి రోడ్‌ షో నిర్వహించడం కొంత వింతగానే వుంది. తూర్పు యుపిలో బిజెపికి గండంగానే వుంది కాబట్టి మోదీ అక్కడే మకాం వేసి ప్రచారం చేస్తారని అంటున్నారు. 2014లో మోదీకి గెలుపు అందించిన వారణాశిలో బిజెపి స్థానిక నాయకులు అభ్యర్థుల పట్ల అసంతృప్తిగా వుండి, సహకరించకపోవడం చేత పరిస్థితి గడ్డుగా వుందని, ఏ కారణం చేతనైనా అక్కడి అభ్యర్థులు ఓడిపోతే మోదీ ప్రత్యర్థులు చెలరేగిపోతారని బిజెపి భయం. ఇప్పటిదాకా ఆరు విడతల ఎన్నికలు జరిగినా ఎవరికీ మొగ్గు కనబడటం లేదని విశ్లేషకులు అంటున్నారు. అబ్బే, బిజెపి గెలుపు ఖాయం అని కొందరు జర్నలిస్టులు చెపుతున్నారు. తరచి చూస్తే తక్కిన ప్రాంతాల్లో గణనీయంగా సీట్లు గెలుచుకుంటామన్న దృఢ నమ్మకం వుండి వుంటే యీ ప్రాంతం గురించి మోదీ యింత కష్టపడవలసిన అవసరం వుండేది కాదు. 

నిజానికి యుపిలో తక్కిన పార్టీలన్నిటి కంటె గెలుపు అవకాశాలు బిజెపికే ఎక్కువ వున్నాయి. పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికవుతూనే అమిత్‌ షా యుపి గెలిచి మీ చేతిలో పెడతానని మోదీకి మాట యిచ్చాడు. గొప్ప నిర్వాహకుడైన అతను ప్రతి నియోజకవర్గం నుంచి నిర్మాణం చేసుకుంటూ వచ్చి పటిష్టమైన యంత్రాంగాన్ని తయారు చేసుకున్నాడు. పార్టీ మొత్తాన్ని తన కనుసన్నల్లో నడిపించాడు. అతని ఆధ్వర్యంలోనే ఢిల్లీ, బిహార్‌ ఎన్నికలలో బిజెపి ఓటమి చెందింది కదా అనవచ్చు. కానీ అక్కడి పరిస్థితులు వేరు. ఢిల్లీలో ఆప్‌తో నేరుగా తలపడవలసి వచ్చింది. బిహార్‌లో కూడా బిజెపియేతర పక్షాలన్నీ ఏకమై ముఖాముఖీ పోటీ యిచ్చాయి. నీతీశ్‌ కుమార్‌ తన బద్ధశత్రువైన లాలూతో చేతులు కలిపాడు. వారికి కాంగ్రెసు తోడయింది. కానీ యుపిలో బిజెపి ప్రత్యర్థులు రెండుగా విడిపోయారు. ఎస్పీ, బియస్పీ రెండూ బలమైన పార్టీలే. కాంగ్రెసు ఎస్పీతో చేతులు కలిపింది కాబట్టి కానీ లేకపోతే చతుర్ముఖ పోటీ అయి వుండేది. ఇప్పుడున్న త్రిముఖ పోటీలో బిజిపి ప్రతికూల ఓటు చీలిపోయి, బిజెపియే లాభపడుతుంది. ఇంకో విషయం ఏమిటంటే నీతీశ్‌ అనుభవజ్ఞుడైన పాలకుడు. రెండో టర్మ్‌లో అంత బాగా పనిచేయలేకపోయినా మొదటి టర్మ్‌లో చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. శాంతిభద్రతలకు స్పెల్లింగు తెలియదని అనుకునే బిహార్‌లో వాటిని నెలకొల్పాడు. కులపక్షపాతం, అవినీతి ఆరోపణలు లేవు. మరి అఖిలేశ్‌ పరిస్థితి అది కాదు. సగం టర్మ్‌ మందకొడిగా గడిపేశాడు. గత రెండున్నరేళ్లగానే అభివృద్ధి అంటూ పరుగులు పెడుతున్నాడు. శాంతిభద్రతల విషయంలో ఎస్పీకి చాలా మైనస్‌ మార్కులు పడతాయి. అతని కాబినెట్‌లో అవినీతి ఆరోపణలున్న మంత్రులున్నారు. యాదవ కులపక్షపాతిగా మొత్తం పార్టీకే చెడ్డపేరుంది. 

'అఖిలేశ్‌ పాలన ఐదేళ్లగా చూస్తున్నాం, దానికి ముందు మాయావతి పాలన చూశాం. బిజెపి పాలించి చాలా ఏళ్లయింది. వాళ్లకో ఛాన్సు యిచ్చి చూద్దాం.' అనే మూడ్‌ ప్రజల్లో వుంది. మోదీకి గతంలో వున్నంత ప్రజాదరణ లేదు కానీ ఏదో చేస్తాడన్న ఆశ ప్రజల్లో యింకా చావలేదు. ఇతన్ని కాదంటే ప్రత్యామ్నాయమూ లేదు. మోదీని హీరోగా చూపించేందుకు అతని సన్నిహితుల చేతుల్లో మీడియా ఎలానూ వుంది. తన హావభావాలతో, ప్రసంగాలతో బహిరంగ సభల్లో జనాల్ని ఆకట్టుకునే ఆకర్షణ మోదీలోనూ వుంది. ఈ కారణాల చేత యుపిలో బిజెపి గెలుపు ఖాయమని అందరూ అనుకుంటూనే వచ్చారు. ఆ ధీమాతోనే దానికి సంబంధించిన నిర్ణయాలన్నీ అమిత్‌ షా, మోదీ ద్వయమే తీసుకున్నారు. యుపిలో దిగ్గజాల వంటి బిజెపి నాయకులున్నా వాళ్ల నెవర్నీ పట్టించుకోలేదు. గెలుపులో వారికి వాటా యివ్వాలనుకోలేదు. అయితే పోనుపోను కుటుంబకలహాల పుణ్యమాని అఖిలేశ్‌ చిన్న సైజు హీరోగా అవతరించాడు. రాహుల్‌ అతనితో చేతులు కలిపాడు. దాంతో బియస్పీతో బాటు బిజెపికీ కష్టాలు మొదలయ్యాయి. తమను పట్టించుకోలేదన్న వేదనతో వున్న స్థానిక నాయకులు అంత వుత్సాహంగా పని చేయటం లేదట. పశ్చిమ యుపిలో 2014లో బిజెపికి పూర్తి మద్దతు యిచ్చిన జాట్లు యిప్పుడు అసంతృప్తితో ఎదురు తిరిగారట. అలాగే 2014లో ఓటేసిన జాతవేతర దళితులు యిప్పుడు మళ్లీ బియస్పీకి మరలారట. 

ఇలా ఒక్కో విడత ఎన్నిక పూర్తయ్యేసరికి బిజెపి ధైర్యం దిగజారుతూ వచ్చింది. విజయమనేది నల్లేరు మీద బండి నడక కాదని తెలిసి వచ్చింది. జనాభాలో దాదాపు ఐదో వంతు వున్న ముస్లిములకు 403 సీట్లలో ఒక్క టిక్కెట్టు కూడా యివ్వకపోవడం తప్పయిపోయిందని రాజ్‌నాథ్‌ సింగ్‌, ఉమాభారతి, నఖ్వీ బహిరంగంగా అంటున్నారు. అభ్యర్థుల పేర్లు ప్రకటించినపుడే వాళ్లకీ విషయం తెలుసు కదా, అప్పుడే అమిత్‌ తో ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు మాట్లాడతాం అంటున్నారు. మాట్లాడి ఏం ప్రయోజనం? ముస్లిములను దూరం చేసుకోవడం దెబ్బ కొట్టిందని వాళ్ల సర్వేలు చెప్పి వుంటాయి. ముస్లిములను దూరంగా పెట్టడం వలన హిందూ ఓట్లన్నీ తమకే పడతాయని వేసుకున్న అంచనా తప్పి వుంటుంది. అందుకే యిప్పుడు స్వరం మార్చారు. అఖిలేశ్‌ కాంగ్రెసుకు అనవసరంగా 100 సీట్లు యిచ్చి తన గొయ్యి తనే తవ్వుకున్నాడని, కాంగ్రెసుకు అంత సీను లేదని చాలా మంది విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెసుతో కలిసి వుండకపోతే ఎస్పీ గతంలో లాగ యాదవ-ముస్లిం ఓట్ల మీద మాత్రమే ఆధారపడవలసి వుండేది. కాంగ్రెసుకు ముస్లిముల సపోర్టుతో బాటు, కొన్ని దళితవర్గాలు, కొన్ని అగ్రవర్ణాల మద్దతు వుంటూ వచ్చింది. అఖిలేశ్‌ కాంగ్రెసుతో కలవకపోతే ఆ వర్గాలు బిజెపి వైపే తిరిగి పోయి వుండేవి. ఆశించినంత మేరకు బిజెపికి అగ్రకులాల మద్దతు లభించి వుండకపోవడం చేతనే కాబోలు మోదీ హిందువుల నందరినీ కన్సాలిడేట్‌ చేసే పని ప్రారంభించారు. అఖిలేశ్‌ అభివృద్ధి గురించి ఎక్కువ మాట్లాడుతూంటే గతంలో అభివృద్ధి గురించే మాట్లాడుతూ వచ్చిన మోదీ యిప్పుడు రంజాన్‌-దీపావళి విద్యుత్‌ సరఫరా గురించి, కబరిస్తాన్‌-స్మశానం గురించి మాట్లాడుతూ మతపరమైన భావాలు రెచ్చగొడదామని చూస్తున్నారు. ఇవి అమిత్‌ షా మాట్లాడవచ్చు కానీ ప్రధాని స్థాయి వ్యక్తి యిలా మాట్లాడుతున్నారంటే ఒక మెట్టు దిగినట్లే! 

నోట్ల రద్దు వలన మేలు కలిగిందని ఏవేవో గణాంకాలు చూపించి ప్రతిపక్షాలను దబాయించవచ్చు. కానీ క్షేత్రస్థాయిలో విఫలమైందని, గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం దెబ్బ తిందని ఎన్నికల సమయంలో అర్థమవుతోంది. ఒక సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం యుపిలో నవంబరులో సర్వే చేసినపుడు 70% మంది నోట్లరద్దును ఆమోదించారు. కానీ జనవరి వచ్చేసరికి వారి సంఖ్య 30%కి పడిపోయింది. ఎందుకంటే వాళ్లు ఆశించినట్లు నల్లధనం బయటపడలేదు, ధనికులు యిక్కట్లు పడలేదు. జైలుకీ వెళ్లలేదు. వాళ్ల జీవితం ఎప్పటిలాగా దర్జాగా సాగిపోతోంది. మధ్యతరగతివారు, పేదలు మాత్రం అవస్థలు పడవలసి వచ్చింది. చిన్నాచితకా వ్యాపారాలు మూలపడ్డాయి. ఎప్పటికి కోలుకుంటారో తెలియదు. ఈ కారణాల చేత గ్రామాల్లో స్థానిక బిజెపి నాయకులెవరూ నోట్ల రద్దు గురించి ఎటూ మాట్లాడడం మానేశారు. నగరాల్లో కూడా దాని గురించి గొప్పలు చెప్పుకునే నాయకుడు ఒక్కడూ లేడు. ఇప్పటిదాకా జరిగిన రౌండ్లన్నీ పరిగణనలోకి తీసుకుని చూస్తే తమకు పెద్దగా మొగ్గు లేదని బిజెపి పార్టీ సర్వే చెప్పి వుంటుంది. యుపిలో ఓటమి సంభవిస్తే నోట్ల రద్దు కారణంగానే అని విశ్లేషకులు, ప్రతిపక్షం వారు తీర్మానిస్తారు. అది తన ప్రతిష్ఠను దెబ్బ తీస్తుందని మోదీ భావన. ఎందుకంటే అది పార్టీలో అందరితో చర్చించి తీసుకున్న నిర్ణయం కాదు. ఆత్మీయులతో మాట్లాడుకుని తీసుకున్నది. అందుకనే రద్దు తర్వాత దాన్ని సమర్థిస్తూ యిద్దరు, ముగ్గురు తప్ప కాబినెట్‌ మంత్రులెవరూ మాట్లాడలేదు. ఇప్పుడిక్కడ ఓటమి సంభవిస్తే పార్టీలో తక్కిన నాయకులకు నోరు పెగులుతుంది. దాన్ని నివారించాలనే మోదీ వచ్చి యింత శ్రమిస్తున్నారు. ఈ శ్రమకు తప్పకుండా ఫలితం వుంటుందనుకోవచ్చు. ఓట్లలో 2-3 శాతం తేడాతో నైనా బిజెపి 200 మార్కు దాటవచ్చు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?