Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ కథలు - 26

విమోచన

''...ఫాదర్‌, నేను పాపం చేసానో లేదో తెలియకుండా ఉంది. ఒక్కోసారి నా అంతరాత్మ నేను చేసానని చెప్తోంది. మరోసారి చేయలేదంటోంది. చేయలేదని అది చెప్పినప్పుడు నా మనస్సు ఇంకా మథనపడుతోంది. చేసానని చెప్పినప్పుడే కాస్త ఊరట కలుగుతోంది.'' - ఒప్పుకోలు మందిరంలోని కిటికీకి తన పెదాలాన్చి సిస్టర్‌ ఫిలోమినా అణకువగా, వినయంగా చెప్పసాగింది.

భక్తులు తమ పాపాలను ఒప్పుకోగా విని, వారికి పాపవిముక్తి ప్రసాదించే క్రైస్తవ ఫాదిరీకి ఫిలోమినా చెప్పదలచినది అర్థం కాలేదు. ''వివరంగా, అర్థమయ్యేట్లా చెప్పు తల్లీ. నువ్వు చిన్నదానివి. పద్ధెనిమిదేళ్ల వయస్సులో అంతరాత్మ ప్రబోధం నమ్మరానిది. నీవు చేసినది నాకు చెప్పు. దాని మంచి చెడ్డలపై నన్ను తీర్పు ఇవ్వనీ. భగవంతుడు ఆ విచక్షణా జ్ఞానం నాకు ఇస్తాడని ఆశిస్తున్నాను. మొత్తం విషయాలన్నీ సాకల్యంగా చెప్పమ్మా.''

''సరే ఫాదర్‌. జరిగిన విషయం విపులంగా చెబుతున్నాను. సోమవారం అర్థరాత్రి కావస్తూండగా నేను నర్స్‌గా పనిచేసే ఆసుపత్రిలో ఐదవ వార్డులో జరిగిందీ సంఘటన. సిస్టర్‌ మేరియా బదులు నేను ఆ వార్డ్‌ చూస్తున్నాను. ఏడో బెడ్‌ నెంబరుపై వున్న రోగిని పరీక్షించిన డ్యూటీ డాక్టరు ఆ వ్యక్తి కోలుకునే అవకాశాలు మృగ్యమనీ, తెల్లవారకముందే మరణించడం ఖాయమనీ చెప్పారు. 'ఈ రోగికి హఠాత్తుగా వచ్చిపడే ప్రమాదం ఏమీ లేదు, క్రమంగా ప్రాణం పోతుంది. ఒకవేళ ఏదైనా ఇబ్బంది వస్తే నన్ను లేపు. తక్కిన పేషంట్ల విషయంలో ఏ మాత్రం భయం అక్కరలేదు' అని చెప్పి పడుక్కోడానికి వెళ్లిపోయారు డాక్టరు. ప్రతీ అరగంటకు ఓ చెంచాడు మందు పట్టించడం తప్ప నాకు వేరే పనిలేదు. అందువల్ల బెడ్‌ పక్కగా కూచుని ఆ ఆత్మ గురించి ప్రార్థించసాగాను.''

''ఎవరి ఆత్మ గురించి?''

''ఆ ప్రాణం పోయే అతని ఆత్మ గురించే..''

''అంటే అతను మగవాడన్నమాట''

''అవును. నేను ఇందాకనే చెప్పానుగా.''

''లేదు. బెడ్‌ నెంబరు 7, రోగి అంటున్నావు. అది ఆడ, మగ ఎవరైనా కావచ్చు. సరేలే, అది అప్రస్తుతం. నీ కథ కానీయ్‌.''

- ''సుమారుగా తెల్లవారు ఝామున మూడుగంటలయి వుంటుంది. పీల గొంతుతో 'సిస్టర్‌ ఫిలోమినా, అంతా అయిపోయింది. మృత్యువు వచ్చిపడుతోంది.' అంటూ గొణిగేడతను. అర్థరాత్రి నుండి అతనిలో చలనమే లేదు. ఇప్పుడు మాట్లాడినప్పుడు మృత్యువే ఆక్రోశించినట్టుంది.

'ధైర్యంగా ఉండండి. సాహసంతో పరిస్థితిని ఎదుర్కోండి' అని అతని చెవిలో చెప్పాను నేను.

దాంతో అతను మాటలు కూడబలుక్కుంటూ నెమ్మదిగా అతి కష్టంమీద చెప్పసాగాడు - 'జరగబోయేదానికి నేను సిద్ధంగానే ఉన్నాను. పాతికేళ్లు నిండకుండానే నూరేళ్లు నిండడం బాధాకరమే. అయినా ఇది నా తలరాత అని సరిపెట్టుకుంటున్నాను. బహుశా ఇదీ నా మంచికేనేమో. నేను ఒంటరివాణ్ని, బీదవాణ్ని. కవిత్వం రాసేవాడిని కానీ దాంట్లో పైకి రాలేకపోయాను. ప్రేమించేను. కానీ దాన్లోనూ అపజయమే. నన్నెవరూ ప్రేమించలేదు. నువ్వు నా పక్కన ఉన్నావు కాబట్టి కానీ లేకపోతే నేను ఎడారిలో ఒంటరిగా చచ్చినవాడి కిందే లెక్క.'

ఇక్కడ దాకా చెప్పి అతను మౌనం వహించగానే అతన్ని నేను ఊరడించాను - 'ధైర్యంగా ఉండాలి. భగవంతుడు నీకు తోడుగా ఉన్నాడు' అంటూ. 

కాస్సేపటికి అతని కళ్లల్లో నీళ్లు. నాకేసి దీనంగా చూసాడు. 'నాకో ఉపకారం చేసిపెడతావా, సిస్టర్‌ ఫిలోమినా?' అన్నాడు నోరు పెకలించుకుని.''

'ఏం కావాలంటే అది చేస్తాను. చెప్పండి' అన్నాను.

'ముందొక విషయం చెప్పు - నేను ప్రశాంతంగా మరణించాలని  కోరుకుంటున్నావా? నన్ను సృజించిన భగవంతుని ప్రశంసిస్తూ మరణించాలని కోరుకుంటున్నావా?'

'ప్రతీ క్రైస్తవుడు చేయవలసినది అదే కదా.' అన్నాను నిబ్బరంగా.''

''చాలా చక్కగా చెప్పావు, సిస్టర్‌ ఫిలోమినా'' అన్నాడు కన్ఫెషన్‌ వింటున్న ఫాదిరీ.

'మరి అలా అయితే నేను ఆ విధంగా మరణించేటట్లు నీకు చేతనైన సహాయం చేయగలవా? ఫిలోమినా' అన్నాడు అతడు.

'ఏం చేయమంటారు? చెప్పండి' అన్నాను.

'ఈ లోకం వీడి వెళ్లబోయే అభాగ్యుడు ఈ లోకాన్ని శపిస్తూ వెళ్లకుండా ఒక ఉపకారం చేయి. బతికి ఉన్నంతకాలం సాటివారి ప్రేమ, ఆదరణకు నోచుకోని దౌర్భాగ్యుడిపై అవసాన థలో ప్రేమ కనబరిచి పై లోకాలకు వెళ్లినా అతడు నీ సహృదయతను గుర్తుంచుకొనేలా చెయ్యి. మృత్యుముఖంలో ఉన్న వ్యక్తిపై జాలి చూపు. ఫిలోమినా, నా పై దయవుంచి ఒక ముద్దు ప్రసాదించు...''

''ముద్దా!?'' సిస్టర్‌ ఫిలోమినా కథనం వింటున్న ఫాదిరీ ఉలిక్కిపడ్డాడు.

''నేను అతనికి నచ్చచెప్పాను ఫాదర్‌, 'దైర్యం చిక్కబట్టుకోండి. భగవంతుడే మిమ్ములను ఆదరంతో ముద్దాడతాడు. దానికై మిమ్ములను మీరు సిద్ధపరచుకోండి. మానవమాత్రుల ఆదరణకు వెంపర్లాడకండి' అని.''

''చాలా చక్కగా నచ్చచెప్పావు తల్లీ''

''కానీ అతను వినలేదు. ఊపిరి అందకుండా అవస్థ పడుతున్నా సరే, అలాగే బతిమాలసాగాడు. - 'ఈ ఉపకారం చేసి పెట్టు. నా బాధ, నా వ్యథ నీ కర్థం కావటం లేదా? ఈ విశాల విశ్వంలో నా పై ప్రేమ కనబరిచిన మనిషి ఎవ్వరూ లేరు. అందుకే నేను లోకంపై పగబూని ఉన్నాను. ఆ విధంగా భగవంతుని సృష్టిపై పగబూనడం నా ఆత్మకు శ్రేయస్కరం కాదని ఈ అవసాన థలో గుర్తించాను. మోక్షప్రాప్తికి అది అవరోధమని గ్రహించేను. అందుకే నిన్ను చిన్న ముద్దు ఇమ్మని ప్రార్థిస్తున్నాను. దీనివల్ల నాలో గూడు కట్టుకున్న ద్వేషం పటాపంచలవుతుంది. ప్రపంచాన్ని క్షమించి, దేవుని ఔదార్యాన్ని ప్రశంసిస్తాను. ఆ విధంగా నా మోక్ష ప్రాప్తికి నువ్వు సోపానమవుతావు. ఈ నా చిన్న కోరిక కాదంటే అజన్మాంతం నిన్నా విషయం బాధిస్తుంది. వేదనకు గురి చేస్తుంది. ఈ తిరస్కారం వల్ల నువ్వు బాధపడడమే కాదు, ఇప్పుడు నా ఆత్మ పాపగ్రస్తమవడానికి కూడా నీవు కారణభూతమవుతావు. నన్ను నరకం వైపు నడిపించదానివి నువ్వే అవుతావు'' అన్నాడు.

''మరి నువ్వేమన్నావు తల్లీ?''

''ఫాదర్‌, అతనన్న మాటలకు నాకు భయం వేసింది. అతని చెప్పిన మాటల్లో నిజం లేకపోలేదనిపించింది. అతను మరణించడం తథ్యం. తెల్లవారేలోపుగానే అతని బతుకు తెల్లారిపోతుందని నాకు ముందే తెలుసు. భారంగా అతని ఊపిరే అందుకు సాక్ష్యం. తక్కిన పేషంట్లు ప్రశాంతంగానే నిద్రిస్తున్నారు. వార్డులో దీపాలు పెద్దగా లేకపోవడంతో చీకటి వ్యాపించి వుంది. తెల్లటి పక్కలు ఆ మంద్రకాంతిలో సమాధుల్లా అనిపిస్తున్నాయి. నా ఎదురుగా ఉన్నతను మృత్యువును చేరబోతున్నాడన్న సంగతి నాకు మరింత బాధ కలిగించింది. నేను ఒంగి అతన్ని ముద్దాడాను. ఎక్కడో నూతిలోంచి మాట్లాడినట్లు, 'థాంక్స్‌, థాంక్స్‌' అన్న పదాలు వినబడ్డాయో లేదో, నేను మళ్లీ ప్రార్థనలో మునిగిపోయాను.''

వింటున్న ఫాదర్‌ తికమకపడ్డాడు. తీర్పు చెప్పడం అంత సులభం కాదనిపించింది అతనికి. తన ఆందోళన బయటకు తెలియనీయకుండా ''నువ్వు ఎక్కడ ముద్దాడావు, తల్లీ'' అని అడిగాడు.

సిస్టర్‌ ఫిలోమినా ప్రశాంతంగానే జవాబిచ్చింది. - ''ఫాదర్‌, అప్పుడు బాగా చీకటిగా ఉంది. సరిగ్గా తెలియలేదు. కానీ, అతని పెదాలమీదనే నేను ముద్దాడాననుకుంటా.''

''ఎంత అవివేకమైన పని చేసావు తల్లీ. నువ్వా పని సదుద్దేశ్యంతోనే చేసావని ఎరుగుదునమ్మా.  క్రైస్తవ సహజమైన జాలి, అంతఃకరణలతోనే నువ్వు అతనికి సాయపడదలచుకున్నావని నాకు అర్థమయ్యింది. కానీ అతన్ని నుదుటిపై ముద్దాడితే పోయేది కదా. అతని ఆత్మను కాపాడ్డానికి అది చాలు. కానీ నోటి మీద ముద్దు పెట్టడం, తప్పమ్మా. చాలా తప్పు. సరేలే, నువ్వు ముద్దు పెట్టిన వ్యక్తి జీవన్మృతుడు. బతికున్నా మరణించినవాడి కిందే లెక్క. అతను మరణించడం, ఖననం చేయబడడం కూడా అయిపోయింది కాబట్టి - ఇక ఆ విషయం గురించి వదిలి పెట్టివేద్దాం.''

''కానీ, ఫాదర్‌, అతను బతికే వున్నాడు!''

''ఆఁ, బతికే వున్నాడా!?''

''అవును, ఫాదర్‌. తెల్లవారబోయేటంత వరకూ అతను నేను చెప్పినట్లే వున్నాడు. సూర్యుడి తొలికిరణాలతో అతనిలో ఉపశమనం కలగసాగింది. పొద్దున్న వార్డులోకి వచ్చిన డాక్టరు గారు ఆయన ఆశ్చర్యాన్ని దాచుకోలేకపోయారు. ముఖ్యంగా ఆయనకు అబ్బురం కలిగించిన విషయం రోగి పెదాలపై చిరునవ్వు మొలవడం. రోగిని జాగ్రత్తగా పరిశీలించి, ఇంజక్షన్‌ ఇస్తూన్నప్పుడు కూడా డాక్టరు గారు గొణుగుతూనే ఉన్నారు 'చాలా వింతగా ఉంది, తమాషాగా ఉంది. రోగం నయమయిపోతుందేమో కూడా.' అంటూనే ఉన్నారు.''

''నయం కావడమా? అంతకంటే విపత్కరం మరోటి లేదు.'' అని ఆక్రోశించాడు ఫాదర్‌.

''ఫాదర్‌, మీరనేదేమిటి? సాటి మనిషి...''

''నీ కర్థం కావటం లేదు తల్లీ. ఇది చాలా గంభీరమైన విషయం. క్రైస్తవ సన్యాసినివయివుండి నువ్వు ఒక బతికున్న మగవాడి పెదాలపై ముద్దు పెట్టావు. అతను చచ్చిపోతాడేమో ననుకుంటే, చావలేదు. బతికే వున్నాడు. నాకేం చేయాలో పాలుపోకుండా ఉంది. మృత్యుముఖంలో ఉంటే ఆ సంగతి వేరు. భగవంతుని చల్లని కటాక్షంలో అంతా సర్దుకుపోయి వుండేది. కానీ అతను బతకడంతో చిక్కు వచ్చి పడింది. భగవంతుని క్షమాదృష్టికి కూడా చిక్కుముడి పడింది. ఉన్న విషయం స్పష్టంగా చెప్పాలంటే, మన మర్యాద మనం కాపాడుకోవాలి''

కొంతసేపు ఆలోచించాక ఫాదర్‌ ప్రశ్నలడగసాగాడు. 

''ఈ డాక్టరు ఎలాటివాడంటావు, సిస్టర్‌ ఫిలోమినా?''

''మంచివాడే, ఫాదర్‌''

''వ్యక్తిగా కాదు... డాక్టరుగా ఎలాటివాడని నా భావం''

''చాలా మంచి డాక్టర్‌''

''మరి ఆ రో..గి? అతనెలా ఉన్నాడు ఇవాళ?''

''మెరుగయ్యేడు, ఫాదర్‌''

''అయితే నీ కర్మం మూడినట్లే''

''హారి భగవంతుడా!''

''భగవంతుని పేరెత్తే ధైర్యం చేస్తున్నావా, పాపాత్మురాలా!''

''అంటే నేను పాపినే అంటారా, ఫాదర్‌''

''తప్పకుండా, నువ్వు ఆ సన్యాసిని దుస్తులు వేసుకొనే అర్హత కూడా కోల్పోయావు.'' 

సిస్టర్‌ ఫిలోమినా పెద్దగా రోదిస్తుండగానే ఫాదిరీ నిర్దయగా మాట్లాడేడు. ''నువ్వు చెప్పిన దాంట్లో నాకు బోధపడని విషయం వుంది. నీ అంతరాత్మ నీది పాపమో కాదో ఖచ్చితంగా చెప్పలేకుండా ఉందని అంటున్నావు. పాపమని అన్నప్పుడే నీకు ఊరట అన్నావు. ఈ వైరుధ్యం ఎలా సాధ్యం? దీన్ని బట్టి నేనేం అర్థం చేసుకోవాలని నీ ఉద్దేశ్యం?''

''అది నాకు తెలియదు ఫాదర్‌, నేను ఎలా ఫీలవుతున్నానో, కన్ఫెషన్‌లో అదే చెప్తున్నాను.''

''అంటే చేసినదానికి నువ్వు పశ్చాత్తాపడుతున్నావా?''

''నేను చేసినది పాపమని మీరంటే, తప్పకుండా పశ్చాత్తాప పడతాను.''

''మంచిదే కానీ ఇప్పుడు నీకు పాపవిమోచనను ప్రసాదించలేను. కొంతకాలం వేచి చూద్దాం. రేపేమి కాగలదో ఎవరు చూడవచ్చారు? ఈ రోగి సంగతి ఎలా తేలుతుందో చూసాక దాని ప్రకారం ఏదో ఒకటి చేద్దాం. ఇక ఇవాల్టికి ఈ కన్ఫెషన్‌ ఆపేద్దాం.''

xxxxxxxxxxxxxxxxxxxxxxxx

కొన్ని రోజుల తర్వాత సిస్టర్‌ ఫిలోమినా మళ్లీ ఒప్పుకోలు మందిరానికి వచ్చింది.

''మీ వార్డ్‌ నెంబరు 7 ఎలా ఉన్నాడు?'' ఫాదిరీ అడిగేడు.

''అతని ఆరోగ్యం చాలా మెరుగుపడింది''

''డాక్టర్లేమంటున్నారు?''

''అతను పూర్తిగా కోలుకుంటాడంటున్నారు''

''అయితే, నీకు మోక్షం లేదు తల్లీ''

''నాకు తెలుసు. ఆ విషయమే నేనతనికి చెప్పాను''

''ఏం చెప్పావు?''

''అతని కారణంగా నేను భ్రష్టురాలినయిపోయానని చెప్పాను. అతను బతికి బట్టకడతాడని తెలిసివుంటే ముద్దుపెట్టుకునే దాన్ని కాదని చెప్పాను.''

''దానికి ఆ కవిపుంగవుడు ఏమన్నాడు?''

''నా వినాశనం అతను భరించలేనన్నాడు. నా ఆత్మను కాపాడ్డానికి అతను శాయశక్తులా ప్రయత్నిస్తానన్నాడు.''

''ఆపాటి దానికి అతను చచ్చిపోయి వుంటే సరిపోయి వుండేది.''

''అందుకే ఫాదర్‌, డాక్టర్లు అతనికి పూర్తిగా నయమవుతుందని చెప్పగానే నా కోసం, నా పాపవిమోచన కోసం, మందులు మానేసి తన ప్రాణం తానే తీసుకుంటానన్నాడు. అలా అని ఒట్టు కూడా వేసాడు.''

ఈ పరిణామం ఫాదర్‌ ఎదురుచూడనిది. ఆయన మరింతగా తికమక పడ్డాడు. కొద్దిసేపు మనస్సులోనే తర్జనభర్జన పడ్డాక, చివరికి ఏమైతే అది అయిందన్నట్టుగా, తెగించి నిర్ణయం తీసుకున్నాడు - 

''అన్నీ విషయాలు సాకల్యంగా ఆలోచించి చూడగా, నీకు పాపవిమోచన కలిగించడమే మంచిదనిపిస్తోంది, సిస్టర్‌ ఫిలోమినా, అలాటి వాడు మళ్లీ చావడం మొదలెడితే, మన వ్యవహారాలు మళ్లీ మొదటికొస్తాయేమో!''

రాబర్ట్‌ బ్రాకో వ్రాసిన ఇటాలియన్‌ కథకు  అనువాదం - ఎమ్బీయస్‌ ప్రసాద్‌

(విపుల 1999లో ప్రచురితం) 

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?