Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ కథలు - 28 'మెతక మనిషి'-2

Click Here For Part-1

రఘుకాకా షాపుకి సోమవారం సెలవు. కాకాను ఆ రోజు కూడా భరించడానికి సమ్మతించే పనివాడెవడైనా ఉన్నాడంటే అతను సదా ఒక్కడే. ఆవేళ వాళ్ల ఇంటికెళ్లి అతను చెప్పిన ఇంటిపనులు చేసిపెట్టడం తన డ్యూటీలో భాగంగా తలచేవాడతను. కాకా భార్య పోయింది. కొడుకు పేరున్న సర్జన్‌. దోసిళ్లకొద్దీ ఆర్జించేవాడు. అతను తండ్రికీ, తండ్రి వ్యాపారానికీ ఎప్పుడూ దూరంగానే ఉండేవాడు. నిజానికి ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకొనేదే అరుదు. ఇల్లు నిర్వహణంతా కోడలిదే. మంచి తెలివైనదీ, ఓపికమంతురాలు కూడా.

ఆ సోమవారం సదా వెళ్లేటప్పటికి బాగా ఇంట్లో వాతావరణం గంభీరంగా ఉంది. రఘుకాకా కుర్చీలో నిటారుగా కూర్చుని కోపాన్ని దిగమింగుకొని కూచున్నట్టున్నాడు. కోడలు బట్టలూ అవీ సద్దుతోంది. ఆమె ప్యాకింగ్‌ ఎప్పుడూ పూర్తవుతుందాని కొడుకు అసహనంగా కాచుకొని ఉన్నాడు.

సదాకి మతిపోయింది, సంగతేమిటని ఎవర్ని అడగాలన్నా ధైర్యం చాలలేదు. కాకాని పలకరిస్తే కస్సుమనేట్టున్నాడు. మామూలుగా యోగక్షేమాలడిగే కోడలు కన్నెత్తి కూడా చూడలేదు. కొడుకు కాస్త  మెరుగ్గా ఉన్నాడు. బెరుగ్గా అతని దగ్గరజేరి, ''ఊరెడుతున్నారా?'' అని అడిగేడు. కొడుకు ఓ చూపు పారేసి అతని వెన్నుతట్టి ఊరుకున్నాడు.

కోడలు ప్యాకింగ్‌ పూర్తయింది. సామాను బయటకు తీసుకెళ్లమని పనివాడితో చెప్పి మొగుడితో కలిసి మామగారి పాదాలు మొక్కబోయింది. కాకా ఛట్టున కాళ్లు వెనక్కి లాక్కున్నాడు. ''చాలించండి. ఈ వినయాలు! పోతేపొండి. ఓసారి బయటకు అడుగుపెడితే తిరిగి ఇంట్లోకి రానిచ్చేది లేదని గుర్తుపెట్టుకొని మరీ కదలండి. జన్మలో మీ మొహం చూసేది లేదింక'' అంటూ అరిచేడు.

కోడలి ఓర్పు హరించుకుపోయినట్టుంది. ముఖం చిట్లించుకొంది. కొడుకు నిట్టూర్చి, ఆమెను లేవదీసి గుమ్మంవైపుకు నడిపించేడు.

స్థాణువులా ఉండిపోయిన సదాకి హఠాత్తుగా మెలకువ వచ్చినట్టు పరిగెట్టుకుంటూ వెళ్లి వాళ్ల దారిలో అడ్డుపడ్డాడు, ''వద్దొద్దు, వెళ్లొద్దు'' అంటూ.

కాకా మండిపడ్డాడు. ''ఈ వ్యవహారంలో తలదూర్చేవో, నిన్నూ మెడపట్టి గెంటుతా జాగ్రత్త'' అంటూ.

కొడుకు, కోడలూ తలుపుమూసి వెళ్లిపోయారు. కాకా పెద్ద పెద్ద అంగలు వేసుకొంటూ గదిలో నుండి వెళ్లిపోయేడు. సదాకి ఏం చెయ్యాలో తోచక నెమ్మదిగా జారుకొన్నాడు.

కొడుకు, కోడలూ బ్రతిమాలకుండా వెళ్లిపోవడంతో కాకా అది పెద్ద అవమానంగా భావించాడు. ఉక్రోషంతో మరింత కోపిష్టిగా తయారయి కనబడిన వాళ్లందరినీ కాల్చుకు తినేవాడు. ఇంట్లో పనివాళ్లూ, దుకాణంలో పనివాళ్లూ మహా అవస్థపడుతూండేవారు. సదాలాంటి మెతకవాడు కూడా భరించలేని స్థితి వచ్చింది.

దీనివల్ల జరిగిన పరిణామం ఏమిటంటే షాపు కార్మికులు ఒక యూనియన్‌గా ఏర్పడడం, ఓ శుభ ముహూర్తాన సమ్మెకు దిగడం. సదా మాత్రం యూనియన్లో చేరలేదు. సమ్మె రోజున దుకాణంలోకి వెళ్లనిమ్మని లీడర్లని బతిమాలుకొన్నాడు. కానీ జండాలు పట్టుకొని నినాదాలిస్తున్న కార్మికులు ఒప్పుకోలేదు.

ఈ గోలంతా చూసి రఘుకాకా రెచ్చిపోయాడు. వెళ్లి షాపు తెరవమని పనివాళ్లని అదిలించేడు. కానీ వాళ్లు వినందే! కాకాకు కాక పుట్టి, తలుపులు తనే తీసి, గుమ్మంలో నుంచుని అందర్నీ తిట్టిపోసేడు. పనివాళ్లు నినాదాల జోరు పెంచేరు. కాకా గొంతు చించుకొంటున్నాడు. కానీ అతని మాట అతనికే వినబడని పరిస్థితి వచ్చిపడింది.

అప్పుడు యూనియన్‌ లీడరు రంగంలోకి దిగేడు. రఘుకాకాను నెట్టుకొంటూ లోపలికి వెళ్లి, బ్రీఫ్‌కేస్‌ తెరిచి కోర్కెల చిఠ్ఠా బయటకు తీసి చదవనారంభించేడు. కాకా ఆక్షేపణలను పట్టించుకోకుండా కంచుకంఠంతో చదువుకుపోసాగేడు. కాకా ఇక వాదనకు దిగేడు. కానీ కోపంతో మూర్ఛ వచ్చినంత పనయింది. ''ఈ గొంతెమ్మ కోర్కెలు తీర్చే బదులు, ఈ కొట్టుకి అగ్గెట్టేసి, ఇంట్లో కూచోడం మేలు'' అని అరుచుకుంటూ కొట్టు మూసేసి, కోపంతో వణికిపోతూ కారెక్కేశాడు.

సమ్మెచేసే పనివాళ్లు అతన్ని హేళన చేసి కేరింతలు కొట్టేరు. కానీ తర్వాత ఏం చెయ్యాలో తెలిసింది కాదు. షట్టర్లు మూసేసిన కొట్టుముందు కేకలేస్తే అరణ్యరోదన అవుతుంది కదా! కేకలు చాలించి ఎవళ్లింటికి వాళ్లు వెళ్లేరు.

సదాకు చచ్చే భయం వేసింది. కాకాకు ఏమయిందోనని బెంగ పట్టుకొంది. అతని వెనకాలే కాకా ఇంటికి వెళ్లాడు. ఎప్పటిలాగానే రఘుకాకా కొయ్యమేకులా కూర్చుని ఉన్నాడు. సదాని చూడగానే రక్తం తలకు పొంగుకొచ్చింది. ''ఫో, పో నువ్వూ ఆ విశ్వాసఘాతకుల్లో ఒకడివే టక్కరి వెధవా! ముందిక్కణ్ణుంచి ఫో' అని అరుస్తూ కోపంతో ఊగిపోతూ లేచి నుంచుని, అంతలోనే దబ్బున పడిపోయేడు. సదా పరిగెట్టుకెళ్లి పట్టుకొని జాగ్రత్తగా మంచం మీదకు చేర్చాడు. ఫ్యామిలీ డాక్టరుకు, కాకా కొడుక్కీ ఫోన్లు చేశాడు. డాక్టరొచ్చి 'హార్టు ఎటాక్‌' అని చెప్పి జాగ్రత్తగా చూసుకోవాలని మరీ మరీ చెప్పి వెళ్లాడు.

రఘుకాకా కోడలు వాహిని బాధ్యత వహించి, మామగార్ని హాస్పిటల్లో చేర్పించి నర్సులను ఏర్పాటు చేసింది. కానీ తనూ, భర్తా మావగారిని చూడబోయినప్పుడు కాకా వాళ్లమీద అరవడం మొదలుపెట్టాడు. తక్షణం ఇద్దరూ బయటకు వచ్చేశారు. కొడుకు సదాను పక్కకు పిల్చి ''మేం వెళ్లి చూసినా, చుట్టుపక్కలున్నా ముసలాయన పరిస్థితి క్షీణిస్తుంది కానీ మెరుగుపడదు. నువ్వే దగ్గరుండి వ్యవహారం నడిపించు. ఖర్చుకు వెనకాడకు. నేను భరిస్తాను'' అన్నాడు.

సదాలాటి సాదామనిషి తన ఆలనా పాలనా చూడడం రఘుకాకాకు సుతరామూ ఇష్టంలేదు. అందులోనూ ఆయన తన అభిప్రాయాలు దాచుకొనే మనిషి కూడా కాదాయె. అవన్నీ విని కూడా సదా నోర్మూసుకొని పడివుండేవాడు. అతనిచేత సపర్యలు చేయించుకోక ముసలాయనకు తప్పేదికాదు. దాంతో ఉడుకుమోత్తనం పెరిగి, 'నీ ఆషాడభూతి వ్యవహారం నాకు తెలీదనుకోకు. నన్ను ఎలాగైనా ఉబ్బేసి ఆ షాపూ, ఇల్లూ నీపేర రాయించేసుకొందామని నీ ఎత్తుగడ. అందుకే ఇంతంత సేవలూ, ప్రేమ కారిపోతున్నట్టు నటించడాలూనూ' అంటూ విరుచుకుపడేవాడు. ఇంత దారుణమైన ఆరోపణలకు జవాబు ఎలా చెప్పాలో తెలియక సదా ఏమీ బదులు పలికేవాడు కాదు.

రోజూ కొడుకు ఇంటికెళ్లి కాకా యోగక్షేమాల కబురు చెప్పేవాడు. కోడలు కూడా వింటూండేది. ఓ నెల్లాళ్లు పోయేక ఆవిడ వెటకారంగా నవ్వుతూ, ''చూస్తూండండి, మావగారు పైకి ఏమంటున్నా సరే, ఆస్తీ పాస్తీ సదాబాబుకి రాసేస్తారు'' అంది.

ఈ మాట వినగానే సదా హడలిపోయేడు. ''మీ కసలు అలాటి ఊహలెక్కణ్ణుంచి వస్తాయో తెలీదు. నాకు ఎర్ర ఏగానీ ఇచ్చేదిలేదని రోజుకి పదిసార్లు కాకా అరుస్తూంటారు. దానధర్మాలకే అంతా ఇచ్చేస్తాట్ట. నన్నడిగితే అదే మంచిది. నా బోటివాడికి ఇస్తే నేనేం చేసుకోగలను? ఆ షాపు నడపడం నా వల్ల అయ్యేపనా?''

xxxxxxxxxxxxxxxxxxxx

కొన్ని రోజులకి మరొక హార్టు ఎటాక్‌ వచ్చి కాకా ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయేయి. పోతూ ఇల్లూ, షాపూ, ఇంకొంత ఆస్తీ సదాకు, తక్కినవి దానధర్మాల కింద రాసేశాడు. దినాలు అయ్యేక వకీలు విల్లు చదివినప్పుడు, సదా ఉక్కిరి బిక్కిరయిపోయేడు. ఇంకొకరి ఆస్తి తాను కాజేసినట్టు ఫీలయ్యేడు.

కోపం, రోషం కలిసిన గొంతుతో కోడలు, ''చూశారా, నేను చెప్పినట్టే అయింది. సదాబాబు దేవాంతకుడు. పైచూపుల్ని బట్టి మోసపోకూడదు'' అనేసింది.

సదా ఆమె దగ్గరకు పరిగెత్తుకెళ్లి చేతులు జోడించి, ''అమ్మా, అలాటి మాటలనకు. నాకు ఈ ఆస్తీ వద్దు ఏమీ వద్దు. ఇదంతా మీ సొత్తు. ఇలా జరుగుతుందని నాకెన్నడూ తెలీదు'' అంటూ ప్రాధేయపడ్డాడు. 

''వట్టి కబుర్లెందుకులెండి. మీ గంగిగోవు మొహం చూసి మోసపోయే రోజులు చెల్లిపోయాయి. అనుభవించండి. ముసలాయన్ని కాకా పట్టి సంపాదించుకొన్నది తనివితీరా అనుభవించండి. మాకేమీ మీ దయాధర్మ బిచ్చం అక్కర్లేదు''

సదాకు ఏం చెయ్యాలో తెలియలేదు. చేతులు కట్టుకొని, తలవాల్చేసి దోషిలా నుంచున్నాడు.

రఘుకాకా కొడుకు అతని పరకాయించి కాస్సేపు చూసి భార్యతో ''ఇతనిమీద అరవడంలో అర్థంలేదు వాహినీ. అతను ఇందులో చేసినదేముంది? సదాబాబూ, నేనే కావలసినంత సంపాదించుకొంటున్నాను. నాకు ఇద్దామని మా నాన్నకు అనిపించనప్పుడు, ఆ ఆస్తి నాకెందుకు? నువ్వు తీసుకుని సుఖపడు'' అన్నాడు.

దీనితో సదా ఇంకా వణికిపోయేడు. ''నేను చెప్పేది మీకు కూడా అర్థం కాలేదా బాబూ? అంత పేరు ప్రఖ్యాతులున్న షాపుని నా చేతుల్లో తీసుకొని నడపడం నా చేతనవుతుందనుకొంటున్నారా? కారులో తిరుగుతూ, ఆ షాపులో షావుకారిగారి సీట్లో నేను కూచుంటే జనాలు నా మొహంమీదే నవ్వుతారు. 'కనకపు సింహాసనమున శునకం ఎక్కిందిరా' అంటారు. షాపు మీరే తీసుకొని నడపండి''

కొడుకు పగలబడి నవ్వేడు. ''వాచీల గురించి నాకేమైనా తెలుసా పెట్టా? క్లినిక్‌ మూసేసి ఆ షాపులో నే కూర్చోవాలని నీ అభిప్రాయమా? నువ్వైతే ఆ షాపులో ఏళ్ల తరబడి పనిచేసి నాలుగు విషయాలూ తెలుసుకొన్నావు. నువ్వే నడపగలవు''

''అబ్బే, అలాక్కాదు...'' అంటూ సదా మళ్లీ ఆరంభించబోయేసరికి ''ఇక వాదనలు వద్దు, షాపు సంగతి నువ్వు చూసుకోవాల్సిందే'' అని కొడుకు ఖరాఖండీగా చెప్పేశాడు. క్లినిక్‌లో అతని గురించి పేషెంట్లు కాచుకొని ఉన్నారు.

సదా కోడలికేసి తిరిగి, ''వాహినీ, నువ్వు కలగజేసుకొని, నన్ను గట్టున పడేయాలమ్మా'' అన్నాడు. కోడలు చదువుకొన్నదీ, సమర్థురాలు. కళ్లెదురుగుండా ఆస్తి చేజారిపోతుండటం ఆమెకు కంటకంగా ఉంది. ''సదాబాబూ, మీరు చెప్పేది ఉత్తుత్తిమాటలా? మనసులోంచి వచ్చేవా?'' అని నిష్కర్షగా అడిగింది.

''మనస్ఫూర్తిగా చెప్తున్నానమ్మా, లాయరు గారిచే రాతకోతలు రాయించండి'' అన్నాడు తననీ భారం నుంచి ఈమైనా విముక్తి చేస్తుందేమోనన్న ఆశతో.

సదా చిత్తశుద్ధిపై కోడలుకు నమ్మకం చిక్కింది. ''సరే అలా అయితే షాపు నేను చూస్తాను. కానీ రోజూ వచ్చి కొట్లో కూచోవడం నాకు కుదరదు. అదంతా నువ్వే చూసుకోవాలి''

'హమ్మయ్య' అనుకొన్నాడు. అనుకొని వంగి ఆమె పాదాలు స్పృశించాడు. సదా మనసులో కల్మషంలేదనీ, పరుల సొత్తుకి ఆశపడే రకం కాదనీ కోడలికి గురి కుదిరింది. అతన్ని అనుమానించినందుకు సిగ్గుపడింది. ఆమెలోని సహజ ఔదార్యం పైకి తన్నుకువచ్చింది. ''కానీ మా మావగారి ఇల్లూ, కారూ నువ్వే అట్టిపెట్టుకో. మాకు నచ్చినవిధంగా మేం ఇంకో ఇల్లు కట్టుకొన్నాం. దాంట్లోనే ఉంటాం.  ఆయన లంకంత కొంప నాకెప్పుడూ ఇష్టం ఉండేదికాదు.'' అంది.

ఆవిధంగా సదాకు కావలసిన విధంగానే అన్నీ జరిగేయి. కోడలు చాకచక్యంగా వ్యవహరించి కార్మికులచేత సమ్మె మానిపించి షాపు తెరిపించింది. సదా ఎప్పటిలాగానే కౌంటర్లో నిలబడి కస్టమర్లతో కబుర్లాడుతూ పని జరిపిస్తున్నాడు. డబ్బు అజమాయిషీ అంతా కోడలిదే. తనతోబాటు పనిచేసినవాడిని యజమానిగా అంగీకరించడానికి పనివాళ్లకు కొంతకాలం పట్టింది. కానీ అతని మృదుస్వభావం, ఇతరుల కష్టాల్ని అర్థం చేసుకొనే గుణం వారిని మార్చాయి. షాపులో ఇదివరకటి ఉద్రిక్తత, టెన్షనూ ఇప్పుడు లేవు. ఆడుతూ పాడుతూ పనిచేస్తున్నట్టే ఉంది. సదా ఎవర్నీ దండించేవాడుకాదు, అధికారం చలాయించేవాడు కాదు. ఇక వారికి నచ్చకేం చేస్తాడు? కస్టమర్లు కూడా అతన్ని యజమానిగా అంగీకరించసాగేరు. సదా మాత్రం తను యజమాని అంటే ఛస్తే ఒప్పుకొనేవాడు కాదు. రఘుకాకా కొడుకూ, కోడలే అసలైన యజమాన్లనీ, వారి ఆజ్ఞల ప్రకారమే తను నడుచుకొంటున్నాననీ అనేవాడు. దాంతో ఏడుపుగొట్టువాళ్ల కళ్లు చల్లబడ్డాయి. సదా పని నల్లేరుమీద బండిలా సాగిపోయింది.

xxxxxxxxxxxxxxxxxxxxxxxx

ఓరోజు కార్లో షాపుకొస్తుంటే తనను ఎస్సెల్సీ గట్టెక్కించిన బాల్యమిత్రుడు వినూ కనబడ్డాడు. కారెక్కించుకొని షాపుకి తీసుకొచ్చి అన్నీ చూపించేడు. వినూ ముగ్దుడైపోయాడు. ఇంత సిరి అబ్బినా సదా ఎప్పటిలాగానే ఉన్నందుకు మరీ సంతోషించేడు. ఆప్యాయంగా భుజం తట్టి, ''సాధించావురా, సదా! నన్ను చూడు. చదువుసంధ్యలు వంట బట్టాయనుకో. కష్టపడి సంపాదించిందేమిట్రా అంటే ఓ ప్రభుత్వోద్యోగం! నువ్వు - కారూ, బంగళా, షాపు గుర్తుందా? నువ్వు చిన్నప్పుడు వీటిగురించే కలలు కనేవాడివి. అప్పుడివన్నీ అసంబద్ధంగా అనిపించి నవ్వుకొనేవాళ్లం. అసాధ్యమనుకొన్నవి సాధ్యం చేశావు. నువ్వు పైకి కనబడేదానికంటె ఎంతో గట్టివాడివిరా.''

మెప్పుకి సదా కలవరపడిపోయాడు. చేతులు జోడించి, ''నాకు లేనిపోని గొప్పలంటగట్టకురా బాబూ! ఇదంతా నా ప్రయోజకత్వం కాదు. ఏదో దేవుడు చల్లగా చూసేడు అంతే'' అంటూ కళ్లు మూసుకొని ఒక్కసారి దేవుణ్ణి ధ్యానించాడు.

వినూ ఫక్కున నవ్వి, ''చాల్లేవోయ్‌. ఈ వంకదణ్ణాలూ అవీ. ఇవన్నీ చూసి ఇక ఎవరూ మోసపోరు. ఎవరు పోయినా, పోకపోయినా నేను మాత్రం ఛస్తే మోసపోను. ఆ, అదీ! నీ విజయరహస్యం వినయంలో ఉంది. చిత్తం, చిత్తం అంటూనే అందర్నీ చిత్తు చేసేశావు'' అంటూ భుజం చరిచేడు. ఈ ఆరోపణలకి ఎలా ప్రతిస్పందించాలో తెలియక సదా ఎప్పటికంటే ఎక్కువగా కారులో మూలకి ఒదిగి కూచున్నాడు.

తర్వాత వినూ అనునయంగా, ''సదా, నీకు కలిసొచ్చిన అదృష్టం గురించి గిల్టీగా ఫీలవ్వాల్సిన అవసరం లేదు. దేవుడిచ్చిన సౌఖ్యాల్ని హాయిగా అనుభవించు. అవునూ... బంగళా, కారులతోబాటు నీకు అరుణా ఫడ్కేని పెళ్లి చేసుకోవడం అనే ఇంకో కల కూడా ఉండేది కదూ. ఆమెకు పెళ్లయిపోయింది కాబట్టి, అలాంటి మరో తెలివైన, చదువుకున్న అందగత్తెను చూసి పెళ్లాడెయ్‌'' అన్నాడు.

సదా భయంతో గడాగడా వణికాడు. ''అటువంటి అమ్మాయిని సంభాలించుకోవడం నా వల్ల కాదు బాబూ. అంతకంటె బ్రహ్మచారిగా ఉండడమే మేలు'' అన్నాడు. వినూ ఒకటే నవ్వు.

ఇంటికి తిరిగొచ్చేసరికి వాహిని తన కోసం కాచుకొని ఉండటం చూసి తబ్బిబ్బుపడ్డాడు సదా. ''అయ్యయ్యో, నువ్వెందుకమ్మా వచ్చేవ్‌? కాకితో కబురంపిస్తే నేనే రెక్కలు కట్టుకొని వాలేవాణ్ణిగా''

''నేనే స్వయంగా రావాల్సిన సందర్భం వచ్చింది. ఏం చెయ్యమంటారు'' అంది వాహిని.

సదాకు గుండె దడదడలాడింది. ''ఏవమ్మా! నావల్ల ఏదైనా లోటుపాట్లు జరిగితే చెప్పు దిద్దుకొంటాను...'' అంటూ ఆరంభించేడు.

వాహిని నవ్వుతూ, ''పెళ్లాం లేకపోవడం లోటేగా. మీరిన్నాళ్లూ పెళ్లి చేసుకోకుండా ఉండటం పొరపాటేగా'' అంది.

సదా మనస్సు తేలికపడింది. ''నాతో హాస్యాలాడుతున్నావామ్మా? రెండువందల జీతం, అతుకుల బొంత జీవితం. గంతకుతగ్గ బొంత అన్నట్టు ఎవరైనా నన్ను చేసుకొన్నా 

బొటాబొటీ ఆదాయంతో పిచ్చుకగూడులాటి ఇంట్లో కాపురం చేయలేక పారిపోయేది. పెళ్లి పెటాకులు చూడడానికి ఎవరైనా పెద్ద దిక్కు ఉండాలిగా. ఇక ఈ వయస్సులో పెళ్లి గురించి ఆలోచన కూడా అనవసరం''

వాహిని ఒప్పుకోలేదు. ''మీ వంటి సాత్వికుడితో డబ్బున్నా, లేకపోయినా ఏ ఆడదైనా సుఖపడేది. సరే, ఇప్పటి సంగతేమిటి? పరిస్థితులు మారినా మీరు పెళ్లిమాట ఎత్తటం లేదు. కాబట్టి నేనే నడుం కట్టాను. చాలా సంబంధాలు వచ్చాయి. ఒకటి నాకు నచ్చింది. మీరూ ఒప్పుకోవాలి''

తనని వివాహితుడుగా ఊహించుకోవడానికి సదాకి ముచ్చెమటలు పోశాయి. భార్యలకి చాలా ఆశలుంటాయనీ, వారిని తృప్తిపరచడం కష్టమనీ అతనికి తెలుసు. ''ఒద్దొద్దు'' అంటూ అరిచేడు.

వాహిని అలిగినట్టు మొహం పెట్టి ''నేను ఔనన్నది మీరు కాదంటున్నారన్నమాట. సరే లెండి, మీ ఇష్టం'' అంది.

సదా బతిమాలేడు. ''కాస్త నా మాట విను వాహినమ్మా, నేను బెండకాయలా ముదిరిపోయేను. కుర్రతనంలో కూడా నేను ఎన్నడూ నదురుగా, కంటికి నచ్చేట్టు లేను''

''ఎర్రగా, బుర్రగా ఉన్న మొగుడే కావాలని ప్రతీ ఆడదీ అనుకోదు. అర్థం చేసుకొనేవాడూ, అల్పసంతోషి అయిన భర్తయితే బాగుణ్ణని అనుకొనేవాళ్లూ ఉంటారని మీరు తెలుసుకోవడం మంచిది.''

''నా వయస్సు సంగతి కాస్త ఆలోచించు''

''అది లెక్కలోకి తీసుకొనే చెప్తున్నాను. మీకు ముప్ఫై దాటాయి. ఆ అమ్మాయికి ముప్ఫై వస్తున్నాయి. అమ్మాయి చాలా బాగుంటుంది. చురుకైనదీ, బాగా చదువుకొన్నదీనూ''

''అమ్మ బాబోయ్‌! అంత ప్రతిభ గల అమ్మాయి అసలొద్దు. అలాటి అమ్మాయిని సుఖపెట్టడం నా వల్లకాదు.''

''నిజానికి ఆ అమ్మాయి సంతోషిస్తుంది. మంచి తెలివైనవాడూ, అందగాడూ కదాని ఓ కుర్రాణ్ణి పెళ్లాడిందామె. వాడు చూస్తే బరువూ, బాధ్యతా తీసుకోనివాడని తేలింది. వాడితో గడిపిన రోజులు తలచుకొంటే ఇప్పటికీ వణికిపోతుంది. చివరికి విడాకులు తీసుకుంది''

సదాతోబాటు ఇంటికొచ్చి ఇప్పటిదాకా మౌనంగా ఉన్న వినూ నోరువిప్పేడు. ''ఆమె డైవోర్సీనా, చెప్పరేం మరి''

వాహిని నచ్చచెప్పింది. ''అవును. విడాకులు తీసుకొన్న మనిషే కానీ సదా బాబూ, మీకు భార్య కావలసిన వ్యక్తి తను. అందమైనదీ, సమర్థురాలూ, మీ వ్యాపార విషయాలు చూసుకోగలగడమే కాదు, అభివృద్ధి కూడా చేయగలదు. నిజానికి తను రుచిచూసిన చేదు అనుభవాల తర్వాత, పెళ్లి అంటే బెదురుతోంది. కానీ మీ పేరు తన దగ్గిర చెప్పగానే, మొహంలో వెలుగు కనపడింది. ఇంట్రెస్టు చూపించింది. మీ గురించి తనకు బాగా తెలుసు. మీకు ఒకప్పుడు తనంటే చాలా ఇష్టం కూడాట...'' ఆగింది వాహిని.

సదా ఆశ్చర్యపడ్డాడు, ''ఎవరా అమ్మాయి, పేరేమిటి?''

''అరుణా ఫడ్కే'' చిరునవ్వుతో సమాధానం చెప్పి సదా ఏమంటాడోనని చూసింది వాహిని.

ఏమంటాడు సదా? బుర్ర తిరిగి పోతూంటేను...

వాహిని కొనసాగించింది. ''ఇంకో విషయం ఏమిటంటే అది మా పినతల్లి కూతురు. అదంటే నాకు చాలా ఇష్టం కూడాను''

తను ఈ సంబంధాన్ని కాదనలేదని సదాకు అర్థమయిపోయేక వెర్రాడిలా తలాడిస్తూ కూచున్నాడు.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?