Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ కథలు - 29

అప్పు పుట్టించే తాహతు

అప్పులు చేయడం చాలా కష్టం అనుకుంటారు జనం. ఎంత ఎక్కువ అప్పుకావాలంటే అంత ఎక్కువ కష్టపడాలని కూడా అనుకుంటారు. అది ఒట్టి అపోహ. అప్పులు చేయడానికి పడే కష్టాల్లోని తేడా స్టేటస్‌ని బట్టి మారిపోతూ ఉంటుంది. కావాలంటే ఈ క్రింది సంఘటనలు ఒక్కసారి చూడండి :

ఘట్టం -1

పాత్రలు - 1.సుబ్బారావు, 2. అప్పారావు

గురూ, సుబ్బారావ్‌, ఓ వందరూపాయలు అప్పుంటే చూద్దూ. నెలఖారు కదా.....

వందరూపాయలా ?

మళ్ళీ ఇచ్చేస్తానయ్యా బాబూ, నా జీతం రాగానే పువ్వుల్లో పెట్టి....

ఇప్పటి వరకు చెవిలో పెట్టిన పువ్వులు చాలు 

చూడు. పీకల మీదికి వచ్చిపడింది. లేకపోతే అడిగేవాణ్ని కాను. హోటల్లో డెబ్భయి రూపాయలు బాకీ పడ్డాను. తిండి పెట్టనంటున్నాడు. చాకలాడికి ఇరవై బకాయి. అది ఇస్తేనే ఉతికిన బట్టలిస్తానంటున్నాడు. టైలరు దగ్గర రిపేరు కిచ్చిన పాంటు ఉండిపోయింది. పది రూపాయలిచ్చి పట్టుకెళ్లమన్నాడు.

అవన్నీ నాకెందుకూ, నేనింతకుముందు ఏభై రూపాయలు అప్పిచ్చాను. గుర్తుందా? పండక్కి పట్టుకొచ్చి ఇచ్చేస్తానని ఒట్టేసి చెప్పావు. నాలుగు పండగలెళ్లాయి ఆ తర్వాత. నేను మళ్ళీ దాన్ని కళ్ల చూడలేదు.

గుర్తుంది గురూ. అప్పుడేదో వీలుపడలేదు. ఇప్పుడు మాత్రం యమర్జంటు. ఈ వందా లేకపోతే పని నడవదు. నువ్వు మనస్సులో ఏమీ పెట్టుకోకుండా ఇచ్చేయ్‌. ఒకటో తారీకు జీతం చెక్కు రాగానే, ఫస్టు నీ బాకీ తీర్చే ఇంటికెళతాను.

అలాగే అంటావు, మళ్ళీ దాని గురించి పట్టించుకోవు.

తల్లితోడు. ఈ సారి తప్పకుండా ఇచ్చేస్తాను.

ఈ వేడికోళ్లు, నిరాకరణలు ఓ అరగంట సేపు సాగాక, అప్పారావు తన మీద, తల్లితండ్రుల మీద, యావత్తు బంధుగణం మీద, ఇంటి పక్కింటివాళ్ళ మీద ఒట్లు వేసాక, జన్మజన్మలకీ ఈ ఉపకారం మర్చిపోనని పడిపడి ప్రాధేయపడ్డాక రాల్తాయి, ఆ వంద రూకలూ.

ఘట్టం -2

పాత్రలు - 1. బ్యాంక్‌ మేనేజరు సుబ్రహ్మణ్యం, 2. సూర్యా అండ్‌ కంపెనీ పార్ట్‌నర్‌ సూర్యారావ్‌

నమస్కారం సార్‌ సుబ్రహ్మణ్యం గారూ! బిజీగా ఉన్నట్టున్నారు.

ఏం కావాలో చెప్పండి ?

అదేమిటి సార్‌, అంత ముభావంగా ఉన్నారు? సాయంత్రం క్లబ్బులో అంత సరదాగా ఉంటారు...!

ఇది బ్యాంకండి, క్లబ్బు క్లబ్బే. ఆఫీసు ఆఫీసే. ఇక్కడ మీరు కస్టమర్‌, నేను మేనేజర్ని.

భలేవారే, ఇవాళ అదోలా మాట్లాడుతున్నారేమిటి? మా వల్ల ఏమైనా పొరబాటు జరిగిందా?

మీ ఎక్కవుంటు సరిగ్గా లేదండి. మీ వల్ల మాకు ఆడిటర్ల దగ్గర్నుంచి చివాట్లు తగులుతున్నాయి.

మీరు ఆ లోను ఇప్పించేస్తే ఎక్కవుంటు రెగ్యులర్‌ అయిపోతుందండి.

ఏదీ, ఆ లక్ష రూపాయల లోనా? నో, నో, ఇదే సరిగ్గా నడవడం లేదు. పైగా లక్ష రూపాయల లోనంటే ఎలాగండి? కుదరదు.

మీరు మా బాలెన్స్‌షీటు చూడండి, మా క్రెడిట్‌ వర్దినెస్‌ చూడండి. ఏ ఇబ్బందీ లేకుండా లక్ష రూపాయలు ఇవ్వచ్చు. సార్‌....

ఆ తర్వాత ప్రశ్నల పరంపర ఇలా సాగుతుంది. సూర్యారావు కంపెనీ వసూళ్లెంత? అమ్మకాలెంత? సాదరు ఖర్చులెంత? ఆఫీసు ఖర్చులెంత? పుస్తకాల్లో చూపించిన లాభాలన్నీ వస్తున్నాయా? సూర్యారావుకి దైవభక్తి ఉందా? అప్పు తీర్చకపోతే ఇంకో జన్మ ఎత్తి ఐనా బ్యాంక్‌ ఋణం తీర్చుకోవాలని అతనికి తెలుసా?

చివరికి బ్యాంక్‌ మేనేజర్‌ లక్షరూపాయల లోను ఇవ్వడానికి నిశ్చయించుకుంటాడు. (ఇలా నిశ్చయించుకోవాల్సి వస్తుందని ఆయనకు ముందే తెలుసు). ఇక అప్పటి నుండి షరతుల జాబితా-

మీరు మీ పార్ట్‌నర్‌ని కూడా కాగితాల మీద సైన్‌ చేయమనండి.

తప్పకుండా!

మీ ఆవిణ్ని కూడా చేయమనండి.

నో ప్రాబ్లెమ్‌, తనేమీ అనుకోదు!

ఎందుకైనా మంచిది, మీ అమ్మగారిని కూడా చేయమనండి.

నా మాట కాదనదు. చేస్తుంది!

ఆ తర్వాత - అంటే సూర్యారావు కుటుంబం యావన్మందీ, అతని భాగస్వామి కుటుంబం యావత్తూ, గారంటీ ఇచ్చిన వారి కుటుంబం మొత్తం, కనబడిన కాగితాలన్నిటిమీదా - ఖాళీవైనా, నింపినవైనా - బోల్డు సంతకాలు పెట్టాక లోను సొమ్ము లక్షరూపాయలు అతనికి ముట్టింది.

ఘట్టం -3

పాత్రలు - 1. సేఠ్‌ దగధగాచంద్‌, చైర్మన్‌ ఆఫ్‌ మోసమ్‌చంద్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌, 2. మూరఖ్‌లాల్‌, డైరక్టర్‌ ఆఫ్‌ బకరా కో ఆపరేటివ్‌ బ్యాంక్‌

రండి సేఠ్‌జీ, మీ రాకతో మా ఆఫీసు పావనం అయ్యింది.

ఇది మీ బ్యాంక్‌ హెడాఫీస్‌ అన్నారు. చూస్తే ఇంత చిన్నగా ఉందేమిటి ?

ఏదో మాది చిన్న బ్యాంకే కదా. మా జనరల్‌ మేనేజర్‌ చెప్పిన దగ్గర్నుంచీ నేను హడావుడి పడుతూనే ఉన్నాను. మీ లాటి వాళ్ళు వచ్చేటంత హంగామా మాకు లేదు కదా, ఎలాగా అని! పాపం మీకు ఇబ్బందిగా ఉన్నట్టుంది. ఇలా పెద్ద కుర్చీలో కూచుంటారా?

కుర్చీ దేముంది లెండి? మా ప్రాజెక్ట్‌కి ఫైనాన్స్‌ చెద్దామని తెగ ఉబలాడపడుతున్నారు. అసలు మీ దగ్గర అంత రిసొర్సెస్‌ ఉన్నాయా లేదాని అనుమానం వేస్తోంది చూస్తే.....

ఈ రూము చిన్నగా ఉంది కాబట్టి మీకు అలా అనిపిస్తూ ఉండవచ్చు. రండి, అలా బోర్డు రూములో కూచుందాం. అక్కడున్న ఏసీ బాగా పనిచేస్తుంది.

నా కంత టైము లేదు. ఫైనాన్స్‌ మినిస్టర్‌తో ఎపాయింట్‌మెంటు ఉంది సాయంత్రం. మీరు ఎంత ఇవ్వగలరో ముందు అది తేల్చండి.

మీరు ఎంతో శ్రమ తీసుకుని మా ఆఫీసుకి రావడమే మా పట్ల మీరు చూపిన....

అవన్నీ ఎందుకులెండి. మీ బ్యాంక్‌ కెపాసిటీ ఎంతో తెలిస్తే మేం మీ దగ్గర లోను తీసుకుందామా లేదాని ఆలోచిస్తాం. సగంలోకి వచ్చాక మీరు చేతులెత్తేస్తే ప్రాజెక్టు ఆగిపోతుంది. మా ఇమేజి పోతుంది.

అలా ఎందుకు జరగనిస్తామండి? ఐదు కోట్లు ఇమ్మంటారా?

ఐదా? అదే మూలకి? సరే, ఇవ్వండి. ప్రస్తుతానికి సరిపెట్టుకుంటాం. మళ్ళీ కావలసివస్తే మా ఫైనాన్స్‌ కంట్రోలర్‌ వచ్చి మాట్లాడతాడు.

తప్పకుండా, తప్పకుండా.

మీ ఫార్మాలిటీస్‌ ఏమిటి? మా ఆస్తులన్నీ తాకట్టు పెట్టాలా ఏమిటి?

అవన్నీ మీ దగ్గర ఎందుకు అడుగుతాం? మీరు సైన్‌ చేస్తే చాలు.

ఆ పేపర్లు ఉంటే ఇచ్చేయండి. సైన్‌ చేసి పడేస్తా.

మీ కంత శ్రమ ఎందుకు? మా స్టాఫ్‌ని మీ ఆఫీసుకి పంపిస్తా. మీ వీలుబట్టి సంతకం చేసి పంపండి. అంతే, దట్సాల్‌.

అయితే నేను వెళ్లచ్చుగా..

అంత త్వరగానా? మా స్టాఫ్‌ అంతా మిమ్మల్ని చూడాలని ఉబలాట పడుతున్నారు. లంచ్‌ కూడా ఎరేంజ్‌ చేశాం.

సరే, కానీయండి.

ఆ విధంగా ఐదు కోట్ల ఋణం అతి సులభంగా చేతులు మారింది.

ఘట్టం -4

పాత్రలు - 1. అమెరికా దేశ ప్రతినిథి, 2. టింబక్టూ దేశాధినేత

సంభాషణలు చాలా లెవెల్స్‌లో జరిగాయి. వాటన్నిటినీ గ్రంథస్తం చేయడం కష్టం కాబట్టి ఆమెరికా పత్రికలలో వచ్చిన వార్తలను చూద్దాం.

న్యూయార్క్‌, శుక్రవారం - టింబక్టూ దేశాధినేత ఫీల్డ్‌ మార్షల్‌ నమోటో అమెరికా పర్యటన సందర్భంగా ఘనమైన స్వాగతం లభించింది. వారు ఈ దేశంలో వారం రోజులు మాత్రమే బస చేస్తారని. ఆ లోపునే అమెరికా ఇవ్వజూపిన 500 కోట్ల ఋణం గురించి సంప్రదింపులు పూర్తి చేస్తారని అభిజ్ఞవర్గాల భోగట్టా.

న్యూయార్క్‌, శనివారం - ఫీ.మా. నమోటోకు జరిగిన పౌరసన్మాన సభలో ప్రసంగిస్తూ అమెరికా వైస్‌ ప్రెసిడెంటు వర్ధమాన దేశాలను ఆదుకోవడంలో అమెరికా ఎన్నడూ వెనకంజ వేయదని అభిభాషించారు. జవాబుగా నమోటో అమెరికా, టింబక్టూ ప్రజల మధ్య తరతరాలుగా ఉన్న సంబంధబాంధవ్యాలు గుర్తుచేశారు.

న్యూయార్క్‌, సోమవారం - ఆదివారం విశ్రాంతి తీసుకున్న ఫీ.మా. నమోటో తన గౌరవార్థం హాలీవుడ్‌లో జరిగిన సభలో తనకు సినిమాలన్నా, సినిమా తారలన్నా మిక్కిలి ఇష్టమని తెలిపారు.

న్యూయార్క్‌, మంగళవారం - ఈ రోజు ఫీ.మా. నమోటో బేస్‌బాల్‌ ఆట చూడడానికి నేషనల్‌ స్టేడియంకు వెళ్ళారు. 500 కోట్ల ఋణం గురించి అధికారుల మధ్య చర్చలు కొనసాగుతున్నట్లు తెలిసింది.

న్యూయార్క్‌, బుధవారం - తాము టింబక్టూ దేశానికి వెయ్యి కోట్లు ఋణం ఇవ్వబోతున్నామని వచ్చిన వార్తలలో నిజం లేదని, అది 500 కోట్ల మించదని అమెరికా ఫైనాన్స్‌ మంత్రిత్వశాఖ అధికారి ధృవీకరించారు.

న్యూయార్క్‌, గురువారం - అమెరికా, టింబక్టూ దేశాల మధ్య కుదిరిన ఒడంబడిక ప్రకారం 500కోట్ల ఋణపత్రాలపై నేడు మధ్యాహ్నం 11గంటలకు సంతకాలు జరిగాయి. వెనువెంటనే ఆ సొమ్ము టింబక్టూ దేశపు ఖాతాలో జమ చేయడం జరిగింది. 12 గంటలకే ఫీ.మా. నమోటో విమానం ఎక్కారు. తన పర్యటన ఇరుదేశాల మధ్య సుహృద్భావ వాతావరణానికి దోహదం చేసిందని ఉద్ఘాటించారు.

ఇప్పుడు చెప్పండి. అప్పు తీసుకునే మొత్తం, అప్పు చేయడానికి పడే కష్టాలు ఏ నిష్పత్తిలో ఉన్నాయో...!? 

ఇక ఈ అప్పు పర్యవసానాలు చూద్దామా....

ఓ ఆర్నెల్ల తర్వాత -

అప్పారావు 55 రూపాయలు తర్వాత నెలలో ఇచ్చాడు. దాని తర్వాత రెండు నెలల తర్వాత మరో 30 రూపాయలు, అది ఇచ్చిన రెండు వారాలకు తక్కినది యిచ్చి ఊపిరి పీల్చుకున్నాడు.

పార్ట్‌నర్‌ మోసం చేయడంతో సూర్యారావు వ్యాపారంలో దెబ్బతిన్నాడు. అయినా ఆస్తి విడిపించుకోవడానికి దేవుడా అంటూ మొత్తం అంతా తనే కట్టాడు - గ్యారంటీ ఇచ్చినవాళ్లు ఒత్తిడి తేవడంతో! మేనేజరుతో అతని క్లబ్బు ఫ్రెండ్‌షిప్‌ కొనసాగుతూనే ఉంది.

ప్రాజెక్టు మొదలుపెట్టగానే, అది పర్యావరణానికి దెబ్బ అంటూ స్థానికులు ఆందోళనకు దిగడంతో మోసమ్‌చంద్‌ గ్రూప్‌ ప్రాజెక్టును విరమించుకుంది. తామిచ్చిన ఐదు కోట్లు ఋణం వెనక్కి రాకపోవడంతో బకరా కోపరేటివ్‌ బ్యాంక్‌ దివాళా తీసింది.

500 కోట్లు ఋణం పుచ్చుకున్న ఫీ.మా. నమోటో దేశానికి తిరిగిరాగానే జరిగిన సైనికకుట్రలో పదవీచ్యుతుడయ్యాడు. ఆ సొమ్మంతా నమోటో స్విస్‌ బ్యాంక్‌లో దాచుకున్నాడు కాబట్టి తాము బాధ్యత వహించమని కొత్త ప్రభుత్వం అమెరికాకు స్పష్టం చేసింది. ఋణం రాబట్టుకోవాలంటే 750కోట్ల కొత్తఋణం ఇవ్వవలసినదేనని పట్టుబట్టింది. జాతీయ పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా మరింత ఋణాన్ని అమెరికా అందజేసింది. పాతఋణాన్ని వడ్డీలేకుండా 50 సంవత్సరాలలో తిరిగి ఇచ్చేట్లా కొత్త ప్రభుత్వాన్ని ఒప్పించడంలో అమెరికా ఆర్థిక శాఖ సఫలీకృతమైంది.

ఇందుమూలముగా నీతి ఏమనగా: అప్పు చేసినప్పుడు, చిన్న మొత్తములలో చేయరాదు.

(స్టీఫెన్‌ లీకాక్‌ ఆంగ్లరచనకు స్వేచ్ఛానువాదం  - ఎమ్బీయస్‌ ప్రసాద్‌

('హాసం' అక్టోబరు 2001 లో ప్రచురితం)

[email protected]

 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?