Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ కథలు - 31

ఉడుం మేష్టారు

క్లాసులో బోర్డు మీద రాస్తున్న ఉడుం మేష్టారికి తల తిప్పకుండానే వెనక ఏదో సందడి జరుగుతోందని తెలిసిపోయింది. ఏదైనా ఆపద రాబోతున్నప్పుడు ముందే పసిగట్టి, తనను తాను కాచుకోవడం ప్రతీ ప్రాణి సహజ లక్షణం. ఆ సహజ లక్షణాన్ని సానబెట్టడం - పుస్తకాలు మథించి, జ్ఞానాన్ని పంచడం కంటే ఓ ఉపాధ్యాయుడికి అవసరమని ఉడుం మేష్టారు ఉద్యోగంలో చేరిన తొలిదినాల్లోనే గ్రహించేడు.

ఇప్పుడో ఆపద వస్తోందని తట్టగానే ఆయన మెడమీద వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. తల తిప్పుతూండగానే కనుసన్నలలోంచి తెల్లటి పేపర్‌ రాకెట్‌ తనవైపుకి దూసుకురావడం గ్రహించేడు. మధ్యదారిలోనే ఓ కుర్రాడు చెయ్యి అడ్డు పెట్టడంతో అది వచ్చి మేష్టారి కాళ్ల దగ్గిర పడింది. వంగి తీస్తూ తన విద్యార్థులకేసి చూసాడాయన. మొహాలన్నీ అలుక్కుపోయినట్టున్నాయి. రక్తం మొహంలోకి తన్నుకువచ్చినట్టనిపించింది. 'కళ్లు పరీక్షించుకోవాలి లేదా బీపీయేమో చూపించుకోవాలి' అనుకుంటూ రాకెట్‌ చేతిలో పట్టుకుని అందరి మొహాలు పరీక్షగా చూసాడు. ఆయన చూపులు తప్పించుకోడానికి కొందరు పక్కకి, కొందరు దూరంగానూ చూడడం మొదలెట్టారు.

చివరికి ''మన మధ్య ఉన్న రైట్‌ సోదరుల తమ్ముడు ఎవరు?'' అంటూ క్లాసంతా కలియజూసాడు మేష్టారు. క్లాసంతా నిశ్శబ్దంగా ఉంది. వాళ్ల టెన్షన్‌ గమనించిన మేష్టారికి ఏదో అనుమానం తోచింది. రాకెట్‌ మడతలు విప్పి, సాపు చేసి చూసాడు. రూళ్ల కాగితం మీద తన బూతుబొమ్మ ఆకుపచ్చ సిరాలో వేసి ఉంది. నిదానంగా కాగితం సగానికి మడిచి, దాన్ని మళ్లీ సగానికి మడిచి, చింపి ముక్కలు చేసి గుప్పిట్లో పెట్టుకుని క్లాసుల్లో తరతరాలుగా మొద్దబ్బాయిలు నివాసం ఏర్పరచుకునే వెనక బెంచీలకేసి నడవసాగేడు. నడుస్తూండగానే పిల్లల చూపులు తనను వెన్నాడి వస్తున్నాయని తెలిసిందాయనకి.

ఆ బూతుబొమ్మ రాకెట్‌ ఎవరు విసిరేరో క్లాసులో అందరికీ తెలుసు. మేష్టారికీ తెలుసు. ఆరడుగుల కంటే ఎత్తున్న కరన్‌ ఖుల్లార్‌ క్లాసులో అందరికంటే సైజులోనూ, వయసులోనూ కూడా పెద్దవాడు. ఏ చొక్కా తొడిగినా పై మూడు గుండీలూ వదిలేసి ఛాతీ విరుచుకొని తిరగడం అతని ట్రేడ్‌మార్క్‌. అతని పర్సులో ఒక కొత్త వంద రూపాయల నోటు, పద్ధెనిమిదేళ్ల వయస్సు వచ్చేసిందన్న దానికి గుర్తుగా 'సిల్వర్‌ ఫాయిల్‌'లో ఉన్న వస్తువొకటి ఉంటాయని కుర్రాళ్లందరూ చెప్పుకుంటారు. మిగిలిన కుర్రకారు కంటే అతనికి జీవితంలోని విషయాలు చాలా తెలుసని చెప్పడానికా అన్నట్లు అతని చేతి నరాలు ఉబ్బి ఉంటాయి. ఓ సారి ఎవరితోనో పందెం కట్టి హిస్టరీ మేష్టారి క్లాసులో సిగరెట్టు కాల్చేడు. హిస్టరీ మేష్టారు ఘోష్‌కి భయం జాస్తి. చూసీ, చూడనట్టు ఊరుకున్నాడు. కానీ ఖుల్లార్‌ వదిలిపెట్టలేదు. సిగరెట్టు పూర్తిగా చివరిదాకా కాల్చి ఆయన మొహం మీదే రింగులు వదిలేడు.

ఉడుం మేష్టారూ, ఖుల్లారూ ఇప్పటిదాకా ముఖాముఖీ తలపడలేదు. ఈ అల్లరి కుర్రాడికి రోజురోజుకి ధైర్యం పెరిగిపోతోందని ఏదో ఒక రోజున తనతో ఘర్షణ పడడం తథ్యమని ఉడుం మేష్టారికి ఎప్పుడో తెలుసు - ఆ రోజేదో ఇవాళే వచ్చింది. త్వరగా తేల్చేస్తే అందరికీ మంచిది. కానీ తన విషయంలో జరిగింది సామాన్యమైనది కాదు. ఏకంగా బూతుబొమ్మే! ఇప్పుడిక వెనక్కి తగ్గేది లేదు.

ఆఖరి వరస కుర్రాళ్ల దగ్గరికి వచ్చి ఖుల్లార్‌ని తేరిపార చూసాడు మేష్టారు. కూర్చున్నా ఆ దున్నపోతుగాడు తనంత ఎత్తున్నాడు. వాడి పక్క కూచున్న కుర్రాళ్లు చేష్టలుడిగి కూచున్నారు. వాళ్ల కనుపాపల్లో ఉడుం మేష్టారికి తన ప్రతిబింబం కనబడింది - పాతకాలం చొక్కా, నలిగిపోయిన పాంటు, పొట్టి ఆకారం. ముసలితనం ముంచుకొస్తోంది. అవసరం, అభిరుచి లేని కుర్రాళ్లకు జ్ఞానాన్ని పంచి యిచ్చి, అరిగిపోయిన శిథిలంలా ఉన్నాడు.

ఖుల్లార్‌ చిరునవ్వొకటి మొహానికి అతికించుకొని విసుగ్గా ఈయనకేసి చూసాడు - ఏం చెయ్యబోతాడో చూద్దాం అన్నట్టు.

''నుంచో, నేను నీ దగ్గరకు వచ్చినప్పుడు నుంచోవాలని తెలీదూ?'' మెల్లగానే అన్నాడు మేష్టారు.

క్లాసు కుర్రాళ్లందరికీ తన పోజు కనబడేలా అమితాబ్‌ బచ్చన్‌ స్టయిల్లో ఖుల్లార్‌ నింపాదిగా లేవబోయాడు. మేష్టారు చురుగ్గా కుడిచేత్తో ఖుల్లార్‌ చొక్కా పట్టుకుని కిందకు గుంజాడు. ఖుల్లార్‌ తొట్రుపడి బాలన్స్‌ తప్పి ముందుకు ఒరిగేడు. ఆ ఊపులోనే ఖుల్లార్‌ మొహం మీద చేత్తో చరిచాడు. అతను వెనక్కి విరుచుకుపడడంతో అతని జేబులోంచి పెన్ను కిందపడి ఆకుపచ్చ రంగు సిరా నేల మీద ఒలికింది. అది చూడగానే మేష్టారికి కోపం ఇంకా పెరిగి అరచేత్తో చెంప ఛెళ్లుమనిపించి, డొక్కలో ఒక్క గుద్దు గుద్దాడు. కాళ్లు విరిగిన దున్నపోతులా ఖుల్లార్‌ బల్లమీద పడిపోయాడు చొంగ కార్చుకుంటూ. మేష్టారు ఎడం చేతిలో ఉన్న కాగితం ముక్కలు అతని మొహాన్న విసిరికొట్టి, ''ఈ బొమ్మలు అవీ డ్రాయింగు క్లాసులో వేసుకో, నా క్లాసులో కాదు'' అంటూ విసవిస నడిచి వచ్చేస్తూండగానే ఇంటర్వెల్‌ బెల్లు మోగింది.

ఇంటర్వెల్‌ సమయం అంటే ఉడుం మేష్టారికి ఎంతో ఇష్టం. అటూ, ఇటూ వెర్రిగా పరుగులు పెట్టే పిల్లల ఉరవడీ, ఉత్సాహమూ మేష్టారికి రోజూ ఒకే సందేశాన్ని గుర్తు చేస్తూంటాయి - 'గెలుపూ, ఓటమీ స్థిరంగా ఉండిపోవు; బండి చక్రంలో ఆకుల్లా పైకీ కిందకూ మారుతూనే ఉంటాయి. ఇవన్నీ పట్టించుకోకుండా ముందుకు సాగిపోవడమే జీవితం' అని.

స్కూలు మెయిన్‌ బిల్డింగులో ఉన్న కామన్‌ రూమ్‌కి నడుస్తూన్నప్పుడు మేష్టారికి తన చేతినొప్పి తెలిసివచ్చింది. అరచెయ్యి వాచిపోయింది. ఆ ఖుల్లార్‌గాడికి ఇంకా ఎక్కువగా నొప్పి పుడుతూ ఉండి ఉంటుంది. తన కోపం అవధులు దాటిందని ఆయనకే అనిపించింది. స్వతహాగా తను ఏ విద్యార్థినీ కొట్టడు. విద్యార్థులను కొట్టే టీచర్లంటే అసహ్యం కూడా. తన నలభై ఏళ్ల సర్వీసులో పిల్లల్ని కొట్టిన ఘట్టాలు వేళ్లమీద లెక్కించవచ్చు. చేతికి పని చెప్పడం కంటే మానసికంగా ఇతరుల మీద అధికారం చలాయించడమే ఉపాధ్యాయుడు నేర్చుకోవాలన్నది తన సిద్ధాంతం.

మధ్యాహ్నం క్లాసులు చెప్పేటప్పుడు మాష్టారి మనసు మనసులో లేదు. అయినా ఇన్నేళ్లగా పాడుతున్న పాటే కనక అప్రయత్నంగా ఆయన పాఠాలు చెప్పుకుంటూ పోయేడు. స్కూలు అయిపోయాక తన క్వార్టర్సుకి బయల్దేరాడు. దారిలో పిల్లలు తనకు 'గుడ్‌ ఈవెనింగ్‌, మిస్టర్‌ ఆండ్రూ' చెప్తున్నా తన  వెనక్కాల నుంచి గుచ్చి గుచ్చి చూస్తున్నారన్న సంగతి ఆయన గ్రహించలేకపోలేదు.

క్వార్టర్సుకి వచ్చాక బాల్కనీలో కూలబడిన మేష్టార్ని ఆలోచనలు చుట్టుముట్టాయి - తన ఒంటరి జీవితం గురించి, స్కూలే తన సర్వస్వంగా సాగిన ఇన్నాళ్ల తన జీవితం గురించి, ఏవేవో కారణాలు చెప్పి మానేసిన తన పెళ్లి గురించి, పట్టిన పట్టు విడవని తన స్వభావం చూసి పిల్లలు పెట్టిన తన నిక్‌నేమ్‌ గురించి...

ఇంతలో బాసు టీచరు వచ్చాడు. ఉడుం మేష్టారికున్న అతి తక్కువ మంది మిత్రుల్లో అతనొకడు. వచ్చి అవీ, ఇవీ మాట్లాడేక నెమ్మదిగా అసలు విషయానికి వచ్చేడు - ''నా దగ్గర ట్యూషన్‌కి వచ్చే చోప్డా ఇవాళ జరిగినది చెప్పాడు. వాడూ ఖుల్లారూ బెంచ్‌మేట్లు కూడా. ఖుల్లార్‌ ముక్కు చితికిపోవడం చూసి వాళ్ల నాన్నకి వెర్రికోపం వచ్చిందట. ఈ విషయం అంతు తేల్చుకుంటానన్నాట్ట. నేను ఇంతకుముందే చెప్పానుగా. కాలేజీ బోర్డులో కూడా అతనికి ఫ్రెండ్సున్నారు.''

ఉడుం మేష్టారు తను కాలుస్తున్న సిగరెట్టు పూర్తయ్యేవరకూ ఏమీ మాట్లాడలేదు. తర్వాత మెల్లగా చెప్పుకొచ్చేడు - ''నేను ఈ ఉపాధ్యాయ వృత్తిలోకి ఎలా వచ్చానో ఎప్పుడూ చెప్పలేదు కదూ. మా నాన్నకు నేను ఒక్కణ్నే కొడుకుని. మిగతావాళ్లంతా ఆడపిల్లలే. మా నాన్నలాగే నేనూ రైల్వేలో పనిచేస్తానని అందరూ అనుకున్నారు. నేనూ అలాగే అనుకున్నాను.

''నా చదువు పూర్తయ్యేక ఓ రోజు మా మామయ్య ఒకరు నన్ను చేపలు పట్టడానికి తీసుకెళ్లాడు. ఎరవేయడం, అదనుచూసి చేపను లాక్కోవడం ఆయనే నాకు నేర్పాడు. అదొక కొత్త అనుభవం. ఓపిగ్గా వేచి ఉండేవాణ్ని. నేను వేసిన ఎర వద్దకు చేపను ఆకట్టుకొనేవాణ్ని. చేప ఎరను అందుకోగానే నా చేతిలో ఉన్న గాలానికి హఠాత్తుగా ప్రాణం వచ్చేది. చేప, గాలం, నేనూ - ఇక మూడు విడివిడి ప్రాణులం కాదు. అంతా ఒకటే. జాగ్రత్తగా పట్టువిడుపులు ప్రదర్శిస్తూ చేపను పట్టేసేవాణ్ని. గిరగిరా గాలం తాడు తిప్పుతూ పట్టుబడినదాన్ని నా వద్దకు తెచ్చుకునేవాణ్ని. తెచ్చుకున్నాక, అప్పుడా చేపను తిరిగి నీటిలోకి వదిలి పెట్టేసేవాణ్ని. ఎందుకంటే చేపని పట్టుకుని తినడంలో ఆనందం లేదు. ఆ పట్టుకునే ప్రక్రియలోనే ఉంది. ఆ పని చేసిన ప్రతీసారి కొత్త కొత్త సంగతులు తెలిసేవి. నాకూ, చేపకూ కూడా అదొక ఛాలెంజ్‌. కొన్ని రూల్స్‌ ప్రకారం ఆడే ఆట అది.

''చేపలు పట్టడం హాబీకి, ఉపాధ్యాయ వృత్తిలో చేరాలని నేను తీసుకున్న నిర్ణయానికి ఏదైనా సంబంధం ఉందేమో నాకు తెలియదు. కానీ ఆ నిర్ణయానికి నాతో సహా అందరూ ఆశ్చర్యపడ్డారు. ఈ వృత్తి కొచ్చాక ఎటువంటి పరిస్థితులైనా మనం ఎదుర్కోగలగాలని పిల్లలకు నేను బోధిస్తున్నాను. బోధిస్తూనే నేనూ నేర్చుకుంటున్నాను. పరిస్థితులతో రాజీ పడాలని కూడా చెప్తున్నాను. కానీ రాజీ పడ్డాక నీ వద్ద మిగిలినదాని పరువు, ప్రతిష్టలతో బతకగలగాలని కూడా చెప్తున్నాను....''

బాసుకి ఇక ఏం మాట్లాడాలో తోచలేదు. ''నువ్వు నా ఫ్రెండువి కాబట్టే నాకు చింత. జాగ్రత్తగా ఉండమని చెప్పడానికే వచ్చాను'' అంటూ సెలవు తీసుకున్నాడు.

దీ

మర్నాడు ఉదయం అసెంబ్లీ కాగానే, ప్రిన్సిపాల్‌ గారి సెక్రటరీ చెప్పింది - ''ప్రిన్సిపాల్‌ గారు మిమ్మల్ని వెంటనే కలవమన్నారు''

''మరి క్లాసో...?'' 

''దాని సంగతి మేం చూసుకుంటాం మీరు పదండి.''

'ఎప్పుడో ఒకప్పుడు ఈ పరిస్థితి ఎదుర్కొనక తప్పదు. ఎంత త్వరగా వదిలిపోతే అంత మంచిది.' అనుకుంటూ ప్రిన్సిపాల్‌ గదికి దారి తీసాడు మేష్టారు.

ప్రిన్సిపాల్‌ తలకాయ పైకెత్తలేదు. కాగితాలు చూసుకుంటూనే ఉన్నాడు. ఆ పోజు చూస్తూనే అసహ్యం వేసింది. ''నన్ను అర్జంటుగా రమ్మన్నారుట...'' అంటూ మేష్టారు కుర్చీ లాక్కుని కూచున్నాడు.

ప్రిన్సిపాల్‌ కళ్లెత్తి దీర్ఘంగా చూసేడు. పొడి గొంతుకతో ''ఒక కంప్లెయింటు వచ్చింది మీ మీద. ఆయన పేరు...'' అంటూ కాగితాలు వెతికి ''ఆఁ.. ఖుల్లార్‌. మీరు వాళ్లబ్బాయిని కొట్టేరని ఫిర్యాదు.'' అన్నాడు.

''ఆ కుర్రాణ్ని కాస్త అదుపులో పెట్టాల్సి వచ్చింది'' అన్నాడు మేష్టారు పొడిగా.

''అంటే ఆ కుర్రాణ్ని కొట్టేనని మీరు ఒప్పుకుంటున్నారన్నమాట.'' ఏ భావం వ్యక్తపరచకుండా ప్రిన్సిపాల్‌ అడిగేడు.

''అదుపులో పెట్టానని చెప్పాను కదా. ఆ పని చాలా ముందే చెయ్యాల్సింది అసలు. వాడి కారణంగా మిగతావాళ్లు చెడిపోతున్నారు. ఎవర్నీ లెక్కచెయ్యడు. మొన్న చేసిన దానితో...''

''...పిల్లల్ని కొట్టడం గురించి నేనేం చెప్పానో మీకు గుర్తుంది కదా...''

''గుర్తుంది సార్‌. దాని ప్రకారమే ఎప్పుడూ చేస్తున్నాం. కానీ వీడి విషయంలో మాత్రం..'' జవాబు చెపుతూండగానే మేష్టారు తన కాళ్లక్రింద భూమిలేకుండా ఇసుక కుప్ప ఉన్నట్టూ, అది కదులుతున్నట్టూ ఫీలయ్యేడు.

''...రూలంటే రూలే నండి. మీ కున్న ఇన్నేళ్ల అనుభవంతో మీ కా విషయం తెలిసే ఉండాలి.''

''మీరు నా మాట వినాలి...'' అంటూ మేష్టారు చెప్పబోయేడు కానీ ప్రిన్సిపాల్‌ మళ్లీ అడ్డువచ్చాడు.

''...అంతేకాకుండా దెబ్బలు చాలా గట్టిగా తగిలాయిట. కుర్రవాడి శరీరమంతా గాయాలని ఫిర్యాదులో రాసారు...''

''గాడిదగుడ్డు! ఆ దున్నపోతుగాడు నాకు రెండు రెట్లుంటాడు'' అంటూ మేష్టారు చెప్పబోతూంటే ప్రిన్సిపాల్‌ టక్కున విషయం మార్చేసాడు.

''ఎందుకు కొట్టవలసి వచ్చిందన్నారు?''

''ఓ బొమ్మ, బూతుబొమ్మ...''

''మీ దగ్గర సాక్ష్యం ఉందా?''

ఆ ప్రశ్న మేష్టార్ని దెబ్బ తీసింది. మాటలు తడబడ్డాయి. ''లేదు, చింపి పారేశాను. అటువంటి వెధవ బొమ్మను జాగ్రత్త పెడతారా? అదీ కాక...''

ప్రిన్సిపాల్‌ మాత్రం చలించకుండా 'సాక్ష్యం లేదు' అంటూ ఫిర్యాదు కాగితం మీద ఆ విషయం రాసేడు.

మేష్టార్ని కోపం ఆవహించింది. ''సీనియర్‌ టీచర్ని. నేను చెప్పేది పట్టించుకోకుండా, మీరు ఆ పోకిరీ వెధవ మాటలకు విలువిస్తారన్నమాట?'' అంటూ అరిచేడు.

మొట్టమొదటిసారిగా ప్రిన్సిపాల్‌ ముఖం మీద ఒక భావం పలికింది. ''ఎవరి మాటకు విలువెక్కువ అన్న విషయం కాదండి. మీరేం చేసారో మీకేమైనా తెలుస్తోందాని. ఆ అబ్బాయి వాళ్ల నాన్న క్రిమినల్‌ కేసు పెడతానంటున్నాడు. పేపరు వాళ్లు ఇలాటిది ఒకటి దొరికిందంటే చాలు... ఏకేస్తారు. నేను మధ్యలో ఇరుక్కున్నాను. దీనిలోంచి బయటపడేందుకు మార్గం ఒకటే ఉంది - మీరు ఆ అబ్బాయికి క్లాసులో, వాళ్ల తండ్రి సమక్షంలో క్షమాపణ చెబితే ఈ విషయం ఇంతటితో సరిపె...''

మేష్టారి కళ్లెర్రబడ్డాయి - ''మీరు వేళాకోళాలాడుతున్నారా? అలా క్షమాపణ చెబితే ఇక నేను ఈ స్కూల్లో ఉండగలనా? ఏ మొఖం పెట్టుకుని మర్నాడు క్లాసులో నిల్చోగలను? అందరూ నా నెత్తి కెక్కేయరూ?''

ప్రిన్సిపాల్‌ ఏ మాత్రం ప్రతిస్పందించలేదు. ''మీరు క్షమాపణ చెప్పక తప్పదనుకొంటా. ఇది నేను చెప్పడం కాదు. బోర్డు చైర్మన్‌ గారి ఆదేశాలివి.''

మేష్టారు తల అడ్డంగా తిప్పాడు. ''అసాధ్యం. నేనెన్నటికీ అలాటి పని చెయ్యలేను. చెయ్యను.''

''అలా అయితే రాజీనామా ఇవ్వక తప్పదు.''

ఇదంతా నిజంగా జరగటం లేదనీ, తన భ్రమ మాత్రమేననీ అనిపించింది మేష్టారికి. తన ఎదురుగా ఉన్న బల్ల, కుర్చీ, గోడలు అన్నీ అల్లుకుపోయి, చిన్న చిన్న చుక్కలుగా మారిపోయి గుర్తుపట్టలేని విధంగా అయిపోయేయి. మధ్యలో ఎన్నో ఖాళీలు. వాటిని నింపాలి. మాటలతో నింపాలన్నా లాభం లేదు. మాటలూ వాటి అర్థాన్ని పోగొట్టుకున్నాయి.

ఎక్కడనుంచో దూరం నుంచి ఒక గొంతు వినబడుతోంది, ''రేపటిలోగా మీ నిర్ణయం చెప్పండి'' అంటోంది.

ప్రిన్సిపాల్‌ గదిలోంచి బయటకు రావడం, క్లాసులో పాఠాలు చెప్పడం, లంచ్‌ సమయంలో స్టాఫ్‌రూమ్‌కి వెళ్లకపోవడం ఏవీ గుర్తులేవు మేష్టారికి. ఏదో తెలియని గ్రహానికి వచ్చిపడినట్లు, అక్కడి పద్ధతులు గమనిస్తున్నట్లు అనుభూతి పొందాడు. ఉరితీసేసిన మనిషి ఇంకా బతికున్నట్టు, చుట్టూ ఉన్న గాజు ప్రపంచం ఏ చిన్న పొరపాటు చేసినా పగిలి పోవడానికి సిద్ధంగా ఉన్నట్టూ అనిపించింది.

xxxxxxxxxxxxxxxx

ఇంటికి వచ్చి భవిష్యత్‌ కార్యక్రమం గురించి ఆలోచించబోతే, గతస్మృతులే అతన్ని వెంటాడాయి - తను పెండ్లాడలేదు. మొదట్లో డబ్బులేదన్నాడు. తర్వాత సరైన సంబంధాలు రాలేదన్నాడు. కొన్నాళ్లు  పోయేక ఈ సాకులకు స్వస్తి చెప్పి తనకు పెళ్లంటే ముందునుంచీ ఇష్టం లేదని తెలుసుకున్నాడు. దగ్గరి బంధువంటూ ఉన్నది అక్క ఒకత్తే. ఆవిడా ఆస్ట్రేలియాలో ఉంది. ప్రతీ క్రిస్మస్‌కి కార్డులు పంపుకోవడం ద్వారా ఆ బంధం నిలిచివుంది.

స్కూలే తనకు చుట్టం, పక్కం, ఆధారం - అన్నీ. జీవితంలోంచి స్కూలు తీసేసి చూస్తే మిగిలేది శూన్యమే. కానీ ఎప్పుడో ఒకప్పుడు స్కూలు వదిలిపెట్టి వెళ్లాల్సివస్తుందని తనకూ తెలుసు. రిటైరు అయ్యేక భుక్తి గడవడానికి చిన్న ట్యుటోరియల్‌ కాలేజి పెట్టుకోడానికి గాను కొద్దికొద్దిగా డబ్బు కూడబెడుతున్నాడు కూడా. రిటైరు కావడం అనేది సహజమైన పరిణామం. కానీ రాజీనామా తీసుకుని తన్ని తగిలేశారంటే అంతకంటే అవమానం వేరే ఉంటుందా?

పోనీ క్షమాపణ చెప్పడం...? అది కూడా సమ్మతం కాదు. క్షమాపణ చెప్పడమంటే తనను తానే మోసగించుకున్నట్టు. ఇన్నేళ్లగా తనకు ఆలంబనగా నిలిచిన సంప్రదాయాన్ని వంచించినట్టు.  బాసుతో తనేం చెప్పాడు? సమస్యతో పోరాడేటప్పుడు కొంత కోల్పోవాలి. తప్పదు. పోగా మిగిలినదానితో మన శేషజీవితం సాగించగలగాలి. క్షమాపణ చెబితే తన వినాశనానికి తనే విత్తు నాటినట్లవుతుంది. ఇక జన్మలో ఎవడూ తనను గౌరవించడు. ఎవరో ఎందుకు? తనంటే తనకే గౌరవం పోతుంది. అందువల్ల ఈ సమస్యనుండి ఎలాగోలా గట్టెక్కాలి. కానీ ఎలా?

xxxxxxxxxxxxxxx

సాయంత్రం చీకటి పడినప్పటినుంచీ శ్రేయోభిలాషులు వచ్చి హితబోధలు చేయబోతారేమోనని మేష్టారికి భయం పట్టుకుంది. క్వార్టర్సు కాంపౌండ్‌లోంచి బయటపడ్డాడు. తనకు తానే చెప్పుకున్నాడు - 'బాగా ఆలోచించు. నీ ప్రత్యర్థులు నిన్ను ఓ మూలకు నెట్టారు. మూల నుండి రంగం మధ్యకు రా. ఎదుర్కో. పట్టిన పట్టు విడవకు. నీకు కుర్రాళ్లు పెట్టినపేరు గుర్తుకు తెచ్చుకో. ఉడుం పట్టు నీది. పోరాటాన్ని ఆపవద్దు. పట్టిన పట్టు విడవరాదు.' 

ఉడుం గురించి ఆలోచించాడు. తన లాగే చిన్నప్రాణి. అయినా అది పట్టు బట్టిందంటే... ఆ ఉడుమే తనకు తారకమంత్రం అనిపించింది. దాని గురించిన ఆలోచనే తనలో శక్తిని నింపింది.

విరిగిపోయిన పేవ్‌మెంట్‌ ఆయన నడకకు బ్రేక్‌ వేసింది. ఆలోచనల్లోంచి బయటపడి చుట్టూ చూస్తే ఎదురుగా ఉన్న రెస్టారెంట్‌ దృష్టి నాకర్షించింది. దాని నియాన్‌ లైట్లు కన్నుగిలిపి ఆహ్వానిస్తున్నట్లనిపించింది. ఉక్కతో చంపుకుతింటున్న సాయంత్రం లోపలకు పదమంది. ఇలాటి ఖర్చుదారీ అలవాట్లకు చాలా కాలంగా దూరంగా ఉన్నాడాయన. అందుకే కాబోలు లోపలికి వెళ్లి మెనూ కార్డులో రేట్లు చూడగానే కళ్లు తిరిగాయి. కానీ పక్కటేబుళ్లలో కూచుని సిగరెట్లు ఊదిపారేస్తున్న కుర్రకారుకు ఇదంతా పట్టనట్టుగా ఉంది. ఖుల్లార్‌ గాడి లాగే తండ్రి డబ్బు ఇష్టమొచ్చినట్టు తగలేసే రకం కాబోలు.

'...నిజం. వాడి లాటి వాళ్లే వీళ్లు కూడా. ఇది శత్రుక్షేత్రం. ఇక్కడకు రావడం మంచిదే. శత్రువుల గుట్టుమట్లు, వాళ్ల అలవాట్లు, వాళ్ల బలహీనతలు తెలుసుకుంటేనే వాళ్లను ఎదిరించగలం. ఇక్కడకు రావడం మంచిదే అయింది' అని తనకు తాను సర్ది చెప్పుకున్నాక చుట్టుపట్ల పరిసరాలను కక్షుణ్ణంగా పరిశీలించాడాయన. ఈ షాండిలియర్స్‌, రంగురంగుల దుస్తులేసుకున్న పాటగాడు, బంగారు చైన్లు ఉతికి చేతికి చుట్టుకున్న కుర్రాళ్లు, గులాబీరంగు తివాచీలు, అరుపులు, కేకలు, తుళ్లింతలు, అనవసరపు నవ్వులు - వీటన్నిటి మధ్యా ఏకాకిగా, ఒక దీవిలా నిలిచినది తను ఒక్కడే.

అంతలోనే లైటింగు మరింత డిమ్‌ అయింది. తెల్ల సూట్‌, ఎర్రచొక్కా వేసుకున్న యువకుడు స్టేజి ఎక్కి స్పాట్‌ లైట్‌ క్రిందకు వచ్చాడు. చూడగానే ఖుల్లార్‌ అనిపించాడు మేష్టారికి. తరువాత తట్టింది. పోలికల బట్టి కాదు తాను పొరబడినది. ఆ ఒడ్డూ, పొడుగూ, ఆ బట్టలు వేసుకునే తీరు, తలా, చేతులు విసరడం - వాటివల్ల తను భ్రమపడ్డాడు. వీళ్లంతా  స్టీరియోటైపు కాబోలు. పాట హైపిచ్‌లో పాడుతూ అతడు ఊగుతూంటే ప్రేక్షకులు వెర్రెక్కిపోయారు. ఈలలు, చప్పట్లు, ఒన్స్‌మోర్లు హాల్లో మార్మోగాయి. పాటగాడిని పరిశీలించినకొద్దీ మేష్టారికి ఆశ్చర్యం వేయసాగింది. జఘనం ఊపడంలో, గొంతెత్తి పాడడంలో, పాడుతూ తను ఎంజాయ్‌ చేస్తున్నట్లు చూపడంలో, ముందుకీ వెనక్కీ నడుస్తూ, తూలుతూ ప్రేక్షకులను హుషారు చేస్తూ చేతులాడించడంలో అతిశయోక్తి, కృత్రిమత్వం ఉంది. అదే ప్రేక్షకులను వెర్రెత్తిస్తోంది. 

ఆ అతిశయోక్తే అతని నిజ వ్యక్తిత్వాన్ని అతని నుండి దూరం చేస్తోంది. ఈ ప్రేక్షకుల కోసం కాస్సేపు వేరే అవతారం ఎత్తినట్లు, ఈ వేదిక దిగిపోగానే పూర్వరూపాన్ని ధరించబోయేటట్లు అనిపించసాగింది. కొత్త విషయాలు అర్థం కాసాగాయి. వాటి విషయమే ఆలోచిస్తూ రెండు గంటల తర్వాత లేచి వచ్చేసేటప్పుడు బేరర్‌కి అనుకున్నదాని కంటే ఎక్కువ టిప్‌ ఇచ్చేసాడు మేష్టారు.

ఇంటికి నడిచి వెళ్లేటప్పుడు వీటి గురించే ఆలోచిస్తూ 'ఉడుం తన పట్టును సడలించనక్కర లేదన్నమాట! ఆ శక్తినింకా కోల్పోలేదన్నమాట!' అనుకుని తనలో తానే నవ్వుకున్నాడాయన. ఉదయం భారంగా నిద్రలేచాక మాత్రం ఆయనలో మళ్లీ భయం తొంగిచూసింది. అంతలోనే తనకు తాను సర్దిచెప్పుకున్నాడు. క్లాసురూమ్‌లో పాఠం చెప్పినప్పుడు విద్యార్థుల దృష్టిని తను ఎలా ఆకట్టుకుంటాడో, మధ్య మధ్యలో విరామాలిస్తూ వారిలో ఉత్కంఠ ఎలా పెంచగలడో, వారి మొహంలో కనబడే ఆశ్చర్యం, ఉత్సుకత తననెలా ఉత్సాహపరుస్తాయో గుర్తుకు తెచ్చుకున్నాడు. నాటకీయతను సృష్టించడంలో తనెవరికీ తీసిపోనని ధైర్యం చెప్పుకున్నాడు.

క్లాసురూమ్‌లో ప్రిన్సిపాల్‌ మధ్యనున్న కుర్చీలో కూర్చున్నారు. ఆయన పక్కనే కూచున్నది ఖుల్లార్‌ నాన్న. చెట్టంత మనిషి, దుబ్బులాటి కనుబొమ్మలు, బొంగురు గొంతు - చూడగానే పెద్దమనిషి కాడని తెలిసిపోయేట్లా. ఉడుం మేష్టారి వీపు కనబడుతోంది వారికి. మేష్టారు వారికి ముందు నుంచొని, ఆఖరి వరసలో కూచున్న ఖుల్లార్‌ వైపే తన దృష్టి నిలిపారు. ఆ కుర్రాడు భయంగా, బెరుగ్గా, ఏం జరుగబోతోందో ఊహించలేనివాడిలా కనబడ్డాడు. అతన్నలా చూస్తూంటే మేష్టారికి ద్వేషం కలగలేదు, తృప్తీ కలగలేదు. 'తను ఆడబోయే నాటకానికి కావాల్సిన సెట్టింగులో అతనొక భాగం. ఒక బల్ల, కుర్చీ, తెర ఎలా అవసరమో అతనూ అంతే.' అనుకుంటూ గొంతు సవరించుకున్నాడు. క్లాసులో విద్యార్ధులందరూ అసాధారణమైనది వినబోతున్న, కనబోతున్న ఉత్సాహంతో, ఉత్సుకతతో తమకు తెలియకుండానే ముందుకు వంగారు.

గొంతులో ఏ భావాన్నీ కనబరచకుండా ''ఖుల్లార్‌, ఇలా రా'' అని పిల్చారు మేష్టారు. ఖుల్లార్‌ సంకోచిస్తూనే లేచాడు. తనతో బాటు వెనక వరసలో కూచున్న విద్యార్థుల చూపులూ, తండ్రి చూపులూ అతనికి ధైర్యానిచ్చాయి. మెల్లగా లేచి, నెమ్మదిగా అడుగులు వేస్తూ మేష్టారి పక్కన నిలిచాడు. మేష్టారు అతనికి పక్కగా జరిగారు. ఖుల్లార్‌ జంకుతూ, కాస్త పక్కకు వైదొగలడంతో ఆయన మరింతగా  అతని పక్కకు చేరి నిలబడ్డారు. ఆయన పొట్టి విగ్రహం ఖుల్లార్‌ కొండంత ఆకారం ముందు మరింత పొట్టిగా, కురచగా, పీలగా కనబడింది.

''మొన్న ఖుల్లార్‌ను నేను దండించవలసివచ్చింది. నేను అతన్ని కొట్టాను.'' మేష్టారు ఒక్కసారి ఆగి, తిరిగి అదే స్థాయిలో కొనసాగించారు. ''అది తప్పని నేను గ్రహించానిప్పుడు...'' అంతలోనే హఠాత్తుగా ఆయన కంఠస్వరంలో, భంగిమలో, వ్యక్తిత్వంలో మార్పు వచ్చింది. మనస్సులోనే రిహార్సల్‌ వేసుకున్న ప్రకారం ఆయన చెయ్యెత్తి ఖుల్లార్‌ భుజం అందుకోబోయేరు. కష్టం మీద అందుకోగలిగేరు. ఇంకో చేత్తో అతని మోచేతిని పట్టుకోబోయేరు. కాలు అతని కాలికి చుట్టివేసి ఎలక్ట్రిక్‌ స్తంభం ఎక్కుతున్నట్టు నటించే మిమిక్రీ కళాకారుడిలా అతన్ని నడుమును చుట్టుకున్నారు. క్లాసు పిల్లలకేసి తిరిగి, కీచు గొంతుతో పదాలు స్పష్టంగా పలుకుతూ, ''చూశారా, ఎంత అన్యాయం చేశానో, ఈ పసిబాలుడి మీద... ఈ చిన్నారి కూన పైన... ఈ నాజూకు పిల్లవాడి మీద... చూడండి పాపం.'' అంటూనే ఖుల్లార్‌ కేసి తిరిగారు. 

ఖుల్లార్‌ కేం చేయాలో తెలియక  తన కంటే సగం సైజున్న మేష్టారి కేసి కళ్లప్పగించి చూస్తూ ఉండిపోయాడు. 

మేష్టారు అతికష్టం మీద తల యెత్తి అతడి కళ్లల్లో కళ్లు పెట్టి మాట్లాడినట్లు, ''సారీ, ఖుల్లార్‌. నా వంటి దృఢకాయుడు నాకు దీటైన వాడి మీద ప్రతాపం చూపించాలి కానీ, నీ లాటి అల్పప్రాణి మీద కాదు. పోనీ చూపిద్దామనుకున్నా ఒక చేయి వెనక్కి కట్టేసుకుని అప్పుడు తలపడాలి కానీ... ఇలా రెండు చేతులతోటీ ..అబ్బే, చాలా అన్యాయం, అక్రమం'' అంటూ చాలా విచారిస్తున్నట్లు, ముఖం వికారంగా పెట్టి, బఫూన్‌లా హావభావాలు ప్రకటించాడు.

కళ్లక్కట్టినట్లు ఆయన చూపిన అతిశయోక్తి, ఆ పరిస్థితిలో ఉన్న అసంబద్ధత క్లాసు పిల్లలలో నవ్వు పుట్టించింది. బావుండదేమో అన్నట్లు సంకోచంతో ప్రారంభమయిన నవ్వుల తుప్పర క్రమంగా బలపడింది. అప్పటిదాకా టెన్షన్‌ నిండిన ఆ వాతావరణం నుండి సేద దీరడానికా అన్నట్లు, విద్యార్థులు హాయిగా చిరునవ్వులు చిందించారు. ఒకసారి నవ్వులు మొదలయ్యాక దానంతట అదే వేగం పుంజుకుంది. తెరలు తెరలుగా, అలలు అలలుగా సాగి ఏం చేయాలో పాలుపోక నిలబడిన ఖుల్లార్‌ను కూడా ఆ వెల్లువ తనలోకి తీసుకుంది. అతనూ పగలబడి నవ్వసాగాడు. 

హమ్మయ్య అనుకున్నాడు మేష్టారు. రాత్రి రెస్టారెంట్లో చూసిన గాయకుడు వేరే అవతారం ఎత్తి ప్రేక్షకులను ఎలా స్పందింపచేసాడో చూసాక, తన సమస్య తీరడానికి అదే మార్గమని తను వేసిన అంచనా తప్పు కానందుకు సంతోషించాడు. ఎన్నో ఏళ్లుగా చేస్తున్న ఉపాధ్యాయవృత్తి నేర్పిన టైమింగ్‌ సైన్స్‌తో క్రమంగా ముఖకవళికలు మారుస్తూ హాస్యగాడి పాత్ర నుండి గౌరవనీయుడైన ఉపాధ్యాయుడి పాత్రలోకి అవలీలగా మారిపోయాడు. ఆ పైన నవ్వులకు గురయినది, ఆయన వెనుక నిలబడివున్న ఖుల్లార్‌ మాత్రమే.

వేడెక్కిన వాతావరణాన్ని నవ్వుల జల్లు పూర్తిగా చల్లబరిచేవరకూ ఆగేడు ఉడుం మేష్టారు. చల్లబడుతూనే చేయెత్తి నిశ్శబ్దమన్నట్టు సూచించాడు. క్రమంగా గది నిశ్శబ్దమై పోయింది. తనకు పరిచితమైన ప్రాంతంపై ఆధిపత్యం తిరిగి వచ్చేసింది మేష్టారికి. ఖుల్లార్‌ కేసి తిరిగి, ''నీ సీటు కెళ్లి కూచో'' అన్నాడు సాధికారంగా. అతను ఒక్కసారి ఆయన కేసి చూసి తల దించుకుని తన చోట్లోకి వెళ్లి కూచున్నాడు.

మేష్టారు వెనక్కి తిరిగాడు. కళ్లు తిరిగినట్లనిపించింది. 'బ్లడ్‌ ప్రెషరా? వృద్ధాప్యమా? ఓ సారి డాక్టరు దగ్గరికెళ్లాలి' ప్రిన్సిపాల్‌ గారి మొహం నిర్వికారంగా ఉన్నట్టనిపించినా ఆయన కళ్లల్లో ఒకరకమైన ఆసక్తి కనబడ్డట్టయింది. 

ఖుల్లార్‌ తండ్రి మాత్రం మొహం చిట్లించుకుని ఉన్నాడు. ఇప్పటిదాకా జరిగినదాన్ని ఎలా అన్వయించుకోవాలో తెలియటం లేదాయనకు. 

ఇప్పుడు మాట్లాడే వంతు ప్రిన్సిపాల్‌ గారిదయింది. ''వెల్‌, దట్సిట్‌! సార్‌, మనం వెళ్దామా?'' అంటూ లేచారు. మేష్టారి కేసి చూసి తలపంకించి, ప్రిన్సిపాల్‌ గారు బయటకు నడవగా, ఆయన వెనక్కాలే ఖుల్లార్‌ తండ్రి సణుక్కుంటూ వెళ్లాడు.

''విజయం నాదే, నా పంతం నెగ్గించుకున్నాను'' అంటూ ఘోషించింది ఉడుం మేష్టారి అంతరంగం. క్లాసు రూము కేసి తిరిగి చిరునవ్వు నవ్వేటంతలో ఆయనకు మళ్లీ కళ్లు తిరిగినట్లనిపించింది. దీనికి మాత్రం బ్లడ్‌ ప్రెషర్‌ కారణం కాదని ఆయనకు అనిపించింది. ఖుల్లార్‌ తన సీటుకు తిరిగి వెళుతూ ఆయన కేసి చూసిన చూపే దానికి కారణమని కూడా తెలియవచ్చింది. 

దాన్ని వెంటనే గుర్తించకపోయినా, తరువాత మనస్సులో అది ముద్ర వేసుకుందని ఆయన గ్రహించేడు. ఆయనకు ఆందోళన కలిగించిన విషయమేమిటంటే - ఖుల్లార్‌ చూపులో కనబడినది - కోపం కాదు, అసహ్యం కాదు, భయం కాదు, అపనమ్మకం కాదు. అతని చూపులో స్పష్టంగా, కొట్టవచ్చినట్టు కనబడ్డ భావం - జాలి!

(జగ్‌ సూర్య రాసిన ''ది బేడ్జర్‌'' కథకు స్వేచ్ఛానువాదం - ఎమ్బీయస్‌ ప్ర్రసాద్‌)

[email protected]

(విపుల ఫిబ్రవరి 1999లో ప్రచురితం)

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?