Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ కథలు - ఓ పోలీసు ప్రేమ

పార్క్‌కాలనీలో డ్యూటీ పడ్డప్పుడు దాని ప్రశాంతతకు బీటు కానిస్టేబుల్‌ ప్లిమర్‌ ఎంతో సంతోషించేడు. అంతకుముందు పనిచేసిన వైట్‌చాపెల్‌ ఏరియాలో తాగుబోతుల్ని ఈడ్చుకెళ్లడం వలన అతని చేతులు లాగిలాగి ఉన్నాయి. వేన్‌ కెక్కడానికి ఇచ్చగించని మందుభాగ్యులు కాళ్లూ, చేతులూ తెగ విదిలించడం వలన ఈ మందభాగ్యుడికి అనేక గాయాలు తగిలేవి. ఇవి చాలవన్నట్లు పెళ్లాన్ని చంపడానికి కిరాయి మనుషుల్ని తెచ్చుకున్న ఓ పతిదేవుడు తన ప్రయత్నానికి ప్లిమర్‌ అడ్డు తగలడంతో కిరాయి ఊరికే పోకుండా ఆ ముగ్గుర్ని అతని మీదే ప్రయోగించాడు. దాంతో ఆసుపత్రికి వెళ్లడానికి ముందే అంతంతమాత్రంగా ఉన్న ప్లిమర్‌ అందం ఆసుపత్రి బయటకు వచ్చేసరికి అంతమాత్రంగా కూడా మిగల్లేదు. చెట్టువేరులా వంకర తిరగపోయిన ముక్కు అనాకారానికి కలికితురాయి అయింది.

అందువల్ల  డ్యూటీ మార్చి ఈ కాలనీలోకి వేసినప్పుడు ప్లిమర్‌ 'హమ్మయ్య' అనుకొన్నాడు. ఇక్కడ పెద్దపనేమీ లేదు. ఒక పావుమైలు దూరంపాటు అటూ, ఇటూ భారీగా అడుగులు వేసుకుంటూ గస్తీ తిరగడం అంతే.

ఆ మాటకొస్తే ఈ కాలనీకి గస్తీయే అక్కర్లేదు. ఆ ఊళ్లో దొంగలున్నారు కానీ వాళ్లు ఆ కాలనీలో ఉండరు. అక్కడున్న వాళ్లందరూ రచయితలు, సంగీతకారులు, పాత్రికేయులు, నటులు, కళాకారులు వగైరా కళాజీవులు, వాళ్లు నేరాలు చేయరని కాదు, కానీ వాళ్లు చితగ్గొట్టేది పియానోలు మాత్రమే, దొంగిలించేవి అయిడియాలు మాత్రమే. ఖూనీ చేసేది సంగీతాన్ని మాత్రమే. అందువల్ల ప్రమోషన్‌  కావాలనుకొన్న పోలీసువాడెవడూ యీ డ్యూటీ వేయించుకోకూడదు.

డ్యూటీలో చేరిన రెండ్రోజులకే ప్లిమర్‌కి ఈ విషయం అర్థమయింది. ఉప్పూపత్రీ పుట్టే ఏ దొంగాడూ రచయితల ఇంట్లో జొరబడడు. అందుచేత ప్రమోషన్‌ ఎలాగూ లేదు కాబట్టి ఇక్కడుండేకాలం ఆటవిడుపుగా అనుకొంటే బాగుంటుందనుకొని సరిపెట్టుకున్నాడు ప్లిమర్‌. ఆ ఆటవిడుపుకూడా బోరుకొట్టే సమయానికి అదృష్టవశాత్తూ ప్రేమలో పడ్డాడు. 

xxxxxxxxxxxxxx

ఆవేళ మధ్యాహ్నం ప్లిమర్‌ గస్తీ తిరుగుతుండగా ఒక విజిల్‌, దానితో బాటు 'హేయ్‌' కూడా వినపడ్డాయి. ప్లిమర్‌ తలెత్తి చూశాడు. ఓ బిల్డింగ్‌ రెండో ఫ్లోర్‌ కిచెన్‌ బాల్కనీలో ఓ పనిపిల్ల కనబడింది. ఆమెను కళ్లతో నింపాదిగా ఆరగిస్తుండగానే ఫ్లిమర్‌కి తనలో కలుగుతున్న పులకింతలు తెలిసివచ్చాయి. ఆ అమ్మాయి అందంగా ఉందని నేననను. మీరు, నేనూ ఆమె కోసం పడి ఛస్తామని కూడా అనను, ప్లిమర్‌కి ఆ అమ్మాయి నచ్చిందని మాత్రం చెప్పి ఊరుకుంటాను.

''ఎస్‌, మిస్‌?'' అన్నాడు ప్లిమర్‌.

''టైమెంతయింది? గడియారాలన్నీ ఆగిచచ్చాయి''

''టైమా?'' అంటూ ప్లిమర్‌ గడియారం చూసుకొని ''నాలుగు కొట్టడానికి సరిగ్గా పది నిముషాలుంది'' అన్నాడు.

''థేంక్సండి''

''దాన్దేముంది''

ఆ అమ్మాయి మాట్లాడే మూడ్‌లో ఉంది. మధ్యాహ్నం భోజనాలయిపోయేయి. రాత్రి వాటికి ఇంకా టైముంది. బయటకు వచ్చి కాస్త ఊపిరి తీసుకొనే సమయం ఇదే. బాల్కనీ గోడమీద నుంచి వంగి ఓ చిరునవ్వు పారేసింది.

''ఎవరికైనా టైము తెలుసుకోవాలంటే పోలీసోళ్లని అడగాలి. అవునూ, ఈ వీధిలో ఎన్నాళ్లనుంచి డ్యూటీ చేస్తున్నావు?'' అని అడిగింది.

''రెండు వారాలయి వుంటుంది''

''నేనొచ్చి మూడురోజులయింది'' అందామె అడక్కుండానే.

''ఇక్కడ మీకు బాగుందా?''

''ఏదో, ఫర్వాలేదు. పాలబ్బాయి మంచోడు''

ప్లిమర్‌ మాట్లాడలేదు. పాలవాడిని తిట్టుకునే సన్నాహంలో ఉన్నాడతను. వాడు తనకు బాగా తెలుసు. ఎర్రగా, బుర్రగా వుండి నవ్వు మొఖం ఒకటి తగిలించుకొని అందగాడిగా చలామణీ అయిపోతూ, తనలాటి అందహీనులకు లోకంలో గడ్డు పరిస్థితులు కల్పించే కిల్లాడీల్లో వాడొకడు. వాడు తెలియకపోవడమేం?

''అతను భలే తమాషాగా మాట్లాడతాడు'' అంటోంది పిల్ల.

అది తెలుసు. వాడు చమత్కారంగా మాట్లాడడం తనూ విన్నాడు. మాట్లాడి, ఆడపిల్లలను ఆకర్షించబడమూ కన్నాడు. మాటకారులంటే ఆడవాళ్లు పడిచావడం ప్లిమర్‌ను మండించే విషయాల్లో ఒకటి.

''అతను... అతనేమో నాకు బుజ్జిపాప అని పేరు పెట్టాడు'' అందా అమ్మాయి ఇకిలిస్తూ.

ప్లిమర్‌ ఏ భావం వ్యక్తపరచకుండా ''మీరేమీ అనుకోకపోతే నాకు డ్యూటీ ఉంది.'' అంటూ వచ్చేశాడు.

ఏపుగా ఎదిగిన అమ్మాయిని పట్టుకొని బుజ్జిపాప అని పిలుస్తాడు వాడు! అయినా ఆ నేరం మీద వాడిని అరెస్టు చేయడానికి లేదు. ఏం లోకం! ఎందుకొచ్చిన చట్టాలు! నీలం యూనిఫాం వేసుకొన్న అగ్నిపర్వతంలా ప్లిమర్‌ అటూ, ఇటూ తిరగసాగేడు.

పైన ఉదహరించిన సమావేశం లగాయితు ప్రపంచమంతా ఒకే ఒక్క పాలవాడి రూపంలో ఘనీభవించినట్టు అనుభూతి కలసాగింది ప్లిమర్‌కి. ఎటువైపు వెళ్లినా పాలవాడే ఎదురయినట్టు తోచింది. వీధిలో తన మానాన తను పోదామా అంటే వెనక్కాల నుంచి బ్రూక్స్‌గాడు - అదేట వాడి దిక్కుమాలిన పేరు! - పాల క్యాన్లు గలగలలాడించుకుంటూ, రాజు గారు స్వయంగా రథం తోలుకొచ్చినంత హడావుడి చేస్తూ తగలడతాడు. తిరిగొచ్చాక చూద్దామా అంటే ఆపాటికి రోమియోలా బాల్కనీలో ఉన్న పనిమనిషి జూలియట్లతో యుగళగీతాలు సాధన చేస్తూంటాడు.

'పొద్దున్న  అయిదు గంటల తర్వాత పాలవాళ్లు రోడ్లమీద కనబడరు' అనే లోక సిద్ధాంతానికి విరుద్ధంగా ఇదంతా జరుగుతోందని కూడా ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. విధి తన పట్ల ఎంత అన్యాయానికి ఒడిగట్టిందో తలచుకొని ప్లిమర్‌ దుఃఖించాడు. హృదయానికి సంబంధించిన వ్యవహారాల్లో వీరులతోనో, ధీరులతోనో తలపడటానికి ఎవరైనా సిద్ధపడతారు. ప్రత్యర్థిగా పోస్టుమేన్‌ ఉన్నా సరిపెట్టుకోవచ్చు. కానీ పోయిపోయి ఒక పాలవాడు పోలీసువాడికి ప్రత్యర్థా? ఘోరం. పచారీ దుకాణంలో పొట్లాలు కట్టేవాళ్లూ, పాలవాళ్లూ పోటీపడితే అర్థం ఉంది కానీ మరీ ఇంత ఇదిగానా?

కానీ ప్రకృతి నియమాలకు విరుద్ధంగా, ఈ బ్రూక్స్‌గాడు ఇక్కడ బిల్డింగులోని ఆడపిల్లల మధ్య గ్రంథసాంగుడిలా వెలుగొందేస్తున్నాడు. వాడు 'పాలూ...!' అని అరవగానే బాల్కనీల్లో కళ్లు మెరుస్తున్నాయి. వాడి జోకులకి మొహాలు ఇకిలిస్తున్నాయి. ఆ మెరిసే, ఇకిలించే సరంజామా యజమానురాళ్లల్లో ఎలెన్‌ (బ్రూక్స్‌ పరిభాషలో 'బుజ్జిపాప') ఒకత్తి.

xxxxxxxxxxxxxxxxxxx

వాళ్లిద్దరూ కలుస్తున్నారు, కలిసి తిరుగుతున్నారు. ఈ కఠోర సత్యం ప్లిమర్‌కి తెలిసినది ఎలెన్‌ ద్వారానే. ఓ రోజు అతను గస్తీ తిరుగుతూ పోస్టు బాక్స్‌ వద్దకు వచ్చేసరికి ఎలెన్‌ కూడా చేతిలో ఓ ఉత్తరంతో అక్కడికి చేరింది. ఆమెను చూడగానే ప్లిమర్‌కు వణుకు పుట్టుకొచ్చింది. అది కమ్ముకోడానికి ఉషారుగా ఉండాల్సి వచ్చింది. ''అలో, అలో ఏంటి సంగతి? ప్రేమలేఖలు పోస్టు చేస్తున్నావా?'' అని పలకరించేడు.

ఎలెన్‌కు స్వతహాగా ఉండే హుషారు ఎక్కడికి పోతుంది? ''నన్నేనా పలకరించింది? ఈ ఉత్తరం ఏటో తెలుసా? పోలీసు కమిషనర్‌ గార్కి. నువ్వెందుకూ పనికిరావని రాశా'' అంది.

''అయితే ఇలా యివ్వు. ఆయనా, నేనూ కలిసి డిన్నర్‌ చేయబోతున్నాం. నేనే స్వయంగా ఇచ్చేస్తాలే'' అంటూ ఉత్తరం లాక్కున్నాడు.

ఆడపిల్లలతో సరసాలాడేవాడిగా ప్లిమర్‌ని తయారు చేద్దామని సృష్టికర్త అనుకోలేదు. అందువల్ల ప్లిమర్‌ ఎలెన్‌ చేతిలోంచి ఉత్తరం లాక్కుని అడ్రసు చూడడం అనేది అతనికి కొంటె చేష్టగా అనిపించినా ఆమెకు మాత్రం కోపిష్టికోతి చేసే చేష్టగా అనిపించింది. ఆ ఉత్తరం మీద బ్రూక్స్‌ అడ్రసు ఉంది. సరసాలకు అంతటితో సరి. అహం దెబ్బతిని ఆ అమ్మాయి ముఖమూ, అసూయ రగిలి అతని ముఖమూ  వెరశి ఇద్దరు ముఖాలూ జమిలిగా మాడాయి.

ఎలెన్‌ మామూలుగా మంచి అమ్మాయే కానీ కళాకళలున్నాయి. కవరుమీద అడ్రసు ప్లిమర్‌ పైకి చదవడంతో ఆమెకు కోపం తన్నుకొచ్చింది. అందువల్ల మామూలుగా కనబరిచే మర్యాదా గట్రా కాస్త చెప్పుకోదగ్గ మోతాదులోనే అడుగంటిపోయిందని చెప్పక తప్పదు.

''ఆ బ్రూక్సే! అయితే ఏమిటంట? తనకు నచ్చినోడికి ఓ ఉత్తరం ముక్క రాసుకొనే హక్కు ఈ దేశంలో ఆడపిల్లలకు లేదా? ఉత్తరానికి పర్మిషన్‌ తీసుకోవాలా? అదీనూ, అడ్డమైన...'' చావుదెబ్బ కొట్టడానికి కాస్త ఆగి, సర్వశక్తులూ కూడదీసుకోవలసి వచ్చింది. '' ...ముక్కు చితికి, దెయ్యమంత పాదాలూ, కందగడ్డ ముఖమూ ఏసుకు తిరిగే పెతీ పోలీసోడి దగ్గర అనుమతి తీసుకోవాలా?''

ప్లిమర్‌ కోసం వెలిసిపోయి మనస్సంతా దిగులు కమ్మేసింది. ఆమె అన్నది నూటికి నూరుపాళ్లు నిజం. తన గురించి సరిగ్గా వర్ణించి నందుకు మెచ్చుకోవాలి. తననెప్పుడైనా తప్పిపోతే సరిగ్గా అలాగే ప్రకటన ఇవ్వాలి. 'తప్పిపోయినాడు - అందవికారమైన భారీ మనిషి, చితికిన ముక్కు, కందగడ్డ ముఖం, పాదాలు దెయ్యాలంత!' ఇలాగ ఇవ్వడానికి మొహమాటపడితే తనిక ఎప్పటికీ దొరకడు.

''నీకేటి కష్టం? నేను అతనితో కలిసి షికారు కొట్టడం నీకు అసూయగా ఉందా?'' అని మొదలెట్టింది ఎలెన్‌.

ప్లిమర్‌ని ఉడికిద్దామనే 'అసూయ' మాట ఎత్తింది ఎలెన్‌. ఎలెన్‌కి పోట్లాడడం మహాఇష్టం. ఈ సందర్భంలో జగడం ఎక్కువసేపు కొనసాగే సావకాశం కనబడక ప్లిమర్‌కి ఓ అవకాశం ఇచ్చి చూసింది. 'అసూయా, గాడిదగుడ్డా, మొహం చూడు...'' అంటూ అతను మొదలెడితే తను కాస్సేపు హాయిగా దెబ్బలాడవచ్చు. అడపాదడపా ఇలా దెబ్బలాడుతూంటే మాటకు మాట అప్పగించే నైపుణ్యం అబ్బుతుంది, రక్తప్రసారం బాగా జరుగుతుంది, అన్నిటికన్నా ముఖ్యం ఇంట్లో పని ఎగ్గొట్టి బయట కాస్సేపు ఉండడానికి సాకు దొరుకుతుంది.

కానీ ఆమె ఎదురుచూడని విధంగా ప్లిమర్‌ ''అవును, అసూయగానే ఉంది'' అనేశాడు.

కత్తియుద్ధం కొత్తగా నేర్చుకొనేవాడు గురీ, బరీ లేకుండా కత్తిదూసి కాకలుతీరిన యోధుడిని పొడిచేసినట్లు అనిపించింది ఎలెన్‌కి. డైరక్ట్‌గా తిట్టినా, వెటకరించినా, లేక గంభీరంగా తలూపినా ఆమె ఇంత తత్తరపడి వుండేదికాదు. వాటన్నిటికీ సిద్ధపడి వుంది కాబట్టి ఈ సమాధానానికి ఎలా ప్రతిస్పందించాలో తెలియక, మాట్లాడకుండా కళ్లెత్తి ప్లిమర్‌కేసి చూసింది. మరీ అంత అందవికారంగా కనబడలేదు. అలా చూస్తుండగానే పోలీస్‌ ఠీవితో అలా నడుచుకుంటూ వెళ్లిపోయాడు - సాధారణ మానవుల వ్యక్తిగత వ్యవహారాల్లో ఆసక్తి చూపని పోలీసువాడిలా.

ఆలోచిస్తూనే ఎలెన్‌ ఉత్తరం పోస్టుడబ్బాలో వేసింది. ఆలోచిస్తూనే ఇంటికెళ్లింది. ఆలోచిస్తూనే వెనక్కి తిరిగి చూసింది. ప్లిమర్‌ కనుచూపు మేరలో ఎక్కడా లేడు.

xxxxxxxxxxxxxxxxxxxx

ప్రేమ వ్యవహారాల్లో దెబ్బతిన్నవాటికి చేతినిండా పనివుంటే మనస్సును మరలించుకోవచ్చు. కానీ పార్క్‌ కాలనీలో తనకు గిరాకీ తగిలే అవకాశమే లేదు. అదే వైట్‌ చాపెల్‌ ఏరియాలో అయితే... అక్కడున్నంత కాలం ఆ డ్యూటీని తిట్టుకుంటూనే వున్నట్టు గుర్తున్నా 'ఆ రోజులు మళ్లీ తిరిగొస్తే ఎంత బాగుండును' అనుకున్నాడు. తన ముక్కు చితక్కొట్టిన వాళ్లు కనబడితే వాటేసుకో బుద్ధేస్తోంది.

ఈ ఏరియాలో పనెప్పుడు పెరుగుతుంది? ఒక్క హత్యా జరుగదు. వీళ్లు దోమల్నీ, ఈగల్నీ కూడా చంపుతున్నారో లేదో? చంపడం లేదేమో! వాటి మీద ప్రాక్టీసు చేసినా ఈ పాటికి బ్రూక్స్‌ గాణ్ని చంపేసి వుండేవారు.

'హు' అని నిట్టూర్చి పేవ్‌మెంట్‌ని ఓ తన్ను తన్నాడు. అంతలో రెండో అంతస్తు బాల్కనీ లోంచి ఒకావిడ ''ఇదిగో పోలీసాయనా, ఇలారా - వెంటనే రావాలి'' అంటూ కేకవేసింది.

హమ్మయ్య! పని దొరికింది. హత్యా? అయ్యుండదు. శవం కళ్లబడితే ఆ విషయం కడుపులో దాచుకునే మనిషిలా లేదావిడ. మరి? తాగుబోతు భర్తా? సరే. ఎవడితో ఒకడితో సరిపెట్టుకోవాలి.

తీరా చూస్తే ''మా వంట మనిషి దొంగతనం చేస్తూ పట్టుబడింది'' అందావిడ.

దొంగను పట్టుకోవడం ఆవిడకి ఉత్సాహం కలిగించింది. కాని ప్లిమర్‌కు మాత్రం ఈ వార్త నిరుత్సాహం కలిగించింది. ఇంతా చేసి దొంగతనమా? అదీ ఆడదొంగ! బాంబులు విసిరే గూండాలతో పోరాడిన వాడికి ఇటువంటి చిల్లర నేరాలు చూస్తే గౌరవం ఏముంటుంది? అయినా డ్యూటీ డ్యూటీయే. వివరాలు అడిగేడు.

''దాన్ని గదిలో పెట్టి తాళం వేసేను. నా బ్రూచ్‌ కొట్టేస్తుంటే చూశా. క్రితంలో డబ్బు కూడా అనేకసార్లు పోయింది. సోదా చేసి చూస్తే...''

''సారీ మేడమ్‌, ఆడవాళ్లను ఆడవాళ్లే సోదా చేయాలి. స్టేషన్‌కి వెళ్లాల్సి వుంటుంది. ఆడ పోలీసుల కోసం''

''కనీసం పెట్టయినా వెతకచ్చుగా''

అంతలో ఆవిడ పిరికి మొగుడు నోరు పెగిల్చాడు. ''ఇదిగో జేన్‌, ఎలెన్‌ విషయంలో నువ్వు పొరబడుతున్నావేమో! చూడండి సార్‌, విషయం ఏమిటంటే మా ఇంట్లో డబ్బు విషయాలు మా ఆవిడే చూస్తుంటుంది. ఒక్కోప్పుడు మతిమరుపు కొద్దీ నేనే...''

''మీరా? మీరు నా డబ్బు కొట్టేస్తున్నారా?''

''మాట వినిపించుకో, జేన్‌ ఒక వేళ మతిమ...''

''ఇలా ఎన్నిసార్లు జరిగింది?''

మనిషి జంకేడు. అంతరాత్మ ప్రబోధం వినబడడం మానేసింది. ''అబ్బే మరీ ఎక్కువసార్లు కాదు''

''అదే, ఎన్నిసార్లని అడుగుతున్నాను. ఒకసారా, రెండుసార్లా? అంతకంటే ఎక్కువా?''

ప్రబోధం మానేసి అంతరాత్మ బబ్బుంది. పిరికి మొగుడు జావకారిపోయాడు. ''భలేదానివే. ఎన్నిసార్లోనా!? ఒక్కసా'రే'్ల!''

''మీరు చేయాల్సిన పనేనా అది? సర్లెండి. అది తర్వాత తేల్చుకుందాం. మీరా విషయం బయటపెట్టినంత మాత్రాన ఎలెన్‌ దొంగ కాకుండా పోదు. నా దగ్గర అరడజను సార్లు డబ్బు పోయింది. పైగా బ్రూచ్‌ గొడవ ఎలాగూ వుంది''

ప్లిమర్‌ గది తలుపుతీసి చూసేసరికి ఎలెన్‌ చక్కగా అలంకరించుకుని ఎక్కడికో వెళుతున్నట్టు కూచునుంది. చేతిలో బ్రూచ్‌ వుంది. ఇంటావిడ ఓ అరుపు అరిచింది. ''నా బ్రూచ్‌ ఏదే దొంగ పీనుగా''

''అరువు తీసుకున్నా...''

''మరి డబ్బు సంగతో? అది కూడా అప్పుచ్చుకున్నావా?''

''నాకు డబ్బు సంగతేమి తెలీదు''

''నువ్వలా చెప్తావూ? ఇదిగో పోలీసాయనా, స్టేషన్‌కి తీసుకెళ్లి నాలుగు తగిలించు''

xxxxxxxxxxxxxx

కొద్దిసేపట్లో రోడ్డుమీద ప్లిమర్‌ కర్తవ్యనిర్వహణలో భాగంగా ఎలెన్‌ను స్టేషన్‌కు నడిపించుకుపోతున్నాడు. సందు చివర బ్రూక్స్‌ పూలరంగడిలా వేచి వున్నాడు. మూడు గంటలకు వస్తానన్న ఎలెన్‌ మూడుంపావైనా కనబడకపోతే చికాకు పడుతున్నాడు. లోకంలో ఆడపిల్లలకు కరువొచ్చి పడలేదనీ, ఎలెన్‌ ఒక్కదాని ముఖం మీద మాత్రమే పొద్దుపొడవలేదనీ గుర్తు చేసుకొంటున్నాడు.

ఇంతలోనే ఎలెన్‌ కంటబడింది. తనను వెయిట్‌ చేయమని చెప్పి పోలీసువాడితో షికార్లు కొడుతోందని కోపం తెచ్చుకోబోయేంతలో పోలీసువాడి బెట్టు అతని కంటబడింది. అంతే అతను డ్యూటీలో వున్నాడన్నమాట. ఎలెన్‌ ముఖం కూడా కవాతు చేసే వాళ్లతో కత్తు కలుపుతున్నట్టు లేదు.

విషయం తట్టగానే అతని గుండె ఆగింది. అంతలోనే ఊపందుకొని దడదడదడ కొట్టుకుంది.

జీవితం పెట్టిన మొట్టమొదటి విషమ పరీక్షలో బ్రూక్స్‌ పెద్దగా మార్కులు తెచ్చుకోలేదనే చెప్పాలి. అంతా అయిపోయిన తర్వాత సంఘటన నెమరు వేసుకొనేటప్పుడు ఆ మాట అతనే ఒప్పుకున్నాడు. ఒప్పుకొంటూనే 'ఆ పరిస్థితుల్లో ఎవరు మాత్రం అంతకంటే ఏం చేయగలరు కనుక?' అని అంతరాత్మను అడిగి చూసాడు. అంతరాత్మ ఇచ్చిన సమాధానం అంతగా రుచించలేదతనికి. కానీ అడగ్గా, అడగ్గా రెండు రోజులకి అంతరాత్మ కూడా అతను చేసినది ఆ పరిస్థితుల్లో సమంజసమైనదే అని చెప్పేసింది. ఆ మూడోరోజు పొద్దున్నకి 'పాలూ...' అని అతను అరిచిన అరుపులో ఆత్మవిశ్వాసం తొణికిస లాడింది. ఆత్మన్యూనతా భావం కలికంలోకి లేకుండా మాయమయింది. 'అవునుమరి తనంతటి పెద్దమనిషి, ఆ ఏరియాలో అందరికీ తెలిసిన వ్యక్తి పోలీసుల చేతికి చిక్కిన అమ్మాయితో మాట్లాడాలని ఎవడు మాత్రం అనుకుంటాడు? అందుకే ఎలెన్‌ తనకు ఎదురయినప్పుడు ఆమె ఎవరో తెలియనట్లుగా దాటుకుని తను వెళ్లిపోయాడు' అని నచ్చచెప్పుకున్నాడు.

అవేళ అతను కాస్త గబగబా నడిచాడు -  వెనకాల ఎవరో చూపుల్తోనే ఓ తాపు తన్నినట్టు అనిపించి.

ప్లిమర్‌ కందగడ్డ ముఖం, కుంకం పూసిన కందగడ్డ ముఖం అయ్యింది. గొంతులో ఏదో అడ్డుపడినట్టయి అది మింగబోయేడు. ఒక్కసారి ఆగేడు. సంగతేమిటన్నట్టు ఎలెన్‌ అతనికేసి చూసింది. నిజానికి ఆ వేళ వాళ్లిద్దరి చూపులూ కలిసినది అదే మొదటిసారి. ప్లిమర్‌కు గొంతులో అడ్డుపడినది సైజులో కాస్త పెరిగింది.

ఆమె చూపులో దెబ్బతిన్న మనిషి చూపుంది. వైట్‌ చాపెల్‌ ఏరియాలో పనిచేసినప్పుడు మొగుడిచే దెబ్బలు తిన్న చాలామంది ఆడవాళ్ల కళ్లల్లో ఆ చూపు చూశాడతను. కొట్టినా, కోసినా ఖాతరు చేయకుండా, ఫిర్యాదు చేయకుండా వుండే ఆ చూపులు అతన్ని కదిలించాయి.

''పారిపో'' అన్నాడు ప్లిమర్‌. ''ఏంటీ'' అంది ఆ పిల్ల అర్థంకాక.

''వెళ్లిపో తప్పించుకుని పారిపో. వెళ్లి అతని దగ్గరికి వెళ్లి అంతా తమాషా అని చెప్పు. స్టేషన్లో నేనేదో చెప్పుకుంటాలే''

ముందు నిర్ఘాంతపోయి, తరువాత అతనికేసి దీర్ఘంగా చూసిందామె. కంట నీళ్లు తిరుగుతుండగా ''బ్రూక్స్‌ ఇక నాకేసి కన్నెత్తికూడా చూడడు. నన్నెరగనట్టే వెళ్లిపోయాడు చూడు'' అని ఏడ్చింది. కాస్సేపయ్యాక ''అతనలాగ చేశాక వెళ్లి ప్రాథేయపడడం అనవసరం. పద, స్టేషన్‌కి పోదాం'' అంది.

కాస్సేపాగి ''అవునూ నువ్వు నిజంగా నన్ను పోనిద్దామనుకొన్నావా ?'' అని అడిగింది.

ప్లిమర్‌ తలూపాడు, ఆమె చూపులు తప్పించుకొంటూ.

''ఎందుకు?'' 

జవాబురాలేదు.

''ఆ పని చేస్తే నిన్నేమనరా''

''ఉద్యోగం పీకేసేవారు'' అన్నాడు ప్లిమర్‌ వివరణ ఏమీ లేకుండా.

''జైలుక్కూడా పంపచ్చుగదూ''

''...వచ్చు'' 

ఆమె నిట్టూర్పు వినబడింది. ''నా గురించి ఎందుకిదంతా సేయడం'' అనే ప్రశ్న వినబడింది కూడా.

''నువ్వు దొంగతనం చేయలేదని అనుకొంటున్నాను కాబట్టి''

''అంతేనా?'' 

''అంతేనా అంటే?''

''అదొక్కటే కారణమా అని''

ఒక్క ఊపుతో అతను ఆమెకేసి తిరిగాడు తిరిగి మొహంలోకి ఉరిమిచూసి ఉరుమున్నరగా చెప్పాడు. ''కాదు. కాదని నీకూ తెలుసు. కానీ నా చేత చెప్పించాలని నీ పంతం. సరే... కానీ, చెప్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కాబట్టి వదిలేస్తానన్నాను. విన్నావుగా? ఇక నన్ను చూసి పొట్టచెక్కలయ్యేలా నవ్వుకో''

''నేను నవ్వడం లేదు''

''నాకు తెలుసు. నీ దృష్టిలో నేనొక వెర్రివాణ్ని''

''కాదు... కాదు''

''నేనంటే నీకు లక్ష్యం లేదు. బ్రూక్స్‌గాడంటే పడిచస్తావు నువ్వు''

''కాదు... కాదు. నేను మారిపోయేను. బహుశా జైలునుంచి వచ్చేసరికి ఇంకా మారిపోతాను''

''జైలా?''

''అవును. లేకపోతే? నా కారణంగా నిన్ను ఇరకాటంలో పెడతాననుకొన్నావా? జైలుకి వెళ్లితీరతాను''

స్టేషన్‌ దగ్గిర పడుతుంటే ఎలెన్‌ అంది. ''నేను జైలు నుంచి బయటకు వచ్చేసరికి పలకరించేందుకు ఎవరైనా వుంటే బాగుంటుంది కదూ!!

ప్లిమర్‌ జవాబిచ్చేడు...''నిన్ను పలకరించడమే కాదు, రాత్రంతా జాగారం చేసి నీ పేరే కలవరిస్తూ వుంటాను. నువ్వు విశాల విశ్వంలోకి రాగానే నీ కంటబడేది ఒక ముక్కు చితికిన, దెయ్యమంత పాదాలున్న కందగడ్డ మొఖం మనిషి...''

ఎలెన్‌ అతని నోరు మూసేసి కౌగలించుకుంది. ''అవునూ, నీక్కావలసిన వాళ్లు నిన్ను ప్రేమగా ఏం పిలుస్తారో కాస్త చెబుదూ?'' అంటూ.

(ఉడ్‌హవుస్‌ 'రొమాన్స్‌ ఆఫ్‌ ఎ పోలీస్‌ కానిస్టేబుల్‌'కు స్వేచ్ఛానువాదం) 

-  ఎమ్బీయస్‌ ప్రసాద్‌,

[email protected]

(ఆంధ్రజ్యోతి వీక్లీ నవంబరు 1996లో ప్రచురితం) 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?