Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ కథ : దాచిన దాగని....

''మేడమ్‌, యిక్కడ కూచోవచ్చా?'' ఇద్దరి గొంతులు ఒకేసారి వినబడడంతో ఆమె తలెత్తి చూసింది. చూస్తూనే పక్కసీటులో పెట్టుకున్న బ్యాగ్‌మీద చేయి వేసింది. పక్కసీటులో ఎవరినో ఒకరిని కూచోనివ్వక తప్పదురా అనుకుంటూండగానే వారిలో ఒకతను ''మిస్‌, కెన్‌ ఐ సిట్‌ హియర్‌?'' అనడం, వెనువెంటనే రెండో అతను ''ఇక్కడ కూచోవచ్చా, అమ్మా'' అనడం జరిగాయి. 

ఆ టీ షర్టు కుర్రాడిని చూస్తే పాతికేళ్లవాడిలా వున్నాడు, 'అమ్మా' అంటూ ముసలిభాష మాట్లాడుతున్నాడేమిటని అందరూ విస్తుపోతూ వుండగానే ఆమె బాగ్‌ తీసి 'కూచోండి' అని సైగ చేసింది. అతను ఆమె పక్క సీటులో కూలబడ్డాడు.

ఎంఎంటియస్‌ రైలు లింగంపల్లిలో బయలుదేరి హైటెక్‌సిటీ స్టేషన్‌కి చేరేసరికి కిటకిటలాడుతూ వుంటుంది. సెకండ్‌ క్లాసు బోగీలో ఎక్కడం అవస్థ అవుతోందని క్రాంతి కుమార్‌ ఫస్ట్‌క్లాసు మంత్లీ పాస్‌ కొన్నాడు అవేళే! ఫస్ట్‌క్లాసు బోగీలో కూడా సీట్లు ఖాళీగా కనబడలేదు. పరికించి చూస్తే విండోసీటులో యీ అందమైన అమ్మాయి, యివతలివైపు ఓ లావాయన, మధ్యనున్న ఖాళీసీటులో లేడీస్‌ హ్యేండ్‌బ్యాగ్‌ కనబడ్డాయి. ఈ అమ్మాయిదే అయివుంటుందని అనుకుని ఓ సారి టక్‌ సర్దుకుని అడిగేటంతలో తనతో బాటే రైలెక్కిన యీ టీ షర్ట్‌ కుర్రాడు అమ్మా, అమ్మా అంటూ సీటు కొట్టేశాడు, ఛ అనుకుంటూ నిప్పులుమిసే చూపులతో అతన్ని దహించేయబోయాడు.

కానీ ఏం లాభం? అతను తనకేసి చూడడమే లేదు. ''ఎక్కడదాకా వెళుతున్నావమ్మా?'' అని ఆ అమ్మాయిని పలకరిస్తున్నాడు. 

అతని రూపంలో, గొంతులో కనబడే యవ్వనానికి, అతని ముసలితరహా మాటకూ పొంతన కుదరక ఆ అమ్మాయి కాస్త తికమకపడుతూ ''లకడీకా పుల్‌, సర్‌'' అంటోంది.

''సర్‌ ఎందుకమ్మా, అంకుల్‌ అను. హాయిగా వుంటుంది.'' అన్నాడితను. 

ఆ అమ్మాయి కాస్త రిలాక్స్‌ అయినట్టుగా చిరునవ్వు చిందించి ''రిక్షావాడి నుంచి, ముష్టివాడి దాకా అందర్నీ అంకుల్‌ అనే అంటున్నారు పిల్లలు.. యీ రోజుల్లో'' అంది. 

దానికితను ఫక్కున నవ్వి ''భలేగా చెప్పావ్‌. అయితే నన్ను సుబ్రహ్మణ్యం అంకుల్‌ అని పిలు.''

ఆ అమ్మాయి యింకా కాస్త రిలాక్స్‌డ్‌గా నవ్వి, అంతలోనే మొహం చిట్లించి ''ఈ అరగంట ప్రయాణంలో మిమ్మల్ని పిలిచే అవసరం ఎందుకొస్తుంది?'' అంది. 

''ఇవాళ అరగంటేననుకో. కానీ రోజూ కలుస్తాంగా... సెకండ్‌ క్లాసులో ప్రయాణం చేయలేక యివాళ్టినుంచి ఫస్ట్‌క్లాసు పాస్‌ కొన్నాను. నేనూ లకడీకా పుల్‌ దాకా వెళ్లాలి..'' 

''జాబా?''

''అవును రిటైరయ్యాక ఖాళీగా వుండలేక...మా ఫ్రెండు ఒకతను ఎకౌంట్స్‌ చూడమంటే.....

రైలు బోరబండలో ఆగి మరింతమంది ఎక్కే హడావుడిలో వాళ్ల మాటలు వినిపించడం మానేశాయి. క్రాంతికుమార్‌ యివతలకి వచ్చి నిలబడాల్సి వచ్చింది. విడిగా వచ్చేడే కానీ ఆ సుబ్రహ్మణ్యం గారి వంక పదేపదే చూశాడు. రిటైరయ్యాడంటే ఏభై అయిదుకి తక్కువుండదు వయసు. కానీ పాతికేళ్లవాడిలా కనబడుతున్నాడు. ఎలా మేన్‌టేన్‌ చేస్తున్నాడో! తనే అనుకుంటే తనకంటె ట్రిమ్‌గా వున్నాడు. తనను చూస్తే నలభైమూడు అంటే ఎవరూ నమ్మరు. ముప్ఫయికి లోపే అనుకుంటారు. రోజూ జిమ్‌కి వెళతాడు. తిండి బాగా తగ్గించేశాడు. ఒకటి రెండు తెల్ల వెంట్రుకలు కనబడగానే డై చేయించడం ప్రారంభించాడు. ఒత్తయిన వుంగరాల జుట్టు, కండలు తిరిగిన దేహం, చక్కటి ముఖకవళికలు - తనను చూడగానే ఏ ఆడపిల్లకయినా నోరూరాల్సిందే! అలాటిది యీ పిల్ల తనను కాదని వాడికి చోటిచ్చింది! ముసలాడు కదా, డేంజర్‌ లేదని లెక్కేసిందన్నమాట!

పెళ్లయిన ఆడది అలా జాగ్రత్త పడితే అర్థం చేసుకోవచ్చు. కానీ పెళ్లి కాని పిల్ల అలా ఆలోచిస్తే ఎలా? షీ షుడ్‌ బి ఎడ్వెంచరస్‌. తనలాటి హీమాన్‌ పక్కన కూచుని థ్రిల్‌ ఫీలవాలి. ఆ ముసలాడితో ముచ్చట్లేమిటి! నాన్సెన్స్‌! రేపెలాగైనా యీ సుబ్రహ్మణ్యంగాడి కంటె ముందే వచ్చేసి ఆ అమ్మాయి పక్కన కూచోవాలి. తనతో ఒక్క పావుగంట మాట్లాడిందంటే చాలు, ఫ్లాట్‌ అయిపోతుంది. ఆ తర్వాత వీడొచ్చి 'అమ్మా, బొమ్మా' అంటూ సీటడిగితే, 'పోరా ముసలితొక్కూ' అంటుంది. 

రైలు లకడీకా పుల్‌ రావడంతో వాళ్లిద్దరూ దిగారు. 'యూ హేవ్‌ గివెన్‌ మీ గుడ్‌ కంపెనీ, గాడ్‌ బ్లెస్‌ యూ, సుభాషిణీ' అంటున్నాడు సుబ్రహ్మణ్యంగాడు దిగుతూ. బోగీ యించుమించు ఖాళీ అయినా క్రాంతికుమార్‌ కసికొద్దీ సుబ్రహ్మణ్యం కూచున్న సీట్లోనే కాస్సేపు కూచున్నాడు. ఆ తర్వాత సుభాషిణి కూచున్న సీట్లో కాస్సేపు కూచుని తృప్తిపడ్డాకనే నాంపల్లి స్టేషన్లో రైలు దిగాడు.

మర్నాడు క్రాంతి అనుకున్నది సాధించాడు. సుబ్రహ్మణ్యం కంటె ముందే పరిగెట్టికెళ్లి ఆమె పక్కన కూచున్నాడు. మాట కలిపాడు. సుభాషిణి కాస్సేపు బాగానే మాట్లాడింది కానీ తను మసాలా జోక్స్‌ వేయగానే అర్థం కానట్టు మొహం పెట్టింది. బ్యాగ్‌ తీసి అర్జంటుగా ఏదో వెతికింది. తర్వాత నిలబడివున్న సుబ్రహ్మణ్యంను పలకరించి ''అంకుల్‌, మీ చేతిలో 'భవాన్స్‌ జర్నల్‌' యిస్తారా, యిప్పుడు చదవటం లేదుగా!'' అంది. 

'చదివేశానమ్మా, నువ్వుంచుకో' అంటూ పుస్తకం యిచ్చేశాడు సుబ్రహ్మణ్యం. లకడీకా పుల్‌ స్టేషన్‌లో దిగాక సుభాషిణి పుస్తకం తిరిగి యిస్తూ వాళ్లిద్దరూ మాటల్లో పడడం చూసి క్రాంతికి మండిపోయింది.

అందుకే అవేళ రాత్రి భార్యతో అన్నాడు - 'ఈ కాలం ఆడపిల్లలు చదువుల్లో ముందు కెళుతున్నారు కానీ, ఎవరు ఎలాటివాడో తెలుసుకునే గ్రహింపు నేర్చుకోవటం లేదు. ముసలాడు పక్కనుంటే ప్రమాదం లేదనుకుంటారు. అసలు డేంజరంతా ముసలాళ్లతోనే.. అమ్మా బొమ్మా అంటూ భుజాలు పిసికేస్తారు...''

భార్య ఓరగా చూసి, ''ఎవరిగురించి బాబూ మీకంత ఆవేదన? కూతురు ఎలాగూ లేదు. ఉన్నవాళ్లిద్దరూ మగవెధవలే! ఇక నా గురించంటారా? నేనెలాగ పోయినా మీకు పట్టదు. కండలు చూసుకోవడానికే ఎక్కడి టైమూ చాలదు..''

క్రాంతి విసుక్కున్నాడు ''.. ఎహె, నువ్వొకత్తివి. నేనేదో సమాజం గురించి మాట్లాడితే నువ్వు నా మీదకు తిప్పేస్తావ్‌ ప్రతీదీ..''

అతని చేతిలోంచి టీవీ రిమోట్‌ లాక్కుని ఛట్టున టీవీ ఆఫ్‌ చేస్తూ ''చూసేది ఎఫ్‌ టీవీ, చెప్పేవి శ్రీరంగనీతులు.. పిల్లలు గమనిస్తారన్న సిగ్గేనా లేదు..'' అంది భార్య విసురుగా.

''సొసైటీ ఎంత అధ్వాన్నమై పోతోందో చూడ్డానికి నేను టీవీ పెడితే.. నువ్వు ఏదో లెక్చర్లు దంచుతున్నావ్‌. మనం చూసినా చూడకపోయినా వాళ్లు వేసే వేషాలు ఎలాగూ వేస్తారు...''

''...కదా! అందువల్ల కుర్రపిల్లలు వాళ్లలో వాళ్లు ఎలా ఏడిస్తే మనకేం, మనం కు'ఱ్ఱ'వేషాలు వేయకుండా వుంటే చాలు అనుకుని వూరుకోండి.'' 

''..నీతో ఏదైనా మాట్లాడ్డం మహా కష్టం సుమా..ఎప్పుడు చూసినా నా మీదకు విరుచుకుపడతావ్‌్‌..కావాలంటే నువ్వూ నాతోబాటు జాగింగ్‌కి రా అంటే వినవ్‌...'' అంటూ కోపంగా లేచి బెడ్‌రూమ్‌లోకి నడిచాడు క్రాంతి.

'ఎందుకూ యింకోణ్ని తగులుకోవాలన్న ఆశేమీ లేదు నాకు..' అంటూ భార్య ఏదో గొణుగుతూనే వుంది వెనక్కాలనుంచి.

*********

మర్నాడు అతను బోగీలోకి ముందే దూరాడు కానీ సుభాషిణి హ్యేండ్‌బ్యాగ్‌ పెట్టి సీటు కాసింది. సుబ్రహ్మణ్యం రాగానే బ్యాగ్‌ తీసి కూచోమంది. క్రాంతి నెత్తురు సలసల కాగిపోయింది. గొడవ పడితే మర్యాదగా వుండదని ఆగిపోయాడు. ఇ”వాళ వాళ్ల కబుర్లలో యీ పక్క సీట్లో కూచునే లంబోదరుడు కూడా మాట కలిపాడు. ''సార్‌, మీరు ఫిఫ్టీ ప్లస్‌ అన్నారు కదా..''

''...సిక్స్‌టీ మైనస్‌ అన్నా ఫర్వాలేదు'' సుబ్రహ్మణ్యం చిరునవ్వుతో అన్నాడు.

''మరి యింత ఫిట్‌నెస్‌ ఎలా మేన్‌టేన్‌ చేస్తున్నారు? వయసు అస్సలు కనబడటం లేదు..'' 

''గోద్రెజ్‌ కంపెనీవాళ్లు కోట్లు గడిస్తూంటే వయసెలా కనబడుతుందండీ బాబూ'' ఫక్కున నవ్వాడు సుబ్రహ్మణ్యం.

''జుట్టుకి రంగేస్తున్నారనే అనుకుందాం. అయినా మొఖంలో ఆ కళ.., ఆ ఎథ్లెటిక్‌ బాడీ..మిమ్మల్ని చూస్తే నాకు సిగ్గేస్తోంది. నేనూ రేపణ్నుంచి వాకింగ్‌కి వెళదామనుకుంటున్నాను..''

సమాధానంగా సుబ్రహ్మణ్యం మితాహారం ఎలా తీసుకోవాలో, ఏ స్థాయిలో ఎక్సర్‌సైజ్‌ చేయాలో చెపుతూంటే అందరూ నోరు తెరిచి ఎడ్మైరింగ్‌గా చూస్తూ వుంటే క్రాంతికి మండిపోయింది. ఆ ప్రస్తావన తెచ్చి సుబ్రహ్మణ్యానికి హీరో వర్షిప్‌ తెచ్చిన లంబోదరుడి మీద పీకలదాకా కోపం వచ్చింది. 'వాకింగ్‌కి వెళ్లి ఒళ్లు తగ్గించరా మహానుభావా, ఇంకో నెల్లాళ్లు యిలాగే వూరిపోయావంటే సీటులో చోటు చాల్లేదంటూ వాడెళ్లి దాని ఒళ్లో కూచుంటాడు. ఇప్పటికే జబ్బలు జబ్బలు తెగ పామేసుకుంటున్నారు.' అని పళ్లు పటపటలాడించాడు.

ఖైరతాబాదు వచ్చేసరికి చాలామంది లేవడంతో సుబ్రహ్మణ్యం వుపన్యాసం ముగిసింది. ముక్తాయింపుగా సుభాషిణి కేసి తిరిగి ''ఇవన్నీ విని వూరుకోవడం కాదు. రేపణ్నుంచి సాయంత్రం ఆఫీసునుండి లకడీకా పుల్‌ దాకా ఆటోలో రావద్దు. ఆఫీసయిపోగానే ఎల్బీ స్టేడియం దగ్గరకు వచ్చేయ్‌. నేనూ అక్కడికి వచ్చేస్తాను. ఇద్దరం కలిసి పబ్లిక్‌ గార్డెన్‌ మీదుగా వాక్‌ చేస్తూ వద్దాం'' అన్నాడు.

సుభాషిణి అతి హుషారుగా ''రేపణ్నుంచి ఎందుకూ, యివాళ్టినుంచే వద్దాం'' అంది. 

క్రాంతికి కళ్లు తిరిగాయి.

*********

ఆ తర్వాతి పదిహేను రోజుల్లో చాలా సార్లు తిరిగాయి. సుభాషిణి, సుబ్రహ్మణ్యం పబ్లిక్‌ గార్డెన్‌లో వేరుశెనక్కాయలు తింటూ కబుర్లు చెపుతూన్నపుడు, రవీంద్రభారతి మెట్లెక్కుతూన్నపుడు, ఆలిండియా రేడియో బయట పాత పుస్తకాల షాపులో పుస్తకాలు ఏరుకుంటూన్నపుడు, అసెంబ్లీ ఎదుట చిలకజోస్యం చెప్పించుకుంటున్నపుడు..! యీ పత్తేదారీ చేయడానికి అతను ఆఫీసునుండి నాంపల్లి మీదుగా లకడీకా పుల్‌కి ఆటోలో రావల్సి వచ్చేది.

ఈ మధ్యలో అతను సుబ్రహ్మణ్యం పరువు తీయడానికి ఓ ప్రయత్నం చేయకపోలేదు. దానికి సుబ్రహ్మణ్యమే ఆజ్యం పోశాడని చెప్పాలి. అవేళ క్రాంతి కుమార్‌ సీటు వద్ద నిలబడినట్లే నిలబడి సుభాషిణిమీద వాలడం మొదలెట్టాడు. సుబ్రహ్మణ్యం లెక్చరిచ్చాడు - 'చూడు మై డియర్‌ యంగ్‌మాన్‌, సీటు లేదన్న కారణంగా మీరు యిలా అవస్థపడి, యింకోళ్లను అవస్థ పెట్టడం భావ్యం కాదు. గట్టిగా పూనుకుంటే మీరు యీ బోగీలో కనీసం అరడజనుమంది యిల్లీగల్‌ పాసింజర్లను లేవగొట్టగలరు.''

క్రాంతికి ఒళ్లు మండింది. ''ఎలా లెమ్మంటామండీ, రైల్వే స్టాఫంటూ ఆ పాస్‌బుక్కులాటివేవో కనబడేట్లా జేబులు కుట్టించుకుని వాళ్లు కూచుంటే..''

''స్టాఫయితే మాత్రం? ఫస్ట్‌క్లాసులో ఫ్రీగా ప్రయాణం చేసేటంత హోదా వుందో లేదో చెక్‌ చేయండి. హోదా లేకపోతే నిర్మొగమాటంగా చెప్పండి, లేచి మీకు సీటు యిమ్మనమని..''

''...అడగడానికి నువ్వెవరంటే?''

''అలా భయపడితే ఎలా? దేశం ఎలా ముందుకు వెళుతుంది? మా తరంవాళ్లం అలా అనుకుంటే మీ తరానికి యీ సౌకర్యాలు అమిరేవా?''

క్రాంతికి ఒళ్లు మండిపోయింది. వెక్కిరించాడు - ''మీదేమైనా గాంధీగారి తరమా?''

సుబ్రహ్మణ్యం చాలా శాంతంగా చెప్పాడు ''ఈ వెక్కిరింత వాళ్లమీద చూపిస్తే సంతోషించేవాణ్ని. వాళ్లని ఏమీ అనలేక యిలా మీదమీద పడకుండా మరింత సంతోషించేవాణ్ని.''

చుట్టూ జనం నవ్వారు. క్రాంతికి తల కొట్టేసినట్టయింది. 

మర్నాడు అతని అదృష్టం కొద్దీ సుబ్రహ్మణ్యం ఎదురుగుండా సీటు దొరికింది. అతని గాలి తీయడానికి అస్త్రం ఒకటి బయటకు తీశాడు. ''మీరు వయసుకు తగ్గట్టుగా హుందాగా వుండకుండా, యీ టీ షర్టులేమిటి, అంకుల్‌'' అని.

సుబ్రహ్మణ్యం తొణకలేదు. ''ఓ ప్రిన్సిపుల్‌ అర్థం చేసుకో బాబూ, నీ వయసులో నువ్వేసుకున్న బట్టలకంటె సోబర్‌గా డ్రస్‌ చేసుకున్నా ఫర్వాలేదు. ఎలాగూ యంగే కాబట్టి! కానీ నా వయసుకి వచ్చేసరికి టీ షర్టులే వేసుకోవాలి. అప్పుడే యంగ్‌గా ఫీలవుతావు. నువ్వూ టీ షర్టు వేసుకుని చూడు. ఎంత హుషారుగా ఫీలవుతావో తెలుస్తుంది.''

క్రాంతి వుడుక్కున్నాడు. ''నేనూ బయట టీ షర్టులేసుకుంటానండి. కానీ ఆఫీసులో మా మేనేజర్‌ ఒప్పుకోడు. మీకైతే ఆ రిస్ట్రిక్షన్స్‌ వున్నట్టు లేవు.''

''..లేవు. ఎవడి తలరాత వాడిది. ప్చ్‌'' అన్నాడు సుబ్రహ్మణ్యం లేని జాలి నటిస్తూ. అందరూ నవ్వారు. 

క్రాంతి బుసకొట్టాడు. ''అయినా మీ ఓల్డ్‌ ఫేషన్‌డ్‌ పేరుకీ, టీ షర్టుకీ పొంతన కుదరదండి.''

సుబ్రహ్మణ్యం చిరునవ్వి నవ్వి వూరుకున్నాడు. 

క్రాంతికి ధైర్యం వచ్చింది. తను గర్వపడే తన పేరు డిక్లేర్‌ చేశాడు. ''నా పేరు క్రాంతి కుమార్‌. ఫరే థర్టీ యియిర్స్‌ యంగ్‌మాన్‌ లైక్‌ మీ, దట్‌ నేమ్‌ యీజ్‌ యాప్ట్‌''

సుబ్రహ్మణ్యం ''మా నాన్నగారి పేరు విక్రాంత్‌ కుమార్‌. ఆయనకు ముప్ఫయ్యవ ఏటా అదే పేరు, డెబ్భయ్యవ ఏటా అదే పేరు. వయసుతో మారిపోలేదు.'' అన్నాడు.

క్రాంతి ఒక్కసారి బిత్తరపోయాడు. ''విక్రాంత్‌ కుమార్‌ కొడుకు పేరు సుబ్రహ్మణ్యమా? యూ మస్ట్‌ బీ జోకింగ్‌!''

''మా తాతగారి పేరులే..స్టేషన్‌ వచ్చింది..''

అవేళ ఎవరూ అడక్కపోయినా అనవసరంగా తన వయసు ముప్ఫయ్యని చెప్పాననిపించింది క్రాంతికి. అలా చెప్పిన రోజున సుభాషిణి తనను కాస్సేపు తేరిపార చూసింది కానీ మరుసటిరోజునుండి పట్టించుకోలేదు. పైగా తను అబద్ధం చెప్పినట్టుగా దాదాపు బయట పడిపోయింది... రేదర్‌ పడిపోయేదే, తను జాగ్రత్త పడివుండకపోతే! 

అవేళ రైలు భరత్‌నగర్‌ వద్ద వుండగా సెల్‌ మోగింది. తన కొలీగ్‌ విశ్వేశ్వరరావు చాలా ఉత్సాహంగా అరుస్తున్నాడు. ''గురూ, మన ప్రమోషన్‌ యిస్యూ జీఎం దగ్గర సాల్వయింది. సీనియారిటీకి వెయిటేజి యిస్తానన్నాడు...''

''..అంటే మనకు ప్రమోషన్‌ ఖాయమంటావా?'' తనూ అరిచాడు. 

''ఖాయమా, ఖాయంన్నరా? మనం వూరుకుంటామా? ఇరవై యేళ్ల సర్వీసు పెట్టుకుని జూనియర్లతో బాటు పోటీ పడడానికి...'' విశ్వేశ్వరరావు కంచుకంఠం బోగీ అంతా మోగుతోంది. తనకు హఠాత్తుగా తట్టింది, యిరవై యేళ్ల సర్వీసున్నవాడికి ముప్ఫయేళ్లంటే ఎవడు నమ్ముతాడు?

''గురూ, రైల్లో వున్నా.. సిగ్నల్‌ రావడం లేదు. మళ్లీ కాల్‌ చేస్తా'' అన్నాడు. సెల్‌ ఆఫ్‌ చేసి బాగ్‌లో పడేసి చుట్టూ చూశాడు. ఎవరూ పట్టించుకున్నట్టు లేదు కానీ, సుబ్రహ్మణ్యంగాడు ఏదో చెప్పిపెట్టినట్టున్నాడు, సుభాషిణి ముసిముసినవ్వులు నవ్వుతోంది. ఈ సుబ్రహ్మణ్యం కిలాడీగాడే అనిపించింది. అనిపించిన మూడో రోజునే కన్‌ఫమ్‌ అయింది.

ఆ రోజున పైన ర్యాక్‌ మీద పెట్టిన తన బ్యాగ్‌లోంచి హెయిర్‌ డైయింగ్‌ సామాను కింద పడింది. ఫారిన్‌ నుంచి వెయ్యి రూపాయిలు పెట్టి తెప్పించాడు తను. తన బ్యాగ్‌ పక్కనే సుబ్రహ్మణ్యం బ్యాగ్‌ వుండడంతో అతని బ్యాగ్‌లోంచి పడిందనుకున్నాడు లంబోదరుడు. తన గజకాయాన్ని కదిల్చి, కిందపడినది తీసి, సుబ్రహ్మణ్యం చేతిలో పెట్టాడు. 'ఫారిన్‌ది కదండీ, అందుకే మీ జుట్టుకి రంగేసినట్టు తెలియదు' అన్నాడు యికిలిస్తూ. 

సుబ్రహ్మణ్యం చిరునవ్వు నవ్వి తన బ్యాగ్‌లో పెట్టేసుకున్నాడు. వెయ్యి రూపాయల సామాను! కళ్లముందు దోపిడీ అయిపోయింది. అతనిది కాదు, నాదంటే ఎవడు నమ్ముతాడు? ముప్ఫయ్యేళ్లని చెప్పుకున్నాడుగా! తన సంగతి ఎలా వున్నా సుబ్రహ్మణ్యం నిజాయితీపరుడు కాదని తేలిపోయింది. టక్కరివేషాలు వేస్తున్నాడు. పాపం సుభాషిణి బుట్టలో పడిపోతుందేమో! ఆ బురూ యీ కబురూ చెప్పి ఆమె చేత స్థలం కొనిపించడమో, యిన్సూరెన్సు చేయించడమో చేస్తాడేమో! సెక్సువల్‌గా కూడా ఎక్స్‌ప్లాయిట్‌ చేస్తాడేమో...శరీరానికే గానీ మనసుకు వయసు లేదంటున్నాడుగా! బాడీ ట్రిమ్‌గా పెట్టుకున్నాడు కాబట్టి కోరికలు వుడిగిపోలేదేమో!

సుభాషిణిని అతని ఆకర్షణలోంచి బయటపడేయాలంటే తనకే సాధ్యం. తనూ టీ షర్టు వేసుకుని వస్తే అతన్ని డౌన్‌ చేసి పడేయవచ్చు. టీ షర్టులో ప్రస్ఫుటంగా కనిపించే తన మజిల్స్‌ చూసి తనవైపే మొగ్గుతుందామె. కానీ టీషర్టు వేసుకోవడం ఎలా - మేనేజర్‌గాడు బతికుండగా?

నెలాఖరులో మేనేజర్‌ సెలవు పెట్టాడు కాబట్టి టీషర్టు వేసుకునే అవకాశం వచ్చింది క్రాంతికి. అవేళ పొద్దుటినుండీ హుషారుగా వున్నాడు కానీ ఎనిమిదో క్లాసు చదివే కొడుకు బుజ్జి తనని జవహర్‌ బాలభవన్‌కి తీసుకెళ్లమనడంతో చప్పబడ్డాడు. 'ఫస్ట్‌క్లాసులో ఎలా వస్తావురా? డబ్భయి రూపాయలు టిక్కెట్టు తెలుసా?' అని కేకలేస్తే భార్య కొట్టి పారేసింది. ''పోనీ మీరివాళ్టికి సెకండ్‌ క్లాసులో వాడితో బాటు వెళ్లండి'' అని. 

కొడుక్కి సెకండ్‌ క్లాసు టిక్కెట్టు కొన్నాడు కానీ వాడితో బాటు సెకండ్‌క్లాసు ఎక్కబుద్ధి కాలేదు. మళ్లీ మేనేజర్‌ సెలవు పెట్టడం ఎన్నాళ్లకో... యీ టీషర్టులో సుభాషిణికి కనబడకపోతే ఎలా? 'ఒరే బుజ్జీ, మా ఫస్ట్‌క్లాసు బోగీ పక్కనే వున్న సెకండ్‌క్లాసు బోగీలో ఎక్కి కూచో. నాంపల్లిలో రైలాగ్గానే నీ దగ్గరకి వచ్చి బాలభవన్‌లో దింపి ఆఫీసు కెళతా'' అన్నాడు. 

''నాకు భయం నాన్నా. నీతో బాటు నేనూ ఫస్ట్‌క్లాసు ఎక్కుతా. నేనెప్పుడూ ఎక్కలేదు.'' అని మారాం చేయబోయాడు కొడుకు. ఏడిశావులే అని సెకండ్‌ క్లాసులో ఎక్కించి తను ఫస్ట్‌క్లాసు ఎక్కేసరికి వెనక్కాలే వున్నాడు కొడుకు. 

'హోరినీ, ఎక్కేశావ్‌! పట్టుకుంటే మూడువందలు ఫైన్‌. ఇక్కడే నించో, స్క్వాడ్‌ వస్తే దిగిపో. నేను లోపలకి వెళ్లి కూచుంటా. నాకు పాస్‌ వుందిగా' అంటూ సుభాషిణి ఎదురుగా సీట్లో కూచున్నాడు. అదృష్టం, ఎప్పుడూ అక్కడ కూచునే ఆయన రాలేదు. 

''ఎవరూ? మీ నెవ్యూనా? లోపలకి రమ్మనలేకపోయారా?'' అడిగాడు లంబోదరుడు.

జవాబు చెప్పకుండా తల యెగరేసి, క్రాంతి సుభాషిణికి ఓ లుక్కిచ్చాడు. పనిలో పనిగా, సుబ్రహ్మణ్యానికి కూడా. సుబ్రహ్మణ్యం టీషర్టు గురించి ఏదో అనే లోపునే ముందురోజు రీడర్స్‌ డైజస్ట్‌లో మెటబాలిజం అండ్‌ ఏజింగ్‌ ప్రాసెస్‌మీద చదివిన ఆర్టికల్‌ గురించి  తను మాట్లాడడం మొదలెట్టాడు. నిజంగా మంచి ఫామ్‌లో వున్నాడేమో, బోగీలో అందరూ అతన్ని చూసి ముగ్ధులైపోయారు. 

ఇంతలో బేగంపేట స్టేషన్‌లో చెకింగ్‌ స్క్వాడ్‌ ఎక్కారు, అదీ ట్రెయిన్‌ కదలబోతూండగా. క్రాంతి కంగారు పడ్డాడు. ''బుజ్జీ దిగేయ్‌'' అని అరిచాడు, అనాలోచితంగా. బుజ్జి ఒక్కసారి దిగేశాడు. కానీ బోగీలో రాడ్‌ వదలలేదు. ట్రెయిన్‌ కదిలింది. బుజ్జి 'నాన్నా నాన్నా' అంటూ వేలాడుతున్నాడు. అందరూ హాహాకారాలు చేశారు. సుబ్రహ్మణ్యం మెరుపువేగంతో గుమ్మం దగ్గరకు చేరాడు. ఓ చేత్తో రాడ్‌ పట్టుకుని ఆ పిల్లవాడి నడుం చుట్టూ చేయి వేశాడు. రైలు వేగం అందుకోవడంతో పిల్లవాడ్‌ రాడ్‌ వదిలేశాడు. సుబ్రహ్మణ్యం కూడా రాడ్‌ వదిలేసి ప్లాట్‌ఫాం మీద పరిగెట్టాడు. పిల్లవాడు అతని చేతిలోనే వున్నాడు. రైలు వెళ్లిపోయింది. పిల్లవాడితో సహా ప్లాట్‌ఫాం మీద కాస్సేపు పరిగెట్టి నిలదొక్కుకున్నాడు సుబ్రహ్మణ్యం. బోగీలోంచి తొంగిచూసినవారందరూ హమ్మయ్య అని వూపిరి పీల్చుకున్నారు. కాస్సేపటికే సుబ్రహ్మణ్యం సెల్‌లోంచి క్రాంతి కుమార్‌ సెల్‌కు కాల్‌ వచ్చింది. చేతుల్లో మొహం పెట్టుకుని రోదిస్తున్న క్రాంతి సెల్‌ ఆన్‌ చేశాడు. ''బేగంపేటకు రా నాన్నా'' అని అరుస్తున్నాడు బుజ్జి. బోగీ అంతా వినబడింది.

*********

మర్నాడు హైటెక్‌సిటీ స్టేషన్‌లో సెకండ్‌ క్లాసు బోగీ ఎక్కిన సుబ్రహ్మణ్యానికి అదే బోగీలో సుభాషిణిని చూడగానే ఆశ్చర్యం కలిగింది. ''అరే మీరేమిటి? ఇక్కడ!?''

''మీరుమాత్రం..''

''నిన్న ఆ కుర్రాడి హడావుడిలో పర్సు ఎక్కడో రైలు కింద పడిపోయింది. నెలాఖరు కదా, జీతాలొచ్చాక ఫస్ట్‌క్లాసు పాస్‌ తీసుకోవచ్చని యివాళ్టికి సెకండ్‌ క్లాసు టిక్కెట్టు తీశాను. లింగంపల్లిలో ఎక్కినా మీకు సీటు దొరకలేదా?''

''నిన్న మీ సాహసం చూసి బోగీలో అందరూ నివ్వెరపోయారు. ఎంత బస్కీలు తీస్తే మాత్రం అరవైయేళ్ల వాడికి యిది సాధ్యమా? అని పందాలు వేసుకున్నారు. 'గజేంద్రమోక్షంలో శ్రీ మహావిష్ణువులా పరిగెట్టినపుడు పర్సు పడిపోయింది కదా, దాన్లో ఐడెంటిటీ కార్డు వుంటుంది. తీసి చూస్తే వయసు తెలిసిపోతుంది' అన్నాడొకాయన. అది మాత్రం నమ్మకమేమిటన్నారు కొందరు. గాంధీ తరమా, ఇందిరా గాంధీ తరమా అని బెట్స్‌ వేసుకుని ఏ విషయం తేల్చడానికి నన్ను పంపారు. ఏం చేస్తాం? హైటెక్‌సిటీ స్టేషన్‌లో దిగి మీ వెనకాలే యీ బోగీ ఎక్కాను.''

సుబ్రహ్మణ్యానికి ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు. అంతలో బోరబండ స్టేషన్‌ వచ్చింది. దిగే జనాలు తోశారు. సుబ్రహ్మణ్యం సుభాషిణిపైకి తూలాడు. ''వెనకనుంచి తోశారు. ఎక్కేందుకూ హడావుడే, దిగేందుకూ హడావుడే..'' అన్నాడు క్షమాపణ చెపుతున్నట్టు.

ఈ లోపునే సుభాషిణి అతని కుడి భుజం గట్టిగా పట్టుకుని తడుముతూ ''గాంధీ తరమే.., రాహుల్‌ గాంధీ తర్వాతి తరం! పాతిక దాటదు'' అంది.

సుబ్రహ్మణ్యం గతుక్కుమన్నాడు. ''..చూసేశారా?'' అన్నాడు కళ్లు దించుకుని. ''అవేళ సీటు కోసం చిన్న ప్రాక్టికల్‌ జోక్‌ వేశాను. తర్వాత అదే కంటిన్యూ చేయాల్సి వచ్చింది..'' 

''ఆగండి, పర్సు యిచ్చేస్తా. ఈ రష్‌లో ఎవరైనా కొట్టేస్తే మీరు నన్ను తిట్టుకుంటారు'' అంటూ పైన పట్టుకున్న రాడ్‌ వదిలేసి బ్యాగ్‌ తెరవబోయింది. అంతలోనే తూలింది. సుభాషిణి యెద సుబ్రహ్మణ్యం ఛాతీపై నిండుగా వాలగా ఆమె అతని చెవిదగ్గర నోరు పెట్టి ''నన్నెవరూ తోయలేదు'' అంది గుసగుసలాడుతున్నట్టు. 

*********

 నెల్లాళ్ల తర్వాత జరిగిన వాళ్ల పెళ్లిలో బుజ్జి చేత బహుమతి యిప్పించడానికి భార్యతో సహా హాజరైన క్రాంతి కుమార్‌ తెల్లజుట్టు చూసి సుబ్రహ్మణ్యం తెల్లబోయాడు - ''ఇదేమిటండీ, మీకు ప్రత్యేకమైన రిటర్న్‌ గిఫ్ట్‌గా యిది యిద్దామనుకుంటే..'' అన్నాడు. అతని చేతిలో అవేళ హక్కుభుక్తం చేసుకున్న ఇంపోర్టెడ్‌ హెయిర్‌ డై వుంది. 

క్రాంతి కుమార్‌ సమాధానం యిచ్చేలోపున అతని భార్య దాన్ని లాక్కుని చేత్తో నలిపి, కింద పడేసి కాలితో తొక్కేసింది. 

(''సాక్షి'' ఫన్‌డేలో 2008 నవంబరులో ప్రచురితం)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?