Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ కథలు : ఇంతకీ నా సంగతేమిటి..?

టీవీ ఛానెలతను యింకా రాలేదు. వచ్చి తనే స్వయంగా కారులో స్టూడియోకి తీసుకెళతానన్నాడు. ''దెయ్యాలున్నాయా? లేదా?'' అన్న టాపిక్‌మీద నాతో ఇంటర్వ్యూ చేయాలన్నాడు. నేనీ మధ్య ఓ పత్రికలో దెయ్యాల కథ ఒకటి రాశాను. అది.. అదిగో, ఆ సురేష్‌ అనే అతను చదివాడట. నచ్చిందట. ఫోన్‌ చేసి మెచ్చుకున్నాడు. టీవీ ప్రొడ్యూసర్‌ కాబట్టి ఆ అంశం మీద మీతో ముఖాముఖీ పెడతానూ అన్నాడు. 

ఈ మధ్య ఓ సినిమాలో నటించడానికి నటీనటులు హడిలి ఛస్తున్నారట - దానికి దెయ్యం పట్టిందంటూ! సినిమాలో పాత్రకు కాదు, సినిమాకే దెయ్యం పట్టిందట. దానిలో వేషాలేసేవారు టపటపా ఎగిరిపోతున్నారట. అది విని హీరోలు  భీరోలై పారిపోతున్నారట. 

ఇవన్నీ చెప్పి 'మీ కథలో దెయ్యాలు లేవని చివర్లో నిరూపించారు కాబట్టి, యిప్పుడు మనం యీ చర్చ పెడితే సమయం, సందర్భం బాగా కుదురుతాయండీ' అన్నాడు. సరే కానీయమన్నాను. 

'వచ్చే మంగళవారం షూటింగు పెట్టుకుందాం. మీరు ఓ ప్రసంగవ్యాసంలా రాసుకురండి దాన్ని పెట్టుకుని ప్రశ్నలు, జవాబులు తయారుచేద్దాం. పబ్లిక్‌ గార్డెన్సు గుమ్మం దగ్గర  నిలబడండి. నేను వచ్చి తీసుకెళతా' అన్నాడు. మరి మిమ్మల్ని గుర్తుపట్టడం ఎలా? అని అడిగాను. 'మా కారు మీద మా టీవీ ఛానెల్‌ స్టిక్కర్‌ అంటించి వుంటుంది కదా' అన్నాడు. 

అతను చెప్పిన సమయం దాటిపోయి పావుగంటయింది. ఏమీ తోచక జేబులోంచి నేను రాసుకుని వచ్చినది మళ్లీ ఓ సారి చదివి చూసుకున్నాను.

**************

'దెయ్యాలున్నాయా? అనే ప్రశ్న మనందరినీ వేధిస్తుంది. ఎవర్నడిగినా 'ఉన్నాయండి, మా వూళ్లో ఒకాయన చూశాడట' అని కథ చెప్తారు తప్ప నేను స్వయంగా కళ్లతో చూశానని అనరు. ఆ కథల్లో బొత్తిగా వైవిధ్యం లేదు. అన్నీ ఒకేలా వుంటాయి. - 'ఒకతను ఊర్నుంచి మరో వూరు వెళుతుంటే ఊరి చివర బావి దగ్గర ఎవరో ఆపి సైకిలెక్కించుకోమన్నాడు, చచ్చేటంత బరువున్నాడు. కాస్సేపు పోయాక చూస్తే హఠాత్తుగా బరువు తగ్గిపోయింది. వెనక్కి తిరిగి చూస్తే మనిషి లేడు. అది దెయ్యమని అర్థమై బాబోయ్‌' అన్నాడితను. 

ఈ కథకు అర్థం లేదు. లెక్కప్రకారం దెయ్యం గాలిలో తేలుతూ హాయిగా వెళ్లగలదు. ఇంకోడి బోడి సైకిలెందుకు ఎక్కాలి?

పోనీ పిల్లల పత్రికలో రాసే కథలు చూడండి. ఎవడో అమాయకుడు కనబడితే వాడు తిండి తెచ్చుకున్న మూట ఎత్తుకు పోయి ఆడుకుంటాయి. వాడు లబోదిబో మంటే 'పోన్లే ఈ చెట్టు తొర్రలో వరహాలున్నాయి తీసుకో' అంటాయి. వరహాలు పోయి కరన్సీ నోట్లు వచ్చాక  యీ రకం దెయ్యాలు పని చేయడం మానేశాయని గుర్తించాలి. నోట్ల కట్ట చెట్టుతొర్రలో పెడితే చెదలు పట్టి పాడై పోతుంది కదా! 

ఇంకోరకం కథలో దెయ్యం 'నేను వెళ్లి ఓ రాజకుమారిని ఆవహిస్తాను. నువ్వు వచ్చి నీ పేరు చెపితే వదిలిపెట్టేస్తాను. నువ్వు రాకుమారిని, అర్ధరాజ్యాన్ని తీసేసుకో అంటాయి.' ఇప్పుడు రాజులూ లేరు, వాళ్లకి రాజ్యాలూ మిగలలేదు. ఇలాటి యిద్దరు కూతుళ్లుండి అల్లుళ్లిద్దరికీ చెరో అర్ధరాజ్యం యిచ్చేస్తూ వుంటే రాజుగారికి ఏం మిగులుతుంది? అందువలన యీ దెయ్యాలు పదవీ విరమణ చేసి వుంటాయి.

కామినీ పిశాచాల కథలలో - అందమైన అమ్మాయి తెల్లచీర కట్టుకుని చింత చెట్టుకింద కూచుంటుంది. దారిన పోయే దానయ్యకి ఎదురుపడి పెళ్లి చేసుకోమంటుంది. పెళ్లయాక కాళ్లు పొయ్యిలో పెట్టి వంట వండుతుంది. ఈ కాలంలో అలా వండుదామంటే పొయ్యిలెక్కడున్నాయి? కట్టెలెక్కడున్నాయి? గాస్‌ స్టవ్‌లో కాళ్లు పెట్టాలంటే స్టూలు వేసుకుని మరీ పెట్టాలి. కష్టం. అందువలన అవీ సెలవు పుచ్చుకుని వుంటాయి.

ఎన్ని కథలు చెప్పినా యీ నాలుగైదు యితివృత్తాల చుట్టూనే తిరుగుతాయి. ఇవన్నీ పాతకాలానికి సరిపోయే సంఘటనలు.  ఉంటే గింటే దెయ్యాలు పాతకాలంలో వుండేవనీ, ప్రస్తుతకాలంలో అవి వుండడానికి ఎంతమాత్రం అవకాశం లేదనీ మనం గ్రహించాలి. 

మరి యిప్పటికీ రాసే కథలు, తీసే సినిమాల సంగతేమిటంటారా?  వాటన్నిటిలో ఊరికి చివర నిర్మానుష్యమైన ప్రాంతంలో ఓ పాత బంగళా వుంటుంది. అంత పెద్ద బంగళాలోనూ పనివాళ్లు వుండరు. మరి అవన్నీ రోజూ ఎవరు తుడిచి పెడతారో తెలియదు. మన నాయకీ నాయకులు వెళ్లేసరికి వర్షం పడుతూ వుండాలి. గాలి హోరున వీస్తూ నేపథ్యసంగీతం అందించాలి. పైగా వీళ్లు అడుగు పెట్టిన ఓ పది నిమిషాలకు కరంటు పోవాలి. ఇన్ని సమకూరితే తప్ప దెయ్యం రాదు. 

అసలు ఇవన్నీ జరిగే అవకాశమే లేదు. ఊరి చివర బంగళా అలా ఉత్తినే వదిలేసే స్వంతదార్లు ఎవరుంటారు? ఒకవేళ వుంటే ఊళ్లో వాళ్లు ఊరికే వుంటారా? ఏ బెల్టు షాపో పెట్టేయరూ? పైగా వర్షంట. ఏళ్ల తరబడి వర్షాలు లేక అల్లాడుతూంటే దెయ్యాలకోసం  అప్పటికప్పుడు వర్షం కురుస్తుందా? అమ్మా ఆశ!

అసలు ఆ కాలంలోనైనా, యీ కాలంలోనైనా దెయ్యాలు వుండే అవకాశం వుందో లేదో చూదాం. -  దెయ్యాలెన్ని వుంటాయో సుమారుగా లెక్కవేసి చూడండి. కోరికలు తీరనివాళ్లు దెయ్యాలవుతారంటారు. ఇప్పటిదాకా కొన్ని కోట్ల మంది పుట్టి, గిట్టి వుంటారు. వీళ్లలో 'నా కోరికలన్నీ తీరిపోయాయి, ఇంకేం మిగల్లేదు' అనుకుంటూ చచ్చిపోయిన వాళ్లు ఎంతమంది వుంటారు చెప్పండి. చచ్చిపోతూ పోతూ..కూడా 'ఇంకో మంచి డాక్టర్ని తీసుకుని వస్తే బాగుండును' అనే కోరికైనా వుంటుంది. ఆ పాటి కోరిక చాలదూ - దెయ్యం అవడానికి! మరి కోటానకోట్లమంది దెయ్యాలయి కూచుంటే అవి వుండడానికి జాగా ఎక్కడిది? పగలంతా గాలిలో ఎగిరినా  రాత్రికైనా ఎక్కడైనా నడుం వాల్చాలా? ఎక్కడ వాల్చగలవు చెప్పండి? - పాడుబడ్డ యిళ్లల్లో, చెట్ల కొమ్మల మీద, స్మశానాల్లో వుండవచ్చు. అంతేనా!?

అసలు ఈ కాలంలో పాడుపడ్డ యిళ్లు ఎక్కడుంటున్నాయండీ? వాటన్నిటినీ పడగొట్టేసి అపార్టుమెంటు కాంప్లెక్సులు కట్టేస్తున్నారు. ఇక చెట్టుకొమ్మలు..! చెట్లు కొట్టేస్తున్నారు. అడవులు హరించుకుపోతున్నాయి. వజ్రాలవేటలంటూ అక్కడున్న గిరిజనులనేే తరిమేస్తూ వుంటే యిక దెయ్యాల్ని వుండనిస్తారా? ఇంకేం మిగిలాయి? ఆ ఁ  స్మశానాలు! వందగజాల స్థలమే ఖాళీగా కనబడితే ఆక్రమించే ప్రబుద్ధులు వుండగా ఎకరాల విస్తీర్ణమున్న స్మశానాలను వదిలిపెడతారా? ఇలా అన్నీ అన్యాక్రాంతం అయిపోతూ వుంటే దెయ్యాలకు ఆవాసం ఎక్కడుంటుంది? ఉండేందుకు చోటు దొరకదు కాబట్టి అవి వుండడం మానేస్తాయి. ఇదీ నా తర్కం....'

****************

కారు హారన్‌ మోగడంతో చదవడం మధ్యలో మానేసి తల పైకెత్తి చూశాను. సురేష్‌ కారు కాదు. విసుగ్గా వాచీ కేసి చూసుకున్నాను. అరగంట దాటింది. చేతిలో వున్న కాగితాలు జేబులోకి తోశాను. మళ్లీ ఎందుకు చదవడం? మా ఆవిడ మెచ్చుకుంది! దెయ్యాలు లేవని వాదిస్తూనే పర్యావరణాన్ని కాపాడవలసిన అవసరాన్ని అన్యాపదేశంగా చెప్పానని సంతోషించింది. టీవీలో కనబడినప్పుడు కెమెరా కేసి మరీ ఎక్కువగా చూడవద్దని, తలపై చేతులు పెట్టుకుని జుట్టు చెరుపుకోవద్దని, ముక్కు రుద్దుకోవద్దని పదేపదే చెప్పింది. అంతా బాగానే వుంది. ఇంతకీ ఈ మహానుభావుడు ఎక్కడ?

సెల్‌లో అతని నెంబరుకు కొట్టాను. 'ఈ నెంబరుతో ఏ ఫోనూ పని చేయటం లేద'ని వచ్చింది. నెట్‌వర్క్‌ బిజీగా వుంటే ఈ సెల్‌ఫోన్‌లు చెప్పే సమాధానమే యిది! ఆ ఛానెల్‌ వాళ్ల ఆఫీసుకే ఫోను చేశా. ''ఆ పేరుతో ప్రొడ్యూసర్‌ ఎవరూ లేరే!'' అని ఫోన్‌ పెట్టేసింది ఆపరేటర్‌. గుండె గుభిక్కుమంది. ఆఫీసుకి పెట్టిన సెలవు వృథాగా పోయిందనిపించింది. ఎవరైనా నాతో వేళాకోళానికి ప్రాక్టికల్‌ జోక్‌ చేశారా... ఛ, ఛ.. అదేం అయివుండదు. సురేష్‌ కాదేమో, రమేషా? లేకపోతే అసలు పేరు వేరే వుంటే ముద్దుపేరు సురేషా? 

టీవీ స్టూడియోకి మళ్లీ ఫోన్‌ చేసి ప్రొడ్యూసర్లు వుండే విభాగానికి కలపమన్నాను. ఎవరో చందూ అనే ఆయన మాట్లాడాడు. సురేష్‌ అనే పేరుతో ప్రొడ్యూసర్‌ ఎవరూ లేరని ధ్రువీకరించాడు. అప్పుడతనితో కథంతా చెప్పాను. ఇలాగ దెయ్యాల అంశం మీద ముఖాముఖీ పెడతానన్నాడనీ, నన్ను తయారై రమ్మన్నాడనీ.. 

ఇది చెప్తూండగానే అతను ఉలిక్కిపడ్డాడు. ''సురేష్‌ యీసారి మిమ్మల్ని పట్టుకున్నాడా?'' అన్నాడు.

నాకు ఒళ్లు మండిపోయింది. ''మరి యిప్పటిదాకా సురేషనేవాడే లేడన్నారు!'' 

''అవును లేడు.'' 

''మరి పట్టుకున్నాడన్నారు..!?'' 

''అబ్బ, మీరు కాస్త నిదానిస్తే అన్నీ చెబుతాను. సురేష్‌ ఇప్పుడు లేడు. మూడేళ్లక్రితం వుండేవాడు. ఇదే ఛానెల్‌లో పనిచేసేవాడు. వాడికి దెయ్యాల అంశం మీద బాగా ఆసక్తి. చాలా పుస్తకాలు చదివి చదివి దెయ్యాలు లేవని తేల్చాడు. ఉన్నాయంటే మనతో వాదించేవాడు. మూడేళ్ల క్రితం ఈ అంశం మీద ఓ మానసిక వైద్యుడితో ముఖాముఖీ ఏర్పాటు చేశాడు.   ఆయన్ని కారులో తీసుకుని వస్తూంటే యాక్సిడెంటయింది. ఆయన బతికాడు. వీడు పోయాడు...''

''ఏమిటీ.. పోయాడా? అంటే.. యూ మీన్‌.. చచ్చిపోయాడా?''

అతను విసుక్కున్నాడు. ''అంతేకదండీ! పోయాడంటే తెలుగులో - చచ్చిపోయాడనేగా!''

''జోకులేయకండి. చచ్చిపోతే నాకెలా ఫోను చేస్తాడండీ? నెల్లాళ్లక్రితం పడిన నా కథ ఎలా చదువుతాడండీ? సరిగ్గా యివాళే  ముఖాముఖీ ఎలా ఏర్పాటు చేశాడండీ?''

''ఇవాళే అంటే..ఆ... యివాళ నవంబరు 12 కదూ! సరిగ్గా మూడేళ్ల క్రితం యీ తారీకునే వాడు కార్యక్రమం ఏర్పాటు చేశాడు. అది జరగలేదుకదా. ఆ కోరిక మిగిలిపోయి వుంటుంది. కోరికలు తీరకుండా చచ్చిపోతే దెయ్యం అవుతాడంటారు కదండి. ప్రతీ ఏడాది యీ తేదీన వాడు కార్యక్రమం పెడదామని చూస్తాడన్నమాట!''

నాకు వెన్నులోంచి వణుకు వచ్చేసింది. ''ప్రతీ ఏడాదీ యిదే తంతా? అంటే కితం ఏడాది కూడా యిలాగే ఎవర్నైనా పిలిచాడంటారా?'' అని అడిగాను.

''పిలిచినట్టే గుర్తండి. ఆయనా యిలాగే ఫోన్‌ చేశారట. నాతో కాదు కానీ మా ఆఫీసులో వేరే అతనితో మాట్లాడారట, మీలాగే! ఆ కితం ఏడాది మాత్రం నాకే వచ్చింది ఫోన్‌. ఓ ముసలాయన. భూతవైద్యం చేస్తారట. మీకు ఫోన్‌ చేసిన సురేష్‌ చచ్చిపోయి దెయ్యమై ఏడాదయిందనగానే ఆయన దబ్బున పడిపోయాడు. ఆయన పక్కనున్నతను ఫోన్‌ తీసుకుని నాకు ఒకటే చివాట్లు - ఇలాటి చావుకబురు చల్లగా చెప్పద్దా అని. చూడండి, ఎలా వుంటారో! ఆ సురేష్‌గాడి చావు కాదు కానీ నాకు మూడింది..''

**************

ఇక నాకు వినబుద్ధి కాలేదు. నీరసంగా యింటికి చేరాను. కథంతా విని మా ఆవిడ తిట్టిపోసింది. విదేశీ పత్రికలోంచి కాపీ కొట్టి కథ రాయడం తప్పంది. రాసినా యిలాటి ఆఫర్‌ వస్తే ఎగేసుకుంటూ సరేననడం పొరబాటంది. దబ్బున పడిపోయిన ఆ ముసలాయన వారం తిరక్కుండా టపాకట్టి వుంటాడని తీర్మానించింది. మరుసటి ఏడాది పిలవబడినవాడు కూడా అదే దారి పట్టి వుంటాడని తేల్చేసింది. నేనూ వారం తిరక్కుండా అదే కాటికి చేరతానని జోస్యం చెప్పింది. ఇలాటి అర్ధాయుష్షు మొగుణ్ని కట్టబెట్టినందుకు వాళ్ల నాన్నను ఆడిపోసుకుంది. 

నేను మాత్రం నిలకడగల బుద్ధితో కార్యాచరణకు ఉపక్రమించాను. టీవీ ఆఫీసుకి వెళ్లి చందూ చెప్పిన వివరాలు నిజమేనని నిర్ధారించుకున్నాను. వాళ్ల సహాయంతోనే సురేష్‌ ఉపయోగించిన సెల్‌ నెంబరు గురించి కంపెనీవారిని వాకబు చేశాను. ఆ నెంబరు చాలాకాలంగా వాడకంలో లేదని వాళ్లు కన్‌ఫమ్‌ చేశారు. సురేష్‌ దెయ్యమై నాతో ఆటలాడుతున్నాడన్న విషయం ఖచ్చితంగా తెలిసిపోగానే, యికపై నన్నేం చేయదలచుకున్నాడో అతని భవిష్యత్‌ ప్రణాళిక ఏమిటో తెలుసుకోవాలని అనుకున్నాను. కానీ ఎలా..? 

***************

దానికో ఉపాయం చెప్పాడు మాధవ్‌ అనే మరో ప్రొడ్యూసర్‌. ''ఊళ్లో వున్న వింతవింతలన్నిటితో 'కాశీపట్నం చూడర బాబూ'  అనే పేరుతో  కొంతకాలం ఫీచర్‌ నడిపామండి. పాతబస్తీలో దెయ్యాలతో మాట్లాడించే 'స్పిరిట్‌ మీడియం' ఒకాయన వున్నారు. 'భూతమాధ్యమం' అనే పేరుతో ఓ స్టోరీ చేశాను...''

''ఆంగ్లమాధ్యమం, తెలుగు మాధ్యమం అన్నట్టు భూతమాధ్యమం ఏమిటండీ..?''

''భూతమధ్యముడు అని పేరు పెడతానన్నానండి. పెద్దా, చిన్నా భూతాల్లో మధ్యవాడు అనే అర్థం వస్తుందని ఆయనే వద్దన్నాడు. మీక్కావాలంటే ఆయనకు చెప్తాను. ఈ ఆదివారం రాత్రి వెళ్లి మీక్కావలసిన ప్రశ్నలన్నీ అడగండి.''

''నాడీ గ్రంథాల్లో మన జాతకంకోసం తాళపత్రాలు తిప్పుకుంటూ పోయినట్టు, సురేశ్‌ అనే పేరున్న ఎన్ని దెయ్యాల్ని పలకరిస్తామండి? చందూగారూ, మీరు దయవుంచి నాతో వచ్చి, ఆయన పిలిచిన దెయ్యం మీ సురేష్‌ అవునో కాదో గుర్తు పట్టాలి..'' అని బతిమాలాను. చందూ సరేనన్నాడు.

***************

భూతమధ్యముడు గారు ఎత్తులో, లావులో మధ్యస్తంగా వున్నారు. ఇంటికి మధ్యలో ఓ ముగ్గేసి ఓ పెద్ద పటం గీసి, దానిమీద అక్షరాలన్నీ రాసుకుని కూచున్నారు. మధ్యలో ఓ సీసామూత. దీపాలార్పేసి ఒక నూనెదీపం వెలిగించి - స్పిరిట్‌ కమ్‌, సురేష్‌ కమ్‌ - అని జపించడం మొదలుపెట్టాడు.  కాస్సేపటికి అంబ పలికింది.. అదే సురేష్‌! 'ఏమిటీ తొక్కలో డిస్టబెన్సు..' అంటూ!

''అదిగో మా వాడే! తొక్కలో.. అనేది వాడి ఊతపదం!'' అన్నాడు చందూ ఉత్సాహంగా.

''హలో సురేష్‌ గారూ! మీతో మాట్లాడడానికి మీ స్నేహితులు వచ్చారు. మీరు చేద్దామనుకున్న ఓ చర్చా కార్యక్రమం గురించి మాట్లాడాలట...''

''ఇప్పుడేంటి తొక్కలో కబుర్లూ, చర్చలూ? మా లోకంలో చర్చావేదిక పెట్టారు - ''మానవులు అనేవారు వున్నారా? లేరా?'' అని. లేరని వాదించడానికి వెళుతున్నాను..'' అన్నాడు సురేష్‌ భూతమధ్యముడి ద్వారా!

''వాడే, వాడే.. మా వాడే! బతికున్నంతకాలం దెయ్యాలు లేవని వాదించేవాడు. ఇప్పుడు చచ్చాక మనుష్యులు లేరని వాదిస్తున్నాడు..'' అని చందూ పొంగిపోయాడు.

''నా కథ చదివి, మొన్ననే నాతో మాట్లాడి, మనుష్యులు లేరని ఎలా అంటాడండీ మీ స్నేహితుడు?'' అని గట్టిగానే అరిచాను.

చందూ ఆగి, నన్ను ఎగాదిగా చూశాడు. - ''వాడు మీతో మాట్లాడాడంటే... అసలు మీరు మనుష్యులే కాదేమో! ఒకవేళ... మీరు.. సార్‌, మీరోసారి మీ పాదాలు చూపించండి. వెనక్కి తిరిగున్నాయేమో చూడాలి..అదేమిటి, నేలమీద కూచున్నా మీరు బూట్లు వేసుకుని కూచున్నారు!.. అంటే మీరు, మీరు..''

కనుమూసి తెరిచేటంతలో చందూ మాయం.

''అదేమిటండీ.. బొత్తిగా మీరైనా చెప్పండి..'' అంటూ భూతమధ్యముడు గారి కేసి తిరిగి చూస్తే ఆయనా హాంఫట్‌.

నా మీద నాకే అనుమానం వచ్చింది. బూటు విప్పి పాదాల కేసి చూద్దామనుకుని ఆగిపోయాను. ఒకవేళ అవి వెనక్కి తిరిగి వుంటే..? ఎందుకైనా మంచిది... బాబ్బాబు మీరు కాస్త చూసి చెబుదురూ!

అయ్యో అదేమిటండీ.. మీరూ అంతర్థానం అయిపోతారేమిటండీ బాబూ!

(2010 డిసెంబరులో ఆలిండియా రేడియోకై రాసి, చదివిన హాస్యకథ, ఆలిండియా రేడియో సౌజన్యంతో)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?