Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ కథ: నాగాభరణం

వీరేంద్ర గదిలోకి వచ్చేసరికి శివాని ఆపిల్‌ పండు కొరుక్కుతింటోంది. ''అదేమిటి వదినా, నువ్వు గదిలోంచి బయటకు రాలేదంటే ఏడుస్తూ కూర్చున్నావనుకున్నాను. ఇలా..''

శివాని హేళనగా నవ్వింది. ''జుట్టు విరబోసుకుని గుండెలు బాదుకుంటూ వుంటే వచ్చి ఓదారుద్దామనుకున్నావు కాబోలు. ..మీ అన్నయ్యకూ నాకూ వున్న గొడవలు తెలిసి కూడా అలా అనుకున్నావంటే..'' భుజాలు ఎగరేసింది.

''..బతికుండగా ఎన్ని గొడవలున్నా, చచ్చిపోయాక కూడా..''

''.. చచ్చిపోయినవాళ్లకి గొడవలుండవు. నేనింకా బతికే వున్నానుగా..విడాకులు యివ్వడానికి ఒప్పుకున్నాడు. తిరుపతి వెళ్లి వచ్చి యిస్తానని ప్రామిస్‌ చేశాడు. చూడు ఏం చేశాడో.. బతికుండగా కాల్చుకుని తిన్నాడు. ఛస్తూ కూడా..'' శివాని గొంతు గద్గదమైంది.

వీరేంద్ర అభ్యంతర పెట్టబోయాడు. ''అదేమిటి వదినా.. అలా మాట్లాడతావ్‌! అక్కడికి తనే కావాలని చచ్చిపోయినట్టు... మావోయిస్టులు యిలా ఎటాక్‌ చేశారు కాబట్టి కానీ..''

శివాని తెల్లబోయింది. ''మధ్యలో వాళ్లెక్కణ్నుంచి వచ్చారు?''

వీరేంద్ర నీళ్లు నమిలాడు. ''..అనుకుంటున్నారు. పోలీసులు ఆ యాంగిల్‌లో యిన్వెస్టిగేట్‌ చేస్తున్నారు.''

శివాని సాలోచనగా వీరేంద్ర కేసి చూసింది. ''ఓహో, ఆ కలర్‌ యిస్తున్నారా? మీ అన్నయ్య లాండ్‌ డీలింగ్స్‌లో కడుపు మండినవాడెవడో చంపితే, అలా చెప్తే అసహ్యంగా వుంటుందని... మావోయిస్టులు చంపారని చెప్పి.. శభాష్‌, నీదేలా వుంది ఐడియా.. ఓ నాలుగు ఎఱ్ఱ కరపత్రాలు పడేస్తే చాలు..''

వీరేంద్ర బదులు చెప్పకుండా ''ప్రెస్‌ వాళ్ల ముందు నువ్వు యిలా మాట్లాడకుండా వుంటే అదే పదివేలు'' అన్నాడు.

శివాని చికాకు పడింది. ''నాకేం పట్టింది మీడియాతో మాట్లాడడానికి? నాకేమైనా పబ్లిసిటీ కావాలా? మొగుడు చచ్చి గదిలో  ఓ మూల కూర్చుని ఏడుస్తోంది అని చెప్పి పంపించేసేయ్‌. లేని దు:ఖం తెచ్చుకుని వెక్కిళ్లు పెడుతూ కెమెరాల ముందు ఏడవడం నా తరం కాదు.''

''చెప్తాననుకో... కానీ ఒకటి రెండు ముక్కలైనా.. అన్నయ్య మంచితనం గురించి..''

''మీరెంత గింజుకున్నా నోరు విప్పను. పేపర్లలో రాస్తారు చూడు.. దిగ్భ్రమకు గురై అవాక్కయిపోయారని.. అలా అని చెప్పుకో. కాదూ కూడదు నోరు తెరవాలంటావా? పురాణం విప్పితే నువ్వు గిలగిల్లాడతావు. నిజాలు చెప్పడమే నా కలవాటు.''

వీరేంద్రకు ఏం మాట్లాడాలో తెలియలేదు. అసహనంగా అటూ యిటూ తిరిగాడు. ''నీతో వేగడం కష్టం. అందుకే అన్నయ్య మొత్తుకునేవాడు 'విడాకులడుగుతోందిరా, ఇస్తే పబ్లిక్‌లో పరువు పోతుందని ఆగాను. ఇక లాభం లేదు, యివ్వకపోతే మతి పోతుంది. పిచ్చెక్కిస్తోంది.' అన్నాడు తిరుపతి వెళ్లబోయే ముందు...''

సోఫాలో కూర్చుని మ్యేగజైన్‌ తిరగేయబోయిన శివాని చేతిలో పుస్తకం విసిరికొట్టింది. ''చూశావా, విడాకులివ్వాలన్నా ఓటర్లు ఏమనుకుంటారని ఆలోచించాడు తప్ప, తను ఎందుకు అడుగుతోంది అని ఆలోచించాడా? తనను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి పెళ్లయి ఐదేళ్లు కాకుండా యింతలా ఎందుకు విసిగిపోయింది అని ఒక్కసారి ..ఒక్కసారి ఆలోచించాడా?''

''ఇందులో ఆలోచించేదేముంది? తను పాలిటిక్స్‌లోకి వెళ్లడం నీ కిష్టం లేదు. బిజినెస్‌లోనే కంటిన్యూ కావాలంటావ్‌. మొదటిసారి పోటీ చేస్త్తూనే ఎమ్మెల్యే అయిపోయాడు. ముఖ్యమంత్రిగారికి రైట్‌ హాండ్‌ అయిపోయాడు. జిల్లాలో కల్లా పెద్ద పబ్లిక్‌ ఫిగర్‌ అయిపోయాడు. నీ దృష్టిలో మాత్రం నథింగ్‌ గాడు అయిపోయాడు...మొగుడిగా పనికి రాకుండా పోయాడు..''

శివానికి కోపం వచ్చింది. ''చూడు వీరేంద్రా, ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు. కాలేజీలో క్లాస్‌మేట్స్‌గా వున్న దగ్గర్నుంచి నా స్వభావం మీ అన్నయ్యకు తెలుసు. నాకు కావలసినది సింపుల్‌ లైఫ్‌. నా భర్త సమాజంలో మర్యాదస్తుడిగా వుంటూ నన్ను, పిల్లలు పుట్టాక నా పిల్లలనూ చూసుకుంటే చాలనుకున్నాను. అడ్డమైన అవినీతి పనులూ చేస్తూ బయట పబ్లిక్‌ ఫిగర్‌గా వెలిగిపోతూ యింట్లో పెళ్లం అనేది ఒకత్తె వుందనీ, దానికీ యిష్టాయిష్టాలు వుంటాయనీ పట్టించుకోని..ఓ బీస్ట్‌... వెల్‌, ఐ డోంట్‌ నో హౌ టు డిస్క్రయిబ్‌ హిమ్‌..''

వీరేంద్ర జవాబివ్వబోయేటంతలో సెల్‌ మోగింది. వస్తున్నా వస్తున్నా అని వాళ్లకు చెప్పి ''ఢిల్లీ నుండి ఎవరో వచ్చారట..'' అంటూ బయటకు వెళ్లిపోయాడు.

**********

శివాని రగులుతూనే మేగజైన్‌ మళ్లీ చేతిలోకి తీసుకుంది.  విజయేంద్ర హఠాన్మరణం ఆమె భవిష్య ప్రణాళికను గందరగోళ పరిచింది.  తిరుపతి నుండి రాగానే అతను విడాకులు యిస్తాడని, ఆర్నెల్లు పోయాక కమలాకర్‌ను పెళ్లి చేసుకుని తనకు నచ్చినట్లు జీవిస్తానని ఆమె అనుకుంది. నిజానికి ఆమె భర్త విజయేంద్ర, కమలాకర్‌ యిద్దరూ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఆమెకు క్లాస్‌మేట్సే. ఆమెను పెళ్లాడాలని యిద్దరూ పోటీ పడ్డారు. శివాని విజయేంద్రను వరించింది, అతనికి చొరవ ఎక్కువని. 

ఆ చొరవే కొంపముంచింది. ఇండస్ట్రియలిస్టుగా టెక్నోక్రాట్స్‌ అసోసియేషన్‌ తరఫున ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్లినపుడు యితని  తీరు చూసి ముఖ్యమంత్రి ముగ్ధుడయ్యాడు. రాజకీయాల్లోకి రమ్మనమని ఒత్తిడి చేశాడు. వెళ్లవద్దని శివాని పట్టుబట్టింది. విజయ్‌ అటే మొగ్గాడు. పార్టీబలం, ముఖ్యమంత్రి దన్ను, ఓ నిజాయితీపరుడైన పారిశ్రామికవేత్తగా విజయ్‌ యిమేజ్‌ - అన్నీ కలిసి అతన్ని ఎన్నికలలో నెగ్గించాయి. 'సరే నెగ్గావుగా, కాస్త ప్రజాసేవ చేయ్‌' అంది శివాని. తప్పకుండా అన్నాడు విజయ్‌. తమ నియోజకవర్గానికి పనికి వచ్చే ప్రాజెక్టులు తెప్పించాడు. పథకాలు పకడ్బందీగా అమలు చేయించాడు. ప్రజల్లో పేరు వచ్చింది. 

కానీ అది ఒక పార్శ్వం మాత్రమే. ముఖ్యమంత్రి పారిశ్రామిక వర్గాలనుండి పిండుకోవడానికి యితన్ని వారధిగా వాడుకున్నాడు. ఇండస్ట్రీ వర్గాలకు సెజ్‌ లో స్థలాలు ఎలాట్‌ చేయిస్తూ, కాంట్రాక్టులు కుదురుస్తూ విజయ్‌ వారిలో మంచి పేరు సంపాదించుకున్నాడు. దానికి బదులుగా వారు యిచ్చిన నిధులు ముఖ్యమంత్రికి అందజేస్తూ ఆయన దగ్గరా పేరు కొట్టేశాడు. మధ్యలో తను ఎంత తీసుకుంటున్నాడో ఆయనకు చెప్పే తీసుకున్నాడు. ముఖ్యమంత్రికి కావలసినవాడు అన్న పేరు రాగానే అన్ని రకాల సెటిల్‌మెంట్స్‌ కోసం జనం యితని వద్దకు రాసాగారు. వివాదాలు లేనిచోట యితను పుట్టించాడు. కొన్ని సందర్భాల్లో పిట్టపోరు, పిట్టపోరు పిల్లి తీర్చినట్లు యితనే స్వాహా చేశాడు. దీనిలో ముఖ్యమంత్రికి వాటా లేదు.

వరించి పెళ్లాడినవాడు యిలా భ్రష్టుడై పోవడం శివానిని నివ్వెరపరచింది. కీర్తి యావలో, డబ్బుకోసం పరుగులో తను అతని కంటికి కనబడడం మానేశానని గ్రహింపుకి వచ్చేసరికి భరించలేకపోయింది. వాళ్లకు పిల్లలు లేకపోవడం సమస్యను మరింత జటిలం చేసింది. వాళ్లిద్దరూ ఏకాంతంగా గడిపే సమయమే తగ్గిపోయింది. ఎప్పుడు చూసినా అతని చుట్టూ జనమే. అర్ధరాత్రి దాటాక అతను పడకగదికి చేరేవేళకు ఆమె నిద్రపోతూ వుండేది. అతను పొద్దెక్కి లేచేవాడు. లేచేటప్పటికే అనుయాయులు ఎదురు చూస్తూ వుండేవారు. 

'పెళ్లయాక గృహిణిగా వుండిపోవాలనుకున్నాను కానీ కుదరటం లేదు. నేనూ ఇంజనీరునే కదా. ఫ్యాక్టరీ వ్యవహారాలు చూసుకుంటాను.' అంది శివాని. 'నీ కెందుకు ఆ శ్రమ, మా తమ్ముడు వీరేంద్రను చూసుకోమన్నాను' అన్నాడు విజయ్‌. విజయ్‌ను అవినీతివైపు ప్రేరేపించినవాడు వీరేంద్రేనని శివానికి అతనికి తగని మంట.

సరదా సంతోషాలు లేని జీవితంతో విసిగిపోయిన శివాని ఆత్మహత్య చేసుకుందామని కూడా ఆలోచన చేసింది. కానీ ఆమెను ఆ ఆలోచననుండి మళ్లించినవాడు కమలాకర్‌. శివాని పెళ్లి తర్వాత అతను ఫారిన్‌ వెళ్లి యింకా చదివాడు. ఫారిన్‌ కొలాబరేటర్స్‌తో కలిసి యీ వూళ్లోనే పెద్ద ఫెసిలిటీ పెట్టాడు. విజయేంద్రే తన స్నేహితుడికి సహాయపడ్డాడు. ఆ సందర్భంగా వాళ్ల యింటికి రాకపోకలు సాగించిన కమలాకర్‌కు శివాని గడుపుతున్న జీవితం అర్థమైంది. ''నన్ను కాదన్నది యీ జీవితం కోసమేనా?'' అని అడిగాడు శివానిని ఒకసారి. 

అడిగిన వారం రోజులకు శివాని అతనిముందు ఓ ప్రతిపాదన పెట్టింది. ''విజయ్‌కు విడాకులు యిచ్చి వచ్చేస్తాను. నన్ను పెళ్లాడతావా?'' అని. 

''సంతోషంగా'' అన్నాడు కమలాకర్‌.

విజయేంద్ర మాత్రం అభ్యంతర పెట్టాడు. ''నీ ఒంటరితనాన్ని అర్థం చేసుకోగలను. కావాలంటే ఎఫైర్‌ పెట్టుకో. కానీ విడాకులు యిచ్చి నా ప్రత్యర్థులకు అస్త్రాన్ని అందించకు. ఇప్పటికే నా మీద పడి ఏడుస్తున్నారు. నా ఎదుగుదలకు స్వంత పార్టీవాళ్లు కూడా ఓర్చుకోలేకపోతున్నారు.''

శివాని ఒప్పుకోలేదు. కమలాకర్‌తో అక్రమ సంబంధం పెట్టుకోలేదు. అతని వద్దకు భార్యగానే వెళతాను అంటూ భర్తను సతాయించింది. చివరకు ఏమైతే అది అయిందని విజయ్‌ ఒప్పుకున్నాడు. తిరుపతినుండి రాగానే విడాకులు యిచ్చేస్తానని మాట యిచ్చాడు. చివరకు జరిగిందిది...

**********

వీరేంద్ర కంగారుగా లోపలకి వచ్చాడు. ''వదినా, ఇంపార్టెంటు విషయం ఒకటి..''

కన్నీళ్లతో తడిసిన శివాని మొహం ఎత్తింది ''ఎవరికి యింపార్టెంట్‌? నీకా నాకా?''

ఆమె మొహం చూసి వీరేంద్రకు జాలి కలిగింది. ''బాధ పడుతున్నావా? ఇలాటి దుర్మరణం..'' 

''నేను బాధపడుతున్నది నా గురించి. మీ అన్నయ్యగురించి కాదు'' అంది శివాని కటువుగా. ''ఇంతకీ విషయం చెప్పు.''

''పార్టీ హై కమాండ్‌ మనిషిని పంపించింది. అన్నయ్య స్థానంలో ప్రజాసేవ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా కనుక్కోమంది..''

''సేవ!?'' శివాని ఫక్కున నవ్వింది. ''మీ అన్నయ్యలా సేవ చేసేవాళ్లు ఎక్కువై పోయే దేశం యిలా అఘోరిస్తోంది. ఒకళ్లు తగ్గినా తగ్గినట్టే. మధ్యలో నేను కూడా ఎందుకు?''

''ఆర్‌ యూ ష్యూర్‌..? ఫ్యామిలీనుండి ఎవరైనా నిలబడితే బై ఎలక్షన్‌లో యీజీ అవుతుందని పార్టీ అనుకుంటోంది.'' గొంతులో ఆతృత దాచుకుంటూ వీరేంద్ర అన్నాడు. ''నీకు అనుభవం లేదంటే వెనక్కాల నేను వుంటాను. అనుకోకుండా అన్నయ్య పాలిటిక్స్‌లోకి వెళ్లాడు. పేరు తెచ్చుకున్నాడు.ఆ లెగసీని ఫ్యామిలీ ఎందుకు వదులుకోవాలి? ఎవరో తన్నుకుపోతూ వుంటే చూస్తూ వుండడం దేనికి?''

శివానికి విషయం అర్థమైంది. తను కాదంటే వీరేంద్ర నిలబడదామని చూస్తున్నాడు. విజయేంద్ర వారసుణ్నంటూ అతని కంటె ఎక్కువగా జనాల్ని దోచుకుంటాడు. 

''ఎవడైనా చావగానే వాడి భార్యను నిలబెట్టడం ఆనవాయితీ అయిపోయింది. అసెంబ్లీలో ఎటు చూసినా మొగుడు పోయినవాళ్లే..వాళ్ల మధ్య నేనూ చేరాలన్నమాట. వాళ్ల సంగతి ఏమో కానీ నేను మాత్రం ఆ కేటగిరీలో వెళ్లను. నాలుగేళ్లగా విజయ్‌ను అనుక్షణం అసహ్యించుకుంటూ, యిప్పుడు అతని పేరు మీద సంపాదించుకున్న పదవిలో వుండడానికి నేను అంత చేవ చచ్చినదాన్ని కాదు. ఆత్మాభిమానం లేనిదాన్ని కాదు. నా పాటికి నేను వెళ్లి కమలాకర్‌ని పెళ్లాడతాను. విడాకుల కోసం ఆర్నెల్లు ఆగవలసిన అవసరం కూడా లేదు.''

వీరేంద్ర ఆమెను చూసి జాలి పడ్డాడు. ''అన్నయ్య బతికుండగా జరిగితే అది వేరే దారి. ఇప్పుడు నువ్వు వెళ్లి కమలాకర్‌ని పెళ్లాడితే జనాలు తప్పుపడతారు. భర్త వుండగానే అతనితో సంబంధం పెట్టుకుని, భర్తను చంపించావంటారు. మావోయిస్టులకు ఉప్పందించావని కథనాలు వచ్చినా రావచ్చు...''

శివాని నిట్టూరుస్తూ సోఫాలో వాలిపోయింది. ''పాముని చూసి పారిపోయినట్టు మీ అన్నయ్యనుండి పారిపోదామనుకున్నాను. కానీ ఆ పామే పగబట్టి నా నెత్తిమీదకు ఎక్కింది. ఇక బతికున్నంతకాలం ఆ పడగనీడలోనే బతకాలేమో!'' 

వీరేంద్ర నవ్వబోయేడు. ''ఆ పామే నీకు అలంకారం అవుతుందేమో, నీ పేరు శివాని కదా..''

శివాని చివ్వున తలెత్తి చూసింది. ''నా కొద్దీ అలంకారాలు... అవేవో నువ్వే పెట్టుకో. ఢిల్లీవాళ్లు కాదు కదా, ఎవరొచ్చి చెప్పినా నేను వినను. నన్ను పలకరించడానికి రావద్దని చెప్పు.''

**********

ఇంకో రెండు గంటల తర్వాత కమలాకర్‌ శివానీని పలకరించడానికి వచ్చాడు. ''ఏమిటి శివానీ, విజయ్‌ స్థానంలో నిన్ను నిలబెడదామని పార్టీ చూస్తోందని టీవీ స్క్రోలింగ్స్‌ వస్తున్నాయి! మరి మన మాటేమిటి? ఇది కాస్త చల్లారాక పెళ్లి అనుకుంటున్నాను నేను. మరి నువ్వు యిప్పుడు విజయ్‌ సింపతీ ఫ్యాక్టర్‌ మీద..''

''కూల్‌.. కూల్‌్‌! అదేం లేదు. నేను నిలబడడం కలలో మాట. వీరేంద్రే ట్రై చేసుకుంటున్నాడు. మొదట నా పేరు తీసుకునివచ్చి ఎవరూ పోటీ రాకుండా చూసుకుని తర్వాత తనే కాండిడేట్‌గా ముందుకు వస్తాడు. అదీ స్ట్రాటజీ..''

''దట్స్‌ ఓకే! అయినా నువ్వేమిటి యింకా యిలా వున్నావ్‌. తెల్లచీర కట్టుకుని బయటకు వెళ్లి తల దించుకుని కూర్చో. అంత్యక్రియలు ఇంకో రెండు గంటల్లో ప్రారంభమవుతాయట...లోకం కోసమేనా కాస్త చేయాలిగా..'' 

''చేద్దాంలే కానీ, రా యిలా కూర్చో. నీతో కాస్త మాట్లాడాలి.'' అంది శివానీ. విజయేంద్ర మరణం తర్వాత ప్రజల ఆక్రందనలు, విలాపాలు,  టీవీ కెమెరాల ముందు వీరేంద్ర యిస్తున్న స్టేటుమెంట్లు ఆమె గంటసేపుగా చూస్తూ మండిపడుతూ వుంది. అందరూ అతను పేదల పట్ల చూపిన ప్రేమ గురించి ప్రస్తావించేవారే. అతను చేసిన దోపిడీ గురించి ఎవ్వరూ ఏమీ మాట్లాడడం లేదు. 

ఇదే వరస కొనసాగితే విజయేంద్రను ప్రజలు దైవాంశ సంభూతుడిగా కొలిచేే ప్రమాదం వుందని ఆమెకు తోచింది.  వీరేంద్ర, ముఖ్యమంత్రి, పార్టీ - ఎవరి ప్రయోజనాల కోసం వారు అతన్ని మానవాతీతుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు అతనిపై ఆరాధన పెరిగినకొద్దీ కమలాకర్‌తో తన పెళ్లి పెటాకులు కావాలని శాపనార్ధాలు పెడతారు. విజయేంద్ర అవినీతిపరుడని చాటి చెప్పి అతని యిమేజ్‌కి భంగం కలిగించాలి. ప్రజలు అతన్ని మర్చిపోయేట్లా చేయాలి. ఎలా?

తన సమస్య అంతా చెప్పి ''కమలాకర్‌, నువ్వు బై ఎలక్షన్‌లో నిలబడాలి...'' అంది శివాని.

''..మతిపోయిందా? విజయ్‌ రాజకీయాల్లోకి వెళ్లినందుకే మండిపడ్డదానివి..'' అనబోయాడు కమలాకర్‌.

''విను. నాలుగేళ్లగా నన్ను హింసించిన నా శత్రువు మంచివాడిగా ప్రజల్లో పేరు తెచ్చుకోవడం భరించలేను. అతని అవినీతి గురించి నేను చెప్పలేను. వీరేంద్ర చెప్పడు. మూడోవ్యక్తిగా నువ్వు చెప్పవచ్చు. నేను ఆధారాలు యిస్తాను. విజయేంద్ర అవినీతిపరుడని మీడియా ఎప్పణ్నుంచో కోడై కూస్తోంది. నీకు మంచి యిమేజి వుంది. అప్పోజిషన్‌ పార్టీ కాండిడేట్‌గా తీసుకుంటుంది. మీడియా సపోర్టుతో నువ్వు తప్పకుండా గెలుస్తావు. ప్రజలు విజయ్‌ను మర్చిపోతారు.''

కమలాకర్‌ చిరునవ్వు నవ్వాడు. ''మనదేశంలో సింపతీ ముందు యిమేజ్‌, గిమేజ్‌ బలాదూర్‌.''

''అదీ ఆలోచించాను. నేను నిలబడనని మొదట చెప్తాను. పార్టీ వీరేంద్రను కాండిడేట్‌గా నిలబెడుతుంది. ఆఖరి నిమిషంలో పార్టీ మోసం చేసిందని ఆరోపిస్తూ నేను యిండిపెండెంట్‌గా నిలబడతాను. ఓట్లు మా మధ్య చీలిపోతాయి. నువ్వే గెలుస్తావ్‌.''

కమలాకర్‌ చాలాసేపు ఆలోచించి ఐడియా బాగానే వుందన్నాడు. తనకు యిష్టం లేకపోయినా శివానికోసం చేస్తానన్నాడు. ప్రజలు విజయ్‌ను మర్చిపోయారని అనుకోగానే రాజకీయాల్లోంచి విరమించుకుని ఇండస్ట్రీ చూసుకుంటానన్నాడు. అప్పటిదాకా శివానీని చూసుకోమన్నాడు. చివర్లో ఓ మాట అన్నాడు. ''విజయ్‌ శవం దగ్గర ఎవర నిలబడితే, ఎవరు అంత్యక్రియలు జరిపితే వాళ్లకే పొలిటికల్‌ ఎడ్వాంటేజ్‌ వుంటుంది. ఇప్పటిదాకా వీరేంద్ర నిలబడ్డాడు. లైవ్‌ టెలికాస్ట్‌ సమయానికి నువ్వు మీ అక్క కొడుకుని నిలబడమను. అతని చేతే అంత్యక్రియలు చేయించు. అప్పుడు వీరేంద్రకు లాభం చేకూరదు.''

శివాని ఫక్కున నవ్వి కమలాకర్‌ భుజం తట్టింది. ''గుడ్‌, ఇప్పటినుండే రాజకీయాలు వంటబడుతున్నాయి.''

**********

అంతా శివాని అనుకున్న ప్రకారమే జరిగింది. షెడ్యూల్‌ ప్రకటించడానికి ముందే వీరేంద్ర పార్టీ కాండిడేట్‌గా ప్రచారం చేసుకోసాగాడు. నియోజకవర్గమంతా విజయేంద్ర విగ్రహాలు పెడతానని, తవ్వబోయే కాలువలకు, వాటిపై కట్టబోయే వంతెనలకు విజయేంద్ర పేరే పెడతానని ప్రకటించసాగాడు. పాదయాత్రలు చేస్తూ చేతిలో పెట్టిన ప్రతి మగశిశువుకు విజయేంద్ర అని, ఆడశిశువుకు విజయ అనీ పేరు పెట్టసాగాడు. కమలాకర్‌ అప్పోజిషన్‌ పార్టీ కాండిడేట్‌గా విజయేంద్ర అవినీతిని ఎండగడుతున్నాడు. ఊరూరా తిరుగుతున్నాడు. అతని గెలుపు ఖాయమని మీడియా అప్పటికే మూడు సర్వేల ఫలితాలు వెలువరించింది. శివాని ఎక్కడా కనబడడం లేదు. విజయేంద్ర చితాభస్మం దేశంలో పుణ్యతీర్థాలన్నిటిలోనూ కలపడానికి వెళ్లిందని పేపర్లలో వచ్చింది. 

పార్టీ యిచ్చే బి ఫారం తీసుకోవడానికి వీరేంద్ర హైదరాబాదు వెళ్లినరోజున కమలాకర్‌ శివాని యింటికి వచ్చాడు. ''శివానీ, మన లెక్క తప్పేట్టుంది. ప్రజల్లో విజయేంద్ర మీద యింత అభిమానం వుందని ఎప్పుడూ అనుకోలేదు. అతని గురించి తిడితే వూరుకోవడం లేదు. ఊరికి మూడు విగ్రహాలైనా పెడతానని వాగ్దానం చేయమంటున్నారు. ఎక్కడ చూసినా యిదే తంతు'' అని వాపోయాడు.

''నువ్వు వాగ్దానం చేశావా?'' కంగారుపడుతూ అడిగింది శివాని.

''ఏం చేయమంటావ్‌? జనాలు ఊరుకోవడం లేదు. రాజకీయంగా భిన్నధృవాలమైనా స్నేహితుడిగా నాకా బాధ్యత వుందని చెపుతున్నా. మా పార్టీ వాళ్లు కూడా నెగ్గాలంటే యిలా చెప్పాల్సిందే అంటున్నారు.''

''అంటే.. అంటే.. నెగ్గితే. నువ్వూ విజయేంద్ర దేవుడని కీర్తిస్తావా?'' అడిగింది శివాని కోపంగా.

''తప్పదు. రేపు నామినేషన్‌ వేసి ప్రచారంలోకి దిగుతావుగా. నీకూ తెలిసివస్తుంది..''

''నేను నోరు విప్పను. మంచీ చెడూ ఏదీ చెప్పను. ఏ వాగ్దానాలూ చేయను. బాధతో నోరు మెదపలేకపోతోంది అనుకుంటారు.''

''నువ్వు నామినేషన్‌ వేయగానే పార్టీలో వీరేంద్రంటే పడనివాళ్లు నీ వెనక్కాల చేరతారు. నువ్వు మాట్లాడకపోయినా నీ వేదిక మీదనుంచే యీ వాగ్దానాలన్నీ చేస్తారు..''

''మరి యింత ప్లానూ వేసి లాభం ఏమిటి?''

**********

మర్నాడు సాయంత్రం కమలాకర్‌ ఓ గ్రామంలో ప్రచారంలో వుండగా న్యూస్‌ వచ్చింది, ప్రజాస్వామ్య వ్యతిరేకుల కఱకు తుపాకులకు బలై పోయిన విజయేంద్ర త్యాగం వ్యర్థం కాకుండా చూడడానికి పార్టీ తరఫున కాండిడేట్‌గా శివాని నిలబడుతోందనీ, వీరేంద్ర తప్పుకున్నాడనీ! హతాశుడై పోయాడు. శివానీయే నిలబడితే ముఖాముఖీ పోరాటంలో యిక తనకు ఛాన్సెక్కడ? ఏమిటి తన వుద్దేశం? అదే అడిగాడు ఆ రాత్రే తన యింటికి వెళ్లి.

''నా లక్ష్యం ప్రజల దృష్టిలో విజయ్‌ యిమేజిని తగ్గించడం, బురదపూయడం. అది నీ వలన కాదని తేలిపోయింది. వీరేంద్రను వదిలేస్తే మరీ పెంచేస్తాడు. అందుకే రంగంలోకి నేను దిగాను. నేనే కాండిడేట్‌ అనగానే పార్టీ సరేనంది. పెళ్లానికి వున్న సింపతీ  ఎడ్వాంటేజి తమ్ముడికి వుండదు కదా. ఎమ్మెల్యే కాగానే నా తడాఖా చూపిస్తాను. విజయేంద్ర గుట్టుమట్లన్నీ నాకు తెలుసు. ఆధారాలన్నీ నా దగ్గర వున్నాయి. ఒక్కొక్కటీ మీడియాకు లీక్‌ చేస్తాను. అతని ప్రత్యర్థులకు అందిస్తాను. కోర్టుకి వెళ్లమంటాను. కథనాలు బయటకు రాగానే 'నో కామెంట్‌' అని తప్పించుకుంటాను. విగ్రహాలంటావా, ప్రజల గుండెల్లో కొలువై వున్నవాడికి యీ విగ్రహాలెందుంటాను. ఇక పేర్లు పెట్టడమంటావా? ఎమ్మెల్యేగా నా కుండే అధికారం సర్వం వుపయోగించి 'విజయ' అనే మాట రాకుండా చూస్తాను. అన్నిటికీ ముఖ్యమంత్రి పేరు పెడతాను. కాదనగల దమ్మెవరికి? రెండేళ్లు తిరిగేసరికి విజయేంద్ర అంటే అవినీతికి మారుపేరుగా మారుస్తాను. అతను అమలు చేసిన పథకాలన్నీ ముఖ్యమంత్రి ఒత్తిడిమీద చేసినవే అని ప్రచారం చేస్తాను.''

ఆమె ఆలోచన అందుకునేసరికి పావుగంట పట్టింది కమలాకర్‌కి. ''పోన్లే, వెధవ రాజకీయాల్లోంచి నన్ను తప్పించావ్‌. సంతోషం. కానీ, మన పెళ్లి మాట?'' అన్నాడు.

''నా లక్ష్యం నెరవేరేవరకు విజయేంద్ర సూచించిన మార్గమే అవలంబిద్దాం'' అంది శివాని అతన్ని హత్తుకుంటూ.

స్వాతి వీక్లీ-సిపి బ్రౌన్‌ ఎకాడమీ 2010 దసరా కథల పోటీలో ప్రత్యేక బహుమతి (5000 రూ.లు.) పొందిన కథ  (నవంబరు, 2010 స్వాతి వీక్లీలో ప్రచురితం)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌

[email protected]

Click Here For Archives

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?