Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ కథలు : రాంపండూ- శాండో షాలినీ

ఎమ్బీయస్‌ కథలు :  రాంపండూ- శాండో షాలినీ

'ఏరోయ్‌, ఈ మధ్య కనబట్టం లేదు. ఊళ్లో లేవా?''

''లేను, దగ్గరే ఓ పల్లెటూళ్లో ఉంటున్నాను''.

''నువ్వా? పల్లెటూరా? ఆశ్చర్యంగా ఉందే! పల్లెటూర్లంటే నీకెంత అసహ్యమో తెలిసున్నవాళ్లెవరూ ఈ మాట నమ్మరు''.

''నమ్మకపోతే పోనీ! పొట్ట గడవాలంటే పల్లెటూరికి కాదు, వల్లకాటికైనా పోవాలి. ఉద్యోగికి దూరభూమి లేదన్నారు పెద్దలు!''

''నీకింత బుద్దెప్పణ్నుంచి వచ్చిందిరోయ్‌. అయినా నీకేం ఖర్మ? మీ బాబాయి ఉన్నాడుగా - ప్రతీనెలా నీ ఖర్చులకు సరిపడా పాకెట్‌మనీ ఇచ్చేటందుకు!''

''బాబాయి మాటెత్తకు నాకు ఒళ్లు మండిపోతుంది'' అన్నాడు రాంపండు.

రాంపండు పెసరట్ల సుబ్బిని పెళ్లి చేసుకునే ఉద్దేశ్యంతో, వాళ్ల బాబాయి పాతతరం అభిప్రాయాలు మారుద్దామని ప్రయత్నించడం, ఆయన మార్చుకుని వంటామెను పెళ్లి ఆమె చేసుకోవడం తెలిసున్నవాళ్లు రాంపండు కోపానికి కారణం సులభంగా ఊహించగలరు. అందునా అతనితో సంభాషణ జరుపుతున్న అనంతశయనం చిన్ననాటి మిత్రుడు కావడం చేత, పైగా సుబ్బి ప్రహసనంలో రచయితగా నటించడం వల్ల ఆ విషయం పూర్తిగా తెలిసున్నవాడు కాబట్టి రాంపండు కోపం చూసి జాలిపడి ఊరుకున్నాడు. కానీ రాంపండే ఊరుకోలేకపోయాడు.

''నీకు తెలుసా? మా బాబాయి ఎంత పీనాసి అయిపోయాడో! కొత్త పెళ్లాం వచ్చాక పాకెట్‌మనీ సగానికి సగం తగ్గించి వేశాడు. ఎలా చావమంటావు చెప్పు?''

''మరి రోజూ ఎలా ఛస్తున్నావు?''

''ఏం చేస్తాం? గుర్రప్పందాలు ఆడి ఓవర్‌ డ్రాప్టు భర్తీ చేసుకుంటున్నాను''

''పాపం రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సౌకర్యం లేదు కదా!''

''నాకు ఉండి మాత్రం ఏం కలిసి వచ్చిందిలే... తూఫాన్‌రాణీ తెలుసా?''

''సినిమానా?''

''నీ మొహం! గుర్రంరా.... రేసుల్లో గొప్ప ఫేవరెట్‌లే. పాకెట్‌ మనీ వచ్చిన్నాడే మొత్తమంతా కాశా''.

''మరింకేం?''

''పూర్తిగా విను. లాస్టు వచ్చింది. మనకు లాసు తెచ్చింది. మళ్ళీ ఫస్టుదాకా పాకెట్‌మనీ రాదు. పొట్ట గడవాలిగా. రామారంలో ఓ కుర్రాడికి ప్రైవేటు మాష్టారు కావాలని పేపర్లో వేశారు. అప్లయి చేయగానే రమ్మన్నారు. తిండికి లోటు లేకుండా రోజులు గడిచిపోతున్నాయి''

''రామారంలో బండవారని మా దూరపుబంధువులు ఉన్నారులే!''

''మీ బంధువులా? వాళ్లబ్బాయికే నేను చదువు చెబుతున్నది....!''

''ఎవరూ బుజ్జిగాడంటారు. వాడా? వినడమే తప్ప ఎప్పుడూ చూడలేదు...''

''చూడకపోతే ఇక చూడక. చెడు కనకు, వినకు, మాట్లాడకు అని గాంధీ గారు చెప్పలే!?''

''....నిజానికి వాళ్లింట్లో నాకు తెలుసున్న అమ్మాయి షాలిని మాత్రమే....''

అనంతం మాట పూర్తి చేసే లోపునే రాంపండు మొహంలో ఓ కొత్త వెలుగు. కళ్లు పెద్దవయ్యాయి. బుగ్గలు బూరెల్లా అయ్యాయి. గొంతులో ఉన్న ముడి పైకి కిందకీ, సైన్సు ఎగ్జిబిషన్‌లో నీటిమీద పింగ్‌పింగ్‌ బాలులా ఆడసాగింది.

''అనంతం'' అన్నాడు రాంపండు ఆర్తిగా.

ఆ వాయిస్‌ అనంతానికి బాగా గుర్తే. రాంపండు ప్రేమలో పడ్డప్పుడెల్లా ఆ సదరు ప్రేయసి ప్రస్తావన వచ్చినప్పుడు ఇలాటి టోనులోనే మాట్లాడడం, నిట్టూర్చడం చేస్తూ ఉంటాడు. అందునా రాంపండు ప్రేమలో పడడం అనేది చాలా తరచుగా జరిగే వ్యవహారం. కానీ ఈసారి మాత్రం ఆ సందర్భం అయివుండక పోవచ్చు అనుకున్నాడు అనంతం. ఎందుకంటే అవతలి శాల్తీ - శాండో షాలిని!

అనంతానికి షాలిని ఎంతమాత్రం రుచించకపోవడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి - ఆమె బుర్ర పెద్దది. చాలా ఇంటెలిజెంటు లేడీగా బంధువర్గాల్లో పేరు తెచ్చుకుంది. రెండు - ఆమె శరీరం పెద్దది. తిండి పుష్టీ, తద్వారా కండపుష్టి సంపాదించుకుని కాలేజీ రోజుల్లో  రౌడీలను చావగొట్టేది. బాక్సింగు పోటీల్లో కూడా పాల్గొందేమోనని అనంత్‌కి అనుమానం. భళ్లున నవ్విందంటే పిల్లలు దడుసుకొని దాంకోవాల్సిందే. అనంతం లాటివాడైతే నవ్వకపోయినా దాంకుంటాడు.

కానీ రాంపండు కథ వేరు. ''అనంత్‌, నేను ఆమెను ఆరాధిస్తానురా. ఆమెను మాత్రమే కాదు, ఆమె నడిచే భూమిని, పీల్చేగాలిని.... దేనినైనా సరే ఆరాధిస్తాను. అంతేకాదు. ఆమె..''

''ఇక చాల్లే. విషయం అర్థమయింది. ఇంతకీ నీ ప్రేమ సంగతి చెబితే ఏమంది?''

''ఇంకా చెప్పనే లేదు. ఎలా చెప్పడం చెప్పు? తమ్ముడికి ప్రైవేటు చెబుతూంటే అప్పుడప్పుడు వస్తూంటుంది. గార్డెన్లో నేను పిచ్చెక్కినట్లు తిరుగుతూ ఉంటే వచ్చి పలకరిస్తుంది. నేను నా మనసు విప్పి చెప్పేద్దామనుకుంటాను. కానీ ఎలా చెప్పగలను? ఆ చూపు ఉందే... ఆమె చూపు...''

''... తెలుసులే.  కమెండో చూపు''.

''ఛ, ఛ,  అచ్చుతప్పు. కన్నె చూసే కమ్మటిచూపు. ఓ లతాంగి చూసే లాలిత్యపు చూపు. ఒక దేవత వెదజల్లే కారుణ్యపు చూపు...'' రాంపండు సినిమా పాటలు రాసే మూడ్‌లోకి వెళ్లిపోవడంతో అనంతానికి అనుమానం వచ్చేసింది.

''ఒరేయ్‌, ముందొక విషయం తేల్చు. మనిద్దరం ఒకే అమ్మాయి గురించి మాట్లాడుతున్నామా? లేక రెండు అమ్మాయిలా? నేను మాట్లాడేది బండవారి అమ్మాయి... షాలిని అని. అ ఆమ్మాయికి చెల్లెలెవరైనా ఉందా? లేదా మాలిని అనే కవల అక్క ఉందా?''

''నోర్ముయ్‌, ఇదేమీ సీతాగీతా టైపు కథ కాదు. షాలిని ఒక్కతే! నో అక్క, నో చెల్లెలు. షాలినిలాటి మరొకరు ఉండడానికి వీల్లేదు.''

''మరి తను నీకు లతాంగిలా కనబడుతోంది''

''అవును. కనబడుతోంది'' రాంపండు మొండికేశాడు.

''గాడ్‌ బ్లెస్‌ యూ'' అన్నాడు అనంతం జాలిగా.

''పాడుతా తీయగా చూస్తూ కూచో. ఇలాటి మాటలే వస్తాయ్‌. నాకు పనుంది. పోవాలి. బుజ్జిగాడిని డెంటిస్టు దగ్గర కూచోబెట్టి వచ్చా''.

''అక్కడికి నేనొక్కణ్నే ఖాళీగా ఉన్నట్టు! మా ఉషారత్తయ్య లంచ్‌కి పిలిచింది. ఈ మధ్య మా ఇద్దరికీ కొంచెం మనస్పర్థలు వచ్చాయిలే. ఎలా పాచప్‌ చేయాలని అనుకుంటూ ఉంటే, ఇవాళ హోటల్‌కి లంచ్‌కి పిలిచింది. తను చెప్పిన పనేదో చేసేస్తే  ఇక చల్లబడుతుంది. వస్తా''.

*********

అనంతానికి అత్తయ్యలంటే మంట. అందునా పెద్దత్తయ్య మాంకాళి అంటే మరీనూ. చిన్న అత్త పేరు ఉష. అయినా అన్నిట్లో హుషారవడంతో ఉషారత్తయ్య అని పిలుస్తాడు అనంత్‌. ఆవేళ అత్తయ్య చెప్పే మాట వినేస్తే సరి అనుకున్నాడు కానీ అది తన పీకకు చుట్టుకునే వ్యవహారం అని ఊహించలేకపోయాడు.

''ఒరే అనంతం, నువ్విక పెళ్లి చేసుకోక తప్పదు. అమ్మాయి నాకు నచ్చింది. అవతలివాళ్లకు మాటిచ్చేశాను. నువ్వు చుట్టపుచూపుగా వాళ్లింటికి వెళ్లి వారం రోజులుండి ఆ అమ్మాయిని చూడు. బాగా ఆలోచించుకుని సరేనని చెప్పు''.

''అది కాదు అత్తయ్యా.... పెళ్లి చేసుకోవడం గురించి నా అభిప్రాయం తెలిసికూడా...'' అంటూ నాన్చేడు అనంతం.

''తెలుసు కాబట్టే నిన్ను మార్చగల అమ్మాయి కోసం ఇన్నాళ్లూ చూశాను. షాలినికి ఆ కెపాసిటీ ఉంది కాబట్టే...'' అని ఉషారత్తయ్య చెప్పుబోతూండగానే అనంతం ఉలిక్కిపడ్డాడు. ''ఎవరూ శాండో షాలినా?'' అని అరిచాడు.

''సిల్లీ ఫెలో.. వాళ్ల ఇంటిపేరు బండవారు. శాండోవారు కారు. నీలాటి మతిమరుపువాణ్ని బాగు చేయాలంటే షాలినే సరైన అమ్మాయి. రేపే రామారం వెళ్లు. అలా అయితేనే నిన్ను క్షమిస్తాను.'' అని తేల్చేసింది  ఉషారత్తయ్య.

*********

తోటలో చెట్టునానుకుని సిగరెట్టు కాలుస్తున్న రాంపండు అనంతాన్ని చూడగానే ఎగిరి గంతేశాడు. ''నువ్వెలా వచ్చేవురోయ్‌?'' అంటూ.

''చెప్తాగానీ ఈ తోటలో, ఈ బ్రిజ్‌ దగ్గర నీకేం పని?'' అని అడిగేడు అనంత్‌ ఆశ్చర్యపడుతూ.

''అదిగో ఆ కుర్రాడు లేడూ, బ్రిజ్‌ మీద చేపలు పడుతూ కూచున్నాడే.... వాడే బుజ్జిగాడు. వాడికోసం వెయిట్‌ చేస్తున్నాను. ఆ ఫిషింగ్‌ ప్రోగ్రాంలో ఒక్క చేపైనా దొరికితేనే పాఠం చెప్పించుకోడానికి వస్తాట్ట''.

అనంత్‌ జాలిపడ్డాడు. 'ఇటువంటి వాడితో ఎలా వేగుతున్నావురా?'' అని.

''కష్టమే...''

''ఏమిటి? పాఠాలు చెప్పడమా?''

''కాదు, వాణ్ని ప్రేమించడం''

''బుజ్జిగాణ్ని.... ప్రేమిస్తున్నావా!!''

''ఏం చెయ్యనూ, షాలిని కోసం.... తమ్ముడంటే పడిఛస్తుంది.''

''నువ్వు ఆమె అంటే పడిచావటం లేదూ....! ఇంతకీ నీ మనస్సు విప్పి చెప్పావా లేదా?''

''అబ్బే.  ఇంకా ఎక్కడరా? ఈ కుర్రాడి కంచిగరుడసేవతో సరిపోతోంది''.

''వాణ్ని... అలా...గే వంతెన మీదనుంచి కాలవలోకి తోసేయకూడదూ.?''

''అవకాశం వస్తే ఆ పని చేయడానికి ఫస్టుండేది నేనే. కానీ షాలిని ఉండగా అలా జరగడం అసంభవం. వాడి మీద ఈగ వాలినా సహించలేదు తను''.

''ఐడియా'' అని అరిచాడు అనంత్‌. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అని ఘోషించింది అతని మనస్సు. ఎలా అయినా సరే షాలిని, రాంపండులను కలిపితే తను హాయిగా బ్రహ్మచారిగా మిగలవచ్చు. బుజ్జిగాడిని అడ్డుపెట్టుకుని రాంపండు షాలినికి చేరువయితే చాలు. అప్పుడు ఉషారత్తయ్య తననేమీ తప్పుపట్టలేదు.

''ఒరే రాంపండూ, నువ్వో పని చేయి. ఎవరికీ తెలియకుండా ఆ కుర్రాణ్ని ఏక్సిడెంటల్‌గా తోసేసినట్టు నీట్లోకి తోసేసి నీ ముచ్చట తీరుస్తా.... తర్వాత షాలిని కళ్లెదురుగా వాడికోసం నీట్లోకి ఉరికి, వాణ్ని కాపాడి ఆమె అభిమానాన్ని పొందు''.

రాంపండు  కళ్లు చెమర్చాయి. ''కుర్రాడు నిజం చెప్పేస్తే షాలిని నిన్ను జీవితంలో క్షమించదు. నా కోసం  ఇంత త్యాగమా?''

''సెంటిమెంటు తర్వాత. ముందు వ్యవహారం చూడు. నేను రేపు సాయంత్రం నాలుగు గంటలకు షాలిని వెంటబెట్టుకుని తోట చూద్దాం రా, అని తీసుకువస్తాను. నువ్వు ఓ అరగంట ముందుగా వచ్చేసి ఆ పొదల దగ్గర దాక్కో. నేను షాలిని మాటల్లో పెట్టి సమయం చూసి వాణ్ని తోసేసి, హెల్ప్‌ అని అరుస్తాను. షాలిని వెనక్కి తిరిగి చూస్తుంది. నువ్వు పొదలచాటునుండి వచ్చి నీట్లోకి ఉరికి రక్షించేయ్‌. తను థాంక్స్‌ చెప్పబోతే 'థాంక్స్‌ కాదు, నీ ప్రేమ కావాలి' అను.''

రాంపండు కళ్లలో  ఎడ్మిరేషన్‌. ''ఒరేయ్‌, అనంతం... అచలపతి నీ దగ్గర చేరిన తర్వాత నీకు తెలివితేటలు పెరిగిపోయాయిరోయ్‌.'' అని ఒకటే మెచ్చుకోవడం... ఉక్రోషంతో అనంత్‌కి మాటలు రాలేదు. 'వీడికి సాయం చేయకపోతే ఏం' అన్న ఆలోచన కూడా వచ్చింది కానీ అంతలోనే తన లాభం కూడా దీంట్లో ఇమిడి ఉందని గుర్తు తెచ్చుకుని ''సర్లే, రేపు సరిగ్గా నాలుగు గంటలకే ఏడు'' అన్నాడు.

**********

మర్నాడు మూడున్నరయినా షాలిని కనబడకపోవడంతో అనంతానికి ఖంగారు పుట్టింది, రాంపండు పొదల్లో ఎంతసేపు ఉండవలసి వస్తుందోనని. మూడు ముప్పావవుతూంటే షాలిని కార్లోంచి దిగింది. అదీ ఓ ఫ్రెండుని వెంటేసుకుని. ''మా క్లాసుమేటు సుజాత. పల్లెటూళ్లో పొలాలు, తోటలు చూస్తానని ముచ్చటపడింది. బస్టాండ్‌కి వెళ్లి రిసీవ్‌ చేసుకున్నాను. కాఫీ తాగేసి, మనం ముగ్గురం కలిసి తోటకు వెళదాం.'' అంది షాలిని ఎపాలిజిటిక్‌గా.

''అవునండి. నాకు విలేజెస్‌ అంటే చాలా ఇష్టం'' అంది సుజాత అందమైన కళ్లు టపటపలాడిస్తూ. 

అనంతానికి గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టయింది. వెంటనే వెలక్కాయ ఉమ్మేసి, గొంతు సవరించుకుని ''సుజాత ఒక్కత్తే వెళ్లి చూస్తే ఇంకా ఎక్కువ ఎంజాయ్‌ చేస్తుందేమో, షాలినీ, మనిద్దరం విడిగా వెళదామా?'' అన్నాడు.

అనంతం మాటలకు షాలిని ఓరగా చూస్తే, సుజాత మనోహరంగా నవ్వి, ... ''ఓకే క్యారీ ఆన్‌, ఐ కెన్‌ అండర్‌స్టాండ్‌'' అంది అతి ఉదారంగా.

అరగంటసేపు నడిచిన తర్వాత కూడా అనంతానికి విషయం ఎలా మొదలు పెట్టాలో తెలియలేదు. ఇటు షాలిని చూస్తే ఏమేమో ఊహించేసుకున్నట్టుగా ఉండి. దగ్గర, దగ్గరగా అంటిపెట్టుకుని నడవడానికి చూస్తోంది. అటు చూస్తే వంతెన దగ్గర పడుతోంది. ఇంట్రడక్షన్‌ లేకుండా రాంపండు నీట్లోకి ఉరికితే స్విమ్మింగ్‌ కోసమేమోనని షాలిని పొరబడే ప్రమాదం ఉంది. ఇక లాభం లేదని అనంతం గొంతు సవరించుకున్నాడు.

''షాలినీ, మా ఫ్రెండు  ఒకడు... ఉన్నాడు. నువ్వంటే పడిఛస్తాడు...'' అన్నాడో లేదో, షాలిని ఇంకో ఓరచూపు విసిరింది. ''అలాగా పాపం...'' అని.

ఛస్తున్నాడని ఓ పక్క చెబుతూంటే ఇంత సరదాగా మాట్లాడడం అనంతానికి నచ్చలేదు. డోసు చాల్లేదనుకున్నాడు. ''అతని దృష్టిలో నువు నడిచే నేల ఓ పూదోట. నీ చూపు ఓ కన్నె కమ్మటి చూపు.... ఓ లతాంగి.... చూసే లాలిత్యపు చూపు. ఓ దేవత చూసే కారపు... కాదు... కాదు... కారుణ్యపు చూపు.''

షాలిని కళ్లు పెద్దవయ్యాయి. ఆ కళ్లల్లో ఆరాధనాభావం ప్రవేశించింది.  ''అనంత్‌, నీ గురించి మీ అత్తయ్య చెప్పింది తప్పు. నీ కింత కవిత్వం వచ్చని ఆవిడ చెప్పనే లేదు. చూశావా....?'' అంది ఫిర్యాదు చేస్తూ.

అనంత్‌ ఖంగారు పడ్డాడు. ''ఇది నా కవిత్వం కాదు. ఆ ఫ్రెండుది'' అని నిజాయితీగా చెప్పేశాడు.

వెంటనే  షాలిని  చిలిపిగా చూస్త్తూ.... ''మరి ఆ ఫ్రెండు నా ఎదుటబడి చెప్పడేం?'' అంది బుంగమూతి పెట్టి.

''అతనికి భయం... బెరుకు... ఇప్పుడున్న అవకాశం కూడా చేజారిపోతుందన్న సంకోచం'' అన్నాడు అనంతం. 

''చూశావా.... మళ్లీ కవిత్వం... ఈ మాటలు కూడా అతనివేనా?'' అంది షాలిని  పగలబడి నవ్వుతూ.  'సొరంగంలో నుండి రైలు వెళ్లేటంత గట్టిగా నవ్విందిరా బాబూ ఈ శాండో' అనుకున్నాడు అనంత్‌. కాస్త దూరంలో వంతెన మీద ఫిషింగ్‌ చేస్తున్న బుజ్జిగాడూ అదే అనుకున్నాడేమో! వెనక్కి తిరిగి చూసి ''అంతగట్టిగా నవ్వకక్కా! చేపలన్నీ బెదిరి పారిపోతాయి'' అన్నాడు విసుగ్గా.

అనంత్‌ అదృష్టం కొద్దీ షాలిని దృష్టి తమ్ముడి మీదకు మరలింది. ''అయ్యో, వాడు అంచుమీద కూచున్నాడు. పడిపోతాడేమో'' అని గాభరాపడింది.

వచ్చిన అవకాశాన్ని అనంత్‌ పోగొట్టుకోదలచుకోలేదు. ''నువ్విక్కడే కూచో. నేను వెళ్లి మీ తమ్ముడికి చెప్పి వస్తాను'' అన్నాడు.

వంతెన ఎక్కిన తర్వాత బుజ్జిగాడిని చేరుకోవడానికి పదడుగుల కంటె ఎక్కువ నడవనక్కరలేదు. కానీ అనంత్‌కి ఆ పది అడుగులూ పది మైళ్ళనిపించింది. ఒక మైలు నడిచాక చూస్తే,  రెండో మైలు మరింతదూరం వెళ్లిపోయినట్టనిపించింది. చిన్నప్పుడు స్కూల్లో వేసిన వేషం వేసిన నాటకం గుర్తుకు వచ్చింది. ఫ్రెండ్స్‌ బలవంతం మీద ఓ చిన్న వేషం కట్టాల్సి వచ్చింది. ఖాళీగా ఉన్న స్టేజి మీదకు నడిచివచ్చి ట్రేను టీపాయ్‌ మీద పెట్టాలి అంతే. రిహార్సల్స్‌లో గబగబా వాకింగ్‌ రేస్‌లోలా నడిచేయకు అని చెప్పడం వల్ల నెమ్మదిగా నడవడం ప్రాక్టీసు చేశాడు. నాటకం రోజున అది కొంప ముంచింది. ఆ స్టేజి ఓ పెద్ద.. ఎంతకీ తరగని ఎడారిలా... అనిపించింది. ప్రకృతి అంతా ఊపిరి స్తంభింపజేసి తననే గమనిస్తున్నట్లు అనిపించింది. నడుస్తున్న కొద్దీ టీపాయ్‌ మరింత దూరం వెళ్లిపోయినట్టనిపించింది.

ఇప్పుడు అదే ఫీలింగ్‌తో సతమతమవుతున్నా నడక ఆపకుండా ముందుకు సాగి, బుజ్జిగాణ్ని చేరుకోవడం. ''హలో'' అని పలకరించడం జరిగింది.

అక్కకు అనంత్‌ మీద ఉన్న ఇంట్రస్టులో పదోవంతు కూడా తమ్ముడికి లేనట్టుంది. వెనక్కి తిరక్కుండా, పలక్కుండా ఎడమ చెవి కాస్త ఆడించి ఊరుకున్నాడు. తనను ఇంత నిర్లక్ష్యం చేసిన కుర్రవెధవను రాంపండు ఎఫైర్‌ లేకపోయినా నీట్లో తోసేయడం తప్పు లేదనిపించింది అనంత్‌కి.

''హలో, ఫిషింగా?'' అంటూ భుజం మీద చెయ్యి వేసాడు.

''ఏయ్‌... జాగ్రత్త, పడేశేట్టున్నావ్‌'' అన్నాడు కుర్ర కాలజ్ఞాని.

మనసులో ఉద్దేశ్యం బయట పడిపోయాక ఇక అనంతానికి తప్పలేదు. 'నౌ ఆర్‌ నెవర్‌' అనుకుని కళ్లు మూసుకుని ఒక్క తోపు తోసేశాడు. భళ్లుమన్న శబ్దం, ఓ కేక వగైరా వినబడ్డాయి కానీ పొదల్లోంచి లేచి మనిషి పరిగెత్తిన శబ్దం వినబడలేదు.

అనంత్‌ కళ్లు తెరిచిచూసాడు. బుజ్జిగాడు నీటిపైకి తేలుతున్నాడు. ''హెల్ప్‌'' అని అరిచాడు అనంత్‌  పొదలను ఉద్దేశించి! పొదలు కదల్లేదు.

''హెల్ప్‌రా బాబూ!'' అని అసహనంగా పొదల్ని తిట్టాడు అనంత్‌.

అయినా పొదల్లో కదలిక లేదు. తన నటనా జీవితం తాలూకు జ్ఞాపకాలు అనంత్‌ని చుట్టుముట్టాయి. ఆ రోజూ అంతే. పనివాడి వేషంలో ట్రే టీపాయ్‌మీద పెట్టాక హీరోయిన్‌ వచ్చేదాక నిలబడాలి. కానీ ఆ మాయదారి హీరోయిన్‌ టైముకి రాలేదు. రిబ్బన్‌ మాచ్‌ కాలేదని గ్రీన్‌రూమ్‌లో పోట్లాట వేసుకుని కూచుంది. దర్శకత్వం వహిస్తున్న డ్రాయింగు మాష్టారు ఆమెను తిట్టి తీసుకొచ్చేదాకా అనంత్‌ అలాగే నిలబడిపోవలపి వచ్చింది - ప్రేక్షకుల అసహనపు దృక్కులు భరిస్తూ,. 'కవులు రాసే 'కాలం స్తంభించడం' అంటే ఇదే గాబోలు' అనుకుంటూ చేతులు నులుముకుంటూ.

అంతలోనే అనుమానం వచ్చేసింది. ''నాలుగంటలకల్లా ఏడు'' అని తను అన్నదాంట్లో ఏడు మైండ్‌లో రిజిస్టరయిపోయి తోపుడు  కార్యక్రమం ఏడు గంటలకి అనుకున్నాడా అని. కావచ్చు. ఇక ఆలోచించే టైము లేదు. ఇవతల బుజ్జిగాడు టపా కట్టేయచ్చు. వాడిలాటి వాడు భూమి మీద ఉండకపోతే సంతోషమే అయినా ఆ  పని తన చేతుల మీదుగా జరగడం అనంత్‌కి ఇష్టం లేకపోయింది.

'తప్పదురా దేవుడా' అనుకుంటూ నీట్లోకి ఒక్క గెంతుగెంతాడు. పది సెకండ్లు దాటకుండా పైకి తేలాడు. కానీ చేతిలో బుజ్జిగాడి చొక్కా కాలరు లాటి పదార్థం, దాంట్లో బుజ్జి లేవు. అది సినిమాలలోనే జరుగుతుంది కాబోలు అనుకుంటూ కళ్లు తుడుచుకుని అటూ ఇటూ చూసేసరికి బుజ్జిగాడు పది గజాల దూరంలో గబగబా ఈదుకుంటూ పోతున్నాడు. 'రక్షించబడాలన్న కోరిక వాడికి లేకపోతే మనమేం చేస్తాం?' అనుకుని సర్దిచెప్పుకుని అనంత్‌ ఈసురో దేవుడాని ఈదుకుంటూ ఒడ్డుకి చేరేసరికి బుజ్జిగాడు తిట్టుకుంటూ వెళ్లిపోవడం జరిగింది.

గట్టున చేరిన అనంత్‌కి మళ్లీ సొరంగంలో రైలు... ఈసారి తూఫాన్‌ మెయిల్‌... ప్రత్యక్షమయింది. షాలిని పొట్ట చేత్తో పట్టుకుని పడిపడి నవ్వుతోంది. మధ్యమధ్యలో, ''అబ్బ... అబ్బ.... ఏం ప్లానురా బాబూ'' అనడం. మళ్లీ కాళ్లు నేలకేసి తంతూ నవ్వడం. ఆ శాండో తాపులకు వంతెన పునాదులు కదిలిపోతాయేమోనని భయపడుతూనే ''ఏం ప్లాను?'' అని అడిగాడు అనంత్‌ బెదురుతూ.

''అబ్బ, చిలిపి. ఏమీ తెలియనట్టు... ఎలాగైనా నా ప్రేమ పొందుదామని.... పాపం బుజ్జిగాణ్ని నీట్లో తోసేసి... నేను చూశానులే... నువ్వు కళ్లు మూసుకుని... నా పేరే జపిస్తూ... తోసేశావ్‌. బుజ్జిగాడు స్విమ్మింగ్‌ ఎక్స్‌పర్ట్‌ కాబట్టి సరిపోయింది. మరొకరెవరైనా అయితే...? ఇది బాలేదు.... డియర్‌'' అంది శాలిని దగ్గరికి చేరి.

తడిసిన బట్టల వల్ల కన్నా షాలిని  వల్ల మరింత వణికాడు అనంత్‌. అయినా ''భలేదానివి...''  అన్నారు. వణుకు తెలియకుండా మేనేజ్‌చేసూ.్త

''నేను కాదు నువ్వే భలేవాడివి. మనస్సులో ఉన్న ప్రేమ బయట పెట్టడానికి అంత డొంక తిరుగుడు ఎందుకు చెప్పు. మీ ఫ్రెండంటావ్‌... పైకి చెప్పడానికి బెరుకంటావ్‌. నన్ను ఇంప్రెస్‌ చేయడానికి తెలుగు సినిమా స్టయిల్‌ కాపాడ్డం సీనొకటా?... నువ్వు నాకు నచ్చావ్‌. ఇప్పుడే మీ అత్తయ్యగారికి ఫోన్‌ చేసి చెప్పేస్తా.'' అని అంటూనే బంగళా వైపు పరిగెత్తింది షాలిని.

***********

నీళ్లోడుతున్న బట్టలతో కాళ్ళీడ్చుకుంటూ అనంత్‌ బంగళా వైపు వస్తూండగా రాంపండు గొంతు వినబడింది. - 'ఏ నిమిషానికి ఏమి జరుగునో' అనే పాట పాడుతూ ! ఎక్కడున్నాడో కనబడక ''ఒరేయ్‌ రాంపండూ'' అని పిలిచాడు అనంత్‌. పక్కన ఎవరో ఉన్నట్టున్నారు. 'జస్ట్‌ ఎ మినిట్‌' అంటూ రాంపండు వచ్చిపడ్డాడు.

''గుడ్‌, సరిగ్గా నీకోసమే చూస్తున్నాను రా. భలే కనబడ్డావ్‌. ఒరేయ్‌, అనంతూ నీకో విషయం... విషయం ఏమిటిలే ... గొప్ప సంగతి చెప్పాలిరా'' అన్నాడు రాంపండు పొంగిపోతూ.

''ఒరే సన్నాసీ, ఎక్కడ చచ్చావురా? ఏడు అంటే. ఏడవమని కానీ, ఏడుగంటలని కాదురా....''

రాంపండు కళ్లల్లో ఆశ్చర్యం. ''అదా? ఆ పొదల సంగతా? అది వదిలేయ్‌. అదంతా కాన్సిల్‌. నీతో చెబుదామంటే నువ్వెక్కడా కనిపించలేదు''.

''కాన్సిల్‌ ఏమిట్రా.... నీ శార్ధం? ఇవతల నేను నీట్లో మునిగి చచ్చి ఉంటే....''

''ఒరే ఎంతసేపూ నీ గోలేనా... నా సంగతి వినిపించుకోవా? నేను ఆ పొదల దగ్గరకు వద్దామనే అనుకున్నానురా... బాబూ. మూడున్నరకే బయలుదేరాను కూడా.  కానీ అంతలోనే ఓ అద్భుతం జరిగింది. ఒక అందాల దేవత. ఒక ప్రేమైకమూర్తి, చూపుల్లో తేనె,  పలుకుల్లో పంచదార.... తొలి చూపులోనే ప్రేమ పుట్టిందంటే పుట్టదూ? ఎవరా అనుకున్నాను. షాలిని ఫ్రెండుట. పేరు సుజాత. జస్ట్‌ ఇప్పుడే ఊళ్లోకి అడుగుపెట్టింది. నా కంటబడింది. తనను తీసుకునే వాకింగ్‌కి బయలు దేరాను. పల్లెటూళ్లంటే ఇష్టంట. జానపద గేయాలు పాడి వినిపించమంది.  నాకొచ్చిన సినిమా పాటలనే ఫోక్‌లోర్‌ పాటలుగా ఫిరాయిస్తున్నాను. ఆమెది ఒక చూపా? కాదు, కన్నెపిల్ల కమ్మని...''

''మరి షాలిని....?'' అన్నాడు అనంత్‌ గొంతు ఆర్చుకుపోతూండగా.

''అదంతా ఓ గతం. పాసింగ్‌ ఫేజ్‌. ప్రేమ కాదురా అది. ఒట్టి వ్యామోహం. అది క్షణికం. ఇది ప్రేమ, శాశ్వతం. నన్ను పూర్తిగా చెప్పనీ... సుజాత చూపు కన్నెపిల్ల కమ్మని...''

అనంత్‌ వినలేదు. ఆగలేదు. భారమైన అడుగులు వేసుకుంటూ బంగళా వైపు సాగిపోయాడు.

(పి జి ఉడ్‌హవుస్‌ రాసిన ''The Pride of Woosters is Wounded, The Hero's Reward  '' అనే రెండు కథల ఆధారంగా సాగిన రచన, 2002లో ''హాసం''లో ప్రచురితం)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?