Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : కొసరు కొమ్మచ్చి - 12

ఆగుదాం, ఏం ఫర్వాలేదు : కథారమణీయం మొదటిభాగం జనవరి 2001లో విడుదలైంది. వారికి చాలా కమిట్‌మెంట్స్‌ వుంటాయి కదా. దానికి తోడు కాస్త తటపటాయింపు కూడా వుంది. రమణగారు ఆ సంపుటాన్ని బాపుకి అంకితం యిస్తూ, తనను కష్టకాలంలో ఆదుకున్న తొమ్మిదిమంది అమ్మలను స్మరిస్తూ, నమస్కరిస్తూ మొదటిపేజీ తయారుచేశారు. వాళ్లల్లో కొందరు అప్పటికే లేరు. మరి కొందరు వయసులో పెద్దవాళ్లు. ఈ సంపుటం వెలువడి వాళ్ల చేతిలో ఆ కాపీ పెట్టాలని రమణగారి ఆశ. పుస్తకం ఆలస్యం కావడంతో కంగారు పడసాగారు. చివరకు పుస్తకం చేతికి వచ్చాక వెళ్లి స్వయంగా యిచ్చి వాళ్ల ఆశీర్వాదాలు అందుకున్నారు. ఆ తర్వాత త్వరలోనే వారిలో యిద్దరు పోయారు. 

పుస్తకం మార్కెట్లోకి వస్తూనే సెన్సేషనల్‌ హిట్‌. ఏడాదికి ఓ సంపుటం చొప్పున వేద్దామనుకున్న విశాలాంధ్రవారు రెండో భాగం వేయడానికి తొందర పడ్డారు. నేను బ్యాంక్‌ ఉద్యోగం వదలి ''హాసం'' పత్రిక మేనేజింగ్‌ ఎడిటర్‌ నయ్యాను. పత్రిక బాధ్యతల వలన యీ పని వెనుకపడింది. విశాలాంధ్ర వారు అసహనంగా ఫీలయ్యారు. ''పుస్తకాలు అమ్ముడుపోవడమే కష్టమైన యీ రోజుల్లో డిమాండ్‌ వున్న పుస్తకాన్ని యిలా ఆలస్యం చేయడం సబబు కాదు'' అని కాస్త కోప్పడ్డారు. 

నేను గిల్టీగా ఫీలయ్యాను. ''పోనీ వేరేవారు సంపాదకత్వం వహించినా నాకు అభ్యతరం లేదు. మెటీరియల్‌ అంతా యిచ్చేస్తాను.'' అన్నాను. 

కానీ రమణగారు అడ్డుపడ్డారు. ''ప్రసాద్‌గారికి ఎప్పుడు వీలుపడితే అప్పుడే తెద్దాం. వేరేవాళ్లు చేయడానికి నేను ఒప్పుకోను.'' అన్నారు. 

సాధారణంగా పుస్తకంలో రచయిత అడ్రసు యిచ్చేవారు కారు. నేను ముందుమాటలో 'ఈ సంపుటంపై మీ అభిప్రాయాలను రచయితకు గాని, సంపాదకుడనైన నాకు గాని తెలియపరచవలసినది అంటూ మా పోస్టల్‌ అడ్రసులు, ఫోన్‌ నెంబర్లు యిచ్చాను. దీని వలన అందరికీ రమణగారి అడ్రసు తెలిసింది. ఉత్తరాల ద్వారా, ఫోన్ల ద్వారా ఆయనకు ఫోన్‌ చేసి అభినందించసాగారు. వారిలో చాలామంది యువతీయువకులు వుండడం ఆయనకు అమితానందాన్ని చేకూర్చింది. తన రచనలు పాతతరం  వాళ్లకే తప్ప కొత్తతరానికి నచ్చవన్న అభిప్రాయం వుండేదేమో. థ్రిల్‌ అయిపోయారు. 'మీ కారణంగా కొత్త తరానికి పరిచయమయ్యాను. అప్పుడేదో రాశాను కానీ వాటికి యింత ఆయుర్దాయం వుంటుందని అనుకోలేదు.'' అనసాగారు. రెండో సంపుటం త్వరగా వస్తే బాగుండునని ఆయనకూ వుంది. మొదటిది హిట్‌ అయింది కాబట్టి రెండోది యింకా బాగా చేయాలన్న తపన నాకుంది. మధ్యలో బాపుగారు 'మీ ప్రసాద్‌కు ''హాసం'' అనే కొత్త లవర్‌ దొరికింది. నిన్ను వదిలేశాడు' అని టీజ్‌ చేయడం మొదలుపెట్టారు. రమణగారు ఓపిక పట్టారు. 

రెండో సంపుటంలో ''కన్నీటిపాట'' కథ పెట్టాను. దానిలో చిన్న ఎడిటింగ్‌ అవసరం పడింది. ఒక్క అక్షరం తీసినా ఒప్పుకోనని విశాలాంధ్రతో పోట్లాడిన నేను యిలా ఎడిటింగ్‌ చేయడానికి కారణం వుంది. ప్రాథమిక విద్యార్థులకోసం సిలబస్‌ తయారుచేసే కమిటీలో రమణగారు వున్నపుడు ''రామదాసు'' కథను పాఠంగా పెట్టడానికి ఆయన యిష్టపడలేదు. 'ప్రభుత్వ సొమ్మును తన యిష్టప్రకారం వాడుకోవచ్చనే రాంగ్‌ మెసేజ్‌ వెళుతుంద'ని ఆయన భయం. ఆ కమిటీలో వున్న ప్రఖ్యాత రచయిత, వృత్తిరీత్యా ఉపాధ్యాయులు అయిన మధురాంతకం రాజారాం గారికి రమణ దృక్కోణం నచ్చలేదు. 'ఈ రమణ ఏమంత రచయిత? నాకు అతని రచనల్లో హాస్యమే కనబడదు. అతని మాటలు పట్టించుకోవడం ఎందుకు' అన్నారుట. దాంతో రమణగారు అప్పుడు తను రాస్తున్న యీ కథలో ''.. మధురాంతకం వారికి రమణ రచనల్లో హాస్యం కనబడినంత ఒట్టు..'' అని రాసేశారు. అది యిప్పుడు పుస్తకరూపంలో రావడం అనవసరం అనిపించింది. ఎవరికైనా ఆసక్తి కలిగితే యీ వివాదమంతా గుర్తు చేసుకుంటారు కదా అనుకున్నాను. రమణగారితో చెప్పకుండానే తీసేశాను. 

పుస్తకం అచ్చుకి వెళుతూంటే రమణగారు ఓ సారి ఫోన్‌ చేశారు. 'ఒక విషయమండీ, 'కన్నీటిపాట..' కథలో..' అంటూ మొదలుపెట్టగానే 'రాజారాంగారి ప్రస్తావనే కదా, తీసేశానండీ' అన్నాను. ఆయన ఆనందాశ్చర్యాలతో 'మంచిపని చేశారు. అదే చెప్దామనుకున్నాను. మీరే తీసేశారు.'' అన్నారు.

''ఇప్పుడు రాజారాంగారు లేరు కదా, అది లేకపోయినా కథకు లోపం రాదు కదా..అని, మీతో చెప్పకుండానే..'' 

''రాజారాంగారు వున్నా తీసేయించేవాణ్ని. అప్పుడేదో తిక్కలో అలా రాశాను. తర్వాత ఫీలయ్యాను. నాకు ఆయనంటే చాలా గౌరవం. పెద్దాయన... పోనీ లెండి, మీరు నన్ను అడక్కుండానే చేసేశారు. అందుకే మిమ్మల్ని మంచి ఎడిటర్‌ అంటాను.'' అన్నారాయన.

అప్పుడు తీసేసినవాణ్ని యిప్పుడు చెప్పడం దేనికంటే రమణగారి వ్యక్తిత్వం గురించి తెలియపరచడానికే! దరిమిలా ''కోతికొమ్మచ్చి'' ప్రారంభించినపుడు మొదటి  నాలుగు వారాల మేటరు నాకు ముందుగా పంపించారు. మొదటి భాగంలోనే ఆయన కొంపతీసిన ఋణగ్రస్తుడి ప్రస్తావన వుంది. 

''వద్దండీ, ఆత్మకథ రాయడానికి మీకు ఛాన్సు యివ్వగానే పాతపగలు తీర్చుకున్నారనుకుంటారు. మీ బాధ పాఠకుడి బాధ కాదు కదా. 'పెద్దాయన.. యివన్నీ పట్టించుకోకూడదు' అనుకుంటారు. అంతకంటె పుట్టెడు డబ్బు కంటె పట్టెడు అన్నం గొప్పదన్న ఎపిసోడ్‌ ముందుకు తీసుకురండి.'' అని సలహా చెప్పాను. 

ఆయనకు యీ సలహా ఎంతో నచ్చింది. ''మీరు చెప్పినది నూటికి నూరు శాతం కరక్టు. పెద్ద పొరబాటు జరిగి వుండేది. యూ సేవ్‌డ్‌ మీ ఫ్రమ్‌ ఎంబరాస్‌మెంట్‌'' అని పదేపదే అనేవారు. ఔచిత్యం గురించి ఆయనకు వున్న పట్టింపు చెప్పడానికే యిది చెప్పాను.

''అమరావతి కథలు'' పుస్తకం తయారైనా రమణగారి ముందుమాట కోసం కొన్ని నెలలు ఆగవలసి వచ్చిందట. ఆయన కథారమణీయం - 2 కి నా కారణంగా అదే అవస్థ పట్టింది. చివరకు నవంబరు 2002లో విడుదలైంది. అదీ సూపర్‌ సక్సెస్‌. మూడోది ''బుడుగు'' ఎవర్‌ గ్రీన్‌. వాడు రెండో సంపుటాని కంటె ముందే వచ్చేసి చెలరేగిపోతున్నాడు. పైగా రెండు భాగాలూ ఒకే దానిలో వచ్చాయి కదా. జనాలంతా ఖుష్‌. 

ఇవి కథలు కాబట్టి 'మూవ్‌' అయ్యాయి కానీ కదంబ రమణీయం, సినీ రమణీయం నడుస్తాయా? అన్న సందేహాలతోనే విశాలాంధ్రవారు వేస్తూ పోయారు. సంపుటాల్లో ఆఖరిదైన అనువాద రమణీయం జులై 2006లో వచ్చింది. అన్నీ పునర్ముద్రణలకు వచ్చాయి. దీని విజయం విశాలాంధ్ర వారికి వూపు నిచ్చింది. తర్వాత ఎందరో రచయితల సాహితీసర్వస్వాలు ప్రచురించారు. తెలుగుసాహిత్యానికి ఎంతో మేలు జరిగింది. గత 50 ఏళ్లగా అందుబాటులో లేని భమిడిపాటి కామేశ్వరరావుగారి రచనలు సైతం ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయంటే యిలాటి సంపుటాలకు లభించిన పాఠకుల ఆదరణే అని చెప్పాలి. సినీరమణీయం - 2 లో వేసిన ''కథానాయకుని కథ'' విశాలాంధ్రవారు విడిగా పుస్తకం వేసి అమ్మారు.

సినిమా రచయితగా ముళ్లపూడి :  ''సినీరమణీయం'' తయారు చేసేటప్పుడు రమణగారు సమీక్షించిన సినిమాలు, సినిమా వ్యక్తుల గురించిన వ్యాసాలతో బాటు  ఆయన సినిమా రంగ ప్రవేశం గురించి, తీసిన సినిమాల గురించి చాలా తెలుసుకున్నాను. బాపు-రమణల యింట్లో వున్న ఆల్బమ్స్‌తో బాటు బయటనుండి ఎన్నో ఫోటోలు సేకరించి, అందంగా కూర్చాను. అప్పటికి వీడియోలు అందుబాటులోకి వచ్చి అప్పటిదాకా చూడని బాపురమణల సినిమాలు కూడా చూడగలిగాను. ఎందుకంటే యిదంతా ఆయన సాహిత్యం గురించిన వ్యాసమే కాబట్టి డైలాగు రచయితగా రమణ గురించి యిక్కడే చెప్పాలి. ఈ వ్యాసాన్ని యిటీవలే తెలుగు సినీరచయితల సంఘం వారు వేసిన పుస్తకానికై రాశాను. (సశేషం) 

ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఆగస్టు 2014)

[email protected]

Click Here For Part-1

Click Here For Part-2

Click Here For Part-3

Click Here For Part-4

Click Here For Part-5

Click Here For Part-6

Click Here For Part-7

Click Here For Part-8

Click Here For Part-9

Click Here For Part-10

Click Here For Part-11

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?