Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : క్షవరం - వివరం

ఎమ్బీయస్‌ : క్షవరం - వివరం

క్షవరం అయితే తప్ప వివరం బోధపడదని సామెత. ''ప్రత్యేక హోదా వలన లాభమా? నష్టమా?'' అనే హైస్కూల్లో ప్రసంగించమంటే కావలసినన్ని పాయింట్లు పోగేసుకుని వచ్చారు చంద్రబాబు. అయితే యీ వివరం వుత్తినే రాలేదు. ఢిల్లీలో క్షవరమయ్యాకనే శిరోభారం తగ్గి, కళ్లకు ముందు వేళ్లాడుతున్న ముంగురులు తొలగిపోయి, అన్నీ స్పష్టంగా గోచరించసాగాయి. ''ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలు ఏం బావుకున్నాయి? గత పదేళ్లగా ఆ హోదా అనుభవిస్తూ కూడా ముందడుగు వేయలేక పోయాయి కదా!'' అనే జ్ఞానోదయం కలిగింది. జ్ఞానోదయం కలిగిన బుద్ధుడు ''కోరికే అన్ని దుఃఖాలకు మూలం. దాన్ని విడిచి పెడితేనే సద్గతి'' అని లోకులకు బోధించి బోధిసత్వుడయ్యాడు. ఇప్పుడు బాబుకు కూడా జ్ఞానోదయం అయ్యాక దాన్ని తనకే వుంచేసుకోవాలని అనుకోకుండా మనందరికీ పంచారు. ''చీకట్లో తాడును చూసి పామని భ్రమిస్తాం. మనకు ప్రత్యేక హోదా లేదు కాబట్టి, అవి వున్న రాష్ట్రాలు ఊహూ ముందుకు వెళ్లిపోతున్నాయని భ్రమ పడ్డాం. దాని కోసం రాజ్యసభలో డిమాండ్లు, ఎన్నికల్లో వాగ్దానాలు, కోటి సంతకాల ఉద్యమాలు, అధికారికంగా మహజర్లు, ఢిల్లీ యాత్రలు, ఇంకేముంది వచ్చేస్తోంది అనే ప్రకటనలు అనేకం చేశాం. ఇప్పుడు భ్రమ తొలగింది. అది కేవలం తాడే, ప్రత్యేక హోదా పేరు తగిలించుకున్నా అదీ మామూలు రాష్ట్రమే అనే ఎఱిక కలిగింది.'' అని చెప్పి మన కళ్లు కూడా తెరిపించారు.  

 అసలు తాడు అనే మూలపదార్థం మీద పాము అనే భావాన్ని సూపర్‌ యింపోజ్‌ చేసినదేమిటి? అంధకారం, మన అజ్ఞానం, అవిద్య! వెలుగు వెలగగానే జ్ఞానం కలగగానే పాము మాయమై పోయింది. తాడు మాత్రమే మిగిలింది. బాబు గారి దయవలన యిప్పుడు మనం విద్యావంతులమయ్యాము కాబట్టి ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలు పేరులోనే ప్రత్యేకమైనవి, అభివృద్ధి విషయంలో వెనకబడిన రాష్ట్రాలు అనే విషయాన్ని గ్రహించాం. ఈ తెలివిడి రావడానికి యిన్నాళ్లూ రెండేళ్లు పట్టింది. ఈ జ్ఞానం యింకా రాక నితీశ్‌ కుమార్‌ బిహార్‌కు ప్రత్యేక హోదా అడిగారు. తెరాసవారు తెలంగాణకు అడుగుతున్నారు. రజ్జుసర్పభ్రాంతిలో మన బుద్ధిని కమ్మివేసేది మాయ. మరి ప్రత్యేక హోదా విషయంలో అదేదో గొప్ప విషయంగా మనల్ని కమ్మివేసినదేమిటి? రాజకీయ పార్టీల ప్రచారమాయ. వారిలో అగ్రతాంబూలం అందుకోవలసినది బిజెపి. రాష్ట్రవిభజన సమయంలో ఆంధ్రప్రాంత ప్రజలు ఆ హోదా గురించి అడగలేదు. హైదరాబాదు మాకు కావాలి, లేదా అందరికీ అందుబాటులో వుండే యూటీ చేయాలి తప్ప సాంతం తెలంగాణకు యివ్వడానికి వీల్లేదు అనే గోల తప్ప మరొకటి వినిపించలేదు. విభజన బిల్లు తయారుచేసిన జయరాం రమేశ్‌, జయపాల్‌, చిదంబరం యిత్యాది కాంగ్రెసు నాయకులూ దాని గురించి ఆలోచించలేదు. తక్కినవన్నీ గొరిగేసి హైదరాబాదుని పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా వుంచితే చాలు అనుకున్నారు. లోకసభలో అలాగే బిల్లు పాస్‌ చేయించేశారు. దానికి బిజెపి, టిడిపి తెలంగాణ యూనిట్‌ వంటివి వంత పాడాయి. ఆంధ్ర ప్రాంతపు ఎంపీలు అడ్డుకోబోతే తెలంగాణ కాంగ్రెసు, టిడిపి నాయకులు వారికి దేహశుద్ధి చేశారు.

రాజ్యసభకు వచ్చేసరికి బిజెపి సహకారం మరింత కావలసి వచ్చింది. ఉన్నదున్నట్టుగా పాస్‌ అవనివ్వకూడదని బిజెపి నిర్ణయించింది. అప్పుడు యీ ప్రత్యేక హోదా గురించిన ఆలోచన వెంకయ్య నాయుడుగారికే తట్టిందని ఆయనే చాటుకున్నారు. తెర వెనుక కాంగ్రెసుతో మంతనాలు సాగాయి. బిల్లులో మార్పులు చేర్పులు చేస్తే మళ్లీ లోకసభకు వెళ్లాల్సి వస్తుంది. అక్కడ మళ్లీ దీపాలార్పేసి చీకటి వ్యవహారం చేయడం యీసారి కష్టమేమో అనుకున్నారు. కాంగ్రెసు, బిజెపి రెండూ కుమ్మక్కయి మన్‌మోహన్‌ 'ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా' అనే ప్రకటన చేశారు. వెంకయ్యనాయుడు పదేళ్లు అని డిమాండ్‌ చేసి, 'సరేలే, ఎలాగూ అధికారంలోకి వచ్చేది మేమేగా, రాగానే పదేళ్లు యిచ్చి తీరతాం' అని గంభీర ప్రకటన చేసి ఆంధ్రుల జేజేలు అందుకున్నారు. బిల్లులో లేకపోయినా ప్రధాని రాజ్యసభలో చేసిన ప్రకటనగా దానికి విలువ వచ్చింది. ఆంధ్ర ఎన్నికల ప్రచారంలో కాంగ్రెసు ఐదేళ్లు యిచ్చామని చెప్పుకుంటే  'మేం అడిగితేనే యిచ్చారది, మేం పదేళ్లిస్తాం, ఆట్టే మాట్లాడితే పదిహేనేళ్లు యిస్తాం. అది యిస్తే మీ రాష్ట్రాన్ని ఎవరూ పట్టుకోలేరు. పక్క రాష్ట్రాల నుంచి పెట్టుబడులు వరదలై పారతాయి. వాళ్లంతా మిమ్మల్ని చూసి కుళ్లుకుని ఛస్తారు. అందుకే మీకు యివ్వద్దని కాలడ్డుపెడుతున్నారు. మీతో పాటు మాకూ యిమ్మనమని వంతులకు వస్తున్నారు.'' అంటూ ఎన్నికలలో డప్పు  కొట్టి ఆంధ్రులను తెగ వూరించారు. టిడిపి కూడా అంతే ధాటీగా ఢంకా బజాయించి ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనేసింది. అంటే మనల్ని కమ్మిన మొదటి మాయ బిజెపి, టిడిపి కూటమి అన్నమాట.

అప్పటిదాకా ఆ హోదా ఏమిటో, దాని కథాకమామీషూ ఏమిటో, ఎవరెవరికి యిచ్చారో ఏమీ తెలియని సామాన్య ఓటరు కూడా అదేదో వస్తే స్వర్గం భూలోకానికి దిగి వచ్చినట్లే అని మురిసిపోయాడు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెసును భూస్థాపితం చేసి, ప్రత్యేక హోదా సాధించిపెట్టిన బిజెపికి, దాని మిత్రపక్షమైన టిడిపికి పట్టం కట్టారు. ఎన్నికల అనంతరం కేంద్రంలో అధికారం బిజెపికి, రాష్ట్రంలో అధికారం టిడిపికి కైవసం అయ్యాయి. రెండూ కలిసి యిదిగో వస్తోంది, అదిగో వస్తోంది అంటూ కబుర్లు చెప్పసాగాయి. టిడిపి కేంద్రమంత్రులైతే మరీనూ, తెగ ఓవరాక్షన్‌ చేసేశారు. వాళ్లలా చేస్తూండగానే 'ప్రత్యేక హోదా రావటం రాష్ట్ర ప్రగతికి ఎంతో అవసరం, అది తేవడం వీళ్ల చేత కాక దొంగ నాటకాలు ఆడుతున్నారు, మేం సాధిస్తాం చూడండి' అంటూ కాంగ్రెసు, వైకాపా ఉద్యమాలు, దీక్షలు చేపట్టి వాళ్లూ మనల్ని మాయలో ముంచెత్తారన్నమాట. ఇన్నాళ్లకు బాబు దయతలచి మనకు జ్ఞానజ్యోతి ప్రకాశాన్ని దయచేయించారు. హోదా అనేది ఒట్టి మేడిపండని, కరి మింగిన వెలగపండని అనే విషయం ఆయనకు ముందే తెలిసి వుంటే ఎన్నికలలో, తర్వాత రెండేళ్లలో దాని గురించి యింత ప్రచారం చేసి వుండేవారు కారు పాపం. ఇప్పుడే వివరం బోధపడింది. అలా బోధపడేట్లా చేసినది మోదీ చేసిన క్షవరం. బాబుకి యింకో వివరం కూడా బోధపడింది. ప్రత్యేక హోదాపై స్పందించాల్సిన బాధ్యత బిజెపిది మాత్రమే కాదని, విభజన సమయంలో అన్ని పార్టీలూ కలిసి ఆంధ్రకు అన్యాయం చేశాయని అన్నారు. ఈ ముక్కే కాంగ్రెసూ చెప్తూ వుంటుంది - 'తక్కిన అన్ని పార్టీలూ యిమ్మనమని అన్నాకనే మేం ప్రత్యేక రాష్ట్రం యిచ్చాం. అడ్డగోలుగా విభజించామని మమ్మల్ని నిందించే బాబు కూడా  ఆనాటి సమావేశాల్లో 'ఇది నిలువుగోలు విభజన, యిలా చేయండి' అని సూచించారా? కనీసం అసెంబ్లీలో తన ఉపన్యాసం సందర్భంగా చెప్పారా?' అని. విభజనకు సిపిఎం మినహా తక్కిన అన్ని పార్టీలు బాధ్యత వహించవలసినదే. విభజనకై లేఖ యిచ్చి, తన పార్టీ తెలంగాణ విభాగం ద్వారా ఉద్యమం చేయించి, అఖిలపక్ష సమావేశాల్లో విభజన వాదనలు వినిపించిన బాబు కూడా విభజనకు బాధ్యుడే. 

క్షవరం అనేది పెద్దమాటగా తోచవచ్చు జనాలకు. కానీ ఆంధ్ర రాష్ట్రపు దుస్థితి గురించి బాబు చెప్పిన వివరాలు చదివితే కేంద్రం ఎంత చిన్నచూపు చూసిందో అర్థమవుతుంది.  హోదాను తగ్గించి చూపడానికి బాబు మధ్యమధ్యలో 'హోదా యిచ్చి నిధులు యివ్వకపోతే ఏం ప్రయోజనం?' అంటూంటారు. కాళికాదేవి తెనాలి రామలింగణ్ని పాలా? పెరుగా? అని అడిగినట్లు హోదాయా? నిధులా? అని మోదీ ఆయన్ను అడుగుతున్నారా? రెండేళ్లగా హోదా యివ్వలేదు, సరే నిధులివ్వాలిగా. అదీ యివ్వలేదుగా! మరి దానికి ఏమంటారు బాబు? విభజన చట్టం ప్రకారం రావలసినదేమిటి? బిజెపి నాయకులు ముగ్గురు మూడేసి రకాల అంకెలు చెప్పినా నిజంగా వచ్చిందేమిటి అనే అంశాలతో ఆంధ్ర అధికారులు గణాంకాలు యిచ్చారంటూ ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఇప్పటివరకు కేంద్రం యిచ్చినది 6088 కోట్లేట. ఏపిలో పెట్టుబడులపై అదనంగా 15% సబ్సిడీ, పెట్టుబడుల తరుగుదలపై మరో 15% సబ్సిడీ యిస్తామని హామీ యిచ్చింది కానీ యీ హామీలతో ఏ పెట్టుబడిదారూ ఉత్సాహం చూపలేదని, ఫలితంగా గత 20 నెలల్లో రాష్ట్రానికి ఒక్క భారీ పరిశ్రమా రాలేదని అధికారులు చెప్పారు. ఇక రాజధాని నిర్మాణానికై మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం 1500 కోట్లు ఒకసారి, రాజ్‌భవన్‌, హైకోర్టు వగైరాల నిర్మాణం కోసం 350 కోట్లు యిచ్చారట. 2016-17 బజెట్‌లో అమరావతికి నిధులు కేటాయించలేదు. ఇక రెవెన్యూ లోటు 2014-15లో రూ. 16200 కోట్లు వుందని రాష్ట్రం కేంద్రానికి నివేదిక యిస్తే దానిలో రూ.2803 కోట్లు మాత్రం అందాయి. 2016-17 బజెట్‌లో దీని కోసం ఒక్క రూపాయైనా కేటాయించలేదు. వెనకబడిన జిల్లాల అభివృద్ధికై ప్రత్యేక ప్యాకేజీ యివ్వాలి. దానికి 24500 కోట్లు అడిగితే 700 కోట్లు మాత్రం వచ్చాయి. 2016-17 బజెట్‌లో నిధులు కేటాయించలేదు. పోలవరం బజెట్‌ 30 వేల కోట్లు కాగా రాష్ట్రానికి 735 కోట్లు విడుదల చేసి, యీ ఏడాది బజెట్‌లో 100 కోట్లు కేటాయించారు. 

ఇవీ ఆంధ్రకు వస్తున్న నిధులు, జరుగుతున్న అభివృద్ధి! ఇవన్నీ అధికారుల గణాంకాలే. ఇంతోటి అభివృద్ధి తమ నియోజకవర్గాలలో జరగటం లేదని బాధ పడిపోయిన వైసిపి ఎమ్మెల్యేలు 'అభివృద్ధి కోసం' అంటూ పార్టీ మారుతున్నారు. ఏ పార్టీలో వున్నా ఎమ్మెల్యేకు ఎంపీలకు నియోజకవర్గంలో పనులకై యిచ్చే నిధులు వాళ్లు ఏ మేరకు ఉపయోగించారో తెలియదు. ప్రత్యేక హోదా లేక నాశనమై పోతున్నాం మహాప్రభో అని బాబు చెప్పుకుంటూ వుంటే టిడిపి ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో మాత్రం జరిగిపోతోందని వీళ్లెలా అనుకుంటున్నారో నాకు అర్థం కాదు. వాళ్ల గోల పక్కన పెడితే రెండేళ్ల తర్వాత తేలిందేమిట్రా అంటే ఆంధ్రులకు ప్రత్యేక హోదా లేదు, ప్రత్యేక ప్యాకేజీ లేదు, నిధులూ లేవు. వచ్చే ఏడాది మార్చి వరకు నిధులు రావని యీ బజెట్‌ చెప్పేసింది. ఇక మిగిలినది పొడవైన సముద్రతీరం మాత్రమే. ఆంధ్రులకు యీ వివరం బోధపడడానికే మోదీ వాళ్లకు కూడా క్షవరం చేసేశాడు. మోదీతో బాబు ఏయే అంశాలపై మాట్లాడాలనుకున్నారో ఆ జాబితాను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిందని, దానిలో ప్రత్యేక హోదా అంశం లేదనీ ఆంధ్రభూమి రాసింది. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ బాబు 'నేను ప్రత్యేక ప్యాకేజీ గురించి మాట్లాడలేదు' అన్నారట. ప్రత్యేక హోదా గురించి, ప్రత్యేక ప్యాకేజీ గురించి మాట్లాడకపోవడానికి కారణం ఏమిటై వుంటుంది? 

అవధానాల్లో కవిగారు ఆశువుగా పద్యం చెపుతూ వుంటే ఆయన ఏ పదం చెప్పబోతున్నాడో ముందుగానే వూహించిన పృచ్ఛకుడు 'ఫలానా 'శ' నిషిద్ధం అంటాడు. 'శివుడు' అందామనుకున్న కవి అప్పుడు అక్షరం మార్చి 'హరుడు' అంటాడు. ఈ ప్రక్రియను 'నిషిద్ధాక్షరి' అంటారు. అలా భేటీకి ముందే మోదీ బాబుతో 'ప్రత్యేక' పదం నిషిద్ధం అని చెప్పారేమో! బాబు యిన్నిసార్లు ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిశారు. అసలు వాళ్లిద్దరి మధ్య ఏం జరుగుతోందో బిజెపి తరఫున ప్రతినిధి ఏమీ చెప్పరు. బాబు పెట్టిన 12 డిమాండ్లు గురించి ఈనాడు పెద్ద లిస్టు వేసింది. దానికి అవతలివాళ్లు ఏ మేరకు స్పందించారన్నదే మనకు యింట్రస్టు. రాజధానికి కదలి రమ్మనమంటే ఆంధ్ర వుద్యోగులూ చేంతాడంత జాబితా యిస్తారు బాబుకి.  బాబు సరేనన్నారా లేదా అన్నదే చూస్తాం. మోదీ భేటీ తర్వాత బాబు బయటకు వచ్చి 'సానుభూతితో విన్నారు, తప్పకుండా చేస్తామన్నారు, ఇప్పటికే ఆలస్యమైంది, అయినా మా మీద నమ్మకం పెట్టుకుని, ఓపిక పట్టమన్నారు' అని చెప్పుకుంటూ వుంటారు. మళ్లీ ఎక్కడ వేసిన గొంగళీ అక్కడే వుంటోంది. టిడిపి ఎంపీ శివప్రసాద్‌ పార్లమెంటులో రకరకాల ఏకపాత్రాభినయాలు వేస్తూ వుంటారు. (బయటి వేషాలే తప్ప ఏదైనా విషయంపై ఆయన పార్లమెంటులో ప్రసంగించిన వీడియోలు నేనిప్పటిదాకా చూడలేదు) ఈసారి ఆయన మోదీ, బాబుల మధ్య సంభాషణ అనే స్కిట్‌ ద్వారా బాబుకి జ్ఞానోదయం ఎలా అయిందో తెలుగు ప్రజలకు తెలియవలసినదిగా కోరుతున్నాను.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మే 2016)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?