Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : మారిన బలాబలాలు

ఎమ్బీయస్‌ : మారిన బలాబలాలు

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. హరియాణా ఓటరు పూర్తి మెజారిటీతో బిజెపికి పట్టం కట్టాడు. అల్లుడు వాధ్రా గారి చేతివాటానికి గురైన హరియాణా 9 ఏళ్లగా ఏలుతున్న కాంగ్రెసును ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో తోసిపారేసింది. ప్రధాన ప్రతిపక్షంగా వుంటూ వచ్చిన చౌటాలా కుటుంబ పార్టీ లోకదళ్‌ను కూడా పక్కకు నెట్టేసింది. వారిపై కూడా అవినీతి ఆరోపణలు చాలా వున్నాయి. ముఖ్య నాయకులు జైల్లో వుంటూ బెయిలులో బయటకు వచ్చి ఎన్నికలలో పాల్గొన్నారు. కులప్రాతిపదికపై నడుస్తూ వచ్చిన ఎన్నికల దిశను బిజెపి మార్చింది. సిఎం కాండిడేటు ఎవరో చెప్పకుండానే ఒకే పార్టీ పాలించే సుస్థిరప్రభుత్వాన్ని ఏర్పరచండి అంటూ మోదీ ఎన్నికల సభలో ప్రచారం చేశారు. ఓటరు అతని మాట విన్నాడు. దాదాపు 53% సీట్లు కట్టబెడుతున్నాడు. హరియాణాలో తొలిసారిగా బిజెపి ప్రభుత్వం ఏర్పడుతోంది. ఆప్‌ పార్టీ రాజకీయ ఆత్మహత్య చేసుకోకుండా వుంటే హరియాణాలో పరిస్థితిలో కాస్తయినా మార్పు వుండేదేమో. ఢిల్లీకి సమీపంగా వున్న రాష్ట్రం కాబట్టి, ఆప్‌ నాయకులు హరియాణా ప్రాంతం వారు కాబట్టి, అవినీతి వ్యతిరేక శిబిరంలో ఆప్‌ కూడా ముఖ్యపాత్రధారి కాబట్టి బిజెపి ఓట్లు చీల్చగలిగి వుండేది. కానీ ఢిల్లీ సింహాసనాన్ని చేజేతులా కూలదోసుకోవడం, బలం లేకపోయినా పార్లమెంటు ఎన్నికలలో దేశమంతా పోటీ చేయడం వంటి తెలివితక్కువ పనులు చేసి బలహీనపడింది. ఏమైతేనేం, తన సత్తా చాటుకోవడానికి హరియాణాలో బిజెపికి చక్కటి అవకాశం వచ్చింది. ఇప్పుడు ఎవరిని ముఖ్యమంత్రి చేస్తుందో, అవినీతిరహిత పాలన అందించగలదో లేదో వేచి చూడాలి. ఒక విషయం మాత్రం స్పష్టమవుతోంది. హరియాణా యిచ్చిన వూపుతో పొరుగు రాష్ట్రమైన పంజాబ్‌లో రాబోయే ఎన్నికలలో అకాలీదళ్‌తో పొత్తు నిలవకపోవచ్చు. మహారాష్ట్రలో శివసేనతో పాతికేళ్ల బంధం తెంపుకుని, సొంతంగా నిలబడడం వలనే తన బలమెంతో, భాగస్వామి బలమెంతో తేలింది. అదే ప్రయోగం పంజాబ్‌లో చేయవచ్చు.

ఇక మహారాష్ట్రలో హరియాణా అంత స్పష్టమైన తీర్పు రాలేదు. అందుకే అక్కడ వింతవింత పరిణామాలు చూడబోతున్నాం. అక్కడ బిజెపి సాధించినది విజయమా, ఘనవిజయమా అన్న విషయం చూసే కోణం బట్టి వుంటుంది. మొన్న పార్లమెంటు ఎన్నికలతో పోల్చి పెదవి విరవడం సరైన పద్ధతి కాదు. అప్పుడు మోదీని ప్రధాని చేయాలన్న పట్టుదలతో దేశప్రజలున్నారు కాబట్టి 145 అసెంబ్లీ సెగ్మెంట్లలో బిజెపి గెలిచింది - అది కూడా శివసేనతో పొత్తు పెట్టుకుని. ఇప్పుడు దాని కంటె 22 సీట్లు తక్కువ వచ్చాయి కాబట్టి బిజెపి దెబ్బ తినిపోయినట్లే అనడానికి లేదు. 122 సీట్లు ఒంటరి పోరాటంలో తెచ్చుకోవడం మాటలా? 2009 ఎన్నికలలో శివసేనతో కలిసి తెచ్చుకున్నవి 92! ఇద్దరూ కలిసినా కాంగ్రెస్‌-ఎన్‌సిపి కూటమి కంటె 52 సీట్లు తక్కువ తెచ్చుకున్నారు. శివసేన-బిజెపి కూటమిలో శివసేనదే లీడర్‌షిప్‌. బిజెపి దానికి తోక పార్టీగా వుండేది. చాలా ఏళ్లగా సగానికి సగం సీట్లలో పోటీ చేయటమే లేదు. అలాటప్పుడు అక్కడ క్యాడర్‌ ఏముంటుంది? బిజెపి ఎజెండాను రాష్ట్రస్థాయిలో శివసేన హైజాక్‌ చేసింది. రాష్ట్రస్థాయి నాయకులందరూ శివసేనకు సలాములు కొడుతూ అది చెప్పినట్లే ఆడారు. తమ వ్యక్తిత్వాన్ని నిలుపుకోలేదు. అలాటి పరిస్థితుల్లో బిజెపి శివసేనను కాదని, ఒంటరిగా పోటీ చేసి ఏకైక పెద్ద పార్టీగా అవతరించడం చాలా విశేషంగానే చెప్పాలి. కొందరు ఢిల్లీ బిజెపి నాయకులు గొప్పలకు పోయినట్లు 150 ప్లస్‌ సీట్లు వస్తాయని ఎవరైనా నమ్మి వుంటే వాళ్లు మాత్రమే నిరుత్సాహపడాలి. 

మహారాష్ట్రలో నాలుగు పెద్ద పార్టీలున్నాయని అందరికీ తెలుసు. విడిగా నిలబడితే తలా 20-22% వచ్చి (ఇతర చిల్లర పార్టీలకు, యిండిపెండెంట్లకు 13-14% ఓట్లు పోతాయిగా) ఎవరూ గెలవలేరు. అందుకే కూటమిగా ఏర్పడేవారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెసు-ఎన్‌సిపి కూటమికి 37% ఓట్లు వస్తే బిజెపి-సేన కూటమికి 30% వచ్చాయి. మళ్లీ యీ కూటమిల్లో ఎన్‌సిపి 16% వస్తే నాయకత్వం వహించిన కాంగ్రెసుకు 21%. అలాగే బిజెపికి 14% వస్తే నాయకత్వం వహించిన సేనకు 16%. ఈసారి ఎన్నికల్లో బిజెపి ఒక్కదానికే రమారమి 27% దాకా వచ్చాయి. 27% ఓట్లతోనే 122 సీట్లా అంటే మన ఎన్నికల పద్ధతి అంతే కదా! సేనకు 16% నుండి యీసారి 20% వచ్చాయి. అంటే ఇద్దరికీ కలిపి 47% ఓట్లన్నమాట. కాంగ్రెస్‌ ఎన్‌సిపిలకు చెరో 18% వచ్చి మొత్తం 36% వచ్చాయి.  ఇప్పుడు బిజెపి, సేన విడిగా పోటీ చేసి, కాంగ్రెస్‌-ఎన్‌సిపి కూటమిగా చేసి వుంటే ఫలితం యిలా వుండి వుండకపోవచ్చు. ఇప్పుడు అన్నీ విడివిడిగా పోటీ చేశాయి కాబట్టి ఎవరి బలం ఎంతో తేలిపోయింది. బాల ఠాకరే చనిపోయిన తర్వాత శివసేన క్షీణించి పోతుందని అందరూ అనుకున్నారు. కానీ మొన్న పార్లమెంటు ఎన్నికలలో సేన 99 అసెంబ్లీ సెగ్మెంట్లలో గెలిచింది. అది చూసుకుని 'మా బలం చెక్కు చెదరలేదు, బిజెపికి వచ్చిన ఓట్లు కూడా మా వలనే వచ్చాయి, మేమే లీడర్స్‌, ముఖ్యమంత్రి పదవి మాకే దక్కాలి' అని ఉద్ధవ్‌ అనుకున్నాడు. అందుకే అంత పంతానికి పోయాడు. బాల ఠాకరే మరణం తర్వాత అతని అసలైన వారసుడిగా రాజ్‌ ఠాకరేయే నిలుస్తాడు అనుకున్నారు. అతన్ని బిజెపి అక్కున చేర్చుకుని వుంటే వచ్చిన సీట్లలో ఎవరి వలన ఎన్ని వచ్చాయో మళ్లీ ఊహాగానం చేసేవారు. అదృష్టవశాత్తూ అతనూ విడిగా పోటీ చేశాడు. 1 సీటు తెచ్చుకున్నాడు. (2009లో 13) దాన్ని బట్టి అతనికి బలం లేదని స్పష్టంగా తేలిపోయింది. మహారాష్ట్రలో గత పాతికేళ్లగా 100 కు మించి సీట్లు తెచ్చుకున్న పార్టీ లేదు. ఇప్పుడు బిజెపికి ఆ ఘనత దక్కింది. అందువలన మోదీ-అమిత్‌ షా టీము సాధించిన గొప్ప విజయంగానే దీన్ని చెప్పాలి. అయితే ముంబయి, విదర్భ ప్రాంతాల్లో దక్కినంత విజయం తక్కిన ప్రాంతాల్లో దక్కలేదని, తక్కిన పార్టీలకు తమకంటె ఎక్కువ సీట్లు, ఓట్లు వచ్చాయని గ్రహించాలి.

కాంగ్రెసు పార్టీ 15 ఏళ్లగా అధికారంలో వుండి కూడా 44 సీట్లు తెచ్చుకోవడం విశేషమే. ఎన్‌సిపితో పొత్తు కారణంగా అది దాదాపు సగం సీట్లలో చాలాకాలంగా పోటీ చేయడం లేదు. ఆ పార్టీ అధ్యక్ష, ఉపాధ్యకక్షులు యీ ఎన్నికలను ఏమీ పట్టించుకోలేదు. దేశమంతా కాంగ్రెస్‌ వ్యతిరేక మూడ్‌ నడుస్తోంది. అయినా మహారాష్ట్రలో సొంతంగా 18% ఓట్లు, 15% సీట్లు తెచ్చుకుందంటే సంస్థాగత బలమనే చెప్పాలి. అలాగే ఎన్‌సిపి కూడా - దాని అవినీతిపై తక్కిన పార్టీలన్నీ విరుచుకుపడ్డాయి. అయినా 18% ఓట్లు, 15% సీట్లు తెచ్చుకుంది. అదీ విశేషమే. అందువలన బిజెపికి మూడు బలమైన ప్రతిపక్షాలను తట్టుకుంటూ పాలన సాగించాలి. ఈ మూడిటిలో ఒకదాన్ని మిత్రపక్షంగా చేసుకోకపోతే ప్రభుత్వం ఏర్పడదు, ఏర్పడినా నిలబడదు. కాంగ్రెసుతో పొత్తు అసంభవం. మిగిలినవి సేన, ఎన్‌సిపి. పొత్తు విచ్ఛిన్నం అయ్యాక సేన బిజెపిని చాలా తిట్లు తిట్టింది. మరాఠీ-గుజరాతీ ఫీలింగ్‌ తెచ్చింది. అదృష్టవశాత్తూ ఓటర్లు దాన్ని పట్టించుకోలేదు. ఇన్నాళ్లూ తమకు తోకగా వున్న బిజెపి, తమతో సరిసమానంగా సీట్లు అడగడంతో కోపం తెచ్చుకున్న సేన, యిప్పుడు బిజెపి తమ కంటె దాదాపు రెట్టింపు సీట్లు తెచ్చుకోవడం భరించగలదా? ఇప్పుడు తాము తోక, వాళ్లు తల అయిపోయారు. ఈ పరిస్థితి యిప్పట్లో మారడం కష్టం. తమ పార్టీ తరఫున ముఖ్యమంత్రి (అనగా తను) ఎవరైనా కావాలంటే యింకో పదేళ్లు ఆగాలి. అందుచేత అయితే గియితే యిప్పుడే అవ్వాలి. తమ మద్దతు లేనిదే ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితిలో బిజెపి వుంది కాబట్టి తనను ముఖ్యమంత్రి చేయాలని ఉద్ధవ్‌ పట్టుబట్టి సాధించవచ్చు. కనీసం రొటేషన్‌ పద్ధతి అని చెప్పి మొదటి టెర్మ్‌ తనకు యిమ్మనవచ్చు. అమిత్‌ షా యిదంతా పడనిస్తాడో లేదో తెలియదు. అసలు బిజెపిలోనే ముఖ్యమంత్రి పదవి ఆశించేవాళ్లు వున్నారు - గడ్కరీ, ఫడ్నవీస్‌, పంకజా ముండే...! ఆరెస్సెస్‌ కార్యక్షేత్రమైన విదర్భలో బిజెపి బాగా గెలిచింది కాబట్టి, వాళ్లు గడ్కరీ లేదా ఫడ్నవీస్‌లలో ఒకరికి యిమ్మనమని సూచించవచ్చు. ఇద్దరూ అగ్రవర్ణులు కాబట్టి పంకజకు యిస్తే బిసి ఓటుబ్యాంకు బలపడుతుందని కొందరు వాదించవచ్చు. 

ఈ పరిస్థితి గమనించి ఎన్‌సిపి ఎవరూ అడక్కుండానే బిజెపికి మద్దతు యిస్తానని ముందుకు వచ్చింది. తమపై విచారణ తప్పించుకోవడానికే యీ ఎత్తు అని కొందరు ఆరోపించారు. ఇది ముందుగా చేసుకున్న ఏర్పాటే, వీళ్ల అండ చూసుకునే సేనతో తెగతెంపులు చేసుకున్నారు అని కాంగ్రెస్‌, సేన ఆరోపిస్తున్నారు. సుస్థిరప్రభుత్వం ఏర్పడాలన్న కోరికతోనే తప్ప మరేమీ కాదు, మేం బయటినుండే మద్దతు యిస్తాం అంటోంది ఎన్‌సిపి. ఎన్నికల సమయంలో ఎన్‌సిపిని నేషనల్‌ కరప్షన్‌ పార్టీగా అభివర్ణించిన మోదీ వారి మద్దతు ఎలా తీసుకుంటారు అని కొందరు అమాయకుల ప్రశ్న. ఎన్నికల సమయంలో లక్ష అంటారు, అవన్నీ సీరియస్‌గా తీసుకోమని ఎవడన్నాడు? అమిత్‌ షా తన ప్రెస్‌ మీట్‌లో ఎన్‌సిపి ప్రకటనను ప్రస్తావించి వదిలేశారు. మద్దతు తీసుకోమని చెప్పలేదు. అది ఉద్ధవ్‌కి హెచ్చరిక. రాకరాక వచ్చిన యీ అవకాశాన్ని బిజెపి వదులుకోదు. ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. ఎవరి మద్దతుతో.. అన్నది రోజులు గడిస్తే గానీ తెలియదు. ఉద్ధవ్‌ మొండిపట్టు పట్టి ఉపముఖ్యమంత్రి పదవికి ఒప్పుకోకపోతే ఎన్‌సిపి బయటిమద్దతు తీసుకుంటుంది. ఉద్ధవ్‌ దిగివస్తే సేనతో బంధం కొనసాగుతుంది. ఉద్ధవ్‌ మరీ బిగిస్తే సేనను చీల్చడానికి కూడా మోదీ-అమిత్‌ వెనకాడరు. గతంలో కాంగ్రెస్‌, ఎన్‌సిపి కూడా సేన నుండి నాయకులను ఎగరేసుకుని పోయారు. ప్రాంతీయవాదానికి పరిమితులున్నాయని, దాన్ని మరీ ఎక్కువగా పుష్‌ చేస్తే చీదేస్తుందని,  ద్వేషం చిమ్మితే ఓట్లు రాలవని సేన, ఎంఎన్‌ఎస్‌ తెచ్చుకున్న సీట్లు నిరూపిస్తున్నాయి. మన తెరాస దీని నుండి పాఠం నేర్చుకోవాలి. 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2014)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?