Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : మతచిహ్నాలపై యూరోపియన్‌ కోర్టు తీర్పు

ఎమ్బీయస్‌ : మతచిహ్నాలపై యూరోపియన్‌ కోర్టు తీర్పు

పని చేసే చోట మతచిహ్నాలు ధరించడంపై ఈ వారంలో యూరోపియన్‌ కోర్ట్‌ ఆఫ్‌ జస్టిస్‌ యిచ్చిన తీర్పు కొన్ని వర్గాల్లో కలవరాన్ని రేపుతోంది. ఇంగ్లండులోని శిఖ్కు సమాజాలు, ముస్లిము కౌన్సిల్‌ మాత్రమే కాదు, యూరోప్‌లో వివిధ దేశాల్లో వున్న 700 మంది యూదు గురువు (రబ్బీ)ల సమాఖ్య కూడా నిరసనలు తెలిపాయి. నిజానికి ఆ కోర్టు మత చిహ్నాల గురించి మాత్రమే చెప్పలేదు, పని చేసే చోట అందరికీ కనబడేట్లా రాజకీయ, సిద్ధాంతపరమైన మతచిహ్నాలు కూడా ధరించకూడదని నియమం ఏర్పరుచుకునే హక్కు యజమానికి వుందంది. అంటే నాజీ వంటి రాజకీయ చిహ్నాలతో బాటు, ముస్లిము స్త్రీల తలముసుగులు (స్కార్ఫ్‌), శిఖ్కుల తలపాగాలు, క్రైస్తవుల శిలువలు, యూదుల టోపీలు యివన్నీ కూడా నిషేధంలోకే వస్తాయి. ఈ తీర్పు రావడానికి కారణం రెండు కేసులు. మొదటి దానిలో జి4ఎస్‌ సెక్యూర్‌ సొల్యూషన్స్‌ అనే బెల్జియన్‌ సెక్యూరిటీ సంస్థలో మూడేళ్లగా రిసెప్షనిస్టుగా పనిచేస్తున్న సమీరా అచ్బితా అనే ముస్లిం మహిళ 2006లో 'నేను యిప్పణ్నుంచి హెడ్‌స్కార్ఫ్‌ ధరిస్తా' నంది. రూల్సు ఒప్పుకోవు అని కంపెనీ వారించింది. అయినా ఆమె ధరించసాగింది. దాంతో కంపెనీ ఆమెను ఉద్యోగంలోంచి తీసేసింది. ముస్లిమని వివక్షత చూపిస్తున్నారంటూ ఆమె బెల్జియం కోర్టుకి వెళ్లింది. వాళ్లు యూరోపియన్‌ కోర్టుకు రిఫర్‌ చేశారు.

రెండో కేసు ఫ్రాన్సుకి సంబంధించినది. మైక్రోపోల్‌ అనే ఫ్రెంచ్‌ ఐటీ కన్సల్టన్సీ సంస్థలో పని చేసే డిజైన్‌ ఇంజనియర్‌ ఆస్మా బఫ్‌నాయీ అనే మహిళ హెడ్‌స్కార్ఫ్‌ ధరిస్తూ వుండేది. తన విధుల్లో భాగంగా 2009లో కంపెనీ క్లయింటు ఆఫీసుకి వెళ్లి వాళ్లకు ఐటీపై సలహా లివ్వవలసి వచ్చింది. అక్కడ కూడా స్కార్ఫ్‌ ధరించి వెళ్లడంతో ఆ క్లయింటు 'ఈమె యిలా వేసుకురావడం మా కంపెనీ ఉద్యోగులకు యిబ్బందిగా వుంది.' అని ఫిర్యాదు చేశాడు. కంపెనీ వాళ్లు యీమెను స్కార్ఫ్‌ తీసేయమన్నారు. ఆమె తీయనంది. దాంతో ఆమెనే తీసేశారు. వివక్షత చూపించారంటూ ఆమె ఫ్రాన్సు కోర్టు మెట్లెక్కింది. వాళ్లూ యూరోపియన్‌ కోర్టును సంప్రదించారు. ఈ రెండు కేసులూ విచారించిన కోర్టు మొదటిదానిలో కంపెనీలో చిహ్నాల ప్రదర్శనపై కంపెనీలో అప్పటికే అంతర్గతంగా నియమాలున్నాయని, వాటికి అంగీకరించి సమీరా ఉద్యోగంలో చేరిందని, తర్వాత తన యిష్టం వచ్చినట్లు వేషధారణ చేసుకుంటానంటే ఒప్పదని చెప్పింది. ఇక రెండో కేసులో కంపెనీలో అలాటి నియమం లేనప్పుడు కస్టమర్లు ఆ విధంగా డిమాండు చేయలేరని అంది. అంతిమ నిర్ణయం ఫ్రాన్సు కోర్టుకి వదిలేసింది. ఏ మతానికీ, వర్గానికీ చెందని తటస్థ యిమేజి వుండాలని కోరుకునే హక్కు కంపెనీకి వుందని, అందువలన యిటువంటి నియమాలు పెట్టుకోవచ్చని కోర్టు అంది.

ఈ విధమైన తీర్పు కారణంగా తమ మతస్వేచ్ఛకు అడ్డు తగులుతోందని శిఖ్కులు అభ్యంతర పెడుతున్నారు. బ్రిటన్‌ ముస్లిము కౌన్సిల్‌ కూడా యిది మా పట్ల వివక్షత చూపినట్లే అంటోంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో స్కూలుకి వెళ్లే ముస్లిము ఆడపిల్లలు స్కార్ఫ్‌ ధరించడంపై ఆంక్షలు విధించడం, వాటికి నిరసనగా ముస్లిములు ఆందోళన చేయడం జరుగుతోంది. అఫ్గనిస్తాన్‌లో పుట్టిన ఒక లేడీ టీచరు జర్మనీలోలో పనిచేస్తూ నేను స్కూలుకి ఇస్లామిక్‌ స్కార్ఫ్‌ వేసుకుని వస్తానంది. కేసు నడిచింది. 2003 సెప్టెంబరులో జర్మన్‌ ఫెడరల్‌ కోర్టు ఆమెను సమర్థిస్తూనే వివిధ రాష్ట్రాలకు చెందిన కోర్టులు స్థానిక పరిస్థితుల బట్టి తమతమ నిర్ణయాలు తీసుకోవచ్చు అంది. సగానికి సగం కోర్టులు స్కార్ఫ్‌లను నిషేధించాయి. 2004 ఫిబ్రవరిలో ఫ్రాన్సు జాతీయ అసెంబ్లీలో చర్చ జరిగింది - స్కూళ్లలో ఇస్లామిక్‌ స్కార్ఫ్‌లు, యూదు టోపీలు, క్రైస్తవ శిలువలు నిషేధించాలా వద్దా అని. 2010 మార్చిలో బెల్జియంలోని ఓ పార్లమెంటరీ కమిటీ బహిరంగ ప్రదేశాల్లో బురఖాలు, నకాబ్‌లు ధరించి తిరగకూడదని నిషేధం విధించాలని సూచించింది. దాన్ని ఊతంగా చేసుకుని ఫ్రాంకోయిస్‌ ఫిలాన్‌ ప్రధానిగా వుండగా ఫ్రాన్సు 2011 ఏప్రిల్‌లో ఆ నిషేధాన్ని అమలు చేసింది. మూణ్నెళ్ల తర్వాత బెల్జియం కూడా నిషేధించింది. దాని ప్రకారం యింట్లో, ప్రార్థనాస్థలంలో, కారులో ప్రయాణించేటప్పుడు మాత్రమే బురఖా వేసుకోవచ్చు. ఫ్రాన్సు బురఖా నిషేధంపై యూరోపియన్‌ కోర్టు ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌కు వెళితే అది నిషేధం సబబే అంటూ 2014 జులైలో తీర్పు యిచ్చింది. అందరూ ఒక్కలాటి వారే, అందరూ కలిసి వుండాలి అనే ఉద్దేశంతోనే ఫ్రాన్సు ప్రభుత్వం యిలాటి నిషేధం విధించింది అని అభిప్రాయపడింది. 

2015 మేలో హాలండ్‌ కాబినెట్‌ బురఖా ధరించడం పాక్షిక నిషేధాన్ని విధించింది. బహిరంగ ప్రదేశాల్లో బురఖా వేసుకోవచ్చు కానీ బస్సుల్లో, రైళ్లల్లో వేసుకోకూడదు అన్నారు. 2016 జనవరిలో అప్పటి యుకె ప్రధాని డేవిడ్‌ కామరాన్‌ 'మా వద్ద మతస్వేచ్ఛ వుంది కాబట్టి బురఖాలు పూర్తిగా నిషేధించమని చెప్పను కానీ, విద్యాసంస్థలు కానీ పనిచేసే సంస్థలు కానీ సమంజసమైన రీతిలో నిషేధం విధిస్తే సమర్థిస్తాను' అన్నాడు. ఈత కొడదామనుకున్న ముస్లిము మహిళల కోసం బికినీలకు బదులుగా ఒళ్లంతా కప్పేసే బుర్కినిలు తయారు చేయసాగారు. ఫ్రాన్సులో వాటి వాడకం పెరగడంతో అనేక మునిసిపాలిటీలు వాటిని నిషేధించసాగాయి. 2016 ఆగస్టులో ఫ్రాన్సు ప్రధాని మాన్యుయెల్‌ వాల్స్‌ ఆ నిషేధాలను సమర్థించాడు. 2016 డిసెంబరులో జర్మనీ ఛాన్సెలర్‌ ఏంజిలా మెర్కెల్‌ బురఖాలను ఓ మేరకైనా నిషేధించాలని అభిప్రాయ పడింది. 2017 జనవరిలో ఆస్ట్రియా ప్రభుత్వం స్కూళ్లలో, కోర్టుల్లో బురఖాలను నిషేధించడానికి నిశ్చయించుకుంది. పబ్లిక్‌ సర్వీసెస్‌లో పనిచేసే మహిళల హెడ్‌స్కార్ఫ్‌ ధారణ నిషేధం విషయం కూడా పరిశీలిస్తామంది. ఇప్పుడీ క్రమంలో ఈ తీర్పు వచ్చింది. 

పనివారు మతచిహ్నాలు ధరించినప్పుడు వాటి వలన వారి భద్రతకు ప్రమాదం కలుగుతుందని అనిపించినప్పుడు మాత్రమే కంపెనీలు నిషేధించవచ్చని ఇప్పటివరకు అనుకుంటూ వచ్చారు. ఇప్పుడీ తీర్పు దాన్ని అధిగమించి ముందుకు వెళ్లింది. యూరోపియన్‌ కోర్టు ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ గతంలో మతస్వేచ్ఛలో భాగంగా క్రైస్తవులు బయటకు కనబడేలా శిలువ ధరించవచ్చని  రూలింగు యిచ్చి వుంది. ఇప్పుడీ తీర్పు దానితో విభేదిస్తోంది. హాలండ్‌లో త్వరలో జరగబోయే ఎన్నికలలో ముస్లిము వలసలు కీలకాంశంగా మారాయి. యూరోప్‌లోని యితర దేశాల్లో కూడా ముస్లిము సమస్య గంభీరంగా మారింది. ఈ తీర్పు ప్రభావం వాటిపై పడుతుందని అనుకుంటున్నారు. ఫ్రాన్సుతో సహా యూరోప్‌లోని రైటిస్టు వర్గాలు యీ తీర్పును ఆహ్వానించాయి. ఇప్పటికే ఇస్లాముకి వ్యతిరేకంగా గట్టిగా వాదిస్తూ అధ్యక్ష పదవికి పోటీ పడబోతున్న ఫ్రాంకోయిస్‌ ఫిలాన్‌ తీర్పును ఆహ్వానిస్తూ ''ఇది కంపెనీలకే కాదు, దాని ఉద్యోగులకు కూడా ఉపశమనా న్నిస్తుంది.'' అన్నాడు. జర్మనీలో ఆల్టర్నేటివ్‌ ఫర్‌ డాయిష్‌ల్యాండ్‌ పార్టీ  నాయకుడు జార్జి పజ్‌డెర్‌స్కీ ' ఈ తీర్పు జర్మనీకి మేలు చేస్తుంది' అన్నాడు.  

ఈ తీర్పు మతస్వేచ్ఛకు భంగం కలిగిస్తుందని అనిపిస్తున్నా, దీనికి దీర్ఘకాలిక ప్రయోజనాలున్నాయి. గతంలో స్కూలు పిల్లలు కులాల బట్టి, మతాల బట్టి, ఆర్థిక స్థాయి బట్టి దుస్తులు వేసుకుని వచ్చేవారు. వీరు ఫలానా, వీరు ఫలానా కాదు అని తెలిసేది. పోనుపోను యూనిఫాం వచ్చాక అందరూ ఒకే రకమైన బట్టలు వేసుకోసాగారు. అందరూ సమానమనే భావన మనసులో కలగసాగింది. దాని వలన లాభమే తప్ప నష్టం కలగలేదు. పనిచేసే చోట అందరూ ఒకే రకమైన డ్రస్సు వేసుకుంటే అందరూ ఒకే జట్టు, అందరం కలిసి పనిచేస్తున్నామనే భావన తప్పక కలుగుతుంది. మిలటరీ, పోలీసు వంటి అనేక వ్యవస్థలలో యూనిఫాం తప్పనిసరి. ఫ్యాక్టరీలలో, హోటల్లో, రైల్వేలో, బస్సుల్లో, విమానాల్లో యిలా అనేక చోట్ల ఒకే రకమైన డ్రస్సు వేసుకుంటున్నారు. మతస్వేచ్ఛ అంటూ ఒళ్లంతా కప్పుకుని ఒకళ్లు, రాజకీయ స్వేచ్ఛ అంటూ పూర్తి ఎఱుపు రంగు డ్రస్సులో మరొకరు తయారైతే డ్రస్‌ కోడ్‌కు భంగం వాటిల్లుతుంది. మీ యింట్లో, మీ ప్రార్థనాస్థలాలలో మీ మతానికి అనుగుణమైన దుస్తులు ధరించడానికి ఎవరూ అభ్యంతర పెట్టరు. వారానికి 35-40 గంటలు మాత్రమే పనిచేసే పనిస్థలంలో అందరితో బాటు సమానంగా వుండకుండా భిన్నంగా కనబడాలన్న తాపత్రయం దేనికి? 

ముస్లింలు ఎన్నో శతాబ్దాలుగా యీ దేశాల్లో వుంటున్నారు. గతంలో లేని అంశాలన్నీ యిప్పుడే ఎందుకు ముందుకు వస్తున్నాయి? వాళ్లు వాళ్ల మతాన్ని చాటుకోవాలని ప్రయత్నిస్తున్నారు కాబట్టి! ఇప్పటికే యూరోప్‌ క్రైస్తవులకు ముస్లిములను చూస్తే ఉలికిపాటుగా వుంది. తమలో జననాల రేటు తగ్గిపోవడం, ముస్లిములలో పెరిగిపోవడం వలన యూరోప్‌లో అతి కొద్ది కాలంలోనే క్రైస్తవుల కంటె ముస్లిములు ఎక్కువ వుంటారని లెక్కలు వేస్తున్నారు. ఇంకో కారణం ఏమిటంటే క్రైస్తవులలో నాస్తికులు, హేతువాదులు, మతం గురించి పట్టించుకోనివారు పెరుగుతున్నారు. ముస్లిములలో మతంపై విశ్వాసం గతంలో కంటె పెరుగుతోంది. ఈ భయాలతో క్రైస్తవులు ముస్లిముల పట్ల ఆవేశకావేషాలతో ప్రవర్తించే సందర్భాలు చాలా వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మేము మీ సమాజంలో భాగమే, జనజీవనస్రవంతిలో కలిసిపోతాం అని తమ చర్యల ద్వారా వాళ్లకు హామీ యివ్వడం ముస్లిముల బాధ్యత. దానికి బదులుగా 'మీకు మీరే, మాకు మేమే' అన్నట్లు తమ ప్రత్యేకతను చాటి చెప్పుకుంటూ వుంటే ఘర్షణలు తప్పవు. మొదటి కేసులో సమీరా అప్పటిదాకా ఆఫీసులో స్కార్ఫ్‌ ధరించలేదు, అంతమాత్రం చేత ముస్లిము కాకుండా పోలేదు. సడన్‌గా మతం గుర్తుకు వచ్చి స్కార్ఫ్‌ ధరిస్తానని పట్టుబట్టింది. 

సాధారణంగా మనుష్యులలో చాలామంది మతవిశ్వాసం విషయంలో మరీ ఛాందసంగా వుండరు. ఆచారాలను మన్నిస్తారు కానీ ఆధునికమైన ఆలోచనలకు, జీవనవిధానానికి అలవాటు పడుతూంటారు. తమ మతం ప్రమాదంలో పడింది అని తోచినప్పుడు మామూలు వాళ్లు కూడా మతాన్ని చాటుకుందామని చూస్తారు. శిఖ్కులు గతంలో తమ గడ్డాలకు నెట్‌ వేసుకునేవారు. కొందరు ట్రిమ్‌ చేసుకునేవారని కూడా అంటారు. ఖలిస్తాన్‌ ఉద్యమం వచ్చినదగ్గర్నుంచి గడ్డాల్ని ట్రిమ్‌ చేయడం మానేశారుట. నెట్‌ వేసుకోకుండా వదిలేస్తున్నారు. భారతదేశంలోనే కాక, యితర దేశాల్లో కూడా ముస్లిముల్లో కొందరు మాత్రమే గడ్డాలు పెంచేవారు. ఇటీవలి కాలంలో ఇస్లాం రాడికలిజం పెరుగుతున్నకొద్దీ పంతంగా గడ్డాలు పెంచసాగారు. అలాగే అప్పటిదాకా ఆధునికంగా వస్త్రధారణ చేసుకుంటూ వచ్చిన ఆడవాళ్లు యిప్పుడు బురఖాలు, స్కార్ఫ్‌లు, బుర్కినీలు వేసుకోసాగారు. వీళ్లను చూసి అవతలి మతస్తులు కూడా తమ మతచిహ్నాలు బాహాటంగా ధరించడం మొదలుపెడితే సమాజంలో ఘర్షణ పెరుగుతుంది. మనుషులంతా ఒక్కటే అనే భావన వెనక్కి పోయి 'ఎవరికి వారే' అనే సిద్ధాంతం బలపడుతుంది. విద్యార్థిదశ నుండి యీ భావాలు నాటడం సమాజానికి హితం చేయదు.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?