Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: మాయాబజార్‌కు 60 ఏళ్లు -1

ఎమ్బీయస్‌: మాయాబజార్‌కు 60 ఏళ్లు -1

ఇవాళ మార్చి 27. ''మాయాబజార్‌'' రిలీజై సరిగ్గా 60 ఏళ్లు. ''మాయాబజార్‌'' నచ్చని తెలుగువాళ్లుండరు. ఎంత కళాఖండమైనా సరే, బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ఉంటే చూడం అనే యువత కోసం  కాబోలు కలర్‌లో కూడా తీసి విడుదల చేశారు. ఒక్కసారి చూస్తే చాలు మళ్లీ చూడబుద్ధవుతుంది.  'చిత్రములన్నిటిలో కన్న ఏ చిత్రము మేలు?' అనే ప్రశ్నకు తెలుగువాడి జవాబు 'ఆబాలగోపాలమును అలరించు మాయాబజారు మేలు.' అని. ఎందుకంటే ఐడియల్‌ సినిమా అంటే మాయాబజారే! అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ. అన్నివిధాలా పెర్‌ఫెక్షన్‌కి నిర్వచనం అంటే మాయాబజార్‌ సినిమాయే. నిజానికి అది తమిళంలోనూ, కన్నడంలోనూ కూడా సక్సెసయినా మనంత యిదిగా వెర్రెత్తిపోరు వాళ్లు. ఫక్తు తెలుగు కథ కాబట్టి.. అనుకోవద్దు. అసలిది మహారాష్ట్ర ప్రాంతంలో ప్రాచుర్యంలో వున్న గాథ. మహాభారతంలో కానరాదు. మాయాబజార్‌లో హీరో హీరోయిన్లు మేనత్త, మేనమామ బిడ్డలు. రామాయణభారతాలు ఉత్తరాది ఇతిహాసాలు. అక్కడ రక్తసంబంధీకులైన మేనరికాలు తప్పు. మేనరికాలు దక్షిణ రాష్ట్రాలలోను, మహారాష్ట్రలోను మాత్రమే సమ్మతం. అందుకే ఆ విధంగా అక్కడ కల్పించారు. బలరాముడి కూతురు పేరు కూడా ఈ కథల్లో రకరకాలుగా వుంది. శశిరేఖ అని మనం అంటే, కొన్నిచోట్ల  సురేఖ అన్నారు. తమిళనాడులో వత్సల అన్నారు. మహారాష్ట్ర గడ్డ మీద పుట్టిన సురభి నాటక సమాజం ద్వారా తెలుగు, తమిళ, కర్ణాటక ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందిందీ కథ. తర్వాత సినిమాల్లో కూడా వచ్చింది. మరాఠీ, హిందీ సినిమాలు కూడా పుణె, బొంబాయిలో పుట్టాయి కాబట్టి హిందీలో కూడా యీ సినిమా తీశారు. కానీ మన తెలుగు, తమిళాలంత అట్టహాసంగా కాదు. తెలుగువాళ్లు తమ ప్రాణానికి ప్రాణంగా భావించే ఈ సినిమా పేరులోనే తమాషా ఉంది. మాయా అనేది సంస్కృతం. బజారు అనేది ఉర్దూ. రెండూ కలిపి తెలుగు సినిమా - అదీ పౌరాణిక సినిమాకు పేరు పెట్టారు - అదీ వింత! పేరయితే పెట్టారు కానీ టైటిల్‌ జస్టిఫై చేయాలి కదాని ఆ పేరును సినిమాలో ఎక్కడా వాడలేదు. మాయాబజార్‌ సినిమా గురించి చాలాసార్లు వినే వుంటారు. నాకు తోచిన కొన్ని పరిశీలనలు రాస్తున్నాను. ఇవన్నీ యిప్పటికే వినేసి వున్నా, మీకే తోచి వున్నా తిట్టుకోకండి. 

పురాణాల్లో అనేక కథలుంటాయి. అన్నీ నాటకాలకు, సినిమాలకు నప్పవు. నప్పిన వాటిల్లో కూడా కొన్నే ప్రాచుర్యం పొందుతాయి. ఎందుకాని ఆలోచిస్తే మానవులు తమను తాము ఐడెంటిఫై చేసుకోగలిగిన కథలు వాళ్ల హృదయాలకు హత్తుకుంటాయి. ''గరుడ గర్వభంగం'' సినిమా చూసినప్పుడు మనం అంతగా చలించకపోవచ్చు. అదే ''శకుంతల'' చూసినప్పుడు స్పందన ఎక్కువగా వుంటుంది. శకుంతల కథ ఏమిటి? ఒక డబ్బున్నవాడు ఒక పల్లెకు వెళ్లాడు. ఒక ముగ్ధను చూశాడు. కబుర్లు చెప్పి, ఆకట్టుకుని, పెళ్లి చేసుకున్నానంటూ గర్భవతిని చేశాడు. బిడ్డను కని ఆమె అతని దగ్గరకు వెళితే నువ్వెవరో తెలియదు పొమ్మన్నాడు. ఇది యీనాటి సమాజంలోనూ జరుగుతున్న కథే. అందుకే జనాలకు నచ్చుతోంది. కాపురానికి వెళుతున్న కూతుర్ని చూసి కణ్వుడు పడే ఆవేదన, ప్రతి ఆడపిల్ల తండ్రీ అనుభవించేదే. భారతంలో వున్న కథలో ఆకాశవాణి కలగజేసుకుని దుష్యంతుణ్ని మందలిస్తుంది 'ఆమె నీ భార్యే, వాడు నీ కొడుకే' అని. దాన్ని నాటకంగా మలచిన కాళిదాసు హీరో యిమేజి చెడిపోకుండా శాపం కారణంగా రాజు మర్చిపోయాడు కానీ లేకపోతే అలాటివాడు కాడు అనే బిల్డప్‌ యిచ్చాడు. క్లయిమాక్సులో కొడుకు సాహసాన్ని చూసి తండ్రి మురిసిపోయాడని, హీరోయినుకు క్షమాపణ చెప్పి చేపట్టాడని కల్పించి వాళ్ల యిమేజీ పెంచాడు. లవకుశుల కథ వుంది. అనుమానం చేత భర్త వదిలేస్తే, భార్య పిల్లల్ని సాహసవంతులుగా పెంచింది. వాళ్లు తండ్రి సైన్యాన్ని ఓడించి తండ్రే దిగి వచ్చేట్లు చేశారు. పొరపాటైంది, నాతో వచ్చేయ్‌ అని భర్త బతిమాలితే 'నో థ్యాంక్స్‌' అని చెప్పి భార్య తన స్వాభిమానాన్ని చాటుకుంది. ఇదీ అత్యంత ప్రజాదరణ పొందిన కథే. ఎందుకంటే అనుమానంతో భార్యను కష్టాలపాలు చేసే భర్తలు చుట్టూ కనబడుతున్నారు. పిల్లలు ప్రయోజకులై తల్లి గౌరవాన్ని కాపాడడం ద్వారా 'పొయెటిక్‌ జస్టిస్‌' సాధించినట్లయింది. 

మాయాబజారులో మౌలికంగా వున్న థీమ్‌ ఏమిటి? ఓ యిద్దరు ప్రేమికులు. వారి ప్రేమను పెద్దలూ హర్షించారు. అయితే సడన్‌గా హీరో పేదవాడై పోయాడు. అంతే హీరోయిన్‌ తలిదండ్రులు ప్లేటు ఫిరాయించి వేరే డబ్బున్నవాడితో పెళ్లి కుదిర్చారు. ప్రేమికులను విడదీశారు. ఇలాటివి మన సమాజంలో అత్యంత సహజంగా జరిగేవే. ప్రేక్షకుడి సానుభూతి అండర్‌డాగ్‌ అయిపోయిన హీరోపై వుంటుంది. పెద్దల లోభానికి బలై పోయిన హీరోయిన్‌పై వుంటుంది. వాళ్లిద్దరూ ఎలాగైనా కలవాలనుకుంటారు. కలిస్తే ఆనందిస్తారు. హీరోయిన్‌ను పెళ్లాడడానికి తయారైన డబ్బున్న పెళ్లికొడుకు భంగపడితే, అతని బంధుగణం నవ్వులపాలైతే చంకలు గుద్దుకుంటారు. అదేగా మాయాబజారు కథాంశం! ఈ ప్రేమ కథ ఫార్ములా తిరుగు లేనిది. జానపద గాథగా, సాంఘిక కథగా ఎలా చెప్పినా నచ్చుతుంది. డబ్బున్న హీరోయిన్‌ను బయటకు తప్పించడానికి ఆమె స్థానంలో జానపదాల్లో అయితే చెలికత్తెకు వేషం వేసి కూర్చోబెడతారు, సాంఘికంలో అయితే క్లాసుమేటును కూర్చోబెడతారు. ఈ సినిమా పౌరాణికం కాబట్టి ఒక రాక్షసుడే ఆ వేషంలో వెళ్లి అందర్నీ మోసగించినట్లు చూపించారు. తక్కిన సినిమాల్లో అయితే ఆఖరి నిమిషంలో వీళ్ల గుట్టు బయటపడి హీరోహీరోయిన్లను అందరూ చుట్టుముట్టినట్లు, హీరో తన ప్రతాపంతో అందర్నీ ఓడించి హీరోయిన్ను పెళ్లాడినట్లు చూపిస్తారు. అయితే మాయాబజారులో హీరోయిజానికి ఛాన్సివ్వలేదు. అభిమన్యుడు అసహాయశూరుడైనా యీ కథలో అతని రణకౌశలం చూపే అవకాశమే లేదు. ఇక్కడ మాయోపాయందే గెలుపు. హీరో కజిన్‌ కపటోపాయంతో హీరోయిన్‌ను ఎత్తుకు వచ్చి ఆమె తలిదండ్రులు తలపెట్టిన పెళ్లిని రసాభాస చేశాడు. దీనివలన హీరో కారెక్టరు దెబ్బ తినే ప్రమాదం వుంది. అందువలన యీ మాయలూ మంత్రాలలో అతని జోక్యం ఏమీ లేదని, అంతా కజిన్‌ చేసినదేననీ, అతను కూడా పినమావగారు వేసిన స్కెచ్‌ ప్రకారమే నడుచుకున్నాడని చెప్పి హీరో పరువు కాచారు. 

మామూలుగా అయితే హీరో తన కజిన్‌ సైనికసహాయంతో పిల్లనిస్తానన్న మేనమామ నగరంపై దాడి చేసి అమ్మాయిని గెలుచుకు రావాలి. తండ్రి అర్జునుడు తల్లి సుభద్రను గెలుచుకుని వచ్చినట్లు చేసి వుండాల్సింది. కానీ అలా చేస్తే తన పుట్టింటి వారి పరువు తీసినట్లే అని సుభద్ర చేత అనిపించి, ఆ మార్గం మూసేశారు. నిజానికి ప్రియుడితో పారిపోయి, అడ్డు వచ్చిన అన్నగారి సైన్యంతో స్వయంగా యుద్ధం చేసిన సుభద్ర కొడుకు దగ్గరకు వచ్చేసరికి యిలా అనడం విచిత్రమే. తల్లి మాటకు కట్టుబడి అభిమన్యుడు కజిన్‌ యింట్లోనే విడిది చేసి విరహగీతాలు పాడుకుంటూ  వుండిపోయాడు. ఇక కజిన్‌ ఘటోత్కచుడే చెడుగుడు ఆడుకున్నాడు. హీరోయిన్‌ పినతండ్రి వెనక్కాల నుంచి నాటకం ఆడించాడు. ఆ పినతండ్రి మరొకడు మరొకడు అయితే కిల్లాడీ అనిపించుకునేవాడు. కానీ కృష్ణుడే కావడంతో ఆ కాపట్యం, అన్నావదినలకు నమ్మకద్రోహం చేయడం అంతా 'జగత్కల్యాణం' కోసం అనే బ్యానర్‌ కింద కొట్టుకుపోయాయి. అప్పటికీ క్లయిమాక్స్‌లో శకుని చేత వాళ్ల కుట్ర గురించి చెప్పించి, ఆ కుట్రకు విరుగుడుగా యీ ట్రిక్కు అని సంజాయిషీ యిచ్చేశారు. మామూలుగా అయితే ఆ కుట్రను బహిర్గతం చేయవలసిన పని హీరో మీదో, అతని సహాయకులపైనో వుండేది. స్క్రిప్టులో అంత స్పేస్‌ యివ్వలేక కన్ఫెషన్‌ బాక్స్‌ లాటి సత్యపీఠాన్ని మొదటి సీన్లలోనే పరిచయం చేసి, ఆఖరి సీనులో దానికి పని చెప్పారు. 

పెద్దల అత్యాశ వలన విడిపోయిన యిద్దరు ప్రేమికులను కలపడానికి ఎన్ని మాయోపాయాలు పన్నినా ఫర్వాలేదని ప్రేక్షకుడు భావించేలా చేయడం చేతనే మాయాబజారు థీమ్‌ అందరికీ నచ్చింది. మౌలికంగా ప్రేమ కథ అయిన యీ సినిమాకు అనేక యితర హంగులు వచ్చి చేరాయి. కృష్ణుడు ఎలాగూ జగన్నాటక సూత్రధారి. అతనికి సహాయకుడిగా ఘటోత్కచుణ్ని తీసుకుని వచ్చారు. భారతంలో ఘటోత్కచుడు కురుక్షేత్రంలోనే పరిచయమవుతాడు. పాండవుల పక్షాన తన రాక్షస మాయలతో యుద్ధం చేస్తాడు. అంతే! అభిమన్యుడితో కానీ, కృష్ణుడితో కానీ ప్రత్యేక బంధం వున్నట్లు కానీ, నూరు వేషాలు వేసైనా ఓ పెళ్లి చేయాలన్న సదుద్దేశం వున్నట్లు కానీ ఎక్కడా ఆధారం లేదు. మాయాబజారు కథ కారణంగా ఘటోత్కచుడు ఒక ఆత్మీయమైన వ్యక్తిగా తోచసాగాడు. ముఖ్యంగా తెలుగువాళ్లకు! అతన్ని ముఖ్యపాత్రగా చేసుకుని తెలుగువాళ్లు  సినిమాలు తీశారు. దానివలన 'రాక్షసులు కూడా మంచివాళ్లేస్మీ' అనే భావం కలిగించారు మనకు. 

మాయాబజారుకు కర్త, కర్మ, క్రియ అన్నీ కె.వి.రెడ్డిగారే. ''షావుకారు'' (1950) తీసి పేరు మాత్రమే తెచ్చుకున్న విజయావారికి ''పాతాళభైరవి'' (1951) డైరక్టు చేసి పెట్టి పేరూ, డబ్బు రెండూ తెచ్చిపెట్టారు. అయినా విజయావారు మళ్లీ ఆయనను రిపీట్‌ చేయకుండా సినిమాలు తీశారు. ''పెళ్లి చేసి చూడు'' (1952 - ఎల్వీ ప్రసాద్‌ డైరక్షన్‌), ''చంద్రహారం'' (1954 - డైరక్షన్‌ కమలాకర కామేశ్వరరావు) ''మిస్సమ్మ'' (1955 - ఎల్వీ ప్రసాద్‌ డైరక్షన్‌). ఎందుకు అంటే దాని వెనుక ఇగో క్లాషెస్‌ వున్నాయి. తాము తీసిన మొదటి సినిమా ''షావుకారు'' ఆర్థికంగా దెబ్బ తీయడంతో నాగిరెడ్డి, చక్రపాణి కెవి రెడ్డిని ఆశ్రయించక తప్పలేదు. కెవి రెడ్డి అయితే 'భక్తపోతన' (1942), 'గుణసుందరి కథ' (1949) వంటి హిట్‌ సినిమాలు తీసిన ఉద్దండుడు. కె అంటే కళ, వి అంటే వ్యాపారం అనీ కళను, వ్యాపారాన్ని రంగరించగల మొనగాడనీ పేరు తెచ్చుకున్నారు. ఆయన తమకు ఓ హిట్‌ సినిమా తీసి ఉద్ధరిస్తాడన్న ఆశ వాళ్లది. ఆ విషయం కెవికీ తెలుసు. అందుకే 'పాతాళభైరవి' దర్శకత్వం వహించడానికి ముందు వంద కండిషన్లు పెట్టాడు. సంగతేమిటంటే బియన్‌, కెవి సినిమారంగంలోకి వచ్చిన పదేళ్లకు నాగిరెడ్డి, చక్రపాణి ఫీల్డుకిి వచ్చారు. కుర్రకుంకలు, వీళ్లకేం తెలుసు? అనే చులకన భావం ఉండేది సీనియర్లకి. పైగా చక్రపాణికి దర్శకత్వంలో కలగజేసుకుని సలహాలు ఇచ్చే అలవాటు ఉండేది. ఆయనదీ, కెవిది రెండూ డిఫరెంట్‌ స్కూల్స్‌ ఆఫ్‌ థాట్‌. అందువల్ల ఒకసారి తనకు ప్రాజెక్టు అప్పగించాక నిర్మాణంలో జోక్యం చేసుకోకూడదని, తను రషెస్‌ కూడా చూపించననీ కెవి షరతు పెట్టాడు. రషెస్‌ అంటే సినిమా తయారవుతూండగానే మధ్యమధ్యలో అప్పటిదాకా తీసినది వేసి చూసుకోవడం. అప్పుడు నిర్మాతల బంధువులు, స్నేహితులు అందరూ పొలోమని వచ్చేసి తమకు తోచిన వ్యాఖ్యలు చేసి పోతూంటారు. 'నేను ఏ ఉద్దేశంతో ఆ షాట్‌ తీసానో వాళ్లకు తెలియదు. తలా, తోకా తెలియకుండా గుడ్డివాళ్లు-ఏనుగు కథలా వాళ్లు ఏదో ఒకటి అనేసి పోతారు. దాంతో నాకూ కన్‌ఫ్యూజన్‌ వచ్చేస్తుంది.' అని కెవి ఫీలింగు. 'అందుకే రషెస్‌ చూపించను.' అని ఆయన వాదన. వాదనలో పస సంగతి ఎలా వున్నా నాగిరెడ్డి, చక్రపాణిలకు వేరే దిక్కు లేదుగా. అందుకే అన్నిటికీ సై అన్నారు.

పాతాళబైరవి భారీ పెట్టుబడితో తీసిన సినిమా. దేవుడిమీద భారం పెట్టి కెవి చెప్పినట్టే నడుచుకున్నారు నాగిరెడ్డి, చక్రపాణి. షూటింగు చూడ్డానికి వెళ్లాలన్నా భయమే! కెవి రెడ్డికి హై బిపి. చటుక్కున ఏమైనా అంటాడేమో! ఓ సారి ఆ ముచ్చటా జరిగింది. ఓ షాట్‌ తీస్తున్నారు. షూటింగు చూడ్డానికి నాగిరెడ్డి, చక్రపాణి ఇద్దరూ వచ్చారు. షాట్‌ తీయడం అయిపోయాక వాళ్లిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు. షాట్‌ అయిపోయినా అంతా నిశ్శబ్దంగా  ఉండకపోతే కెవికి కోపం వస్తుంది. అవేళ వచ్చింది. నిర్మాతలన్న మొహమాటమైనా లేకుండా 'బ్రదర్‌, దిసీజ్‌ నాట్‌ ఫిష్‌ మార్కెట్‌! ఇఫ్‌ యూ వాంట్‌ టు టాక్‌ గో ఔట్‌ అండ్‌ టాక్‌' అని అరిచారు కెవి. ఓ దర్శకుడు నిర్మాతలను అలా గద్దించడం ప్రపంచ సినీ చరిత్రలోనే జరిగివుండదు. కెవి రెడ్డి అలా అన్నా నిర్మాతలు భరించారు. ఏదో ఒకలా సినిమా ఆడితే చాలని వాళ్ల ఆశ. అప్పటికి ఊరుకున్నా, ఓ ఇరవై యేళ్లు పోయాక కెవి రెడ్డి సినిమాలు ఫ్లాప్‌ అవుతూంటే అప్పుడు కసి తీర్చుకున్నారు. ఆయన కిచ్చిన సౌకర్యాలన్నీ లాగేసుకున్నారు. సరే మొత్తానికి పాతాళభైరవి తయారయింది. 1951 మార్చిలో విడుదల అనుకున్నారు. విజయవాడలో డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీకి కాపీ పంపారు. వాళ్ల ఆఫీసులో పాతాళభైరవి సినిమా ప్రివ్యూ వేశారు. కొంతమంది పురప్రముఖులు సినిమా చూసి పెదవి విరిచారు. 3,4 వారాల పిక్చర్‌ అన్నారు. అంటే ఇంత పెట్టుబడీ వేస్టేనన్నమాట! 

మర్నాడు ఆ వార్త మద్రాసులో ఉన్న నాగిరెడ్డి, చక్రపాణిలకు ఆ డిస్ట్రిబ్యూటర్‌ ఫోన్‌ చేసి చెప్పాడు. దాంతో వాళ్లు హతాశులయిపోయారు. దిగాలుపడి కూచున్నారు. సరిగ్గా అదే టైముకు కెవి విజయా ఆఫీసుకు వచ్చారు. వీళ్లని చూసి ఏం బ్రదర్‌ ఏమయింది? అని అడిగారు. చక్రపాణిగారు ఇదీ సంగతి అని చెప్పేశారు. పాతాళభైరవి ఫెయిలయితే ఇంకో సినిమా తీయడం అవుటాఫ్‌ క్వశ్చన్‌ కదాౖ! ఇది వినగానే కెవికి పట్టరానంత కోపం వచ్చింది. వెంటనే విజయవాడకు ఫోన్‌ చేసి ఆ డిస్ట్రిబ్యూటర్ను పట్టుకుని తిట్టిపోశారు. 'అసలు నన్నడక్కుండా షో ఎందుకు వేశావ్‌? మీ కాంప్లిమెంటరీ గాళ్లకోసం నేను సినిమా తీశానా? టిక్కెట్టు కొని సినిమా చూసే సామాన్య ప్రేక్షకుడి కోసం తీశా. సినిమా రిలీజయ్యాక జనం ఏమన్నారో అది చెప్పు చాలు.'' అని తిట్టారు. సాయంత్రం సినిమా విడుదలయింది. ముందులో యావరేజ్‌ టాకే గానీ క్రమంగా పుంజుకుంది. బ్రహ్మాండంగా ఆడింది. సినిమా ఆరేడు వారాలు ఆడేటప్పటికి నిర్మాతలు హమ్మయ్య అనుకున్నారు. అయినా నెక్స్‌ట్‌ సినిమా కెవి దర్శకత్వంలో రాలేదు. దానికి కారణాలు రెండు! 

నిజానికి నాగిరెడ్డి, చక్రపాణి ఇద్దరూ కలిసి సినిమాలు తీసినా, ఇద్దరి స్వభావాల్లో తేడా ఉంది. నాగిరెడ్డి అందర్నీ లుపుకుపోయే లౌక్యం ఉన్నాయన. చక్రపాణిది పెడసరంగా మాట్లాడే స్వభావం. అందుకే విజయాలో రెండు కాంప్స్‌ కనబడతాయి. చక్రపాణి, ఎల్వీ ప్రసాద్‌ ఒక జట్టు. కెవి రెడ్డి, పింగళి మరో జట్టు. వీటిమధ్య సమన్వయం చేసే బాధ్యత నాగిరెడ్డిది. పాతాళభైౖరవి హిట్‌ అయిన తర్వాత నాగిరెడ్డి కెవి వద్దకు వచ్చి 'బ్రదర్‌, నెక్స్‌ట్‌ పిక్చర్‌ ప్లాను చెయ్యి. ఇదిగో బ్లాంక్‌ చెక్‌.' అన్నారు. కెవి ఎగిరి గంతేయలేదు. 'లేదు, వంతు ప్రకారం నేను వాహినీకి పనిచేయాల్సి వుంది. ప్రస్తుతం బియన్‌ మల్లీశ్వరి తీశాడు. తర్వాతిది నేను డైరక్టు చేయాలి.' అన్నారు. ఇందులో ఓ చిన్న ఫైనాన్షియల్‌ ఏంగిల్‌ ఉంది. విజయాకు తీస్తే నెలజీతానికి తీయాలి. వాహినీకి తీస్తే ఆయన కంపెనీ డైరక్టర్లలో ఒకడు కాబట్టి నెలజీతం ప్లస్‌  లాభాలలో వాటా వస్తుంది. అందుకని వాహినీకి 'పెద్దమనుషులు' తీయడానికే కెవి ప్రిఫర్‌ చేశారు. దాంతో నాగిరెడ్డికి కాస్త ఒళ్లు మండింది. పైగా చక్రపాణి 'కెవితో వేగడం కంటె ఎల్వీ ప్రసాద్‌ను పెట్టి సాంఘికం తీద్దాం' అనడం ఒకటి. అందువల్ల 1952లో పాతాళభైరవి తర్వాత ఎల్వీ ప్రసాద్‌తో 'పెళ్లి చేసి చూడు' అనే సాంఘిక సినిమా తీశారు. హాస్యభరితమైన సినిమా అది. అది హిట్‌ కావడంతో చక్రపాణికి ధైర్యం వచ్చింది. కెవి మార్కు జానపదం కూడా చూసి తడాఖా చూపిద్దాం అనుకున్నారు. 'చంద్రహారం' భారీ ఎత్తున ప్లాన్‌ చేశారు. పాతాళభైరవికి అసిస్టెంటుగా ఉన్న కమలాకర కామేశ్వరరావుకి డైరక్టరుగా ఛాన్సు ఇచ్చారు. పాటల పుస్తకం దగ్గర్నుంచి కలర్‌లో వేసి మంచి అట్టహాసం చేశారు. సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ అయింది. అది 1954 ముచ్చట.

ఇదే టైములో కెవి రెడ్డి వాహినీకై తీసిన 'పెద్ద మనుషులు' హిట్‌ అయింది. సాంఘికాలు కూడా తీయగలనని కెవి చాటి చెప్పారు. ఈ లోపునే అక్కినేని నాగేశ్వరరావు, దుక్కిపాటి మధుసూదనరావు గారు భాగస్వాములుగా అన్నపూర్ణ ఫిలింస్‌ ప్రారంభమయింది. తొలి సినిమాకి డైరక్టరుగా భరణీ పిక్చర్స్‌ రామకృష్ణగారిని అనుకున్నారు. ఆయన అడ్వాన్సు తీసుకుని కూడా తర్వాత వ్యక్తిగత కారణాల చేత చేయలేకపోతున్నానని చెప్పి అడ్వాన్సు వెనక్కి ఇచ్చారు. అప్పుడు బియన్‌ రెడ్డిగారి వద్దకు వెళితే ఆయన లక్ష రూపాయలు పారితోషికం అడిగారు. అమ్మబాబోయ్‌ అనుకుని పి.పుల్లయ్యగార్ని అడిగారు. ఆయన సరేనన్నాడు కానీ ప్రయర్‌ కమిట్‌మెంట్స్‌ వల్ల నాలుగు సినిమాలు ఒకేసారి చేయవలసి వస్తోంది. ఇక ఆయన వల్ల ఏమవుతుందని ఊరుకున్నారు. అంతలో కెవి బయటి పిక్చర్స్‌ చేయడానికి సిద్ధమవుతున్నారని కబురు చేరింది. వెళ్లి అడిగారు. 'వేరే సినిమా తీస్తున్నాను. మరి మీరు ఆగగలరా?' అంటే మీకోసం ఏళ్లూ, పూళ్లూ అయినా నిరీక్షిస్తామని అన్నారు వీళ్లు. విజయా-వాహినీ నుండి బయటకు వచ్చి కెవి చేస్తున్న తొలి సినిమా ఇదే అవుతుంది కదా, తప్పకుండా ఫెచింగ్‌గా ఉంటుందని వీళ్ల ఆశ! అలా తయారయిందే 'దొంగరాముడు'!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?