Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : మధ్యప్రదేశ్‌లో మార్కుల స్కామ్‌

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌పై మార్కుల స్కామ్‌ నీడలు పడ్డాయి. టీచర్లు, పోలీసు కానిస్టేబుళ్లు, సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, ఫారెస్టు గార్డులు, జైలు గార్డులు, ఫుడ్‌ యిన్‌స్పెక్టర్లు వంటి అనేక ప్రభుత్వోద్యోగాల రిక్రూట్‌మెంట్‌కై నిర్వహించే పరీక్ష నిర్వహించే సంస్థను ఆ రాష్ట్రంలో వ్యావసాయిక్‌ పరీక్షా మండల్‌ (సింపుల్‌గా వ్యాపమ్‌) అంటారు. వారి పరీక్షలో వచ్చిన మార్కుల ప్రకారమే ఉద్యోగ నియామకాలు జరుగుతాయి. లంచాలు తినో, నేతల పలుకుబడికి లొంగో అధికారులు కొందరి మార్కులు మార్చేసి ప్రతిభావంతులకు అన్యాయం చేశారని గత ఏడాదే గొడవ జరిగింది. నిందితుల్లో ఒకడు, సిస్టమ్‌ ఎనలిస్ట్‌ అయిన నితిన్‌ మొహీంద్రా అనే అతని వద్ద ఒక ఎక్సెల్‌ షీటు దొరికింది. ఎవరెవరు ఎవరెవరి విషయంలో తమ పలుకుబడి వుపయోగించారో అలాటి 131 పేర్లు దానిలో వున్నాయి. దిగ్విజయ్‌ సింగ్‌ ఆ షీటు సంపాదించి హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశాడు. దానిపై స్పందించిన హైకోర్టు మాజీ జడ్జి ఆధ్వర్యంలో స్పెషల్‌ ఇన్వెస్టిగేటింగ్‌ టీమ్‌ (సిట్‌) ఏర్పాటు చేసి విచారించమంది. ఆ షీటులో తన పేరు కూడా వుండడంతో ఉమా భారతి సిబిఐ చేత విచారణ జరిపించమని కోరారు. కానీ ముఖ్యమంత్రి రాష్ట్ర పోలీసుల చేతే చేయిస్తున్నారు. 

ఇప్పటికి 500 మందిని అరెస్టు చేశారు. వారిలో విద్యాశాఖ మంత్రి, ఆరెస్సెస్‌కు సన్నిహితుడు అయిన లక్ష్మీకాంత శర్మ కూడా వున్నారు. లిస్టులో వున్న పేర్లలో ఆరెస్సెస్‌ నాయకుడు సురేష్‌ సోనీ, ఆరెస్సెస్‌ మాజీ చీఫ్‌ కెయస్‌ సుదర్శన్‌ పేర్లు కూడా వున్నాయి. అసలు లిస్టులోని పేర్లను విచారణ సంస్థలు మార్చేశారని దిగ్విజయ్‌ సింగ్‌ ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి పేరు 21 చోట్ల వుంటే ఆయన పేరు తీసేసి ఆ స్థానంలో విద్యామంత్రి పేరు పెట్టారని, ఉమా భారతి పేరు ఏడు చోట్ల మార్చారని, రాజ్‌భవన్‌ పేరును ఒక చోట మార్చారని కూడా ఆరోపించారు. రాజ్‌ భవన్‌లో వుండే గవర్నరు రామ్‌ నరేశ్‌ యాదవ్‌ కుమారుడు శైలేశ్‌ కూడా నిందితుల్లో ఒకడు కాబట్టి గవర్నరును విచారించేందుకు అనుమతి కోరుతూ సిట్‌ హైకోర్టుకు దరఖాస్తు చేసుకుంది. ఉద్యోగాలకు సిఫార్సు చేసిన పెద్దల్లో గవర్నరు కూడా వున్నారు కాబట్టి ఆయన చేత రాజీనామా చేయిస్తారనే వార్తలూ వస్తున్నాయి. ముఖ్యమంత్రి శివరాజ్‌ ఆడ్వాణీకి సన్నిహితుడు. అందుచేత అతన్ని దింపేసి మంత్రి కైలాశ్‌ విజయవర్గీయను అతని స్థానంలో నియమించే యోచన కూడా అమిత్‌ షా మనసులో వుందట. దిగ్విజయ్‌ సింగ్‌ యిచ్చిన లిస్టు బోగస్‌ అని రాష్ట్ర బిజెపి అధ్యకక్షుడు నంద్‌కుమార్‌ చౌహాన్‌ ఓ పక్క ఆరోపిస్తున్నా, ఆ లిస్టు తెప్పించి నిజానిజాలు తెలుసుకోండి అని అమిత్‌ షా కేంద్రమంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ను ఆదేశించారట! 

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2015)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?