Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: ముంబయి కార్పోరేషన్‌ ఎవరిది?

ఎమ్బీయస్‌: ముంబయి కార్పోరేషన్‌ ఎవరిది?

ఎవరిదో యివాళ్టి ఎన్నికలో తేలుతుంది. ఫలితం ఎల్లుండి తెలుస్తుంది. 20 ఏళ్లగా కలిసి కార్పోరేషన్‌ను పాలిస్తూ వచ్చిన బిజెపి, శివసేన ఒకరితో మరొకరు తలపడి పోరాడడమే ఎన్నికపై ఆసక్తి కలిగిస్తోంది. రూ.43,123 కోట్ల డిపాజిట్లున్న బృహన్ముంబయ్‌ మునిసిపల్‌ కార్పోరేషన్‌ (బిఎంసి) దేశంలో అన్నిటికన్న అత్యంత ధనికమైన కార్పోరేషన్‌. దాని 2016-17 బజెట్‌ రూ. 37 వేల కోట్లు. అంటే అనేక రాష్ట్రాల బజెట్‌ కంటె ఎక్కువ. అంతేకాదు, ముంబయి దేశానికి ఆర్థిక రాజధాని. ఎందరో పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు మకాం వుండే నగరం. దీనిపై పట్టు సాధించాలని ప్రతి పార్టీ కలలు కంటుంది. ఇప్పటిదాకా కూటమిలో శివసేన పెద్దన్నగారి పాత్ర పోషించేది. కానీ 2014 పార్లమెంటు ఎన్నికలలో ముంబయిలో వున్న అసెంబ్లీ స్థానాల్లో బిజెపి 16 గెలవగా, శివసేన 14 మాత్రమే గెలిచింది. అప్పణ్నుంచి పెద్దన్న పాత్ర కోసం బిజెపి తహతహ లాడసాగింది. ఈసారి 227 కార్పోరేటర్‌ స్థానాల్లో 115 స్థానాలడిగింది.

'2014లో మోదీ హవా వుంది. తర్వాతి అసెంబ్లీ ఎన్నికలలోనే ఆ స్థాయిలో మీకు సీట్లు రాలేదు. ముంబయి మా యిలాకా. మీకు 60 సీట్లిస్తాం సరిపెట్టుకోండి.' అంది శివసేన. ఈ ప్రతిపాదన బిజెపికి నచ్చలేదు. పైగా బిజెపి ఎంపీ కిరీట్‌ సోమయ్య ''బిఎంసిలో రోడ్ల నిర్మాణంలో, చెత్త నిర్వహణలో, నీటి సరఫరాలో, స్కూలు యూనిఫారంలలో, పాల సరఫరాలో అన్నిటా మాఫియా నడుస్తోంది. శివసేన కనుసన్నల్లోనే యిది నడిచింది.'' అన్నాడు. దీనిపై కాంగ్రెసు ఎమ్మెల్యే నితీశ్‌ రాణే ''ఈ మాటలు నేను గత ఐదేళ్లగా చెపుతున్నాను. అన్నాళ్లూ బిజెపి మౌనంగా ఎందుకుంది? బిఎంసి లూటీకి గురవుతూ వుంటే సోమయ్యా, యితర బిజెపి నాయకులు గుడ్లప్పగించి చూస్తున్నారా?'' అని అడిగాడు. 

అనేక మురికివాడలున్న ముంబయిలో చెత్త నిర్వహణ - సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఒక గంభీరమైన సమస్య. యునైటెడ్‌ ఫాస్ఫరస్‌ లిమిటెడ్‌ అనే కంపెనీకి  ఏటా రూ.5 వేల కోట్ల ఫీజు చొప్పున 25 ఏళ్లకు బిఎంసి కాంట్రాక్టుకి యిచ్చింది. చెత్తలోంచి ఎరువులతో బాటు విద్యుత్‌ కూడా తయారు చేస్తానని కంపెనీ చెప్పింది. ఆచరణలో అదేమీ జరగటం లేదుట. చెత్త పట్టుకెళ్లి దేవనార్‌లో ఖాళీ స్థలాల్లో కుమ్మరిస్తున్నాడని మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన ఎమ్మెల్యే అంటున్నాడు. ''వర్షాలు వస్తే చాలు ముంబయి రోడ్లు నీళ్లతో నిండిపోతాయి. నల్లాలు శుభ్రపరచి నీళ్లు వెళ్లేట్లు చూడడానికి అంటూ రూ.4 వేల కోట్లు ఖర్చుపెట్టారు. అంతా అవినీతికే పోయింది.'' అంటాడతను.

బిజెపి కూడా భాగస్వామిగా వున్నా యిలాటి నిందలన్నీ తమ నెత్తి మీదకే వస్తాయని శివసేనకు తెలుసు. అందుకే యీసారి ఎన్నికల మానిఫెస్టోలో చాలా ఆఫర్లు యిచ్చింది. 500 చ.అ.ల కంటె తక్కువ వున్న యిళ్లకు యింటి పన్ను మాఫ్‌ చేస్తానంటోంది. విద్యార్థులకు ఉచిత బస్‌ సర్వీసట. 12 వేల మంది బిఎంసి శానిటేషన్‌ పనివారికి యిళ్లట. ''ఇవన్నీ ఆచరణ సాధ్యం కాని హామీలు. కార్పోరేషన్‌కు వచ్చే ఆదాయంలో 60% ఆక్ట్రాయ్‌ ద్వారా వస్తోంది. జిఎస్‌టి అమలులోకి వచ్చిన తర్వాత అది యిక రాదు. ఇక యింటి పన్ను విషయానికి వస్తే, 60% భాగం మురికివాడలే. అక్కడ యింటి పన్నే లేదు. మిగిలినవాటిల్లో చూస్తే 80% వరకు 500 చ.అ.ల కంటె తక్కువ యిళ్లే. వాటిపై పన్ను తీసేస్తే యిక ఆదాయం ఎక్కడిది? ఆదాయం లేకుండా శివసేన కార్పోరేషన్‌ను ఎలా నడపగలుగుతుంది?'' అంటాడు ఓ సీనియర్‌ జర్నలిస్టు. 

గెలవడం మాట ఎలా వున్నా శివసేన అధిపతి ఉద్ధవ్‌ ఠాక్రే బిజెపిపై మాంచి కసిగా వున్నాడు. ''ఆ పార్టీ నిండా గూండాలు, అవకాశవాదులు వున్నారు. రాష్ట్రపాలన చూడబోతే వీళ్ల కంటె కాంగ్రెసు హయాంలోనే పాలన బావుంది. ఇప్పుడు యుపి ఎన్నికలలో బిజెపి రైతుల ఋణాలు మాఫీ చేస్తానంటోంది. ఆ పని మహారాష్ట్రలో ఎందుకు చేయరు? మేం ఎన్నిసార్లు అడిగినా పెడచెవిన పెడతారెందుకు? ముంబయి నుంచి కేంద్రం రూ.2 లక్షల కోట్లు సంపాదించింది. దానిలో కనీసం నాల్గో వంతైనా మా మీద ఖర్చు పెట్టకూడదా? దేవేంద్ర ఫడ్నవీస్‌ ముఖ్యమంత్రిగా వున్నాడు. కళ్యాణ్‌-డోంబివిలి ప్రాజెక్టుకై రూ.6500 కోట్లు యిస్తానని 2015లో అన్నాడు. ఒక్క పైసా విదల్చలేదు. ముంబయి ఈస్ట్‌ కోస్ట్‌ను, కోస్టల్‌ రోడ్డును అభివృద్ధి చేయడానికి కేంద్రం నుంచి అనుమతులు కూడా సాధించలేదు. పైగా ముంబయి, పట్నా అంత వెనకబడిన నగరం అంటున్నాడు, చూడండి.'' అని తిట్టిపోస్తున్నాడు.

శివసేనకు కార్పోరేషన్‌లో 1997లో 103 సీట్లుండేవి. 2012 వచ్చేసరికి అవి 75 అయ్యాయి. ఈ సారి యింకా తగ్గించాలని బిజెపి ప్రయత్నం. దానికి అది వాడుతున్న ఆయుధం అవినీతి ఆరోపణలు. ''బిఎంసి కార్యకలాపాల్లో పారదర్శకత లేదు. గత రెండేళ్లగా అంతర్గత ఆడిట్‌ లేదు. అవినీతిని సమూలంగా తొలగించివేయడానికి మేం కంకణం కట్టుకున్నాం. కానీ అది ఉద్ధవ్‌కు నచ్చటం లేదు. బహుశా నోట్ల రద్దు తర్వాత బ్లాక్‌మనీపై దెబ్బ పడడం అతన్ని బాధిస్తోందేమో'' అని దేవేంద్ర వెక్కిరించాడు. తాము కేంద్రప్రభుత్వంలో పాలు పంచుకుంటున్నా, తమతో ఒక్క ముక్క చెప్పకుండా నోట్ల రద్దు వంటి పెద్ద నిర్ణయం తీసుకున్నందుకు మోదీపై మంటగా వున్న ఉద్ధవ్‌ యీ పారదర్శకత వ్యాఖ్యతో భగ్గుమన్నాడు.

''జనవరి 31 న పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఎకనమిక్‌ సర్వే చూడండి. దేశంలోనే అన్ని కంటె అత్యుత్తమంగా పారదర్శకత వున్న కార్పోరేషన్‌ బిఎంసి అని దానిలో వుంది. అది తయారుచేసిన వారు తెలివితక్కువ గాడిదలని బిజెపి భావమా?'' అని విరుచుకుపడ్డాడు.

2014 తర్వాత బిజెపిది పైచేయి కావడంతో అప్పటిదాకా శివసేన పోషిస్తూ వచ్చిన పెద్దన్న పాత్ర పోయి, శివసేన కార్యకర్తల్లో నిరుత్సాహం ప్రబలింది. వారిలో ఉత్సాహం నింపడానికి ఉద్ధవ్‌ యిటీవల ఏదో ఒక కార్యక్రమం చేపడుతున్నాడు. గ్రామీణ ప్రాంతాల్లో వున్న ప్రభుత్వ కార్యాలయాల్లో నుంచి దేవుడి బొమ్మలు తీసేయమంటూ యిటీవల దేవేంద్ర ప్రభుత్వం ఒక ఆదేశం జారీ చేసింది. ''ఇది  కాబినెట్‌లో చర్చించకుండా, శివసేన మంత్రులను సంప్రదించకుండా తీసుకున్న నిర్ణయం. ఇది 'ఫత్వా'లా వుంది. దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి.'' అని ఉద్ధవ్‌ డిమాండ్‌ చేశాడు. అంతే కాదు, గుజరాత్‌లో పటేల్‌ ఆందోళన పేరుతో బిజెపికి వ్యతిరేకంగా పోరాడుతున్న హార్దిక్‌ పటేల్‌ను తమ పార్టీలో చేర్చుకున్నాడు. చాలాకాలంగా సఖ్యంగా వున్న రెండు హిందూత్వ పార్టీల మధ్య ఏర్పడిన అఖాతం ముంబయి కార్పోరేషన్‌ ఎన్నికలతో మరింత వెడల్పు అవుతోంది.

ఈ ఎన్నికల తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి శివసేన బయటకు నడవడం ఖాయమనే అనుకుంటున్నారు. బిజెపి కూడా దానికి సిద్ధంగానే వుంది. అందుకే శివసేన స్థానంలో తమ కొమ్ము కాయడానికి ఎన్‌సిపిని రెడీ చేసి పెట్టుకుని వుంది. స్కాములతో కూరుకుపోయిన యుపిఏ ప్రభుత్వంలో ఆద్యంతం పాలు పంచుకున్న, అనేక ఆరోపణలున్న శరద్‌ పవార్‌కు పద్మవిభూషణ్‌ యిచ్చి మంచి చేసుకుంది. యుపి ఎన్నికల సందర్భంలో ఎస్పీ-కాంగ్రెసు మైత్రి గురించి మోదీ సెటైర్లు పేల్చవచ్చు కానీ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు వుండరని ఆయనకు తెలియనది కాదు, ఆచరించి చూపుతున్నదే!  

ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2017)

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?