Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: నగదురహితం... నడిచేనా? - 2/2

ఎమ్బీయస్‌: నగదురహితం... నడిచేనా? - 2/2

నీతి ఆయోగ్‌ సిఇఓ అమితాబ్‌ కాంత్‌ ప్రకారం డిజిటల్‌ లావాదేవీలు యిటీవలి కాలంలో చాలా పెరిగాయి. నవంబరు 9 నుంచి చూస్తే రూపే వాడకం 316% పెరిగితే, ఈ వాలెట్లు (పేటిఎమ్‌ వంటి ఈ-వాలెట్‌ అప్లికేషన్లు మొత్తం 55 వున్నాయి). మొత్తం అన్నీ కలిపితే 271% పెరిగాయి. యుపిఐ (యునైటెడ్‌ పేమెంట్‌ యింటర్‌ఫేస్‌) 119% పెరిగాయి. యుఎస్‌ఎస్‌డి (అన్‌స్ట్రక్చర్డ్‌ సప్లిమెంటరీ సర్వీస్‌ డేటా) వాడకం 1202% పెరిగిందని ఆయన చెప్పారు. ఇంతా చేసి జనాభాలో 5% మంది మాత్రమే డిజిటల్‌ లావాదేవీలు చేస్తున్నారు. ఎందువలన అంటే జనాలకు నెట్‌ ఆపరేషన్లపై యింకా గురి కుదరలేదు. యుపిఐ, యూఎస్‌ఎస్‌డిల వ్యవస్థల్లో లోపాలున్నాయని ఐటీ మినిస్ట్రీలో సెక్రటరీయే స్వయంగా చెప్పారు. ఆ సాంకేతిక సమస్యలను అధిగమించడానికి ఓ కమిటీ వేశారట. 2013 జనవరి నుంచి 2016 అక్టోబరు మధ్య జరిగిన సైబర్‌ సెక్యూరిటీ అఘాతాల (బ్రీచెస్‌) సంఖ్య 1.75 లక్షలున్నాయంటే (వీటి నిర్వచనం ఏమిటో వారికే తెలియాలి) యీ సమస్య ఎంత తీవ్రమైనదో తెలుస్తుంది. 

 'డిజిటలైజేషన్‌ పెద్ద కష్టం కాదు, చదువురాని వాళ్లు కూడా సెల్‌ఫోన్‌ వాడేస్తున్నారు, యిది నిమిషాల్లో నేర్చుకుంటారు' అని కొందరు వాదిస్తారు. సెల్‌ఫోన్‌ వాడకందార్లలో చాలామందికి  ఫోన్‌లా మాట్లాడడం తప్ప మెసేజిలు చూసుకోవడం కూడా రాదు. అనేక రకాల యాప్స్‌ ఎలా వుపయోగించాలో తెలియదు. 102 కోట్ల మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్లు వున్నాయి కానీ వాటిలో 15%కి మాత్రమే బ్రాడ్‌బాండ్‌ వుంది. చాలా ఫోన్లు బేసిక్‌ మోడల్సే తప్ప స్మార్ట్‌ ఫోన్లు కావు. ఇంటర్నెట్‌ వాడకం ప్రపంచ సరాసరి 67% కాగా, మన దేశంలో అది 27% మాత్రమే వుంది. మన దగ్గర సిస్టమ్స్‌ లోపభూయిష్టంగా వున్నాయని వేరే ఎవరూ చెప్పనక్కరలేదు, నాకే తెలుసు. ఎటిఎం కార్డు వాడినప్పుడు ఖాతాలో సొమ్ము తరిగిపోయింది కానీ డబ్బు చేతికి రాలేదు. బ్రాంచ్‌లో ఫిర్యాదు చేస్తే సవరించడానికి మూణ్నెళ్లు పట్టింది. 

మా క్రెడిట్‌ కార్డులో ఎవరో కానీ 2 డాలర్లతో ఏదో కొని, తర్వాత వెంటనే 250 డాలర్లతో మరొకటి కొనేశాడు. మా సెల్‌ నెంబరుకు ఒటిపి (ఒన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌) రాకుండా దాని చెల్లింపు ఎలా అయిందో తెలియదు. తస్కరించినవాడు మా సెల్‌ నెంబరు తీసేసి వాడిది పెట్టేశాడు అనుకుంటే, మరి ట్రాన్సాక్షన్‌ గురించిన మెసేజి మా సెల్‌కు వచ్చిందే! ఇది చేసిన అరగంటకు వాడు యింకో 250 డాలర్లతో మరొకటి కొన్నాడు. అయితే యీ లోగానే మేం కార్డు బ్లాక్‌ చేసేశాం. ఆ తర్వాత కార్డు వాళ్లు మొదటి 252 డాలర్లు కట్టమని మా వెంట పడ్డారు. వాగ్వివాదాలు, పోట్లాటలు నాలుగు నెలలు సాగాక చివరకు ఏ నష్టం లేకుండా బయటపడ్డాం. నెట్‌ బ్యాంకింగ్‌ చాలా సింపుల్‌గా అనిపిస్తుంది. ఓసారి మాది యూజర్‌ ఐడీతో సహా బ్లాక్‌ అయిపోయింది. కారణం ఎవరూ చెప్పలేకపోయారు. దానికోసం నాలుగు నెలలు తిరగాల్సి వచ్చింది. ఎంతోకొంత సాంకేతిక పరిజ్ఞానం వున్న నా సంగతే యిలా వుంటే, నా కన్న తక్కువ తెలిసున్న వారి సంగతేమిటి? ఈ యాప్స్‌ను అస్సలు నమ్మడానికి లేదు. ఓలా చూడండి. మొదట్లో ఎలా మొదలుపెట్టాడు? ఇప్పుడు ఎంత చార్జి చేస్తాడో వాడికే తెలియదు. పాత కాలపు టాక్సీలే హాయనిపిస్తున్నాయి. ఆటోలకు మీటర్లుంటాయి, టాక్సీలకు మీటర్లుంటాయి కానీ ఓలా, ఊబర్‌లకు వుండవు. వాళ్ల చిత్తం వచ్చినట్లు తీసేసుకుంటున్నా అదుపు చేసే శక్తి మాకు లేదు అంటోంది ప్రభుత్వం.

ఇలాటి భయాలతో కొత్త టెక్నాలజీ వైపు మళ్లేందుకు జనాలు ఓ పట్టాన సిద్ధం కారు. అందులో సైబర్‌ మోసాల్లో విద్యాధికులు కూడా చిక్కుకుంటున్నారు. ఇన్సూరెన్సు పాలసీల పేరు చెప్పి, లాటరీల పేరు చెప్పి ఫోన్లు చేస్తూంటే, ఈ మెయిల్స్‌ పంపుతూ వుంటే ఎంతోమంది తమ కార్డ్‌ నెంబరు, పిన్‌ చెప్పేస్తున్నారు. చదువుకున్న వారు కూడా ఎటిఎంల వద్ద యితరుల సహాయం తీసుకోవడం చూస్తున్నాం. ఎటిఎం, క్రెడిట్‌ కార్డుల క్లోనింగ్‌ల సంగతి వింటూనే వున్నాం. ఏదైనా గోల్‌మాల్‌ జరిగితే ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియని మాయాలోకం వచ్చింది. ఎవడికీ స్థిరమైన ఆఫీసు వుండదు. టోల్‌ఫ్రీ నెంబరుకు ఫోన్‌ చేసి మాట్లాడండి అంటారు. వాళ్లిచ్చే ఆఫరు గురించి ఈ మెయిల్‌ పంపమంటే పంపరు. గందరగోళంగా మాట్లాడి మన చేత ఔననిపించడమే వాళ్ల పని. ఏదైనా లావాదేవీ గురించి ఇంగ్లీషులో ఎస్సెమ్సెస్‌ వస్తే ఎంతమందికి అర్థమవుతుందో చెప్పలేం. 

నేను నెట్‌ బ్యాంకింగ్‌ వరకు చేస్తాను కానీ మొబైల్‌ బ్యాంకింగ్‌ అంటే భయపడతాను. నెట్‌లో కూడా బ్యాంకు ఖాతాలోంచి డబ్బు తీయడంలో ప్రమాదం తక్కువని, క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డు ద్వారా అయితే వాటి వివరాలు స్టోర్‌ చేసుకుని మన ప్రమేయం లేకుండా యింకోసారి రిపీట్‌ అయిపోయే ప్రమాదాలు వున్నాయని చెప్తారు. ఒక క్లబ్బు సభ్యత్వానికి యీ ఏడాది చందా క్రెడిట్‌ కార్డు ద్వారా చెల్లించామనుకోండి, వచ్చే ఏడాది దానంతట అదే రెన్యూ చేసుకున్న సందర్భాలు చూశాను. సెల్‌ఫోన్‌లు చేతులు మారడానికి చాలా అవకాశాలున్నాయి. మనమే ఎక్కడో మర్చిపోవచ్చు. సెల్‌ పోయినా డాటా భద్రం అని చెప్తారు కానీ నమ్మడానికి లేదు. మన మేధావులకు హ్యేక్‌ చేయడం సరదా. 100 రూ.లు పెట్టి పుస్తకం కొనటం కంటె 500 రూ.ల టైము వెచ్చించి దాని ఈ-బుక్‌ వెర్షన్‌ను ఛేదించడంలో మజా ఎక్కువ, లేదా 10 గంటలు వెచ్చించి ఆ పుస్తకాన్ని స్కాన్‌ చేసి బ్లాగులో పెట్టడంలో కిక్కెక్కువ. ఎటిఎంలలో స్కిమ్మర్స్‌ పెట్టి మన పిన్‌ నెంబరుతో సహా అన్నీ లాగేస్తున్నారు. హోటల్లో బిల్లు చెల్లించడానికి కార్డు ఉపయోగిద్దామంటే పిన్‌ అడుగుతారు. చెపితే ప్రమాదం కాబట్టి, మిషన్‌ తెప్పించుకోమని సలహా యిస్తున్నారు. అయినా యిప్పటికీ చాలామంది పిన్‌ చెప్పేయడం గమనిస్తూనే వుంటాం. 

ప్రపంచమంతా యిదే తంతు కాబట్టే అమెరికా ప్రభుత్వపు వెబ్‌సైట్‌ను, అధికార డెమోక్రాటిక్‌ పార్టీ డేటాబేస్‌ను రష్యన్‌ హ్యేకర్లు హేక్‌ చేయగలిగారు. ఆఫ్రికా, యూరోప్‌లలో పనిచేసే ఇండియన్‌ సంస్థల డేటాబేస్‌ను నవంబరులో ఎవరో గాని హ్యేక్‌ చేశారు. అక్టోబరులో భారతీయ బ్యాంకుల 30 లక్షల ఎటిఎం కార్డుల సమాచారం లీకయింది. అవన్నీ రద్దు చేయవలసి వచ్చింది. మన దేశంలో ఎటిఎమ్‌లలో 75% మైక్రోసాఫ్ట్‌ ఎక్స్‌పి ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై ఆధారపడి వున్నాయి. 2014 నుంచి మైక్రోసాఫ్ట్‌ దానికి సపోర్టు విత్‌డ్రా చేసింది. అందుకే కాబోలు హేకర్లు చొరబడగలిగారు. డిసెంబరులో లీజియన్‌ అనే బృందం విజయ్‌ మాల్యా, రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌ ఖాతాలను హ్యేక్‌ చేసింది. పే టిఎమ్‌లో కూడా లూప్‌హోల్స్‌ వున్నాయని వారు ప్రకటించారు. ఇప్పటికే ఏపిల్‌ హేండ్‌సెట్‌ యూజర్లు ఒక బగ్‌ కారణంగా పేటిఎమ్‌ చెల్లింపులు చేయలేకపోతున్నారట. తక్కినవారికి కూడా 'నో ట్రాన్సాక్షన్‌ ఐడీ' రావటం లేదు. మామూలుగా అయితే 48 గంటల్లో జమ కావాలని, కానీ బ్యాంకు సర్వర్లు బిజీగా వుండటంతో ఆలస్యమవుతోందని కంపెనీ సంజాయిషీ యిస్తోంది. పేటిఎంలోనే లోపాలున్నాయనుకుంటే ఆధార్‌ ఆధారిత చెల్లింపుల్లో మన బయోమెట్రిక్‌ వివరాలను కూడా దొంగిలించే సావకాశం వుందిట. అది మరింత ప్రమాదకరం అని సెంటర్‌ ఫర్‌ ఇంటర్నెట్‌ అండ్‌ సొసైటీ పాలసీ డైరక్టరు ప్రాణేశ్‌ ప్రకాశ్‌ అంటున్నారు. ఆరియన్‌ప్రో అనే సెక్యూరిటీ కంపెనీ సిఇఓ సమీర్‌ షా ప్రకారం అమెరికా, యూరోప్‌లు ఐడి మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌లలో మూడో, నాలుగో జనరేషన్‌లో వుండగా, ఇండియాలో మాత్రం ఫస్ట్‌ జనరేషన్‌లో వున్నాం. 

అసలు మన దేశంలోని ఐటీ చట్టంలో ప్రైవసీ కాపాడడానికి సరైన రక్షణలు లేవట. నేషనల్‌ సైబర్‌ సెక్యూరిటీ పాలసీ అని కొన్నేళ్ల క్రితం ప్రకటించినా తర్వాత దాని గురించి ఏమీ చేయలేదట. ప్రస్తుత చట్టం ప్రకారం సెక్షన్‌ 43 ఎ కింద కంపెనీ  సెక్యూరిటీ పరంగా తగినంత భద్రతలు తీసుకోవాలి అని వుంది. తగినంత అన్నదానికి నిర్వచనం లేదు. చెక్స్‌, కౌంటర్‌ చెక్స్‌ గురించి, ఆడిట్స్‌ గురించి, కనీసార్హతల గురించి ప్రస్తావన ఏమీ లేదు. అందువలన మన డేటా ఏదైనా కంపెనీ ద్వారా లీకైనా మనం వారిపై చర్య తీసుకోలేము. నేను పైన చెప్పిన నా ఉదాహరణలో నా క్రెడిట్‌ కార్డు వివరాలు అవతలివాడికి ఎలా తెలిశాయి అని కంపెనీని అడగలేకపోయాను కదా. కొత్త కార్డు తీసుకోవడానికి అనవసరంగా నాకు ఖర్చయినా వాళ్లు నా దగ్గర నుంచి ఆ 252 డాలర్లు అడగలేదు అని సంతోషపడి వూరుకున్నాను. మొన్ననే పేపర్లో చూశా - 2015-16లో డెబిట్‌/క్రెడిట్‌ కార్డు, ఆన్‌లైన్‌ చెల్లింపుల మోసాలపై 12 వేల కేసులు నమోదయ్యాయట. డబ్బు నష్టం జరగలేదు కదాని నాలా రిపోర్టు చేయని వారు ఎంతమంది వున్నారో మరి! ఒక సర్వే ప్రకారం తమ పాస్‌వర్డ్‌ల భద్రత ఏ మాత్రం పట్టించుకోనివారు 34% వున్నారట, వైఫై సురక్షితమో కాదో గుర్తించనివారు 44% మందిట. (ఈ 44%లో నేనూ వుంటాను. నేను వాడే వైఫై సురక్షితమో కాదో నాకు తెలియదు, ఎలా పరీక్షించాలో కూడా తెలియదు)

మన దేశంపై అనేక దేశాల వారు రకరకాల కారణాల చేత కన్ను వేసి వున్నారు. నోట్ల విషయంలో దొంగ నోట్లు ముద్రించి మన ఆర్థిక వ్యవస్థను కల్లోల పరచగలిగారని పాలకులే చెప్పారు. ఇక సైబర్‌ నేరమైతే అంత శ్రమ కూడా పడనక్కరలేదు. ఒక్క వైరస్‌ ఏదో పెట్టి మన బ్యాంకింగ్‌ వ్యవస్థనే స్తంభింప చేయగలుగుతారు. మనది మరీ దుర్భేద్యమైన వ్యవస్థ ఏమీ కాదు. మన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌లే హ్యేక్‌ అయిపోతున్నాయి. ఒకసారి మన రాష్ట్ర పోలీసు వెబ్‌సైటే హ్యేక్‌ చేసి వాళ్లు వెక్కిరించారు. ప్రపంచస్థాయిలో ఒక సంస్థ పనిచేస్తోందట. రాన్‌సమ్‌వేర్‌ అనే పేర వైరస్‌ తయారుచేసి మన సిస్టమ్‌లో పెట్టేస్తారట. వాళ్లడిగినంత రాన్‌సమ్‌ (బెదిరిస్తే చెల్లించాల్సిన మొత్తం) చెల్లిస్తే తప్ప మన కంప్యూటర్లలో ఏ ప్రోగ్రామూ పనిచేయకుండా అది అడ్డుకుంటుంది. ఆ రాన్‌సమ్‌వేర్‌ ప్రపంచంలో ఐదు దేశాలపై దృష్టి పెట్టింది. వాటిలో ఇండియా ఒకటి అని రష్యాకు చెందిన సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ కాస్పాచిర్‌స్కీ లాబ్‌ తెలిపింది. 2016 జులై-సెప్టెంబరు మధ్య ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో రాన్‌సమ్‌ బారిన పడినవారిలో మూడో వంతు మంది ఇండియన్లేట. హేకర్లను పట్టడం అంత సులభం కాదు. 

వెరిజాన్‌ అనే కంపెనీ లెక్కల ప్రకారం 2015లో ౖప్రపంచవ్యాప్తంగా లక్ష సెక్యూరిటీ బ్రీచెస్‌ జరిగాయట. 2016లో 2200 డేటా బ్రీచ్‌లు జరిగాయట. వీటిలో 900 ఫిషింగ్‌ కేసులే. ఆర్థికపరమైనవి, గూఢచర్యానికి సంబంధించినవి 89%. వీటిలో 10% మాత్రమే కనిపెట్టగలిగారు. మన వ్యవస్థలో లోపాలు తెలుసు కాబట్టే ఆర్‌బిఐ జూన్‌లో అన్ని బ్యాంకులను హెచ్చరించింది - మీరంతా సమగ్రమైన సెక్యూరిటీ సిస్టమ్‌ తయారుచేసి సైబర్‌ క్రైసిస్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాను సిద్ధం చేయాలి అని. అదెంతవరకు వచ్చిందో తెలియదు కానీ ప్రభుత్వం హఠాత్తుగా డిజిటలైజేషన్‌ పల్లవి ఎత్తుకుంది. కంప్యూటర్‌ ఎమర్జన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (సిఇఆర్‌టి-ఇన్‌) కింద రెండు టీములు ఏర్పాటు చేసి ఒకదాన్ని సైబర్‌ ఎటాక్స్‌ గురించి, మరొకదాన్ని డిజిటల్‌ పేమెంట్స్‌ గురించి చూడమంది. నేషనల్‌ సైబర్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌ అని మార్చి 2017లో ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ లోగా ఎన్ని కోట్ల లావాదేవీలు జరుగుతాయో, వాటిలో ఎన్ని సవ్యంగా వుంటాయో ఎవరికీ తెలియదు.

అసోచామ్‌ (అసోసియేటెడ్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌), ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ కలిసి తయారుచేసిన నివేదిక ప్రకారం మొబైల్‌ మోసాల స్థాయి పెరగవచ్చని హెచ్చరిస్తూ ప్రభుత్వం చాలా పనులు చేపట్టాలంది. పూర్తి స్థాయి డిజిటలైజేషన్‌కు 20 ఏళ్లు పట్టవచ్చంది. మెట్రోలు, పెద్ద నగరాలలో కూడా మూడేళ్ల తర్వాత 65-70% కావచ్చంది. సైబర్‌ నేరాల కారణంగా ప్రపంచంలో ఏటా 4 బిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లుతోందని చెప్పింది. భారత్‌లో మొబైల్‌ సెట్ల అప్లికేషన్లలో తగినంత భద్రతా ప్రమాణాలు లేకపోవడం చేత, తగినంత హార్డ్‌వేర్‌ ఉపయోగించకపోవడం చేత, ఫోన్‌ ద్వారా చెల్లింపులు ప్రమాదకరమని మొబైల్‌ చిప్‌ సెట్ల తయారీలో అగ్రగామి సంస్థ అయిన క్వాల్‌కామ్‌ స్పష్టం చేసింది. డిజిటల్‌ ఇండియా పేర ఏడాదిన్నర క్రితం కేంద్రం 1.13 లక్షల కోట్ల భారీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2017 మార్చి నాటికి 2.5 లక్షల గ్రామాలకు ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించడం, 1.5 లక్షల పోస్టాఫీసులను అనుసంధానం చేయడం, 2018 నాటికి అన్ని గ్రామాలుకూ మొబైల్‌ కనెక్టివిటీ అందుబాటులోకి తేవడం యిత్యాది అనేక లక్ష్యాలున్నాయి. 2017 యిప్పటికే వచ్చేసింది. ఎన్ని లక్షల గ్రామాలకు ఇంటర్నెట్‌ సౌకర్యం వుందో వారే చెప్పాలి. ఒక లెక్క ప్రకారం ఇంటర్నెట్‌ సౌకర్యం వున్న జనాభా 28% మాత్రమే. దేశంలో 19% గ్రామాలకు యిప్పటికీ విద్యుత్‌ సౌకర్యం లేదని గుర్తు పెట్టుకోవాలి. మన దేశంలో యిప్పటికీ 26% మందికి చదవటం తెలియదు, 60% మందికి ఇంగ్లీషు రాదు, 30 కోట్ల మందికి మొబైల్‌ ఫోన్‌ తెలియదు. ఈ వాలెట్లలో చార్జీలు ఎలా పంచుకోవాలన్న దానిపై వివిధ సంస్థలకు సమన్వయం కుదరలేదు. స్టేటుబ్యాంక్‌, పేటిఎమ్‌ మధ్య వివాదం నడుస్తోంది. యుపిఐ ఆశించిన ఫలితాల నివ్వలేదు. 2016 ఆగస్టులో ఎంతో హంగుతో ప్రారంభించినా ఎవరూ పెద్దగా మొగ్గు చూపటం లేదు. డిజిటల్‌ వాలెట్లతో పోలిస్తే 1% కంటె తక్కువగా వుంది. ఇక యుఎస్‌ఎస్‌డి ప్లాట్‌ఫాం లో ఇంటర్నెట్‌, స్మార్ట్‌ ఫోన్లు అక్కరలేదు కానీ పద్ధతి చాలా యిక్కట్లతో కూడినది. బ్యాంకులతో రిజిస్టర్‌ చేసుకోవాలి. ఐదారు స్క్రీన్‌లు దాటుకుని వెళ్లాలి. ౖటప్రస్తుతం సీలింగు రోజుకి 5 వేలు. వీటిల్లో అపరిష్కృతమైన సమస్యలెన్నో వున్నాయి. 

వాస్తవ పరిస్థితి యిలా వుండగా హఠాత్తుగా డిజిటలైజేషన్‌ గురించి పట్టుబడుతున్నారు. కార్డు వాడకం పెరిగిన కొద్దీ వీసా వంటి విదేశీ కంపెనీలకే లాభమని అందరికీ తెలుసు. ఎటిఎంల విషయంలో కూడా దేశంలో రెండు లక్షల చిల్లర ఎటిఎంలుంటే వాటిలో 3 వేలు మాత్రమే మన దేశంలో తయారవుతున్నాయట. లావాదేవీలు సాగించే స్మార్ట్‌ ఫోన్లలో 50% చైనావే. ఇటువంటి పెనుమార్పు తెచ్చేముందు స్వదేశీ ప్రత్యామ్నాయాలు అందుబాటులో వున్నాయో లేదో చూసుకోవాలి. లేకపోతే తయారేందుకు ప్రోత్సహించాలి. లేకపోతే దీనివలన లాభపడేవి విదేశీ కంపెనీలే! ప్రతిపక్షంలో వున్నపుడు బిజెపి స్వదేశీ నినాదాన్ని చాలా గట్టిగా వినిపించేది. అధికారం చేజిక్కాక దాన్ని ఆచరణలో చూపించి వుంటే బాగుండేది. 'నల్లధనం అరికట్టడానికే నగదురహితం చేపట్టాం, అంతా బ్యాంకుల ద్వారా నడిస్తే నల్లధనమనేదే వుండదు' అని హోరెత్తుస్తోంది ప్రభుత్వం. ఆర్‌బిఐ మాజీ గవర్నరు వైవీ రెడ్డిగారు మంచి ప్రశ్న లేవనెత్తారు - మన దేశం నుంచి నల్లధనం విదేశాలకు వెళ్లి రంగు మార్చుకుని తిరిగి వస్తోందని అందరికీ తెలుసు. అది నగదు రూపంలో వెళ్లటం లేదు కదా! బ్యాంకు కార్యకలాపాల ద్వారానే వెళుతోంది కదా అన్నారు. ఇప్పుడు రద్దు చేసిన నోట్ల విలువలో 50 వేల కోట్ల రూ.ల నోట్లు తప్ప తక్కినవన్నీ బ్యాంకింగ్‌ సిస్టమ్‌లోకి వచ్చి చేరాయట. అంటే బ్లాక్‌మనీ దాదాపు అంతమైందని నమ్మాలా!? క్యాష్‌ వాడకాని, నల్లధనం-అవినీతికి లింకు లేదని ఎకనమిస్టులన్నారు. అలాగే అభివృద్ధి చెందిన దేశాల్లో క్యాష్‌ వాడకం తక్కువ అనే వాదన కూడా సరైనది కాదు. క్యాష్‌ వాడకం తగ్గించడం ద్వారా ప్రతి అమ్మకమూ లెక్కలోకి వస్తుంది. దానిపై పన్ను ప్రభుత్వానికి చేరుతుంది. అందువలన దాన్ని ప్రోత్సహించాలి. కానీ అభివృద్ధి చెందిన దేశాలెన్నిటిలోనో నగదురహిత వ్యవస్థను సాధించలేకపోయారు. క్రమేపీ ఆ శాతాన్ని పెంచుకుంటూ వస్తున్నారంతే. ఇక్కడ తక్కిన దార్లన్నీ మూసేసి హఠాత్తుగా దానివైపు పరిగెట్టమంటే ప్రజలం బొక్కబోర్లా పడతాం. (సమాప్తం) 

ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జనవరి 2017)

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?