Advertisement

Advertisement


Home > Articles - MBS

కేంద్రీయ విద్యాలయాల్లో జర్మన్ భాషకు స్వస్తి?

మోడీ సర్కారు అంతర్జాతీయ సమాజాన్ని భారత్‌కు వచ్చి ఇక్కడ వస్తువులు తయారు చేయమంటోంది, భారీ నిర్మాణాలను చేపట్టమంటోంది. 2020 నాటికి భారత యువతను నిపుణులుగా చేసి స్కిల్ ఇండియాగా మారుద్దామని సంకల్పిస్తోంది. అంతర్జాతీయ సమాజంతో మనం సంబంధాలు పెట్టుకోవాలన్నా, పెంచుకోవాలన్నా భాష ముఖ్యమైన సాధనం. ఇప్పటిదాకా మనం ఇంగ్లీషునే పట్టుకుని వేళ్లాడుతున్నాం. ఇప్పుడు జపాన్, చైనా, అనేక యూరోప్ దేశాలతో వాణ్యి బంధాలను పెంచుకోవాలనుకుంటున్నాం, వారి సహాయంతో ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పుదా మనుకుంటున్నాం కాబట్టి ఆయా భాషలు తెలిసున్నవారు మనకు చాలామంది కావాలి. ట్రైనింగ్‌కై ఆ యా దేశాలు వెళ్లాలన్నా, వారితో కలిసి మెలసి పని చేయాలన్నా, సంప్రదింపులు జరపాలన్నా, దుబాసీల అవసరం లేకుండా చర్చలు జరపాలన్నా, వారి భాషల్లో వున్న దస్తావేజులను అనువదించుకోవాలన్నా భాష తెలిసుంటే ఖర్చు తగ్గుతుంది. పని సుకరమవుతుంది. రాబోయే దశాబ్దాలలో ఇంగ్లీషు కాకుండా ఇతర విదేశీభాషలు నేర్చుకున్నవారికి మంచి గిరాకీ వుండబోతోంది. కేంద్రప్రభుత్వపు విద్యాశాఖ మాత్రం ఇలా ఆలోచించటం లేదు. కేంద్రీయ విద్యాలయాల నుండి జర్మన్ బోధన తీసివేద్దామని చూస్తోంది. జర్మన్ ప్రభుత్వం ఆధ్వర్యంలోని గొథె ఇన్‌స్టిట్యూట్ భారతదేశంలో మాక్స్‌ముల్లర్ భవన్‌లను నెలకొల్పి జర్మన్ భాష చదివే విద్యార్థులను ప్రోత్సహిస్తుంది. జర్మన్ భాష నేర్చుకుంటే జర్మనీలో నాణ్యమైన ఇంజనీరింగు తక్కువ ఖర్చుతోనే చదవవచ్చు కాబట్టి అనేకమంది తెలుగు కుర్రవాళ్లు కూడా జర్మన్ నేర్చుకున్నారు. గతంలో హైదరాబాదులో మాక్స్‌ముల్లర్ భవన్ వుండే రోజుల్లో చాలామంది సరదాగా జర్మన్ నేర్చుకునేవారు. 

మాక్స్‌ముల్లర్ భవన్ ద్వారానే కాకుండా కేంద్రీయ విద్యాలయాల ద్వారా కూడా జర్మన్ నేర్పేందుకు జర్మన్ ప్రభుత్వం సహాయం చేస్తోంది. కేంద్రీయ విద్యాలయాల్లో జర్మన్ నేర్పే 700 మంది టీచర్ల జీతభత్యాలను అదే భరిస్తుంది. ఈ మేరకు భారత ప్రభుత్వంతో ప్రతీ మూడేళ్లకు ఒక ఒప్పందం కుదుర్చుకుంటుంది. ఈ అవకాశం వినియోగించుకోవడానికి కేంద్రీయ విద్యాలయాల్లో సగం స్కూళ్లు జర్మన్ భాషా విభాగం ఏర్పాటు చేశాయి. ఇప్పుడు హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ మంత్రిగా స్మృతి ఇరానీ వచ్చాక జర్మన్ భాషాబోధనకు అడ్డుకట్ట వేద్దామని చూస్తున్నారు. గొథె ఇన్‌స్టిట్యూట్-కేంద్రీయ విద్యాలయ సంఘటన్ మధ్య రాసుకున్న ఒప్పందం  (ఎంఓయు) సెప్టెంబరు ఆఖరికి పూర్తయింది. కానీ భారత ప్రభుత్వం దాన్ని కొనసాగించ దలచుకోలేదు. దీనికి వాళ్లు చెపుతున్న కారణం ఏమిటంటే - దేశంలోని త్రిభాషా సూత్రానికి ఇది అడ్డు వస్తోంది! ఆ సూత్రం ప్రకారం హిందీయేతర రాష్ట్రాలలోని విద్యార్థులు హిందీ, ఇంగ్లీషు, ప్రాంతీయభాష నేర్చుకుంటారు. ఉత్తరభారతంలోని విద్యార్థులు హిందీ, ఇంగ్లీషుతో బాటు ఏదైనా మోడర్న్ ఇండియన్ లాంగ్వేజి (ఎంఐఎల్) నేర్చుకోవాలన్న నిబంధన వుంది. అంటే వాళ్లు ఇతర భారతీయభాష - బెంగాలీయో, పంజాబీయో, తెలుగో, మరాఠీయో - నేర్చుకుంటారని, ఆ విధంగా జాతిసమైక్యతకు దోహదపడతారని విధానకర్తలు అనుకుని వుంటారు. కానీ వాళ్లకు ఈ భాషలేమీ పట్టవు. ఆ విభాగం కింద సంస్కృతం తీసేసుకుంటున్నారు. సంస్కృత భాష తీసుకున్నా నూటికి 90 మంది ప్రావీణ్యత సంపాదించటం లేదు. విద్యాభ్యాసం తర్వాత దాన్ని ఉపయోగించడం లేదు. దాని బదులుగా జర్మన్ తీసుకుంటే ఎందుకైనా పనికి వస్తుందన్న ఆలోచనతో విద్యార్థులున్నారు. అందుకే ప్రస్తుతం 70 వేల మంది జర్మన్ చదువుతున్నారు.

ఇది సంస్కృత భాషాభిమానులను బాధించింది. జర్మన్ మాన్పిస్తే తప్ప సంస్కృతం చదివేవారి సంఖ్య పెరగదన్న ఆలోచనతో సంస్కృత శిక్షణ్ సంఘ్ అనే సంస్థ గత ఏడాది ఢిల్లీ హైకోర్టులో ఒక పిల్ వేసింది. గొథె ఇన్‌స్టిట్యూట్‌తో చేసుకున్న ఒప్పందం రాజ్యాంగవిరుద్ధమని వారి వాదన. కోర్టు విచారణ సమయంలో కేంద్రీయ విద్యాలయ సంఘం జర్మన్ భాష అభ్యాసాన్ని గట్టిగా వెనేకసుకుని వచ్చింది. గ్లోబలైజేషన్ పెరుగుతున్న ఈ రోజుల్లో ఇది విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని వాదించింది. కావాలంటే మూడు భాషలతో బాటు విదేశీ భాషాధ్యయనం ఆప్షన్ కూడా అందరికీ ఇవ్వాలని సూచించింది. ఇప్పుడు స్మృతి ఇరానీ గారి శాఖ కేంద్రీయ విద్యాలయాల వాదనకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఒప్పందాన్ని అటెకక్కించింది. 

ఎమ్బీయస్‌ ప్రసాద్

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?