Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : పానుగంటి వారి ''సాక్షి'' - 3

సంఘసంస్కర్తలు సంఘాన్ని ప్రేమిస్తారు, దానిలోని లోపాలను ద్వేషిస్తారు. లోపాలు సవరించడానికి కొందరు సూటిమార్గంలో ఉపన్యాసాలు యిస్తారు, మరికొందరు వ్యంగ్యమార్గంలో వెక్కిరిస్తారు. వ్యంగ్యానికి పదును, ప్రభావం ఎక్కువ. కందుకూరి, చిలకమర్తి ప్రహసనాలు రాసినది అందుకే. సంఘంలోని దురాలోచనలను, దురలవాట్లను ఎత్తి చూపడానికి ఇంగ్లీషులో వచ్చిన ''స్పెక్టేటర్‌'' వ్యాసాల ప్రభావంతోనే పానుగంటి ''సాక్షి'' వ్యాసపరంపర మొదలుపెట్టారు. నాటకరంగంలోని కొందరు చేస్తున్న 'అతి'ని, ఔచిత్యభంగాన్ని ఎత్తి చూపడానికి ఆయన రాసిన వ్యాసాలను ఉదహరిస్తే ఆయన నాటకరంగం మొత్తాన్నే తిట్టిపోశాడనీ, నాటకాలనేవి చూడనక్కరలేనివనీ ఎవరైనా భావిస్తే అంతకంటె పొరబాటు వుండదు. పానుగంటి స్వయంగా నాటకకర్త. పాతిక పై బడి నాటకాలు రాశారు. అసలు ఆయన స్వతహాగా కవి. కాకినాడ నాటక సమాజం వారి నాటక ప్రదర్శనలు చూసి ఉత్తేజితులై, పామరజనానికి కూడా వాటి 'రీచ్‌' వుందని గ్రహించి అటు మొగ్గారు. పిఠాపురం సంస్థానంలో నాటకకర్తగా నియమించబడడానికి ముందూ, వెనుకా అనేక నాటకాలు రాశారు. అవి గ్రంథమాలగా ప్రచురించబడ్డాయి. ఆయన నాటకాల్లో కొన్ని - ''సారంగధర'', ''ప్రచండ చాణక్యము'', ''రాధాకృష్ణ'', ''పాదుకా పట్టాభిషేకము'', ''విప్రనారాయణ''! విప్రనారాయణ నాటకం చదివితే ఆ పేరుతో వచ్చిన సినిమాలో రేలంగి-భానుమతి మధ్య డైలాగ్సుకి యీ నాటకసంభాషణలే ప్రేరణ అనిపిస్తుంది. ''కంఠాభరణం'' అనే యీయన రాసిన ఫార్స్‌ అద్భుతంగా వుంటుంది. ఒక్క రాత్రిలో కథ నడుస్తుంది. దానిలో 'మాలప్రాపిజం'ను ఆయన ఎంత బాగా వాడుకున్నారో చెప్పలేను. హాస్యప్రియులు చదివి తీరవలసిన పుస్తకమది. ఇక కవిగా ఆయన ప్రతిభకు ఒక ఉదాహరణ - ''సంపూర్ణ రామాయణం'' సినిమాలో  రాముణ్ని ఉద్దేశించి వశిష్టుడు పాడినట్లు ఆయన పద్యాన్ని టెయిల్‌పీస్‌గా వాడుకున్నారు. దాన్ని యథాతథంగా యిస్తున్నాను. ఇదీ నాకు చాలా యిష్టమైన పద్యమే!

ఇక ''సాక్షి'' వ్యాసానికి వస్తాను - 2000 సం||రంలో ప్రపంచం అంతరించి పోతుందన్న పుకార్లు వచ్చినమాట యిప్పుడు ఎంతమందికి గుర్తుందో తెలియదు. 2012లో ప్రళయమే అని కూడా ప్రచారం సాగింది. అంతకుముందు 1900 సం||రంలో, 1800 లో కూడా యిలాటి పుకార్లే వచ్చాయట. స్కైలాబ్‌ పడిపోతుందని, అష్టగ్రహ కూటమి అని, వినాయకుడు పాలు తాగాడని, అమ్మవారి విగ్రహం నుంచి రక్తం కారిందని, ఏసు క్రీస్తు నీడ గోడమీద పడిందని, ఏదో ఒకటి చెప్పి ప్రపంచమంతా ప్రజలు కంగారు పడుతూనే వుంటారు. ప్రతీసారీ నోస్ట్రాడమన్‌ జోస్యం అనడం, మన తెలుగునాట అయితే బ్రహ్మంగారు చెప్పారనడం పరిపాటి. ఇటీవల గ్లోబల్‌ వార్మింగ్‌ గురించి చేసేదేమీ లేకపోయినా చర్చించడాలు, అడలగొట్టడాలూ ఎక్కువయ్యాయి. ఇలాటి మాటలు అప్పుడూ వున్నాయి. వాటి గురించిన  వ్యాసం యిది. 

గ్రహచక్ర జ్యోతిషము - సమావేశస్థలానికి వచ్చినవారు 'ఇప్పటికే ఎండలు తీవ్రంగా వున్నాయి, వైశాఖమాసం ఎలా వుంటుందో ఏమో' అనుకుంటూండగా జంఘాల శాస్త్రి ఉపన్యాసం మొదలుపెట్టాడు - ''కావా? యింకా ఎక్కువవుతాయి. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఎండలు హెచ్చిపోతున్నాయి. వర్షాలు తగ్గిపోతున్నాయి. భూమిలోని సారం హరించిపోతోంది. భూగర్భంలో వుండే అగ్ని అధికమవుతోంది. లతలు, చెట్లు నీరసిస్తున్నాయి. ఇక మనుష్యుల మాట చెప్పేదేముంది? ఏడు తరాల కింద జీవించిన మనిషి ఎవరైనా మళ్లీ పుట్టి మనల్ని చూస్తే మనం మనుష్యజాతి వాళ్లం అనుకోడు. అతని ముందు గేదె ముందు లేతపెయ్యల్లా అగపడతాం. దీనికంతా కారణం ఎండ. సూర్యుని ఆకర్షణ శక్తి అధికం కావడం చేత భూమి దినదినానికి సూర్యుడికి దగ్గరగా వెళ్లిపోతోంది. మన తండ్రుల కాలం కంటె మన కాలం వచ్చేసరికి మరింత దగ్గరగా వెళ్లింది. ఆ మహాగ్నికుండం ఏ పగలు మనల్ని భోజనం చేస్తుందో, ఏ రాత్రి నిద్రపోతూండగా గబుక్కున మింగుతుందో? అప్పుడు యీ భూమి దీపంలో మిడతలా, హోమకుండంలో నేతిబొట్టులా అంతరించిపోదూ!? 

ఇదిగో యీ పత్రిక చూశారా? కొన్ని సంవత్సరాలలో కొన్ని కోట్ల యోజనాల తోకతో ఒక గొప్ప తోకచుక్క అవతరిస్తుందని పాశ్చాత్యుడు రాసిన వ్యాసం.  అది ఒక క్రమం అనుసరించి, రూటు ప్రకారం పోకుండా యిష్టం వచ్చినట్లు ప్రయాణిస్తుందట. పొరపాటున ఖర్మకాలి, అంత పెద్ద తోకతో మన భూమిని కొడితే గాలిలోకి తన్నిన బంతిలా మన గోళం ఎక్కడకి ఎగిరిపడుతుందో ఆలోచించండి. భూమి అలా అంతరిక్షంలోకి ఎగిరిపోతూంటే మన గతి ఏమిటి? చెట్టు దులిపితే నేరేడుపళ్లు జలజల రాలినట్లు భూమి నుండి చెల్లాచెదరై జలజల-జరజర-బిరబిర కిందకు పడిపోమా? కింద అంటున్నాను కానీ భూమిని వదిలినవాడికి కిందేమిటి, పైనేమిటి? దేనిమీదా పడకుండా అంతరిక్షంలో గిరగిర ఎన్ని యుగాలు తిరుగుతూ వుంటామో ఏమో! అలా ఎగిరిపోకుండా భూమి మీద ఏ స్తంభాన్నో గట్టిగా పట్టుకుని నిలదొక్కుకున్నా, భూమి మరి ఏ యితర గోళాన్నో ఢీడిక్కీ కొడితే పండు దోసకాయ విచ్చిపోయినట్లు మన గోళం విడిపోదా? మనం గొట్టంలోంచి వెన్న ముద్దలు ఎగిసినట్లు పైకి ఎగిరిపోమా? మనలో కొందరు యితర గోళాల్లో పడిపోరా? 

ఈ పత్రికలోనే 37 వ పుటలో ఏముందో చూశారా? ఇది రాసిన పాశ్చాత్యుడు ప్రకృతిశాస్త్ర పండితుడు. సూర్యునిలో వంటచెఱకు తగ్గిపోతోందట. అందుకే సూర్యదీప్తి తగ్గిపోతోంది. కొంతకాలం జరిగాక సూర్యుడు ఆరిపోతాడు. సూర్యుడు చల్లారిపోతే చంద్రుడు, నక్షత్రాల మాట లెక్కేమిటి? ప్రపంచమంతా గాఢాంధకారం కమ్ముకుంటుంది. పగలు, రేయి తేడా తెలియదు. ఏక చలి. చలి కాచుకుందామంటే అగ్గిపుల్లయినా వెలుగుతుందో లేదో. అందరం గుడ్డివాళ్లం అయిపోతాం. ఆకలికి అలమటించి ఒకరి నొకరం తింటాం. ఇదొకటేనా? ఆరిపోయిన సూర్యుడికి ఆకర్షణశక్తి కూడా పోతుంది కదా. అది లేకపోతే యితర గోళాలు అంతరిక్షంలో ఎలా నిలుస్తాయి? వచ్చి మనమీద పడతాయేమో! ఈ ఆలోచన వచ్చిన కొద్దీ నాకు అన్నం సహించటం లేదు. మనసు చెదిరిపోయింది.'' అంటూ నిట్టూర్పులు విడుస్తూ జంఘాల శాస్త్రి కూర్చున్నాడు. ఇది విని పోగొట్టుకోవడానికి భార్య, పిల్లలు, సోదరీసోదరులు ఎవరూ లేని కాలాచార్యులు కూడా విషాదంలో మునిగిపోయాడు.  ఢీకొట్టినపుడు తను యింకో గోళంలోకి ఎగిరిపడితే అక్కడ తన కవిత్వం వినిపించడానికి వారికి తెలుగు వచ్చో రాదో అనే చింతతో కవి అయిన వాణీదాసుడు వెర్రివాలకం వేసి కూర్చున్నాడు. ఇక శ్రోతలందరూ దుఃఖంలో మునిగిపోయారు. వారిలో కొందరు తోకచుక్క కొట్టే లోపున రావలసిన బాకీలు వసూలు చేసుకుంటే మంచిదనుకుంటూ బయటకు వెళ్లిపోయారు. తూర్పు ప్రాంతాల నుంచి వచ్చిన ఒక యువతి జంఘాల శాస్త్రి వద్దకు వచ్చి ''అయ్యా మా పిన్నమ్మ నిన్న నేను వచ్చేసరికి కొత్తగా పెట్టిన ఆవకాయను ఎండపెట్టింది. అది ఎండకుండానే సూర్యుడు ఆరిపోతాడంటారా?'' అని ఆదుర్దాగా అడిగింది. 

ఇదంతా చూసి నేను (ఈ ఉపన్యాసాలు, కార్యకలాపాలు రిపోర్ట్‌ చేసే సాక్షి అనే అతను) వేదిక ఎక్కి మాట్లాడాను - ''చేటలో పడినది మొదలు కాటిలో పడేవరకూ మనం ప్రత్యక్షంగా ఏడవవలసిన ఏడుపులు చాలవన్నట్లు కొత్తగా యీ రోదనకాండ పారాయణ చేయాలా? మీకేమైనా మతి పోయిందా? ముంచుకు వచ్చిన ఆపదలను వేదాంత విజ్ఞానమున తొలగించుకోవడం మన విధి. అది మర్చిపోయి ఎప్పుడో రాదలచిన, వస్తుందో రాదో అని సందేహింప దగిన, వచ్చినా కలియుగంలో నాల్గో పాదంలో తప్ప రావడానికి వీల్లేని ఆపద గురించి యిప్పుడు ఆలోచించడం దేనికి? అంత సర్వనాశనం చేసే వుపద్రవమే అయితే విచారించేవాడి విచారానికే అవకాశం లేదు, ప్రతిక్రియ చేయడానికీ అవకాశం లేదు. అలాటి ఆపద వచ్చినప్పుడే ఏడవకుండా యిప్పుడే వచ్చినట్లు ఏడ్చేవాడు మూర్ఖుడు కాడా? ప్రాపంచిక వస్తువులు అస్థిరములు. శాశ్వతపదార్థం నీలో వున్నదని తెలుసు కదా. ఏ మహాతేజము ముందు సూర్యుడు కూడా బొగ్గువలె వుంటాడో ఆ తేజాన్ని నువ్వు ఆధ్యాత్మికదృష్టితో చూడగలిగినప్పుడు సూర్యుడు ఆరిపోతే ఏమి? గురుశుక్రులిద్దరు ఢీకొని పొడి ఐపోతేనేమి? అట్టి జ్ఞానథ ఎలా పొందాలో నేను చెప్తాను.'' అని ఉపన్యాసం మొదలుపెట్టేసరికి అందరూ జారుకున్నారు. (సశేషం) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2015)

[email protected]

Click Here For Part-1

Click Here For Part-2

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?