Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : రాజధాని స్థలానికి రైతులు ఒప్పుకున్నారా?

ఎమ్బీయస్‌ : రాజధాని స్థలానికి రైతులు ఒప్పుకున్నారా?

ఆంధ్ర రాష్ట్రంలో పాలన ఏం సాగుతోందో మనకు తెలియటం లేదు. ఉగాదికి హైదరాబాదు వదిలేసి ఆంధ్రలో గుడిసెల్లో కాపురం పెట్టి అక్కణ్నుంచే పాలన చేస్తామని బాబు అంటున్నారు. ఈ గుడిసెల కబుర్లు రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచే చెప్తూ వచ్చారు. అక్కడ గుడిసెలు వేయించిన పాపాన పోలేదు కానీ యిక్కడ హైదరాబాదులో ఆయన ఛాంబర్‌ రిపేర్లకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇన్ని కోట్లతో అక్కడ ఎయిర్‌ కండిషన్‌ గుడిసెలు వచ్చేవేమో! జిల్లాల్లో రొటీన్‌ కార్యకలాపాలు తప్ప రాష్ట్రస్థాయి నిర్ణయాలు తీసుకోవడానికి ఐయేయస్‌లు లేరు, ఉన్నతాధికారులూ లేరు. నామ్‌ కే వాస్తే ఉన్నవాళ్లు వుంటారో, వెళతారో తెలిసేటప్పటికి ఆర్థిక సంవత్సరం ముగిసిపోతుంది. ఉగాది వచ్చేస్తుంది. ఐయేయస్‌ల విషయమైనా యీ ఏడాది చివరకు తేలుతుందనుకుంటే అదీ వాయిదా పడుతోంది. కేంద్రానికి ఏ తొందరా లేదు, హైదరాబాదులో తిష్ట వేసుకుని వున్న ఆంధ్ర, తెలంగాణ అధికారులకూ లేదు. హామీలు యివ్వడం తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఏ పనీ జరగటం లేదనుకుంటారేమోనని బెంగ పెట్టుకున్న సందర్భంలో హుదూద్‌ వచ్చి కాస్త పరువు కాచింది. కాస్త యాక్టివిటీ వచ్చింది. కేంద్రం నుంచి నిధులు రావడం లేదు, వైజాగ్‌ పునర్నిర్మాణం జరగటం లేదు, యిక న్యూసేముంది అనుకోకుండా రాజధాని కోలాహలం ఒకటి నడుస్తోంది. అక్కడా యిక్కడా అన్న విషయం త్వరలోనే తేల్చేశారు. ఇక రాజధాని యిలా కడతాం, అలా కడతాం, వెళ్లి చూసి రండి అని ప్రజాప్రతినిథులకు విదేశాలకు పంపడాలూ అవీ జరిగాయి. పేరు ఏం పెట్టాలి అన్నదానిపై చర్చ కూడా ప్రారంభించేశారు. 

పచ్చని పొలాలు నాశనం చేసి రాజధాని కట్టడమేమిటి? అని అడిగేవాళ్ల నోరు మూయించడానికి రైతులు ఒప్పుకున్నాక మీ న్యూసెన్సు ఏమిటి అంటున్నారు. రైతులు నిజంగా ఒప్పుకున్నారా అన్న విషయంపై, చెప్పొద్దూ, నాకు క్లారిటీ రాలేదు. నాకు అర్థమైనంత వరకు 29 లో 28% అనగా 8 గ్రామాలు ఒప్పుకోలేదుట, 21 గ్రామాల వాళ్లు ఒప్పుకున్నారట. ఎక్కువ గ్రామాలు ఒప్పుకున్నాయి కాబట్టి ఆర్డినెన్సు తెచ్చి బలవంతంగా అందరి వద్దా భూములు తీసేసుకుంటారా? ఎవరైనా కోర్టుకి వెళ్లి సవాలు చేస్తే? అసలు నా సందేహం ఏమిటంటే - ఇలాటివి గ్రామాల చొప్పున లెక్క వేస్తారా?  గ్రామమంతా ఒకే మాటపై వున్నారా? పంచాయితీ ఎన్నికలలో సైతం ఏకగ్రీవంగా ఎన్నుకోరు కదా, యీ విషయంలో అందరూ అవును అనో, కాదు అనో ముక్తకంఠంతో చెప్పేశారా? 21 గ్రామాల్లో కాదన్నవాడు, 8 గ్రామాల్లో అవునన్నవాడు ఒక్కడూ లేడా? అసలు గ్రామవాసుల అభిప్రాయాలు ఎలా సేకరించారు? రిఫరెండమ్‌ జరిపారా? వాళ్లను కూర్చోబెట్టి రాజధాని వస్తే లాభాలివి, నష్టాలివి, వ్యక్తిగతంగా మీకు కలిగే ప్రయోజనాలివి, అనుకున్న ప్రకారం జరగకపోతే తగిలే దెబ్బలివి, యివన్నీ ఆలోచించుకుని ఓటేయండి అనే ఆప్షన్‌ యిచ్చారా? నిజానికి రాజకీయ నాయకులు ఏదీ స్పష్టంగా చెప్పరు. గందరగోళ పరచడమే వారి పని. 

ఎక్కడైనా ప్రాజెక్టు పెట్టాలని అధికార పార్టీ ఆలోచిస్తే, అప్పోజిషన్‌లో వున్న పార్టీ అడ్డుకుంటుంది. పారిశ్రామికవేత్తలతో ప్రభుత్వనేతలు కుమ్మక్కయ్యారంటుంది. లంచాలు తీసుకుని స్థానిక ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టారంటుంది. వాతావరణ కాలుష్యం అంటుంది, గిరిజనుల నాగరికత ధ్వంసమైందంటుంది. ప్రజాభిప్రాయ సేకరణ చేసి అప్పుడు పెడతాం అని కంపెనీ ప్రతినిథులు, అధికారులు వచ్చి మీటింగు పెట్టబోతే అప్పోజిషన్‌ వాళ్లు మీటింగే జరపనీయరు. ప్రాజెక్టు ఆగిపోతుంది. కట్‌ చేస్తే... ప్రతిపక్షం పాలకపక్షంగా మారితే, సేమ్‌ కార్డ్‌ - నేమ్‌ ఛేంజ్‌ అన్నట్టు ప్రాజెక్టు వలన కలిగే ప్రయోజనాలు వల్లిస్తారు. అభివృద్ధికి అడ్డుపడకూడదని సుద్దులు చెప్తారు. ఇలాటి పరిస్థితుల్లో మీడియా మేనేజ్‌మెంట్‌పై సర్వం ఆధారపడి వుంటుంది. ప్రభుత్వానికి అనుకూలంగా వున్న మీడియా 'ప్రజలంతా ప్రాజెక్టు చూసి సంతోషించారు' అని రాసేస్తుంది.

ఇప్పుడు రాజధాని గురించి నిజానిజాలు చెప్పవలసిన మీడియా కూడా వెస్టెడ్‌ యింట్రెస్ట్‌ అయిపోయింది. మీడియా హౌసెస్‌కు అక్కడ భూములు వున్నాయట. అందుకే కొన్ని టీవీల్లో అదే పనిగా కార్యక్రమాలు వేస్తున్నారు. అన్ని గ్రామాల వాళ్లు భూములిచ్చేశారు, మీరే మిగిలిపోయారు, ఆలసిస్తే ఆశాభంగం అని వూదరగొట్టేస్తున్నారు. అసలు ప్రభుత్వం ఏమిస్తుందో ఏమిటో టెర్మ్‌స్‌ ఎక్కడా ఫైనలైజ్‌ కాలేదు. ప్రభుత్వం ఆఫర్‌ చేస్తున్నది సరిపోదు, మాకు యింకా కావాలి అని ఊరిపెద్దలు అంటున్నారు అని రాసి వదిలేస్తున్నారు. వీళ్లు అడగడానికేం, ఎంతైనా అడుగుతారు. ఇచ్చేందుకు వాళ్లు రెడీనా? అది చెప్పటం లేదు. అసలు వీళ్ల ప్రామిస్‌లు ఎంతవరకు నమ్మాలి అనే దానిపై ప్రజలకు అనుమానాలు కలగవా? చంద్రబాబుకి విశ్వసనీయత లేదు అని వైయస్సార్‌ వూదరగొట్టి ఓట్లు దండుకున్నారు. ఆయన పోయాక 2014 ఎన్నికలలో ఓటర్లు బాబును విశ్వసించారు. 

అయితే ఋణమాఫీ  వ్యవహారం చూశాక నమ్మకం అడుగంటి వుంటుంది. మాఫీ గురించి ప్రచారంలో చెప్పినది వేరు, యిప్పుడు చెపుతున్నది వేరు. మానిఫెస్టోలు, ప్రచారచిత్రాలు, టీవీ చర్చల్లో పార్టీ సలహాదారులు చెప్పిన మాటలు అన్నీ రికార్డు అయి వున్నాయి. ఇప్పుడు ఎన్ని రైడర్స్‌ వచ్చి చేరాయో చూడండి. వ్యవసాయ ఋణాలు కావు, పంట ఋణాలన్నారు, కుటుంబానికి ఒక్కటే లోను అన్నారు. అప్పుకు పరిమితి పెట్టారు. నిజానికి యీ షరతులు విధించే క్రమంలో ఎన్ని విషయాలు బయటకు వచ్చాయో చూడండి. ఒక్క కుటుంబంలో 17 లక్షల రూపాయల లోను తీసుకున్నారట, 22 లోన్లు తీసుకున్నారట, డూప్లికేటు పేపర్లతో తీసుకున్నారట.. మొత్తానికి రైతులు దొంగలు అని తేల్చారు. మరి వీరి కోసమేనా అందరూ అంగలార్చేది? అసలు యిటీవలి కాలంలో రైతు అన్న పదమే పోయింది, మాట్లాడితే 'అన్నదాత' అంటారు, అక్కడకి వాళ్లు మనందరికీ అన్నం దానం చేస్తున్నట్లు! అలా అయితే వ్యాపారస్తులను కూడా వస్తుదాత అనవచ్చుగా! 

బ్యాంకు ఆఫీసర్లు, రైతులు కలిసి అవసరానికి మించి, నియమాలు ఉల్లంఘించి ఏ మేరకు కొల్లగొట్టారో తెలిసి వచ్చింది కదా! వీళ్లందరికీ మాఫీ చేయాలని ఎవరు మాత్రం అనగలరు? ఎన్నికల వాగ్దానాలు చేసేటప్పుడు యీ విషయాలు టిడిపి నాయకులకు తెలియవా? అంతా రైతు కుటుంబాలకు చెందిన వారమే, గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చామనే చెప్పుకుంటారు. వారి చుట్టాలు, పక్కాలు, యిరుగుపొరుగులు, బంధుమిత్రులు చేస్తున్నది వారికి తెలియదా? ఒకే పొలం చూపించి కుటుంబంలో నలుగురు లోను తీసుకుంటున్నారని తెలియదా? ఓట్లు అడిగేటప్పుడు 'మేం కక్షుణ్ణంగా వెరిఫై చేస్తాం, దొంగ లోను అని తేలితే మాఫ్‌ చేయం' అని చెప్పారా? లేదుగా! ప్రభుత్వం మనది, డబ్బు మనది, పైన కేంద్రంలో మనవాడున్నాడు, డబ్బులు కురిపిస్తాడు, కళ్లు మూసుకుని యిచ్చేస్తాం దోసిలి పట్టండి అని చెప్పి వుంటారు. ఆ మాటలు నమ్మడం బట్టే కదా రైతులు సకాలంలో తిరిగి కట్టకుండా వడ్డీ వెసులుబాటు, బీమా సౌకర్యం అన్నీ పోగొట్టుకున్నారు. 

ఇలా గట్టిగా చూస్తారని సెప్టెంబరులోగా ఏ మాత్రం అనుమానం తగిలినా కొందరైనా తిరిగి కట్టేసి బయటపడేవారు, తమ అక్రమాలు బయటకు రాకుండా కప్పిపుచ్చుకునేవారు. ఇప్పుడు బ్యాంకుల వాళ్లు కేసులు పెడతారో ఏమో! టిడిపి వారు కోటయ్య కమిటీ అని, ఆర్‌బిఐ ఒప్పుకుందనీ, రీ షెడ్యూల్‌ అనీ కబుర్లు చెప్పి కాలక్షేపం చేసి వాళ్లను మభ్యపెట్టి ముంచారు. 87 వేల కోట్ల భారం వుంటుందని బ్యాంకర్లు మొదటినుండీ చెప్తున్నా వీళ్లు అబ్బే మాకు తెలుసు, మీకేం తెలుసు అంటూ బుకాయిస్తూ వచ్చి చివరకు 15 వేల కోట్లకు భారాన్ని తగ్గించుకున్నారు. 50 వేల లోను మించిన వారికి యిప్పుడు వాయిదాల్లో కడతారట. మరి వడ్డీ పెరగదా? ఆ మాట అడిగితే 'అందుకే నన్నడిగితే ఆ డబ్బూ అదీ మీరే ఎక్కణ్నుంచో తెచ్చి అప్పు తీర్చేయండి. వడ్డీ మిగులుతుంది. మేం ఎప్పటికో అప్పటికి ఆ డబ్బు మీకు యిచ్చేస్తాం లెండి' అన్నారు బాబు. మా గొప్ప సలహా లెండి! వేరే చోట నుండి డబ్బు తెచ్చుకోగల సత్తా రైతులకు వుందని మీరనుకుంటే ఋణమాఫీ ఎందుకు ప్రకటించారు మహాశయా! 

ఈ మాఫీ సంగతి చూసిన రాజధాని ప్రాంత రైతులకు గుబులు పుట్టదా? వాళ్లు హోల్డ్‌ చేస్తున్న భూమికి సంబంధించిన కాగితాలలో ఎన్ని లుకలుకలు బయటపడతాయో! భూమి ఎవరి పేర వుంది? నువ్వు కౌలుదారువా, సొంతదారువా? పన్ను కట్టావా? ఇలాటి ప్రశ్నలు ఎన్ని వస్తాయో తెలియదు. మద్రాసులో రైల్వే స్టేషన్‌ పక్కన రైల్వే వారి స్థలంలో మూర్‌ మార్కెట్‌ అని సెకండ్‌ హ్యాండ్‌ వస్తువులమ్మే కొట్లు వుండేవి. సెంటర్లో వుంది కాబట్టి పగిడీ కూడా పెద్ద మొత్తంలోనే వుండేది. కానీ రైల్వే వాళ్లకు అద్దె అతి తక్కువగా వచ్చేది. వాళ్లకు తెలియకుండానే దుకాణాలు చేతులు మారుతూ వుండేవి. రైల్వే వాళ్లు రిజర్వేషన్‌ కౌంటర్లకు ఆఫీసు కావాలని వాళ్లను ఖాళీ చేయమన్నారు. వాళ్లు చేయలేదు. చెప్పి చూశారు చూశారు చివరకి ఎవరు నిప్పు పెట్టారో ఏమో కానీ పెద్ద అగ్నిప్రమాదం జరిగింది. రైల్వేవారు చ్చొచ్చొచ్చొ అని, 'అసలు దుకాణదారులెవరో వస్తే వాళ్లకు నష్టపరిహారం యిచ్చేస్తాం' అని ప్రకటించారు. అసలు వాళ్లెక్కడ? ఎప్పుడో పోయారు. ఇక శుబ్భరంగా రైల్వే వాళ్లు స్వాధీనం చేసేసుకుని పెద్ద బిల్డింగు కట్టేసుకున్నారు. ఇది జరిగిన కొన్నేళ్లకు కలకత్తా మునిసిపల్‌ కార్పోరేషన్‌ వాళ్లు న్యూ మార్కెట్‌ విషయంలో యిదే ట్రిక్కు వుపయోగించారు. ఇప్పుడు భూమి యివ్వడానికి సై అంటున్న వారెవరు? పట్టాదారులా? కౌలుదారులా? డబ్బు పెట్టి కొన్నవారా? అని శూలశోధన మొదలుపెడితే ఏమౌతుందో వేచి చూడాలి. 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2014)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?