Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: రాజీవ్‌ హత్య - 62

జులై 27 - షణ్ముగం చావు తర్వాత సిట్‌కు తమ కస్టడీలో వున్న యితర ఖైదీలపై భయం పట్టుకుంది. అప్పటిదాకా ముద్దాయిలందర్నీ 'సిట్‌' కేంద్ర కార్యాలయమైన 'మల్లిగై' భవనంలో నిర్బంధంలో వుంచారు. అందరికీ బేడీలు వేసి, ఒక్కో సిఆర్‌పిఎఫ్‌ కానిస్టేబుల్‌ను కాపలా పెట్టారు. కానీ అది చాలదనిపించింది. అందువలన వీళ్లకోసం ఒక ప్రత్యేక జైలు కావాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కార్తికేయన్‌ కోరారు. వాళ్లు వెంటనే స్పందించి మల్లిగైకు 25 కి.మీ.ల దూరంలో వున్న పూనమల్లి సబ్‌జైలును వారికోసం కేటాయించింది. అక్కడైతే భద్రతా ఏర్పాట్లు బాగుంటాయి. దానితో బాటు శ్రీలంక నుంచి వచ్చి అక్రమంగా యిక్కడ వుంటున్న తమిళులను విచారించడానికి సైదాపేట సబ్‌జైలును కేటాయించింది తమిళనాడు ప్రభుత్వం. 

xxxxxxxxxxxxxxxxx

ఆ రోజు రాత్రి గౌండర్‌ పాళయం అనే కోయంబత్తూరు శివారు ప్రాంతంలో మోటార్‌ సైకిల్‌ మీద వెళ్తున్న యిద్దరు యువకుల్ని పోలీసులు అనుమానించి పట్టుకున్నారు. పోలీసు స్టేషన్‌కు పట్టుకుని వచ్చి విచారించసాగారు. గట్టిగా అడిగితే తెలిసిందేమిటంటే వాళ్లిద్దరూ విక్కీ, రఘులు. ఎల్‌టిటిఇ కోసం పనిచేస్తున్న శ్రీలంక తమిళులు. గట్టిగా ఝాడిస్తే - ''మీ ప్రకటన చూసి భయమేసింది. శిబిరం మార్చేద్దామని అనుకున్నాం. కొత్త చోటు కోసం వెతుకుతున్నాం.'' అన్నారు. ఇప్పటిదాకా ఎక్కడున్నారంటే 'కోయంబత్తూరులో మునుస్వామి నగర్‌లో..' అన్నారు. అక్కడ మీతో ఎవరెవరున్నారని అడిగితే నాన్చారు. ఓ రెండు తగిలిస్తే 'మాతో బాటు డిక్సన్‌, అతని సహాయకుడు గుణ కూడా వుంటున్నారు.'' అని ఒప్పేసుకున్నారు. వెంటనే కోయంబత్తూరు మునుస్వామి నగర్‌ పోలీసు స్టేషన్‌కు సమాచారం వెళ్లింది.

నిజానికి విక్కీ రంగన్‌కు అనుచరుడు. రంగన్‌ శ్రీలంక తమిళుడు, ఎల్‌టిటిఇ నాయకుడు శంకర్‌కు డ్రైవరు, దొంగ పాస్‌పోర్టుల తయారీలో ఘనుడు. చెన్నయ్‌లో వుంటాడు. తిరుచ్చి శంతన్‌ ఆదేశాలపై శివరాజన్‌ ముఠాను బెంగుళూరు తరలించాడు. అలా తరలించినప్పుడు విక్కీ వారితో బాటు బెంగుళూరు వెళ్లి మళ్లీ కోయంబత్తూరుకు తిరిగి వచ్చేశాడు. ఇవన్నీ విక్కీ సిట్‌ వద్ద అప్పుడు దాచాడు. అప్పుడే చెప్పి వుంటే సిట్‌వారు బెంగుళూరు పరిగెత్తేవారు. 

జులై 28 - ఇంకా తెల్లవారలేదు. కోయంబత్తూరు మునుస్వామి నగర్‌ పోలీసు స్టేషన్‌ సిబ్బంది డిక్సన్‌, గుణలు వున్న యింటిని చుట్టుముట్టారు. ఏ మాత్రం అనుమానం తగిలినా ఎల్‌టిటిఇ కార్యకర్త తను సజీవంగా పోలీసులకు దొరక్కుండా వుండడానికి చూస్తాడనీ, అందుచేత చడీ చప్పుడు లేకుండా మెరుపుదాడి చేయాలనీ వారికి తోచలేదు. తమ మామూలు ధోరణిలోనే యింటిని చుట్టుముట్టి మైకులో ప్రకటనలు చేశారు - ''లొంగిపొండి, లొంగిపోతే మీకు ఏ హానీ కలగకుండా చూస్తాం'' అంటూ. డిక్సన్‌, గుణ చాలా తెలివైనవారు. పోలీసులకు సమాధానం చెపుతూ, వాదిస్తూ, తాత్సారం చేస్తూ యీ లోపునే తమ వద్ద వున్న సాక్ష్యాలన్నీ తగలబెట్టేశారు. శంతన్‌కు చెందిన సొంత వైర్‌లెస్‌ పరికరాలు, అతనికి మాత్రమే ప్రత్యేకమైన కోడ్‌ షీటు, యితర పత్రాలు అన్నీ స్టౌ మీద తగలబెట్టేశారు. కరెన్సీ నోట్లను తగలబెట్టి కిటికీలోంచి విసిరేసి, సైనైడ్‌ మింగి, తమను తామే పిస్టల్‌తో కాల్చుకుని చచ్చిపోతూ గ్రెనేడ్‌తో ఆ యింటిని ధ్వంసం చేశారు. పోలీసులకు చివరిలో కానీ బల్బు వెలగలేదు. పరిగెత్తి చూస్తే ఏముంది,  యిద్దరూ చచ్చిపోయారు, సాక్ష్యాలూ నాశనం. చచ్చిపోయేముందు డిక్సన్‌ స్వహస్తంతో రాసిన కాగితం అక్కడ దొరికింది - 'డియర్‌ కార్తికేయన్‌, మీ సామర్థ్యానికి నా జోహార్లు.. డిక్సన్‌' అని.  

ఆ పోలీసులు సిట్‌కు వెంటనే తెలియపరచి వుంటే వాళ్లు ఢిల్లీ నుంచి వచ్చిన నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌స్‌లోని బ్లాక్‌ కమాండోలను వుపయోగించి డిక్సన్‌ను సజీవంగా నిర్బంధంలోకి తీసుకునేవారు. కోయంబత్తూరు పోలీసుల కారణంగా అలా జరగలేదు. అది ఒక మచ్చ. రాజీవ్‌ హత్య తర్వాత ఇండియాలో జరిగిన తొలి సైనైడ్‌ చావు యిదే. డిక్సన్‌ బతికి వుంటే (53 వ భాగంలో అతని గురించి రాసినది కూడా చదవండి) రంగన్‌ ద్వారా శివరాజన్‌ ముఠా బెంగుళూరుకు తప్పించుకుని పోయిన విషయం సిట్‌ కనిపెట్టగలిగి వుండేది.

xxxxxxxxxxxxxxxxxxxxxx

1980లో ఎల్‌టిటిఇ వారి స్మగ్లింగ్‌ను, తీవ్రవాదుల చొరబాట్లను అరికట్టడానికై కోస్టల్‌ సెక్యూరిటీ సిస్టమ్‌ అని తమిళనాడులో పెట్టారు. అయితే అది సరిగ్గా నడవలేదు. ఇపిఆర్‌ఎఎల్‌ఎఫ్‌ నాయకుడు పద్మనాభ హత్య తర్వాత హంతకులు తప్పించుకున్న తీరు ఆ లోపాలను ఎత్తి చూపింది.  ఇప్పుడు రాజీవ్‌ హత్య తర్వాత కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చి, ఒత్తిడి చేయడంతో తమిళనాడు రాష్ట్రప్రభుత్వం 11 తీరప్రాంతపు జిల్లాలలో సెక్యూరిటీని పెంచింది. రామనాథపురంలో 10 చెక్‌పోస్టులు, తూర్పు తంజావూరులో 9, పుదుక్కోటై, పశ్చిమ తంజావూరు, సౌత్‌ ఆర్కాటులలో చెరో 5.. యిలా పెట్టుకుంటూ పోయింది. ఒక్కో చెక్‌పోస్టు వద్ద ఒక సబ్‌ ఇన్‌స్పెక్టరుతో సహా 15 మంది మనుషులు వుంటారు. వారి వద్ద 12 రైఫిల్స్‌, ఒక స్టెన్‌గన్‌, ఒక ఎల్‌ఎంజి వుంటాయి. ప్రతీ చెక్‌పోస్టు వద్ద ఒక విఎచ్‌ఎఫ్‌ (వెరీ హై ఫ్రీక్వెన్సీ) వైర్‌లెస్‌ సెట్టు వుంటుంది. ఈ చెక్‌పోస్టులు గతంలో వుండేవి కానీ సరిగ్గా పనిచేసేవి కావు. డీజిల్‌, పెట్రోలు స్మగ్లింగ్‌ అవుతున్నా, లంచాలు తీసుకుని స్టాఫ్‌ వదిలేసేవారు. ఇప్పుడు అలా కుదరదంటున్నారు. 

ఇవి కాకుండా తీరప్రాంతంలో నిర్దిష్ట ప్రాంతంలో తిరుగాడే మొబైల్‌ పెట్రోలింగ్‌ వ్యాన్‌లు ఏర్పాటు చేశారు. రామనాథపురం, తూర్పు తంజావూరు జిల్లాలలో చెరో నాలుగు వున్నాయి. ప్రతీ వ్యానులో ఒక యిన్‌స్పెక్టరు, 5గురు సహాయకులు వుంటారు. వారిలో ఒకరు డ్రైవరు. రివాల్వర్‌, రెండు ఎకె 47లు, ఒక రైఫిల్‌ వుంటాయి. ఇవి కాకుండా కాలినడకన పెట్రోలింగ్‌ చేసే యూనిట్లు కూడా పెట్టారు. ఒక్కో యూనిట్‌లో ఒక హెడ్‌ కానిస్టేబుల్‌, నలుగురు కానిస్టేబుళ్లు వుంటారు. రెండు రైఫిల్స్‌, వాకీటాకీ వుంటాయి. ఎవరైనా వ్యక్తి కానీ, బోటు కానీ అనుమానంగా సంచరిస్తూ వుంటే యితరులకు తెలియపరచడమే యీ పెట్రోలింగు యూనిట్ల పని. 

ఇవి కాకుండా కస్టమ్స్‌ శాఖను పిలిపించి అన్ని రకాల స్మగ్లింగ్‌ను అరికట్టమన్నారు. వైజాగ్‌ బేస్‌గా వున్న నేవీ సముద్రమధ్యంలో మూడు ఓడలతో నిఘా వేసింది. నేలమీద సెక్యూరిటీని పర్యవేక్షించడానికి 10 కంపెనీల తమిళనాడు స్పెషల్‌ పోలీసు, 10 కంపెనీల సిఆర్‌పిఎఫ్‌ పని చేశాయి. సముద్రం మీద సెక్యూరిటీ కోసమై కోస్ట్‌ గార్డ్‌, నేవీ కలిసి పనిచేశాయి. నాగపట్టినం, రామేశ్వరం వద్ద రెండు నావల్‌ డిటాచ్‌మెంట్లు పాక్‌ జలసంధిని వద్ద వున్న 30 కి.మీ.ల తీరాన్ని, మన్నార్‌ అగాధాన్ని పర్యవేక్షించాయి.  తంజావూరు జిల్లాలో తీరప్రాంతం 145 కి.మీ. దూరం విస్తరించింది. అక్కడంతా కచ్చా రోడ్లే. ఏది ఎక్కడికి దారి తీస్తుందో స్థానికులకే తెలుసు. పైగా అక్కడ అన్నీ కొబ్బరి తోటలే. ఎవరైనా దాగుంటే కనబడరు. 45 జాలర్ల గ్రామాలున్నాయి. రోజూ రాత్రి 10 వేల మంది వేటకు వెళతారు. చీకట్లో సముద్రంలో ఎవరు నిజమైన జాలరో, ఎవరు తమిళ టైగరో కనిపెట్టడం చాలా కష్టం. 

రామనాథపురం తీరం కంటె తంజావూరు తీరం తమిళటైగర్లకు, స్మగ్లర్లకు అనువుగా వుంది. ఎందుకంటే అక్కడ నీటి లోతు తక్కువ. నేవీ వారి పెద్ద నౌకలు అక్కడ వరకు రాలేవు. అందుకని యిప్పుడు అడుగు చదునుగా వుండి తక్కువ లోతు నీళ్లల్లో వెళ్లగలిగే బోట్లను ప్రత్యేకంగా తెప్పించారు. రాత్రి పూట చూడగలిగే నైట్‌ విజన్‌ ఎక్విప్‌మెంట్‌ తెప్పించారు. మారిన పరిస్థితులను జాలర్లు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇప్పటివరకు అధికారులు టైగర్ల్ల జోలికి వెళ్లవద్దనే వారు. వీలుంటే సాయపడి తృణమో, పణమో సంపాదించుకోమనేవారు. ఇప్పుడు వారు మన శత్రువులు పట్టుకోండి, మాకు అప్పచెప్పండి అంటున్నారు. స్థానిక పోలీసులకూ యిబ్బందిగానే వుంది. ఇన్నాళ్లూ వాళ్లకు ఎక్‌ 47లు అవీ పేల్చడమే రాదు. ఆధునిక ఆయుధాల జోలికి పోకుండా నెట్టుకొచ్చేశారు. ఇప్పుడు హఠాత్తుగా అవన్నీ యిచ్చి మీ తడాఖా చూపించండి అంటున్నారు. 

ఎంతైనా యీ ఏర్పాట్లు, చర్యలూ మంచి ప్రభావాన్ని చూపించాయి. ఎల్‌టిటిఇకి సంబంధించిన ఎంతోమంది పట్టుబడడం, వారిని సిట్‌ విచారించడం జరిగింది. ( సశేషం) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌  (ఏప్రిల్‌ 2015)

[email protected]

Click Here For Archives

(ఫోటోలు - విక్కీ (గడ్డం, మీసంతో), రంగన్‌, శ్రీలంక తమిళుల కోసం బస్సుల్లో గాలింపు, వేదారణ్యంలో పోలీసుల పర్యవేక్షణలో చేపల వ్యాపారం) ఫోటో సౌజన్యం - ఇండియా టుడే, ఫ్రంట్‌లైన్‌

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?