Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: రాజీవ్‌ హత్య - 66

ఆగస్టు 9 -రాజీవ్‌ హత్యలో మానవబాంబు ఉపయోగించారని కనిపెట్టినది తమిళనాడు ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ డిపార్ట్‌మెంట్‌ వారే. ఆ బాంబు తయారీ విధానం వలననే సిట్‌ ఎల్‌టిటిఇ వైపు దృష్టి సారించింది. ఆ శాఖకు 1980 నుండి డైరక్టరుగా వున్న ప్రొఫెసర్‌ పి. చంథ్రేఖరన్‌కు 30 ఏళ్ల టీచింగ్‌, రిసెర్చ్‌ అనుభవం వుంది. ఇంగ్లండ్‌, జర్మనీ, స్కాట్లండ్‌, వియన్నా, స్విజర్లండ్‌, ఫ్రాన్స్‌లలో ప్రత్యేకంగా తర్ఫీదు పొంది వచ్చారు. ఆయన రూపొందించిన స్కల్‌ స్ట్రక్చర్‌ ద్వారా మనిషెవరో కనుకోగలమనే థియరీ ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది. నేరపరిశోధనలో తమ విభాగం ఎలా వుపయోగపడుతోందో ఆయన మీడియాకు చెప్పసాగారు. 

రాజీవ్‌ హత్య జరగగానే ఏదో ఒక బొకేలోనో, పూలబుట్టలోనో బాంబును అమర్చి రిమోట్‌ కంట్రోలుతో దాన్ని పేల్చి వుంటారని మొదట అందరూ అనుకున్నారు. హత్య జరిగిన కొన్ని గంటలకు అంటే మే 21 అర్ధరాత్రి దాటిన రెండున్నర గంటలకు ఫోరెన్సిక్‌ నిపుణులు అక్కడకు చేరి సాక్ష్యాలు సేకరించసాగారు. ఈయన 22 ఉదయం 8 గం||లకు కారులో చెన్నయ్‌ నుండి పెరంబుదూరు వెళుతున్నాడు. 7, 8 న్యూస్‌ పేపర్లలో ఫోటోలు చూశాడు. హత్యాస్థలం వద్ద పేలుడుని చూపించిన ఫోటోలు కూడా వాటిలో వున్నాయి. అవి చూస్తూండగానే యీయన పూలబుట్ట టైపు బాంబు కాదని గ్రహించాడు. ఎందుకంటే ఆ పరిస్థితిలో నేలపై గుంత పడి వుండాలి. కానీ గుంతేమీ లేదు. తివాచీ కూడా పాడు కాలేదు. అంటే బాంబు నేల లెవెల్లోకాదు, నడుం లెవెల్లో పేలి వుండాలి. ఎందుకంటే హతుడి నడుం కింద భాగమే పేలిపోయింది. హత్యాస్థలానికి వెళ్లడానికి ముందే యీయనకు నమ్మకం కుదిరింది - ఎవరో నడుం లెవెల్లో బాంబు పెట్టుకుని పేల్చి వుండాలి అని. 

హత్యాస్థలంలో చూసినపుడు కార్పెట్‌ కాస్త నేలలోకి కుంగినట్లు అనిపించింది. బ్లూ డెనిమ్‌ ముక్కలు కనబడ్డాయి. జాగ్రత్తగా వెతగ్గా వైరు ముక్కలూ కనబడ్డాయి. వాటితో హంతకురాలు వేసుకున్న జాకెట్‌ను పునర్నిర్మించారు వీళ్లు. పలు ప్రయోగాల తర్వాత సి4 టైపు 90% ఆర్డెక్స్‌ను పేలుడుకై వుపయోగించారని తేల్చారు. పశ్చిమ దేశాల్లో వుపయోగించే పర్శనల్‌ ఎప్పియరెన్స్‌ ఐడెంటిఫికేషన్‌ పద్ధతిని యిక్కడా వుపయోగించాలని ఆయన వాదించి వాదించి మన ప్రభుత్వాన్ని ఒప్పించారు. అది యిప్పుడు ఎంతగానో ఉపయోగపడుతోంది. హరిబాబు తీసిన రాజీవ్‌ హత్య ఫోటోలు మే 24 న హిందూ పేపర్లో రావడానికి యీయనే కారణమనీ, యీయనే వాళ్లకు లీక్‌ చేశాడనీ ఆరోపణలు వచ్చాయి. చీఫ్‌ సెక్రటరీగా వున్న టివి ఆంటోనీ యీయన్ను పిలిపించి నువ్వే యిచ్చావా అని అడిగారు. పరిశోధన సాగుతూండగా పత్రికలతో మాట్లాడమేమిటని మందలించారు. తనా రోజు ఆఫీసులోనే లేననీ, ఫోటోలు ఎలా సంపాదించారో హిందూ వాళ్లనే అడగాలనీ యీయన అంటాడు. ఇక ప్రెస్‌తో మాట్లాడడం విషయమై ఫోరెన్సిక్‌ సైన్సు గురించి ప్రజల్లో అవగాహన పెంచితేనే నేరస్థలంలో సాక్ష్యాలు నాశనం కాకుండా వుంటాయని ప్రభుత్వం చెపుతోందని, అందుకే తను ఆ విభాగం విలువేమిటో ప్రజలకు చెప్తున్నాననీ ఆయన వాదిస్తున్నాడు. 

xxxxxxxxxxxxxxxxxxxxx

ఆగస్టు 11- శివరాజన్‌ ముఠా స్థానిక ఎల్‌టిటిఇ కార్యకర్తలందరితో సంబంధాలు తెంపేసుకుని సురేష్‌ మాస్టర్‌ ద్వారానే కొత్త యింటి కోసం ప్రయత్నిస్తూండడంతో సిట్‌కు సమాచారం రావడం ఆగిపోయింది. వాళ్లకు యిళ్లు చూపుతున్న రంగనాథ్‌కు కూడా నేరచరిత్ర ఏదీ లేదు. విడిగా ఎవరి కంటా పడకుండా వుండే యిళ్ల కోసం రంగనాథ్‌ వెతికి, వెతికి బెంగుళూరు సమీపంలోని మాండ్యా జిల్లాలోని ముత్తటి, బిరూటి గ్రామాల్లో రెండు యిళ్లు - సినిమా షూటింగు కోసం తీసుకుంటున్నాం అని చెప్పి అద్దెకు తీసుకున్నాడు. శివరాజన్‌ ముఠా అక్కడకు మారిపోయింది. అప్పటికే రంగనాథ్‌కు అర్థమై పోయింది - వీళ్లు పోలీసులు వెతుకుతున్న శివరాజన్‌, శుభ అని. కానీ నరరూప రాక్షసులు కాబట్టి, వాళ్ల మాటకు ఎదురాడితే చంపేస్తారని భయపడి, వాళ్లు చెప్పినట్లల్లా ఆడుతున్నాడు. అతని భార్య మృదులకు చెప్పగానే చాలా భయపడింది. ఎందుకొచ్చిన గొడవ, తప్పుకుంటే పోలేదా అనుకుంది. కానీ డబ్బు అవసరం కదా అని చెప్పి భర్త ఆమెకు నచ్చచెప్పాడు. ఇక ఆమె వూరుకుంది. భర్తతో కలిసి వాళ్ల రహస్య శిబిరాలకు వెళ్లి అక్కడ శివరాజన్‌ బృందంతో బాటు వున్న గాయపడ్డ కార్యకర్తలను దగ్గర్లో వున్న కళప్ప నర్శింగ్‌ హోంకు తరలించడానికి, చికిత్స చేయించడానికి సాయపడింది. రంగనాథ్‌, భార్య స్థానికులు కాబట్టి యీ రోగులు వాళ్లకు తెలిసినవాళ్లో, బంధువులో అనుకుని వైద్యులు చికిత్స చేశారు.

ఇవేమీ సిట్‌కి గానీ, కర్ణాటక పోలీసులకు కానీ తెలియటం లేదు.

ఆగస్టు 13- రంగనాథ్‌ సహాయంతో సురేశ్‌ మాస్టర్‌ తిరుచ్చి శంతన్‌కు చెందిన ఆకుపచ్చ జిప్సీకి, నీలం రంగు ఫియట్‌కు తెల్ల రంగు వేయించాడు. రకరకాల నెంబరు ప్లేట్లను రెడీగా పెట్టుకుని మారుస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం వున్నదే కాకుండా ఇంకో యిల్లు వెతకమన్నాడు. రంగనాథ్‌ యీసారి బెంగుళూరు శివార్లలోని కోననకుంటెలో యింకోటి చూసిపెట్టాడు. 

ఆగస్టు 14- తిరుచ్చి జిల్లాలోని కరూర్‌ దగ్గరున్న చిట్టిపాళయం శిబిరంలో తలదాచుకున్న తిరుచ్చి శంతన్‌ వద్ద వున్న వరదన్‌   యిళ్ల మధ్య వుండగా వైర్‌లెస్‌ వాడవద్దని చెప్పినా బద్ధకంతో 'ఇవాళ శంతన్‌ బయటకు వెళ్లాడు కదా, మళ్లీ ఎక్కడో నిర్జన ప్రదేశానికి వెళ్లడం దేనికి' అనుకుని తామున్న యింట్లోంచే వైర్‌లెస్‌ సెట్టుతో సంభాషించాడు. దాంతో పక్కనున్న యిళ్లలో టీవీ సిగ్నల్స్‌ గందరగోళంగా మారిపోయాయి. ఇలాటిది జరిగితే పోలీసులకు చెప్పాలన్న సంగతి అందరికీ గుర్తుంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. (సశేషం)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌  (ఏప్రిల్‌ 2015)

[email protected]

(ఫోటోలు - ప్రొ. చంథ్రేఖరన్‌  ఫోటో సౌజన్యం - ఇండియా టుడే, ఫ్రంట్‌లైన్‌

Click Here For Archives

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?