Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: రాజీవ్‌ హత్య - 70

ఆగస్టు 19 తెల్లవారింది. ఊరు జనం నిద్ర లేచి అక్కడ మోహరించిన పోలీసు వాహనాలను చూసి గుమిగూడారు. ఏమైంది, ఏమైంది అని అడగసాగారు. పొద్దెక్కిన కొద్దీ వాళ్లను అదుపు చేయడం, ఆ దారిన పోయే ట్రాఫిక్‌ను మళ్లించడం పోలీసులకు పెద్ద తలనొప్పిగా తయారైంది. 

హైదరాబాదు నుంచి బెంగుళూరుకు వచ్చే మొదటి విమానంలో కార్తికేయన్‌ వచ్చారు. 

ఉదయాన్నే నిద్ర లేచిన రంగనాథ్‌ తన స్నేహితుడు ప్రేమకుమార్‌తో కలిసి ఆటో రిక్షాలో కోననకుంటెకు వచ్చాడు. ఆటో దిగ్గానే ఆ యిల్లు అద్దెకు తీసుకున్న మనిషిగా పాలమ్మే మునియమ్మ గుర్తించింది. ''నువ్వే గదా ఆ యిల్లు బాడుగకు తీసుకున్నది'' అని అడిగింది. రంగనాథ్‌ కంగారు పడి ''నాకేం తెలియదు, నువ్వెవరో, ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో'' అంటూ పారిపోబోయాడు. అతని వెంట ప్రేమకుమార్‌ కూడా! అక్కడున్న జనం వాళ్లను చుట్టుముట్టి గుమిగూడి ఎటూ పోనీయకుండా ఆపేశారు. పోలీసులు వచ్చి రంగనాథ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రేమకుమార్‌ టైగర్‌ కదా, సైనైడ్‌ గొట్టం నోట్లో వేసుకున్నాడు. పోలీసులు  వెంటనే పట్టుకుని ఉప్పునీరు పట్టించి కక్కించారు.  

సాయంత్రం 4.30 కు విజయ్‌ కరణ్‌, రామాచారి బెంగుళూరు వచ్చారు. ఎన్‌ఎస్‌జి వద్ద వున్న సైనైడ్‌ విరుగుడు మందులు చూసి రామాచారి పెదవి విరిచారు. ఇవి పనికి రావు, గ్వాలియర్‌ నుంచి మరో రకమైన మందులు తెప్పిస్తే మంచిదన్నారు. ఎన్‌ఎస్‌జి ప్రధానాధికారి కల్నల్‌ దత్తా వాటిని తీసుకుని వస్తానన్నారు. ఇవన్నీ మర్నాటి ఉదయం దాకా రావు. అప్పటిదాకా ఆగాలనుకున్నారు. అవి వచ్చాక దాడి చేసి శివరాజన్‌ బృందం సైనైడ్‌ మింగితే వెంటనే విరుగుడు మందు యిచ్చి, చికిత్స చేసేందుకు దగ్గరలో వున్న హాస్పటల్‌లో ఏర్పాట్లు చేసుకున్నారు. హాస్పటల్‌కు వెళ్లాలంటే జనసందోహం అడ్డుపడకుండా వుండాలి. ట్రాఫిక్‌ జామ్‌ కాకుండా చూడాలని పోలీసులకు ఆదేశాలిచ్చారు. ముఠా వాళ్లు యింటికి నిప్పుపెడతారేమో ఎందుకైనా మంచిదని అగ్నిమాపక దళాన్ని సిద్ధం చేశారు. అన్నీ రెడీగానే వున్నాయి, ఆ మందులేవో వచ్చేదాకా అడుగు ముందుకు వేయకూడదు అనుకుని అందరూ నిమిషాలు లెక్కపెడుతూ కూర్చున్నారు.

ఈలోగా మూడో కంటికి తెలియకుండా టైగర్లను గమనించవలసిన కర్ణాటక పోలీసులకు అదెలా చేయాలో తెలియలేదు. శివరాజన్‌ శిబిరానికి పొరుగున వున్న మూర్తి అనే ఆయన యింట్లో 20 మంది పోలీసులను మఫ్టీలో వుంచి నిఘా వేయమన్నారు. చిన్న యింట్లో 20 మంది వుండడంతో వాళ్లు తిరణాలకు వచ్చి పోతున్నట్లు హడావుడి చేసి నలుగురి కళ్లల్లో పడ్డారు. ''అసలు ఆ బంగళాను మాత్రమే కాకుండా మొత్తం ఆ ఏరియా నంతటినీ చుట్టుముట్టి వుంటే యింత గందరగోళం జరిగేది కాదు'' అన్నారు నిపుణులు, సంఘటన తర్వాత. రంగనాథ్‌, ప్రేమకుమార్‌లను పట్టుకోవడంలో జనం కూడా పాలు పంచుకోవడంతో అక్కడంతా పెద్ద సంతలా మారింది. అందరూ ఒకరి నొకరు ఏమైందని ప్రశ్నించుకోవడం, ప్రతీవాడూ ఆ ఘనకార్యం తనే చేశానని చెప్పుకోవడం జరిగింది. ప్రేమకుమార్‌కు ఉప్పునీరు పట్టించడం జనాలంతా చూశారు. ఒక చిన్న పల్లెటూరిలో యింత ముఖ్యమైన సంఘటన జరుగుతూంటే ఎందరు గుమిగూడతారో వూహించవచ్చు. వాళ్లను అదుపు చేయడానికి అక్కడున్న 40 మంది పోలీసులు సరిపోక, మూడు వ్యాన్ల నిండా రిజర్వు దళాలను రప్పించవలసి వచ్చింది. ఈ గోల కారణంగా శివరాజన్‌ ముఠాకు తాము పట్టుబడ్డామని తెలిసిపోయింది. పోలీసులు ఎప్పుడు దాడి చేస్తారో, ప్రతిగా మనం ఎప్పుడు ఎదురుదాడి చేయాలో అని  తుపాకులు పట్టుకుని కాచుకుని కూర్చున్నారు. 

సాయంత్రం చీకటి పడింది. ఇలాటి పరిస్థితుల్లో విధి ఒక వింత క్రీడ ఆడింది. అటువైపు వెళుతున్న కట్టెల లారీ ఒకటి శిబిరానికి 150 అడుగుల దూరంలో అడుసులో దిగబడిపోయింది. దాన్ని బయటకు లాగడానికి డ్రైవరు బాగా యాక్సిలరేట్‌ చేశాడు. దాన్తో యింజన్‌పై బాగా భారం పడి ఢాం అని శబ్దం చేసి ఆగిపోయింది. 

ఈ శబ్దం కొంప ముంచింది. ఈ లారీని అడ్డుపెట్టుకుని పోలీసులు మారణాయుధాలతో తమపై దాడి చేస్తున్నారని లోపల వున్న శివరాజన్‌ పొరబడ్డాడు. వెంటనే ఎకె 47తో బుల్లెట్ల వర్షం కురిపించాడు. ఇది సాయంత్రం 7.15కు ప్రారంభమైంది. మూర్తి యింటి బాత్‌రూమ్‌లోంచి పోలీసులు నక్కినక్కి చూస్తూన్నారు కదా, ఆ బాత్‌రూమ్‌ తలుపును శివరాజన్‌ బుల్లెట్లు జల్లెడలా చేసి పారేశాయి. అదృష్టవశాత్తూ ఆ సమయంలో ఎవరూ అక్కడ లేరు. 

శివరాజన్‌ నుంచి కాల్పులు ప్రారంభం కాగానే ఎన్‌ఎస్‌జి కమెండోలు కూడా తమ రైఫిల్స్‌ను శిబిరం వైపు తిప్పి కాల్చడం ప్రారంభించారు. 

క్షణాల్లో అక్కడంతా బీభత్సం. లోపటినుంచి శివరాజన్‌ ముఠా, బయట నుంచి కమాండోలు ఎడతెరిపి లేకుండా కాల్పులే కాల్పులు. బుల్లెట్లు అటూ యిటూ ఎగురుతున్నాయి. అంతా గందరగోళం. ముందుగా ఏర్పాటు చేసిన ఫ్లడ్‌లైట్లు వెలిగించారు. అంతా పట్టపగలులా మారింది. ఆంబులెన్సులు గీపెడుతూ వచ్చేశాయి. ఫైరింజన్లు రణగొణ ధ్వనితో పరుగులు పెడుతూ వచ్చాయి. చీకట్లో జరిగిన రహస్య కమాండో ఆపరేషన్‌ కాస్తా చివరకు యిలా ఒక పట్టపగటి ప్రహసనంలా మారింది. 

ఒక కమాండో, ఒక పోలీసు అధికారి శరీరాల్లోకి బుల్లెట్లు చొచ్చుకుపోయాయి. వెంటనే ఆసుపత్రికి తరలించారు. 

ఇలా అరగంట సేపు అంటే 7.45 వరకు కాల్పులు సాగుతూనే వున్నాయి. చివర్లో ఒక ప్రేలుడు శబ్దం వినిపించింది. అది గ్రెనేడ్‌ శబ్దమా, పిస్టల్‌ చప్పుడా అని తెలియలేదు. లోపల్నుంచి కాల్పులు ఆగిపోవడంతో దళాలు కూడా కాల్పులు ఆపేశారు. 

''కమాన్‌, లోపలకి దూకండి'' అన్నారు సిట్‌ అధికారులు.

కానీ కమాండోలు తటపటాయించారు. 'ఇప్పుడు వాళ్లు విరామం యిచ్చారు. మేం లోపలకి వెళితే సైనైడ్‌ మింగేస్తారు. గ్వాలియరు నుంచి సైనైడ్‌ విరుగుడు మందులు రావడానికి ముందే వాళ్లు సైనైడ్‌ మింగితే వాళ్లను బతికించలేం. నిన్నటి నుంచి చేస్తున్న నిరీక్షణంతా వ్యర్థమే.' అని వాళ్లు వాదించారు. ఇందిరా నగర్‌లో దాడులు జరపడంలో కమాండోలు మరీ దూకుడు చూపారని విమర్శలు రావడంతో వాళ్లు యీసారి మరీ జాగ్రత్త పడ్డారు. 

''అయితే సైనైడ్‌ మందులు వచ్చేదాకా ఆగాల్సిందే, అవి తెల్లవారుఝామున 5 గం||లకు కానీ రావట'' అన్నారు సిట్‌ అధికారులు.

అందరూ బయట కాపు కాసి కూర్చున్నారు. కానీ వాళ్లకు తెలియదు - అప్పటికే శివరాజన్‌ ఆత్మహత్య చేసుకున్నాడని! అతనొక్కడే కాదు, శుభ, నెహ్రూ, సురేశ్‌ మాస్టర్‌, అమ్మన్‌, డ్రైవర్‌ అణ్ణా, జమున అనే అమ్మాయి (ఆమె ఆ ముందురోజే అక్కడకు వచ్చింది, చావు పిలిచినట్లుగా) అందరూ సైనైడ్‌ గొట్టాలు మింగారు. శివరాజన్‌ మాత్రం పిస్టల్‌తో తన కణతకు గురిపెట్టి కాల్చుకున్నాడు. 

చనిపోతూ చనిపోతూ ఎల్‌టిటిఇ నాయకుడు ప్రభాకరన్‌ను కీర్తిస్తూ తమిళంలో ఒక కవిత రాశాడు. మన పెద్దన్నకు మరింత శక్తి నిచ్చేట్లా మేల్కొనండని తమిళ సోదరులకు పిలుపు నిచ్చాడు. 

తన దుశ్చర్యలతో దేశాన్నంతా వులిక్కిపడేలా చేసిన శివరాజన్‌ ఆ రోజు చివరి శ్వాస విడిచాడు.

అవేళ - ఆగస్టు 19 - రాజీవ్‌ పుట్టిన రోజు! (సశేషం) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌  (ఏప్రిల్‌ 2015)

[email protected]

Click Here For Archives

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?