Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: రాజులతో నెయ్యము

ఎమ్బీయస్‌: రాజులతో నెయ్యము

రాజులతో నెయ్యము ఎప్పుడూ ప్రమాదకరమే అన్నారు పెద్దలు. దాదాపు తెలుగు ప్రాంతంగా వుండే, మనం పర్లాకిమిడిగా పిలుచుకునే పర్లాఖేముండికి సంస్థానాన్ని ఏలిన రాచకుటుంబానికి చెందిన 74 ఏళ్ల గోపీనాథ గజపతి నారాయణ దేవ్‌కి, ఆయన తమ్ముడికి తాతముత్తాతల నుంచి సంక్రమించిన రూ. 500 కోట్ల విలువైన ఆస్తిపై వివాదం నడుస్తోంది. ఆ ఆస్తుల్లో వారికి సంబంధించిన 173 ఏళ్ల గజపతి ప్యాలస్‌ కూడా వుంది. ఆరు ఎకరాలలో విస్తరించిన ఆ మహల్‌ ఎలా కట్టాలో ప్లాను వేసిన బ్రిటిషు ఆర్కిటెక్ట్‌కు 1835లోనే నాలుగున్నర లక్షల ఫీజు యిచ్చారట.  ఎస్టేటుకు ఒడిశా, ఆంధ్రలలో 100 ఎకరాల భూమి చెన్నయ్‌లో చాకొలేట్‌ ఫ్యాక్టరీ కూడా వుంది. గోపీనాథ్‌ తాత మహారాజా కృష్ణచంద్ర నారాయణ దేవ్‌ను ఆధునిక ఒడిశాకు నిర్మాత అంటారు. బ్రిటిషు వారి హయాంలోనే ఒడిశాను ప్రత్యేక రాష్ట్రంగా సాధించడానికి ఆయనే కారకుడు. ఆయన కారణంగానే తెలుగువారు మెజారిటీలో వున్న గంజాం, కోరాపుట్‌ జిల్లాలను ఒడిశాలో కలిపివేశారట. ఆ రాష్ట్రానికి తొలి ప్రధాని (అప్పట్లో ముఖ్యమంత్రిని అలా అనేవారు) ఆయనే.

1943లో పుట్టిన గోపీనాథ్‌ కూడా కాంగ్రెసులో చేరి, 1989లో, 1991లో బరంపురం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 1996లో కూడా ఎన్నికవుదామని చూస్తే పివి నరసింహారావు నంద్యాలతో బాటు బరంపురం నుంచి పోటీ చేద్దామనుకుని యీయన్ని తప్పుకోమన్నారు. రెండు చోట్లా గెలిచాక పివి నంద్యాల వదిలేసి, బరంపురం వుంచుకుని యీయనకు మళ్లీ పోటీ చేసే అవకాశం లేకుండా చేశారు. అది ఆయనను బాధించింది. పార్టీ వదిలేసి 1998లో బిజెపి పక్షాన పోటీ చేస్తే, కాంగ్రెసు తరఫున పోటీ చేసిన ముఖ్యమంత్రి జెబి పట్నాయక్‌ భార్య జయంతి యీయన్ని ఓడించింది. 2009లో అధికార పక్షమైన బిజెడిలో చేరారు కానీ వాళ్లూ టిక్కెట్టు యివ్వలేదు. ప్రస్తుతం ఆ పార్టీలోనే వున్నారు. ఆయన కాంగ్రెసులో వుండే రోజుల్లో గంజాం జిల్లాలో మహిళా కాంగ్రెసుకు అధ్యక్షురాలిగా వున్న అనంగ మంజరి పాత్రా అనే ఆమెతో పరిచయమైంది. ఇద్దరి మధ్య 20 ఏళ్లు తేడా వున్నా స్నేహం బలపడింది. ఆయన ఎస్టేటుకు మేనేజరుగా కుదురుకుంది. ఆమె తమ్ముడు సంజయ్‌ రాజా వారికి పిఏగా వున్నాడు. గోపీనాథ్‌కు ధరమ్‌పూర్‌ యువరాణి ఐన పూర్ణాదేవితో 1967లో పెళ్లయింది. వారికి దిగ్విజయ్‌ అనే కొడుకు, కల్యాణీ దేవి అనే కూతురు. దిగ్విజయ్‌ 2015లో ఆత్మహత్య చేసుకున్నాడు. కల్యాణి అవివాహితగా చెన్నయ్‌లో వుంటోంది. భార్య విడిపోయారో, అసలు జీవించి వున్నారో లేదో కూడా తెలియటం లేదు. ఆస్తుల గురించి గోపీనాథ్‌కు, తమ్ముడు సర్వజ్ఞ జగన్నాథ్‌కు మధ్య ఆస్తుల పంపకం గురించిన తగాదా 2006 నుంచి కోర్టులో నడుస్తోంది. 

కుటుంబసభ్యులెవరూ దగ్గర లేకపోవడం చేతనో ఏమో అనంగ మంజరి, ఆమె సోదరుడు అనారోగ్యపీడితుడైన గోపీనాథ్‌కి చేరువై అతన్ని తమ స్వాధీనంలో వుంచుకోసాగారు. అతని ఆస్తులు అమ్మివేశారని, ధనం కాజేశారని కొందరు ఆరోపిస్తున్నారు. దాని మాట ఎలా వున్నా వీళ్లు రాజాను ప్యాలస్‌లోనే బందీగా వుంచి, బంధువులు సైతం చూడడానికి వీల్లేకుండా దిగ్బంధం చేశారు. ఈ మాట బయటకు రాగానే  స్థానిక కాంగ్రెసు ఎమ్మెల్యే కె.సూర్యారావు నాయకత్వంలో ''పర్లా మహారాజా సురక్షా కమిటీ'' పేర ఒక సమితి వెలిసింది.  వాళ్లు అక్కా, తమ్ముళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా మహారాజా వారి దర్శనం కాలేదు. దాంతో ఆగస్టు 14 న సమితి వాళ్లు ధర్నా నిర్వహించి రాష్ట్రప్రభుత్వం కలగజేసుకోవాలని డిమాండ్‌ చేశారు. మరుసటి రోజే ప్రభుత్వం కదిలింది. సుగర్‌, బిపి, గొంతునొప్పితో బాధపడుతున్న మహారాజాను చెన్నయిలోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించి, అతని కూతురి సంరక్షణలో పెట్టింది. రాష్ట్ర ఆరోగ్యశాఖా మంత్రి అతనూ సవ్యసాచి నాయక్‌ చెన్నయ్‌ వెళ్లి రాజాను పలకరించి, చికిత్స ఖర్చులు ప్రభుత్వం భరిస్తుందని హామీ యిచ్చి వచ్చాడు. గత 30 ఏళ్లగా  తండ్రి ఆస్తుల విషయంలో జరిగిన లావాదేవీలపై విచారణ జరిపించమని కల్యాణీదేవి ప్రభుత్వాన్ని కోరింది. తన సంరక్షణలో వున్న తండ్రికి నచ్చచెప్పి అనంగ మంజరిని, ఆమె తమ్ముడు సంజయ్‌ను ఎస్టేటు మేనేజరు, పిఏ పదవుల నుంచి తీయించి వేసింది.

ఆ అవమానాన్ని వాళ్లిద్దరూ తట్టుకోలేక పోయారు. మహారాజాను తీసుకుని వెళ్లిపోయిన దగ్గర్నుంచి వాళ్లు బయటకు రావడం మానేశారు. తమను అందరూ దోషులుగా చూస్తూండడం భరించలేకపోయారు. ఆగస్టు 21 న మహల్‌కు కొద్ది దూరంలోనే వున్న జంగమ్‌ సాహీ నివాసంలో ఆమె, తమ్ముడు యిద్దరూ విషం తాగి చనిపోయారు. చిత్రం ఏమిటంటే వాళ్లిద్దరితో బాటు రాజావారి ఎస్టేటుతో ఏ సంబంధం లేని విజయలక్ష్మి అనే సోదరి కూడా విషం తాగింది. సంతోష్‌ (తులు అని కూడా అంటారు) అనే మరో సోదరుడు ఉరి వేసుకుని ప్రాణాలతో కొట్టుమిట్టులాడుతూండగా పక్కింటి వాళ్ల కంటపడ్డాడు. బరంపురంలోని ఆసుపత్రికి తరలిస్తే మర్నాడు చనిపోయాడు. అనంగ వయసు 54, ఆఖరతని వయసు 35. వీళ్లెవరికీ పెళ్లిళ్లు కాలేదు. ఆత్మహత్య చేసుకునే ముందు సూర్యారావుపై నింద మోపుతూ ఉత్తరాలు రాశారట. పోలీసులు ఇంకా బయటపెట్టలేదు. ''రాజావారి తమ్ముడు జగన్నాథ్‌ ప్రోద్బలంతో సూర్యారావు చేసిన దుష్ప్రచారం చేతనే వారు ఆత్మహత్య చేసుకున్నారు.'' అని కొందరంటున్నారు. ''వాళ్లు నిజాయితీపరులైతే బయటకు వచ్చి నా వాదన తప్పని పోరాడాలి. ఆత్మహత్య చేసుకుంటారంటేనే నా ఆరోపణ కరక్టని తెలుస్తోంది' అంటాడు సూర్యారావు. ఆస్తులు అమ్మేశారా అని న్యాయవాదిని అడిగితే ''వివాదంలో వున్న ఆస్తులేవీ అమ్మకూడదని పర్లాఖెముండి సబార్డినేట్‌ జడ్జి 2010లోనే మధ్యంతర ఉత్తర్వు యిచ్చాడు. నాకు తెలిసి స్థిరాస్తులు చేతులు మారలేదు.'' అన్నాడు. 

నిజానిజాలు తేల్చడానికి ఒడిశా ప్రభుత్వం సిట్‌ (స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీము) వేసింది. అదేం తేల్చినా ఒకటి మాత్రం నిజం. రాజులు లేదా పాలకులకు మరీ సన్నిహితంగా వెళ్లకూడదు. వాళ్లు ఆరోగ్యంగా వున్నపుడు ఎలా వున్నా అంత్యదశ వచ్చేసరికి కుటుంబం మాటే సమాజంలో చెల్లుతుంది. బయటివాళ్లు బయటివాళ్లగానే మిగిలిపోతారు, నింద పడతారు కూడా. (ఫోటో -173 ఏళ్ల గజపతి ప్యాలస్‌)  

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఆగస్టు 2016)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?