Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ క్రైమ్‌ రచన: సాహసము శాయరా డింభకా- 1/2

ఈ-మెయిల్‌ ఐడీ వున్న ఇండియన్సందరికీ యీ తరహా మెయిల్‌ వచ్చే వుంటుంది - ''నేను ఫలానా దేశంలో ఒక బ్యాంకులో పనిచేస్తున్నాను. మా వద్ద ఒక యినాపరేటివ్‌ ఎక్కవుంట్‌ వుంది. దానిలో వున్న డబ్బు ఎవరూ క్లెయిమ్‌ చేయటం లేదు. అది ఒక ఇండియన్‌ పేర వుంది. మీరు యిండియన్‌ కాబట్టి మీరే ఖాతాదారని క్లెయిమ్‌ చేస్తే మా బ్యాంకు వాళ్లు నమ్మేసేట్లు చూసే బాధ్యత నాది. నాకు డబ్బు అవసరంగా వుంది. నాకు తెలిసిన ఇండియన్‌ ఒకతను మీ పేరు చెప్పి మీ ఈమెయిల్‌ వివరాలిచ్చాడు. దీనికి ఒప్పుకుంటే వచ్చే డబ్బులో మీరూ నేనూ సగంసగం పంచుకుందాం.''. దానికి మీరు జవాబిస్తే వెంటనే సాదరు ఖర్చులకు గాను కొంత డబ్బు ఫలానా ఖాతాలో వేయమని మెయిల్‌ వస్తుంది. వేశాక మళ్లీ ఉలుకూపలుకూ వుండదు. మోసపోయినవాళ్లు నోరు మూసుకుని కూర్చుంటారు. ఇలా మోసం చేయడం కొత్తగా నేర్చుకున్నారనుకునే వారు యీ టెక్నిక్‌ పాతదే, టెక్నాలజీయే కొత్తది అని తెలుసుకోవాలి.

పై ఆఫర్‌లో 'మోసం చేద్దాం, రా' అనే పిలుపు వుంది. అది మనలో చాలామందికి నచ్చదు. అలా కాకుండా 'ఆ డబ్బు నాదే.  కర్మకాలి జైల్లో పడ్డాను. నా డబ్బు వేరే చోట యిరుక్కుపోయింది. కాస్త ధైర్యం చేసి, రిస్కు తీసుకుని దాన్ని నేను చెప్పిన ప్రకారం బయటకు తీస్తే చాలు. మీ కష్టం వుంచుకోను. మూడో వంతు యిస్తాను.' అంటే తప్పుగా తోచదు. ఒక సాహసకృత్యం చేసి తగిన పారితోషికం తీసుకున్నట్లు, ట్రెజర్‌ హంట్‌ చేసినట్లు ఫీలవుతాం. దీనికి తోడుగా 'నా వాటా డబ్బును నా అందమైన, 18 ఏళ్ల కూతురికి మీరే స్వయంగా అందించి, తనను కష్టాల్లోంచి కాపాడాలి.' అని రొమాంటిక్‌ యాంగిల్‌ కూడా చేరిస్తే కింగ్‌ ఆర్థర్‌ కాలం నాటి నైట్‌లా పులకించి పోతాం. 

ఉదాహరణగా చెప్పాలంటే - అది 1952. జాన్‌ అనే అతను అమెరికాలో ఒక వ్యాపారస్తుడనుకోండి. అతనికి ఓ రోజు మెక్సికో నుంచి ఒక ఉత్తరం వచ్చింది. టైపులో 23 లైన్లుంది. ''నేనొక మెక్సికన్‌ బ్యాంకర్‌ని. దివాళా తీశానని డిక్లేర్‌ చేశాను. జైల్లో పెడతారన్న భయంతో ముందు జాగ్రత్తగా నాకున్న డబ్బంతా అమెరికన్‌ డాలర్లుగా మార్చేశాను. అదంతా ఒక పెద్ద ట్రంకు పెట్టె  అడుగుభాగంలో రహస్యంగా దాచేశాను. దాన్ని అమెరికాలో ఓ కస్టమ్‌ హౌస్‌ అడ్రసుకు పార్శిల్‌ చేశాను. అది అక్కడకు చేరింది. అమెరికాకు వెళ్లి దాన్ని తీసుకుందామని నేనూ, నా కూతురూ మెక్సికో నుంచి బయలుదేరి వస్తూంటే సరిహద్దుల్లో పోలీసులు పట్టుకున్నారు. మా చేతుల్లో రెండు సూట్‌కేసులున్నాయి. వాటిల్లో రహస్య అరలు వున్నాయి. ఆ అరల్లో ట్రంకు బుక్‌ చేసిన రసీదు, ట్రంకు తాళం చెవి వున్నాయి. రసీదు చూపిస్తేనే అమెరికాలో ట్రంకు డెలివరీ యిస్తారు. తాళం చెవితో ట్రంకు తెరవవచ్చు. ఈ రెండిటితో బాటు 25 వేల డాలర్ల బ్యాంకు డ్రాఫ్టు ఒకటి వుంది. పోలీసులు ఆ సూట్‌కేసులు స్వాధీనం చేసుకున్నారు, తమ దగ్గర పెట్టుకున్నారు కానీ వాళ్లకి రహస్య అరల గురించి తెలియదు. దివాలా తీసినందుకు నన్ను అరెస్టు చేశారు కానీ మా అమ్మాయిని వదిలేశారు. నాకు మూడేళ్ల శిక్ష, జరిమానా పడింది. 45 రోజుల్లో ఆ జరిమానా మొత్తం కట్టకపోతే సూట్‌కేసులు వేలం వేసేస్తారు. వేలం వేసేశాక అవి ఎక్కడ తేలతాయో తెలియదు. వాటిని కొన్నవాడి కంట ఆ రహస్య అరలు పడితే వాడు అమెరికా వచ్చి ట్రంక్‌ తీసుకుని దానిలో వున్న 2,85,00 డాలర్లు హస్తగతం చేసుకుంటాడు. 

''నాతో బాటు జైల్లో వున్న అమెరికన్‌ మీ పేరు చెప్పాడు. అతని పేరు రాసేవాణ్నే కానీ అతను జైల్లో వున్నట్లు అమెరికాలో వున్న అతని కుటుంబానికి తెలియదు. తెలిస్తే పరువు పోతుంది, చెప్పవద్దని అతను షరతు విధించాడు. నా యందు దయ వుంచి మీరు మెక్సికో నగరానికి వచ్చి నా జరిమానా, కోర్టు ఖర్చులు చెల్లించి - 4 వేల డాలర్ల దాకా వుంటుంది - ఆ సూటుకేసులు హేండోవర్‌ చేసుకోండి. తర్వాత నేను చెప్పినట్లు వాటిని తెరిచి 25 వేల డాలర్ల డ్రాఫ్టు, రసీదు తీసుకోండి. ఆ డబ్బు మీకే. ఖర్చులు పోగా మిగిలినది మీ సాహసానికి, కష్టానికి ప్రతిఫలం అనుకోండి. తర్వాత ఆ రసీదు తీసుకుని అమెరికాలోని కస్టమ్స్‌ హౌస్‌లోని ట్రంక్‌ విడుదల చేయండి. దానిలో మూడో వంతు మీరు వుంచుకుని తక్కినది మా అమ్మాయికి అందచేయండి. తను మీ అడ్రసుకు వచ్చి తీసుకుంటుంది. మీరు నాకు సాయపడడానికి నిశ్చయించుకుంటే యీ క్రింది అడ్రసుకు రాయండి. ఇది నేనున్న జైలులో కాపలాదారుగా పనిచేస్తున్నతని బావమరిది పోస్టు బాక్సు అడ్రసు. జైలరు నాపై జాలి కొద్దీ సాయపడుతున్నాడు. మీరు సాయం చేయకపోయినా ఫర్వాలేదు కానీ దయచేసి అతన్ని ఎక్స్‌పోజ్‌ చేయకండి. మీరు యీ ఉత్తరానికి జవాబిస్తే తర్వాతి ఉత్తరంలో మీరు మెక్సికో సిటీకి ఎలా వెళ్లాలో, ఎవర్ని కలవాలో సూచనలన్నీ వివరంగా రాస్తాను.'' 

ఇది చదివిన జాన్‌ తిరుగు జవాబు రాశాడు - ''మానవతా దృక్పథంతో మీకు సాయం చేయడానికి నాకు అభ్యంతరం లేదు. మెక్సికన్‌ చట్టాలకు వ్యతిరేకమైన పని కానంతవరకు నేను మీరు కోరిన సాహసం చేయడానికి సిద్ధంగా వున్నాను. ముఖ్యంగా మీ టీనేజి కూతురి అవస్థ తలచుకుంటే నాకు జాలిగా వుంది. గతంలో కూడా నేను యిలాటి వారెందరికో సాయం చేశాను. మీరు ఆఫర్‌ చేసిన డబ్బు నాకు ముఖ్యం కాదు. మీ సంతోషం కొద్దీ యిస్తున్నారు కాబట్టి పుచ్చుకుంటాను తప్ప దాని కోసమే ముందుకు వస్తున్నా ననుకోకండి.''

కొన్ని రోజులకు రెండో ఉత్తరం, ఫోటో వచ్చాయి. ''మీకు శతథా కృతజ్ఞుణ్ని. నేను చెప్పిన గార్డు బావమరిది పేర మీరు ఎప్పుడు వస్తున్నారో ఉత్తరం రాయండి. అతను అన్ని ఏర్పాట్లూ చేస్తాడు. మీ యింటికి మా అమ్మాయి వచ్చినపుడు గుర్తు పట్టడానికి వీలుగా తన ఫోటో పంపుతున్నాను. జాగ్రత్త పెట్టుకోండి.'' అని. ఇక్కడిదాకా వచ్చినా ఓ 5 వేల డాలర్లు పెట్టి మెక్సికో వెళ్లాలా వద్దా తటపటాయించేవారు కూడా ఆ ఫోటోలోని జగదేక సుందరిని చూస్తే ఓయ్యస్‌, వెళదాం అనిపిస్తుందన్నమాట. మన జాన్‌ కూడా విమానంలో మెక్సికో సిటీకి వెళ్లాడు. అక్కడ ఎయిర్‌పోర్టులో ఒకతను కలిసి జైలు గార్డు బావమరిదినని పరిచయం చేసుకున్నాడు. వెంట వుండి ఓ హోటలుకు తీసుకెళ్లాడు. సాయంత్రాని కల్లా 'పోలీసులకు మన మీద అనుమానం వచ్చినట్లుగా వుంది, మకాం మార్చేద్దాం' అని వేరే చోటకి తరలించాడు. 'మన ప్లాను అనుకున్నంత యీజీగా సాగేట్టు లేదు. జడ్జికి అనుమానం తగిలింది. జరిమానా కట్టినా సూటుకేసులు రిలీజు చేస్తాడో లేదో' అని సందేహం వ్యక్తం చేశాడు. ఇక అక్కణ్నుంచి మసక చీకటిలో సందుల్లో  గొందుల్లో తచ్చాడడాలు, ఊరి శివారులో జైలు గోడలకు ఆనుకుని వున్న పాత కోటలో తలదాచుకోవడాలు, రకరకాల మెక్సికన్లు తారసిల్లడాలు, వారిని తప్పించుకోవడానికి అవస్థలు, చిన్నపాటి ఛేజింగులు, ఎవరో వెంటాడడాలు, సిగరెట్టు పొగలతో నిండిన నైట్‌ క్లబ్బులు, యిలా సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాను తలదన్నే డ్రామాను జాన్‌ రుచి చూశాడు. ఇవన్నీ సినిమాల్లో బాగానే వుంటాయి. నిజజీవితంలో నాలుగురోజుల పాటు జరిగేసరికి మొదట్లో కుతూహలంగా, తర్వాత గందరగోళంగా, ఆ తర్వాత భీతి కొల్పేట్లా తయారై ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు. 

చివరకు బావమరిది 'పోలీసు గూఢచారులు జడ్జిగారికి మీరు వూళ్లోకి వచ్చిన సంగతి చేరేశారు. కుట్రలో భాగస్వామిగా కేసు పెట్టించి ఆయన మీ పేర అరెస్టు వారంటు జారీ చేస్తాట్ట. వినగానే నాకు భయం పట్టుకుంది. అది జరిగేలోపునే కోర్టులో తెలిసున్నవాళ్లను పట్టుకుని, డబ్బు తర్వాత యిస్తానని నచ్చచెప్పి సూటుకేసులు తెరిపించాను. ఖైదీ చెప్పినట్లే వాటి అడుగు భాగంలో యిదిగో యీ రసీదు, తాళం చెవి, పాతిక వేల డ్రాఫ్టు వున్నాయి. ఇవి తీసుకుని మీరు తక్షణమే మీ దేశం వెళ్లిపోండి. వెళ్లేముందు ఆ 4 వేల డాలర్లు యిచ్చేయండి. కోర్టు ఉద్యోగికి యిచ్చేయాలి. నా కష్టానికై తృణమో, ఫలమో యిస్తే సంతోషిస్తాను. మీకెలాగూ పాతిక వేల డాలర్లు వస్తున్నాయి.'' అన్నాడు. ఇది వినగానే జాన్‌ బతుకుజీవుడా అనుకుని అవి పట్టుకుని క్షణాల్లో మెక్సికో సిటీ విడిచి అమెరికా వచ్చి పడ్డాడు. ఆ రసీదు పట్టుకుని కస్టమ్స్‌ హౌస్‌ కెళితే అలాటి ట్రంకేమీ లేదే అన్నారు. బ్యాంకు కెళితే డ్రాఫ్టు చెల్లదన్నారు. ఆ జగదేక సుందరి కూడా దిగి రాలేదు. తాళం చెవి మాత్రం చెవిలో గుబిలి తీసుకోవడానికి పనికి వచ్చింది. ఈ అనుభవాన్ని ఎవరికైనా చెపితే నవ్వుతారేమోనని జాన్‌ నోరుమూసుకుని కూర్చున్నాడు. నాలా మోసపోకండి అని ఎవరినీ హెచ్చరించలేదు.

ఇదీ జాన్‌ కథ. ఇలాటి జాన్లు అమెరికాలో కుప్పలుతిప్పలుగా వున్నారు. ఉత్తరాలన్నీ పోస్టు ఆఫీసు ద్వారానే వెళ్లేవి కాబట్టి చీఫ్‌ పోస్టు ఆఫీసు యిన్‌స్పెక్షన్‌ విభాగానికి ఒక అంచనా వుంటుంది. ఇలాటి జాన్‌లు 1950లలో సుమారు 6 లక్షల డాలర్లు పోగొట్టుకుని వుంటారని ఓ యిన్‌స్పెక్టరు లెక్క కట్టాడు. మొదటి ఉత్తరాలు సరాసరిన వారానికి 5 వేలు బట్వాడా అయ్యేవి. దేశంలోని ఏ ప్రాంతాన్నీ వాళ్లు వదలలేదు. ఏళ్లు గడుస్తున్న కొద్దీ ద్రవ్యోల్బణానికి అనుగుణంగా అంకెలు పెరుగుతూ వుండేవి. జరిమానా 4 వేల నుంచి 10 వేలకు పెరిగింది. చెక్కుపై అంకె 25 వేల నుంచి 35 వేలకు పెరిగింది. ట్రంకులోని ఆస్తి విలువ 2,85,000 నుంచి 4,50,000కు పెరిగింది. ఇవన్నీ పెరిగినా జగదేక సుందరి వయసు మాత్రం 18 దగ్గరే ఆగిపోయింది. - (సశేషం) 

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జూన్‌ 2016)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?