Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: శశికళ ఎందుకు తొందర పడింది?

ఎమ్బీయస్‌: శశికళ ఎందుకు తొందర పడింది?

జయలలిత జబ్బు పడిన దగ్గర్నుంచి శశికళ పెత్తనమే సాగింది. కేంద్రం కూడా కొన్ని విషయాల్లో ఆమెకు మద్దతుగా నిలిచింది. అందుకే ఆమె గవర్నరు దగ్గర్నుంచి అందరినీ ఆసుపత్రిలో నియంత్రించ గలిగింది. జయలలిత మరణం తర్వాత అప్పటిదాకా వినబడని 'చిన్నమ్మ' పదం చలామణీలోకి వచ్చింది. అందరూ హఠాత్తుగా ఆమెను చిన్నమ్మ అని పిలవసాగారు, జయలలిత స్థానంలో ఆమెను ఆమోదించసాగారు.

జయలలిత తన విల్లులో యిల్లు ఎవరి పేర రాసిందో తెలియదు కానీ శశికళ ఆ యింట్లో తిష్ట వేసింది. అంత్యక్రియల నిర్వహణ కూడా ఆమెయే చేపట్టింది. హిందూ సంప్రదాయాల పట్ల ఎంతో నమ్మకం వున్న జయలలిత తనను దహనం కాకుండా ఖననం చేయమని అడిగిందా? ఆ ముక్క ఎవరికి చెప్పింది? అని అడిగిన పార్టీ పెద్దలు కానీ, ప్రభుత్వ నేతలు కానీ లేకపోయారు. తన కుటుంబసభ్యులెవరినీ దగ్గరకు రానివ్వనని జయలలితకు మాట యిచ్చిన శశికళ ఆమె శవం చుట్టూ వాళ్లనే నిలబెట్టింది. అయినా ఎవరూ కిమ్మనలేదు. జయలలిత రక్తబంధువు లెవరూ లేకుండా పోతే బాగుండదనుకుని నామ్‌ కే వాస్తే ఆమె మేనల్లుడు దీపక్‌ను పట్టుకుని వచ్చి నిలబెట్టారు. 

జయలలిత మరణానంతరం పార్టీపై గట్టి పట్టు సాధించకపోతే తనకు వ్యతిరేకంగా తిరుగుబాటు రావచ్చని అంచనా వేసిన శశికళ ప్రభుత్వ నిర్వహణా బాధ్యత పన్నీరు సెల్వంకు అప్పగించి తను పార్టీని చేతిలోకి తీసుకోదలచింది. పార్టీ జనరల్‌ సెక్రటరీ పదవి చేపడతానంది. ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఇక్కడిదాకా ఆమె అనుకున్నవన్నీ చేయగలిగింది. పన్నీరును గద్దె దిగమని అన్న దగ్గర్నుంచి ఆమె కష్టాలు ప్రారంభమయ్యాయి. ఊహించని విధంగా పన్నీరు ఎదురు తిరిగాడు. హఠాత్తుగా పన్నీరు పట్ల ప్రజలకు జాలి కలగసాగింది. శశికళకు వ్యతిరేకంగా మీడియా, నెటిజన్లు దుమ్మెత్తిపోయసాగారు. పన్నీరును దిగమని అనడమే కీలకమైన మలుపు. ఎందుకు దిగమంది? ఈ ప్రశ్నకు జవాబు యిప్పట్లో దొరకదు. 

నిజానికి శశికళ ఫస్ట్‌ ప్రయారిటీ పార్టీపై పూర్తి పట్టు సాధించడం, తర్వాతే ముఖ్యమంత్రి గద్దెపై దృష్టి సారించాలి. ఎందుకంటే ఆమెకు ప్రభుత్వ నిర్వహణలో కాని, పార్టీ నిర్వహణలో కాని అనుభవం లేదు. జయలలిత ఆమెకు ప్రభుత్వంలో, పార్టీలో, రాజకీయాల్లో ఏ పదవీ యివ్వలేదు. తనకు విశ్వాసపాత్రమైన సహచరి పాత్ర మాత్రమే యిచ్చింది. ఒక యింటర్వ్యూలో ''ఆమె రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తోందని, నేను తీసుకున్న రాజకీయ నిర్ణయాల వెనుక ఆమె హస్తం వుందని, ఆమె డి-ఫాక్టో సిఎం అనీ సాగుతున్న ప్రచారం చూస్తే నాకు చికాకు వేస్తుంది. చీఫ్‌ మినిస్టరుగా వున్న నాకు అది ఒక యిన్సల్ట్‌. నేను ఆమెను ఎప్పుడూ రాజకీయాల్లోకి రానీయలేదు.'' అని ఆమె చెప్పింది.

''ఎమ్జీయార్‌ మరణం తర్వాత నేను చాలా మానసిక ఆందోళనకు గురయ్యాను. నాకు మద్దతుగా నిలవడానికి యింట్లో ఎవరూ లేకపోయారు. ఆ సమయంలో శశికళ, ఆమె భర్త నటరాజన్‌ యిద్దరూ వచ్చి వుండసాగారు. కానీ కొన్నాళ్లకు నటరాజన్‌ హద్దులు మీరాడు. అందుచేత అతన్ని వెళ్లిపోమని చెప్పాను. శశికళ భర్తను విడిచి నాతో వుండడానికే యిష్టపడింది. అప్పుడు నేను ఏ పదవిలోనూ లేను. ఆ తర్వాతే ముఖ్యమంత్రి అయ్యాను. ఆమె తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి నాతో వుండిపోయింది. నిజానికి ఓ సందర్భంలో నా ప్రాణం కాపాడింది.'' అని చెప్పింది కూడా. 

శశికళ తండ్రి పేరు వివేకానందన్‌, తల్లి కృష్ణవేణి. ఇద్దరూ దివంగతులు. వాళ్ల రెండో కూతురు శశికళ. శశికళ అన్న సుందరవదనంకి ఒక కొడుకు, యిద్దరు కూతుళ్లు - డా|| వెంకటేశ్‌,  అనూరాధ, ప్రభా శివకుమార్‌. అక్క లేటు వనితామణికి ముగ్గురు కొడుకులు - ఇప్పుడు డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ ఐన టిటివి దినకరన్‌ (యితను మేనరికం చేసుకున్నాడు. పైన చెప్పిన అనూరాధ యితని భార్య), జయలలిత పెంపుడు కొడుకు టిటివి సుధాకరన్‌ (ఇతనూ యిప్పుడు జైలుకి వెళ్లాడు), టిటివి భాస్కరన్‌. శశికళకు ఒక కూతురు ప్రభావతి అని. ఆమె శివకుమార్‌ అనే అతన్ని చేసుకుంది. శశికళ పెద్ద తమ్ముడు జయరామన్‌ చనిపోయాడు. అతని భార్య ఇళవరసి యిప్పుడు శశికళతో బాటు జైలుకి వెళ్లింది. వాళ్లకు కృష్ణప్రియ (భర్త కార్తికేయన్‌) అనే కూతురు, వివేక్‌ జయరామన్‌ అనే కొడుకు వున్నారు. ఈ జయరామన్‌ జయలలిత కంపెనీలకు ఆడిటరు. శశికళ రెండో తమ్ముడు వినోదగంకు యిద్దరు కొడుకులు టివి మహాదేవన్‌, టివి తంగమణి. శశికళ ఆఖరి తమ్ముడు వికె దివాకరన్‌కు పెళ్లయినట్లు లేదు. ఇక శశికళ పెదతండ్రి డా|| కరుణాకరన్‌ అల్లుడు ఆర్‌ పి రావణన్‌ కూడా దీనిలో భాగమే. వీళ్లనే మన్నారుగుడి మాఫియాగా వ్యవహరిస్తారు. వీళ్లందరి పేర అనేక సూటుకేసు కంపెనీలున్నాయి. జయలలిత మరణంతో కేంద్రంతో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి కాబట్టి యిప్పుడా కేసులన్నీ తవ్వి పోయవచ్చు. 

ఇలా సంపాదించడానికి దోహదపడినది జయలలితే అని మనం మర్చిపోకూడదు. ఆమె పార్టీ నిధులు ఎక్కడ దాచిందో శశికళకు మాత్రమే తెలుసనుకోవాలి. అందుకే కాబోలు ఎమ్మెల్యేలందరూ సుప్రీం కోర్టు తీర్పు వచ్చాక కూడా ఆమె వెంటనే నిలిచారు, ఆమె తన అక్క కొడుకు దినకరన్‌ను తెచ్చి డిప్యూటీ జనరల్‌ సెక్రటరీగా నెత్తిన పెట్టినా వూరుకున్నారు. ఆ విధంగా నిధులు ఎక్కడున్నాయో పరాయివారికి చెప్పనక్కరలేదు. ఇలాటి రోజు వస్తుందని శశికళ ముందే వూహించిందట. 2016 అసెంబ్లీ ఎన్నికల నాటికే జయలలిత ఆరోగ్యం బాగా పాడై పోయింది. ఎక్కువసేపు నిలవలేని పరిస్థితి. బహిరంగ సభల్లో చూస్తున్నవారికే యీ పరిస్థితి గోచరించినప్పుడు ఆత్మీయంగా మెలగిన శశికళకు తెలియకుండా వుంటుందా? జయలలిత అంతిమ ఘట్టం ప్రారంభమైందని, మహా అయితే కొన్ని నెలలనీ గ్రహించే వుంటుంది. అన్నీ జాగ్రత్త పెట్టి వుంటుంది. అందుకే జయ విల్లు కూడా కనబడకుండా పోయింది. 

జయలలిత చనిపోయాక పార్టీలో అందరూ 'చిన్నమ్మ ముఖ్యమంత్రి కావాలి' అని నినాదాలు చేసినా సంకోచించి, పార్టీయే ముఖ్యమంటూ లెక్కలు వేసుకుని పన్నీరును సిఎంగా చేసిన శశికళ తర్వాతి రోజుల్లో పన్నీరుని దిగిపోమని ఎందుకు అంది? అతను స్వతంత్రంగా వ్యవహరించడం మొదలుపెట్టాడని, జయలలిత మరణానంతరం శాంతిభద్రతలు కాపాడడంలో, తుపాను సహాయకచర్యలు నిర్వహించడంలో, జల్లికట్టుకు అనుమతి సాధించడంలో విజయం సాధించి వ్యక్తిగతంగా పేరు తెచ్చుకున్నాడని, యిలాగే వదిలేస్తే ఏకు మేకౌతాడని భయపడిందని మరో వార్త.  పదవి చూసి పన్నీరుకి ఆశ పుట్టి, సొంతంగా ఎదుగుదామనుకున్నాడా? శశికళ వ్యవహారాలపై దర్యాప్తు చేయించి, భవిష్యత్తులో ఆమె తనను దిగమనకుండా ఫైళ్లు తయారు చేయించడం ప్రారంభించాడా? దానికి కేంద్రం మద్దతు యివ్వసాగిందా? తెలియదు.

జయలలిత మరణానంతరం పరామర్శించడానికి వచ్చిన మోదీ శశికళతో కంటె పన్నీరుతో సన్నిహితంగా వ్యవహరించడం ఆమెలో భయాన్ని పెంచి వుండవచ్చు. కారణం ఏమైనా బిజెపి జయలలితతో మేన్‌టేన్‌ చేసిన స్నేహాన్ని శశికళతో మేన్‌టేన్‌ చేయదలచలేదు. జయలలిత మరణించాక కేంద్రం అప్పటిదాకా ఆమెకు సన్నిహితంగా మెలగిన చీఫ్‌ సెక్రటరీ రామ్మోహనరావుపై, పార్టీ నాయకుడు శేఖర్‌ రెడ్డిపై చర్యలు తీసుకుంది. వాళ్ల ద్వారా శశికళకు వ్యతిరేకంగా సమాచారం సేకరించడానికి ప్రయత్నించి వుండవచ్చు. పన్నీరు దాన్ని నివారించే ప్రయత్నం ఏమీ చేసినట్లు లేదు. ఏది ఏమైనా పన్నీరు బిజెపి మనిషని, అతని ద్వారా బిజెపి ఎడిఎంకెను చీలుస్తుందని శశికళ గట్టిగా నమ్మి అందుకే దిగిపోమని అడిగి వుండవచ్చు.

బిజెపి వెనక్కాల నుంచి మద్దతు యిచ్చినా పన్నీరుకి వెన్నెముక లేదని, తను ఆజ్ఞ మీరడని శశికళకు గట్టి నమ్మకం. అందుకే రాజీనామా చేయమంది. అతను చేశాడు కూడా. అయితే ఆ తర్వాత అతనికి ఏ హామీ లభించిందో ఏమో ఎదురు తిరిగాడు. దాంతో కథ అడ్డం తిరిగిపోయింది. ఫిబ్రవరి 7 న జయలలిత సమాధి వద్ద పన్నీరు తిరుగుబాటు బావుటా ఎగరేసిన గంటల్లోనే రాత్రి 10.30కు శశికళ చిటికేసి 119 ఎమ్మెల్యేలను వేద నిలయానికి రప్పించింది. అర్ధరాత్రి కల్లా పన్నీరు పదవి వూడపీకడం జరిగింది. పార్టీ తన చేతిలో వుంది కాబట్టి ఆ పని చేయగలిగింది కానీ కేంద్రంతో సఖ్యత లేదు కాబట్టి గవర్నరును అంకెకు తెచ్చుకోలేక పోయింది. 

మన్నారుగుడి మాఫియా తొందర పెట్టడం వలననే శశికళ పన్నీరును దిగిపోమని కోరిందని ఒక వార్త. సుప్రీం కోర్టు తీర్పు శశికళకు వ్యతిరేకంగా వస్తుందని, ఆమె జైలుకి వెళ్లక తప్పదని యీ మాఫియాలో కొందరు ముందే వూహించారట. అక్రమాస్తుల కేసే కాదు యితర కేసులూ వున్నాయి. ఫెరా (ఫారిన్‌ ఎక్స్‌ఛేంజ్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌) ఉల్లంఘించినందుకు ఎన్‌ఫోర్స్‌మెంటు డైరక్టరేటు (ఇడి) 1995లో, 1996లో మోపిన కేసులు నడుస్తున్నాయి. వాటి నుంచి తప్పించమని శశికళ చేసుకున్న అభ్యర్థనను 3 వారాల క్రితమే మద్రాసు హైకోర్టు తిరస్కరించింది. మలేసియాలో వున్న ఒక పరిచయస్తుడి ద్వారా చట్టవిరుద్ధంగా ఫారిన్‌ కరెన్సీ తెప్పించుకుని ఆ డబ్బుతో నీలగిరిలో కోడనాడ్‌ టీ ఎస్టేట్‌ తన వదిన ఇళవరసితో కలిసి కొన్నందుకు మరో కేసు నడుస్తోంది. 2015 మేలో ఎగ్మూరు ఎడిషనల్‌ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేటు ఆ కేసునుంచి ఆమెను విడుదల చేశాడు. దానిపై ఇడి హైకోర్టులో రివిజన్‌ పిటిషన్‌ వేసింది. హైకోర్టు తీర్పు ఇడికి అనుకూలంగా వచ్చింది. అందువలన ఆ కేసు కూడా ఎదుర్కోవాలి.

ఫెరా కేసుల్లోనే మరొకటి - రీజయా టీవీకి చైర్మన్‌గా వుండగా ట్రాన్స్‌పాండర్లు అద్దెకు తీసుకోవడానికి అమెరికాలో, సింగపూరులో ఫారిన్‌ కరెన్సీ చెల్లింపులు! జైలుకి వెళ్లే లోపునే శశికళ ముఖ్యమంత్రి అయిపోతే, జైలుకి వెళ్లబోయేముందు తమలో ఒకరిని గద్దెపై కూర్చోబెట్టి వెళుతుందని మాఫియా వారు అంచనా వేశారట. శశికళకు ముఖ్యమంత్రి అయ్యే యోగం లేకపోవడంతో వీళ్లకూ ఆ యోగం లేకుండా పోయింది. పార్టీ డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ పదవితో సరిపెట్టుకోవలసి వచ్చింది.  

''ద వీక్‌'' ప్రకారం శశికళకు ఒక జ్యోతిష్కుడు చెప్పాడట - 'ఫిబ్రవరి 14 లోగా నువ్వు ముఖ్యమంత్రివి కాలేకపోతే ఎప్పటికీ కాలేవు' అని. అందుకే ఫిబ్రవరి 9 లోగానే ప్రమాణస్వీకారం చేయడానికి ఆమె తొందరపడింది. ఈ సంచిక మార్కెట్లోకి వచ్చేసరికి సుప్రీం కోర్టు తీర్పు యింకా రాలేదు. 14న తీర్పు వస్తుందని కూడా ఎవరికీ తెలియదు. కానీ ఆ జోస్యం కరక్టయింది. 14నే తీర్పు వచ్చింది. శశికళ కల చెదిరింది. బిజెపి వారికి కూడా యీ జోస్యం సంగతి ముందుగా తెలిసి, తాత్సారం చేశారేమో చెప్పలేం. ఈ లోపుగా పన్నీరు సెల్వంకు స్థానిక బిజెపి నాయకులు బహిరంగంగా సపోర్టు యిచ్చారు.

''పన్నీరు వెంట జనం నిలిచారు. క్యాంపులో వున్న ఎమ్మెల్యేలను అక్కడ బలవంతంగా వుంచారు. పన్నీరు చేత ప్రమాణస్వీకారం చేయించి అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోమనాలి'' అని మాజీ బిజెపి ఎమ్మెల్యే ఎచ్‌.రాజా ట్వీట్‌ చేశాడు. పన్నీరుకిి పరిపాలనానుభవం వుందేమో కానీ, రాజకీయ పరిణతి లేదన్న సంగతి బిజెపి నాయకత్వానికి చాలా ఆలస్యంగా గ్రహింపులోకి వచ్చింది. చివరకు పళనిస్వామినే పిలవాల్సి వచ్చింది. శశికళపై తీర్పు వచ్చాక కూడా యింకా ఎందుకు మీనమేషాలు లెక్కించారో గవర్నరు సమాధానం చెప్పలేని ప్రశ్నగా మిగిలింది.  

ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2017) 

(ఫోటో - ఎడిఎంకె కొత్త డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ దినకరన్‌, పిన్ని శశికళతో) 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?