Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : సెజ్‌ల నుంచి నేర్చుకున్నదేమిటి? - 8

ఎమ్బీయస్‌ : సెజ్‌ల నుంచి నేర్చుకున్నదేమిటి? - 8

ఇక ఋణమాఫీ విషయంలో ఆర్‌బిఐ గవర్నరు కుండ బద్దలు కొట్టిన తీరు చూశాం కదా. గవర్నరు ఆలోచనాధోరణి యిలా వుండగా, ఆర్‌బిఐ రీషెడ్యూలింగ్‌కు ఒప్పుకుంది, మాఫీకి ఒప్పుకుంది అంటూ ఆంధ్రమంత్రులు మూడు నాలుగు నెలల క్రితం దాకా ఎన్ని స్టేటుమెంట్లు యిచ్చారో గుర్తు తెచ్చుకోండి. ఇంత జరిగినా బాబు యివాళ నవ్యాంధ్ర నిర్మాణానికి బ్యాంకర్లు సాయపడాలంటూ సుద్దులు చెపుతున్నారు. బ్యాంకులు వడ్డీవ్యాపారస్తులు. ప్రజలు తమ వద్ద డిపాజిట్‌ చేసిన మొత్తాన్ని వడ్డీకి తిప్పి వారికి వడ్డీ యివ్వాల్సిన బాధ్యత కలవారు. డబ్బు తిరిగి వస్తుందంటేనే అప్పిస్తారు. కిట్టుబాటు కాని సామాజిక బాధ్యత పనులు నెత్తిన వేసుకుంటే బ్యాంకులు మూసేసుకోవాలి. మీ దగ్గర సత్తా వుందని వాళ్లకి తోస్తే వాళ్లే మీ వెంట పడతారు. లేకపోతే ఎన్ని సార్లు మీటింగులు పెట్టినా యీ చెవితో విని ఆ చెవితో వదిలేస్తారు. ఇన్ని చూశాక కూడా యిప్పుడు కేంద్రసహాయం గురించి ఆంధ్ర ప్రభుత్వం చెప్పేవి కాకమ్మ కబుర్లు కావని ఎలా నమ్మగలం? ప్రభుత్వాఫీసులన్నీ ఒకే చోట వుండడానికై 44 అంతస్తుల భవంతి కడుతున్నారని సింగపూరు పేపర్లో వచ్చింది. అన్ని ఆఫీసులూ ఆ భవంతిలో వచ్చేసిన తర్వాత యిక మిగతా స్థలం దేనికి బాబూ? అని కేంద్రం ఆర్థికశాఖలో అధికారి ఎవరైనా అడిగితే మన దగ్గర సమాధానం ఏముంది? 'అదేనండి, కమ్మర్షియల్‌ కాంప్లెక్సులూ, మల్టీప్లెక్సులూ కట్టి అద్దెకిచ్చి ఆదాయం పెంచుకుని...' అని నానిస్తే 'మీరు చేసే రియల్‌ ఎస్టేటు వ్యాపారానికి కేంద్రనిధులు కావాలా?' అని వారడగరా? 

అసలు యీ ఒప్పందాలు, యీ అంచనాలు అన్నీ సరిగ్గా రికార్డు అవుతున్నాయా? అన్నిటికీ ఈ-గవర్నెన్స్‌ అనడమే నాకు భయం పుట్టిస్తుంది. మహామహా స్కాముల్లోనే ఫైళ్లు దొరకలేదంటూ మూసేస్తున్నారు. వాద్రా-డిఎల్‌ఎఫ్‌ కేసులో ఫైల్లో రెండు పేజీలు దొరకలేదని హరియాణా ప్రభుత్వం చెప్పేస్తోంది. దానిలోనే అధికారుల నోటింగ్సు అన్నీ వున్నాయి. ఇప్పుడు కాబినెట్‌ సమావేశాల దగ్గర్నుంచి అన్నీ కంప్యూటర్లోనే, ఐ ప్యాడ్‌లోనే అంటున్నారు. అసలు మన మంత్రులకు వాటిని ఆపరేట్‌ చేయడం వచ్చా? రేపుమర్నాడు ఏదైనా విచారణకు వస్తే యీ ఇ-ఫైళ్లు దొరుకుతాయా? సాఫ్ట్‌వేర్‌ మారిపోయింది, యాక్సెస్‌ చేయలేమనవచ్చు, లేదా వైరస్‌ సోకి చెడిపోయాయనవచ్చు. వైట్‌హౌస్‌ వెబ్‌సైట్‌నే హ్యాక్‌ చేస్తున్నారు. ఆంధ్ర ప్రభుత్వం ఇ-ఫైళ్లను డిప్యుటేషన్‌లో వచ్చిన తెలంగాణ ఐయేయస్‌ అధికారి కరప్ట్‌ చేశారనవచ్చు, తెలంగాణ ప్రభుత్వం కూడా డిటోడిటో టెక్నిక్కే ఉపయోగించవచ్చు. రేపు రైతులకు కూడా కీలక ఒప్పందపత్రాలను వాట్స్‌యాప్‌లో పంపించాం, డిజిటల్‌ సిగ్నేచర్స్‌ ద్వారా ఆమోదాలు సేకరించాం అనవచ్చు. బ్లాక్‌ అండ్‌ వైట్‌లో వున్న వాటికే దిక్కు లేకుండా పోతోంది. ఇలా డిజిటల్‌గా చేసేవి రేపు విచారణకు వస్తే దొరుకుతాయా? 

ఇలాటి అనేక సందేహాలను తీర్చకుండానే టిడిపి ముందుకు దూసుకుపోతోంది. రూల్సు నిర్ధారించకుండానే రైతుల నుండి ఆమోదపత్రాలు సేకరించేస్తోంది. దీనిపై ప్రభుత్వాన్ని ఎండ గట్టవలసిన ప్రతిపక్షం కూలబడింది. చంద్రబాబు ఉపన్యాసం తర్వాత జగన్‌ మాట్లాడడానికి నిలబడగానే ఉత్సాహంగా చూశాను, చీల్చి చెండాడతాడేమోనని. అబ్బే, ఆయన తడుముకుంటూ మొదలుపెట్టాడు. అస్సలు వాగ్ధాటి లేదు. ఔత్సాహిక కవిలా చెప్పిన మాటలే మళ్లీ మళ్లీ వల్లిస్తూ 'చంద్రబాబు.. చేశాడు, ..డు' అంటూ కాగితాలు చూసుకుంటున్నాడు. అసలు చంద్రబాబే మంచి వక్త కాదు. ఏ విధమైన ఛలోక్తులు, చమత్కారాలు లేకుండా సాగదీస్తూ మాట్లాడతారు. ఈయన మరీ అన్యాయం. 'ముఖ్యమంత్రి యిలా అన్నారు' అని అంటూ ఘాటుగా విమర్శించి వుంటే ఎఫెక్టివ్‌గా వుండేది. చంద్రబాబు మోసం చేశాడు అంటే పర్శనల్‌గా వెళ్లినట్లయింది. 'డు' ప్రయోగం కూడా సభలో శోభించదు. చకచకా మాట్లాడకుండా కాగితం చూసుకుంటూ, మాటలు వెతుక్కుంటూ వుంటే నాకు నీరసం వచ్చింది. పది నిమిషాలు పోయేసరికి 'రేపు పేపర్లో చదవచ్చులే' అనుకుని టీవీ కట్టేశాను. 

వైసీపీ చెప్పిన పాయింట్లలో మామూలు డెవలపర్‌ అయితే భూమి సొంతదారుకి 70% యిచ్చి వుండేవాడని, బాబు అలా యివ్వకుండా రైతులను మోసగిస్తున్నారనేది అతిశయోక్తి. 40-60, 50-50, 60-40 యిలాటివి విన్నాను తప్ప 70-30 ఎక్కడో ప్రైమ్‌ ఏరియాలో తప్ప జరగదు. వాళ్ల పాయింట్లలో - జోన్‌ ఫిక్స్‌ చేసి వదిలేస్తే చాలు, ఆ యా జోన్స్‌లో కట్టడాల పని ప్రయివేటు సంస్థలే చూసుకుంటాయన్న పాయింటు బలమైనది. సాధ్యమైనంతవరకు ప్రభుత్వం యిలా బరువుబాధ్యతలు వదుల్చుకోవాలి. అసలు అక్కడ రాజధాని వద్దు అని కూడా జగన్‌ గట్టిగా చెప్పటం లేదు. వద్దంటే అక్కడ పార్టీ బలహీనపడుతుందేమోనన్న భయం. తెలంగాణ విషయంలోనూ జగన్‌ యిటువంటి తప్పులే చేశారు. ఎటూ తేల్చకుండా అతి జాగ్రత్తకు పోయి కేంద్రం మీద బాధ్యత పెట్టారు. చివరిలో సమైక్యం అనడంతో తెలంగాణలో పార్టీ పోయింది. అక్కడేమైనా వుంటుందన్న భ్రమతో కెసియార్‌ను పన్నెత్తి ఏమీ అనకపోవడంతో ఆంధ్రలో పోయింది. కెసియార్‌ యింత రెచ్చిపోతున్నా తెలంగాణలో టిడిపి, బిజెపి, కాస్త కాస్త కాంగ్రెసు ఎదిరిస్తున్నాయి తప్ప వైకాపా ఏమీ అనటం లేదు. ఒక ఉద్యమం లేదు, ఒక నిరసన లేదు. ఇవన్నీ ఆంధ్రులు గమనిస్తూనే వున్నారు. అందుకే అక్కడా  వైసీపీ పుంజుకోవటం లేదు. 

రాజధాని విషయంలో కూడా ఎలాటి సందిగ్ధం లేకుండా ప్రయివేటు భూముల్లో వద్దు, ప్రభుత్వ భూముల్లోనే పెట్టాలి అని వైసీపీ పెద్ద ఆందోళన చేసి వుండాల్సింది. ప్రధాన ప్రతిపక్షంగా ఆ బాధ్యత వారిపై వుంది. దాన్ని నెరవేర్చకపోవడం వలన భావితరం వారినీ తప్పు పడుతుంది. ఆంధ్ర అసెంబ్లీలో అసలైన చర్చ జరగడం లేదు. జగన్‌ను ఉడికించడానికి అన్నట్లు ఏ యనమలో, మరోరో లక్ష కోట్లనో, జైలు జీవితమనో ఏదో అనడం, యిక దానితో నిరసనలు, వాదోపవాదాలు. సిఆర్‌డిఏ బిల్లు పాస్‌ చేయవలసిన ముఖ్యమైన తరుణంలో రోజా లేడీ విలన్‌ అవునా కాదా విషయంపై చర్చ జరిగింది. వేషాల బట్టే మాట్లాడాలంటే టిడిపి నిండా నటులే. పార్టీ స్థాపకుడు ఎన్టీయార్‌ దుర్యోధనుడు, కీచకుడు, రావణుడు వంటి వేషాలు వేశారు. ఏదైనా చమత్కారబాణం వేసి, బిల్లుపై ఫోకస్‌ తప్పిపోకుండా చూసుకోవలసిన ప్రతిపక్షం టిడిపి విసురుతున్న వలలో ప్రతీసారీ పడుతోంది. జగన్‌ మాటిమాటికీ దేవుడి ప్రస్తావన చేస్తారు. ఎందుకో తెలియదు. తండ్రి పాలన మాట వదిలిపెట్టరు. గతం ఎవరికి కావాలి? వైయస్సార్‌ గుడ్‌విల్‌ ఎంతకాలం మన్నుతుంది? సానుభూతి, ఓదార్పు మొహం మొత్తేశాయని గుర్తించకపోతే ఎలా? ఇప్పటి విషయాలపై టకటకా మాట్లాడాలి. ఉపన్యాసం ఎలా యివ్వాలో, యిబ్బందికర పరిస్థితుల్లో చమత్కారం, వ్యంగ్యం ఎలా వుపయోగించాలో ట్రైనింగ్‌ తీసుకోవాలి. 

నా ఉద్దేశంలో ఆంధ్రలో పాలకపక్షం, ప్రతిపక్షం రెండూ సరిగ్గా వ్యవహరించటం లేదు. తెలంగాణలో ప్రతిపక్షం చీలిపోయింది. ఆంధ్రలో అన్ని సీట్లున్న ప్రతిపక్షం కూడా ఎఫెక్టివ్‌గా లేదు. అధికారపక్షం వాళ్లను చూసి అస్సలు బెదరటం లేదు. బిజెపి ఆంధ్రలో స్వతంత్రంగా ఎదగడానికి చూస్తోందన్న వార్తలు వస్తున్నాయి. టిడిపితో స్నేహబంధం ప్రస్తుతానికి కొనసాగిస్తూనే ఫ్రెండ్లీ అప్పోజిషన్‌, కనస్ట్రక్టివ్‌ క్రిటిసిజం అనే పేర ప్రజాసమస్యలపై ఉద్యమాలు చేసిందంటే తనకంటూ ఒక స్పేస్‌ పొందుతుంది.  బిజెపి నాయకుల వాగ్ధాటి ముందు జగన్‌ వాగ్ధాటి చాలదు. కాంగ్రెసు నుండే కాదు, వైసీపీ నుండి కూడా ఫిరాయింపులు జరుగుతాయి. యువనేతగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్‌ గతంలో ఎన్టీయార్‌లా తనకంటూ అభిమానగణాన్ని పోగు చేసుకుని,  వారికి తర్ఫీదు యిచ్చి వారిలోనుండి నేతలను తయారుచేసుకుని వుంటే వారు అతన్ని ఎల్లవేళలా అంటిపెట్టుకుని వుండేవారు. అయితే వెంటనే  ముఖ్యమంత్రి కావాలనే కాంక్షతో, తన కోరిక తీర్చని సోనియాపై పగ సాధించడానికి కాంగ్రెసు ప్రభుత్వాన్ని కూల్చాలనే లక్ష్యంతో ఆయన పార్టీ ఫిరాయింపులను నమ్ముకున్నారు. ఫక్తు రాజకీయనాయకులనే తన పార్టీలో చేర్చుకున్నారు. వారు కాంగ్రెసుకు, వైసీపీకి మధ్య దోబూచులాడారు. ఎన్నికల వేళ టిడిపి వూపు చూసి అటు మొగ్గారు. ఎన్నికల తర్వాత యింకా చేరుతున్నారు. బిజెపి వూరిస్తే అటూ వెళ్లిపోతారు. 

రాత్రికి రాత్రి అధికారం చేజిక్కించుకోవాలని చూసి, పాతతరం నాయకులను నమ్ముకుని విఫలమైన గాథ జగన్‌ది. ఆయన ప్రజలను నమ్ముకోవడం లేదు. వారిని ఎలా ఎడ్యుకేట్‌ చేయాలో, ఎలా యింప్రెస్‌ చేయాలో యిప్పటికీ ఆలోచించటం లేదు. వైయస్సార్‌ కున్న సెన్సాఫ్‌ హ్యూమర్‌ కానీ, నవ్వు మొహం కానీ, రాజసం కానీ జగన్‌లో కనబడవు. రాజకీయాల్లో రాణించాలంటే యివన్నీ అవసరమని తండ్రిని ఔటాఫ్‌ ఫోకస్‌లో పెట్టి తను ఫోకస్‌లోకి రావాలని తెలుసుకోవాలి. ఇది యిలాగే కొనసాగితే రేపు టిడిపి పట్ల ప్రజలు విముఖులయినా ప్రజలు మరో పార్టీని ఆశ్రయించవచ్చు తప్ప జగన్‌ వైపు రాకపోవచ్చు. ఋణమాఫీ విషయంలో జగన్‌ తొందరపడి నరకాసుర వధ పేర ఉద్యమం లేవదీసి ఫెయిలయ్యారు. నరకాసుర వధ నాటికి రైతుల్లో యింకా ఆశలున్నాయి.  ఇప్పుడు చేసి వుంటే దానికి ఫలితం వుండేది. రైతుల్లో చాలా తక్కువశాతం మందికే మాఫీ జరుగుతోంది కాబట్టి, ఆ స్కీములో ఏముందో ఏం లేదో యిప్పుడు అందరికీ అర్థమైంది కాబట్టి వాళ్లంతా కలిసి వచ్చేవారు. సిఆర్‌డిఏ విషయంలో జగన్‌ సరైన సమయంలో స్పందించటం లేదు. ఈ భారీ ప్రాజెక్టులో లొసుగులపై బుక్‌లెట్లు వేసి, అన్ని జిల్లా కేంద్రాల్లో వివిధ పార్టీల వారిని పిలిచి చర్చావేదికలు ఏర్పాటు చేసి, ప్రజలకు అవగాహన పెంచి వుండాలి. ''సాక్షి'' పేపర్లో రాశాం, ''సాక్షి'' టీవీలో చూపించాం అంటే వాటిపై పార్టీ ముద్ర ఆల్‌రెడీ వుంది. 

వ్యక్తిగతంగా చెప్పాలంటే - రాజధాని గురించి ఎవరు ఎంత ప్రచారం చేసి డప్పు కొట్టినా, సింగపూరువాళ్లు, జపాన్‌వాళ్లు ఎంత మొనగాళ్లయినా, దీనిలో చాలా మతలబులున్నాయనీ, యీ మొత్తం ప్రాజెక్టు రాష్ట్రప్రజల శ్రేయోదాయకం కాదనీ, యిది వారిని మరింత కడగండ్లపాలు చేస్తుందని నేను నమ్ముతున్నాను. నా భయాలు నిజం కాకూడదని కూడా ఆశిస్తున్నాను. కోర్టు కేసులు, లిటిగేషన్లు, టెండర్లు పిలవడాలు, వాటిని సవాలు చేయడాలు యిలా అనేక రకాల గొడవలు పుట్టుకుని వచ్చి రాజధాని పూర్తయ్యేటప్పటికి పోలవరం ప్రాజెక్టు లాగే పది, పదిహేను సంవత్సరాలు పడుతుందేమో.  అప్పటికి గాని నా భయాలు సహేతుకమైనవో, నిర్హేతుకమైనవో తేలదు. అంతవరకు ఎవరు ఎటువైపు మాట్లాడినా చెల్లిపోతుంది. (సమాప్తం) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2014) 

[email protected]

Click Here For Part-1

Click Here For Part-2

Click Here For Part-3

Click Here For Part-4

Click Here For Part-5

Click Here For Part-6

Click Here For Part-7

 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?