Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : సోషల్‌ మీడియాలో బోగస్‌ న్యూస్‌పై ఫేస్‌బుక్‌ పోరాటం

ఎమ్బీయస్‌ : సోషల్‌ మీడియాలో బోగస్‌ న్యూస్‌పై ఫేస్‌బుక్‌ పోరాటం

సోషల్‌ మీడియాలో రకరకాల వార్తలు వచ్చిపడుతున్నాయి. దేన్ని నమ్మాలో, దేన్ని నమ్మకూడదో తెలియని అవస్థ వచ్చి పడింది. దీని వలన జర్నలిజానికే ముప్పు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇటీవల జరిగిన అమెరికన్‌ ఎన్నికలలో అనేక అబద్ధపు వార్తలు చలామణీలోకి వచ్చి ఓటర్లను ప్రభావితం చేశాయి. ఇప్పుడు యూరోప్‌లో ఎన్నికలకు సిద్ధమవుతున్న దేశాల్లో కూడా అదే పరిస్థితి. ఎవరికి తోచినట్లు వాళ్లు కట్టుకథలల్లేసి దాన్నే వాస్తవాలుగా ప్రచారం చేసేస్తున్నారు. సామాన్య పౌరుడికి ఏది నిజమైన వార్తో, ఏది మిస్‌ఇన్ఫర్మేషనో ఎలా తెలుస్తుంది? ఈ సమస్యను పరిష్కరించడానికి, వార్తల నాణ్యత పెంచడానికి ప్రపంచవ్యాప్తంగా టెక్నికల్‌ ఇండస్ట్రీ పెద్దలు, ఎకడమిక్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌, జర్నలిస్టు సంఘాలు ''ద న్యూస్‌ ఇంటెగ్రిటీ ఇనీషియేటివ్‌'' పేర 14 మిలియన్‌ డాలర్ల పెట్టుబడితో నడుం బిగించాయి. ఫేస్‌బుక్‌, ఫోర్డ్‌ ఫౌండేషన్‌, మొజిల్లా వంటి సంస్థలు నిధులివ్వడానికి ముందుకు వచ్చాయి.

అబద్ధపు వార్తలను గుర్తుపట్టి వాటిని మొగ్గలోనే తుంచేయడం అన్ని సందర్భాల్లో జరగదు. కానీ నాలుగు రోజుల క్రితం సింగపూర్‌ కోర్టు యిచ్చిన తీర్పు గమనిస్తే తలచుకుంటే ఏదీ అసాధ్యం కాదనిపిస్తుంది. నల్లా మొహమ్మద్‌ అబ్దుల్‌ మాలిక్‌ అనే ముస్లిం మతగురువు తమిళనాడుకి చెందినవాడు. 2010లో సింగపూర్‌కు వర్క్‌ పర్మిట్‌పై వెళ్లి అక్కడ జామే చూలియా మసీదులో చీఫ్‌ ఇమామ్‌గా పనిచేయసాగాడు. ఏడేళ్లగా అతని మీద ఫిర్యాదు లేవీ రాలేదు కానీ ఈ జనవరి 6 న అతను శుక్రవారపు ప్రార్థనల సమయంలో యిచ్చిన ఉపన్యాసంపై సింగపూర్‌ ప్రభుత్వం కేసు పెట్టింది. కురాన్‌ సూక్తులు చెప్తున్నానంటూ అతను 'యూదులు, క్రైస్తవులకు వ్యతిరేకంగా మాకు సాయం చేయి' అని అరబిక్‌లో ఓ మంత్రం చదివాడు. ఆ ఉపన్యాసం వీడియోను ఒకతను ఆన్‌లైన్‌లో పెట్టాడు. సింగపూర్‌ యూనివర్శిటీలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేసే మరొకతను ఫేస్‌బుక్‌లో పెట్టాడు.

దానిపై విమర్శలు రావడంతో ప్రభుత్వంలోని హోం శాఖ అతన్ని కోర్టుకి రప్పించింది. బోనులో నిలబెట్టేసరికి మాలిక్‌ 'అది కురాన్‌లో లేదు. ఇండియాలో మా వూళ్లో ఒక పాత పుస్తకంలో చదివాను. విదేశంలో వున్నపుడు అలాటివి ఉటంకించి, యిక్కడి మతసామరస్యానికి భంగం కలిగించకూడదు. నేను చేసినది తప్పే.' అని అతను రాతపూర్వకంగా క్షమాపణ రాసి యిచ్చాడు. కోర్టు అతనికి 4 వేల సింగపూరు డాలర్ల జరిమానా విధించడంతో బాటు ఇండియాకు తిప్పి పంపేసింది. అంతేకాదు, ఆ ఉపన్యాసాన్ని ఆన్‌లైన్‌లో, ఫేస్‌బుక్‌లో పెట్టినవారికి గట్టి వార్నింగులు యిచ్చింది. గట్టిగా నిలదీయకపోయి వుంటే నిజం ఎప్పటికీ బయటకు వచ్చేది కాదు. కురాన్‌ పేర ఆ సూక్తి చలామణీ అయిపోయేది.

మన దగ్గర యిటీవల ఒక వాట్సప్‌ మెసేజి షికార్లు చేస్తోంది - టాల్‌స్టాయ్‌, హెర్బెర్ట్‌ వెల్స్‌, ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, హ్యూస్టన్‌ స్మిత్‌, నోస్ట్రాడమస్‌, బెర్‌ట్రండ్‌ రస్సెల్‌, గోస్టా లోబోన్‌, బెర్నార్డ్‌ షా, జోహాన్‌ గీత్‌ వంటి పాశ్చాత్య వేదాంతుల కొటేషన్స్‌ అంటూ. వాటిల్లో హిందూత్వ గొప్పదని, హిందూమతం ఒకనాటికి ప్రపంచాన్ని ఏలుతుందని చెప్పినట్లు రాసేశారు. నిజానికి యీ ఫిలాసఫర్లలో చాలామంది పేర్లు మనకు తెలియవు. వాళ్లు మన మతాన్ని మెచ్చుకుంటున్నారంటే ఓహో అని సంతోషిస్తాం. అయితే హిందూ అనడంతో సరిపెట్టకుండా, హిందూత్వ (అతివాద హిందూయిజం అనే అర్థంలో దీన్ని వాడుతున్నారు)ని కూడా మెచ్చుకున్నారేమిటా అని ఆశ్చర్యపడతాం. వాళ్లు నిజంగా అన్నారో లేదో వెతికే పని పెట్టుకోము. అలా పని పెట్టుకున్నవారు బయటపెట్టినదేమిటంటే 'హిందూత్వ' పదం మొదటగా వాడినది వీర సావర్కార్‌ట. 1923లో వెలువరించిన ''ఎస్సెన్షియల్స్‌ ఆఫ్‌ హిందూత్వ'' అనే కరపత్రంలో మొదటిసారి ఆ పదాన్ని కల్పించాడట. మరి యీ వాట్సప్‌లో హిందూత్వ పదాన్ని వాడిన టాల్‌స్టాయ్‌ 1910లో చచ్చిపోయాడు. నోస్ట్రాడమస్‌ 1566లో చచ్చిపోయాడు. అంటే యీ కొటేషన్స్‌ పూర్తిగానో, సగమో అబద్ధాలయి వుంటాయి. ఇంకో తమాషా ఏమిటంటే ఇస్లామిస్టులు వీళ్ల పేర్లతోనే యివే కొటేషన్స్‌ చలామణీ చేస్తున్నారట. వాటిల్లో హిందూమతం ఒకనాటికి ప్రపంచానికి ఏలుతుంది అనే మాట స్థానంలో ఇస్లాం, షరియా ఒకనాటికి ప్రపంచాన్ని ఏలుతుంది అని వుందిట!

నాకీ వాట్సప్‌ పంపిన మిత్రుణ్ని ఏమిటి స్వామీ హిందూత్వ పదం అప్పుడెప్పుడుంది? అని అడిగాను. 'మన హిందువులను అందరూ అణగదొక్కుతున్నారండీ' అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. 'అది వేరే సబ్జక్ట్‌. మహానుభావులను మిస్‌కోట్‌ చేసే అధికారం మనకు ఎవరిచ్చారని నా ప్రశ్న.' అన్నాను. 'అది కోటో, మిస్‌కోటో మనకెలా తెలుస్తుంది? నాకెవరో పంపారు. మన గురించి గొప్పగా చెప్తోంది కదాని మీకు పంపా' అన్నాడాయన. నాలుగేళ్ల క్రితం యిలాగే మార్క్‌ ట్వేన్‌ పేర 'ఇండియా ఈజ్‌ మదర్‌ ఆఫ్‌ హిస్టరీ, గ్రాండ్‌మదర్‌ ఆఫ్‌ లెజెండ్‌, గ్రేట్‌ గ్రాండ్‌మదర్‌ ఆఫ్‌ ట్రెడిషన్‌.. అంటూ ఒక కొటేషన్‌ చలామణీలోకి వచ్చింది. చమత్కారానికి మారుపేరైన మార్క్‌ ట్వేన్‌ పేర యింత చప్పగా యీ అబద్ధపు కొటేషన్‌ వెలువడడం అతని స్మృతికి అవమానం. ''మోతీలాల్‌ తండ్రి ముస్లిమా?'' అనే వ్యాసంలో యిలాటి ప్రచారాల గురించి రాసి వున్నాను. మెకాలే ప్రసంగం అంటూ ఒక అబద్ధపు ఉపన్యాసాన్ని చాలాకాలం క్రితమే ప్రచారంలో పెట్టారు. మెకాలే భాష తెలిసినవాడెవడూ అది అతనిదంటే నమ్మరు. కానీ ఎంతమందికి తెలుస్తుంది? కామమ్మ మొగుడంటే కాబోలు ననుకున్నాను అన్నట్లు నడిచిపోతుంది.

అలాగే యింకో వాట్సప్‌ వచ్చింది. ఎవరో వక్త భారతదేశం గొప్పతనాన్ని ఉగ్గడించడానికి అలెగ్జాండర్‌ను వాడేసుకున్నాడు. అలెగ్జాండర్‌ భారతదేశంపై దండయాత్రకు వెళుతూ తన గురువుకి చెప్పాడట. 'అక్కడకి వెళితే నీకు ఆశ నశిస్తుంది, సంపాదించినది చాలనిపిస్తుంది, ప్రపంచాన్ని జయించాలనే నీ ఆశయం నెరవేరదు' అని గురువు హెచ్చరించాడట. చివరకు అలాగే జరిగిందట! నిజానికి పురుషోత్తముడితో యుద్ధం తర్వాత అలెగ్జాండర్‌లో ఆశ నశించలేదు. ఇంకా ముందుకు వెళదామనుకున్నాడు. కానీ సైన్యం మొండికేశారు. ఇల్లు వదలి చాలాకాలమైంది, వెనక్కి వెళ్లి మళ్లీ వద్దామన్నారు. విధిలేక అలెగ్జాండరు వెనక్కి మరలాడు. ఇదీ మనం చదువుకున్న చరిత్ర. తర్వాత ఈయన యింకో కథ చెప్పాడు - భారత్‌లో ఒక ఋషి వద్దకు అలెగ్జాండరు వెళ్లాడట. నేను అలెగ్జాండర్‌ ద గ్రేట్‌ని అన్నాడట, 'గ్రేట్‌ అని స్వయంగా చెప్పుకునేవాడు ఏం గ్రేట్‌, సరే ఏదో ఒకటి అయితే అయ్యావులే, ముందు పక్కకు తప్పుకో, ఎండకు అడ్డుగా వున్నావు, ఎండపొడ పడనీ' అన్నాడట ఋషి.

ప్రాచుర్యంలో వున్న అసలు కథలో అలెగ్జాండర్‌ దేశాలు జయించాక తన గురువు అరిస్టాటిల్‌ వద్దకు వెళ్లి 'ఇన్ని దేశాలు జయించాను, నేను మీకు ఏ సాయం చేయగలను గురుదేవా' అని అడిగితే ఆయన 'ఎండ పడకుండా అడ్డంగా నిలబడ్డావు, పక్కకు తప్పుకో, అదే పదివేలు' అన్నాడట. అరిస్టాటిల్‌ సింప్లిసిటీకి, వాంఛారాహిత్యానికి ఉదాహరణగా చెప్తారిది. ఆ తర్వాత యీ వక్త అలెగ్జాండరుకు ఎడారిలో ఒక ఋషి ఎదురైనట్లు, అలెగ్జాండరుకు దాహం వేసి మంచినీళ్లు అడిగితే సగం నీళ్లు యిస్తానన్నట్లు ఏదో పిట్టకథ చెప్పారు. అలెగ్జాండరు భారత్‌లో ఏ ఎడారిలో తిరిగాడు? పైగా ఆ స్థాయి వ్యక్తి తనకు దాహం వేస్తే స్వయంగా వెళ్లి అడుగుతాడా? ఎవడో సైనికుణ్ని వెళ్లి పట్టుకురమ్మంటాడు, అవతలివాడు యివ్వకపోతే వాడి తలకాయ తెగ్గోసి మరీ పట్టుకొస్తాడు సైనికుడు. భారతదేశం ఔన్నత్యం చెప్పాలంటే ఎన్నో ఉదంతాలున్నాయి. ఇలా లేనివి పుట్టించడం దేనికో తెలియదు.

పురాణాలను వక్రీకరించడం కూడా మిస్‌ఇన్‌ఫర్మేషన్‌ కిందే వస్తుందని నా భావన. అది చరిత్రే కాదు, పుక్కిటి పురాణం అనుకుంటే వాటిలో ఏముందో అదే చెప్పాలి. ఒకదానితో మరొకటి విభేదిస్తే అదీ చెప్పాలి. అంతేగాని దానిలో కొంత భాగాన్ని మాత్రం తీసుకుని, అది చరిత్ర అంటూ చెప్పి, యీనాటి రాజకీయ అవసరాల కోసం పాత్రల స్వభావాన్ని మార్చివేయకూడదు. మహిషాసురుడు దళితుడు, అతన్ని అన్యాయంగా చంపేశారు అనే వాదనకు ఆధారం ఏముంది? ఆ పురాణంలో రాసి వున్నంతవరకే తీసుకో, కానీ లేనిపోనివి కల్పించడం దేనికి? మహిషుడు దళితుడు, నరకాసురుడు దళితుడు, రావణాసురుడు దళితుడు అంటూ విలన్లందరినీ అణచివేతకు గురైనవారిగా చిత్రీకరించడం అనుమతించ కూడదు. రేపెవరో 'బకాసురుడు కూడా దళితుడు.

తన పాటికి తను ఎద్దుమాంసం తింటూ వుంటే 'గోరక్షాదళ్‌' సభ్యుడైన క్షత్రియుడు భీముడు బ్రాహ్మణవాదం ప్రేరణతో (మధ్యలో యిదెందుకు అని అడక్కండి, దేనికైనా సరే యిలాటివాటిల్లో బ్రాహ్మణవాదం అనే తాలింపు పెడితే ఆ కిక్కే వేరప్పా!) వచ్చి వాణ్ని అన్యాయంగా చంపేశాడు' అనే థీమ్‌తో ఓ నాటకం రాసి జనాల మీదకు వదలవచ్చు. భావస్వేచ్ఛ వుండాలి నిజమే, పురాణాలపై ఆధారపడి ఊహాజనితమైన కథలు రాయడం భాసుడి కాలం నుంచి వుంది. దుర్యోధనుణ్ని విషాదాంత నాయకుడిగా ఆయన చిత్రీకరించాడు. ఎన్టీయార్‌ తీసిన అనేక పౌరాణిక సినిమాల్లో పురాణాల్లో లేనివి చొప్పించారు. కానీ అవన్నీ కల్పనలో భాగంగా చేశారు తప్ప రాజకీయ ఎజెండాతో, సమాజంలో ఘర్షణలు సృష్టించడానికి రాయలేదు. ప్రస్తుత ప్రయత్నాల్లో అది జరుగుతోంది కాబట్టే యీ ఆవేదన.

ఇలాటివి సమాజంలో అనేకం జరుగుతున్నాయి. కనీసం కొంతమేరకైనా మిస్‌ఇన్‌ఫర్మేషన్‌పై ముకుతాడు వేయడానికే పైన చెప్పిన ఇనీషియేటివ్‌ ప్రారంభమైంది. ఫేస్‌బుక్‌, గూగుల్‌ దొంగ వార్తలను ఏరివేయడానికి పూనుకున్నాయి. వాటిని ప్రచారం చేసే వెబ్‌సైట్లకు యాడ్స్‌ తగ్గించేందుకు నిశ్చయించాయి. ఎన్‌బిసి, సిఎన్‌ఎన్‌ జర్నలిస్టుగా పనిచేసిన కాంప్‌బెల్‌ బ్రౌన్‌ అనే ఆయన్ను జనవరిలో ఉద్యోగంలోకి తీసుకున్నారు. ఆయన ఫేస్‌బుక్‌ న్యూస్‌ పార్ట్‌నర్‌షిప్‌ టీముకి నేతృత్వం అప్పచెప్పారు. దీనికి విరాళాలు అందించేందుకు పైన చెప్పినవే కాక జాన్‌ ఎస్‌. జేమ్స్‌ ఎల్‌. నైట్‌ ఫౌండేషన్‌, టో ఫౌండేషన్‌, ఏప్‌నెక్సస్‌, బీటా వర్క్‌స్‌ ముందుకు వచ్చాయి. దీనికి హెడ్‌క్వార్టర్స్‌ న్యూయార్క్‌ సిటీ యూనివర్శిటీలో వుంటుంది. వార్తల యాదార్థ్యాన్ని తేల్చడానికి మరిన్ని యూనివర్శిటీలు తోడుగా వచ్చాయి. అరిజోనా స్టేట్‌ యూనివర్శిటీ, ద ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ జర్నలిస్ట్‌స్‌, ద న్యూస్‌ లిటరసీ ప్రాజెక్టు, ద ట్రస్ట్‌ ప్రాజెక్ట్‌, పబ్లిక్‌ రిలేషన్స్‌ గ్రూప్‌ ఐన వెబెర్‌ షాండ్‌విక్‌! ఈ ఉద్యమం యూరోప్‌కి, ఆసియాకు కూడా విస్తరించింది.

డెన్మార్క్‌లోని ఆర్థస్‌ యూనివర్శిటీలో వున్న 'కనస్ట్రక్టివ్‌ ఇన్‌స్టిట్యూట్‌', నెదర్లాండ్స్‌లోని యూరోపియన్‌ జర్నలిజం సెంటర్‌, హేంబర్గ్‌ మీడియా స్కూల్‌, జర్మనీలో హాన్స్‌ బ్రెడో ఇన్‌స్టిట్యూట్‌, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌లోని పోలిస్‌ మీడియా డిపార్ట్‌మెంట్‌, ఫ్రాన్స్‌లోని సైన్సెస్‌ పో యూనివర్శిటీ, హాంగ్‌కాంగ్‌ కేంద్రంగా గల సొసయిటీ ఆఫ్‌ పబ్లిషర్స్‌ ఇన్‌ ఏసియా, ఆస్ట్రేలియాలోని వాక్‌లీ ఫౌండేషన్‌, వికిపీడియా వ్యవస్థాపకుడు జిమ్మీ వేల్స్‌, యునెస్కో.. యిలా యిన్ని చేతులు కలిపాయి. త్వరలో జరగబోతున్న ఫ్రాన్స్‌ అధ్యక్ష ఎన్నికలను మిస్‌యిన్‌ఫర్మేషన్‌ ప్రభావితం చేయకుండా చూడడానికి త్వరలో జరగబోతున్న ఫ్రాన్స్‌ అధ్యక్ష ఎన్నికలలో మిస్‌యిన్‌ఫర్మేషన్‌ ప్రభావితం చేయకుండా చూడడానికి ఫిబ్రవరిలో గూగుల్‌ సహకారంతో 37 ఫ్రెంచ్‌, అంతర్జాతీయ మీడియా సంస్థలు వెలువడుతున్న వార్తలను క్రాస్‌చెక్‌ చేయడం ప్రారంభించాయి. సత్యం గెలుస్తుందో, అబద్ధం గెలుస్తుందో వేచి చూదాం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?