Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : సోనాలీ రోసిలినీ మృతి

పేరే కాస్త వింతగా వుంది కదూ! ఆమె పేరు సోనాలీ దాస్‌గుప్తా. డాక్యుమెంటరీ సినిమాలు తీసే హరిసదన్‌ దాస్‌గుప్తా భార్య. అతని సినిమాలకు స్క్రిప్టు రాస్తూండేది. రాబర్టో రోసిలినీ అనే ఇటాలియన్‌ సినీదర్శకుడు 1957లో భారతదేశానికి వచ్చాడు. ఆయన వాస్తవిక చిత్రాలకు ఆద్యుడని చెప్పాలి. ఆయన, ఆయన స్నేహితుడు విట్టోరియో డిసికా తీసిన సినిమాలు చూసి ప్రభావితమైన సత్యజిత్‌ రాయ్‌ అదే తరహాలో ''పథేర్‌ పాంచాలీ'' (1955) తీసి ప్రపంచ ప్రముఖులను ఆకట్టుకోవడంతో, రోసిలినీ  రాయ్‌ను, ఆ పద్ధతిలో తీసే ఋత్విక్‌ ఘటక్‌ వంటి వారిని కలుద్దామని కలకత్తా వచ్చాడు. ఆ సందర్భంగా అప్పటికే మంచి డాక్యుమెంటరీ చిత్రాలు తీసి, ఖ్యాతి తెచ్చుకున్న హరిసదన్‌ తన భార్య సోనాలీతో సహా ఆయన్ని కలిశాడు. రోసిలినీకి అప్పటికి 51 ఏళ్లు. సోనాలీకి 27. ఇద్దరు పిల్లలు. పెద్దవాడికి ఆరేళ్లు. పసివాడికి 11 నెలలు. కానీ రోసిలినీని చూసి తలమునకలా ప్రేమలో పడిపోయింది. పెద్దపిల్లవాణ్ని భర్త దగ్గర వదిలేసి, చంటిపిల్లవాడితో రోసిలినీతో లేచిపోయింది. రహస్యంగా ఇటలీకి పారిపోయింది. అది ఆ రోజుల్లో పెద్ద స్కాండల్‌. అందుకే యీ జూన్‌ 7 న 86వ యేట ఆమె మరణించగా అది మన పత్రికల్లో వార్తగా వచ్చింది.

ఒక భారతీయ గృహిణిని అంతగా ఆకర్షించిన రోసిలినీ ఎవరు? 1906లో పుట్టిన అతను ఒక ఆర్కిటెక్ట్‌ కొడుకు. 1938లో హ్రస్వచిత్రాలు తీయడంతో కెరియర్‌ మొదలుపెట్టాడు. అతని ప్రతిభను గుర్తించిన ముస్సోలినీ తన ప్రభుత్వం తరఫున కొన్ని సినిమాలు తీయించుకున్నాడు. రెండవ ప్రపంచం 1945లో ముగిసిన తర్వాత ఓటమి పాలైన ఇటలీ పరిస్థితి దుర్భరంగా తయారైంది. ఆనాటి ప్రజల స్థితిగతులను యథాతథంగా చూపించడానికి రోసిలినీ కెమెరా చేతపట్టి వాళ్ల యిళ్లకే వెళ్లి చిత్రీకరించాడు. తర్వాతి రోజుల్లో చాలామంది యీ పద్ధతి అనుసరించారు. ఆ విధంగా తయారైన ''ఓపెన్‌ సిటీ'' విశ్వవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని అతనికి అభిమానులను సంపాదించి పెట్టింది. ''పైసాన్‌'' (1946), ''జర్మనీ ఇయర్‌ జీరో'' (1947) వంటి సినిమాలు కూడా యిదే ధోరణిలో నడిచి అతనికి ఖ్యాతి చేకూరింది. 

హాలీవుడ్‌ నటీనటులు సైతం అతనికి ఫ్యాన్‌ మెయిల్‌ రాయసాగారు. అలా రాసినవారిలో ఒక నటీమణి - ఇన్‌గ్రిడ్‌ బెర్గ్‌మన్‌. చాలా అందగత్తె. ఇతని డైరక్షన్‌లో ''స్ట్రోంబోలి'' (1949) సినిమాలో నటించడానికి వచ్చి ప్రేమలో పడింది. భర్తను, కూతుర్ని అమెరికాలో వదిలిపెట్టి అప్పటికే వివాహితుడైన రోసిలినీతో యూరోప్‌లో కాపురం పెట్టింది. అతనితో కూతుర్ని కంది. అమెరికన్‌ పౌరులు యిది జీర్ణించుకోలేక పోయారు. నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఇక హాలీవుడ్‌ నిర్మాతలు ఆమెను తమ సినిమాల్లో తీసుకోవడం దాదాపు మానేశారు. ఆమె రోసిలినీని 1950లో పెళ్లాడి యూరోప్‌లోనే స్థిరపడి పోయి, అక్కడ తీసే హాలీవుడ్‌ సినిమాలలోనే నటించసాగింది. ఇన్‌గ్రిడ్‌తో ప్రణయం తర్వాత రోసిలినీ సినిమాల వైఖరిలోనూ కాస్త మార్పు వచ్చింది. సోఫిస్టికేషన్‌, రొమాంటిసిజం వచ్చి చేరాయి. విమర్శకుల ప్రశంసలు ఎంత పొందినా కమ్మర్షియల్‌గా అంత సక్సెస్‌ కావటం లేదన్న బాధతో వుండగానే ''జనరల్‌ డెల్లా రోవెరీ'' (1959) సినిమాతో ఆ చింత తీరిపోయింది. ఆ తర్వాత యుద్ధంపై, చరిత్రపై అనేక భారీ సినిమాలు తీశాడు. 1977లో చనిపోయేవరకు సినిమాలు, ఇటాలియన్‌ టివికై చారిత్రాత్మక సినిమాలు తీశాడు.

1957లో రోసిలినీ ఇండియా వచ్చేసరికి అంతకు ఏడేళ్లకు ముందే అతన్ని వరించి ఇన్‌గ్రిడ్‌ ఎలా నష్టపోయిందో ప్రపంచంతో పాటు సోనాలీకి తెలుసు. అతని చపలబుద్ధీ తెలుసు. అయినా అతని మోహంలో పడిపోయింది. భర్తను, పెద్దపిల్లవాడిని యింట్లో వదిలేసి రోసిలినీ బస చేసిన హోటల్‌కు దగ్గరగా హోటల్లో వుండసాగింది. వీళ్లిద్దరి సరసం గురించి హాలీవుడ్‌ పేపర్లలో వచ్చేసింది. అప్పటిదాకా రోసిలినీ చేత ప్రభుత్వం తరఫున డాక్యుమెంటరీలు తీయించాలని ప్రధానిని కోరుతూ వచ్చిన సోనాలి భర్త, అతన్ని వెంటనే దేశం విడిచి పొమ్మనాలని డిమాండ్‌ చేయసాగాడు. సోనాలిని బెంగాలీ సమాజం, ఆమె కుటుంబం చీదరించుకున్నాయి. ఇక ఆమె రోసెలినీతో పారిపోదామనుకుంది. పాస్‌పోర్టు కోసం అప్లయి చేసుకుంది. ఈమెకు పాస్‌పోర్టు యివ్వవద్దని భారతప్రభుత్వంపై కొందరు బెంగాలీ చిత్రప్రముఖులు ఒత్తిడి చేశారు. 

అయితే యిలాటి 'శుభ'కార్యానికి సాయపడేందుకు కొందరు ఎప్పుడూ నడుం కట్టుకుంటారు. శాంతినికేతన్‌లో తనకు సీనియర్‌ అయిన ఇందిరా గాంధీని సోనాలి ఆశ్రయించింది. పాస్‌పోర్టు, వీసా వచ్చేశాయి. రోసిలినీకి స్నేహితుడైన ఎమ్‌.ఎఫ్‌. హుస్సేన్‌ మీడియా కళ్ల పడకుండా యీమెకు బురఖా తొడిగించి, నా భార్య అని చెప్పి కలకత్తా నుండి ఢిల్లీకి చేర్చాడు. అక్కణ్నుంచి ఆమె పారిస్‌కు వెళ్లిపోయింది. అక్కడ మళ్లీ రోసిలినీ స్నేహితుడైన ఒక ఫోటోగ్రాఫర్‌ స్టూడియోలో కొన్నాళ్లు కాపురం చేసి, ఫైనల్‌గా ఇటలీకి చేరింది. ఈమెను చూడగానే ఇన్‌గ్రిడ్‌ రోసిలినీతో తెగతెంపులు చేసుకుంది. తన కూతురు ఇసబెల్లాను అతని దగ్గరే వదిలేసింది. ఆమెను కూడా సోనాలీయే పెంచి పెద్ద చేసింది. ఆమె హాలీవుడ్‌ తారగా మారింది. సోనాలీ రెండో కొడుకు అర్జున్‌ని రోసిలినీ దత్తత తీసుకుని అతని పేరును గిల్‌గా మార్చాడు. అతనూ సినిమా నిర్మాత, దర్శకుడు అయ్యాడు. సోనాలి, రోసిలినీలకు ఒక అమ్మాయి పుట్టింది. రాఫేలియా పౌలా అని. 

ఇన్‌గ్రిడ్‌తో విడాకులకు ఇటలీ కోర్టు సమ్మతించలేదు. ఆ వివాదం సద్దుమణిగాక వీళ్లు వివాహం చేసుకోవడానికి టైము పట్టింది. వాళ్లు 17 ఏళ్లు కలిసివున్నారు. రోసిలినీ జీవితంలో అది పెద్ద విశేషమే. 1973లో విడిపోయారు. అంతకు పదేళ్ల క్రితమే సోనాలి రోమ్‌లో ఒక బొతిక్‌ పెట్టి సంపాదించసాగింది. ఆమె మళ్లీ ఇండియాకు రాలేదు, భర్తతో, పెద్దకొడుకుతో సంబంధం పెట్టుకోలేదు. పెద్దకొడుకు రాజా దాస్‌గుప్తా కూడా డాక్యుమెంటరీ సినిమాలు తీస్తాడు. జూన్‌ 7 న రోమ్‌లో సోనాలీ మరణించడంతో యీ వింత ప్రణయగాథ ఒక ముగింపుకు వచ్చింది.

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జులై 2014)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?