Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: తడాఖా చూపిన అఖిలేశ్‌

ఎమ్బీయస్‌: తడాఖా చూపిన అఖిలేశ్‌

మొక్కే కదా అని పీకేయబోతే అసలుకే ఎసరు తేగలనని చూపుకున్నాడు అఖిలేశ్‌. అతన్ని ఎలాగైనా పార్టీలోంచి తరిమివేయాలని కంకణం కట్టుకున్న అమర్‌ సింగ్‌, ములాయం రెండో భార్య సాధనా సింగ్‌, శివపాల్‌ యాదవ్‌, (మరో మహిళా ఐయేయస్‌ అధికారిణి కూడా వీరితో బాటు వుందట) తాజా పరిణామాలతో కంగు తిన్నారు.

ములాయం ఆరోగ్యపరిస్థితి ఏమీ బాగాలేదట. వచ్చే బుద్ధి, పోయే బుద్ధిగా వుందట. తనేం చేస్తున్నాడో, ఎవరితో మాట్లాడుతున్నాడో కూడా తెలియని అయోమయంలోకి వెళ్లిపోతున్నాడని కొందరు పాత్రికేయులు చెప్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీ అంటే ములాయందే, అతని ఆదేశం వేదవాక్కు అని కార్యకర్తలందరూ నమ్ముతారు కాబట్టి, అతన్ని అడ్డుపెట్టుకుని అఖిలేశ్‌ను తన్ని తగిలేద్దామని అమర్‌ సింగ్‌ అండు కో ప్లానేసింది. పార్టీ నుంచి సస్పెండ్‌ చేయించింది. అతను పార్టీ నుంచి బయటకు వెళ్లి వేరే పార్టీ పెట్టుకుంటాడని ప్రచారం చేసింది. అయితే అఖిలేశ్‌ బెదరలేదు. నేనెందుకు వెళ్లాలి? అంటూ తనదే పార్టీ అన్న ధీమా వ్యక్తపరుస్తూ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పరచాడు. 200 మంది దాకా అఖిలేశ్‌ వైపుకి వస్తే, ఇరవై లోపు మంది ములాయం వైపు వెళ్లారు. ఎమ్మెల్సీలు, ఒకరిద్దరు తప్ప తక్కిన సీనియర్‌ నేతలు అఖిలేశ్‌ వైపే వున్నారు. తాము టిక్కెట్లు యిచ్చిన వారిలో 20% మందే తమ మీటింగుకు రావడంతో పరిస్థితి గమనించి శివపాల్‌ గ్రూపు వెనకడుగు వేసి అఖిలేశ్‌, రాంగోపాల్‌లపై సస్పెన్షన్‌ ఎత్తివేయించింది. అయినా అఖిలేశ్‌ వెనక్కి తగ్గటం లేదు. పార్టీపై తన పట్టు ప్రదర్శిస్తున్నాడు.

ఇది ఎవరూ ఎదురు చూడనిది. 'తన స్వేదంతో ములాయం పార్టీ నిర్మించాడు, శివపాల్‌ అన్నకు అండగా నిలిచాడు. ఆ టైములో కాలేజీలో చదువు పేర షికార్లు కొట్టినవాడు అఖిలేశ్‌.  మాయావతి పాలనలో ఆమెకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తూ, అష్టకష్టాలు పడినవారు ములాయం, శివపాల్‌ యిత్యాదులు. 2012 ఎన్నికలలో ఎన్నో ప్రణాళికలు రచించి, అభ్యర్థులను ఎంపిక చేసి గెలిపించుకున్నవారు వారే. చివరి నిమిషంలో ఏ కష్టమూ పడకుండా, కేవలం ములాయం కొడుకన్న కారణంగా సరాసరి ముఖ్యమంత్రి అయిపోయినవాడు అఖిలేశ్‌. పార్టీకోసం త్యాగాలు చేసినవారి సంగతి అతనికి తెలియదు. పనికిమాలిన నీతిసూత్రాలు వల్లిస్తాడు కానీ తన సొంతబలంపై ఒక్క ఎన్నికా నెగ్గలేదు, నెగ్గలేడు.' - ఇదీ శివపాల్‌ ముఠా ప్రచారం చేస్తూ వచ్చినది. 

నిజానికి 2012 ఎన్నికల ప్రచారంలో అఖిలేశ్‌ కూడా బాగా తిరిగాడు. అతన్ని చూసి యువత ప్రభావితమైన మాట వాస్తవమే. అది గమనించే ములాయం అతన్ని ముఖ్యమంత్రిని చేశాడు. తనపై, తన సోదరునిపై కుల, హింసా రాజకీయాల ముద్ర ప్రగాఢంగా వుందని, యీ దశలో వాటిని తాము విదిలించుకోలేమని ములాయంకు తెలుసు. అందుకే కొత్త తరానికి సరైన నాయకుడు అన్నట్లు అఖిలేశ్‌ను ప్రొజెక్టు చేశాడు. అయితే అతనికి పాలించే అవకాశం యివ్వలేదు. తన కుండే ఆబ్లిగేషన్స్‌ అన్నీ అతనిపై రుద్దాడు. దాంతో అఖిలేశ్‌ ఏ నిర్ణయమూ తీసుకోలేని చేతకానివాడిగా ముద్రపడ్డాడు. 2014 ఎన్నికలలో ఓటమి తర్వాత అతనిలో పౌరుషం మేల్కొంది. జూలు విదిలించి, అభివృద్ధి పథకాలు చేపట్టసాగాడు. పార్టీలో క్షాళన తెస్తానన్నాడు. అది యథాతథవాదులైన శివపాల్‌కు నచ్చలేదు. అఖిలేశ్‌పై కత్తి కట్టిన సవతితల్లితో చేతులు కలిపాడు. శకుని పాత్ర పోషించడానికి అర్జంటుగా అమర్‌ సింగ్‌ మళ్లీ పార్టీలోకి అడుగు పెట్టాడు. అందరూ కలిసి ములాయంను వంచారు.

భారత రాజకీయాల్లో విపరీతమైన పుత్రప్రేమ కనబరచిన ధృతరాష్ట్రుల వారసులెందరో వున్నారు. గాంధేయవాదిగా వినుతి కెక్కిన మొరార్జీ దేశాయిలో కూడా ఆ అంశ కనబడింది. అలాటిది ములాయం తన కొడుకును దూరం పెట్టి తమ్ముడిపై వలపక్షం చూపించాడంటే ఆశ్చర్యం కలిగింది. అయితే యిక్కడ చిన్న మెలిక వుంది. ములాయంకు రెండో భార్య, ఆమె ద్వారా కలిగిన కొడుకు వున్నారు. వాళ్లు అఖిలేశ్‌ను వ్యతిరేకిస్తున్నారు. వారికి ములాయం మద్దతు వుంది. ఈ కథా మనకు జానపదాల నుంచీ పరిచితమైనదే. రాజుగారికి యిద్దరు భార్యలున్నారంటే రెండో భార్య ఎప్పుడూ చెడ్డదే. అన్ని విధాల సమర్థుడు, మంచివాడు అయిన పెద్దభార్య కొడుకుపై ఎలాగైనా నింద మోపి, తన కొడుక్కి పట్టం కట్టాలని చూస్తూ వుంటుంది. అతనిపై, బతికి వుంటే అతని తల్లిపై రాజుగారికి అనుమానం కలిగేట్లు తన తమ్ముడితో కలిసి పన్నాగాలు పన్నుతూ వుంటుంది. ఈ కథలు చదివిచదివి మనం పెద్ద భార్య కొడుకుపైనే జాలి చూపుతాం.

తెలుగునాట ఎన్టీయార్‌ కథ చూశాం. ఆయన వృద్ధాప్యంలో రెండో పెళ్లి చేసుకోగా చూశాం. పోన్లే, తోడు కోసం అనుకున్నాం. అంతలోనే ఆమె రాజకీయాల్లోకి రావాలని, వెనక నుంచి చక్రం తిప్పాలని చూడడంతో తెల్లబోయాం. లక్ష్మీపార్వతిపై ఆగ్రహం, ఎన్టీయార్‌పై జాలి ప్రజల్లో బలంగా నాటుకున్న తర్వాత అంతఃపుర కుట్ర జరిగింది. ఎన్టీయార్‌ పెద్ద భార్య పిల్లల్లో చాలామంది ఒకటయ్యారు. ఇంటల్లుడు సారథి అయ్యాడు. 'మా నాన్నను అమాయకుణ్ని చేసి ఆమె లోబరుచుకుంది. ఆయన చేత పిల్లవాణ్ని కనడానికి మేగ్నటిక్‌ థెరపీ యిప్పిస్తోంది. చేతులు కాళ్లూ కట్టేసి అయస్కాంతాలు శరీరంపై పెట్టి హింస పెడుతోంది.' అంటూ హరికృష్ణ రచ్చ చేశారు.

ప్రజలకు లక్ష్మీపార్వతిపై ఏవగింపు కలగడంతో, ఎందరు చెప్పినా ఆమెనే వెనకేసుకుని వస్తున్న ఎన్టీయార్‌పై నిస్పృహ కలగడంతో కుటుంబం ఎన్టీయార్‌ను పదవీచ్యుతుణ్ని చేసేసినా ప్రజలు మిన్నకున్నారు. 'మీరు నన్ను చూసి ఓట్లేశారు, నాపై చెప్పులు వేస్తే, నన్ను దింపేస్తే సహిస్తారా?' అని ఎన్టీయార్‌ ఆక్రోశించినా స్పందించలేదు. అది చూసి ఎన్టీయార్‌ వెనక నిలబడిన ఎమ్మెల్యేలు కూడా అధికారపక్షం కేసి వచ్చేశారు. చివరకు పార్టీ వ్యవస్థాపకుడికే పార్టీలో చోటు లేకుండా పోయింది.

ఇప్పుడు అఖిలేశ్‌ అంత పనీ చేయబోయి మానేశాడు. 'నా తండ్రి మతి తప్పిన సమయంలో వీళ్లు ఏవేవో చెప్పి ఆయన్ని ఆడిస్తున్నారు' అని బాహాటంగా అనకుండా బయటి వ్యక్తులు కుటుంబ వ్యవహారాల్లో చొరబడుతున్నారు అంటూ అమర్‌ సింగ్‌ను విలన్‌గా చూపి వూరుకున్నాడు. ఇక 'తండ్రి మాట నాకు శిరోధార్యం, నేను ధిక్కరించి బయటకు వెళ్లను,  యుపిని గెలిచి మా నాన్నకు బహుమతిగా యిస్తాను' అంటూ విధేయుడైన కొడుకుగా తనను తాను చూపుకున్నాడు.

ఇవాళ చేసిన పార్టీ సమావేశం ఏర్పాటు చేసి తీర్మానంలో తను పార్టీకి జాతీయ అధ్యక్షుడై పోయి, తండ్రికి మార్గదర్శకుడి స్థానం యిచ్చాడు. అమర్‌ సింగ్‌ను పార్టీలోంచి తరిమివేసి, శివపాల్‌ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి దింపేశాడు. ఇంత చేయడానికి అతనికి బలం యిచ్చినది - పార్టీ క్యేడర్‌. అఖిలేశ్‌ను పార్టీలోంచి సస్పెండ్‌ చేసి, కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకుంటాం అని శివపాల్‌ ప్రకటించడంతో ఎస్పీ పార్టీ కార్యకర్తలందరూ అటోయిటో తేల్చుకోవాల్సిన తరుణం వచ్చింది. అలా వచ్చినపుడు వాళ్లలో 90% అఖిలేశ్‌నే ఎంచుకున్నారు. రోడ్లపై ఎటు చూసినా అఖిలేశ్‌ మద్దతుదారులే కనబడ్డారు. ములాయం, శివపాల్‌ సమర్థకులు కనబడడం మానేశారు. కొన్ని గంటల్లోనే ప్రజాబలం ఎటుందో తెలిసిపోయింది. అందువలన శివపాల్‌ ముఠా రాజీకి సిద్ధపడ్డారు. కానీ అఖిలేశ్‌ బెసకదలచలేదు. పార్టీని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోదలిచాడు. దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాడు. దీనికి ప్రతిగా అమర్‌ సింగ్‌ ఏ యెత్తులు వేస్తాడో చూడాలి. ములాయం బుద్ధికి మళ్లీ మబ్బు కమ్మి ఏ ఆదేశం యిస్తాడో చూడాలి.

ప్రస్తుతానికి అఖిలేశ్‌ ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశం పార్టీ రాజ్యాంగానికి విరుద్ధమని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు. పార్టీలోంచి మరో యిద్దరు నాయకులను తీసేశాడు. అతనికి బిపి ఎక్కువై పోయి అస్వస్థుడయ్యాడని కూడా వార్త వచ్చింది. ఈ స్థితిలో సహజంగా భార్య - మొదటి భార్య పోయింది కాబట్టి, రెండో భార్యే యింట్లో వుంది - ఎలా కావాలంటే అలా ఆడిస్తుంది. ములాయం మనుషులను గుర్తు పట్టే స్థితిలో లేడని సస్పెండ్‌ అయిన నాయకులు బాహాటంగా అనసాగారు. అది కార్యకర్తలు నమ్మితే పార్టీలో చాలా భాగం అఖిలేశ్‌ వైపే వచ్చేస్తుంది.

అఖిలేశ్‌ను పార్టీలోంచి తీసేశారన్న వార్తలు రాగానే పాత్రికేయులు చర్చలకు దిగారు. పార్టీ ఓటు బ్యాంకులో రెండిట మూడువంతులు అఖిలేశ్‌ వెంట నడవగా, మూడో వంతు ములాయం వెంట వుంటుందని లెక్కలు వేశారు. కాంగ్రెసు, ఆర్‌ఎల్‌డి చేతులు కలిపినా ముస్లిములు, బిజెపి వ్యతిరేక వర్గాలు ముక్కలైన ఎస్పీని పక్కన పెట్టి బియస్పీని ఆదరిస్తారని, పార్టీల నధిగమించి యువత  ఓటు అఖిలేశ్‌, మోదీల మధ్య చీలిపోతుందని, మొత్తంగా చూస్తే బిజెపి మరింత బలపడుతుందని వ్యాఖ్యానించారు. యుపిలో అధికాంశంగా వున్న గ్రామీణ ప్రాంతాల్లో నోట్ల రద్దు ప్రభావం ప్రతికూల ప్రభావం చూపితే తప్ప బిజెపి గెలుపు తథ్యమని అంచనా వేశారు. ఇప్పుడు ఎస్పీలో 80-90% అఖిలేశ్‌ వెంట నిలిస్తే పరిస్థితి ఎలా వుంటుందో కొత్త లెక్కలు వేయాలి. ఎన్నికల కమిషన్‌ ఎవరి వర్గాన్ని అసలైన పార్టీగా గుర్తిస్తుందన్న అంశంపై కూడా చాలా ఆధారపడుతుంది. పార్టీలో లుకలుకలు సర్దుకుని ఎన్నికలకు వెళ్లేందుకు రెండు వర్గాలకు చాలా తక్కువ సమయం వుంది. ఈ లోపుగా తక్కిన పార్టీలు ప్రచారంలో ముందుకు వెళ్లిపోతాయి. 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జనవరి 2017)

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?