Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: తమిళనాట కుదిరైయాట్టం

ఎమ్బీయస్‌:  తమిళనాట కుదిరైయాట్టం

తమిళనాడులో ఒక జానపద నృత్యం వుంది - కుదిరైయాట్టం అని. తెలుగులో చెప్పాలంటే కొయ్య గుఱ్ఱపు ఆట. పక్కనున్న ఫోటో చూడండి. అలా చూస్తే ఓ మనిషి గుఱ్ఱం ఎక్కి ఠీవిగా కూర్చున్నట్లు కనబడుతుంది. కానీ ఆ మనిషి చెక్కల మీద నిలబడి అలా పొడుగ్గా కనబడతాడంతే. తనే ఆ డొల్ల గుఱ్ఱాన్ని అటూయిటూ వూపుతూ స్వారీ చేస్తున్నట్లు కటింగ్‌ యిస్తాడు. ఇప్పుడు పన్నీరు సెల్వాన్ని చూస్తే నాకు అదే గుర్తుకు వస్తోంది.

మొన్నటిదాకా అతను ఆడాళ్ల సీట్లో కూర్చున్న బస్సు ప్రయాణీకుడు. ఆడాళ్లు రానంత వరకే కూర్చోగలడు. వస్తే లేచి నిలబడాల్సిందే. సొంత బలం లేదు కాబట్టే శశికళ రాజీనామా చేయ్‌ అనగానే చేసేశాడు. అంతలో మంగళవారం రాత్రికి ఎక్కణ్నుంచో శక్తి వచ్చినట్లు ఫీలయ్యాడు. శశికళపై ఆరోపణలు గుప్పించాడు. చెయ్యి పట్టుకుని తన చేత బలవంతంగా రాజీనామా చేయించారంటూ వాపోయాడు. తనేమైనా చిన్నపిల్లవాడా, చెయ్యి పట్టుకుని చేయించడానికి! అంత పిరికివాడు ముఖ్యమంత్రిగా పనికి వస్తాడా? అన్న సందేహాలు ప్రజలకు వస్తాయని తోచలేదు పాపం.

జయలలితను చూడనీయలేదనీ, ఆమె చికిత్సలో లోపం జరిగిందనీ ఆరోపణలు చేస్తూ చేసిన యీ తిరుగుబాటేదో ఆ రోజే చేసి వుంటే జనాలు కాస్తయినా నమ్మేవారు. ఈ రోజు కేంద్రం గవర్నరు ద్వారా శశికళ గద్దె ఎక్కకుండా అడ్డుకుంటోందని అందరికీ తెలిసిపోయాక యిప్పుడీ మాటలు చెపితే యిదంతా దిల్లీ దర్బారు ఆడిస్తున్న ఆటగా తేటతెల్లంగా తెలిసిపోతోంది. 

శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన వ్యక్తిని ప్రమాణస్వీకారం చేయకుండా గవర్నరు ఎలా అడ్డుకోగలడు? ఏం అధికారం వుందని అడ్డుకోగలడు? ఎన్నాళ్లు తప్పించుకుని వూరూరూ తిరుగుతాడు? కారణం ఏం చెపుతాడు? ఇప్పటిదాకా అసెంబ్లీలో బలపరీక్ష రోజుదాకా ఎమ్మెల్యేలతో క్యాంపుల నిర్వహణ వ్యవహారాలు చూశాం. అందర్నీ బస్సెక్కించి, ఊటీలు, కశ్మీరులు తీసుకుని వెళ్లడం చూశాం. గవర్నరు వ్యవస్థను దుర్వినియోగం చేయడంలో కాంగ్రెసు బాటలోనే పయనిస్తున్న బిజెపి హయాంలో యిప్పుడు కొత్తగా గవర్నరు క్యాంపు వ్యవహారం చూస్తున్నాం. పన్నీరు సెల్వంకు మెజారిటీ వచ్చేదాకా ఆయన అలా షికార్లు కొడుతూనే వుంటాడు కాబోలు.

శశికళపై రాబోయే సుప్రీం కోర్టు తీర్పు విషయంలో ఆందోళన చెంది ఎడ్వకేట్‌ జనరల్‌ను సంప్రదిస్తున్నారని గాలివార్తలు వదిలారు. తన నోటితో అంటే నవ్వుతారని భయం కాబోలు! తీర్పు వచ్చేసిన కేసుల్లో కూడా జనాలు అప్పీలు కెళ్లాం అంటూ పదవులు చేపడుతున్నారు. ఈ కేసులో తీర్పు యింకా రాలేదు. అది ఎలా వుంటుందో ఎవరికీ తెలియదు. ఈ లోపుగానే అంత ఆదుర్దా ఎందుకు? 

అసలు కేంద్రం కూడా తీర్పు త్వరగా చెప్పండి అంటూ కేంద్రం సుప్రీం న్యాయమూర్తులను కోరడం వింతగా వుంది. ప్రజలకు ఉపయోగపడే ఎన్నో ప్రాజెక్టులు కోర్టుల్లో కేసుల కారణంగా ఆగిపోయి వున్నాయి. కేసులు తేలక ఎందరో అమాయకులు జైళ్లల్లో మగ్గుతూ వుంటారు. తగినంత మంది న్యాయమూర్తులను నియమించి ఆ కేసులన్నీ పరిష్కరించే ప్రయత్నాలు చేయదు ప్రభుత్వం. ఇప్పుడీ కేసులో మాత్రం తొరగా తీర్పు చెప్పేయండి అంటూ ఆరాటపడుతోంది. అవినీతిపై పోరాటంలో భాగంగా... అని అనుకోవాలా? అలా అయితే జయలలిత బతికి వుండగా ఏం చేశారట? రాజ్యసభలో ఎడిఎంకె మద్దతు కావాలి కాబట్టి, జయలలితతో దోస్తు కాబట్టి గప్‌చుప్‌. చట్టం తన పని తను చేసుకుని పోతుందంటూ కాలక్షేపం చేశారు. కానీ జయలలిత హఠాత్తుగా కాలం చేసింది. శశికళ ముందుకు వచ్చింది. ఆమెకు ముకుతాడు వేయాలి, అందుకని రాత్రికి రాత్రి కేసులకు ప్రాధాన్యం వచ్చింది. మంచిదే, యిలాటి కేసుల్లో తీర్పులు ఎంత త్వరగా వస్తే అంత మంచిది. ఆ పాటికి శశికళ ముఖ్యమంత్రిగా వుందనుకోండి. తీర్పు ఆమెకు వ్యతిరేకంగా వచ్చి పదవి దిగాల్సి వచ్చిందనుకోండి. ఆమెకు కూడా ఏ పన్నీరు శెల్వమో, శెల్వి (కుమారి)యో దొరక్కపోదు. కొన్ని నెలలపాటు పాదరక్షల పాలన సాగుతుంది. తమిళనాడుకు అది కొత్త కాదు.

ఇవన్నీ 'విద్యాసాగర'రావు గారికి తెలియవా? కావాలంటే తీర్పు వచ్చాక ఏం చేయాలో న్యాయకోవిదులను సంప్రదించవచ్చు. అయితే, గియితే... స్థితిలో వుండగా యిప్పుడే అడ్వకేట్‌ జనరల్‌ను అడగాలా? ఏమడుగుతాడు? వచ్చే వారం ఏ తీర్పు చెపుతావో ముందే నా చెవిలో వూదు అని న్యాయమూర్తిని వెళ్లి అడుగు అని అడుగుతాడా? అయినా అడగాలంటే గవర్నరు స్థాయి వ్యక్తి స్వయంగా వాళ్ల గుమ్మం దగ్గరకి వెళ్లి అడగాలా? ఫోన్‌ చేసి అడగలేడా? వీడియో కాన్ఫరెన్సింగ్‌ చేయలేడా? సెక్రటరీని పంపలేడా? 

విద్యాసాగరరావుగారు తననేమీ అడగలేదని చెప్తూనే అడ్వకేట్‌ జనరల్‌ 'శశికళ పదవి చేపట్టడానికి ప్రస్తుతం న్యాయపరమైన అవరోధం ఏమీ లేదు' అని స్పష్టం చేసేశారు. ఇక బాగుండదనుకున్నారేమో, విద్యాసాగరరావు చెన్నయ్‌కు ప్రయాణం కట్టారు. రేపు చేరతారట. చేరినా కడుపునొప్పో, కాలునొప్పో అంటూ ప్రమాణస్వీకారం చేయకుండా సాకులు చెప్తారన్న భయం వున్నట్టుంది శశికళకు. అందుకే ఆయన ఎపాయింట్‌మెంట్‌ తీసుకుంటూనే తను విధేయులైన ఎమ్మెల్యేలతో కలిసి దిల్లీకి ప్రయాణం కట్టబోతున్నట్లు ఫీలర్‌ వదిలింది. ఈ లోపున పన్నీరుపై కన్నీరు కురిపిస్తున్నారు చాలామంది. శశికళ అతని చేత బలవంతంగా రాజీనామా చేయించడం అన్యాయం అంటూ డిఎంకె వాపోయింది, బిజెపి కూడా వాపోయింది. ఇతర పార్టీ వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం భావ్యం కాదని కొన్నిసార్లు అంటారు. ఇప్పుడు మాత్రం భావ్యంగా తోచింది మరి.

శశికళను జనాలు ఓటేయలేదు అనే స్లోగన్‌ మొదలెట్టారు యీ మధ్య. పన్నీరుని చూసి ఓటేశారా? జయలలితను చూసే వేశారు. ఆవిడ లేదిప్పుడు. 1967 ఎన్నికలలో అన్నాదురైను చూసి ఓటేశారు. ఆయన పోయిన తర్వాత సీనియర్‌ మంత్రిగా నెడుంజెళియన్‌ అపద్ధర్మ ముఖ్యమంత్రి అయ్యాడు. అయితే ఎమ్మెల్యేలలో చాలామంది కరుణానిధిని కోరుకున్నారు. కరుణానిధి సిఎం అయ్యాడు. ఇప్పుడు పన్నీరు సెల్వం విషయమూ అంతే. పార్టీ ఎమ్మెల్యేలలో ఎక్కువమంది ఎవరు కోరుకుంటే వాళ్లే సిఎం అవుతారు. అదే విషయం సినీనటి రాధిక స్టాలిన్‌కు గుర్తు చేసింది - 'మీ నాన్న ఎంపికను గుర్తు చేసుకో' అని.

శశికళకు అనుభవం లేదు, ఎమ్మెల్యే కూడా కాదు అంటున్నారు. ఎమ్జీయార్‌ పోయినప్పుడు ఆయన భార్య విఎన్‌ జానకిని తీసుకుని వచ్చి ఎకాయెకి ముఖ్యమంత్రి చేశారు. ఆవిడకు అనుభవం వుందా? శశికళ మొహమైనా మనకు పరిచితం. జానకి మొహం ఎలా వుంటుందో పబ్లిక్‌కు అస్సలు తెలియదు. ఎన్నడో యిక్ష్వాకుల కాలంలో ఆవిడ సినిమా తార కానీ ఎమ్జీయార్‌తో పెళ్లయ్యాక ఆవిడ యింటికే పరిమితం.

మాజీ స్పీకరు పాండ్యన్‌ శశికళ జయలలిత చావుకి కారణమంటూ ఏవేవో ఆరోపణలు చేస్తున్నాడు. అతని గతచరిత్ర తిరగేస్తే అతను ఏమైనా అనగల సమర్థుడని తెలుస్తుంది. శశికళ అవినీతిపరురాలని, మాఫియా అని, మరోటనీ మనం ఎన్ని గింజుకున్నా లాభం లేదు. మెజారిటీ ఎమ్మెల్యేలను ఎవరు పోగేస్తే వాళ్లే సిఎం. దట్సాల్‌. 1994 ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలలో చంద్రబాబును చూసి జనాలు ఓటేయలేదు. ఎన్టీయార్‌ను చూసి వేశారు. కానీ ఏడాది తిరక్కుండా మెజారిటీ ఎమ్మెల్యేలు చంద్రబాబు నీడలోనే తాము వర్ధిల్లగలమని నమ్మారు. అంతే బాబు సిఎం, ఎన్టీయార్‌ పదవీభ్రష్టుడు అయిపోయారు. ఇప్పుడు ఎడిఎంకె ఎమ్మెల్యేలు ఎటువైపు వుంటారో వాళ్ల చెప్పుల్లో కాళ్లు పెట్టి మనం ఆలోచిద్దాం. పన్నీరుకు స్వయంప్రతిపత్తి లేదు. ఒట్టి భరతుడి లాటి వాడు. మరి శశికళ? ఆంజనేయుడు లాటిది. రాముణ్ని చేరుకోవాలంటే మనం ఎవర్ని ఆశ్రయిస్తాం? రామదూత హనుమంతుణ్ని వేడుకుంటాం. జయలలిత ఎవరికీ ఓ పట్టాన దర్శనం యిచ్చేది కాదు. అంతా శశికళ ద్వారానే వ్యవహారం నడిపేది. టిక్కెట్ల పంపిణీ, నిధుల పంపిణీ, నిధుల సేకరణ అన్నీ శశికళ ద్వారానే జరిగాయి. ఎమ్మెల్యేలందరికీ ఆమె పరిచితురాలు. ఆమెతో వాళ్లు కంఫర్టబుల్‌గా ఫీలవుతారు.

పన్నీరుతో గతంలో సంబంధాలు ఎలా వున్నా, యిప్పుడు తిరుగుబాటు చేసిన తర్వాత చూస్తే అతను బిజెపి మనిషిగా తేలాడు. ఉత్తరాది పార్టీగా, హిందీ పార్టీగా ముద్ర పడిన బిజెపితో చేతులు కలిపాడంటేనే తమిళ ప్రజలకు అనుమానం. అందునా అది యిప్పుడు కేంద్రంలో అధికారంలో వుంది. తమ రాష్ట్రాన్ని గుప్పిట్లో పెట్టుకోవడానికి పన్నీరును వాడుకుంటోందన్న సందేహం కలిగితే చాలు ప్రజలు దూరమవుతారు. బిజెపి నైతిక మద్దతే యివ్వగలదు. ఎమ్మెల్యేలు లేరు పాపం. 89 మంది ఎమ్మెల్యేలున్న డిఎంకె మద్దతు యిస్తేనే ప్రభుత్వం ఏర్పాటు చేయగలడు. ఎడిఎంకెను చీల్చడానికి ప్రస్తుతం డిఎంకె పన్నీరుకి యిస్తున్న మద్దతు ఎల్లకాలమూ వుంటుందా? అది యిన్నాళ్లూ జయలలితకు వ్యతిరేకంగా ఉధృతంగా పోరాటం చేసినది ఆమెకు జీహుజూర్‌గా పనిచేసిన పన్నీరును ముఖ్యమంత్రి గద్దెపై కూర్చోబెట్టడానికా? అబ్బే! శశికళను అణచివేశాక పెద్దాయన కరుణానిధికి కాస్సేపు సీటు మీద కూర్చోబెడదాం అనదా? అప్పుడు పన్నీరు వెంట వచ్చిన ఎడిఎంకె ఎమ్మెల్యేల గతి ఏమిటి? తమ నియోజకవర్గంలో పోటీగా వున్న డిఎంకె నాయకులతో భుజం కలిపి పనిచేయగలరా? సగం మంది పన్నీరు వెంట, సగం మంది శశికళ వెంట వెళ్లి ఎడిఎంకె ప్రభుత్వాన్ని తామే కూల్చుకుంటే, భవిష్యత్తు ఎలా వుంటుందో! రాష్ట్రపతి పాలన, తిరిగి ఎన్నికలు అంటే తిరిగి నెగ్గగలమా? నెగ్గి ఏడాది కాలేదు, మళ్లీ పోటీ అంటే ఎంత ఖర్చు? జయలలిత లేనప్పుడు స్టాలిన్‌కే ఎక్కువ అవకాశం వుంటుంది తప్ప పన్నీరుకి కాదు. ఇన్ని బాధలకు బదులు శశికళనే అంటిపెట్టుకుని నాలుగేళ్లూ లాగించేస్తే, ఎన్నికల ఖర్చు రాబట్టుకోవచ్చు కదా! - ఇలా సాగుతాయి వారి ఆలోచనలు.

పన్నీరుకి వున్న బలం ఎంత అనేది స్పష్టంగా తెలియటం లేదు. 4గురు అంటున్నారు కొందరు. మీడియావారు పన్నీరుకి మెజారిటీ మాన్యుఫేక్చర్‌ చేసి, 50 మంది వున్నారన్నారు, మరి కొందరు 60 మంది అంటున్నారు. వాళ్లెవరూ బయటకు రావటం లేదు. అతను జయలలిత సమాధి వద్ద ధ్యానముద్రలో వున్నపుడు ఒక్కడే వున్నాడు కానీ వెనక్కాల ఎవరూ రాలేదు. మరి 60 ఎలా అంటున్నారు అంటే మీడియా ఏదైనా అనగలదు. జయలలిత మేనకోడలు దీప వెనక కూడా ఎమ్మెల్యేలున్నట్లు పుకార్లు రాశారు. ఈ దీపం యిన్నాళ్లూ చీకట్లోనే వుంది. జయలలిత ఆమెను దరిదాపుల్లోకి రానీయలేదని అందరికీ తెలుసు. జయ పేరు చెప్పుకుని బతికే ఎడిఎంకె ఎమ్మెల్యేలు దీప వద్దకు వెళతారా? అబ్సర్డ్‌! కానీ పన్నీరు ఆమెను తనతో చేతులు కలపమని ఆహ్వానించాడు. జోగీజోగీ రాసుకున్నట్టుంది.

శశికళ చూడబోతే  పార్టీకి వున్న 133 మంది ఎమ్మెల్యేలలో తన వద్ద 130 మంది వున్నారంటోంది. ఆమె మంగళవారం నాడు పోయెస్‌ గార్డెన్‌లో ఏర్పాటు చేసి పన్నీరును కోశాధికారిగా తొలగించిన సమావేశానికి 20 మంది మంత్రులు, 80 మంది ఎమ్మెల్యేలు వచ్చారట. రేపు రాష్ట్రపతి వద్ద పెరేడ్‌ చేస్తే కరక్టు అంకె తేలిపోతుంది. మొత్తం 233 ఎమ్మెల్యేలలో 117 మంది వుంటే చాలు, సింపుల్‌ మెజారిటీ వున్నట్లే. ఒకటీ అరా తక్కువైతే 8 మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెసు భుజం కాస్తాననవచ్చు. మెజారిటీ ఎమ్మెల్యేలు ఆమె వెంట వున్నారని తేలితే గవర్నరుకి ఆమెను ఆహ్వానించక తప్పదు. అసెంబ్లీలో బలం నిరూపించుకోమని షరతు తప్పకుండా విధిస్తాడు. అది ఎప్పణ్నుంచో వస్తున్న సంప్రదాయమే. ఈ పని ముందే చేసి వుంటే బిజెపి నింద పడకుండా వుండేది.

ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2017)

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?