Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : తమిళ రాజకీయాలు - 48

ముఖ్యమంత్రిగా వున్న కామరాజ్‌ గుడియాత్తం ఉపయెన్నికలో అభ్యర్థిగా నిలిచినపుడు, అతనికి ప్రత్యర్థిగా కమ్యూనిస్టు నాయకుడు వికె కోదండరామన్‌ నిలబడ్డాడు. కామరాజ్‌ను బహిరంగంగా వ్యతిరేకించే ధైర్యం చేయలేక పెరియార్‌, అణ్నా అతన్ని సమర్థించారు. దానికి కామరాజ్‌ పొంగిపోలేదు. డిఎంకెకు ఎలాగైనా ముకుతాడు వేయాలని దాని మద్దతుతో నెగ్గిన తమిళనాడు టాయిలర్స్‌ పార్టీ నాయకుడు ఎస్‌ఎస్‌ రామసామిని తన వైపు తిప్పుకుని మంత్రి పదవి యిచ్చాడు. ఇది డిఎంకెను మండించింది. ఇక కామరాజ్‌ పట్ల ఆదరమూ లేదు, నిరాదరణా లేదు అంటూ అణ్నా ప్రకటించాడు. కామరాజ్‌ ఇమేజి జాతీయస్థాయిలో పెరిగిపోసాగింది. 1955 జనవరిలో మద్రాసులోని ఆవడిలో కాంగ్రెసు పార్టీ జాతీయ స్థాయి సమావేశం ఏర్పరచి తన నిర్వహణాసామర్థ్యాన్ని చాటుకున్నాడు. ఆ సమావేశంలోనే కాంగ్రెసు సోషలిజానికి కట్టుబడి వుందన్న తీర్మానం చేయడం జరిగింది. కామరాజ్‌ స్థాయి పెరిగినకొద్దీ తమకు యిక్కట్లు తప్పవని గ్రహించిన అణ్నా 'ఇలాటి సమావేశాల వలన తమిళులకు ఒరిగేది ఏమీ లేదని, కామరాజ్‌ తమిళుల కోసం ఏమీ చేయటం లేదనీ' విమర్శించాడు. కామరాజ్‌ను అచ్చమైన తమిళుడని పెరియార్‌ కీర్తించగా 'అతను కనబడడానికి మాత్రమే ద్రవిడుడని, లోపలంతా ఆర్యత్వమే వుందని, అతను ఉత్తరాది ఆర్యుల చేతిలో ఆడే బొమ్మ' అని అణ్నా వ్యాఖ్యానించాడు. 

1955 అక్టోబరులో స్టేట్‌ రీఆర్గనైజేషన్‌ కమిషన్‌ (ఎస్సార్సీ) నివేదిక వచ్చింది. భాష ప్రాతిపదికన 16 రాష్ట్రాలు ఏర్పడాలని వారు సూచించారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి పిసి రాయ్‌ 'అన్ని రాష్ట్రాలు అక్కరలేదు, ఐయిదారు పెద్దపెద్ద ప్రావిన్సెస్‌ వుంటే చాలు' అని వాదించాడు. దాని ప్రకారం కర్ణాటక, కేరళ, తమిళనాడు కలిసి దక్షిణ ప్రదేశ్‌గా ఏర్పడాలి. ఉత్తర ప్రదేశ్‌ పలుకుబడితో పోటీ పడాలంటే యీ దక్షిణ ప్రదేశ్‌ ఏర్పడాలని రాజాజీ అభిప్రాయపడ్డాడు. కానీ ఒకప్పుడు ద్రవిడస్థాన్‌ కోసం పోరాడిన పెరియార్‌, అణ్నా యీ ప్రతిపాదనను వ్యతిరేకించారు. ఎందుకంటే వారి బలం తమిళ ప్రాంతాలకే పరిమితం. అందువలన 'ఈ ద్రవిడస్థాన్‌లో తమిళేతరులు తమిళులను డామినేట్‌ చేస్తారు' అంటూ వాదించారు. కామరాజ్‌కు కూడా అలాగే తోచి యీ ప్రతిపాదనను తోసిపుచ్చాడు. మొత్తానికి 1956లో భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. మద్రాసు రాష్ట్రంలో వున్న దేవీకుళం, పీర్మేడు కేరళకు ఎలాట్‌ చేశారు. దాని గురించి తమిళ ప్రతిపక్షాలు ఆందోళన చేసి యిది కామరాజ్‌ చేతకానితనం అనేశాయి. మద్రాసు రాష్ట్రం పేరైనా ''తమిళనాడు''గా మార్చాలని ద్రవిడ పార్టీలు ఆందోళన చేశాయి. ''మద్రాసు అనే పేరు అంతర్జాతీయంగా తెలుసు. దానికి ఒక యిమేజి వుంది. పేరు మార్చి అదెందుకు పోగొట్టుకోవాలి?'' అని కామరాజ్‌ వాదించి ఆ ప్రతిపాదనను తోసిపుచ్చాడు. 

1956 నవంబరులో తుపాను వచ్చింది. తుపాను బాధితుల సహాయార్థం డిఎంకె పార్టీ విరాళాలు సేకరించింది. సినిమా తారలు వీధుల్లో తిరిగి నిధులు పోగుచేశారు. అందరి కంటె ఎక్కువగా శివాజీ నిధులు సంపాదించినా పార్టీ ఎమ్జీయార్‌కు సన్మానం చేసింది. ఇది శివాజీని మండించింది. దీని తర్వాతనే అతను భీమ్‌ సింగ్‌తో కలిసి తిరుపతి వెళ్లడం, దానిపై డిఎంకె కార్యకర్తలు అతని కారుపై రాళ్లు విసరడం, పోస్టర్లపై పేడ ముద్దలు కొట్టడం జరిగింది. అతను పార్టీ విడిచి పెట్టి కామరాజ్‌కు అనుచరుడిగా మారిపోయాడు. అప్పటివరకు డిఎంకె సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ వదిలేసిన పాత్రలు ధరించే అవకాశం కలిగింది. ఆ విధంగా వైవిధ్యభరితమైన పాత్రపోషణతో గొప్ప నటుడిగా ఎదిగాడు.  

1957 లో ఎన్నికలు జరిగాయి. డిఎంకె మ్యానిఫెస్టోలో ద్రవిడనాడు గురించి ప్రస్తావన లేదు. దానికి బదులు రాష్ట్రాలకు స్వయంనిర్ణయాధికారా లుండాలని, కేంద్రాధికారాలకు పరిమితి వుండాలనే ప్రతిపాదన వుంది. 234 ఎసెంబ్లీ సీట్లలో 124 వాటికి, 39 పార్లమెంటు సీట్లలో 11టికి డిఎంకె పోటీ చేసింది. కామరాజ్‌పై గౌరవంతో వ్యతిరేకంగా అభ్యర్థిని ఎవరినీ నిలపకపోయినా కాంగ్రెసుకు వ్యతిరేకంగానే ప్రచారం సాగింది. 'కాగితపుపూలకు వాసన లేదు, కాంగ్రెసు సోషలిజంలో మాధుర్యం లేదు, దానివలన ఉత్తర భారతం వర్ధిల్లుతుంది, దక్షిణభారతం వాడుతుంది' అనే నినాదంతో డిఎంకె ముందుకు వెళ్లింది. అణ్నా 30 అసెంబ్లీ సీట్లు వస్తాయనుకుంటే దానిలో సగమే దక్కాయి. నెగ్గినవారిలో అణ్నా, కరుణానిధి, అన్బళగన్‌, సత్యవాణి ముత్తు, ఆశైతంబి తదితరులున్నారు. ఓడినవారిలో కవి కణ్నదాసన్‌, నెడుంజెళియన్‌ వున్నారు. మద్రాసు నగరం, ఉత్తర దక్షిణ ఆర్కాట్‌ జిల్లాలు, సేలంలలో డిఎంకె తన సత్తా చూపింది. కాంగ్రెసు 151 గెలిచింది. కాంగ్రెసుతో విభేదించి ఏర్పడిన కాంగ్రెసు రిఫార్మ్‌ పార్టీకి 16 రాగా, స్వతంత్రులు 12 మంది గెలిచారు. కమ్యూనిస్టులకు గతంలో 18 వుంటే యిప్పుడు 4తో సరిపెట్టుకోవలసి వచ్చింది. సోషలిస్టు, ఫార్వార్డ్‌ బ్లాక్‌ చెరో రెండు గెలిచాయి. డిఎంకె తరఫున ఇవికె సంపత్‌, అన్బిల్‌ ధర్మలింగం పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 

1958లో గువాహతిలో జరిగిన కాంగ్రెసు జాతీయ సమావేశంలో 1965 నాటికల్లా ఇంగ్లీషు స్థానంలో హిందీ తేవాలని తీర్మానం చేయడం జరిగింది.  మద్రాసు ముఖ్యమంత్రి కామరాజ్‌, మైసూరు (అప్పట్లో కర్ణాటకను అలా పిలిచేవారు) ముఖ్యమంత్రి కెంగళ్‌ హనుమంతయ్య పట్టుబట్టి తీర్మానానికి సవరణలు చేయించారు. దాని ప్రకారం 1965 తర్వాత కూడా ఇంగ్లీషు వాడకానికి కావలసిన వసతులు చేస్తామని కాంగ్రెసు అంగీకరించింది. మద్రాసుకు కాంగ్రెసు తరఫున ముఖ్యమంత్రిగా చేసి హిందీ వ్యాప్తికి ఎంతో కృషి చేసిన రాజాజీ ఆ ఏడాది స్వతంత్ర పార్టీ స్థాపించారు. మాజీ సంస్థానాధీశులు, జమీందార్లు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, సోషలిజానికి వ్యతిరేకులు అందరూ ఆ పార్టీలో చేరారు. హిందీ తీర్మానంపై వ్యాఖ్యానిస్తూ రాజాజీ ''హిందీ ప్రాంతాల వారికి ఇంగ్లీషు విదేశీ భాష అయితే హిందీయేతర ప్రాంతాల వారికి హిందీ కూడా విదేశీ భాషే'' అన్నారు. 

1959 జనవరిలో మునిసిపల్‌ ఎన్నికలు జరిగాయి. మద్రాసు కార్పోరేషన్‌లో 100 స్థానాలకు గాను డిఎంకె 90 స్థానాల్లో పోటీ చేసి 45 గెలిచింది. కాంగ్రెసు 100కు పోటీ చేసి 37 మాత్రమే గెలిచింది. కమ్యూనిస్టు, పిఎస్‌పి పార్టీలకు చెరో రెండు, సోషలిస్టులకు 1 రాగా 13 మంది స్వతంత్రులు గెలిచారు. వారిలో డిఎంకె మద్దతుతో గెలిచిన ముస్లిం లీగు సభ్యుడు కూడా వున్నాడు. మేం నాస్తికులం, మతాన్ని వ్యతిరేస్తామని చెప్పే ద్రవిడ పార్టీలు హిందూ మతం తప్ప తక్కిన మతాలన్నిటినీ వాటేసుకున్నాయి. తక్కిన 55 మునిసిపాలిటీల్లో 20 వాటిల్లో 350 మంది డిఎంకె అభ్యర్థులు నిలబడితే 45 మంది మాత్రం గెలిచారు. కోయంబత్తూరులో కమ్యూనిస్టు అభ్యర్థికి మేయరు పదవికై మద్దతిస్తామనే షరతుపై మద్రాసు మేయరు పదవికి డిఎంకె కమ్యూనిస్టుల మద్దతు తీసుకుంది. కొందరు స్వతంత్రుల మద్దతు సంపాదించడానికి ఎమ్జీయార్‌ పాటుపడ్డాడు. మద్రాసు కార్పోరేషన్‌ విజయోత్సవ సభలో అణ్నా రుణానిధి సేవలు ప్రశంసిస్తూ ''ఈ సందర్భంగా తనకు ఉంగరం తొడిగి సత్కరించాలనుకుని మిట్టమధ్యాహ్నం నగల షాపులన్నీ తిరిగాను. నా కోసం కానీ, మా ఆవిడ కోసం కానీ నేనెన్నడూ యిలా తిరగలేదు.'' అన్నాడు. అని ఒక ఉంగరం తీసి తొడిగాడు. సభ తర్వాత కణ్ణదాసన్‌ అణ్నాతో పేచీ పెట్టుకున్నాడు. ''నేనూ ఎన్నికల కోసం ఎంతో కష్టపడ్డాను. కానీ నా కోసం మీరేమీ కొనివ్వలేదే'' అని. ''వచ్చే మీటింగు నాటికి నువ్వూ ఓ ఉంగరం కొని నా చేతిలో పెట్టు.'' అని అణ్నా సమాధానమిచ్చాడు. ''కరుణానిధి అలాగే చేశాడా?'' అని సూటిగా అడిగాడు కణ్ణదాసన్‌. వాదనలొద్దు అంటూ అణ్నా మాట తప్పించేశాడు. పార్టీలో అణ్నా తర్వాతి స్థానం కైవసం చేసుకోవడానికి, కార్యకర్తల దృష్టిలో తన యిమేజి పెరగడానికి కరుణానిధి ఎన్ని ఉపాయాలు పన్నాడో దీని వలన తెలుస్తుంది. (సశేషం)  

(ఫోటో - 1952 మే 1 న శివాజీ గణేశన్‌ పెళ్లయింది. ఆ రోజున తన  మిత్రులతో శివాజీ (ఎడమ నుంచి రెండవ వ్యక్తి), ఫోటో. మధ్యలో గడ్డం కింద చెయ్యి పెట్టుకున్నది కవి కణ్ణదాసన్‌, పక్కన రుణానిధి, ఆ పక్కన ఎమ్జీయార్‌)

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ 

[email protected]

Click Here For Archives

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?