Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: తమిళ రాజకీయాలు - 61

ఎమ్బీయస్‌: తమిళ రాజకీయాలు - 61

కరుణానిధి అవినీతికి పాల్పడిన విధానంలో నవ్యత గురించి, సర్కారియా కమిషన్‌ ఎత్తి చూపిన ఒక కేసును యిటీవల జయలలిత ప్రస్తావించారు. కరుణానిధి మూడో భార్య రాజాత్తి (అప్పట్లో ఆమెను మిసెస్‌ ధర్మాగా ప్రస్తావించారు) 1969 జనవరి 20 న రాజా అన్నామలై పురంలోని ఒక యింటిని రూ.57 వేలకు శ్రీమతి విశ్వాసం అనే ఆవిడ వద్ద కొని ఏడు నెలల తర్వాత ఆగస్టు 21న కపాలికి అమ్మింది. ఆ కపాలి ఆమె దగ్గర వాచ్‌మన్‌! అతను రూ. 14 వేలు యివ్వగానే అతనికి యిల్లు రాసి యిచ్చేసింది. అతను వెంటనే యీవిడకు నెలకు రూ.300 అద్దె మీద యిల్లిచ్చినట్లుగా లీజు అగ్రిమెంటు రాసి యిచ్చేశాడు. అనగా ఆవిడ తన యింట్లోనే అద్దె కుండసాగింది. అదే యింటిని కపాలి 1972 జనవరిలో 45 వేలకు (అనగా 12 వేల నష్టానికి) శివభాగ్యం అనే ఆవిడకిి అమ్మేశాడు. ఆ శివభాగ్యం వేరే ఎవరో కాదు, రాజాత్తి తల్లే! రెణ్నెళ్లు తిరక్కుండా ఆవిడ ఆ యింటిని తన తదనంతరం తన కూతురికి, మనుమరాలు కనిమొళికి చెందుతుందని సెటిల్‌మెంట్‌ డీడ్‌ చేసేసింది. 1973 నాటి ఇన్‌కమ్‌ టాక్స్‌ రిటర్న్‌లో రాజాత్తి ఆ యిల్లు కొనడానికి 1970లో కపాలి వద్ద రూ.40 వేలు అప్పు చేసినట్లు చూపించింది.  దానికో ప్రామిసరీ నోటు, ఆ డబ్బు ముట్టినట్లుగా దానిపై కపాలి సంతకాలు కూడా వున్నాయి. ఇన్‌కమ్‌ టాక్స్‌ అధికారులు 1976 మార్చిలో దాన్ని స్వాధీనం చేసుకున్నారు. అప్పివ్వడానికి నీకీ 40 వేలు ఎలా వచ్చాయి? అని కపాలిని అడిగితే శివభాగ్యం వద్ద 20 వేలు అప్పు పుచ్చుకున్నాను అని చెప్పాడు. అనగా రాజాత్తి ఇంట్లో వాచ్‌మన్‌ ఆమె తల్లి దగ్గర అప్పు పుచ్చుకుని రాజాత్తికి అప్పు యిచ్చాడన్నమాట!   పైగా కూతురు దగ్గర యిల్లు కొని తల్లికి అమ్మేశాడన్నమాట! బినామీ లావాదేవీలు ఎంత విడ్డూరమైన స్థాయిలో జరిగాయో చెప్పడానికి యిదొక మచ్చుతునక! 

2 జి స్పెక్ట్రమ్‌ స్కామ్‌కూడా యిలాటి విధానాల్లోనే జరిగిందని జయలలిత చెప్పుకొచ్చింది - ''డైనమిక్స్‌ బల్వా అనే ముంబయి రియల్‌ ఎస్టేటు కంపెనీ కొత్తగా నెలకొల్పిన స్వాన్‌ టెలికమ్‌ అనే కంపెనీకి డిఎంకెకు చెందిన కేంద్రమంత్రి రాజా 2 జి స్పెక్ట్రమ్‌ను రూ.1537 కోట్లకు ఎలాట్‌ చేశాడు. వెంటనే డైనమిక్స్‌ బల్వా దాని హోల్డింగ్స్‌లో 45% ను యుఎఇలో వున్న ఎతి సలాత్‌కు రూ.4200 కోట్లకు అమ్మింది.  ఈ లాభం చేకూర్చినందుకు గాను, డైనమిక్‌ బల్వా రాజాకు నాయకుడైన రుణానిధికి పరోక్షంగా 209.25 కోట్లు చెల్లించింది. దానికి గాను ఆ కంపెనీ కంట్రోలు చేసే 11 కంపెనీల నుండి రూ. 25 లక్షల నుండి రూ.100 కోట్లదాకా వివిధ మొత్తాల లావాదేవీల ద్వారా కుసెగాంవ్‌ ఫ్రూట్స్‌ అండ్‌ వెజిటబుల్స్‌ అనే కంపెనీకి 209.25 కోట్లు బదిలీ చేసింది. దానికి సొంతదారులు అసిఫ్‌ బల్వా, రాజీవ్‌ అగర్వాల్‌. అప్పుడు కుసెగాంవ్‌  కంపెనీ రూ.206.25 కోట్లు బల్వాలు, మొరానీకు చెందిన సినీయుగ్‌ ఫిల్మ్‌స్‌ కు బదిలీ చేసింది. సినీయుగ్‌ వారి 2009-10 బాలన్స్‌ షీటులో వాళ్లు రూ.206 కోట్లు కలైంజర్‌ టీవీకి హామీ లేని ఋణం యిచ్చినట్లు చూపించారు. కలైంజర్‌ టీవీలో కరుణానిధి రెండవ భార్య దయాలు, మూడో భార్య ద్వారా కలిగిన కూతురు కనిమొళి 80% వాటాలు కలిగివున్నారు.'' 

ఏది ఏమైనా కరుణానిధి ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని 1976లో తమిళనాడు ప్రజలు నమ్మారు. 1977లో ఎమర్జన్సీ ఎత్తివేశాక  మార్చిలో ఎన్నికలు జరిగాయి. ఎమర్జన్సీని సమర్థించిన ఎమ్జీయార్‌ ఎడిఎంకె, ఇందిరా కాంగ్రెసు, సిపిఐ కలిసి ఒక కూటమిగా, ఎమర్జన్సీని వ్యతిరేకించిన పాత కాంగ్రెసు, డిఎంకె, సిపిఎం మరో కూటమిగా ఏర్పడి తలపడ్డాయి. ఆ ఎన్నికలలో ఇందిరా కాంగ్రెసు ఉత్తరాదిన ఘోరంగా ఓడిపోగా, దక్షిణాదిన ఘనవిజయం సాధించింది. ఆ ప్రభావం తమిళనాడులో కూడా కనబడింది. ఎడిఎంకెకు 17, కాంగ్రెసుకు 14, సిపిఐకు 3 వచ్చి ఆ కూటమికి మొత్తం 34 వచ్చాయి. మరో కూటమిలో పాత కాంగ్రెసుకు 3, డిఎంకెకు 2 వచ్చి చతికిలపడింది. కేంద్రంలో జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇందిర ఘోరంగా పరాజయం పాలై, రాజకీయాల్లో కనుమరుగవుతుందనే భావన కలిగింది. 

ఇందిరతో స్నేహం కొనసాగించి కేంద్రానికి కోపం తెప్పిస్తే కరుణానిధికి పట్టిన గతే తనకూ పడుతుందని భయపడిన ఎమ్జీయార్‌ మూణ్నెళ్ల తర్వాత 1977 జూన్‌లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెసుతో తెగతెంపులు చేసుకుని సిపిఎంతో చేతులు కలిపాడు. ఉత్తరాది పార్టీగా ముద్ర పడిన జనతాతో డిఎంకె తెగతెంపులు చేసుకుంది. సిపిఐ ఒక్కటే కాంగ్రెసును అంటిపెట్టుకుని వుంది. జనతా విడిగా పోటీ చేసింది. ఈ బహుముఖ పోటీలో ఎన్నికల ఫలితాలు పార్టీల బలాబలాలకు సంకేతంగా నిలిచాయి. మొత్తం సీట్లు 234 కాగా ఎడిఎంకె కూటమి 34% ఓట్లతో 144 సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చింది.  దానిలో ఎడిఎంకెకు 130, సిపిఎంకు 12, వాళ్లు బలపరచిన యితరులకు 2 వచ్చాయి. డిఎంకెకు 25% ఓట్లతో 48 సీట్లు వచ్చాయి. కాంగ్రెసు కూటమికి 20% ఓట్లతో 32 సీట్లు వచ్చాయి. జనతాకు 21% ఓట్లతో 10 సీట్లు, వాళ్లు బలపరచిన మరో అభ్యర్థికి 1 సీటు వచ్చాయి. జనతా పార్టీ అంటే పాత కాంగ్రెసు అనే అర్థం చేసుకోవాలి. 

ఈ విధంగా ఎమ్జీయార్‌ 1977లో ముఖ్యమంత్రి అయ్యాడు. ఎమ్జీయార్‌ డిఎంకె పార్టీలో పనిచేసినా ద్రవిడ సిద్ధాంతాలను వంటపట్టించుకోలేదు. నాస్తికత్వం, బ్రాహ్మణవ్యతిరేకత, హిందీ వ్యతిరేకత, బిసిలను కూడగట్టడం, తమిళత్వం గురించి నిరంతర చర్చ, రాష్ట్రాల హక్కుల గురించి పోరాటం - యిలాటివాటి జోలికి పోలేదు. ఎందుకంటే అతను స్వయంగా అగ్రవర్ణుడు (మేనోన్‌్‌), మలయాళీ, ఆస్తికుడు. కరుణానిధి ధోరణిలో మాట్లాడితే తన గురించి ప్రశ్నించడం మొదలుపెడతారు. అతని లక్ష్యం పేదలకు మేలు చేసే సంక్షేమపథకాలు అమలు చేసి, మంచి పేరు తెచ్చుకోవడమొకటే. ముందుచూపుతో దీర్ఘకాలిక పథకాలు చేపట్టడం, రాష్ట్రాన్ని పారిశ్రామికీకరణ చేయడం యిలాటి గమ్యాలు ఏమీ పెట్టుకోలేదు. ప్రణాళికాబద్ధ రంగం నుంచి ప్రజారంజక పథకాలకు నిధులు మళ్లించి, ప్రజల జేజేలు అందుకున్నాడు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నభోజన పథకం, రైతులకు ఋణమాఫీ, వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌, మద్యనిషేధం, యిలా ఎన్నో ఎన్నో స్కీములు. మహిళలు అతనంటే పడి చచ్చేవారు కాబట్టి వాళ్ల కోసం స్పెషల్‌ బస్సులు, ప్రత్యేక రాయితీలు వంటివి ఎన్నో చేశాడు. గ్రామీణులకు ఉచిత హవాయి చెప్పులు, పళ్లపొడి వంటి వినూత్న పథకాలు పెట్టి వారిలో ఆరోగ్యం పట్ల అవగాహన పెంచాడు. అవన్నీ ఎమ్జీయార్‌ తన జేబులోంచి తీసి యిస్తున్నాడంతగా ప్రజలు పొంగిపోయారు. పరిశ్రమలు, మౌలికరంగ అభివృద్ధి జరగకపోతే రేపు ఎలా గడుస్తుందని ఎవరూ ఆలోచించలేదు. ఎమ్జీయార్‌ కొత్త సిద్ధాంతాలేవీ కనిపెట్టలేదు, ఆర్థిక విధానంలో అతనిది లెఫ్ట్‌ అని, రైట్‌ అని ఏమీ చెప్పడానికి లేదు. ఇక పరిపాలనకు వస్తే డిఎంకె నుంచి అనేకమంది వచ్చి అతని పార్టీలో చేరారు. వారికే పదవులిచ్చి మంత్రులుగా చేసుకున్నాడు. పార్టీలో, ప్రభుత్వంలో అందరూ అతనికి విశ్వాసపాత్రంగా వుండాలి. తనకు తెలియకుండా ఏదీ జరగడానికి వీల్లేదు. తను కూర్చోమంటే కూర్చోవాలి, పొమ్మంటే పోవాలి. నమ్మకమైన అధికారులపై ఎక్కువగా ఆధారపడేవాడు. 

అవినీతి విషయంలో - కరుణానిధిని తను అదే విషయంలో తప్పుపట్టాడు కాబట్టి మొదటి టర్మ్‌లో ఎమ్జీయార్‌ అవినీతికి పాల్పడలేదు. అయితే 1980లో కరుణానిధి ఇందిరా గాంధీతో చెప్పి తన ప్రభుత్వాన్ని రద్దు చేయించడంతో మూడేళ్లు కూడా కాకుండానే ఎన్నికలను ఎదుర్కోవలసి వచ్చింది. ఎన్నికలలో విపరీతంగా ఖర్చు పెట్టవలసి వచ్చింది. 1980లో రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అవినీతి మొదలై కరుణానిధితో పోటీ పడ్డాడు. కరుణానిధి ఆ విషయమై ఎంత మొత్తుకున్నా 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు ఎమ్జీయార్‌నే గెలిపించారు. ఎడిఎంకెకు నిధులు సమకూర్చినవారిలో ఎమ్జీయార్‌కు ఆత్మీయులైన కొందరు పారిశ్రామిక వేత్తలున్నారు. వాళ్లు ఏం కోరినా ఎమ్జీయార్‌ చేసేవాడు. అలాటి వారిలో ఒకరి కారణంగానే సినీనటుడు సుమన్‌ అన్యాయంగా  ఏళ్లపాటు జైల్లో కూర్చోవలసి వచ్చింది. ఎందరు వెళ్లి మొత్తుకున్నా, ఎమ్జీయార్‌ వినలేదు. అతను అంతటి కర్కోటక నియంత. మానవ హక్కుల గురించి సినిమాలలో ఉపన్యాసాలు దంచిన ఆ విప్లవనటుడే యితరుల మానవహక్కులు హరించడానికి ఏ మాత్రం వెనకాడలేదు. అందుకే ఎమ్జీయార్‌లో మంచీ, చెడూ రెండూ తీవ్రస్థాయిలో వున్నాయని అంటారు.  (సశేషం)  ఫోటో - ఇందిరా గాంధీ, ఎమ్జీయార్‌

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2015)

[email protected]

Click Here For Archives

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?