Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ :తేజ్‌పాల్‌ కేసు నేర్పే పాఠం -2

ఎమ్బీయస్‌ :తేజ్‌పాల్‌ కేసు నేర్పే పాఠం -2

అతన్ని యిరికించే ప్రయత్నంలో ఆమె కొన్ని పొరబాట్లు చేసిందని కూడా గ్రహించవచ్చు. నవంబరు 7 రాత్రి 11.30 సమయంలో ఆమెతో ఒంటరిగా లిఫ్టులో వెళ్లింది. అతను అసభ్యకరమైన చేష్టలు చేశాడు. మర్నాడు మళ్లీ అతనితోనే లిఫ్టులో ఒంటరిగా వెళ్లడం వింతగా లేదా? ఆ హోటల్‌ బిల్డింగులో వున్నది రెండంతస్తులే. లిఫ్టులో వెళితే 14 సెకన్లే పడుతుంది. మీరు లిఫ్టులో వెళ్లండి సార్‌, నేను మెట్లెక్కి వస్తాననవచ్చు. లేదా ఎవరితోనో సెల్‌ఫోన్లో మాట్లాడుతున్నట్టు నటిస్తూ తర్వాతి సారి వెళ్లవచ్చు. మొదటిరోజు రాత్రే లిఫ్టులోంచి బయటకు వచ్చిన తర్వాత తేజ్‌పాల్‌ తనను హెరాస్‌ చేస్తున్నాడని తన సహోద్యోగులతో చెప్పుకుందామె. అలాటప్పుడు మర్నాడే మళ్లీ ఎలా సాహసించింది? తేజ్‌పాల్‌ తను లిఫ్టులోంచి బయటకు నడుస్తూ వుంటే అతను సడన్‌గా తనను మళ్లీ లిఫ్టులోకి వెనక్కి గుంజాడని చెప్పింది. కెమెరాల్లో చూస్తే అతని చేతిని ఆమె పట్టుకుని బయటకు వెళ్తున్నట్టు వుంది. అతను తనను బలాత్కారం చేశాక లిఫ్టు బయటకు పరిగెట్టుకుంటూ వెళ్లానంది. కెమెరాల్లో చూస్తే ఆమె తాపీగా నడుస్తూ బయటకు వచ్చినట్టుంది. మర్నాడు తేజ్‌పాల్‌ తనను లిఫ్టులోకి లాగాడని చెప్పింది. కానీ కెమెరాల్లో చూస్తే అతను అప్పటికే లిఫ్టులో వున్నాడు. ఈమె పరిగెట్టుకుంటూ దానిలోకి వెళుతోంది. ఆమె నవంబరులో సోమా చౌధురికి పంపిన ఫిర్యాదుకి, పది రోజులు పోయాక మేజిస్ట్రేటు ముందు రికార్డు చేసిన వాంగ్మూలానికి తేడాలున్నాయి. ఈ తేడాలు ఎత్తి చూపితే ప్రాసిక్యూషన్‌ వారు 'ఒక రేప్‌ బాధితురాలికి కలిగే మానసిక ఆందోళనలో యిలాటి తొట్రుపాట్లు సహజమే' అనేశారు. అవతలి వ్యక్తికి పదేళ్ల జైలు శిక్ష పడుతూంటే ఎంత జాగ్రత్తగా ఫిర్యాదు చేయాలి!

ఇంతకీ తేజ్‌పాల్‌ తనపై చేసిన అత్యాచారం గురించి ఆమె మాటల్లో -' లిఫ్టులో అతను ముద్దులు పెట్టుకున్నాడు. నేను వద్దన్నా వినలేదు. ఆ తర్వాత అతను మోకాళ్ల మీద కూర్చుని, నా స్కర్టు ఎత్తిపట్టుకుని అండర్‌వేర్‌ కిందకు లాగాడు. నా మర్మాంగాన్ని ముద్దాడబోయాడు. నేను వద్దువద్దని చెప్పాను. అప్పుడు అతను తన వేళ్లను దానిలోకి జొనపబోయాడు. నేను ఆపమని చెపుతూ అతన్ని వెనక్కి తోసేశాను.' ఇదంతా చేస్తూ వుంటే లిఫ్టు తలుపులు తెరుచుకోవా అన్న సందేహం వస్తుంది. తెరుచుకోకుండా లిఫ్టును 0,1,2 ఫ్లోర్ల మధ్య తిరిగేట్లా అతను చేశాట్ట. 'క్లోజ్‌' బటన్‌పై వేలు నొక్కి పెట్టి వుంచితేనే అది సాధ్యం. నిమిషన్నరం పాటు అలా తిరిగినట్లు సాక్ష్యం వుంది. అలా తిరగడానికి యీమె క్లోజ్‌ బటన్‌ను నొక్కి పెట్టి వుంచి సహకరించి వుండాలి. 'అబ్బే అతనే ఒక చేతితో బటన్లు నొక్కుతూన్నాడు' అంటోంది ఈమె. వద్దని పెనగులాడుతున్న స్త్రీ లాంగ్‌ స్కర్టు ఎత్తి అండర్‌వేర్‌ కిందకు లాగి ముద్దాడాలన్నా, వేలు పెట్టాలన్నా రెండు చేతులు కావాల్సిందే. అనేక చేతులున్న రావణాసురుడికి తప్ప మరెవరికీ యిలాటి పని అసాధ్యం. అంటే ఆ లిఫ్టు బటన్‌ యీమెయే ఒత్తి పట్టుకుని వుండవచ్చని తోస్తుంది. ఆమె యిచ్చిన తొలి రాతపూర్వకమైన ఫిర్యాదులో 'అతను నా అండర్‌వేర్‌ లాగి కింద పడేశాడు. లిఫ్టు ఆగగానే దాన్ని చేతిలోకి తీసుకుని బయటపడ్డాను.' అని రాసింది. ఆ సమయంలో ఆమె చేతిలో అండర్‌వేర్‌ కాదు కదా, ఏమీ లేనట్టు కెమెరా ఫుటేజి చూపింది. అది చూశాక ఆమె వాంగ్మూలం మార్చింది. 'ఐ పిక్‌డ్‌ అప్‌ అండర్‌వేర్‌' స్థానంలో 'ఐ పుల్‌డ్‌ అప్‌ (పైకి లాక్కున్నాను) అండర్‌వేర్‌' అని రాసింది. అయినా నిలబడిన ఒక స్త్రీ అండర్‌వేర్‌ను ఆమె సహకారం లేనిదే కాళ్లనుండి పూర్తిగా తొలగించి కింద పడేయడం సాధ్యమా?

తేజ్‌పాల్‌ చెప్తున్నదాని ప్రకారం - 7 వ తారీకు రాత్రి వాళ్లిద్దరూ సెకండ్‌ ఫ్లోర్‌ నుండి గ్రౌండ్‌ ఫ్లోర్‌కు వెళ్లాక కాస్సేపు బయటకు వెళ్లి, మళ్లీ లిఫ్టు ఎక్కేలోపున వాళ్లిద్దరి మధ్య సరససంభాషణ జరిగింది. దాని పర్యవసానంగానే అతను ఆమెకు 'ఫింగర్‌టిప్స్‌..' అంటూ ఎస్సెమ్మెస్‌ పంపాడు. ఆమె దాన్ని తన కొలీగ్స్‌కు చూపించి తేజ్‌పాల్‌ తనతో చేసినదానికి రుజువుగా చెప్పింది. ఇంత జరిగినా మర్నాడు అంటే 8 వ తారీకు రాత్రి అతనితో కలిసి లిఫ్టు ఎక్కింది. అతను ఎవరితోనో మాట్లాడుతూ వుంటే అతని కోసం వెయిట్‌ చేసి, మరీ లిఫ్టు ఎక్కింది. ఆ రోజు జరిగిన దాని గురించి ఆమె - 'అతను నన్ను మళ్లీ ముద్దాడసాగాడు. నా డ్రెస్సు పైకి ఎత్తాడు. నాకు కోపం వచ్చింది. నేను మెట్లమీదుగా వెళతాను అన్నాను. అంతలో లిఫ్టు ఆగింది. నేను బయటకు నడిచాను.' అంది. కెమెరాల ఫుటేజి చూసినా చిరాకు మొహంతో ఆమె లిఫ్టులోంచి బయటకు రావడం, వెనక్కాల అతను నెమ్మదిగా రావడం కనబడుతోంది. అంతలోనే లిఫ్టులోకి వెళ్లాడు. ఆమె లిఫ్టులోకి పరిగెట్టుకుంటూ వెళ్లింది. ఎందుకో ఆమే చెప్పాలి (అలక తీర్చడానికా?) అలా వెళ్లాక 'నేను కోపంగా వున్నానని గ్రహించి అతను నన్ను ముట్టుకోవడానికి భయపడ్డాడు. సరిగ్గా గ్రౌండ్‌ ఫ్లోర్‌లో లిఫ్టు ఆగే సమయానికి నా పిఱ్ఱలమీద చరిచాడు.' అని తన ఫిర్యాదులో రాసింది. కానీ కెమెరా ఫుటేజి ప్రకారం వాళ్లిద్దరూ ఆ లిఫ్టులో ఒకరికొకరు ఐదడుగుల దూరంలో నిలబడినట్లు స్పష్టంగా కనబడింది. ఇద్దరి మొహం మీద ప్రతిఫలించిన అశాంతిని కెమెరాలు బంధించాయి.

మొత్తం వ్యవహారం చూస్తే వాళ్లిద్దరి మధ్య మొదటిరోజు సరసం జరిగినా, మర్నాటికి విరసంగా మారిందని బోధపడుతుంది. ఆమె ఎందుకోగాని పగబట్టి కథ మార్చేస్తోంది. చట్టం చూడబోతే మగవాడికి పూర్తిగా వ్యతిరేకంగా వుంది. ''ఔట్‌లుక్‌''లో యీ వ్యాసం వచ్చాక మను జోసెఫ్‌పై మహిళా సంఘాలు విరుచుకుపడ్డాయి. అతనితో బాటు యిటువంటి కథనమే వేసిన ''ద సిటిజన్‌'' అనే ఆన్‌లైన్‌ పత్రికపై కూడా. 'నెట్‌వర్క్‌ ఆఫ్‌ విమెన్‌ ఇన్‌ మీడియా' అనే సంస్థ యీ జర్నలిస్టులపై ప్రెస్‌ కౌన్సిల్‌కు, ఎడిటర్స్‌ గిల్డ్‌కు ఫిర్యాదు చేసింది. ఆ రెండు పత్రికలు క్షమాపణ చెప్పాలని వారి డిమాండు.  తేజ్‌పాల్‌ యితరత్రా ఏమైనా అకృత్యాలు చేసి వుండవచ్చు, ఆర్థికనేరాలు చేసి వుండవచ్చు. కానీ యీ కేసులో వాస్తవం ఏమిటో బయటకు రావాలి కదా. చట్టం యింత కఠోరంగా వున్నపుడు నేరం జరిగిందని నిస్సందేహంగా రుజువు కావాలి. ప్రాసిక్యూషన్‌ వాదంలో లోపాలు వుండకూడదు. దాన్ని ప్రశ్నించినందుకు యీ జర్నలిస్టులపై నిందలు వేస్తున్నారు. ఈ చర్చలు తీవ్రంగా, లోతుగా జరిగితే  దురుద్దేశంతో నిందలు వేసిన సందర్భాల్లో చట్టంలో మగవారికి కూడా కొన్ని రక్షణలు కల్పించాలని కొందరికి తోస్తుందేమో! ఈ కథ వలన నీతి ఏమిటంటే - సరసాలాడే సరదా మగవారు తగ్గించుకుంటే మంచిది. ఏ క్షణంలో అది విరసంగా మారి జైలుకి దారి తీస్తుందో తెలియదు కాబట్టి! - (సమాప్తం)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఏప్రిల్‌ 2014)

[email protected]

Click Here For Part-1

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?