Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : తేజ్‌పాల్‌ కేసు నేర్పే పాఠం -1

ఎమ్బీయస్‌ : తేజ్‌పాల్‌ కేసు నేర్పే పాఠం -1

గోవాలో ఓ హోటల్‌ లిఫ్టులో తన కూతురు వయసున్న సహోద్యోగినితో సరసమాడబోయి తెహల్కా సంపాదకుడు తేజ్‌పాల్‌ చిక్కుల్లో పడ్డాడని అందరికీ తెలుసు. ''ఆమెకిష్టమే అనే అభిప్రాయంతో శృంగారచేష్టలు చేశాను. అది పొరబాటు కాబట్టి ఆరునెలల పాటు నా బాధ్యతల నుండి తప్పుకుంటున్నాను.'' అని తేజ్‌పాల్‌ స్వయంగా తెహల్కా మేనేజింగ్‌ ఎడిటర్‌ సోమా చౌధురికి ఈమెయిల్‌ పంపి వ్యవహారం అంతటితో ముగించాననుకున్నాడు. కానీ బాధితురాలైన యువజర్నలిస్టు అంతటితో వదిలిపెట్టలేదు. చివరకు రేప్‌ చేశాడంటూ పోలీసులు 2013 నవంబరులో తేజ్‌పాల్‌ను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఇప్పటిదాకా బెయిల్‌ కూడా దొరకలేదు. అతనిపై కేసు పెట్టడానికి పోలీసులకు ఉపయోగపడినది - క్రిమినల్‌ లా ఎమెండ్‌మెంట్‌, 2013! గత ఏప్రిల్‌ నుండే అమలులోకి వచ్చిన యీ చట్టంలోని ఏడు సెక్షన్ల కింద పోలీసులు కేసు పెట్టారు. వీటి ప్రకారం నిందితుడికి గరిష్టంగా పదేళ్ల శిక్ష పడవచ్చని తెలిశాక, యీ చట్టం యింత కఠినంగా, యింత ఏకపక్షంగా వుందా? అని అందరూ వులిక్కిపడ్డారు. ఎందుకంటే రేప్‌ అంటే మనందరం అనుకునే సామాన్యార్థం ఒకటుంది. స్త్రీ మర్మాంగంలో ఆమె కిష్టం లేకుండా పురుషుడు తన అంగాన్ని ప్రవేశపెట్టి కొద్దిసేపు కదలికలు సాగితేనే రేప్‌ అని అనుకుంటాం. ఆ రోజు ఆ లిఫ్టులో ఒకటిన్నర నిమిషాల్లో తేజ్‌పాల్‌ అంత దూరం పోలేదని అందరికీ తెలుసు. ఎక్కడో ఒత్తడమో, గిల్లడమో జరిగి వుంటుంది, దానికి ఆ అమ్మాయి అభ్యంతర పెట్టి వుంటుంది అని వూహిస్తాం. ఆ మాత్రానికి పదేళ్ల జైలు శిక్షా? ఇదెక్కడి చట్టంరా బాబూ అని విస్తుపోతాం. 

పాఠకులకు కలిగే యీ సందేహాలను నివృత్తి చేయడానికి ''ఔట్‌లుక్‌'' వారపత్రిక తన మార్చి 3 వ సంచికలో అనూరాధా రామన్‌ రాసిన కథనాన్ని ప్రచురించింది. కొత్త చట్టం ప్రకారం స్త్రీకి తన శరీరంపై సర్వహక్కులు వుంటాయి. దానిలో ఏ భాగంలో నైనా సరే, (మర్మాంగమే కానక్కరలేదు) ఎవరైనా తమ పురుషాంగం చేతకానీ, మరే అంగం చేతకానీ,  లేక వస్తువు చేతకానీ ఆమె అనుమతి లేకుండా ఆక్రమిస్తే (ఇన్వేజన్‌) దాన్ని రేప్‌గా పరిగణించాలి. దానికి జరిమానాతో బాటు ఏడేళ్ల శిక్ష (యావజ్జీవిత శిక్ష వేసేందుకు కూడా అవకాశం యిచ్చింది చట్టం). 'సెక్సువల్‌ హెరాస్‌మెంట్‌' కు మూడేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ పడతాయి. దాని నిర్వచనం ఏమిటంటే - మగవాడు ఆమెను స్పృశించినా, స్పృశించకుండా ఆమె నుండి సెక్సువల్‌ ఫేవర్‌ (లైంగిక అంగీకారం)కోసం ఒత్తిడి చేసినా, చొరవ తీసుకున్నా అది లైంగికపరమైన వేధింపేట! ఒత్తిడి చేశాడ, చొరవ తీసుకున్నాడా, కేవలం అడిగి చూశాడా - అన్నది తేల్చవలసినది అక్కడున్న మహిళ మాత్రమే. 'అబ్బే, ఆమె అప్పుడు ఒప్పుకుంది. తర్వాత మాట మార్చింది.' అని మగవాడు వాదిస్తే ఏం జరుగుతుంది? 'అతను చెప్పినది నాకు అర్థం కాలేదు' అనో 'దాని పరిణామాలు నేను వూహించలేదు' అనో ఆమె అందంటే యితని వాదన ఒప్పుకోరు. అంతేకాదు, అప్పుడు నేను తాగి వున్నాను అనో లేదా నన్ను చంపుతాననో, కొడతాననో బెదిరించి నా అనుమతి పొందాడు అనో ఆమె అంటే యితని వాదన చెల్లదు, శిక్ష తప్పదు. పదవిలో లేదా అధికారంలో వున్న వ్యక్తి తన కంటె తక్కువ హోదా (జూనియర్‌)లో వున్న మహిళతో పరస్పరాంగీకారంతో శృంగారంలో పాల్గొంటే - తమ పదవి వుపయోగించి అనుభవించినట్టుగా భావించి దాన్ని 'పవర్‌ రేప్‌' అన్నారు. దీనికి పదేళ్ల శిక్ష పడుతుంది. 

దీనికి సమాధానంగా అన్నట్టు ''ఔట్‌లుక్‌'' సరిగ్గా నెల్లాళ్లు పోయాక తన ఏప్రిల్‌ 7 సంచికలో మను జోసెఫ్‌ అనే జర్నలిస్టు రాసిన ''వాట్‌ ద ఎలివేటర్‌ సా'' అనే వ్యాసం ప్రచురించింది. తేజ్‌పాల్‌ వ్యవహారంలో జరిగినదేమిటో వాళ్లిద్దరికే తెలుసు. ఒక హోటల్‌ లిఫ్టులో రాత్రి 11.30 సమయంలో తామిద్దరే వున్నపుడు తనను (చట్టంలోని నిర్వచనం రీత్యా) 'రేప్‌' చేశాడని ఆమె అభియోగం. లిఫ్టులో సిసి కెమెరాలు వుంటే జరిగినదానికి సాక్ష్యం వుండేది. కానీ అక్కడ కెమెరాలు లేవు. లిఫ్టులు ఆగే లాబీల్లో వున్నాయి. లిఫ్టులోకి వెళ్లేటప్పుడు, లిఫ్టునుండి వచ్చేటప్పుడు మనుష్యుల హావభావాలు రికార్డయ్యాయి. వాటిని బట్టి లోపల ఏం జరిగిందో కొంత వూహించవచ్చు. ఆ కెమెరాల ఫుటేజి తనను నిర్దోషిగా చూపుతుందని తేజ్‌పాల్‌ ఆశ. కానీ ప్రాసిక్యూషన్‌వారు దాన్ని బయటపెట్టటం లేదు. ఈ జర్నలిస్టు వాటిని చూసి వున్నట్టున్నాడు. చూసినట్టుగా రాస్తే కోర్టు వారు దండిస్తారని కాబోలు, అది స్పష్టంగా రాయకుండానే వాటిలో వున్న విషయాలన్నీ రాశాడు. ఆ ఫోటోలు పత్రికలో వేయకుండా వాటి ఆధారంగా రేఖాచిత్రాలు వేశారు. 5 పేజీల ఆ సుదీర్ఘ వ్యాసం చదివితే నాకు అనిపించిందేమిటంటే - 'ఆమె తేజ్‌పాల్‌కు కాస్త 'లిఫ్ట్‌' యిచ్చింది, అతను వెకిలి చేష్టలు చేశాడు, ఆమెకు కోపం వచ్చింది, జరిగినదాన్ని ఆమె ఎక్కువ చేసి యాగీ చేస్తోంది' అని. (సశేషం)

 - ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఏప్రిల్‌ 2014)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?