Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : తెలంగాణ మెడకు రాయి - రాయల తెలంగాణ - 5

రాయల తెలంగాణ అనే ఆలోచనను కెసియార్‌ వ్యతిరేకించడం సహజం. తన బలాన్ని ఎదుటివాళ్లు దెబ్బ కొడుతూ వుంటే చూస్తూ కూర్చోరు కదా. అలా చేయకపోతే తెలంగాణ రాదు సుమా అంటే ఏమంటారో చూడాలి. లింకేమిటి అంటే పార్లమెంటులో బిల్లు పాస్‌ అవాలంటే అసెంబ్లీలో ఏకాభిప్రాయ తీర్మానం  టెక్నికల్‌గా అక్కరలేదు కానీ మోరల్‌గా కావాలి. అసెంబ్లీ వద్దుకాక వద్దు అని పాస్‌ చేసిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే అనేక ప్రశ్నలు వస్తాయి. రాష్ట్రపతి కూడా గుడ్డిగా సంతకం పెట్టలేరు. అందువలన అసెంబ్లీలో మెజారిటీ సంపాదించేందుకు చూస్తున్నారు. దానికోసం రాయలసీమ వాళ్లను కలుపుకుంటున్నారు. రాయల తెలంగాణ అయితే బిల్లు ఆల్మోస్ట్‌ పాసయిపోతుందని కాంగ్రెసు ధీమా. అప్పుడు పార్లమెంటులో బిల్లుకు దారి సుగమం అవుతుంది. కానీ పార్లమెంటు సభ్యులు కూడా అనేక ప్రశ్నలు వేస్తారు - ఎవరూ అడగని రాయల తెలంగాణ ఎందుకు యిస్తున్నారు? అని. 'బయటకు చెప్పకపోయినా మా దగ్గర చెపుతూ వచ్చార'ని మంత్రుల ముఠా అంటారు.

మన తెలుగువాళ్లకు రాయల.. ఐడియా చాలా ఔట్‌రేజియస్‌గా వుంది కానీ కాంగ్రెసు అధిష్టానం మెదడులో యిది ఎప్పటినుండో మెదలుతూనే వుంది. అసలు యీ సూచన మజ్లిస్‌ నుండి వచ్చింది. ఫన్నీగా వుంది అనుకున్నాను. కానీ జస్టిస్‌ శ్రీకృష్ణ అలా అనుకోలేదు. దాన్ని కూడా ఆరిటిలో ఒక ఆప్షన్‌గా తీసుకుని చర్చించారు. ఎందుకంటే పైనున్న కాంగ్రెసు వాళ్లకూ అది నచ్చింది కాబట్టి! ఆ తర్వాత అందరం మర్చిపోయాం కానీ మధ్యమధ్యలో ఫీలర్లు వదులుతూనే వచ్చారు. జులై 30 తర్వాత కూడా దాని గురించి దిగ్విజయ్‌ మాట్లాడారు. ఆ ఫైలు క్లోజ్‌ చేయలేదన్నట్టు చెప్పారు. మంత్రుల ముఠా వద్దకు మొర వినిపించుకోవడానికి వెళ్లిన కాంగ్రెసు నాయకుల వద్ద, అఖిలపక్షం సందర్భంగా వెళ్లిన యితర పార్టీ నాయకుల వద్ద 'నువ్వు చెప్పినది సరే కానీ, రాయల తెలంగాణ గురించి నీ అభిప్రాయం ఏమిటి?' అని అడుగుతూ వచ్చారు. దాని గురించి ఏమీ ఆలోచించని మనవాళ్లు తెల్లమొహం వేసి, 'అదెందుకు?' అనేసి వచ్చేశారు. అధిష్టానం మెదళ్లలో ఆ రాయల-టి పురుగు దొలుస్తూనే వుంది. దాని గురించి సైలెంటుగా వర్క్‌ చేస్తూనే వున్నారు. ఇప్పుడు బయటపెడుతున్నారు. ఈవాళ్టి ఆంధ్రజ్యోతి ఆ ప్రతిపాదనపై పునరాలోచించే అవకాశం వుందని రాసింది.

అంతిమంగా ఏమవుతుందో తెలియదు కానీ, అంత సులభంగా వెనక్కి తీసుకునే మాటయితే అలా ప్రతిపాదించి, భంగపడేదే కాదు. రాయల తెలంగాణ ఎందుకు అవసరమో వాళ్లు ఏ జైరాం రమేషో యిప్పటికే పెద్ద నోట్‌ తయారు చేసి వుంటారు.

దీనివలన రేసులోంచి కర్నూలు తప్పుకుంటుంది కాబట్టి ఆంధ్ర రాజధాని సమస్య తీరుతుంది అన్నది వాళ్లు చెప్పే ఓ పాయింటు. అది పోయినా వైజాగ్‌, విజయవాడ, ఒంగోలు, గుంటూరు మధ్య పోటీలు తప్పవు కదా! అన్ని ప్రాంతాలకూ అనువుగా రాష్ట్రం మధ్యలో రాజధాని వుండాలి కాబట్టి... అంటూ యిన్నాళ్లూ విజయవాడ.. ఒంగోలు మధ్య వూళ్లవాళ్లు వాదిస్తూ వచ్చారు. మొన్న బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఆ పాయింటు కొట్టి పారేశారు. ఏ రాష్ట్రానికి రాజధాని మధ్యలో వుంది చెప్పండి -  బొంబాయా? కలకత్తాయా? మద్రాసా? అంటూ లిస్టు చదివారు. నిజమేననిపించింది. ఇలా ఆలోచిస్తే శ్రీకాకుళం వాళ్లూ, తిరుపతివాళ్లూ కూడా 'మేమూ వున్నాం లిస్టులో' అంటూ బయలుదేరవచ్చు. రాజధాని ఎక్కడ పెట్టాలో తేల్చడానికి నిపుణుల కమిటీ వేస్తామని మంత్రుల ముఠా అంటోంది. రాజధానికై భారీ ప్యాకేజీ కూడా యిస్తామని చెప్తున్నారు. అసలు రాజధాని ఎక్కడో తెలిస్తే అక్కడి భూమి సేకరణకు ఎంతవుతుందో తెలుస్తుంది, అప్పుడు ప్యాకేజీ ఎంత యివ్వాలో తేలుతుంది. దానిలో ఎంత విదిలిస్తారో ఏమో రాబోయే ప్రభుత్వం చూసుకోవాలి. వీళ్లకు ఏ బాధ్యతా లేదు. ఇలాటి హామీని నమ్ముకుని సీమాంధ్రులు విభజనకు ఒప్పుకోవాలిట! వహ్వా!!

నీటి సమస్యకు యిది పరిష్కారం అని అంటున్నారు కానీ, కడప, చిత్తూరుల సమస్య తీరదు. కెసియార్‌ ధోరణి చూశాం కదా. రాయలసీమలో ఏ జిల్లాకు నీరు వదిలినా ప్రతిఘటించేట్లు వున్నారు. పోలవరాన్ని కట్టనిచ్చేట్టు లేరు. అన్నదమ్ముల్లా విడిపోదాం అంటూనే యిలాటి బెదిరింపులు వస్తూ వుంటే విభజనకు ఎందుకు ఒప్పుకుంటారు? ఒప్పుకుంటారు - అసెంబ్లీని సగానికి చీలిస్తే అని ఢిల్లీ హై కమాండ్‌ అంచనా. జగన్‌ దేశమంతా తిరిగి యితర పార్టీ నాయకులను కలిసి కేంద్రానికి అపరిమిత అధికారాలు యిచ్చేస్తున్నారు, చూసుకోండి అని అడలగొట్టి వచ్చాడు. 371 (డి), ఉమ్మడి రాజధాని యిలా అనేక అడ్డంకులు వున్నా రాజ్యాంగ సవరణకు అందర్నీ ఒప్పించడం పోయి, ఏదో ఒక దొడ్డిదారి వెతికి పని కానిచ్చేద్దామని చూస్తోంది అని వాళ్లను సెన్సిటైజ్‌ చేసి వచ్చాడు. తెలంగాణ మాట ఎలా వున్నా, యిలా అడ్డదార్లు అనుమతిస్తే రేపు బిజెపి ఆర్టికల్‌ 370 ను కూడా సింపుల్‌ మెజారిటీతో మార్చేసి కశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తి వూడగొట్టేస్తుందని భయపడసాగారు వాళ్లు. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం రాకపోతే పార్లమెంటులో బిల్లు అడ్డుకుందామని అనుకుంటున్నారేమోనన్న భయం వేసి విఎచ్‌ జగన్‌ వెళ్లిన చోటికి వెళ్లి అబ్బెబ్బే జగన్‌ మాటలు వినకండి అని చెప్పివచ్చారు.

అసెంబ్లీలో బిల్లును ఓడించి తీరతామని ప్రతిన బట్టిన కిరణ్‌ను అదుపు చేయలేక హై కమాండ్‌, అసెంబ్లీలో మెజారిటీ తయారు చేయడానికై కాంగ్రెసు రాయల తెలంగాణ తెచ్చిందని జాతీయ ఛానెళ్లు చెపుతున్నాయి. కావచ్చు. కానీ ఆ ప్రకటన సరిగ్గా విఎచ్‌ బస్సు యాత్ర మొదలుపెట్టిన టైముకే వెలువడింది. తెలంగాణ యిచ్చిన సోనియాను దేవతగా కీర్తిస్తూ తెలంగాణ అంతా ప్రచారం చేయండి, పొండి అని దిగ్విజయ్‌ సింగ్‌ టి-కాంగ్రెసు నాయకులను తోస్తున్నారు. వాళ్లు ఒకటి రెండు మీటింగులు జరిపి కాళ్లు జాపేశారు. వీళ్లతో కాదు, చూడండి నా తడాఖా అంటూ విఎచ్‌ బస్సేసుకుని బయలుదేరారు. సరిగ్గా రాయల తెలంగాణ గొడవ వచ్చింది. వెళ్లి సోనియా ఏమైనా చెప్పబోతే 'అంత మంచిదైతే తెలంగాణ యివ్వాలి కానీ రాయల తెలంగాణ ఫిటింగ్‌ పెట్టిందేం?' అని జనాలు అడుగుతారు. ఈయన దగ్గర సమాధానం ఏముంది?

ఈ రాయల తెలంగాణ ప్రతిపాదన వేరే ఎవరి దగ్గర్నుంచి వచ్చినా ఎలా వుండేదో కానీ, మజ్లిస్‌ నుండి రావడంతో అందరికీ మంటగా వుంది. మజ్లిస్‌ తన రాజకీయప్రయోజనాల కోసం చెపితే, దాన్ని గులాం నబీ ఆజాద్‌ పట్టుకుని వేళ్లాడి సోనియాకు చెప్పి ఒప్పించారు. మైనారిటీలు కాంగ్రెసుకు ఓటేస్తారని,  తెలంగాణలో రాబోయే ప్రభుత్వానికి మజ్లిస్‌ మద్దతు అవసరం కాబట్టి దీనికి ఒప్పుకోండి అని ఆజాద్‌ చెప్పి వుంటారు. సీమాంధ్ర మంత్రులు సమైక్యం.. పదేళ్ల యూటీ.. ఐదేళ్ల యూటీ.. పోనీ మూడేళ్ల యూటీ.. అంటూ ఎన్ని మెట్లు దిగినా, మజ్లిస్‌ యూటీకి ససేమిరా అంది కాబట్టి ఆ ఆలోచనను కొట్టి పారేశారు. అంతా మజ్లిస్‌ చెప్పినట్టే సాగుతోంది. తెలంగాణ ఏర్పడితే బిజెపి బలపడుతుంది కాబట్టి అది కౌంటర్‌ చేయడానికి మజ్లిస్‌ను దువ్వాలనే ఐడియాతో అది చెప్పినట్లా ఆడితే మిగతా పార్టీలకు ఎలా వుంటుందో కాంగ్రెసు ఆలోచిస్తోందా? గతంలో మజ్లిస్‌ వాళ్లు ప్రభుత్వోద్యోగులను పట్టుకుని తన్నినా వైయస్‌ అదుపు చేయలేదు. కిరణ్‌ వచ్చాకనే వాళ్లకు ముకుతాడు పడింది. ఇప్పుడు విభజన తర్వాత శాంతిభద్రతలు కేంద్రం చేతిలో వుండబోతున్నాయి. మజ్లిస్‌ వాళ్లు మళ్లీ హైదరాబాదులో వాళ్ల ఆగడాలు మొదలెడితే, వాళ్లను తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఏమీ చేయజాలదు. వెళ్లి కేంద్రానికి చెప్పుకోవాలి. అది మజ్లిస్‌ మద్దతుపై ఆధారపడిన ప్రభుత్వమైతే ఏ చర్యా వుండదు. (సశేషం)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2013)

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?