Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : తృణమూల్‌ చీలుతుందా..?

ఎమ్బీయస్‌ : తృణమూల్‌ చీలుతుందా..?

ఫిబ్రవరిలో బెంగాల్‌లో ఒక అసెంబ్లీ స్థానానికి, ఒక పార్లమెంటు స్థానానికి జరిగిన ఉపయెన్నికలలో తృణమూల్‌ గెలిచింది. తృణమూల్‌ శారదా స్కామ్‌లో పీకలదాకా యిరుక్కున్నా, సిపిఎం నిర్జీవంగా పడి వున్నా ఫలితం యిలా రావడంతో అక్కడ ఎదుగుదామని చూస్తున్న బిజెపి కంగు తిని, ముకుల్‌ రాయ్‌ ద్వారా తృణమూల్‌ను చీల్చే ప్రయత్నం చేస్తోందని వార్తలు వస్తున్నాయి. ముకుల్‌ రాయ్‌ 24 పరగణా జిల్లాకు చెందిన కాంగ్రెసు నాయకుడు. మమతా బెనర్జీ లాగే ప్రియరంజన్‌ దాస్‌మున్షీకి అనుచరుడు. మమతా 1984లో సిపిఎం దిగ్గజం సోమనాథ్‌ చటర్జీని ఓడించాక, ఆమె శక్తిని గుర్తించి ఆమెకు అనుచరుడిగా మారాడు. 1998లో తృణమూల్‌ పార్టీని స్థాపించమని ప్రోత్సహించాడు. వ్యవస్థాపక జనరల్‌ సెక్రటరీగా రిజిస్ట్రేషన్‌ సమయంలో సంతకం పెట్టాడు. ఎన్నికల కమిషన్‌నుండి పార్టీ గుర్తు ఆమోదింప చేసుకున్నాడు. 2000 సం||రంలో అందరూ ఆమెను విడిచి వెళ్లినా అతను వెంటనంటి వున్నాడు. అప్పట్లో విద్యావంతులకు, మేధావులకు మమతా అంటే గౌరవం వుండేది కాదు. నందిగ్రామ్‌, సింగూర్‌ ఘర్షణ సమయంలో ముకుల్‌ ఎంతో కష్టపడి మీడియా ద్వారా ఆమె యిమేజిని మారుస్తూ వారికి ఆమోదయోగ్యురాలిగా చేశాడు. మమత అతనిపై చాలా ఆధారపడింది. అజిత్‌ పాంజా, సుబ్రత ముఖర్జీలను తప్పించి అతన్నే నెంబర్‌ టూగా చేసుకుంది. తన పార్టీ తరఫున యుపిఏలో రైల్వే మంత్రిగా వున్న దినేష్‌ త్రివేదిని తప్పించినపుడు, ముకుల్‌ అతని స్థానంలో పంపించింది. మనమోహన్‌, ప్రణబ్‌ అభ్యంతరం చెప్పినా ఖాతరు చేయలేదు. ఇలాటి ముకుల్‌ యిప్పుడు శారదా స్కామ్‌ కారణంగా దూరమయ్యాడు.

శారదా అధిపతి సుదీప్త సేన్‌ను తను ఎప్పుడూ కలవలేదని మమతా బుకాయిస్తూ వచ్చింది. కానీ ఆమె పార్టీ మాజీ ఎంపీ కునాళ్‌ ఘోష్‌ జైల్లోంచి సిబిఐకు రాసిన తన ఉత్తరంలో మమత, ముకుల్‌ కలింపాంగ్‌లో సమావేశమయ్యారని తెలియపరిచాడు. సిబిఐ ముకుల్‌ని పిలిచి నిజమేనా అని అడిగింది. అతను నిజమని ఒప్పుకున్నాడన్న వార్త మమతను మండించింది. ముకుల్‌ కలకత్తా తిరిగి రాగానే పిలిపించి నా పరువు తీశావని తిట్టింది. తప్పంతా నీదే అని ఒప్పుకో, నన్ను ముంచకు అందిట. పార్టీ ఆదేశాల ప్రకారమే నడుచుకున్నందుకు నాకు దక్కుతున్న మర్యాద యిదా? అని ముకుల్‌ వాదించాడట. సిబిఐతో జరిగిన తర్వాతి సమావేశంలో తన పార్టీలో ఎవరెవరు ఎంతెంత తీసుకున్నారో చెప్పేశాడట. వారిలో మమత మేనల్లుడు, పార్టీ ఎంపి అభిషేక్‌ బెనర్జీ పేరు కూడా వుందిట. 'మాకు చెప్పినట్లు వాళ్లకు తెలియపరచవద్దు. వాళ్లు జాగ్రత్త పడి ఆధారాలు నాశనం చేస్తారు' అందిట సిబిఐ. 'సిబిఐతో ఏం చెప్పావో నాకు చెప్పు' అని మమత అడిగినా ముకుల్‌ నోరు విప్పలేదు. 

అతను సిబిఐ ఎప్రూవర్‌గా మారి తనను చిక్కుల్లోకి నెడతాడని మమత భయపడి, అతను ఏం చెప్పినా తనపై కక్షతో చెప్పాడన్న భావం రావడానికై పార్టీలో అతని పరువు తీయాలనుకుంది. అతను వ్యవస్థాపక సెక్రటరీ కాబట్టి అతన్ని తీయలేదు, అందుకని అతనితో సమాన హోదా కల్పిస్తూ జనరల్‌ సెక్రటరీ పదవి సృష్టించి దాన్ని సుబ్రత బక్షికి యిచ్చింది. ముకుల్‌ కొడుకు శుభ్రాంశును పార్టీ యువవిభాగపు ఉపాధ్యక్ష పదవి నుండి తప్పించింది. ఈ పార్టీలో భవిష్యత్తు లేదని ముకుల్‌కు అర్థమైంది. పార్టీ ఫిరాయించి బిజెపిలో చేరితే తృణమూల్‌ కార్యకర్తలు హర్షించరు. అందుకని తనదే అసలైన తృణమూల్‌ అనో, మమత నియంతృత్వం నుండి పార్టీని రక్షించవలసిన అవసరం వచ్చిందనో, మరో వాదనతోనో ముకుల్‌ రాయ్‌ పార్టీని చీల్చవచ్చని, ఎన్నికల సమయంలో బిజెపితో పొత్తు పెట్టుకుని మమతను ఓడించవచ్చని వూహాగానాలు సాగుతున్నాయి.

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2015)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?