Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: ట్రంప్‌కు ఎందుకింత పాప్యులారిటీ?

ఎమ్బీయస్‌: ట్రంప్‌కు ఎందుకింత పాప్యులారిటీ?

భారతీయులను, ముఖ్యంగా తెలుగువారిని అడిగితే అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌ నెగ్గకూడదనే అంటాడు. నెగ్గడనే ఆశిస్తారు. నెగ్గే అవకాశాలు హిల్లరీకే ఎక్కువగా వున్నాయని మన మీడియా రాస్తే సంతోషంగా వింటారు, నమ్ముతారు. అనేక దేశాల్లో ఎన్నికలు జరుగుతూంటాయి. అవేమీ పట్టించుకోం. కానీ అమెరికాపై మనకు ప్రత్యేక ఆసక్తి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలలో అనేక ధనిక, మధ్యతరగతి కుటుంబాల నుంచి ఒకరో, యిద్దరో అమెరికాతో సంబంధాలు వున్నవారే. చదువుకో, ఉద్యోగానికో అమెరికా వెళ్లడమో, ఆన్‌సైట్‌ పనిపై వెళ్లడమో, యిక్కడే వుండి అమెరికన్‌ కంపెనీల్లో పని చేయడమో జరుగుతోంది. అక్కణ్నుంచి యిక్కడకు డబ్బు పంపితే యిక్కడ ఆస్తులు కొనడమూ జరుగుతోంది. మధ్యతరగతి ఎన్నారై (విదేశం అంటే బై డిఫాల్ట్‌ అమెరికానే అవుతోంది, దిగువ తరగతి ఎన్నారై అంటే గల్ఫ్‌ అవుతోంది)ల కోసం యిక్కడ రియల్‌ ఎస్టేటు వెంచర్స్‌ తయారవుతున్నాయి, వారి పిల్లల కోసం కాలేజీలు తయారవుతున్నాయి. వారి పెట్టుబడుల నాశించి టీవీ ఛానెల్స్‌ వెలుస్తున్నాయి. ఇక్కడ సమాజసేవా కార్యక్రమాలకు, సాంస్కృతిక కార్యక్రమాలకు యింధనం, ధనం ఆమెరికా నుంచి వస్తోంది. 

మనల్ని రానిచ్చే అభ్యర్థి నెగ్గాలి: అమెరికా పరిస్థితి అటూయిటూ అయితే దాని ప్రభావం యిక్కడా తీవ్రంగానే వుంటుంది. అందువలన మనం బాగుండాలంటే అమెరికా బాగుండాలి అనుకునేవారే ఎక్కువ. అమెరికా బాగుంటే సరిపోదు, మనను అక్కడకి రానివ్వాలి, మన సేవలు వుపయోగించుకోవాలి, మనకు డబ్బులివ్వాలి కూడా. లేకపోతే వాళ్ల కెంత డబ్బున్నా మనకేం లాభం? అందుకని వీసా నిబంధనల గురించి పట్టుబట్టకుండా మనం ధారాళంగా వచ్చిపోయేందుకు వీలు కలిగించే అమెరికన్‌ ప్రభుత్వం మనకు కావాలి. అంతేకాదు, మనం అక్కడకు వెళ్లి రూల్సు అతిక్రమిస్తాం. దొంగ రెస్యూమేలు యిస్తాం, చదువుకోసమే వచ్చాను, ఉద్యోగాలు చేయనని రాసిచ్చి కూడా దొంగతనంగా ఉద్యోగాలు చేస్తాం. దాని వలన స్థానికులకు ఉద్యోగాలు రాకపోతే అది వాళ్ల కర్మ. అవి చూసీచూడనట్లు  ఊరుకునే ప్రభుత్వం వుండాలి - ఇవీ మన కోరికలు. మనకు యిలాటి హామీలు యిచ్చే అధ్యక్ష అభ్యర్థి గెలవాలని మనం కోరుకుంటాం. డెమోక్రాటిక్‌ పార్టీ అయితే మన కనుగుణంగా వుంటుందని నమ్మకం కాబట్టి హిల్లరీ గెలవాలనుకుంటాం. ట్రంప్‌ ఒక జోకరుగా, ఒక విలన్‌గా, ఒక ఉన్మాదిగా తోస్తాడు. కానీ తాజాగా సిఎన్‌ఎన్‌ నిర్వహించిన సర్వేలో ట్రంప్‌కు 48% ఓట్లు రాగా హిల్లరీకి 45% మాత్రమే వచ్చాయి. ఎందుకు?

నిరుద్యోగం, తక్కువ జీతాలు: సాధారణ అమెరికన్ల దృక్కోణం నుంచి ఆలోచిస్తే ట్రంప్‌ వాళ్లకు ఆత్మీయుడిగా అనిపిస్తాడు. ఎందుకంటే ఎన్నో ఏళ్లగా వాళ్లకు ఉద్యోగాలు తగ్గిపోతూ వస్తున్నాయి. జీతాలు పెరగటం లేదు. ఖర్చు తగ్గించుకోవడానికి ఔట్‌సోర్సింగ్‌ పేరుతో అమెరికాలోని పెద్ద కంపెనీలన్నీ - ట్రంప్‌ కంపెనీతో సహా - తక్కువ జీతాలకు యితర దేశస్తుల సేవలను వినియోగించుకుంటున్నారు. ఇతర దేశాల్లో తమ శాఖలను తెరిచి చాలా భాగం పని అక్కడే చేయిస్తున్నారు. అమెరికాలో అయితే స్థానికులకు జీతాలు ఎక్కువ యివ్వాలి. అంతకంటె చాలా తక్కువ జీతానికి, అంతకంటె ఎక్కువ విద్యావంతులైన, నిపుణులైన విదేశీయులు దొరుకుతున్నారు. ఇలా సంపాదించిన డబ్బుపై అమెరికన్‌ కంపెనీలు పన్నులు కట్టి ప్రభుత్వానికి ధనం చేకూరుస్తున్నారు. దానిలోంచే అమెరికన్‌ నిరుద్యోగులకు భృతి అందుతోంది. కానీ సగటు అమెరికన్‌కు కావలసినది ఉద్యోగం, యిలాటి బిచ్చం కాదు. తమ కంపెనీలు తమను కాదని వేరే దేశస్తులను పోషించడం వారిని రగిలిస్తోంది. 1973 నుంచి వారి అసలైన జీతాలు పెరగలేదన్న విషయాన్ని రిపబ్లికన్‌ పార్టీకి చెందిన ట్రంప్‌యే కాదు, డెమోక్రాటిక్‌ పార్టీ తరఫు అభ్యర్థిత్వానికి హిల్లరీతో పోటీపడిన సోషలిస్టు భావాల బెర్నీ శాండర్స్‌ కూడా ఎత్తి చూపాడు. కానీ దాన్ని ఎలా ఎదుర్కోవాలన్నదానిలోనే యిద్దరివి వేర్వేరు మార్గాలు. పట్టణాలకు చెందిన మధ్యతరగతి ప్రజలు, అమెరికా పౌరసత్వం వున్న యితర జాతీయులు, యూనియన్లు శాండర్స్‌ను సమర్థిస్తూండగా, ట్రంప్‌ చెప్తున్న మొరటు విధానాలను గ్రామీణ ప్రాంతాల్లో వున్న తెల్లజాతి వారు మెచ్చుకుంటున్నారు. లౌక్యం, మొహమాటం, యితర వర్గాలు, ప్రపంచ దేశాలు ఏమనుకుంటాయోనన్న నదురు, బెదురు లేకుండా తమ తరఫున మాట్లాడే ట్రంప్‌ అంటే వారికి అభిమానం వెల్లువెత్తుతోంది. 

శ్వేతజాతి వారి ఆక్రోశం: ఆఫ్రో-అమెరికన్లను తెల్లజాతివారు కొన్ని వందల యేళ్ల క్రితం బానిసలుగా తీసుకుని వచ్చారు. వారిని నీచంగా చూస్తూ అణగదొక్కారు. జాతి వివక్షత పాటించారు. కొన్నాళ్లకు అది తప్పని గ్రహించి సమానహక్కులు యివ్వసాగారు. ఇవ్వడంతో సరిపెట్టలేదు, గతంలో చేసిన అత్యాచారాలకు ప్రాయశ్చిత్తంగా అన్నట్లు వారికై విపరీతంగా సంక్షేమ పథకాలు అమలు చేయసాగారు. వాటికోసం పన్నులు పెంచారు. 'పూర్వతరాలు చేసిన పాపాలకు మా తరం మూల్యం చెల్లించడమేమిటి? ఇంత చేసినా నల్లజాతివారు పౌరహక్కులకోసం యింకా పోరాడుతున్నారేమిటి?' అని ఈ తరం తెల్లజాతి యువకులు ప్రశ్నిస్తున్నారు. వారి ఆలోచనలకు అనుగుణంగా రిచర్డ్‌ నిక్సన్‌ 1968లో ''సదరన్‌ స్ట్రాటజీ'' అని ప్రతిపాదించాడు. వలస వచ్చినవారు, నల్లజాతివారు హక్కుల కోసం చేసే పోరాటాలను పట్టించుకోనక్కరలేదని, పట్టించుకుంటే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని అతని వాదన. అందువలన సంక్షేమ పథకాలు తగ్గించి, పన్నులు కూడా ఆ మేరకు తగ్గించాలని అతని ఆలోచన. కానీ యితర జాతుల వారి ఓట్లు పోతాయన్న బెదురుతో యివేవీ సక్రమంగా అమలు చేయలేకపోయారు. 1990ల నుంచి రిపబ్లికన్‌ పార్టీ అభిమానుల్లో యీ ఆలోచన బలపడుతూ వచ్చింది. ఇటీవలి కాలంలో అమెరికన్లకు తక్కువ జీతాలకు పనిచేసి తమ పొట్ట కొట్టే మెక్సికో వలస కార్మికుల పట్ల అసూయ పెరిగింది. సక్రమంగా, అక్రమంగా వలస వచ్చేవారి వలన స్థానికుల ఉద్యోగాలు హరించిపోతున్నాయని, వారు నిరుద్యోగులుగా మారి ప్రభుత్వం యిచ్చే నిరుద్యోగభృతిపై ఆధారపడుతున్నారని ట్రంప్‌ ఎత్తి చూపుతున్నాడు. వలస వచ్చినవారు ఉన్నతోద్యోగాలు సంపాదించుకుని ఆర్థికంగా బలపడుతున్నారు. ఒక పక్క వారికి హెచ్చు జీతాలు చెల్లిస్తూ, మరో పక్క తన పౌరులకు యిచ్చే నిరుద్యోగ భృతి పెరుగుతూ రెండు విధాలా అమెరికా ఖజానా తరిగిపోతోందని అతని వాదన. తను అధికారంలోకి వస్తే వీసా విధానాలను కఠినతరం చేసి, ఔట్‌సోర్సింగును కనీసస్థాయికి తెచ్చి, అమెరికన్లకు మళ్లీ పని కల్పిస్తానని హామీ యిస్తున్నాడు. దానికి సంబంధించిన నినాదమే 'మేక్‌ అమెరికా వర్క్‌ ఎగైన్‌'. 

 రైల్వే కంపార్టుమెంటాలిటీ: ఆఫ్రో-అమెరికన్లు, లాటిన్‌ దేశాల నుంచి వచ్చినవారి పరిస్థితి ఒబామా అధికారంలోకి వచ్చిన నాటి కంటె మరింత దిగజారిందని, దానికి కారణం ఆ కాలంలో అక్రమ వలసలు విపరీతంగా జరిగి, నిరుద్యోగం పెరిగి, వేతనాలు తగ్గాయని అతనంటున్నాడు. ఈ విధమైన వాదనతో సక్రమంగా వలస వచ్చి పౌరసత్వం సంపాదించుకున్నవారిని ఆకట్టుకుంటున్నాడు. రైల్వే కంపార్టుమెంటాలిటీ అనే ధోరణి ఒకటుంది. జనరల్‌ బోగీలోకి ఎక్కబోయేవాణ్ని లోపలున్నవాళ్లు చోటు లేదు, వేరే బోగీ వెతుక్కో అంటూ అడ్డుకుంటారు. కానీ అతను ఎలాగోలా ఎక్కేశాడనుకోండి. తర్వాతి స్టేషన్లో ఎక్కబోయేవాణ్ని అడ్డుకునేవారిలో అతనే ప్రథముడిగా వుంటాడు. 'నేను వచ్చేశాను, యింకెవ్వరూ - నా వాళ్లయినా సరే - రాకూడదు' అనుకుంటాడు. మొన్న బ్రెగ్జిట్‌లో చాలా మంది తెలుగువాళ్లు 'లీవ్‌'కు అనుకూలంగా ఓటేశారట. 'మనం తక్కువ జీతాలకు పని చేస్తూ ఏదో అవస్థ పడుతున్నాం. సిరియా నుంచి వలస జనం వచ్చిపడి మన కంటె తక్కువ జీతానికి సిద్ధపడి మనకు ఎసరు పెడుతున్నారు. టర్కీ నుంచి కూడా వస్తే మరీ ప్రమాదం.' అనుకున్నారు వాళ్లు. ఇవాళ యూరోప్‌ వలసదారులను పంపేస్తున్నట్లే, రేపు తెల్లవారు కానివాళ్లందరూ దేశం విడిచి పోవాలంటూ మనల్ని కూడా పంపేస్తారేమో అనే భయం లేదు వారికి. అదే విధంగా అమెరికాలో స్థిరపడిన హిస్పానిక్స్‌ (దక్షిణ అమెరికా దేశస్తులు) ట్రంప్‌ను సమర్థించినా సమర్థించవచ్చు. 

ముస్లిములంటే భయం: ఇస్లాము తీవ్రవాదం పట్ల భయం పౌరులందరినీ చుట్టుముట్టింది. దానికి తగ్గట్టుగానే యూరోప్‌లో కూడా ఇస్లాము తీవ్రవాదుల దాడులు యీ మధ్య మరీ పెరిగాయి. దేశంలో శాంతిభద్రతల విషయంలో ఒబామా ఘోరంగా విఫలమయ్యాడని, టెర్రరిజాన్ని ఉత్పత్తి చేసే దేశాల నుంచి వలస వచ్చేవారిని ఆపలేక పోయాడని, వారు మన దేశంలోనే మన ఉప్పు తింటూనే మనకు ముప్పుగా మారారని నిర్దాక్షిణ్యంగా వారిని తరిమికొట్టకపోతే మనకు మనుగడే వుండదని ట్రంప్‌ చేస్తున్న వాదన ఆకట్టుకుంటోంది. ఒర్లాండో ఘటనను తన కనుగుణంగా మార్చుకుని ఎల్‌జిబిటిలను విదేశీ సిద్ధాంతాలతో ప్రభావితమైన తీవ్రవాదుల దాడి నుంచి రక్షిస్తానని మాట యిచ్చాడు. నిజానికి రిపబ్లికన్లలో అత్యధికులు ఎల్‌జిబిటిలకు వ్యతిరేకులు. ఆ మాట ట్రంప్‌ చెప్పటం లేదు. తను అధికారంలోకి వస్తే టెర్రరిజం పట్ల కఠినంగా వ్యవహరించని దేశాల నుంచి వచ్చే వ్యక్తులను దేశంలోకి అనుమతించబోనని చెప్తూ 'అమెరికా సేఫ్‌ ఎగైన్‌' అనే నినాదం కూడా యిచ్చాడు. తమలో కొందరు తీవ్రవాద చర్యలు చేపడుతున్నారని తెలిసినా స్థానిక ముస్లిములు పోలీసులకు ముందస్తు సమాచారం యివ్వటం లేదని, ఆ విధంగా వారు దేశద్రోహులని ట్రంప్‌ ఆరోపించాడు. అది నిజం కాదని, వాళ్లిచ్చిన సమాచారంతో ఎన్నో నేరాలు అరికడుతున్నామని ఎఫ్‌బిఐ ప్రకటించింది. ''వాళ్ల మతం పేరుతో జరిగే హింసను కాని, వాళ్ల మతస్తుడు చేసే హింసను కాని వాళ్లు సహించరు. ఎఫ్‌బిఐ సమర్థవంతంగా పనిచేయడానికి వాళ్లిచ్చే సహకారమే కారణం'' అని చెప్పింది. కోర్టు రికార్డులు కూడా యిదే విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. ముస్లిం-అమెరికన్లపై అధ్యయనం చేసిన నార్త్‌ కరోలినా యూనివర్శిటీ ప్రొఫెసర్‌ కూడా దీన్ని సమర్థించాడు. ''వారితో జరిగిన గ్రూపు డిస్కషన్స్‌లో వాళ్లు ఒక అంశం ప్రస్తావించారు - 'మేం హింసను ఆపుదామని, కుట్రను భగ్నం చేద్దామని చూస్తున్నాం. కానీ కొన్ని సందర్భాల్లో పోలీసులు కుట్రను జరగనిచ్చి, అరెస్టు చేద్దామని చూస్తున్నారు. మేం వారిని నమ్మినట్లుగా వాళ్లు మమ్మల్ని నమ్మటం లేదు.' అని వాపోయారు.'' ట్రంప్‌ అధికారంలోకి వస్తే పోలీసుల్లో యీ ధోరణి మరింత పెరగవచ్చేమో! 

చర్చికి, తుపాకీకి రెండింటికీ ఆప్తుడే: ఇస్లాం వ్యతిరేకతతో బాటు క్రైస్తవ మతవాదులను ట్రంప్‌ మచ్చిక చేసుకుంటున్నాడు. అబార్షన్లను, స్వలింగ సంపర్కులకు వ్యతిరేకించడం ద్వారా వారికి చేరువవుతున్నాడు. తను అధికారంలోకి వస్తే ఎవాంజలిస్టులతో సహకరిస్తానని చెప్తున్నాడు. ఎవాంజలిస్టులు ట్రంప్‌ను చూసి మొదట్లో బెదిరారు కానీ, పోనుపోను అతని పద్ధతులను ఆమోదించారు. అయితే వారిలో అనుయాయుల్లో హిస్పానిక్స్‌ కూడా వున్నారు. అందుకని వారితో ట్రంప్‌కు ఒక రహస్య సమావేశం ఏర్పాటు చేసి యిద్దరి మధ్య సయోధ్య కుదిరేట్లు చేశారు. ఇక తుపాకుల విషయానికి వస్తే -  నిజానికి రిపబ్లికన్లందరినీ ఒక్క తాటిపై తెచ్చిన ఘనత తుపాకీలకే చెందుతుంది. విదేశాల నుంచి దిగుమతి అవుతున్న ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ప్రతి వారూ ఆయుధం ధరించడమొకటే శరణ్యమని, దాన్ని పౌరుడి హక్కుగా పరిగణించాలని వాళ్లు భావిస్తున్నారు. రిపబ్లికన్‌ సమావేశానికి హాజరైన నేషనల్‌ రైఫిల్స్‌ అసోసియేషన్‌ నాయకుడు క్రిస్‌ కాక్స్‌ ''అమెరికాలో అత్యంత ప్రాచీనమైన ప్రజాహక్కుల సంస్థ మాదే. స్త్రీలు తమను తాము రక్షించుకునే ఏకైక సాధనం. ఇటీవలి కాలంలో తుపాకీలు కొనేవర్గంలో మహిళలదే ప్రథమస్థానం.'' అని ప్రకటించాడు. ఎటొచ్చీ తెల్లవాళ్లకే ఆ హక్కులు అనకుండా జాతి, వర్ణ వివక్షత లేకుండా అమెరికాలో వున్న ప్రతి పౌరుడికి ఆ హక్కు వుందన్నాడు. ట్రంప్‌, అతని పిల్లలు తమ సంస్థలో సభ్యులని, హిల్లరీ క్లింటన్‌ అధికారంలోకి వస్తే యీ హక్కు హరించుకుపోతుందని, దాన్ని మళ్లీ తెచ్చుకోవడానికి దశాబ్దాలు పట్టవచ్చని, అందువలన మీ ఓటు రాబోయే నాలుగేళ్లను కాదు, నలభై ఏళ్లను ప్రభావితం చేస్తుందని ప్రసంగించి రిపబ్లికన్లను ఒప్పించాడు. అమెరికాలో గన్‌ లాబీ చాలా పలుకుబడి, డబ్బు గలదని అందరికీ తెలుసు. 

విదేశీ వ్యవహారాలు: అమెరికన్ల కష్టార్జితాన్ని, దేశవ్యతిరేక శక్తులకు డెమోక్రాట్లు ధారపోస్తున్నారని ట్రంప్‌ ఆరోపిస్తూ ''అణు ఒప్పందం పేరుతో ఇరాన్‌కు 150 బిలియన్‌ డాలర్లు అప్పనంగా యిచ్చేశారు'' అన్నాడు. నిజానికి అది అమెరికా ప్రభుత్వం యిచ్చినదేమీ కాదు, అమెరికన్‌ బ్యాంకుల్లో వున్న ఇరాన్‌ ఖాతాలను యిన్నాళ్లూ స్తంభింపచేసి యిప్పుడు విడుదల చేశారంతే. అది కూడా 50-60 బిలియన్లకు మించి వుండదంటున్నారు పరిశీలకులు. 1993 నాటి ఇరాక్‌ యుద్ధాన్ని నిరసిస్తున్న ట్రంప్‌ యిప్పుడు మాత్రం సిరియాలోని ఐసిస్‌, ఇరాక్‌లపై బాంబులు వేసి తుడిచి పెట్టి (బాంబ్‌ ద హెల్‌ ఔట్‌ ఆఫ్‌...) పారేయాలంటాడు. అంతేకాదు, సౌదీ అరేబియా, నాటో దేశాలు మన ఔదార్యాన్ని బలహీనతగా భావించాయని, యివ్వాల్సిన డబ్బు యివ్వటం లేదని వాదించాడు. గ్లోబలైజేషన్‌ పేరుతో చైనా వంటి దేశాలు వస్తువులతో, ఇండియా వంటి దేశాలు సేవలతో అమెరికాను ముంచెత్తి దాని ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చి, ప్రపంచంలో దాని స్థాయి దిగజార్చాయని, తను గెలిస్తే యిటువంటివి అరికట్టి అమెరికాను మళ్లీ అగ్రరాజ్యంగా నిలుపుతానని అంటున్నాడు. 'మేక్‌ అమెరికా ఫస్ట్‌ ఎగైన్‌', 'మేక్‌ అమెరికా వన్‌ ఎగైన్‌' నినాదాలు యీ కోవకే చెందుతాయి. ''1994 నాటి ఫ్రీ ట్రేడ్‌ ఎగ్రిమెంటు నుంచి యిప్పటి ట్రాన్స్‌-పసిఫిక్‌ పార్ట్‌నర్‌షిప్‌ వరకు అన్ని ఒప్పందాల్లో అమెరికా నష్టపోయింది. నాకు అధికారం యిస్తే యివన్నీ రద్దు చేస్తా. నా నినాదం గ్లోబలిజం కాదు, అమెరికనిజం! అమెరికా ప్రయోజనాలే నాకు ముఖ్యం. 'అమెరికా ఫస్ట్‌' అనేదే నా ఫిలాసఫీ. డిఫెన్సు ఒప్పందాలన్నిటినీ తిరగరాయిస్తా, వాణిజ్య లోటులో వున్న మన ఆర్థిక వ్యవస్థను మార్చి మన నుంచే ఎగుమతులు ఎక్కువ వెళ్లేట్లు చేస్తా. ఇక ముందు చేయబోయే ఒప్పందాల గురించి చెప్పాలంటే మన వర్కర్లకు నష్టం కలిగించే లేదా మన స్వాతంత్య్రం హరించే, ఏ ఒప్పందంపై సంతకం పెట్టనని మాట యిస్తున్నాను. కొన్ని దేశాలు కూటమిగా ఏర్పడి మనతో గీచిగీచి బేరాలాడి మనల్ని నష్టపరచాయి. ఇకపై నేను ప్రతి దేశంతో విడివిడిగా ఒప్పందాలు చేసుకుంటా.'' అంటున్నాడు ట్రంప్‌.

 'ఆడు మగాడ్రా, బుజ్జీ' : ట్రంప్‌ తనను తాను ఒక రాజకీయవేత్తగా చూపించుకోలేదు. ఎప్పుడూ సెనేట్‌ సభ్యుడిగా కూడా లేని అతను రాజకీయ పరిజ్ఞానం చాటుకోలేదు. ఒక వ్యాపారవేత్తగా రెండు పార్టీలకూ విరాళాలు అందిస్తూ వచ్చాడు. ఆ విషయాన్ని గొప్పగా చెప్పుకున్నాడు కూడా. ''నేనొక విజయాన్ని కైవసం చేసుకున్న వ్యాపారస్తుణ్ని. తెలివితో, కష్టపడి పైకి వచ్చాను. హౌసింగ్‌ సంక్షోభం వచ్చినపుడు చౌకగా యిళ్లు కొనేసి బాగుపడ్డాను. ఒక సంకటంలోంచి ప్రయోజనం ఎలా పొందాలో చేసి చూపించాను. నాలాగే అందరు అమెరికన్లు ఎదగాలని కోరుకుంటున్నాను.'' అని నిర్భయంగా చెప్తున్నాడు. 'నేను దమ్మున్నవాడిని, జంకూగొంకు లేనివాణ్ని' అని చెప్పుకోవడం వలన సగటు పౌరుడిలో అతనిపై ఆరాధన పెరుగుతోంది. 'ఆడు మగాడ్రా, బుజ్జీ' అనే డైలాగులో ఎంత పవరుందో చూడండి. 'నేను మన్‌మోహన్‌ సింగ్‌లా పిరికివాణ్ని కాను, 56 యించిల ఛాతీ కలవాణ్ని, పాకిస్తాన్‌, చైనాలకు బుద్ధి చెప్పగల మొనగాణ్ని' అని మోదీ చెప్పిన డైలాగులు ఎంతమంది భారతీయుల ఛాతీ ఉప్పొంగేట్లు చేశాయో గమనించండి. తర్వాత ఏం చేయగలిగినా, చేయలేకపోయినా ఎన్నికల ప్రచారంలో యివి గొప్ప టానిక్‌లా పనిచేస్తాయి. 'తక్కిన దేశాలవాళ్లందరూ మనల్ని లోకువ కట్టారు, వాళ్లకు మన సత్తా చూపించాలి, తన్ని తగిలేయాలి' అని కోరుకునే వాళ్లకు ట్రంప్‌ హీరోగా ఎందుకు కనిపించడు? అది మేచో యిమేజికి మూడు పెళ్లిళ్లు చేసుకున్న విషయం కూడా కలిసి వచ్చింది. హిల్లరీ గురించి 'భర్తనే తృప్తి పరచలేకపోయినామె దేశాన్నేం తృప్తి పరుస్తుంది?' అంటూ సెక్సిస్టు రిమార్కు చేశాడు. ట్రంప్‌కు 'మగసిరి' వుందని నొక్కి వక్కాణించినవారిలో అతనికి సహచరుడిగా ఉపాధ్యక్ష పదవికి నిలబడుతున్న మైక్‌ పెన్స్‌ ఒకడు. తనను తాను ''క్రిస్టియన్‌గా, కన్సర్వేటివ్‌గా, రిపబ్లికన్‌గా - ఆ వరుసలో'' వర్ణించుకున్న అతను ట్రంప్‌గురించి మాట్లాడుతూ 'అతనిది లార్జ్‌ పర్శనాలిటీ, కలర్‌ఫుల్‌ స్టయిల్‌, ఆకట్టుకునే కరిజ్మా. వాటిన్నిటిని బాలన్స్‌ చేయడానికి కాబోలు అవేమీ లేని నన్ను ఎంచుకున్నాడు'' అన్నాడు. మైక్‌ అంటే రిపబ్లికన్‌ కన్సర్వేటివ్స్‌లో చాలా మందికి యిష్టం. వాళ్లకు, ట్రంప్‌కు మధ్య యితను వారధిగా వుంటాడని అనుకుంటున్నారు. 

పైన చెప్పిన విషయాలను నొక్కి చెప్పడానికి కొన్ని వివరాలు యిస్తున్నాను. వీటివలన సగటు అమెరికన్‌ వ్యథ, మార్పు కోసం అతను ఎదురుచూస్తున్న కారణం అవగతమౌతాయి. 

అసమానతల అమెరికా: అమెరికన్‌ ఎకానమీ ఎటువంటి స్థితికి వచ్చిందంటే దేశజనాభాలో 1% మంది వద్ద 40% సంపద వుంది. సంపదలోని 7%ను అట్టడుగున వున్న 80% మంది పంచుకోవలసి వస్తోంది. సాధారణ పనివాడు నెలంతా కష్టపడితే వచ్చేది ఒక కంపెనీ సిఇఓ గంటలో సంపాదిస్తున్నాడు. మధ్యతరగతి వద్ద వున్న సంపద కంటె వెయ్యి రెట్లు టాప్‌ 10% ధనికుల వద్ద వుంది. ఆ 10% వద్ద వున్న సంపద కంటె వెయ్యి రెట్లు వారిలో 1% వద్ద వుంది. గ్లోబలైజేషన్‌, ఫ్రీ ట్రేడ్‌తో బాగు పడినది ఆ వర్గాలే. లక్షలాది ఉద్యోగాలను ఔట్‌సోర్సు చేసి, విదేశాల్లో తమ ఆఫీసులు తెరిచి, పనంతా అక్కడే చేయిస్తూ, ఉదారమైన వీసా విధానాల ద్వారా అనేకమందిని ఆన్‌-సైట్‌ తెప్పించుకుంటూ, ఒకప్పటి అమెరికన్‌ పారిశ్రామిక నగరాలను మరుభూములుగా మార్చి వీరు మరింతగా సంపాదించారు. ఆర్థిక సంక్షోభం నుంచి తేరుకున్నాక అంటే 2009 నుంచి వచ్చిన ఆర్థిక లాభాల్లో 95% యీ 1% కే దక్కాయని రాబర్ట్‌ రీచ్‌ అనే అనే అతను 2013లో డాక్యుమెంటు చేసి చూపాడు. 

వేతనవ్యత్యాసాలతో కృంగిన పనివాళ్లు: అమెరికాలోని వేతనవ్యత్యాసాల గురించి 2015 జనవరిలో చేసిన అధ్యయనంలోని గణాంకాలు కాస్త ఓపిగ్గా పరిశీలిస్తే అమెరికా లోని సాధారణ ప్రజలు ఎందుకు కుతకుతలాడుతున్నారో అర్థమవుతుంది. అమెరికన్‌ ఆర్థిక వ్యవస్థ గత కొన్ని దశాబ్దాలుగా ఎంతో ఆదాయం గడించినా, జీతాలపై ఆధారపడిన అనేక వర్గాల వారికి (జనాభాలో వీరు 60% వుంటారు)  నాలుగు దశాబ్దాలుగా అసలైన జీతాలు (అంటే ద్రవ్యోల్బణాన్ని లెక్కలోకి తీసుకున్న సవరించిన అంకె) పెరగలేదు. అప్పట్లో 50 డాలర్లు వస్తే యీ రోజు 80 వస్తే 30 పెరిగింది కదా అనకూడదు. ఆ 50 డాలర్లకు అప్పుడు కొనుక్కోగల వస్తువుల (కొనుగోలు శక్తి) కంటె యిప్పుడు 80 డాలర్లతో కొనగలిగేవి తక్కువ అని గుర్తించాలి. 1979ని బేస్‌గా తీసుకుని చూస్తే 2007లో యీ 60% కుటుంబాల సరాసరి సంవత్సరాదాయం తక్కినవారితో సమానంగా పెరిగి వుంటే 94,310 డాలర్లు వుండాలి కానీ దానికంటె 23% తక్కువగా 76,443 డాలర్లు మాత్రమే వుంది. ఆర్థిక సంక్షోభం తర్వాత 2007 తర్వాత తక్కినవారికి కూడా జీతాలు తగ్గాయి, వ్యత్యాసం తగ్గింది కానీ 2011 నాటికి కూడా రావలసినదాని కంటె 16% తక్కువే వచ్చింది. 1973 కంటె 30 ఏళ్ల క్రితం ఉత్పాదకవృద్ధి (ప్రొడక్టవిటీ గ్రోత్‌) 97% పెరిగితే వాళ్ల జీతాలు కూడా 91% పెరిగాయి. కానీ 1973-2013 మధ్య ఉత్పాదకత 74% పెరిగితే ఒక సాధారణ పనివాడి జీతం 9% మాత్రమే పెరిగింది. ఉత్పత్తి పెరగడం వలన వచ్చిన లాభం ఎవరికి వెళ్లింది అంటే ఉన్నత స్థానాల్లో వున్నవారికి వెళ్లింది. 1979 నుంచి కార్పోరేట్‌ సంస్థల్లో పనిచేసే వారిలో టాప్‌ పొజిషన్‌లో వున్నవారి జీతాలు 138% పెరిగాయి. కింది స్థాయి జీతగాళ్ల జీతాలు 15% పెరిగాయి. 1979లో కూడా వారి జీతాల్లో వ్యత్యాసం వుండేది. ఆ వ్యత్యాసాన్ని అలాగే మేన్‌టేన్‌ చేసి వుంటే కింది వాళ్ల జీతాలు 32% పెరిగి వుండాల్సింది. కానీ దానిలో సగమే పెరిగాయి. 

  అభివృద్ధిని స్వాహా చేసిన సిఇఓలు: ఇక మధ్యతరగతి పనివారు అంటే మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 50% మంది సగటు సంపాదన కంటె ఎక్కువ సంపాదించేవారు అన్నమాట. వారి సంగతి చూస్తే 1979-2013 మధ్య వారి దాదాపు జీతాలు స్తంభించాయి. కరక్టుగా చెప్పాలంటే ఏడాదికి 0.2% చొప్పున యిన్నేళ్లలో 6% పెరగాయి. కాలేజీ చదువు చదివినవారిలో కూడా జీతాలు పెరగలేదు. నిజానికి వారి జీతాలు 2000 నుండి తగ్గిపోతూ వచ్చాయి. చదువుపై పెట్టాల్సిన ఖర్చు పెరుగుతోంది. చదివినా సరైన జీతం రావటం లేదు. జీతం పెరక్కపోయినా యజమాని యిచ్చే హెల్త్‌ యిన్సూరెన్సు సౌకర్యం వుంటుంది కదా అనుకుంటే అదీ ఘనంగా లేదు. 1989లో 61% మందికి వుండే ఆ సౌకర్యం 2012 వచ్చేసరికి 31% మందికే వచ్చింది. హైస్కూలు చదువు చదివినవారిలో అయితే యిది 24% నుంచి 7%కి పడిపోయింది. ఇదే సందర్భంలో అమెరికన్‌ పబ్లిక్‌ సెక్టార్‌లో వున్న అతి పెద్ద సంస్థల్లో 350 వాటిలో సిఇఓల జీతాలు ఎలా పెరిగాయో చూదాం. 1965లో ఒక మామూలు (టిపికల్‌) పనివాడు సంపాదించే దాని కంటె సిఇఓ 20 రెట్లు ఎక్కువ సంపాదించేవాడు. 2013 వచ్చేసరికి యిది 300 రెట్లయింది. కార్పోరేట్‌ సంపాదించిన లాభాల కంటె వీరి జీతంలో పెరుగుదల రెట్టింపు వుంది. 

1% వారు ఎటు వుంటారు?: సోషలిస్టు అయిన బెర్నీ శాండర్స్‌ యీ వ్యత్యాసాల్నే మాటిమాటికీ ఎత్తిచూపుతూ ఆర్థిక సంస్కరణలు తెచ్చి, 1% సూపర్‌ రిచ్‌ వారికిి ముకుతాడు వేస్తానంటున్నాడు. ట్రంప్‌ స్వయంగా వ్యాపారవేత్త కాబట్టి అలాటివాటి జోలికి పోడని ఆ 1% వారి నమ్మకం. అందువలన వారూ అతన్ని సమర్థించి నిధులు అందించవచ్చు. ఔట్‌సోర్సింగ్‌పై ఆధారపడిన ఐటీ పరిశ్రమ ట్రంప్‌ విధానాలను ఆమోదించదని అందరూ అనుకున్నారు. గూగుల్‌ సిఇఓ సుందర్‌ పిచాయి ట్రంప్‌కు వ్యతిరేకంగా బహిరంగ ప్రకటన చేశాడు. అయితే పేపాల్‌ వ్యవస్థాపకుల్లో ఒకడు, సిలికాన్‌ వ్యాలీలో టెక్‌ మొఘల్‌ అనదగిన పీటర్‌ థియెల్‌ ట్రంప్‌కు మద్దతు తెలిపాడు. ''నా చిన్నపుడు అపోలోతో ఒక అమెరికన్‌ను చంద్రుడిపైకి పంపించాం. ఈ పాటికి సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెంది, యింకో అమెరికన్‌ను కుజగ్రహంపై పంపవలసిన వాళ్లం. కానీ పోయిపోయి మధ్యఆసియాపై దాడుల గొడవల్లో యిరుక్కుపోయాం. సాంకేతికంగా మనకున్న ఆధిక్యత పోగొట్టుకుని, యితర దేశాల కంటె వెనకపడ్డాం. మనకు కావలసినది అంతర్జాతీయ వ్యవహారాల్లో తలదూర్చడం కాదు, అమెరికాపై ప్రగతిపై దృష్టిని కేంద్రీకరించడం. ఆ విషయంలో ట్రంప్‌ది సరైన దృక్పథం.'' అని మాట్లాడాడు.

అయినవారిలో ఆకుల్లో, కానివారికి కంచంలో: ప్రారంభదశలో జార్జి వాషింగ్టన్‌ వంటి వారు స్థానికంగా ఉద్యోగాలు సృష్టించడానికి రోడ్లు వేసి, వంతెనలు కట్టి దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించారు. పోనుపోను అమెరికా ప్రభుత్వంపై ప్రైవేటు కంపెనీల పెత్తనం పెరిగి, తమ కనుకూలంగా చట్టాలు మార్పించుకుని, తక్కువ జీతాలు, ఉత్పత్తి వ్యయం వుండే దేశాలతో ఒప్పందాలు చేసుకుని దిగుమతి చేసుకోవడం మరిగారు. 1990ల చివర్లో చైనాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకున్న దగ్గర్నుంచి చైనా మాన్యుఫేక్చరింగ్‌ సెంటరుగా పెరిగి, అమెరికా ఒక మార్కెట్‌గా మారిపోయింది. అమెరికన్లకు హెచ్చు జీతాలివ్వడం కంటె చైనా, ఇండియాలలో, కొరియాల వంటి దేశాలలో యూనిట్లు పెట్టి తక్కువ జీతాలతో ఎక్కువ లాభం పొందసాగాయి అమెరికన్‌ కంపెనీలు. అమెరికాలో యూనియన్ల శక్తి క్షీణిస్తూ వచ్చి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉద్యోగం పీకేసే శక్తి కంపెనీలకు వచ్చింది. వారాంతానికి ఉద్యోగం వుంటుందో లేదో తెలియని స్థితిలో కార్మికుడు తన జీతం పెంపు కోసం యూనియన్‌ ద్వారా బేరాలాడే సందర్భమే లేదు. చివరకు అమెరికా 'అయినవారిలో ఆకుల్లో, కానివారికి కంచంలో పెట్టే' వ్యవస్థగా తయారైంది. ఈ పరిస్థితిని చక్కదిద్దాలంటే ప్రభుత్వమే ఉద్యోగకల్పనకై కొన్ని ప్రాజెక్టులు చేపట్టి, కనీస వేతనాలు పెంచి, పెన్షన్‌, సిక్‌ లీవ్‌ సౌకర్యాలు పెంచడం, అసంఘటిత కార్మికుల హక్కులను కాపాడడం, తమ కంపెనీలు విదేశాల్లో ఉత్పత్తి చేసి స్వదేశంలో అమ్మడాన్ని నియంత్రించడం వంటివి చేయాలి. కానీ ప్రభుత్వం వద్ద డబ్బు లేదు, పైగా కంపెనీలు చెప్పినట్లు ఆడుతోంది. ఇవాళ్టి దుస్థితికి ట్రంప్‌ను ఒబామా ఒక్కణ్నే నిందిస్తున్నాడు కానీ యిది రిపబ్లికన్లు, డెమోక్రాట్లు కలిసి దశాబ్దాలుగా తగలేసిన వ్యవహారం. డబ్బు లేకపోవడానికి కారణం - సామ్రాజ్యవాద స్వభావంతో యితర దేశాల వ్యవహారాల్లో తలదూర్చడం. గతంలో రష్యా యిలాగే చేసింది. కమ్యూనిజం వ్యాప్తికి కృషి చేస్తూన్నామంటూ సొంత ప్రజలను ఎండగట్టి, విదేశాలకు విందు కుడిపింది. చివరకు సొంత ప్రజలే తిరగబడ్డారు. 

సామాజిక అశాంతి: పైన రాసిన గణాంకాల్లో, వివరణల్లో, నా అవగాహనలో, అన్వయంలో పొరపాట్లు వుండవచ్చు. కానీ మొత్తం మీద పరిస్థితి బాగా లేదని గ్రహిస్తే చాలు. ఆర్థిక అసమానతలు సమాజంలో అశాంతి సృష్టించాయి. డబ్బు లేకపోయేసరికి భార్యాభర్తల మధ్య కీచులాటలు, విడిపోవడాలు, పిల్లలకు ఆలనాపాలనా లేక చెడు మార్గాలవైపు మళ్లడాలు, ఫ్రస్ట్రేషన్‌, డిప్రెషన్‌, మత్తుపదార్థాలు, హింసకు పాల్పడడం, విదేశాల నుంచి వచ్చి సంపాదించుకుంటున్న వారిని చూసి అసూయ పడడం, వీలైతే దోచుకోవడం.. యిలా రకరకాలుగా సమాజం భ్రష్టు పట్టింది. రేపేమిటో తెలియక అల్లాడుతున్న అమెరికన్ల అభద్రతాభావాన్ని ట్రంప్‌ సొమ్ము చేసుకుంటున్నాడు. తెలంగాణలో చూశాం - స్థానిక నిరుద్యోగానికి, ఆంధ్రుల్ని దోషులుగా చూపి, కెసియార్‌ లాభపడ్డారు. ఆంధ్రులను తరిమివేస్తాం, ప్రయివేటు కంపెనీల్లో స్థానికులకు రిజర్వేషన్లు చేయిస్తాం, యింటికో ఉద్యోగం ఖాయం అన్నాడు. జనాలు నమ్మారు. ఇప్పుడు ట్రంప్‌ వలసవాదులను తరిమివేస్తా, మీకే అన్ని వుద్యోగాలూ అని వూరిస్తున్నాడు. కెసియార్‌ కంటె కటువైన భాష వుపయోగిస్తున్నాడు. నెగ్గాక ఏం చేస్తాడో తెలియదు కానీ, సగం చేసినా ఫర్వాలేదుగా అనుకుంటారు విసిగి వేసారిన స్థానికులు. 

డైలమా: ట్రంప్‌ తయారుచేస్తున్న విద్వేషపూరిత వాతావరణం ఏ స్థాయికి చేరిందో తెలుసుకునేందుకు ఒక సూచన ఏమిటంటే - కూ క్లక్స్‌ క్లాన్‌ అనే జాత్యహంకార సంస్థ కొన్నాళ్ల క్రితం అమెరికాలో బలంగా వుండేది. తెల్లజాతి వారే అధికులని, యితరులకు తమ దేశాల్లో నివసించే హక్కు లేదని వాదిస్తూ వారు ఆ జాతులపై హింసాత్మక దాడులకు తెగబడేవారు. క్రమేపీ వాళ్లు బలహీనపడ్డారు. ఇన్నాళ్లకు దాని నాయకుడు డేవిడ్‌ డ్యూక్‌ తను లూసియానా రాష్ట్రం నుంచి అమెరికన్‌ సెనేట్‌కు అభ్యర్థిగా నిలబడతానని ప్రకటించాడు. అతను రిపబ్లికన్‌ పార్టీకి చెందినవాడే అయినా, పార్టీ అతన్ని సమర్థించనని చెప్పింది. అయినా నిలబడతానని అతనంటున్నాడంటే దానికి కారణం - అమెరికాలో ప్రబలుతున్న వేర్పాటు వాదం! ట్రంప్‌ గెలిచి, యిప్పటి తన హెచ్చరికలను అమలు చేయడానికి చూస్తే ప్రపంచానికి ఏ ముప్పు వాటిల్లుతుందో అని ఒక భయం. అతను ఓడిపోయినా మరో ప్రమాదం వుంది. అతను రెచ్చగొట్టి వదిలిపెట్టిన అమెరికన్‌ శ్వేతజాతివారు అదుపు తప్పి దేశంలో వున్న పరజాతీయులకు ప్రమాదకరంగా మారవచ్చు. 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జులై 2016)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?