Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : వెనెజులా చెపుతున్న పాఠం

హ్యూగో చావెజ్‌ వెనెజులా అధ్యక్షుడిగా వుండగా తన ప్రజలకు అనేక సౌకర్యాలు కల్పించాడు. వస్తువులన్నీ చౌకధరకే అందేట్లా చేశాడు. ఉచితంగా యిళ్లు యిచ్చాడు. పెట్రోలు రెండు సెంట్లకే యిచ్చాడు. ఇదంతా ఆయిలు ఎగుమతులపై వచ్చిన డబ్బుతో చేసి ప్రజల మన్ననలు పొందాడు. ఆయన పోయాడు. ఆయన స్థానంలో నికోలస్‌ మదురో వచ్చాడు. చావెజ్‌ విధానాలే కొనసాగించాడు. ప్రస్తుతం వెనెజులా పరిస్థితి ఎలా వుందో తెలుసుకుంటే ఇలాటి విధానాలకు ఏ మేరకు అనుకరించాలో బోధపడుతుంది. 

పెట్రోలు ధర తగ్గినందుకు ప్రపంచంలో చాలా దేశాలు ఆనందిస్తున్నాయి కానీ వెనెజులా ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఎందుకంటే వెనెజులా ఆర్థికవ్యవస్థంతా ఆయిలు ధరలపై ఆధారపడి వుంది. వారి ఆదాయంలో 97% పెట్రోలు ఎగుమతుల ద్వారానే వస్తుంది. ఇప్పుడు వారి పరిస్థితి ఎంత దీనంగా వుందంటే దేశాధ్యక్షుడు  జనవరిలో 'ఎకనమిక్‌ ఎమర్జన్సీ' ప్రకటించాడు. 60 రోజులన్నాడు కానీ పరిస్థితి ఏమీ మెరుగుపడలేదు. 2013, '14లలో ఆయిలు బారెల్‌ 100 డాలర్లుండే  రోజుల్లో ఎగుమతుల ద్వారా పోగేసిన బంగారం, క్యాష్‌ నిలువలు తరిగిపోతున్నాయి. ఇప్పుడు బారెల్‌ 28 డాలర్లయింది. పన్నెండేళ్లల్లో యిదే కనిష్ఠధర. ఈ ఏడాది అది ఆయిలు ఎగుమతులపై ఆర్జించింది 30 బిలియను డాలర్లు మాత్రమే. దీనితో 3 కోట్ల మంది జనాభాను పోషించాలి. ఆర్థికవ్యవస్థ అతలాకుతలం కావడంతో ద్రవ్యోల్బణం గత ఏడాది 141% పెరిగింది. ఐఎంఎఫ్‌ అంచనా ప్రకారం అది యీ ఏడాది 720% తాకుతుంది.  ఇప్పటికే వెనెజులా కరెన్సీ విలువ చూడబోతే గత ఏడాది డాలరుకు 175 బొలీవర్లు వస్తే  ప్రస్తుతం 865 వస్తున్నాయి. ఆర్థిక గణాంకాలు చూస్తే జనం దడుసుకుంటారని 2014 నుంచి ప్రభుత్వం ప్రచురించడం మానేసింది.

ప్రస్తుతం వెనెజులా ఋణాలు 10 బిలియన్‌ డాలర్లు దాటాయి. మిత్రదేశాలైన చైనా, రష్యా, ఇరాన్‌ ఆదుకుంటే తప్ప వెనెజులా మునిగిపోవడం ఖాయం. సోషలిస్టు విధానాలు అవలంబిస్తున్న దేశంగా వెనెజులా ఆహారధాన్యాలు, తదితర పదార్థాలు తక్కువ ధరకు యిచ్చేట్లా వ్యాపారస్తులపై నిబంధనలు విధించింది. కొన్ని తనే రేషన్‌లో యిస్తూ వుంటుంది. ఇది వారికి ముప్పు తెచ్చిపెట్టింది. ఎందుకంటే వెనెజులాకు పొరుగున వున్న కొలంబియాలో దుర్భర పరిస్థితులుండడంతో సరిహద్దు గ్రామమైన కుకుటా పట్టణం మీదుగా స్మగ్లింగ్‌ జరిగిపోతోంది. గతంలో ఆ దారిలో మాదకద్రవ్యాలు దొంగరవాణా అయ్యేవి. ఇప్పుడు  పెట్రోలు, నారింజలు, చిన్నపిల్లల డైపర్ల వంటి సాధారణ వస్తువులు కూడా వెళ్లిపోతున్నాయి. కొలంబియా ప్రభుత్వం ధరలపై ఆంక్షలు పెట్టలేదు కాబట్టి అవన్నీ అక్కడ హెచ్చుధరకు అమ్ముడుపోతున్నాయి. అంతేకాదు, అక్కడి ప్రజలు వెనెజులాకు వలస వచ్చేసి ప్రభుత్వం చౌకగా యిచ్చే విద్య, ఆరోగ్య సదుపాయాలు పొందుతున్నారు. 

ఇది గమనించి వెనెజులా వెయ్యిమందిని బహిష్కరించింది. 20 వేల మంది భయపడి పారిపోయి కొలంబియాకు తిరిగి వచ్చారు. వెనెజులా గత ఏడాది సరిహద్దులు మూసేసింది. గట్టి బందోబస్తు పెట్టింది. అందువలన సామాన్యపౌరుల ద్వారా స్మగ్లింగ్‌ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. మామూలుగా కనబడే అమ్మాయిలు కొలంబియా నుంచి నది దాటి వెనెజులా గ్రామంలోకి వస్తారు, అక్కడ ఒకతను వారిని కలిసి ప్రభుత్వం నడిపే సూపరు మార్కెటులో కొని పట్టుకుని వచ్చిన బీఫ్‌ వంటి ఆహారపదార్థాలు వాళ్ల చేతిలో పెడతాడు. వాళ్లు అది పట్టుకుని సామాన్య గ్రామస్తుల లాగానే వూరు చేరి తమను పంపించిన వాడి చేతికి అందిస్తారు. వెనెజులాలో 54 డాలర్లకు కొన్న 60 కిలోల బీఫ్‌ కొలంబియాలో మార్కెటుకు చేరేసరికి దాని ధర 200 డాలర్లు అవుతుంది. మధ్యలో కాపలాదారులకు 25 డాలర్లు లంచం యిస్తారు. ఈ అమ్మాయిల చేతిలో కొంత కూలీ యిస్తారు. కొలంబియాలో అనేక రౌడీ మూకలు ప్రయివేటు సేనలుగా ఏర్పడి ఓ పక్క ప్రభుత్వంతో తలపడుతూ, మరో పక్క తమలో తాము పోట్లాడుకుంటున్నాయి.  ఈ స్మగ్లింగ్‌ వారి కనుసన్నల్లో నడుస్తోంది. 

ఇలాటి పొరుగుదేశం వలన వెనెజులా అవస్థలు మరీ పెరిగాయి. పాలు, పిండి, గుడ్లు వంటివి దిగుమతి చేసుకునేందుకు డబ్బు సరిపోవటం లేదు. దిగుమతి చేసుకుంటే తప్ప ప్రజలకు చౌకధరలకు అందివ్వలేదు. చౌకదుకాణాల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. ప్రస్తుతం ఫుడ్‌ క్రైసిస్‌ నడుస్తోంది. మదురో పరపతి తగ్గిపోతోంది. జనవరిలో జరిగిన ఎన్నికలలో అతని పార్టీకి  కాంగ్రెసులో 54 సీట్లు వస్తే ప్రతిపక్షమైన డెమోక్రాటిక్‌ పార్టీ 109 వచ్చి కాంగ్రెసులో 65% సీట్లు సంపాదించుకుంది. వాళ్లు వచ్చి తన విధానాలు మార్చేయకుండా మదురో ముగ్గురు సుప్రీం కోర్టు జడ్జిలను వేసుకున్నాడు. కొత్తవాళ్లు రాజ్యాంగంలో ఏ మార్పు చేయబోయినా వాళ్లు అడ్డుకోవచ్చు. రాజకీయ సంక్షోభం కూడా తోడైతే దేశం యిప్పట్లో కోలుకోదు.

వెనెజులాలో లభించే ఆయిలు ముడి తైలం. దాన్ని శుద్ధిపరిస్తే తప్ప ధర పలకదు. శుద్ధిపరచే యంత్రాలపై గతంలో పెద్దగా పెట్టుబడి పెట్టకపోవడం వలన, 1999-2013 మధ్య పెట్రోలు ఉత్పత్తిలో 25% తగ్గిపోవడం వలన వాళ్లకు ఆయిలు ఆదాయం తగ్గింది. అయినా ఉచిత పథకాలు ఆపడం పాలకుల తరం కాకపోయింది. ప్రభుత్వం కరెన్సీ ఎక్కువగా ముద్రించసాగింది. దానితో డబ్బు విలువ తగ్గి, వస్తువ విలువ పెరిగి ద్రవ్యోల్బణం వచ్చింది. ప్రజలకు చౌకధరలకే అన్నీ అందించాలనే లక్ష్యంతో వాళ్లు వ్యవసాయ ఉత్పత్తులను, ఫ్యాక్టరీలలో తయారయ్యే రకరకాల వస్తువులను తాము చెప్పిన ధరకే అమ్మమని ఉత్పత్తిదారులపై ఒత్తిడి చేస్తున్నారు. అలా అమ్మితే గిట్టుబాటు కాదని రైతులు, పారిశ్రామికవేత్తలు మొత్తుకుంటున్నా వినటం లేదు. అలాటి ఒత్తిళ్లు పెట్టకుండా మార్కెట్‌ మానాన్న వదిలేస్తే అది ఏదో ఒక విధంగా స్థిరపడేదేమో, ప్రభుత్వజోక్యం వలన మొత్తం అస్తవ్యస్తమైంది. వస్తువులు ఉత్పత్తి చేసినా లాభం లేదనగానే వాళ్లు తయారుచేయడం మానేశారు. వారి కొనుగోలు శక్తి కూడా తగ్గిపోయింది. ప్రజలకు వస్తువులు లభ్యం కావడం మానేశాయి. పెట్రోలుపై ఆదాయం ఎల్లకాలం వుంటుందనుకుంటూ సంక్షేమ పథకాలకు, ప్రణాళికేతర వ్యయానికి పెద్దపీట వేస్తే ఎలాటి పరిస్థితి ఎదురవుతుందో వెనెజులా చూపుతోంది. 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఏప్రిల్‌ 2016)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?