Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : విదూషకుడు 'చో' కు నివాళి

ఎమ్బీయస్‌ : విదూషకుడు 'చో' కు నివాళి

రాచపీనుగ తోడు లేందే వెళ్లదంటారు. జయలలిత పోయిన వెంటనే 82 ఏళ్ల చో రామస్వామి కూడా వెళ్లిపోయారు. చో చాలాకాలం జయలలితకు ఆత్మీయుడిగా, సలహాదారుగా వున్న విషయాన్ని గుర్తుకు తెచ్చుకుంటే సామెత నిజమే ననిపిస్తుంది. బహుముఖ ప్రజ్ఞాశాలి, అఖండమైన తెలివితేటలున్న చోకు 'జయలలిత సలహాదారు' అనే గుర్తింపు చాలా చిన్నది. ఆయన లాయరు, రచయిత, నాటకకర్త, నటుడు, దర్శకుడు, సినిమాలలో, టీవీ సీరియల్స్‌లో నటుడు, నిర్మాత, దర్శకుడు, సంపాదకుడు, పత్రికాధిపతి, రాజకీయ విశ్లేషకుడు, వక్త, రాజకీయ నాయకుడు, రాజ్యసభ ఎంపీ.. యింకా కొన్ని వుండే వుంటాయి. ఇన్ని రకాలుగా తన ప్రతిభను చూపించినా ఆయనను నేను విదూషకుడు అనడానికి కారణం - ఆ పదవిపై నాకున్న గౌరవం. విదూషకుడు గంతులేసి నవ్వించే జోకర్‌ కాడు. అతనికి వైదుష్యం వుండాలి, సమయస్ఫూర్తి వుండాలి, అప్రియమైనది సభాముఖంగా చెప్పగల ధైర్యం వుండాలి, హాస్యాన్ని రంగరించే చెప్పే ఒడుపు తెలిసి వుండాలి, మనసులో కల్మషం లేకుండా చెపుతున్నాడనే నమ్మకం రాజుకి సైతం కలిగించాలి, విమర్శ హద్దులెరిగి, వికటించకుండా తనను తాను నియంత్రించుకో గలగాలి. తమిళులకు తమ భాష, సంస్కృతి, వారసత్వంపై దురభిమానం హెచ్చు. ఆత్మావలోకనం చేసుకుని, తమను తాము విమర్శించుకునే లక్షణం తక్కువ. అటువంటి తమిళ సమాజంలో పుట్టి తమపై తాము జోకులేసుకునే అలవాటును వాళ్లకు నేర్పడానికి ప్రయత్నించిన వాడు చో. పెద్దాచిన్నా లేకుండా అందరినీ ఆటపట్టించడానికి ప్రయత్నించాడు - తన నాటకాల ద్వారా, ''తుగ్లక్‌'' పత్రిక ద్వారా. అతని ప్రశ్నోత్తరాల శీర్షిక ఎంత పాప్యులరో చెప్పనలవి కాదు. డైరక్టు తెలుగు సినిమాల్లో వేయలేదు కాబట్టి తెలుగువాళ్లలో చాలామందికి ఆయన పెద్దగా తెలియకపోవచ్చు. ఆయన సోదరి, తెలుగాయన్ని చేసుకుని నటీమణి రమ్యకృష్ణకు జన్మనిచ్చింది. అందువలన రమ్యకృష్ణ మావయ్యగా గుర్తు పెట్టుకోవచ్చు. ఆయన జీవితం గురించిన పూర్తి వివరాలు రేపటి పేపర్లలో వస్తాయి. ఈ లోపున నాకు తెలిసున్న నాలుగు విషయాలు పంచుకుంటాను. 

తెలుగులో ''మహమ్మద్‌ బిన్‌ తుగ్లక్‌'' సినిమా నాగభూషణం ప్రధాన పాత్రధారిగా 1972లో వచ్చింది. రాజకీయంగా దేశం భ్రష్టుపట్టడం చూసి కడుపు భగ్గుమన్న ఒక స్వాతంత్య్రయోధుడు ప్రజలపై ఒక ప్రాక్టికల్‌ జోక్‌ వేద్దామనుకున్నాడు. తన అనుచరులు యిద్దరికి తుగ్లక్‌గా, అతని సహచరుడు బదూదాగా వేషాలు వేశాడు. మీ యిద్దరూ యీ వేషాల్లో ప్రజాస్వామ్యం ఎంత అపహాస్యంగా నడుస్తోందో జనాలకు సోదాహరణంగా తెలియపరిచి, ఏడాది తర్వాత వేషాలిప్పేసి, వాస్తవాన్ని చెప్పి, వాళ్ల కళ్లు తెరిపించండి అన్నాడు. వాళ్లు సరేనని గుడిలో ప్రమాణం చేశారు.  తర్వాత గురువుగారు వాళ్లను ఒక అయోమయం ఆర్కియాలజీ ప్రొఫెసరు తవ్వకాలు జరిపే చోట శవపేటికల్లో పడుక్కోబెట్టాడు. ప్రొఫెసరుకు వాళ్లు కనబడగానే ఎవరు మీరు? అని అడిగాడు. ఫలానా అనగానే యిన్నాళ్లూ సజీవంగా ఎలా వున్నారు? అని అడిగాడు. ఏదో సంజీవనీ వేరులాటి దానివలన అని చెప్పారు. ఇక పేపర్లో పెద్ద వార్త. విపరీతమైన పబ్లిసిటీ. ఆ పబ్లిసిటీతో, విపరీతమైన వాగ్దానాలతో ఎంపీగా గెలిచేశాడు తుగ్లక్‌. తర్వాత ప్రధాని కావడానికి ఓ పన్నాగం పన్నాడు. విడివిడిగా ఒక్కోణ్నీ పిలిచి 'నాకు మద్దతిస్తే నిన్ను ఉపప్రధానిని చేస్తాను' అన్నాడు. అందరూ సమ్మతించి గెలిపించారు. తీరా చూస్తే తుగ్లక్‌ ప్రధాని. తక్కినవాళ్లంతా ఉపప్రధానులే. అందరూ కాబినెట్‌ సభ్యులే. ఇలా తుగ్లక్‌ రాజ్యం సాగింది. తన పారశీక భాషను అధికారభాషగా డిక్లేర్‌ చేశాడు. (హిందీని దేశంపై రుద్దడంపై సెటైర్‌) దాన్ని వ్యతిరేకిస్తూ జనాలు బస్సులు, రైళ్లు తగలబెడితే 'పారశీకం బస్సుల్లో, రైళ్లల్లో వస్తుందా?' అంటూ రేడియోలో ప్రధాని ప్రసంగం. (తమిళులు చేసిన హిందీ వ్యతిరేకోద్యమంపై సెటైర్‌). ప్రసంగం చివర కమ్మర్షియల్‌ యాడ్‌ కూడా ప్రధానే చెప్తాడు (రేడియోల కమ్మర్షియల్‌ దృక్పథంపై సెటైర్‌) కాబినెట్‌ మంత్రుల పుట్టినరోజులే దేశమంతా పండగలుగా జరుపుకోమంటాడు. అదేమిటని ఒకరు అభ్యంతర పెడితే ఆ ఫంక్షన్‌కు అవసరమయ్యే కేక్‌, బుడగలు, లైట్లు, ఆహ్వానపత్రికల ప్రింటింగు, వగైరావగైరా పరిశ్రమల అభివృద్ధి జరుగుతుంది కదాని వాదిస్తాడు. (పుష్కరాలు, శంకుస్థాపనలు, భూమిపూజలు, విగ్రహావిష్కరణలు యీ స్థాయికి చేరడానికి ముందే యీ సెటైరు). ఆహారసమస్య గురించి ఏం చేశారు అని అడిగితే అమెరికా వెళ్లి ఆలోచిస్తానంటాడు. చిలకజోస్యం చెప్పే ఒకమ్మాయిని మంత్రిగా చేస్తారు. ఏ ఫైలుపై సంతకం పెట్టాలో చిలక చేత కార్డు తీయిస్తూ వుంటుంది. 

ఇలా రాజకీయాల ఒక్కదానిపైనే విసుర్లు కాదు. సమాజపు పోకడలపై కూడా చాలా వుంటాయి. అన్నా, చెల్లి ఓ సెక్సుబుక్కు గురించి కొట్టుకుంటూ వుంటారు. 'అది నా బుక్‌ ర్యాక్‌లోది, ఎవరు తీశారు?' అని తండ్రి వాళ్లిద్దరినీ తిట్టి లాక్కున్నాడు. అతని చేతుల్లోంచి అతని తండ్రి గుంజుకున్నాడు, తను చదువుతానంటూ. అంతా చూస్తూ నిర్లిప్తంగా వున్న వియ్యంకుడితో మీకేమీ యింట్రస్టు లేదా? అని అడుగుతాడు. 'ఎప్పుడో చదివేశా' అంటాడాయన. ఇలా పోనుపోను సమాజం భ్రష్టమై, రాజకీయనాయకత్వమంతా అవినీతిమయమై పోయినా, ప్రజలకు తుగ్లక్‌ ఆరాధ్యదైవం అయిపోతాడు. ఏడాది అయ్యాక బదూదా వేషధారి తుగ్లక్‌ వేషధారి వద్దకు వచ్చి తమ ప్రమాణాన్ని గుర్తుచేశాడు. 'ఇక వేషాలిప్పేసి ఇలాటి నాయకుల వలలో పడకండి అని ప్రజలకు సందేశం యిద్దాం. రా' అన్నాడు. అప్పటికే తుగ్లక్‌ వేషధారి పదవి మరిగాడు. 'మన గురువుగారు చచ్చిపోయారు. వాళ్ల అమ్మాయికి మంత్రి పదవి యిచ్చి లోబరుచుకున్నాం. మన రహస్యం ఎవరికీ తెలియదు. మనల్ని నిజం తుగ్లక్‌, బదూదా అనుకుంటున్నారు. ఇలాగే కంటిన్యూ అయిపోదాం' అన్నాడు. బదూదా పాత్రధారి ఒప్పుకోలేదు. బయటకు వచ్చి 'ఇదంతా వేషం, మాదంతా నటన' అన్నాడు. తుగ్లక్‌ పాత్రధారి 'బదూదాకు పిచ్చెక్కింది. పాపం అతన్ని రాళ్లేసి కొట్టకండి, చంపకండి' అంటూ ప్రజలకు ఐడియాలు యిచ్చాడు. తుగ్లక్‌ మత్తులో వున్న ప్రజలు అతన్ని చంపేశారు. తుగ్లక్‌ పాలన నిరాఘంటంగా సాగుతుంది.

ఈ సినిమా చూసి నాకు మతిపోయింది. ఎంత గొప్ప ఆలోచన అనిపించింది. ఇది తమిళం నుంచి వచ్చిందని తెలిసి చో రామస్వామి గురించి తెలుసుకున్నాను. దీన్ని ఆయన తమిళంలో 1968లో నాటకంగా రాసి, తర్వాత 1971లో సినిమాగా  తీశాడు. దాన్ని చూసి మనవాళ్లు తెలుగులో తీశారు. ఆ నాటకం తమిళంలో ఎంత హిట్‌ అంటే ''తుగ్లక్‌'' పేరుతో ఆయన 1970లో వారపత్రిక  స్థాపించి నడుపుతున్నాడు. దాని సర్క్యులేషన్‌ 75 వేలు. తుగ్లక్‌ నాటకాన్ని ఆయన చాలాకాలం వేశాడు. కలకత్తాలో వుండగా 1983లో ఆ నాటకాన్ని చూశాను. ఇంటర్వెల్‌లో ఆయనకు సన్మానం జరిగింది. ''పాతికేళ్ల కితం రాసిన ఈ నాటకంలో ఒక్క డైలాగు మార్చలేదు. ఇప్పటికి కూడా రిలవెంట్‌గా వుందంటే ఆ ఘనత నాది కాదు. పరిస్థితులు ఏ మాత్రం యింప్రూవ్‌ చేయని రాజకీయనాయకులది.'' అన్నాడు. డైలాగులు మార్చలేదేమో కానీ, యింప్రొవైజేషన్‌ మాత్రం వుందని చెప్పవచ్చు. చోకు ఒత్తయిన జుట్టు వుండేది. ఎలర్జీ ఏదో వచ్చి ఓ పూట నిద్ర లేచేసరికి ఒంటి మీద ఒక్క వెంట్రుక కూడా లేకుండా రాలిపోయింది. అప్పణ్నుంచి తన గుండు మీదే జోకులేసుకుంటూ వచ్చాడు. అసలే ఆయనది కోడిగుడ్డు మొహం. సాసర్‌ కళ్లు. అమాయకంగా మొహం పెట్టి హాస్యంగా నటించడంలో ఘనుడు. తల బోడిగుండు అయిపోయిన తర్వాత ''ఏలిస్‌ ఇన్‌ వండర్‌లాండ్‌''లో కారెక్టరుగా కనబడసాగాడు. ఆ రోజు తుగ్లక్‌ నాటకంలో యింటర్వెల్‌ పంచ్‌ ఏమిటంటే పాత్రికేయులు వచ్చి తుగ్లక్‌ను 'మీ పాలన యిలాగే సాగితే దేశం గతి ఏమవుతుంది?' అని అడుగుతారు. తుగ్లక్‌ వేషంలోని చో 'దేశం గతా?' అంటూ సాలోచనగా తన తలపాగా తీసి ఓ చేతిలో పట్టుకుని, మరో చేత్తో గుండు రాసుకున్నాడు. హాలంతా చప్పట్లు మారుమ్రోగాయి.

నేను కలకత్తాలో వుండగానే చో మరోసారి వచ్చారు. ఆనంద బజార్‌ గ్రూపుకి చెందిన ''ద టెలిగ్రాఫ్‌'' దినపత్రిక వారు ''హేజ్‌ లెఫ్ట్‌ ఎనీ ఫ్యూచర్‌ యిన్‌ ఇండియా?'' అనే మకుటంతో డిబేట్‌ పెట్టారు. వామపంథాకు ఇండియాలో భవిష్యత్తు వుందని కొందరు, లేదని కొందరు మాట్లాడడానికి వచ్చారు. జార్జి ఫెర్నాండెజ్‌ వచ్చి ఉందని మాట్లాడాడు. తర్వాతి వంతు కమ్యూనిజానికి బద్ధ వ్యతిరేకి అయిన చో ది. అందుకుంటూనే ''ఫెర్నాండెజ్‌ అద్భుతంగా మాట్లాడారు. ఇక మా పక్షానికి ఫిరాయిస్తారని ఆశిస్తున్నాను.'' అన్నాడు. ఇక్కడ సందర్భం ఏమిటంటే - 1979లో మొరార్జీ దేశాయ్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉపప్రధాని చరణ్‌ సింగ్‌ కాంగ్రెసుతో కలిసి కుట్ర పన్ని జనతా పార్టీని చీల్చాడు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాడు. ఫెర్నాండెజ్‌ మొరార్జీ ప్రభుత్వాన్ని సమర్థిస్తూ, తమ హయాంలో ఎంత ప్రగతి జరిగిందో గణాంకాలు ఏకరువు పెడుతూ అద్భుతమైన ప్రసంగం చేశాడు. ఆ మర్నాడే పార్టీ ఫిరాయించి చరణ్‌ సింగ్‌తో చేతులు కలిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశాడు. చో దాన్ని గుర్తు చేశాడు. ఫెర్నాండెజ్‌ మొహం మాడింది. ఆ తర్వాత యిచ్చిన ఉపన్యాసంలో అద్భుతమైన పంచ్‌లైన్‌ యిచ్చాడు. 30 ఏళ్లు దాటినా నేను దాన్ని మరవలేదు. ''ఇఫ్‌ లెఫ్ట్‌ హేజ్‌ ఎనీ ఫ్యూచర్‌ యిన్‌ ఇండియా, ఇండియా యీజ్‌ లెఫ్ట్‌ విత్‌ నో ఫ్యూచర్‌''! (వామపంథాకు ఇండియాలో భవిష్యత్తు వుంటే, ఇండియాకు భవిష్యత్తు లేకుండా పోతుంది). తెలుగులో యింత చప్పగా వచ్చింది కానీ 'లెఫ్ట్‌' అనే పదంపై చో చేసిన 'పన్‌' బ్రహ్మాండంగా పేలి, కమ్యూనిస్టు అభిమానులు కూడా పడిపడి నవ్వేట్లు చేసింది. కమ్యూనిస్టులు ఏవేవో ఊహలు చేసేసి, వ్యక్తులపై, సంఘటనలపై తీర్పులు యిచ్చేసి, తీర్మానాలు చేసేసి, ఆ తర్వాత ఏ 20, 30 ఏళ్లకో తాము ఆనాడు చేసినది తప్పు అని ఒప్పుకోవడంపై చో ఎన్ని జోకులు వేశాడో లెక్కే లేదు. 

చో జనతా పార్టీ అభిమాని. ఎమర్జన్సీ నడిపే రోజుల్లో అనేక పెద్ద పత్రికలు సెన్సార్‌షిప్‌కు దాసోహం అనగా చో మాత్రం ధైర్యంగా ఎదిరించి, సెన్సార్‌కు దొరక్కుండా వ్యంగ్యంగా ఎత్తిపొడుస్తూ సెన్సార్‌ వాళ్లతోనే ఆటలాడుకున్నాడు. 1976 ఫిబ్రవరి 29 మొరార్జీ పుట్టినరోజు సందర్భంగా మొరార్జీ ఫోటో వేసి 'మెనీ మెనీ హేపీ రిటర్న్‌స్‌ ఆఫ్‌ ద డే టు మొరార్జీ' అని వ్యాఖ్య పెట్టి అప్పటి రూలు ప్రకారం పత్రిక విడుదలకు ముందు సెన్సార్‌ ఆఫీసరుకి సబ్మిట్‌ చేశాడు. ఆయన టైటిల్‌ మార్చు అన్నాడు. ఒక మెనీ తీసేసి మెనీ హేపీ... అని పంపాడు. అదీ తీసేయ్‌ అన్నాడు ఆఫీసరు. హేపీ.. అని పంపాడు. దానికీ అభ్యంతరమే. చివరకు మొరార్జీ ఫోటో వేసి, కింద మొరార్జీ అని పేరు రాసి పత్రికను విడుదల చేశాడు. ఈ ఉదంతాన్ని ఎమర్జన్సీ అత్యాచారాలపై జనతా పార్టీ వేసిన షా కమిషన్‌ ముందు చో చెప్తుంటే జడ్జి గారి దగ్గర్నుంచి అందరూ పడిపడి నవ్వారు. సెన్సారుకి దొరక్కుండా చేసిన తమాషాలు చాలా వున్నాయి. ప్రశ్నోత్తరాలలో ఓ ప్రశ్న - 'నేను ప్రధాని అయ్యే అవకాశం వుందా?' అని! 'మీ అమ్మ పేరు చెప్పు. ఉందో లేదో అప్పుడు చెప్తాను' అని సమాధానం. ఇది సంజయ్‌ గాంధీపై విసురు. 1980లో సంజయ్‌ గాంధీ చచ్చిపోయినపుడు మళ్లీ అధికారంలోకి వచ్చేసిన ఇందిర అతని పేర ఒక స్టాంపు విడుదల చేసింది. చో తన పత్రిక ద్వారా సంజయ్‌తో పాటు చనిపోయిన కో-పైలట్‌ సక్సేనా పేర స్టాంపు విడుదల చేశాడు. 'సంజయ్‌ చేసిన ఘనకార్యం యింతకంటె ఏం లేదు, అవతలివాడు యితనికి ఎందులోనూ తీసిపోడు' అని అనిపించేట్లు. పత్రికలోంచి కత్తిరించి కొందరు తుగ్లక్‌ ఆఫీసుకి పంపే ఉత్తరాలపై ఆ స్టాంపు అతికించారు. సరిగ్గా చూసుకోని పోస్టాఫీసు వారు దానిపై ముద్ర కొట్టారు కూడా. ఇదీ పోస్టల్‌ డిపార్టుమెంటు పనిచేసే తీరు అంటూ చో ఆ కాన్సిలేషన్‌ను ఫోటో తీసి అచ్చేశాడు. జనతా పార్టీకి అతను మద్దతు యిచ్చే రోజుల్లో 'మీరు ఆ పార్టీలో చేరవచ్చు కదా' అని ఎవరో అడిగారు. 'ఆ పార్టీకి ఒక సుబ్రహ్మణ్యం స్వామి చాలు. నేను కూడా ఎందుకు?' అని జవాబిచ్చాడు. ప్రతీదాన్ని వివాదం చేసే స్వామిపై విసురు అది. తను విమర్శకుడే తప్ప, నిర్మాణాత్మకంగా ఏమీ చేయలేనని తన మీదా సెటైర్‌ వేసుకున్నాడు. 

ఆ రోజుల్లోనే తనకు దేశవ్యాప్తంగా వచ్చిన పేరును ఉపయోగించుకుందామని తుగ్లక్‌కు యింగ్లీషు వెర్షన్‌గా ''పిక్విక్‌'' అనే పత్రిక పెట్టి నడిపాడు. నేను దానికి తొలి సంచిక నుండి చందాదారుణ్ని. రెండేళ్లు కాబోలు నడిచి ఆగిపోయింది. తుగ్లక్‌ మాత్రం అప్రతిహతంగా సాగింది. ద్రవిడ పార్టీలను ఆయన తెగ విమర్శించాడు. వాళ్లతో విసిగి కాబోలు, తర్వాతి రోజుల్లో బిజెపికి మద్దతుదారుగా వున్నాడు. కాంగ్రెసు అంటే ఎటూ యిష్టం లేదు. బిజెపి ఆయనను 1999లో రాజ్యసభకు పంపింది. 2008లో మోదీని మద్రాసుకి పిల్చి సత్కరించాడు. అలా అని అయనవి ఆరెస్సెస్‌ భావాలు కావు. రాజకీయ నాయకులందరినీ ఒకే గాటన కట్టి మాట్లాడిన సందర్భాలు ఎక్కువ. పాలిటిక్స్‌పై ''యారుక్కు వెట్కమిల్లయ్‌'' (ఎవరికీ సిగ్గు లేదు) అనే డ్రామా, సినిమా వుందాయనది. అనేక సినిమాలకు కథ లందించాడు. సినిమా కథలపై సెటైరికల్‌ ఓ టీవీ సీరియల్‌ రాసి, దానిలో కథకుడిగా నటించాడు. ఆయన అందర్నీ ఆట పట్టిస్తూనే వున్నాడు. తమిళనాడులో సినిమా, రాజకీయాలు కలిసిపోయి వుంటాయి. కరుణానిధి, ఎమ్జీయార్‌లను విమర్శిస్తే వేషాలు రావని భయపడలేదు. తమాషా ఏమిటంటే ఆయన్ని ఎవరూ శత్రువుగా చూడలేదు. వేషాలిస్తూ పోయారు. ఆరోగ్యకరమైన వ్యంగ్యం అంటే చోదే! వ్యక్తిగతంగా జయలలితకు ఆప్తుడు. ఇద్దరూ కలిసి అనేక సినిమాల్లో నటించారు. ఇద్దరూ మేధావులే. కొంతకాలం యీయన సలహాలు ఆమె వింది. తర్వాతి కాలంలో దూరం పెట్టేసి నష్టపోయింది. 1996 ఎన్నికలలో ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. మళ్లీ డిఎంకెతో విసిగి 2011లో ఆమెను సమర్థించాడు. ఆ మేధావికి, హాస్యరచయితకు యిదే నా బాష్పాంజలి. (ఫోటో - చో దంపతులకు నమస్కరిస్తున్న జయలలిత)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2016) 

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?