Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : వినోద్‌ మెహతా - 10

ఎమ్బీయస్‌ : వినోద్‌ మెహతా - 10

సండే అబ్జర్వర్‌కు పాఠకుల్లో, ప్రకటనదారుల్లో వచ్చిన విశేష స్పందన చూసి ఎగిరి గంతేసే లోపులే ఒక ఉపద్రవం వచ్చిపడింది. భారతీయ సంగీత, నృత్య, రంగస్థలాలకు వేదిక కల్పించే ఆశయంతో టాటా గ్రూపువారు బొంబాయిలో నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ పెర్‌ఫామింగ్‌ ఆర్ట్‌స్‌ (ఎన్‌సిపిఏ) అని 'న భూతో.. ' అన్నంతగా భారీగా ఆడిటోరియం కట్టి 1980 అక్టోబరులో ఇందిరా గాంధీ చేత ఆవిష్కరింప చేశారు. దాన్ని కట్టే బాధ్యతను తమ గ్రూపుకే చెందిన 'టాటా హౌస్‌'లో సీనియర్‌ డైరక్టరుగా వున్న జంషెడ్‌ భాభాకు అప్పగించారు. మన ఆంధ్ర రాజధానికి సింగపూరు ప్లానర్లను తెప్పిస్తున్నట్లు ఆయన అమెరికా నుంచి  యిద్దరు ఆర్కిటెక్టులను తెప్పించాడు. ''ఇక్కడివాళ్లు పనికి రారా? మన దగ్గర ఛార్లెస్‌ కోరియా వుంటి అద్భుతమైన ఆర్కిటెక్టు వున్నాడుగా' అని ఎవరో అంటే 'అతను ఫైవ్‌ స్టార్‌ హోటళ్లు కట్టడానికే పనికి వస్తాడు. ఇలాటి కళాత్మకమైన ఆడిటోరియం అతని చేత కాదు.' అని జవాబిచ్చాడు జంషెడ్‌. వాళ్లు ఎంత కళాత్మాకంగా కట్టారో కానీ అకూస్టిక్స్‌ (శబ్దవ్యవస్థ) పరమ దరిద్రంగా తయారైంది. అక్కడ ప్రదర్శనలు యిచ్చిన వారందరూ ఏడుపు మొహం పెట్టారు. కానీ ఎవరూ పైకి ఏమీ అనటం లేదు, రాయటం లేదు. ఏమైనా అంటే టాటాలకు అప్రతిష్ట. అంత పెద్దవాళ్లు పోనీ కదాని కళాసేవ చేస్తూ వుంటే వాళ్ల పరువు తీస్తావా? అని తక్కినవాళ్లు తిడతారని భయం. 

వినోద్‌ దృష్టికి యీ సంగతి రాగానే శీలా బర్సే అనే ఫ్రీలాన్స్‌ జర్నలిస్టుకు ఆ స్టోరీ అప్పగించాడు. ఆమె అనేకమందిని యింటర్వ్యూ చేసింది. ఉస్తాద్‌ ఆలీ అక్బర్‌ ఖాన్‌ - 'అక్కడ పాడుతూ వుంటే నేనేం పాడుతున్నానో నాకే వినబడటం లేదు' అన్నారు. హరిప్రసాద్‌ చౌరాసియా అదే మాట చెప్పాడు. శివ్‌కుమార్‌ శర్మ 'భారతీయ శాస్త్రీయసంగీతానికై ఆడిటోరియం కట్టేటప్పుడు ఆ సంగీతం, సంగీతకారుల కళాకళలు, ఆడియన్స్‌ సౌకర్యం యివన్నీ తెలిసినవాడి చేత ప్లాన్‌ చేయించుకోవాలి.' అని స్పష్టంగా చెప్పారు. నాటకకర్తలైన అలిక్‌ పాదమ్‌సీ, సత్యదేవ్‌ దూబే 'వేదికకు డెప్త్‌ లేదు. నలుగురి కంటె ఎక్కువ పాత్రధారులుంటే వారిని ఒకే లైన్లో నిల్చోబెట్టి డైలాగులు చెప్పవలసి వస్తోంది.' అని చెప్పారు. 'కళలకు ఓ సమాధి' అని పేరు పెట్టి యీ ఆర్టికల్‌ రెడీ చేస్తూండగానే దీని గురించి జంషెడ్‌కు తెలియవచ్చింది. 'ఇది కనక వేస్తే టాటా గ్రూపు నుంచి మీ పేపరుకు ఏ యాడ్స్‌ రాకుండా చేస్తా' అని బెదిరించాడు. టాటా గ్రూపు సపోర్టు లేకుండా పేపరు నడపడం సాధ్యమా? అశ్విన్‌ 'వినోద్‌, నువ్వు ఎలాగోలా మేనేజ్‌ చేయి. అతను ఓకే చేయనిదే యిది వేసే ప్రసక్తే లేదు.' అని చెప్పాడు. పుబ్బలో పుట్టి, మఖలో మాడిపోయే ప్రమాదం వచ్చింది పేపరుకు. వినోద్‌ నానీ ఫల్కీవాలా వద్దకు వెళ్లాడు. ఆయన పెద్ద లాయరే కాక, టాటా గ్రూపులో డైరక్టరు. 'టాటాలు యిలా పత్రికా స్వేచ్ఛను అణచేస్తున్నారని బయటకు పొక్కితే అప్పుడు మాత్రం యిమేజి దెబ్బ తినదా?' అని వినోద్‌ వాదించాడు. ఫల్కీవాలా జంషెడ్‌తో మాట్లాడాడు. చివరకు రాజీ కుదిరింది. ఆర్టికల్‌ యథాతథంగా వేశారు, కింద ఎన్‌సిపిఏ వారు దాన్ని ఖండిస్తూ తమ వాదనను వినిపించారు. కొన్ని వారాలు పోయిన తర్వాత టాటాల కోపం తగ్గింది. మళ్లీ యాడ్స్‌ యివ్వసాగారు. వినోద్‌ కెరియర్‌ చివరి థలో మళ్లీ టాటాలతోనే తగాదా వచ్చింది. నీరా రాడియా టేపులు ప్రచురించిన కారణంగా రతన్‌ టాటా వినోద్‌ను ''ఔట్‌లుక్‌'' లోంచి తీసేయమని హెచ్చరించాడు. దాని కథ తర్వాత వస్తుంది. 

టాటా గొడవ తర్వాత అరుణ్‌ శౌరీ గొడవ వచ్చిపడింది. అప్పట్లో మహారాష్ట్రకు ముఖ్యమంత్రిగా వున్న అంతులే సిమెంట్‌ కోటా కేటాయింపులకై తన వద్దకు వచ్చినవారి వద్ద తను పెట్టిన 'ఇందిరా గాంధీ ప్రతిభా ప్రతిష్టాన్‌' అనే ట్రస్టుకు విరాళాలు యిమ్మనమని ఒత్తిడి చేసి నిధులు సంపాదించాడు. ఇటీవల అందరూ వాడుతున్న క్విడ్‌-ప్రో-కో కేసు లాటిదే అది. ఆ సమాచారం ''ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌''కు ఎడిటరుగా వున్న అరుణ్‌ శౌరీ పేర కథనాలుగా వెలువడి సంచలనాలకు దారి తీసి, అంతులే రాజీనామా చేయవలసి వచ్చింది. అరుణ్‌ శౌరీ ప్రభ ఉజ్జ్వలంగా వెలిగింది. అంతులే విషయం కర్ణాకర్ణిగా విన్న గోయెంకా తన ఎక్స్‌ప్రెస్‌ న్యూస్‌ బ్యూరోకు వివరాలు సేకరించే పని అప్పగించాడు. దానిలో చీఫ్‌ రిపోర్టరుతో సహా అనేక మంది కష్టనష్టాలు, ప్రమాదాలు ఎదుర్కుంటూ ఆధారాలు పోగు చేసి అరుణ్‌ చేతిలో పోశారు. అరుణ్‌ తన వ్యాసపరంపరలో తన న్యూస్‌ బ్యూరో సిబ్బంది పడిన శ్రమదమాదుల గురించి ఒక్క మాట రాయకుండా అంతా తన పరిశోధనా ఫలితమే అన్నట్టు రాసుకున్నాడు. ఇది వాళ్ల కడుపు మండించింది. వాళ్లల్లో కొంతమంది ''ఫ్రీ ప్రెస్‌ జర్నల్‌''లో పనిచేసే ఒక యువ రిపోర్టరు ద్వారా వినోద్‌కు కబురు పెట్టారు. ''నా దగ్గర యీ కథ వుంది. మీది కొత్తగా పెట్టిన పేపరు. అవతల చూస్తే పత్రికా దిగ్గజం గోయెంకా, దేశమంతా జేజేలు అందుకుంటున్న అరుణ్‌ శౌరీ. వారికి వ్యతిరేకంగా కథనం వేసే దమ్ము వుందా?'' అని అతను అడిగాడు. అంతా విన్నాక వినోద్‌కు అన్యాయం జరిగిందనిపించింది. కథనం వేసేశాడు. అరుణ్‌ శౌరీ భగ్గుమన్నాడు. ''మీదంతా కట్టుకథ. దాన్ని ఖండిస్తూ నేను యివ్వబోయే యింటర్వ్యూ ఫుల్‌ పేజీలో వేయాలి.'' అని డిమాండ్‌ చేశాడు. అరుణ్‌ కథనాన్ని కుమార్‌ కేట్కర్‌ అనే బాంబే జర్నలిస్టు ఉత్తరాల శీర్షికలో ఎదుర్కున్నాడు. అరుణ్‌ చేస్తున్నది శ్రమ దోపిడీ అంటూ హుంకరించాడు. ఈ చర్చ కొన్ని నెలలపాటు సాగింది.

రజనీ పటేల్‌ అని ఆ రోజుల్లో మహారాష్ట్రలో పెద్ద రాజకీయ నాయకుడు వుండేవాడు. అతను లాయరు, వామపక్ష భావాలు కలవాడు, కొంతకాలానికి కాంగ్రెసులో చేరి ఇందిరా గాంధీకి సమర్థకుడిగా మారాడు. బొంబాయి నుంచి అపారంగా నిధులు సేకరించి యిస్తూ వుండేవాడు. ఎమర్జన్సీ సమయంలో 'కమ్యూనిస్టు'లంటే గిట్టని సంజయ్‌ గాంధీ అతన్ని దూరంగా పెట్టేశాడు. రజనీ సినిమావాళ్లతో, రాజకీయనాయకులతో భుజాలు రాసుకుని తిరుగుతూ పార్టీలు యిస్తూ చాలా విలాసవంతమైన జీవితం గడిపాడు. ఇద్దరు భార్యలు. డబ్బు గురించి యిద్దరితో కొట్లాటలుండేవి. చివరిలో ప్రతిమా బేదీతో కలిసి జీవించాడు. ప్రతిమా అది గొప్పగా చెప్పుకునేది, అతను పోయినప్పుడు సండే అబ్జర్వర్‌కు తన సాన్నిహిత్యాన్ని చాటుకుంటూ ఓ వ్యాసం రాసింది కూడా. రజనీ చనిపోయినపుడు తన మామూలు శైలిలోనే ఖుశ్వంత్‌ సింగ్‌ ఒక నివాళి రాశాడు - ''రజనికి మదిర, మదవతి అంటే యిష్టం. తప్పు చేసిన సందర్భాల్లో కూడా స్నేహితులకు అండగా నిలుస్తాడు. రాజకీయంగా, ఆర్థికపరంగా సిద్ధాంతాలకు కట్టుబడడు. ఓ సారి పెద్ద పార్టీ ఏర్పాటు చేశాడు. ఎందుకని అడిగితే మహారాష్ట్రలో కరువుపీడితులకై నిధుల సేకరణ అని చెప్పాడు. చూడబోతే ఆ పార్టీలో సీసా రూ.1500 లుండే రాయల్‌ సెల్యూట్‌ ఏరులై ప్రవహించింది...'' యిలా సాగింది. ఇది చూసి రజనీకి స్నేహితుడైన ఫ్రాంక్‌ సైమోస్‌ ఖుశ్వంత్‌ను ఖండిస్తూ  ''చనిపోయిన వాళ్ల గురించి చెడు ఎందుకు మాట్లాడం?'' అని వ్యాసం పంపాడు -  ''ఖుశ్వంత్‌ సింగ్‌ చనిపోయిన స్నేహితుల గుండెల్లో గునపాలు గుచ్చేరకం. ఇలాటివాణ్ని స్నేహితుడిగా భావించిన రజనీ అమాయకుడు..'' అన్న ధోరణిలో సాగిందది. దానికి ఖుశ్వంత్‌ కొడుకు రాహుల్‌ సమాధానం పంపాడు - ''చచ్చిపోయిన వాడి కళ్లు చారెడు అన్నట్టే రాయాలి కానీ నిజానిజాలు నిష్కర్షగా రాయకూడదని ఫ్రాంక్‌ అభిప్రాయంలా తోస్తోంది. చేతనైతే, ఆ సమాచారం తప్పయితే ఖండించాలి.'' అని. ఇలా వినోద్‌ తన పత్రికను అన్ని రకాల వివాదాలను, భావాలను స్వేచ్ఛగా చర్చించే వేదికగా మార్చాడు. తన గురించి మెచ్చుకుంటూ, తిడుతూ రాసే ఉత్తరాలు కూడా వేసేవాడు. ఏ పార్టీకి కట్టుబడకుండా, ఎవరినీ వదిలిపెట్టకుండా, పత్రికలు విస్మరించే అనేక విషయాలను వెలుగులోకి తెచ్చే సాధనంగా ఆ పత్రిక పేరు తెచ్చుకుంది. (సశేషం) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2015)

[email protected]

Click Here For Previous Articles

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?